Tuesday, July 14, 2020

రుద్రమదేవికి అసలు వివాహం అయ్యిందా?


రుద్రమదేవి కాకతీయ పదమూడవ శతాబ్దంలో సుదీర్ఘకాలంపాటు పాలించిన సామాజ్ఞి. గణపతిదేవుని తరువాత ఈమె రాజ్యనిర్వహణ బాధ్యతలను చేపట్టింది. ఈమె వ్యక్తిగత జీవితం అంటే ఎక్కడ పుట్టింది, తల్లిదండ్రులు, భర్త వివరాలు లాంటి సమాచారం చాలా తక్కువగా లభిస్తుంది. ఈమె వేయించిన శాసనాలు కూడా స్వల్పం. అందువల్ల రుద్రమదేవి గురించి అనేక పరస్పర విరుద్ధమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది ఈమె వివాహం గురించి.
అక్కడక్కడా లభిస్తున్న శాసనాలను బట్టి రుద్రమదేవి భర్త పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చాళుక్య వంశజుడైన వీరభద్రా అని చాలా మంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
***
I రుద్రమదేవి వీరభద్రుని భార్య అని చెప్పే శాసనాలు
ఎ. తణుకు తాలూక సోమేశ్వరాలయములో లభించిన 1258 సంవత్సరానికి చెందిన ఒక అసంపూర్ణ శాసనములో- రుద్రమ మహాదేవిని పెండ్లాడిన చాళుక్య వంశ వీరభధ్రేశ్వరుని యొక్క మంత్రిగా చెప్పుకొన్న విష్ణు అనే వ్యక్తి అఖండదీపారాధన ఏర్పాటు చేసినట్లు ఉంది (740 of 1920)
బి. పాలకొల్లు క్షీరారామ ఆలయంలో లభించే శాసనంలో (509 of 1893) వీరభద్రా కుటుంబము గురించి కొంత సమాచారం లభిస్తుంది. ఇది 1266 నాటిది. ఇందులో విష్ణువర్ధుని(Mahadeva I) కొడుకైన ఇందుశేఖరుని కుమారుడైన వీరభద్రా తన తల్లి అంబ పేరిట దీపదానం చేసినట్లు చెప్పబడింది. అంతకు మించి వివరాలు తెలియరావు.
సి. Hyd Arch. Series 18 నంబరుతో ఉన్న కొలనుపాక శాసనంలో గణపతిదేవుని కూతురైన రుద్రమదేవికి సర్వజనరంజకంగా వీరభద్రా భర్త అయ్యాడని; ఇతడు ఇందుశేఖరుని పెద్దకుమారుడని; ఈ ఇందుశేఖరుడు మహదేవరాజు, లక్కాంబల పుత్రుడని స్పష్టంగా ఉంది. కొలనుపాకలో ఒక పంటకాలువ తవ్వించిన సందర్భంగా ఇందుశేఖరుని సేవకుడైన పోతినాయకుడు ఈ శాసనాన్ని వేయించినట్లు తెలుస్తుంది.
రుద్రమదేవి వీరభద్రా లు దంపతులని తెలిపే అత్యంత ముఖ్యమైన శాసనం ఇది. ఎందుకంటే ఇందులో రుద్రమదేవి గణపతిదేవుల ప్రస్తావన, వీరభద్రా తల్లిదండ్రుల వివరాలు ఉన్నాయి. వీరు బహుశా కాకతీయులకు సామంతులు కావొచ్చు. అయితే దీని కాలం తెలియరాదు. (1279? ఖండవల్లి లక్ష్మి రంజనం)
II వీరభద్రా అతని కుటుంబ వివరాలు
Mahadeva I వేంగిని పాలిస్తున్న చాళుక్య వంశరాజు. ఇతనికే విష్ణువర్ధనుడు అనే పేరుకూడా కలదు. ఇతను నిడదవోలు కేంద్రంగా చేసుకొని ప్రస్తుత పశ్ఛిమగోదావరి జిల్లా ప్రాంతాన్ని 1266-1300 మధ్య పాలించాడు. ఇతను కాకతీయులతో సత్సంభంధాలను కలిగి ఉన్నాడు.
1266 లోని పాలకొల్లు శాసనాన్ని బట్టి ఈ మహదేవుని కొడుకు ఇందుశేఖరుడని, కోడలు అంబ యని, మనుమని పేరు వీరభద్రా అని తెలియుచున్నది. కొలను పాక శాసనం ద్వారా ఇతని భార్యపేరు లక్కాంబ అని తెలుస్తున్నది. ఇందుశేఖరుడు క్రీశ 1300 నుండి 1306 వరకూ నిడదవోలు కేంద్రంగా పరిపాలించాడు. వీరభద్ర పాలనా వివరాలు తెలియరావు.
Mahadeva I క్రీశ 1300 లో చనిపోయేనాటికి (గరిష్టంగా) తొంభై ఏండ్లు అనుకొంటే అతను 1210 లో పుట్టి ఉండాలి. ఇతనికి 1230 లో ఇందుశేఖరుడు పుట్టాడనుకొంటే, అతనికి వీరభద్రా పుట్టేసరికి కనీసం 1250 అవుతుంది. అంటే పాలకొల్లు శాసనం వేయించిన 1266 నాటికి Mahadeva I మనవడైన వీరభద్రా వయసు సుమారు 16 సంవత్సరాలు ఉండవచ్చుననే ఊహ తర్కదూరం కాదు.
III. రుద్రమదేవి, వీరభద్రా వివాహం అసంభవం
ఇటీవల బయటపడ్డ చందుపట్ల శాసనం ఇంకా మేడి మల్కల్ శాసనాల ద్వారా, రుద్రమ దేవి 1289 లో తన 82 వ ఏట మరణించి ఉండవచ్చని డా. ద్యావనవల్లి సత్యనారాయణ వంటి చరిత్రకారులు నిర్ధారించారు. అంటే ఈమె 1207 ప్రాంతంలో పుట్టి ఉండాలి.
1266 నాటికి వీరభద్రా కు పదహారేండ్లయితే అప్పటికి రుద్రమదేవి వయసు 60 ఏండ్లు. లభిస్తున్న శాసనాధారాలను బట్టి రుద్రమదేవికి వీరభద్రాకు వివాహం జరిగి ఉండకపోవచ్చునని నిర్ధారించవచ్చును.
రుద్రమదేవి, వీరభద్రా లు దంపతులని చెపుతున్న తణుకు, కొలనుపాక శాసనాలు గణపతిదేవుడు కాని, రుద్రమదేవి కానీ వేయించినవి కావు. ఇతర సేవకులు వేయించటం గమనార్హం. బహుసా ఈ వీరభద్రా, కాకతి వంశీయులలోని రాణిరుద్రమను కాక రుద్రమ పేరుతో ఉన్న మరొక చిన్నదానను పెండ్లి చేసుకొని ఉండవచ్చు.
***
గణపతిదేవుడు 1240 లో వేంగిని జయించాడు. బహుసా ఇదే సమయంలో ఇతను వేంగిచాళుక్య వంశానికి చెందిన వీరభద్ర తో రుద్రమదేవి వివాహాన్ని జరిపించి ఉండవచ్చునని ప్రరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయపడ్డారు. ఈ ఊహ కూడా సరైనది కాకపోవచ్చు.
JAHRS Vol 8 లో ఇవ్వబడిన Hyd Arch. Series. 17 నంబరు గల పమ్మి శాసనంలో 1236 నాటికే రుద్రమదేవి పరిపాలన చేస్తున్నట్లు చెప్పబడింది. అంటే రుద్రమదేవి 1236 నుంచే గణపతి దేవునితో కలిసి రాజ్యపాలనలో పాలుపంచుకొంటూ, తర్ఫీదు పొందుతూ ఉండేదని భావించాలి. బహుసా ఈ సమయానికి రుద్రమదేవికి వయసు పై లెక్కప్రకారం చూసుకొన్నట్లయితే 30 ఏండ్లు, 1240 నాటికి 35 ఏండ్ల వయసు ఉంటుంది. అప్పటికి వీరభద్రా ఇంకా పుట్టనేలేదు.
IV. రుద్రమ దేవి గణపతిదేవుని కూతురా లేక భార్యా?
ఈ ప్రశ్నపై చరిత్రకారుల మధ్య నాలుగైదు దశాబ్దాలపాటు వాదోపవాదాలు జరిగాయి. రుద్రమదేవి గణపతిదేవుని పుత్రిక అని చెపుతూ ఆనాటికాలానికి చెందిన అనేక శాసనాలు ఉన్నాయి. ఉదాహరణకు 1261 నాటి ప్రసిద్ధ మల్కాపుర శాసనంలో రుద్రమ దేవి గణపతి దేవుని పుత్రిక అని స్పష్టంగా రెండుసార్లు వస్తుంది.
అయినప్పటికీ అనూచానంగా, గాధలరూపంలో, జనశృతిలో రుద్రమదేవి గణపతిదేవుని భార్యగా ఎందుకు చెప్పబడింది అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. రుద్రమదేవి నిజంగా ఒకవేళ గణపతిదేవుని కూతురు అయితే భార్య అంటోనో; భార్య అయితే కూతురు అంటోనో నిర్మించబడ్డ నేరేటివ్స్ కు ఏవో సామాజిక, రాజకీయ ఉద్దేశాలు ఉండే ఉంటాయి.
ఎ. మార్కోపోలో కథనం
1293 లో ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి వద్ద ఆగిన మార్కొపొలో “ఈ రాజ్యాన్ని అప్పటికి నలభై ఏళ్ళుగా భర్తవిహీన అయిన స్త్రీ అద్భుతంగా పరిపాలిస్తున్నది” అని రాసుకొన్నాడు.
ఈ భర్తవిహీన స్త్రీ బహుసా గణపతిదేవుని కోల్పోయిన రుద్రమదేవి కావొచ్చునని కొందరు అభిప్రాయపడగా- జయంతి రామయ్యపంతులు గారు ఆమె రుద్రమదేవి సోదరి అయిన గణపాంబ కావొచ్చునని అన్నారు. కానీ గణపాంబ భర్త చనిపోగా 13 సంవత్సరాలు మాత్రమే పాలించింది అంతే కాక ఆమె పాలన 1264 లో ముగిసిపోయింది. మార్కో పోలో సమయానికి నాలుగు దశాబ్దాలు పాలించిన “భర్తవిహీన” రుద్రమదేవి ఒక్కరే కనిపిస్తుంది. కనుక పంతులుగారి అభిప్రాయాన్ని త్రోసిపుచ్చవచ్చు.
బి. ప్రతాపరుద్రీయము, సోమరాజీయము కావ్యాలు
ప్రతాపరుద్రీయం పై వ్యాఖ్యానం వ్రాసిన కుమారస్వామి రుద్రమదేవిని గణపతి దేవుని భార్యగా పేర్కొన్నాడు. అదేవిధంగా సోమదేవరాజీయం అనే గ్రంధంలో గణపతిదేవుడు యాదవరాజులను గెలిచి, ఆ రాజు కుమార్తె అయిన రుద్రమ్మను పెండ్లాడాడు అని ఉన్నది.
సి. మెకంజీ కైఫియత్తులు
ఏకశిలానగర మెకంజీ కైఫియతు. దీనికె అనుమకొండ మరియు ఓరుగల్లు కైఫియతు పేరు కలదు. దీనిలోని కొన్ని ముఖ్యాంశాలు ఇవి.
……. కాకతి రుద్రరాజు కొడుకు పేరు గణపతి రాజు. రుద్రరాజు తమ్ముడి పేరు మహదేవరాజు. ఈ మహదేవ రాజు దేవగిరి పై జరిగిన యుద్ధంలో మరణించాడు.
గణపతి రాజు తన పినతండ్రి అయిన మహదేవరాజును చంపిన దేవగిరి రాజులపై దండయాత్ర చేసినపుడు దేవగిరి రాజు గణపతిరాజుని నిభాయించలేక సంధికి ఒప్పుకొని దేవగిరి రాజు కుమార్తె అయిన “రుద్రమ దేవి” అనే కన్యకను గణపతి రాజు కు యిచ్చి వివాహంబు చేశి యిచ్చెను. కాకతి గణపతి రాజు మంత్రి పేరు శివదేవయ్య.
కాకతి గణపతికి పుట్టిన కూతురి పేరు వుంమ్మక్క. ఈమెను వీరభద్ర రాజు కి ఇచ్చి వివాహం చేసాడు. గణపతి తనమంత్రి అయిన శివదేవయ్యకు రాజ్యం అప్పగించి క్రీశ. 1257 కాలం చేసాడు.
కాకతి గణపతి రాజు గారి భార్య అయిన రుద్రమదేవి తన పెనిమిటి కాలం చేసిన పిమ్మట తానున్ను పెనిమిటితో కూడా సహగమనానికి సిద్ధపడింది. మంత్రి శివదేవయ్య ఆ రుద్రమదేవుల్కు (రుద్రమదేవికి) దుఃఖోపశమనం గావించి, రాజ్యం అరాజకం అవుతుంది అని హెచ్చరించగా రుద్రమ దేవి జ్ఞానవంతురాలై తన పెనిమిటి అయిన గణపతి రాజుకు ఉత్తర క్రియలు సాంత్తంగా చేసినది. పిమ్మట కాకతి గజపతి ఖడ్గమును, రాజముద్రికను సింహాసనమందు ఉంచి శివదేవయ్య అనుమతితో రాజ్యభారము చేయసాగెను.
రుద్రమదేవి కూతురైన ఉంమ్మక్క, వీరభద్రరాజు దంపతులకు క్రీశ 1279 లో ప్రతాపరుద్రుడు జన్మించాడు. రుద్రమదేవి మనవడైన ప్రతాపరుద్రుడిని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని అతనితో ప్రతిరోజు మూడువేల వరహాలు ప్రజలకు పంచిపెట్టించేదట.
అటు పిమ్మట ఉంమ్మక్క కు మరియొక సుతుడు జన్మించగా అతనికి అన్నమదేవుడు అనే పేరుపెట్టారు. అలా ముప్పై ఎనిమిది ఏండ్లు పాలించిన రుద్రమదేవి క్రీశ . 1294 లో ఒకనాడు ప్రతాపరుద్రుడిని శివదేవయ్య చేతులలో పెట్టి అతణ్ణి సింహాసనాసీనుం జేయవలసినది అని చివరికోర్కెగా చెప్పి మరణించెను.
***
ఉపసంహారం
*. రుద్రమదేవి ఎనభై ఏండ్లు జీవించినది సత్యమే అయితే ఆమె భర్తగా చెప్పబడుతున్న వీరభద్రా ఈమె కంటే కనీసం నలబై ఏండ్లు చిన్నవాడు కనుక వీరిద్దరి వివాహం అసంభవము. అలాగని వేరొక వ్యక్తితో వివాహమైనట్లు ఆధారాలు లభించవు.
*. మెకంజీ కైఫియత్తులనేవి క్రిందనుంచి స్థానికులు రాసుకొన్న చరిత్రలు. ఇవి పైనుంచి చక్రవర్తి లేఖకులు రాసిన చరిత్రలు కావు. ప్రధానస్రవంతి చరిత్రతో పోల్చినపుడు ఈ కైఫియత్తుల చారిత్రికత చాలా సందర్భాలలో వివాదాస్పదము. అయినప్పటికీ వీటికి సోషలాజికల్, ఆంత్రొపొలాజికల్ విలువ ఉంటుంది. కైఫియత్తులన్నీ సామాన్య ప్రజలు నిర్మించుకొన్న నేరేటివ్స్. రుద్రమదేవి గణపతిదేవుని భార్యగా జనశృతిలో ఎందుకు ప్రచారం పొందిందో, దానిలో ఏ రాజకీయ, సామాజిక ప్రయోజనాలున్నాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
*. ఒక మహా సామ్రాజ్యాన్ని లోపలనుంచి, బయటనుంచి వచ్చే దాడులనుండి కాపాడుకోవటం సామాన్యమైన విషయం కాదు. అలాంటి అనేక తిరుగుబాట్లను రుద్రమదేవి సమర్ధవంతంగా ఎదుర్కొన్న అసమాన్య వీరనారి. కాకతీయ వంశంలో రుద్రమదేవే కాక మరికొందరు రాణులు కూడా రాజ్యభారాన్ని వహించి రాజ్యసంరక్షణ గావించిన సందర్భాలు మరికొన్ని కనిపిస్తాయి.
తండ్రి చనిపోయే సమయానికి యెరుకదేవరాజు పిన్నవయస్కుడు. అతని తల్లి కొంతలదేవి పాలనా పగ్గాలు చేపట్టి 19 సంవత్సరాలు పరిపాలించి, కటకం రాజులతో జరిగిన అనేక యుద్ధాలను జయించి, రాజ్యాన్ని నిలబెట్టి తిరిగి కొడుకుకు అప్పగించింది.
రుద్రమదేవి సోదరి గణపాంబ తన భర్త బేతరాజు చనిపోగా రాజ్యాధికారం చేపట్టి 13 సంవత్సరాలు పరిపాలించింది. కొడుకు యుక్తవయస్సుకు వచ్చాక రాజ్యాన్ని అతనికి అప్పగించింది.
*. పై ఇద్దరూ రాణులు రాజ్యాలను సంరక్షించి వారసులకు అప్పగించిన భర్తవిహీనులే కావటం గమనార్హం.
బొల్లోజు బాబా
సంప్రదించిన గ్రంధాలు
1. South Indian Inscriptions Vol 10
2. Journal Of The Andhra Historical Research Society,vol.8,pt-1 To 3
3. The Historical Inscriptions of Southern India by Robert Sewell
4. South Indian Inscriptions Vol V edition 1986
5. History of Andhra Country 1000-1500 by Yashoda Devi
6. The Early History Of The Deccan Pts. 1 To 6 G. Yazdani 1960
7. కాకతీయ యుగము – ఖండవల్లి లక్ష్మి రంజనం
8. Travels Of Marco Polo by Frampton, John

No comments:

Post a Comment