Tuesday, July 14, 2020

సప్తశతి గాథలలో మత ప్రస్తావనలు – పార్ట్ 2


(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. )
***
.
మనసులో ఏదో ఉంచుకొని
తనవెనుకే పదే పదే తిరుగుతున్న మరిదికి
ఆ సుగుణవంతురాలైన ఇల్లాలు
గోడపై చిత్రించిన రామాయణ దృశ్యాలను చూపిస్తూ
రామ లక్ష్మణుల అనుబంధాన్ని ఒక రోజంతా భోదించింది. (135)
.
సప్తశతి కాలానికి రామాయణం ఇంకా మతగ్రంథ స్థాయికి చేరనప్పటికీ ఆ కావ్య సారాంసాన్ని గ్రామీణులు కూడా గ్రహించగలిగారని పైగాథ ద్వారా అర్ధమౌతుంది. గాథాసప్తశతి అనగానే జనబాహుళ్యంలో శృంగారరాతలనే అపప్రథ ఉంది. కొన్ని గాథలలో విచ్చలవిడి శృంగారేచ్ఛ ప్రకటించబడినప్పటికీ, చాలాగాథలు అలా ఉండవు.
పై గాథలో రామాయణంలోని రామలక్ష్మణుల అనుబంధాన్ని ఆదర్శంగా తీసుకొమ్మని, లక్ష్మణుడు సీతాదేవిల అనుబంధం ఎలాంటిదో మనమధ్య అనుబంధం కూడా అంతటి పవిత్రమైనదేనని ఒక వదిన మరిదికి చెప్పటం ఆనాటి కుటుంబ సంబంధాలను కళ్ళకు కడుతుంది.
వెసూవియస్ అగ్నిపర్వతం వల్ల ధ్వంశమైన పాంపే శిథిలాలలో ఆనాటి అనేక కుడ్య చిత్రాలు బయటపడ్డాయి. దాదాపు అదేకాలంలో ఇక్కడి ఇండ్లలోకూడా కుడ్యచిత్రాలు ఉండేవి అనే సంగతి పైగాథ ద్వారా అర్ధం చేసుకొనవచ్చును.
***
ప్రియమైన ఎనుబోతు చనిపోగా
దాని మెడను వేలాడిన గంటల పట్టీని
ఇంటికాపు చాన్నాళ్ళు దాచుకొని చివరకు
అజ్జ దేవళానికి సమర్పించుకొన్నాడు. (272)
.
సప్తశతి గాథలలో గౌరిదేవి, లక్ష్మిదేవి వర్ణణలు చాలా చోట్ల కనిపిస్తాయి. పై గాథలో “అజ్జ” దేవి (అజ్జా-ఘరే) ప్రస్తావించబడింది. అజ్జ దేవి దుర్గామాత సాత్విక రూపం. ఈ స్వరూపం సమస్త వృక్ష, జంతు జాతులను సంరక్షిస్తుందని ఒక విశ్వాసం. అజ్జ మాతను వనదేవతగా నేటికీ ఒరిస్సాలో పూజిస్తారు (ఆఫ్రికా వనదేవత పేరు కూడా Aja నే). పైగాథలో చెప్పబడిన అజ్జాదేవిని ఒక గ్రామదేవతగా ఊహించుకోవచ్చు.
గాథలు వ్రాసిన సమయానికి హైందవ సంప్రదాయాలు ఇంకా బలపడలేదు. భిన్న మతసంప్రదాయాలు పక్కపక్కనే సహజీవనం చేసాయి. గ్రామదేవతల సంప్రదాయం కూడా అప్పటినుంచే ఉన్నదనే విషయాన్ని పై గాథ నిరూపిస్తుంది. దేవతలకు చెందిన దేవాలయం గురించి ఈ ఒక్క గాథ మాత్రమే చెబుతుంది. అదికూడా ఒక వనదేవత ఆలయం కావటం విశేషం.
పై గాథలోని విషయానికి వివిధ వ్యాఖ్యానకారులు- అక్కడ చనిపోయింది భార్య అని ఆమె నగల్ని ఆ మగడు గుడిలో ఇచ్చేసాడని అంటూ ఒకరు; కొత్తభార్యకు పాతభార్య నగలు నచ్చనందుకు వాటిని గుడిలో ఇచ్చాసాడని మరొకరు - స్త్రీపురుష కోణంలోంచి చుస్తూ రకరకాల భాష్యాలు చెప్పారు. ఎందుకో పై గాథను అర్ధం చేసుకోవటానికి అత్యంత సరళమైన మానవోద్వేగాన్ని అన్ని ఒంకర్లు తిప్పక్కరలేదనిపిస్తుంది. My dog has died./I buried him in the garden/ Some day I'll join him right there// అనె Pablo Neruda కవితావాక్యం పలికిన ఉద్వేగం లాంటి స్వచ్చమైన ఉద్వేగమే పై గాథలో కూడా కనిపిస్తుంది.
***
చిలుకముక్కు ఆకారంలో ఉండే మోదుగపూలు
రాలి నేలంతా పరచుకొని
బుద్ధుని పాదాలవద్ద మోకరిల్లిన
బౌద్ధభిక్షుకుల సమూహంలా
పరిసరాలను ప్రకాశింపచేస్తున్నాయి (308)
.
సప్తశతి గాథలలో బుద్ధుని ప్రస్తావించే ఒకే ఒక గాథ ఇది. నిజానికి ఆనాటి సమాజంలో బౌద్ధమతం ఉచ్ఛస్థితిలో ఉన్నది. అయినప్పటికీ ఒకే ఒక గాథలో బుద్ధదేవుని ప్రస్తావన అదికూడా నేరుగా కాక పరోక్షంగా ఉండటం ఆశ్చర్యం కలిగించకమానదు.
మోదుగపూలు ఎర్రగా ఉంటాయి. వాటి ఆకారం చిలుకముక్కులా ఒంపుతిరిగి ఉంటుంది. బౌద్ధభిక్షుకులు కాషాయవస్త్రాలు ధరిస్తారు. ఒక భిక్షకుడు ఒంగొని తలనునేలకు ఆన్చి సాగిలపడినపుడు దూరంనించి చూస్తే చిలుకముక్కులా, ఎర్రని మోదుగుపువ్వులా అనిపించటం ఒక మామూలు దృశ్యం.
ఆ దృశ్యాన్ని ఒక పువ్వు చెట్టుకు చేసే వందనంగాను, వినమ్రత ఈ సమాజాన్ని ప్రకాశింపచేసే అంశంగాను చేసిన ఊహ ఆ గాథలోని అవాచ్య దర్శనం. (ఇంకా ఉంది)Image may contain: outdoor and food
బొల్లోజు బాబా

No comments:

Post a Comment