Tuesday, July 14, 2020

ఇనుప ఎడ్లు


.
కాలిన్ మెకంజి సేకరణలలో 8076 శాసనాలు ఉన్నట్లు వాటిని కేటలాగ్ చేసిన H H Wilson గుర్తించాడు. వీటిలో ద్రాక్షారామ భీమేశ్వర ఆలయానికి సంబంధీంచిన 243 శాసనాలు కలవు. పదకొండవ శతాబ్దంనుంచి పదిహేనవ శతాబ్దాంతం వరకూ ఆనాటి రాజులు, అధికారులు, వ్యాపారులు, సామాన్యులు అనేకమంది ఈ ఆలయానికి విశేషమైన దానాలు సమర్పించుకొన్నారు. ఈ దానాలలో భీమేశ్వరునికి అఖండ దీపారాధన జరిపించటం కొరకు ఇచ్చిన పశువుల దానాలు అనేకం కలవు.
భీమేశ్వర ఆలయానికి సొంత కిలారము (పశువుల కొట్టాం) ఉండేది. పశువులను సాకటానికి అనేకమంది బోయ వాండ్రు ఉండేవారు. ఆలయానికి దానంగా ఇచ్చిన పశువులను ఈ బోయవాండ్రు మేపటం; ఆలయ పూజాదికాలకు అవసరమైన దీపారాధనకొరకు నేయి, అభిషేకాలకొరకు పాలను అందించటం వీరి పని. అనేక శాసనాలలో పశువులను ఈ బోయలకు అప్పగించినట్లు ఉంది. (శా.నం. 1156 of South Indian Inscriptions, Vol IV). ఇక్కడ బోయ అన్నది బహుసా యాదవులయి ఉండవచ్చు. క్రీశ. 1259 నాటి ఒక శాసనములో దేవనబోయ అనే పేరుగలిన వ్యక్తి, కులనిధి గోపాన్వయుడు (యాదవకులస్థుడు) గా చెప్పబడ్డాడు (శా.నం 1370).
ఈ రకపు దానములలో “ఇనుప ఎడ్లు” పేరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇది ఆలయంలో నిత్య దీపారాధన జరిపించటానికి ఇచ్చిన దానమని, “పాలు ఇచ్చే పశువులు” అనే అర్ధంలో “ఇనపఎడ్లు” అనే పదం వాడబడిందని అర్ధమౌతుంది. ఎడ్లు కి నైఘంటికార్ధం ఎద్దులు, ఆవులు లేక గొర్రెలు (తెలుగు వ్యుత్పత్తి కోశం 1978 – ఆంధ్రభారతి). ఎడ్లు అంటే అంటే ఎద్దులు అనే అర్ధమే జనసామాన్యంలో స్థిరపడింది. “ఇనుప ఎడ్లు” పదం వాడిక నేడు వింతగా అనిపిస్తుంది.
***
ద్రాక్షారామ భీమేశ్వరునికి అఖండదీపారాధన, అభిషేకాలకొరకు సమర్పించుకొన్న వివిధరకాల పశువుల సంఖ్య వివిధ శతాబ్దాలలో ఒక్కో విధంగా ఉంది. 11 వ శతాబ్దంలో వేయి పశువులను దానం ఇవ్వగా, ఇది 12 వ శతాబ్దంలో ఈ 9470 గాను(వెలనాటి చోళుల పాలన) , 13 వ శతాబ్దానికి ఇది 1105 గానూ ఉండటం గమనార్హం. 14, 15 శతాబ్దాలకు సంబంధించి దానం చేయబడిన పశువుల సంఖ్య 50 మరియు 221 కావటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ తరువాతి శతాబ్దాలలో అలాంటి దానాలకు సంబంధించిన వివరాలు లేవు. ఈ మార్పులు ఆనాటి పాలకుల రాజకీయ ప్రాధాన్యతలను లేదా ఒడిదుడుకులను సూచిస్తాయి.
ఆలయంలో స్థానికంగా కొంతమంది యాదవులు ఉంటూ ఈ పశువుల దానాలను స్వీకరించేవారు. వాటి నిర్వహణా బాధ్యతను మరొకరికి అప్పగించవలసి వచ్చినప్పుడు, స్థానిక యాదవులు హామీ ఇచ్చి ఆ పశువులను బయటవ్యక్తులకు అప్పగించినట్లు కొన్ని శాసనముల ద్వారా తెలుస్తున్నది.
***
క్రీశ. 1166 లో చోడమహాదేవి 10 కులోత్తుంగ మాడలతో 50 ఇనుప ఎడ్లను బహుకరించింది. అంటే ఒక మాడ (అర వరహా) అయిదు ఇనుపఎడ్లకు సమాన విలువ అని అర్ధమౌతుంది. (శా. నం. 1052)
ఇనుపఎడ్లు అనే పదం “ఆవు” పదానికి ప్రాకృత రూపం అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే అదే సమయంలో ఆవులను మొదవులని (మొదవు=పాడియావు) పేర్కొంటూ ఉన్న కొన్ని శాసనాలు కలవు. 1158 నంబరు కలిగిన ఒక శాసనములో- ఒక్కెత్తు గండయ సోదరి అయిన మేడసాని అనే ఆమె ద్రాక్షారామ భీమేశ్వర దేవరకు అఖండ దీపారాధన నిమిత్తము 50 “మొదవులు” (ఆవులు) దానం ఇచ్చినట్లు ఉన్నది. అదే విధంగా మొదటి కులోత్తుంగుని పాలనాకాలంలో చేసిన ఒక శాసనములో, ఒక మణుగు నెయ్యిని (సుమారు 11 కేజీలు) ఇచ్చేలాగ 35 “సురభిలు” (ఆవులు) దానం ఇచ్చినట్లు తెలుస్తున్నది. (నం. 1288).
ఈ పదం నిఘంటువులో చెప్పిన విధంగా గొర్రెలు అనుకోవటానికి కూడా వీలుచిక్కదు, ఎందుకంటే కొన్ని శాసనాలలో గొర్రెలను “గొఱియలని” పేర్కొనటం జరిగింది. క్రీశ 1038 నాటి శాసనములో క్షేత్రపాలకుని సంధ్యదివ్వెల కొరకు ఒక మానిక (సుమారు లీటరు) నెయ్యి ఇచ్చేలాగ 50 గొఱియలు, అర మానిక నెయ్యి ఇచ్చేలాగ 25 గొఱియలు దానంగా ఇవ్వబడ్డాయి. (శా.నం 1014)
క్రీశ. 1084 లో వేసిన ఒక శాసనములో ఆలయములో ఉన్న కులోత్తుంగ సత్రమునకు ముప్పది పుట్ల భూమితో (ఒక గరిసె లేదా 60 ఎకరములు) పాటు 300 యెడ్లను కూడా దానం ఇచ్చినట్లు ఉంది. 300 ఎడ్లు అనేది చాలా పెద్ద సంఖ్య. ఇది అరవై ఎకరముల పంట భూమితో పాటు ఇస్తున్న దానం కనుక ఆ భూమిని సాగుచేయటానికి అవసరపడే ఎద్దులుని ఊహించాలి. ఆ నేలను సాగుచేయగా వచ్చిన ఫలధాన్యాలను సత్రంలో భోజనాదులకు వినియోగించేవారని అనుకోవాలి. (నం. 1015). దీనిని బట్టి “ఎడ్లు” అనే పదం వాడిక నేడు ఉన్నట్లుగానే అప్పట్లోకూడా ఉందనే భావించాలి.
***
28 మార్చ్, 2018 ఆంధ్రభూమి పత్రికలో “తెలుగు భాషకిదో ‘ప్రాకృతిక’ బాంధవ్యం” అనే వ్యాసంలో శ్రీ చీమకుర్తి శేషగిరి రావు “ఇనపఎడ్లు” అన్న పదానికి దేవర ఆంబోతులు/దేవరెద్దులు అన్న అర్ధం చెప్పారు. కానీ ఈ పదానికి ఆ అర్ధం అనుకూలించదు. ఎందుకంటే…
ఇనుపఎడ్ల సంఖ్య దాదాపు అన్ని శాసనాలలోను 25 నుంచి 50 వరకూ ఉండటాన్ని గమనించవచ్చు.
ఇనుప ఎడ్లకు “దేవర ఆంబోతు” అన్న అర్ధం తీసుకొన్నప్పుడు అంత పెద్ద సంఖ్యలలో ఆంబోతులను దానం చేయటం జరగదు. అప్పట్లో వ్యవసాయానికి ఎద్దుల అవసరం ఎక్కువ. కనుక ఒక ఊరికి రెండో మూడో దేవర ఆంబోతులు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది తప్ప, ఇంత భారీ సంఖ్యలలో ఆంబోతులను ఇవ్వటానికి వీలుపడకపోవచ్చు.
అనేక శాసనాలలో భీమేశ్వరుని “దీపారాధన” కొరకు ఇనుపఎడ్లను దానం చేస్తున్నట్లు స్పష్టంగా ఉంది.
రెండవ గొంకరాజు వద్ద ప్రధాని, సమస్త సేనాధిపతిగా పనిచేసిన వాసనపెగ్గడ కూతురు గుండమ భీమేశ్వరునికి “అఖండదీప నిర్వహణ” కొరకు 50 ఇనపఎడ్లను దానం ఇచ్చినట్లు ఆమె వేయించిన శాసనంలో స్పష్టంగా ఉంది. (నం. 1089). ఈ అవసరం దృష్ట్యా ఇనుపఎడ్లు అన్న పదానికి ఆంబోతులు అన్న అర్ధం పొసగదు.
***
ఇనుప ఎడ్లు అంటే గేదెలా?
ఈ శాసనాలను పరిశీలించగా, ఇనుప ఎడ్లు అన్నపదానికి అర్ధం ఆంబోతులు, ఎద్దులు, ఆవులు, గొర్రెలు కాదు అనే విషయం అర్ధం అవుతుంది. ఇవి కాకుండా పశువులలో పాలు ఇచ్చేటివి బర్రెలు మాత్రమే.
కనుక ద్రాక్షారామ శాసనాలలో ఇనపఎడ్ల పేరుతో పిలువబడిన పశువు బర్రెలు గా (గేదె) నిర్ధారణ చేయవచ్చును. శ్రీ కానూరి బదిరీనాథ్, ద్రాక్షారామ శాసనాలను తమ “తణుకు తళుకులు” అనే పుస్తకంలో ఉటంకిస్తూ “ఇనుప ఎడ్లు అనగా గేదెలు” అని అన్వయించారు. (పేనం 144). గేదెలు నల్లగా ఉంటాయి కనుక “ఇనుప” అన్న విశేషణం చేరి ఉండవచ్చు.
ఉపసంహారం
నేటి సమాజంలో దేవుని పూజకు ఆవు పాలు, ఆవు నెయ్యి తప్ప ఇతరజీవుల ఉత్పత్తులను వినియోగించరు. అదొక అపవిత్ర చర్యగా కూడా భావిస్తారు. కానీ సుమారు వెయ్యేళ్ల క్రితం గేదెల, గొర్రెల ఉత్పత్తులను దేవతార్చనకు వాడటం పట్ల ఏ రకమైన నిషేదం లేదని పై శాసనాల ద్వారా తెలుస్తుంది.
సమకాలీనంగా ఆవుకు ఎనలేని పవిత్రత ఉంది. గోమూత్రం ఒక సర్వరోగనివారిణిలాగ ప్రచారించటం కూడా చూస్తున్నాం. వెయ్యేళ్ళ క్రితంనాటి సమాజం గోవును ఇతరపశువులతో సమానంగా చూసింది తప్ప ఏ రకమైన ప్రత్యేకతను ఇచ్చినట్లు ద్రాక్షారామ ఆలయ శాసనాలలో కనిపించదు. పన్నెండో శతాబ్దపు మూడవ కులోత్తుంగచోళుడు ఆలయాలకు అనుసంధానంగా గోశాలలు ప్రారంభించాడు.
ఆధునిక కాలంలో గోరక్షణ అనేది మొదటి సారిగా 1870 లో పంజాబ్ లో గోరక్షణ ఉద్యమం ద్వారా, 1882 లో దయానంద సరస్వతి గోరక్షణ సభను స్థాపించటంద్వారా మొదలయ్యింది. Mother cow is in many ways better than the mother who gave us birth అన్న మహాత్మ గాంధీ మాటలు ఆశ్చర్యం కలిగించకమానవు. ఇది నాటినుంచి నేటివరకూ రాజకీయ ఏకీకరణ కొరకు ఉపయోగపడుతూందనే విషయాన్ని త్రోసిపుచ్చలేం. భారతదేశంలో జరిగిన చాలా మతకలహాలలో గోవధ అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక కారణమే. నేడు గోరక్షణ అనేది ఒక సామాజిక బాధ్యతగా పరిణమించింది. ఒక మత అస్తిత్వానికి చిహ్నంగా మారింది. మనిషిని చంపైనా సరే గోవును రక్షించాలనేంత దూరం వెళుతోంది.
.
వైదిక క్రతువులలో సాగించిన గోవధ నుండి క్రమక్రమంగా దేవతలకు బర్రెలను, గొర్రెలను బలులుగా ఇవ్వటం వరకూ హిందూ సమాజం సాగించిన ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు కనిపిస్తాయి. ఒకప్పుడు ఆవులతో సమాన హోదా కలిగిన బర్రెలు, గొర్రెలు కాలక్రమేణా పవిత్రతను పొందలేకపోవటమే హిందూదేశ చరిత్ర.
బొల్లోజు బాబా
సంప్రదించిన పుస్తకాలు
1. Epigraphica Indica Vol 4
2. ద్రాక్షారామ శాసనాలు, మెకంజీ సేకరణ
3. వికిపీడియా
4. A Topographical List of the Inscriptions of the Madras Presidency, vol II

No comments:

Post a Comment