Tuesday, July 14, 2020

విజయవాడలో సాయిపాపినేని గారి ఆధ్వర్యంలో జరిగిన కాలయంత్రం వర్క్ షాపు గొప్ప స్పూర్తిని, ఉత్తేజాన్ని ఇచ్చింది. అనేక మంది మిత్రులను తొలిసారిగా కలిసాను. మిత్రులు కట్టాశ్రీనివాస్ అరవింద్ ఆర్య లు వెలగపూడిలో ఉన్న ప్రసిద్ధి చెందిన కాకతీయులకాలంనాటి శాసనాన్ని దర్శించారు. దాని గురించి చిన్న రైటప్ పెట్టారు వారి వాల్ పై. ఆర్య మంచి వివరాలు ఆశువుగా చెప్పటం నచ్చింది ఫేస్ బుక్ లైవ్ లో. ఆసక్తి కలిగి కొంత శోధిస్తే ఈ విషయాలు తెలిసాయి.
***
మల్కాపురం శాసనం
ఈ శాసనం క్రీ.శ.1261 మార్చి25 న వేయబడింది.
ఇక ఈ శాసనం గురించి జయంతి రామయ్య పంతులు గారు 1930 నాటి జర్నల్ ఆఫ్ ఆంధ్ర హిస్టారికల్ రీసర్చ్ సొసైటీ లో చాలా విషయాలు చర్చించారు
1. కాకతీయులు క్షత్రియులా శూద్రులా అన్న విషయం. - ఈ శాసనంలో క్షత్రియులని చెప్పబడింది. ఆ విషయాన్ని ఆయన అనేక ఉటంకిపులు చేస్తూ పూర్వపక్షం చేయటానికి ప్రయత్నించారు
2. రుద్రమదేవి గణపతిదేవుని భార్యా లేక కూతురా అనే వివాదాన్ని కూడా పరిష్కరించారు. మార్కోపోలో రుద్రమదేవిని గణపతిదేవుని విధవరాలుగా చెప్పాడు. అప్పటినుంచి ఉన్న ఆ సందిగ్ధాన్ని పంతులు గారు నిర్ధ్వంధ్వంగా ఈ శాసనాధారంగా తిరస్కరించారు.
3. ఈ శాసనంలో ప్రతాపరుద్రుడు రుద్రమదేవి కొడుకుగా చెప్పబడ్డాడు. దీన్ని చర్చిస్తూ ప్రతాపరుద్రుడు రుద్రమదేవి కూతురుకొడుకనీ, అతనిని అప్పటికే రుద్రమదేవి దత్తత తీసుకోవటంతో ఈ శాసనంలో కొడుకుగా లిఖించబడినదని పంతులుగారు అన్నారు.
4. గణపతి దేవుడు, రుద్రమదేవి ఇరువురూ దానాలు చేసినట్లు ఈ శాసనంలో ఉన్నాయి. అలా ఉండటానికి కారణం, గణపతి దేవుడు చివరి కాలంలో రాజుగా ఉంటూనే రుద్రమదేవికి పగ్గాలు అప్పగించినట్లు పంతులుగారు ప్రతిపాదించారు. అలా ఈ శాసనం రుద్రమదేవి మొదటి పాలనా సంవత్సరంలో (ఒకరకంగా తండ్రితో కలిసి ఉమ్మడి పాలన అని జయంతి పంతులుగారి అభిప్రాయం ) వేయించిన శాసనం ఇది.
5. ఈ శాసనంలో ఉన్న విశ్వేశ్వర శివ అనే రాజగురువుకు శివదేవయ్య అనే పేరు కూడా కలదని ప్రతిపాదించారు.
6. ఈ శాసనంలో కనిపించే ఆనాటి సామాజిక పరిస్థితులను విపులంగా చర్చించారు జయంతి రామయ్య .
ఈ శాసనం ద్వారా తనకు దానమొసగిన అగ్రహారంలో విశ్వేశ్వర శివుడు- బ్రాహ్మలు మొదలుకొని చండాలురు వరకూ ఉపయోగపడేలా ఒక సత్రాన్ని, ఒక ఆసుపత్రిని, పురుళ్ళు పోసుకోవటానికి ఒక ప్రసూతి కేంద్రాన్ని, సంస్కృతం నేర్పే కళాశాలను నెలకొల్పినట్లు తెలుస్తున్నది. (ఇక్కడ గమనించవలసినది అన్ని కులాలకొరకు సత్రము, ఆసుపత్రి నిర్మాణము). ఆ గ్రామములో శైవారాధన కొరకు అరవై మంది బ్రాహ్మణులను తమిళనాడునుండి రప్పించారు.
ఆ గ్రామములో పదిమంది వీరభద్రులు పేరుతో గ్రామరక్షకులు ఉండేవారు. వీరిపని వృషణాలను, శిరస్సులను, పేగులను ఛేధించటం. అవి బహుసా ఆనాటి శిక్షలు కావొచ్చునని జయంతి పంతులుగారు అభిప్రాయపడ్డారు. ఈ వీరభద్రుల క్రింద పనిచేయటానికి వీరముష్టి పేరుతో
ఇరవై మంది భటులు ఉండేవారు.
7. అప్పట్లో ఏదైనా కొత్త గ్రామాన్ని ఏర్పాటుచేసినపుడు గ్రామసేవకు కావలసిన అన్ని వృత్తుల వారిని ఏర్పాటు చేసే బాధ్యత రాజుదే. ఎందుకంటే వృత్తి పనివారు ఒక గ్రామాన్ని వీడి మరో గ్రామానికి వెళ్ళాలంటే రాజానుమతితోనే చెయ్యాలి. లేకపోతే కులంనుంచి వెలి వేసే వారు. ఆ కారణంగా ఈ గ్రామానికి విశ్వేశ్వర శివుడు ఈ క్రింది వృత్తుల వారిని ఏర్పాటు చేసాడు.
పంచవృత్తుల వారు, మేదర, తాపీపని, కుమ్మరి, మంగలి, స్థపతి అని పదిరకాల వివిధ వృత్తులవారిని ఆ గ్రామానికి నియమించాడు.
ఆలయానికి పదిమంది దేవదాసిలను, ఎనిమిది మంది వాయిద్యకారిణులను, పద్నాలుగుమంది గాయనిలను, ఆరుగురు డప్పులు కొట్టేవారిని ఒక Kashmirian (ఏపని చేస్తారో తెలియదు. బహుసా సంగీత శిక్షకుడు కావొచ్చు) ఏర్పాటు చేసాడు. ఆలయ ఆదాయ వ్యయాలను చూడటానికి పలువురు బ్రాహ్మణులను నియమించాడు.
పైన చెప్పిన వ్యక్తులందరకూ తరతరాలుగా అనుభవించుకొనే హక్కుతో మాన్యములు ఇవ్వబడ్డాయి. వీటన్నింటిమీదా విశ్వేశ్వర శివుడు అంతిమంగా హక్కులను కలిగి ఉంటాడని ఉన్నది.
8. శాసనం చివరలో విశ్వేశ్వర శివుడు చేసిన అనేక దానాల సుదీర్ఘపట్టిక కలదు.
***
ఇక చివరగా ఒక మాట
.
ఈ శాసనం నేడు ఏ రక్షణా లేకుండా, ఏ రకమైన శ్రద్ధకు చోచుకోక, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్నది. నిజమే..
.
బహుసా జయంతి రామయ్య పంతులు గారు చూసినప్పటికంటే కూడా ఈ రోజు మరింత అధ్వాన్న స్థితిలో ఉండొచ్చు. (పాత ఫొటోలో చుట్టూ ఫెన్సింగ్ ఉండటం గమనించవచ్చు)
.
వెయ్యేళ్ళుగా రాజధాని లేకుండా బతుకులు ఈడ్చుకొస్తున్నాం ....
ఒక స్థిరనివాసం, ఒక స్థిరమైన అస్థిత్వం, ఘనమైన సాంస్కృతిక వారసత్వం ఉన్నా నిలబెట్టుకోలేకపోవటం, ఉన్నదాన్ని పరిరక్షించుకోలేకపోవటం .... అర్ధం చేసుకోరూ....
మరీ రుద్రమదేవి చేత కూడా కన్నీళ్ళు పెట్టిస్తే ఎలా Katta Srinivas gaaroo? 
బొల్లోజు బాబాImage may contain: sky and outdoor, text that says "Nandi Pillar containing the Malkapuram Inscription."

No comments:

Post a Comment