Tuesday, July 14, 2020

ముళ్లకంప లాంటి దుఃఖ కవిత్వం – ప్రభు “దుఃఖపు ఎరుక”


.
శ్రీ అద్దేపల్లి ప్రభు గారు కథకునిగా, కవిగా, వక్తగా అందరకూ తెలిసిన వ్యక్తి. ఇంతవరకూ ‘ఆవాహన’, ‘పారిపోలేం’ అనే రెండు కవిత్వసంపుటలను వెలువరించారు. జిల్లాలోని చారిత్రిక ప్రదేశాలను తిరిగినపుడు కలిగిన అనుభూతులను “పర్యావరణ ప్రయాణాలు” పేరుతో చిన్న బులిటన్ గా తీసుకువచ్చారు. ఇది ఇంతవరకూ కవిగా ప్రభు గారి కవిత్వ ప్రయాణం.
ఇటీవల విడుదల చేసిన కవిత్వ సంపుటి పేరు “దుఃఖపు ఎరుక’. చాలా గొప్ప శీర్షిక ఇది. మానవ దుఃఖాన్ని ఆవిష్కరించటం సాహిత్యం చేసే అతి ప్రధానమైన పని. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుస్తకాలలో మానవ దుఃఖమే ప్రధాన ఇతివృత్తంగా ఉండటం గమనించవచ్చు. దుఃఖపు ఎరుక అంటే దుఃఖం గురించిన జ్ఞానం.
ఏదిమనకు దుఃఖాన్ని కలిగిస్తుందో చాలా మంది గుర్తించలేరు.
ప్రముఖ అమెరికన్ కవి చార్లెస్ బుకొవ్ స్కి – రోజు తాగి వచ్చి తల్లిని చితకబాదే తండ్రి గురించి వ్రాసిన ఒక కవితలో ఇలా అంటాడు
మా నాన్న మాత్రం తన ఆరున్నర అడుగుల దేహంతో ఊగిపోతూ
మా అమ్మను, నన్నూ విపరీతంగా కొట్టేవాడు
ఎందుకంటే
ఎవరు అతన్ని లోపలనుంచి హింసిస్తున్నారో
అతనికి అర్ధమయ్యేది కాదు.
అతనిని ఏది హింసిస్తుందో లేక దుఃఖపెడుతుందో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఒక కవి లేదా తత్వవేత్తా ఈ దుఃఖాన్ని గుర్తిస్తాడు దానిగురించి విముక్తమవటానికి మార్గాలు అన్వేషిస్తాడు. దుఃఖ మూలాలు కొరకు తన లోపలా, తనకు వెలుపలా ఉండే ప్రపంచాలను అన్వేషిస్తాడు. తను పొందిన “దుఃఖపు ఎరుక” ఆధారంగా ఇదిగో ఇక్కడ నుంచి మానవ దుఃఖం ఊరుతుంది అని కొన్ని ప్రతిపాదనలను మన ముందుంచుతాడు. ఈ అన్వేషణ గమ్యం అందరికీ ఒక్కటే అవ్వాలని లేదు. ఒకనికి దుఃఖమూలాలు రాజకీయాలలోనో, నాగరికతలోనో కనిపించవచ్చు, మరొకనికి మానవసంబంధాలలో కనిపించవచ్చు, ఇంకొకరికి ఆర్ధికవ్యవస్థలో కనిపించవచ్చు లేదా భక్తిరాహిత్యంలో కనిపించవచ్చు. దుఃఖమూలాలు ఎక్కడ ఉన్నాయి అనే అన్వేషణ నిరంతరం కొనసాగే ఒక ప్రక్రియ. ఎవరి అనుభవం వారిది, ఎవరి దుఃఖపు ఎరుక వానిదే.
నిజానికి దుఃఖాన్ని గుర్తించటం కష్టం
నవ్వే పెదాల వెనుక ముళ్లకంప లాంటి దుఃఖం
అలా గీరుతూనే ఉంటుంది -- (దుఃఖపు ఎరుక) – అంటూ ప్రభు దుఃఖ స్వరూపాన్ని కళ్ళకుకడుతున్నాడు.
“దుఃఖపు ఎరుక” పుస్తకంలో ప్రభు చాలా కవితలలో మానవ దుఃఖానికి కారణం పర్యావరణ విధ్వంసం అని చెపుతున్నాడు. అభివృద్ది పేరుతో ప్రకృతిని నాశనం చేయటం దుఃఖదాయకం అంటున్నాడు.
చెట్టంత మనిషి లేడు
డబ్బంత మనిషి
ప్రకృతిలో కాలుష్యంగా వ్యాపిస్తున్నాడు
చెప్పు ఈ వ్యయనామ సంవత్సరంలో
ఎన్ని కొండల్ని వ్యయం చేసి
ఎన్ని డబ్బుల కొండల్ని చేద్దాం
ఎన్ని నదుల్ని పొట్లాలు కట్టి
ఎన్ని రూపాయిల మూటలు కడదాం
ఎన్ని పిట్టలకు మందు పెట్టి
ఎన్ని కట్టలతో చిందులేద్దాం
ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది
అందుకు ప్రణమిల్లాలి
మనం ప్రకృతికి ఏమీ యివ్వలేదు
కనీసం రాబందుకొక కళేబరాన్ని కూడా -- (ఆదికి ముందు).
ప్రకృతిని కలుషితం చేయటం, కొండల్ని, నదుల్ని అమ్ముకొని సొమ్ముచేసుకోవటం ద్వారా ఆధునిక మనిషి చేస్తున్న విధ్వంసాన్ని కళ్ళకు కడుతున్నాడు. మనకు ఎన్నో ఇచ్చే ప్రకృతికి కనీసం ఒక కళేబరాన్ని కూడా ఇవ్వటం లేదు అనటం ద్వారా మొత్తం కవితావస్తువును పరాకాష్టకు తీసుకెళతాడు ప్రభు. మనిషి చేస్తున్న వినాశక చర్యలవల్ల ఈ రోజు రాబందులు ఎండేంజర్డ్ కేటగిరీలోకి చేరాయి.
ఓ పదేళ్ళ క్రితం కోస్తా కారిడార్ పేరిట తీరప్రాంతంలో పారిశ్రామిక జోన్ ను ఏర్పాటు చేసారు. దీనివల్ల పచ్చని ప్రకృతి నాశనం అవుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరించారు. ఆ నేపథ్యంలోంచి వ్రాసిన కారిడార్ అనే కవిత కోస్తా కారిడార్ పేరిట భూములు లాక్కోవటం, కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలు స్థాపించటాన్ని ప్రశ్నిస్తుంది.
అటు సముద్రానికీ
ఇటు కనుమలకీ మధ్య
ఉక్కపోత లాంటి సరళ రేఖ.
ఏ అలా పర్వతమోలె ఎగియదు
ఏ పర్వతమూ అలవోలె విరగదు
మధ్య ఒక తాచుపాము విషం కక్కుతూ
మెలికలు తిరుగుతుంది. (కారిడార్).
రాబోతున్న విధ్వంసాన్ని, కాలుష్యాన్ని గుర్తించి వ్రాసిన అద్భుతమైన కవితా వాక్యాలివి. “ఉక్కపోతలాంటి సరళ రేఖ” అన్న మాటలో సరళ రేఖ కోస్తా కారిడార్ భౌగోళిక స్వరూపాన్ని చెపుతుంది. ఉక్కపోత అది కలగచేసే మానవ దుఃఖాన్ని వ్యక్తీకరిస్తుంది. అతి తక్కువ పదాల్లో గంభీరమైన భావం ఇది. అదే సమయంలో ప్రజలలోని నిర్లిప్తతని – తరువాత పాదాలు చెపుతున్నాయి. ఈ ప్రాంతంలో ఆరులైన్ల హైవే నిర్మాణం జరిగింది. ఆ హైవేని తాచుపాము విషం కక్కూతూ మెలికలు తిరిగుతుంది అంటున్నాడు.
విశాలమైన రోడ్లపట్ల ప్రభు తన వ్యతిరేకతను అనేక వాక్యాలుగా చాలాచోట్ల చెప్పాడు. నిజానికి ఒక్కోసారి ఇదేమిటీ రోడ్లే కదా మన అభివృద్ది సూచికలు వాటిని వద్దంటున్నాడేమిటా అని ఆశ్చర్యం కలుగుతుంది కూడా. కానీ ప్రభు దృష్టి వేరు. రోడ్లు అభివృద్ది సూచికలే కావొచ్చు కానీ ఆ రోడ్ల నిర్మాణం కొరకు మనిషి కొండల్ని, పంటపొలాల్ని, పెద్దపెద్ద వృక్షాలను నాశనం చేస్తున్నాడన్న విషయం స్పష్టంగా మనముందుంచుతాడు. ఈ రోడ్లకు ఇరువైపులా కేటిల్ గార్డ్ లు పెట్టి పశువులను నడవనివ్వరు. పక్కన చెట్లు ఉండవు కనుక ఏ పిట్టా గూడు కట్టుకోలేదు. ఇలా ఒక రోడ్డు చేస్తున్న విధ్వంశాన్ని దర్శించటమే గొప్ప పర్యావరణ ప్రేమ.
రోడ్డు కొండల్ని పేల్చుకుంటూ
నేలమీద పరుచుకుంటుంది//
హైటెక్ కర్మ నున్నటి తారు రోడ్డులా
అన్నం మీంచి దూసుకుపోతుంది//
ఈ రోడ్డు పక్కన చెట్లు మొలవ్వు
పైన పక్షి వాలదు//
కటిక చీకటిలో కూడా
కళ్ళు తెరచి పరుగులు తీసే ఈ రోడ్డు మీద
ఏ జంతువూ నడవదు//
ప్రభు కవిత్వంలో ఆనకట్టల పట్ల వ్యతిరేకత కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ రోజున పర్యావరణ వేత్తలు ఆనకట్టలు కట్టటం పర్యావరణ హితం కాదని చెపుతున్నారు.
వానలు పడ్డ ప్రతిసాలూ
రూపాయిలు కావాల్సిన నది
నీరై సముద్రంలోకి పోతుంది//
ఎక్కడో ఒక చోట దాని
పీక నొక్కి
నీళ్ళని కక్కించాలి
ఆనకట్టల వెనక
నోట్ల కట్టలతో
పొంగి పొర్లిపోవాలి//
అప్పుడు
ఎనిమిది రోడ్ల ప్లై వోవర్లు కట్టుకుని
పటం అక్కర్లేని ప్రపంచీకరణలో
ముఖం అక్కర్లేని మనుషుల్ని పుట్టించవచ్చు. (ఒక నది ఉండటం)
ఆనకట్టలు కట్టి సరిహద్దులు లేని విధంగా ప్రపంచీకరణ అయి, మానవత్వం లేని మనుషులను పుట్టించుకొందాం అంటాడు. ఈ కవితలో ఐరనీ ఉంది. అలాంటి అభివృద్దిలో ముఖంలేని మనుషులే ఉంటారు తప్ప ఇతర జీవరాశి ఉండదు అని సూచన ఉంది.
ఈ రోజు భూసేకరణ అనేది ఒక రాజకీయ క్రీడలా మారిపోయింది. ఉన్నపళంగా ఒక జివొ తెచ్చి తరతరాలుగా నివసిస్తున్న భూమినుంచి అక్కడ నివాసం ఉంటున్నవారిని తొలగించటం జరుగుతుంది. ఇందులో ఉన్న అమానవీయతను భూసేకరణ అనే కవితలో ఇలా పట్టుకొంటాడు ప్రభు.
కూర్చున్న చాపని కుదిపి
లాగేసినట్టు
నిలబడ్డ భూమిని చట్టం చేసి
చుట్టేశారు-
అమ్మకమూ కొనుగోలూ ఉండే
కొత్తగ్లోబులో
నిర్వాసితుడొకడు ప్రశ్నలా
లేచాడు//
నీటి అమ్మకాలూ ఎండిన పెదాలూ ఉండే
కొత్తగ్లోబులో
నిర్వాసితుడొకడు
రెక్కలు పగిలిన పిట్టలా
పడిపోయాడు
పోగుపడుతున్న మహా సంపద ముందు
తెగిపడిన బతుకు తలకోసం
తొక్కిసలాటలో దేవులాడుతున్నాడు
నిర్వాసితుడు (భూసేకరణ)
వస్తువును అలవోకగా కవిత్వం చేస్తారు ప్రభు. చాపని లాగేయడం, భూమిని చట్టం చేయటం, ప్రశ్నలా లేవటం, పగిలిన పిట్ట, బతుకు తల లాంటి వ్యక్తీకరణలు మామూలు వ్యక్తీకరణలు కావు. ఆ యా చర్యల్ని దృశ్యాలుగా నిలబెడతాయి. వాటివెనుక ఉద్వేగాలను శక్తివంతంగా ఆవిష్కరించి కలవరపెడతాయి. ఏ వెలుగులకీ ప్రస్థానం అని ఆలోచింపచేస్తాయి.
“The biggest fraud of History is Agriculture” యువల్ నోవా హరారి అనే రచయిత వ్రాసిన “సెపియన్స్” అనే పుస్తకంలోని ఒక చాప్టర్ పేరు.
ఆ పుస్తకంలోనుంచి కొన్ని వాక్యాలు ఇవి
“వ్యవసాయ విప్లవం మానవులకు ఎక్కువ ఆహారాన్ని అందించిన మాట నిజమే, కానీ అదనంగా దొరికిన ఆ ఆహారం వాళ్లు తినే పదార్ధాలలో మెరుగైన మార్పులు తీసుకురాలేదు. వాళ్ళకి ఎక్కువ విశ్రాంతిని అందించలేదు, పైగా దానివల్ల జనాభాలో విపరీతమైన పెరుగుదల, ధనవంతులను గారాబం చేసి పనికిమాలిన వాళ్ళుగా తయారుచేయటంలాంటివి జరిగాయి. సగటు అటవికుడికన్నా సగటు రైతు ఎక్కువ కష్టపడి పనిచేసేవాడు. దానికి మారుగా అతనికి తక్కువపోషకాలున్న ఆహారం దొరికేది. వ్యవసాయ విప్లవం చరిత్రలో అతిపెద్ద వంచన. // చెట్లు ఎక్కేందుకు, జింకల వెనుక పరిగెట్టేందుకు అనువైన శరీరం మానవునిది. నేలను చదునుచేయటం, నీళ్ళు మొయ్యటం లాంటి వ్యవసాయపనులు చేయవలసి వచ్చినపుడు మానవుల వెన్నెముక, మోకాళ్లు మెడలు దానికి మూల్యం చెల్లించి దెబ్బతిన్నాయి”
పై వాదనను అంగీకరిస్తే మనం ఈరోజు అభివృద్ది అనుకొంటున్నదంతా ఉత్త వంచనగా అంగీకరించకతప్పదు. ప్రభు చెపుతున్నదంతా దాని గురించే.
అభివృద్దిపేరుతో జరుగుతున్న విధ్వంసమే మానవ దుఃఖానికి హేతువు అన్న విషయంలో ప్రభు స్పష్టంగానే ఉన్నాడు. మరి ఈ దుఃఖం నుంచి విముక్తమవ్వాలంటే ఏం చేయాలో కూడా ఒక చోట చెపుతాడు.
పాల పిట్ట అనే కవితలో అందమైన ఆ పిట్ట సౌందర్యాన్ని, స్వేచ్ఛని వర్ణించి చివరలో ఇలా అంటాడు.
జ్ఞానం సబ్బుబుడగలా
ఉబ్బిన మనిషి
ప్రకృతి తక్కెడలో
ఈ పిట్టముందు తేలికయ్యాడా
బుడగ పగిలి విముక్తుడౌతాడు (పాల పిట్ట).
మనిషి జ్ఞానభారం నుంచి విముక్తుడై ప్రకృతి ముందు వినమృడై తలవంచిననాడే అతనికి విముక్తి అంటున్నాడు. ఈ అభివృద్ది పథంలో ఇన్ని వేల సంవత్సరాలుగా ప్రయాణం చేసి ఇక వెనక్కు వెళ్లలేని స్థితికి చేరుకొన్నాకా ఈ మాటలు వింతగా తోచవచ్చు. కానీ ఇది మాత్రం వాస్తవమని అంగీకరించక తప్పదు.
***
ప్రభు కవిత్వంలో పర్యావరణ విధ్వంసం గురించే కాక మరో రెండు ప్రధానమైన ఇతివృత్తాలు కనిపిస్తాయి. అవి బౌద్ధం పట్ల ఆరాధన, ప్రకృతి సౌందర్యం పట్ల వివశత్వం.
ఇన్ని నాగరికతల్ని దాటి వచ్చాను
యింకా నీ నిమీలిత నేత్రాల
పారవశ్య రహస్యం తెలియనే లేదు (దుఃఖపడ్డం ఎలా నేర్చుకోవాలి) అంటాడు బుద్ధుడను ఉద్దేశించి.
బీహార్ లో బుద్ధుడు సంచరించిన ‘జేతవనం” అనే ప్రదేశాన్ని సందర్శించిన అనుభవాన్ని అద్బుతమైన కవితగా పోతపోస్తాడు ప్రభు.
పట్నం వంతెన మీద, వయా రంగంపేట, పాలపిట్ట, పట్నంలో పున్నాగ, పిచ్చుకల చెట్టు లాంటి కవితలలో ప్రకృతి సౌందర్యం పట్ల తనకు ఉన్న ప్రేమను మనోరంజకంగా ఆవిష్కరిస్తాడు.
ప్రభు మార్క్సిస్టు సిద్దాంతాన్ని నమ్మినవాడు. ఆ వాద ఛాయలు మనకు అమర, అనేక ఓటముల తరువాత, తూత్తుకుడి వేదాంతం లాంటి కవితలలో కనిపిస్తాయి.
***
ప్రభు కవిత్వం క్లుప్తంగా ఉంటూనే అనంతమైన భావాలను పొదువుకొని ఉంటుంది. అలా రాయటం చాలా కష్టం. కవిత్వాంశను మిస్ అవకుండా, వాక్యం వాచ్యం కాకుండ ద్వన్యాత్మకంగా చెప్పటానికి చాలా శక్తి కావాలి. అది ప్రభుకు పుష్కలంగా ఉంది.
ఉడుగ్గంజి కుండలాంటి చెరువు మీద
ఊరెల్తూ ఆగిన దోసిలి (వయా రంగం పేట)
వందలకొద్దీ పిచ్చుకలు చెట్టునిండా
పూసిన పువ్వుల్లా
రెక్కల్ని, తోకల్నీ అల్లాడిస్తూ
కూతల పరిమళాన్ని చుట్టూరా చల్లుతాయి (పిచ్చుకల చెట్టు)
ఈ నిముషం లక్షరూపాయిలు కావొచ్చు
ఎన్ని లక్షల రూపాయిలైనా ఒక్క నిముషం కాలేవు (ఈ వేళ ఒక్కపైసా కూడా సంపాదించలేదు)
ఇంతకీ వాళ్లు పాపం
కాలుష్యం వద్దు
బతకనివ్వండి చాలు అన్నారు (తూత్తుకుడి వేదాంతం)
నిజానికొక లైబ్రేరీ అంటూ లేదు మా నాన్నకి
వందలకొద్దీ పుస్తకాలు
కొమ్మలమీద వాలిన పక్షుల్లా ఉండేవి
జీవిత వృక్షానికి పూసిన పువ్వుల్లానూ ఉండేవి (నిజానికి….) -- లాంటి వాక్యాలు ప్రభుకవిత్వంలోని లోతుల్ని, సారాన్ని ఆవిష్కరిస్తాయి.
ప్రభు తాత్వికుడు. ఆలోచనాశీలి. ఏది దుఃఖహేతువు అంటూ అనాది సందేహాన్ని మోస్తున్న ఆధునిక అన్వేషకుడు. ఏ వస్తువును కథగా రాయాలో ఏ వస్తువును కవితగా చెప్పాలో రహస్యం తెలిసిన వాడు. దుఃఖపు ఎరుక పుస్తకం మంచి పఠనానుభవాన్ని కలిగిస్తుంది.
బొల్లోజు బాబా
(ఈ వ్యాసం ఈ నెల ప్రస్థానం పత్రికలో ప్రచురించబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదములు )

No comments:

Post a Comment