Tuesday, July 14, 2020

culture of suspicion and fear


.
ఆఫీసులోకి ప్రవేశిస్తుంటే
కూర్చున్న ఒక్కొక్కరూ తమ మాస్కులను సర్దుకొన్నారు.
మిత్రుడొకరు కుర్చీ దూరంగా లాక్కొని కూర్చొని
"మా ఏరియాకూడా కంటైన్మెంట్ చేసారు తెలుసా" అన్నాడు
అతని ఫేస్ షీల్డ్ తెరపై
నా మొఖమే పొడుగ్గా సాగిపోయి కనిపిస్తోంది.
ఏది బింబం? ఏది ప్రతిబింబం?
***
ఇంటికొచ్చేటపుడు
కాసేపు ఆగి కబుర్లు చెప్పుకొనే ఓ షాపు
పద్నాలుగురోజులు దాటి నెలవుతున్నా
ఇంకాతీయలేదు.
పక్క షాపు షట్టర్ కి
"తాత్కాలికంగా మూసివేయటమైనది" బోర్డు వేలాడుతోంది.
ఏది తాత్కాలికం? ఏది శాశ్వతం?
***
పిట్టగోడకు తలాన్చి
సన్నగా పడుతోన్న వర్షాన్ని చూస్తున్నాను.
అంబులెన్స్ ఒకటి సైరన్ మోగించుకొంటూ
పక్కవీధిలో ఆగింది.
ఏడుపులు తుంపర్లు తుంపర్లుగా వినిపిస్తున్నాయి.
అంబులెన్స్ వెళిపోయింది వాన హోరు పెరిగింది
ఏది వాననీరు? ఏది కన్నీరు.
***
గొడుగు చేత ధరించిన ఓ వ్యక్తి
రెడ్ జోన్ బారికేడ్ల పైకెక్కిదూకి
వానలో పరిగెట్టుకొంటూ వెళిపోతున్నాడు ఎక్కడికో.
పిట్టగోడపై వాలిన పిచ్చుక
రెక్కల తడిని విదిలించుకొంటూంది
ఇటుకలమధ్యలోంచి ఫెర్న్ మొక్క మొలకెత్తుతోంది
ఏది భయం? ఏది అభయం?
.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment