James Rennel అనే కార్టోగ్రాఫర్ 1783 లో హిందుస్తాన్ మేప్ ని రూపొందించాడు. అప్పటికి హిందుస్తాన్ (నేటి భారతదేశం) దాదాపు ఈస్ట్ ఇండియా కంపనీ వారి చేతుల్లోకి వచ్చేసింది. వారు వర్తకులనుండి పాలకులగా మారుతున్న దశ అది.
మేప్ కు కుడిపక్క ఉన్న చిత్రం చారిత్రాత్మకమైనది. ఆ చిత్రానికి రెన్నెల్ ఇలా అర్ధం చెప్పాడు
"భారతీయ పండితుల వద్దనుంచి వారి పవిత్ర గ్రంధాలను బ్రిటానియ స్వీకరిస్తున్న దృశ్యం"
.
వివరణ
ప్రాచీన బ్రిటన్ కు మూర్తిమత్వాన్ని కల్పించి Brittannia అనే పేరుకల ఒక దేవతగా పిలుచుకొనేవారు. హిందుస్తాన్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నాక ఇక్కడి పవిత్రగ్రంధాలను బ్రిటానియా దేవత స్వీకరిస్తున్నట్లు చెప్పటాన్ని - మీ జ్ఞానాన్ని మేము స్వీకరించి దాన్ని రక్షిస్తాము అని సింబాలిక్ గా చెపుతున్నట్లు చరిత్రకారులు అర్ధం చెప్పారు.
అలా చరిత్రకారులు భావించటానికి ఆధారాలు
1. కంపనీ వారు అప్పటికే భారతదేశ రచనలను సేకరించి ఆర్చైవ్ చేసే ప్రొజెక్ట్ ఒకటి చేపట్టారు.
2. హేస్టింగ్స్ పూనుకొని అప్పటికి వందలసంవత్సరాలుగా అమలులో ఉన్న హిందూ, పర్షియన్ చట్టాలను అనువదింపచేసి 1776 లో కంపనీ డబ్బులతో “A Code of Gentoo Laws” పేరుతో ప్రచురించాడు.
3. Asiatic Society of Bengal (1784) పేరుతో ఔత్సాహిక కంపనీ ఉద్యోగులు Sir William Jones ఆధ్వర్యంలో ఒక సంస్థను స్థాపించుకొని భారతీయ వ్రాతప్రతులను సేకరించటం వాటిని పరిశోధించటం చేయటం మొదలుపెట్టారు.
4. 1785 లో చార్లెస్ విల్కిన్స్ భగవద్గీతను సంస్కృతంనుంచి ఇంగ్లీషులోకి అనువదించాడు. సంస్కృతంలోంచి ఇంగ్లీషులోకి అనువదింపబడిన మొదటి పుస్తకం ఇది.
5. ఆ తదుపరి కాలంలో మెకంజీ సుమారు లక్ష పేజీల వ్రాతప్రతులను సేకరించాడు. ఇవన్నీ నేటికీ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. (మనవద్ద చాలా కాపీలు చెదలు తినేసాయి)
***
బ్రిటిష్ లైబ్రేరీలో అనేకవేల ఆనాటి తెలుగు పుస్తకాలు నేటికీ పదిలంగా ఉన్నాయి. ఆరుద్ర చాలా సమాచారం అక్కడనుంచి సేకరించాడు. ఆ తరువాత ఎవరూ ఆ ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. డా. ఎన్. గోపి ఫ్రాన్స్ నుంచి ఇక్కడ లభించని కొన్ని వేమన పద్యాలు తెచ్చారు.
మద్రాసు ప్రాచ్యలిఖితభండాగారంలో బ్రౌన్ సేకరణలను (ఇవి బ్రౌన్ తిరగరాయించిన మెకంజీ సేకరణలు కావొచ్చు) ఎవరూ పట్టించుకోవటం లేదని బంగోరె నెత్తీనోరుబాదుకొని చెప్పాడు.
బ్రిటిష్ లైబ్రేరీలో ఉన్న ఇండియన్ ఆఫీస్ రికార్డ్స్ నుంచి, మెకంజీ సేకరణల నుంచి గ్రహించిన సమాచారంతో Jennifer Howes, Philip Wagnoner, Rama Sundari Mantena లాంటి యురోపియన్ చరిత్రపరిశోధకులు పుస్తకాల మీద పుస్తకాలు రాస్తున్నారు.
.
మనకు చరిత్ర అంటే కులం మతం తప్ప మరింకేం కనిపించదు.
.
ఇక పై చిత్రంలో గమనిస్తే సుమారు రెండువందల యాభైఏండ్ల క్రితం నాటి పండితుల వేషధారణ గమనించవచ్చు. బ్రిటానియాదేవత వెనుక గ్లోబుతో ఆడుకొంటున్న సింహం, ఎత్తైన ఉన్నతస్థానం కనిపిస్తుంది. ఆ వెనుక ఏదో దేవాలయం. మరో పక్క పెద్ద ఓడ. క్రింద నేలపై విల్లంబులు.
ఒరలో కత్తితో సైనికుడు.ఆ పక్క దుబాసి కావొచ్చు.
అప్పటికే తుపాకులు వచ్చాయి అవి చిత్రంలో మిస్ అయ్యాయి.
మరొక ఆసక్తి కలిగించే అంశం చిత్రంలో వ్యక్తి తలను క్రిందకు ఉంచి, పవిత్రగ్రంధాలను పైచేయిస్థానంతో కాక, క్రింద ఉంచి ఇస్తున్నాడు. ఇది బహుసా అప్పట్లో రాజుల ఎదుట ప్రదర్శించే రీతి కావొచ్చు.
బొల్లోజు బాబా
No comments:
Post a Comment