Tuesday, July 14, 2020

తెలుగు కవిత్వరాజకీయాలు



కవిత్వం రెండు విధాలుగా వ్రాయబడుతుంది. కవి తన లోపలకు చేసే ప్రయాణంలో కనుగొనే విషయాలను వ్యక్తీకరించటం ఒక పద్దతి అయితే బయట ప్రపంచంతో తను సాగించే ప్రయాణంలోని అనుభవాలను ఆవిష్కరించే పద్దతి మరొకటి.
లో లోపలికి చేసే ప్రయాణం ద్వారా వ్రాసే కవిత్వంలో ప్రేమ, వేదన, అర్పణ, తాత్విక చింతన, మానవసంబంధాలు, జీవితానికి దొరికే నిర్వచనాలు, జీవనానుభవాల దర్శనం లాంటి ఉద్వేగాలు ఎక్కువగా ప్రతిబింబిస్తాయి. దురదృష్టవశాత్తు ఇలాంటి కవిత్వాన్ని విమర్శకులు వైయక్తిక కవిత్వమనీ, తీరిక వర్గాల కవిత్వమని తీర్మానాలు చేస్తారు.
ఇక వెలుపలి ప్రపంచంలోకి చేసే ప్రయాణం ద్వారా సృజించే కవిత్వం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రకృతి సౌందర్యము, పిల్లలు, నాస్టాల్జియా లాంటి అంశాలకు వివశత్వంతో, ప్రేమ నిండిన ఉద్వేగాలతో అల్లిన కవిత్వం. ఈ రకపు కవిత్వాన్ని చెట్టు, పుట్టా కవిత్వమనీ, కడుపునిండిన వ్యవహారమని విమర్శకులు లెక్కలోకి తీసుకోరు.
సమాజంలో ఉండే అసమానతలు, రాజకీయాలపట్ల ఆగ్రహంతో, సహానుభూతితో, ఈ సమాజం మెరుగుపడాలి అనే ఆశయంతో వ్రాసే కవిత్వం మరొకరకం. కొంతమంది తెలుగు విమర్శకుల దృష్టిలో సామాజిక స్పృహకలిగిన కవిత్వమే ఉత్తమ కవిత్వం. మిగిలినదంతా ప్రగతినిరోధక, దోపిడీవర్గాలకు దోహదపడే కవిత్వంగా పరిగణించి జారీచేసిన ఫత్వాలు ఇప్పటికీ చలామణీలో ఉన్నాయి.
మరికొంత విమర్శకులు కొంచెం రిఫైన్డ్ గా సమాజాన్ని ప్రతిబింబిస్తూ, ఘర్షణ కలిగి ఉన్నకవిత్వమే ఉత్తమ స్థాయి కవిత్వమనీ మిగిలినదంతా సెకండ్ గ్రేడ్ కవిత్వమనీ తీర్మానాలు చేస్తారు. ఘర్షణ లేని రచనా రూపం ఉండదు. కవిత్వమే కానక్కరలేదు అది కథకావొచ్చు, వ్యాసం కావొచ్చు ఘర్షణ ఉన్నప్పుడే ఉద్వేగాలు పలుకుతాయి, చదువరిని ఆలోచింపచేస్తాయి. పైన చెప్పిన హృదయసంబంధ కవిత్వంలో కూడా అంతర్ బహిర్ సంఘర్షణ ఉంటుంది. అది ఏ తూనికరాళ్ల ఆధారంగా సెకండ్ గ్రేడ్ కవిత్వమయ్యిందో మాత్రం చెప్పలేరు.
***
మానవుడు మౌలికంగా అన్వేషకుడు, ఆరాధకుడు. తన జీవితపరమార్థం ఏమిటనేదాన్ని నిత్యం అన్వేషణ చేస్తూంటాడు, తన అనుభవాల సారం వడబోస్తాడు, తన చుట్టూ ఉన్న ప్రకృతిని, సన్నిహితులను ఆరాధిస్తాడు. ఇవి అతని ప్రధాన వ్యాపకాలై ఉంటాయి. ఆ తరువాత అతను సమాజం గురించి ఆలోచించటం మొదలు పెడతాడు. మొదటి రెండు క్రియలలో అతను నిత్యం అనేక అంతర్ధర్శనాలను పొందుతూంటాడు. వాటిని కవిత్వంలోకి తీసుకొస్తాడు. అదే మిమాంసలో ఉండే ఇతరులు అలాంటి కవిత్వాన్ని చదివినపుడు గొప్ప అనుభూతిని, ఆనందాన్ని, ఉపదేశాన్ని పొందుతారు. కవిత్వానికి ప్రయోజనం ఆనందోపదేశాలన్నది ఇందుకే. దీన్ని విమర్శకులు చవకరకం కవిత్వంగా జమకట్టటం దుర్మార్గమైన కుట్ర.
***
ఆధునిక కాలం ప్రజాస్వామ్యయుగం. పేద, ధనిక బేధాలు, శ్రామిక వర్గాల దోపిడి చర్చనీయాంశాలుగా మారాయి. వీటిని ప్రధానంగా చర్చించే సాహిత్యం ఇరవయ్యో శతాబ్దంలో ఇబ్బడిముబ్బడిగా వచ్చింది. సిద్ధాంతాలు, సూత్రీకరణలు జరిగాయి. ఈ దోపిడీని అరికట్టటం, అసమానతలను తొలగించటం, సాటిమానవుల పట్ల సహానుభూతిని ప్రదర్శించటం ప్రధాన ఇతివృత్తాలుగా మారాయి. మానవజాతికి ఇవే ప్రధాన ప్రయారిటీ అంశాలయ్యాయి. ఈ కారణంగానే సామాజిక స్పృహ గురించిన కవిత్వాన్ని ఉత్తమమైన కవిత్వంగా భావించటం జరిగింది. అలాంటి రాజకీయ కవిత్వం ముందు అందమైన సీతాకోక చిలుక మెత్తగా గాలిలో ఎగరటాన్ని వర్ణించే కవితో లేదా సహచరుని సమక్షంలో తనకు కలిగిన అద్భుతమైన అనుభవాన్ని వర్ణించే కవితో ఉత్త నాన్సెన్స్ గా తోచాయి చాలామందికి.
ఇరవయ్యో శతాబ్దం ముగిసేసమయానికి, మనిషిని సంఘంలో ఒక యంత్రంలా పరిగణించటం "మానవ స్వేచ్ఛ" కి విఘాతమని జనబాహుళ్యం భావించటం వల్ల ఈ రోజు క్రమక్రమంగా ఆ సిద్ధాంతాలు కనుమరుగవుతున్నాయి. నేటికీ ఇంకా అవే పడికట్టు పదాలను పట్టుకొని వేలాడటం అర్ధరహితం.
***
మానవ సమాజం సమాజ శ్రేయస్సును పర్యవేక్షించటానికని వివిధ వ్యవస్థలను ఏర్పరచుకొన్నది. అవే మనం ఎన్నుకొనే ప్రభుత్వం, అది తప్పుచేసినప్పుడు ప్రశ్నించటానికి ప్రతిపక్షం, ప్రజలను-ప్రభుత్వాన్ని సమన్వయ పరిచే చట్ట వ్యవస్థ, పోలీసు వ్యవస్థలు. ఒక వ్యక్తికి అన్యాయం జరిగినపుడు సంబధిత వ్యవస్థలను సంప్రదించి పరిష్కరించుకోవటం అనేది సరైన మార్గమని అందరూ అంగీకరించే విషయం. ఎందుకంటే ఈ వ్యవస్థలను అన్నింటినీ మనమే రూపొందించుకొని మనమే నడుపుకొంటున్నాం కనుక. అందుకనే తను చేయాల్సిన పనులు మరొకరు చేయటాన్ని సహించని రాజ్యం ఎన్ కౌంటర్లుచేసి, జైల్లో పెట్టీ తన చర్యలను సమర్ధించుకొంటుంది.
అమలులో ఉన్న ఈ మొత్తం వ్యవస్థను కాదని సమస్యను ఉత్త కవిత్వీకరించటమో, సమస్య పరిష్కారానికి తుపాకులు పట్టుకోవాలనటమో, లేక జీపుక్రింద మందుపాతరలు పెట్టటమో ఏమేరకు పరిష్కారానికి దోహదపడతాయనేది ఆలోచించాల్సిన విషయం.
చిన్న ఉదాహరణ. ఈ రోజు కరోనా వలస కార్మికులు మైళ్లకొలదీ నడుచుకురావటం పట్ల పుంఖానుపుంఖాలుగా కవిత్వం వచ్చింది. చాలామంది ఆహా ఓహో అంటూ మెచ్చుకొన్నారు. ఎంతమంది కవులు అలాంటి బాధితులకు తమ ఇండ్లలో ఆశ్రయమిచ్చి ఉంటారు అనేది సందర్బోచిత ప్రశ్నే. ఈ రోజు అలాంటి వారికి ఆశ్రయం ఇస్తున్నది, పోషిస్తున్నది మనం ఏర్పరుచుకొన్న పటిష్టమైన వ్యవస్థలోని అంగాలైన అధికారులు, స్థానిక నాయకులు ఇంకా మనలోని వితరణశీలులు. ఈ సామాజిక స్పృహ కవిత్వం రాసిన కవులెక్కడా కనిపించలేదు. అంటే రాసేదంతా కపట సహానుభూతి అని భావించొచ్చా? ఇది హిపోక్రిసి క్రిందకు రాదా? ఈ సందర్భంలో తాగిపడేసిన సీసాలు కాదు రాసిపడేసిన కవిత్వాన్ని చూడండి అన్న ఒకనాటి కామెంటు లోతుగా చూస్తే ఉపరితల వ్యాఖ్యగానే మిగిలిపోతుంది.
రాజకీయకవిత్వంలో నిజాయితీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మొదటి రెండురకాల (వైయక్తిక, ప్రకృతి) కవిత్వాలలో నిజాయితీ ఉంటుంది. చింతనాశీలత ఉంటుంది. మానవజీవితాన్ని ఉద్దీపింపచేసే ఆనందోపదేశాలు ఉంటాయి.
***
కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండితీరాలన్న కొన్ని రంగుటద్దాలు పెట్టుకొని కవిత్వ విమర్శ చేయటం వల్ల రాజకీయేతర కవిత్వాన్ని కడుపునిండిన కవిత్వమనీ, శృంగారము తిండియావా తప్ప ఎలాంటి సాహిత్య విలువా లేదని, ఈ సాహిత్యమంతా తీరికవర్గాల కూనిరాగాలగా తేల్చేసారు విమర్శకులు.
కవిత్వంపై జరిగిన ఈ రంగుటద్దాల దాడిని "సాహిత్యం జీవితాన్ని ప్రతిబింబించాలనీ, రాజకీయాలు జీవితంలో ఒక భాగమనీ" అంటూ శేషేంద్ర శర్మ;
"సిద్ధాంతాలను కవిత్వంలో చొప్పించటం అంటే తిరగళ్ళు కట్టుకొని నడవటం లాంటిదని" ఇస్మాయిల్;
"రాజకీయేతరమైన మరే అనుభవం కవిత్వంగా ప్రతిపాదించడమే నేరంగా చెలామణీ చేయటం ఒక దుర్మార్గం" అని ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
కవిత్వానికి కవిత్వమే ప్రమాణమని మరికొందరూ ఎదుర్కొన్నారు. కాని వారి వాదన, వేదనా సామాజిక స్పృహమాత్రమే కవిత్వం అని ఢంకా భజాయించి చెప్పే డమడమ శబ్దాలలో వినిపించకుండా పోయాయి.
ఈ రకపు విమర్శనా చట్రం వలన తెలుగు నాట ప్రకృతి, భక్తి, మానవసంబంధాలు, తాత్వికత, ప్రేమ, జీవనానుభూతులు, నాస్టాల్జియా లాంటి అనేక కవిత్వ పాయలు దాదాపు ఎండిపోయాయి. ఎందుకంటే అలాంటి కవిత్వాన్ని తెలుగువిమర్శకులు ద్వితీయశ్రేణి కవిత్వంగా ముద్రలు వేస్తున్నారు నేటికీ కూడా.
***
ఈ ధోరణి వల్ల మా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కృష్ణశాస్త్రికి, ఇస్మాయిల్ కి, ఇంద్రగంటికి, గోదావరి శర్మకు, మధునాపంతుల కు దక్కాల్సిన స్థానాలు దక్కలేదు. సోమసుందర్ కి, అద్దేపల్లికి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డులు రాకపోవటం కూడా కేంద్రీకృతమైన ఆనాటి రంగుటద్దాల సాహిత్యపీఠాధిపతుల వివక్షే కారణం. ఎందుకంటే వీరు కవిత్వానికి కవిత్వమే ప్రమాణమని వ్యాసంగం సాగించారు. వీరందరూ ప్రజల నాల్కలపై ఉండవచ్చు గాక. అవార్డులు కొలమానం కాకపోవచ్చు గాక, కానీ అవి అర్హులైనవారికి దక్కకపోవటం అన్యాయం అనే అనాలి.
ఇతర భారతీయ భాషలలో కానీ అంతర్జాతీయంగా కానీ అన్నిరకాల కవిత్వమూ విరివిగా వస్తున్నది. మరీముఖ్యంగా జీవనానుభవాల కవిత్వం. కవిత్వం ఒకటే ప్రామాణికం గా ఉంటోంది ప్రతీ చోటా, మన తెలుగునేలపై ఉన్నట్లు రంగుటద్దాలు లేవు.
కవిత్వంలో కవి తనదైన అనుభవాన్ని చెప్పాలి. ఎంగిలి సంఘటనలు కవిత్వానికి శోభనివ్వవు. ఇటీవల కరోనా సందర్భంగా రీపోస్ట్ చేసిన ఒక కవిత చూడండి. ఒక వైయక్తిక అనుభవాన్ని తాత్వికముక్తాయింపులోకి మార్చిన వైనం కనిపిస్తుంది.
What Issa Heard ---- by David Budbill
Two hundred years ago Issa heard the morning birds
singing sutras to this suffering world.
I heard them too, this morning, which must mean,
since we will always have a suffering world,
we must also always have a song.
***
సమాజంలో ఉన్న దోపిడి, దాని రూపాలను అర్ధం చేసుకోవటంలో ఇరవయ్యో శతాబ్దం గడచిపోయింది. ఇపుడు అధికారము అది సమాజంలో కలిగించే ప్రభావాలను అర్ధం చేసుకోవాల్సి ఉంది.
తొంభైలనుండీ మన జీవితాలలో అనూహ్య మార్పులు చోటుచేసుకొన్నాయి. సరళీకరణ ఆర్ధికవిధానాల తరువాత దోపిడీ దాని రూపం మార్చుకొంది. ప్రత్యక్ష దోపిడీకి బదులు పరోక్షదోపిడీ రాజ్యం ఏలుతుంది. ఒకప్పుడు పద్దెనిమిది గంటల పనిచేసే పరిస్థితులనుండి ఎనిమిది గంటల పనికాలాన్ని సాధించుకోవటం కొరకు కొన్ని వందల ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. ఈ రోజు ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగో, లేక ఏదో షాపులో పనిచేసే వర్కరో రోజుకు పద్నాలుగు గంటలు పనిచేయటానికి ఐచ్చికంగానే ముందుకు వస్తున్నాడు.
ఈ నేపథ్యంలో మానవజీవితం సంక్లిష్టభరితమైపోయింది. సంస్కృతి అనేది కేంద్రీకృత నిర్వహణతో పరిశ్రమ స్థాయిలో పెరిగిపోయింది. ఇలాంటి సమయంలోనే వ్యక్తి జీవితాన్ని, అతని జీవితానుభవాలలో ఉండే సంక్లిష్టతనూ, సుఖ,దుఃఖాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడుకూడా రాజకీయేతరమైన కవిత్వాన్ని రాయటం అనాగరికమని తీర్మానాలు చేయటం బాధ్యతా రాహిత్యమే కాదు సాహిత్య ద్రోహం కూడా.
కవి జీవితంలో రాజకీయాలు, సామాజిక స్పృహా ఒక భాగమే తప్ప అవే సర్వస్వం కావు. జీవనానుభవాలను ఆవిష్కరించే ఏ కవిత్వమైనా ఉత్తమమైనదే. అంతే తప్ప రాజకీయాలు కలిగి ఉన్నది మాత్రమే ఉత్తమ కవిత్వం అనటం సహేతుకం కాదు. కవిత్వం అనేది ఆల్ ఇంక్లూజివ్ గా ఉండాలి.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment