Tuesday, July 14, 2020

సప్తశతి గాథలలో సామాజిక వ్యవస్థ – పార్ట్ 7


(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు)
వివాహవ్యవస్థ
.
పరిణామక్రమంలో పురుషజీవికి తనసంతానం ఎవరో తెలుసుకోవాలనే కోర్కె వివాహవ్యవస్థకు బీజం వేసింది. ఈ క్రమంలో ఆనాటి సమాజం Polygamy, Polyandry లను తొలగించుకొంది. ధార్మికవిధులు నిర్వర్తించటం, సంతానం పొందటం సహజీవనానికి పరమార్ధాలుగా గుర్తించి monogamy ని ఎంచుకొంది. ఫలితంగా స్త్రీ అంతవరకూ మాతృస్వామిక సమాజంలో అనుభవించిన స్వేచ్ఛనుకోల్పోయింది. పురుషాధిక్య సమాజంలో పురుషుని సంరక్షణలో నిరంతరం అణిగి ఉండేలా స్మృతులు సరిహద్దులు ఏర్పరచాయి. సప్తశతి కాలం ఈ పరిణామదశను సాహిత్యంలో నిక్షిప్తం చేసింది. ఈ గాథలలో స్వేచ్ఛగా విహరించే స్త్రీలు, భర్తచాటు స్త్రీలు ఇద్దరూ ఉంటారు. అదే సమయంలో స్త్రీపురుషుల మధ్య తళుక్కుమనే అనాది మానవోద్వేగాల అద్భుత ఆవిష్కరణ జరిగింది.
.
బాల్యవివాహాలు అప్పట్లో లేవు; బహుభార్యత్వం ఉండేది. అత్తాకోడళ్ళ విరసాలు ఉన్నాయి. దూరదేశాలు వెళ్లిన భర్తకోసం ఎదురుచూసే ప్రోషితపతికలు ఉన్నారు; భర్త పరదేశంలో ఉన్నప్పుడు భార్య రోజులు లెక్కపెట్టుకొంటుంది. బక్క చిక్కిపోతుంది. అలాంటి కోడల్ని ఓదార్చే అత్తలున్నారు; దూరదేశమేగిన భర్తకు ఉత్తరం రాద్దామని కూర్చుంటే కన్నీళ్ళతో అక్షరాలు తడిచిపోతుంటాయి; భర్త ఊర్లోలేడు, అత్తపొరుగూరెళ్ళింది దొంగలభయం ఉంది అంటూ ఆహ్వానాన్ని నర్మగర్భంగా చెప్పే రసికమనోరమణులు ఉన్నారు; పొరుగింటావిడ భర్త లేనప్పుడు, ఆమె బాధలో పాలుపంచుకొని తానుకూడా పండగఅలంకరణ చేసుకోకుండా ఉంటుందో ఇల్లాలు; వానాకాలంలోపులో (వాగులు నదులు పొంగి దారులు మూసుకుపోతాయికనుక) ఇంటికి చేరాలని వడివడిగా అడుగులు వేసే భర్తలు ఉన్నారు; భర్త పేదవాడైనా, ముసలివాడైనా గుణాన్ని ప్రేమించే భార్యలున్నారు; భర్త ఆర్ధిక స్థితి ఎరిగిన ఒక భార్య శ్రీమంతం రోజున నీకేం కావాలి అని కోరినప్పుడు మంచినీళ్ళు కావాలి అని భర్తగౌరవాన్ని నిలిపే ప్రయత్నం చేస్తుందో ఇల్లాలు అమాయకంగా: తనతో శృంగారం చేస్తూ మరొక స్త్రీ పేరు ఉచ్ఛరించినపుడు దుఃఖపడిన ఇల్లాండ్రు ఉన్నారు, భర్త బాధచూడలేక స్వయంగా అన్యస్త్రీ ఇంటికి తీసుకు వెళ్ళే భార్యలూ ఉన్నారు; మగడు చనిపోయాకా సతీసహగమనం చేసే స్త్రీలు ఉన్నట్లుగానే, భార్యచనిపోయాక ఆ దుఃఖంతో విరాగి అయిన భర్తలూ ఉన్నారు. ఇన్నివైరుధ్యాలతో సప్తశతి గాథలలోని వివాహవ్యవస్థ చిత్రమైన స్వప్నలోకంగా అనిపించకమానదు. రకరకాల ఉద్వేగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
.
తామంతా పితృస్వామిక వ్యవస్థ అనే విషపుకోరలలో చిక్కుకొని బ్రతుకుతున్నామనే ఎరుక లేకుండానే వాళ్లంతా సుఖించి, దుఃఖించి, ఏడ్చుకొని, నవ్వుకొని, గొప్పగానో, బీదగానో జీవించేసారు. "మేమెలా జీవించామో చూడండి" అంటూ ఇన్నేళ్ల తరువాతకూడా మనకు కొన్ని జ్ఞాపకాల్ని మిగిల్చిపోయారు.
***
ముత్తైదువులు పెండ్లిపాటలు ఎత్తుకోగానే
పెండ్లికూతురి రోమాలు నిక్కబొడుచుకొన్నాయి
పెండ్లికొడుకు పేరు తాముకూడా వినాలని కాబోలు. (644)
పై గాథలో పెండ్లికూతురు యుక్తవయసుకు చెందిన అమ్మాయి అని, ఆమెకు పెండ్లిరోజునాటికి కూడా భర్త పేరు తెలియదని, పెద్దలే అన్నీ చూసి పెళ్ళి నిశ్చయం చేసి ఉండవచ్చని అర్ధమౌతుంది. “తాంబూలాలిచ్చేసాను తన్నుకు చావండి” అన్నట్లు పెండ్లికూతురు ఇష్టాఇష్టాలతో ప్రమేయం లేకుండా పెళ్ళిల్లు చేసే ఆనాటి సంప్రదాయం నిన్నమొన్నటి వరకూ కొనసాగింది.
***
.
నా పెండ్లి సమయంలో పలికిన
పవిత్ర మంగళాసీస్సులను విన్న
ఏటి ఒడ్డునవెదురుపొద ఇంకా ఊరి కుర్రకారు
లోలోపల నవ్వుకొన్నారేమోనని అనుమానంగా ఉంది. (645)
.
ఆనాటి ప్రజలు శృంగారాన్ని హాయిగా ఆనందించారు, ఆ విషయాన్ని అందమైన గాథలలో అరమరికలు లేకుండా చెప్పుకొన్నారు. ముందుచెప్పుకొన్న గాథ ఒక అమాయకమైన పెండ్లికూతురు గురించయితే రెండో గాథలో ప్రేమ మధురిమల్ని అనుభవించిన వలపులాడి గురించి. బహుసా “కన్యా”దాన సమయమందు చెప్పే మంత్రాలేవో ఆ విలాసవతికి నవ్వుతెప్పించి ఉంటాయి.
వెదురు గుబుర్లు ప్రేయసీప్రియులు కలుసుకొనే సంకేత స్థలాలుగా ఉండేవని అనేక గాథలలో కనిపిస్తుంది. మరో గాథలో ఓ అభిసారిక తమ ఏకాంతానికి భంగం కలిగిస్తున్న ఒక సన్యాసితో “ ఓయీ! నిన్ను రోజూ భయపెట్టే కుక్కను ఈ రోజు సింహం వచ్చి తినేసింది, రేపటినుంచి నీవు ధైర్యంగా ఇక్కడ సంచరించవచ్చు” అంటుంది. అంటే నువ్వు కుక్కకే భయపడుతున్నావు ఇక్కడ సింహం సంచరిస్తుంది, ఇకపై ఇక్కడ తిరగకు అని ధ్వన్యాత్మకంగా చెప్పటం.
***
వీటన్నిటినీ మించి భార్యభర్తల అన్యోన్యత అనేక గాథలలో అందంగా చెప్పబడింది.
.
పాదాలు పట్టుకొని
బతిమాలుతున్న భర్త వీపునెక్కి
చిన్నకొడుకు తైతెక్కలాడుతుంటే
అంత కోపంలోనూ ఆమెకు నవ్వాగలేదు. (11)
పై గాథద్వారా ఎన్ని గొడవలు పడ్డా చివరకు భార్యాభర్తలు కలిసి సంసారాన్ని సుఖమయంచేసుకొన్నారని, హాయిగా జీవితాల్ని పండించుకొన్నారని తెలుస్తుంది.
***
సుదీర్ఘకాల సహజీవనం లో కష్టసుఖాలు పంచుకొని
ప్రేమ అర్ధాన్ని కనుగొన్నదంపతులలో
మొదటచనిపోయినవారు బ్రతికినట్లు
రెండవవ్యక్తి ఉన్నా చచ్చినట్లే. (142)
చాన్నాళ్ళు కలిసున్న దంపతులలో ఒకరు మరణిస్తే మరుకొరు చనిపోయిన వ్యక్తిని తన జ్ఞాపకాలలో నిత్యం బ్రతికించుకొంటూ క్షోభపడుతూండటం ఒక పాతవిలువ. దాన్ని వివాహబంధం అనేకన్నా విశాలమైన మానవీయవిలువల ఔన్నత్యంగా అనుకోవచ్చు.
(ఇంకా ఉంది)
బొల్లోజు బాబా
(పై గాథలు Poems on Life and Love in Ancient India, Translated from the Prakrit and Introduced by Peter Khoroche and Herman Tieken నుండి చేసినవ్యాసకర్త చేసిన స్వేచ్ఛానువాదాలు. బ్రాకట్స్ లో ఇచ్చినది గాథల సంఖ్య)

No comments:

Post a Comment