Tuesday, July 14, 2020

సప్తశతి గాథలలో సామాజిక వ్యవస్థ – పార్ట్ 9


.
(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు)
.
గ్రామీణ వ్యవస్థ
ఓ వటరాజమా!
నీ దట్టమైన ఊడలమధ్య చీకటిని బంధించి ఉంచావు
ఊరి కావలిదారుడు ఎంత కఠినాత్ముడైనా
రసికులకు దిగులే లేదు. (656)
.
ఊరి మధ్యలో ఊడలతో విస్తరించి ఉండే మర్రిచెట్టు ప్రేమికులకు చక్కని సంకేత స్థలంగా ఉండేది. పై గాథ ద్వారా ఊరిని కాపలా కాసే కావలిదారుడు ఒకడు ఉండేవాడని తెలుస్తుంది.
ఈ గాథను రెండు విధాలుగా అర్ధం చేసుకొనవచ్చును. ఆ కావలి బహుసా స్వైరణిల వద్దనుండి పన్నులు వసూలు చేసే అధికారి కావొచ్చు ఎందుకంటే వ్యభిచారం అనేది క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచీ రాజ్యానికి ఒక ఆదాయమార్గంగా ఉండేది లేదా విచ్చలవిడి శృంగారాన్ని నిరోధించటానికి ఆనాటి సమాజం ఏవో కొన్ని కట్టుబాట్లను ఏర్పరచి వాటిని అమలుచేయటానికి ఏర్పాటు చేసిన కావలి అధికారి కూడా కావొచ్చు.
ఏది ఏమైనప్పటికీ ఆనాటి గ్రామాలను కావలి కాసే మనుషులుండేవారని పై గాథ తెలియచేస్తుంది.
***
.
ప్రభుత్వం తరపున శిక్షలను అమలుపరిచే తలారి ప్రస్తావన కొన్ని గాథలలో కనిపిస్తుంది. అప్పట్లో శిక్ష విధింపబడినవారిని డప్పులు వాయించుకొంటూ తీసుకువెళ్ళి ఉరితీయటమో లేక కొర్రువేయటమో చేసేవారు.
.
అతనితో సుఖించిన క్షణాలు గుర్తుకొచ్చి
నేడు ఈ వానాకాలపు తొలిమబ్బులు చేసే ఉరుములు
ఉరితీయడానికి ముందు మ్రోగించే
డప్పుల మోతలాగ అనిపిస్తున్నాయి (29)
.
పై గాథలో ఒక ప్రోషితపతిక దూరదేశమేగిన భర్తకొరకు ఎదురుచూస్తోంది. భర్త ఇంకా రాలేదు... వానాకాలం సమీపిస్తోంది. వానాకాలం వస్తే వాగులు వంకలు పొంగి రహదారులు మూసుకుపోయి మూడునాలుగు నెలలపాటు ఎక్కడివారు అక్కడే నిలిచిపోవలసి ఉంటుంది.
తొలిమబ్బులు చేసే ఉరుములు ఆ యువతికి చావుశబ్దాలుగా వినిపించటం వియోగంలోని విషాదానికి అద్భుత వ్యక్తీకరణ.
***
.
వానకు తడిచి కంచెపై కూర్చున్న కాకులు
మురికి ముఖాలతో, సత్తువకోల్పోయిన రెక్కలతో
వేలాడేసిన మెడలతో
కొర్రు వేసినట్టు కనిపిస్తున్నాయి (564)
.
రోజుల తరబడి కురిసే వానాకాలం పక్షులకు గడ్డుకాలం. పై గాథలో ఇంటినీడన ఉంటూ కంచెపై వాలిన కాకుల స్థితిని వర్ణిస్తున్నాడీ గాథాకారుడు.
ఈ గాథలో ఆసక్తికలిగించే ఒక చారిత్రిక సంగతి కొర్రు/కొరత వేయటం. నేరస్థులను ఇనుప మొన కలిగిన ఒక కర్రదూలంపై బంధించి కూర్చోపెట్టగా, దేహం బరువుకి అతను నెమ్మదినెమ్మదిగా క్రిందకి దిగుతూంటే, ఆ దూలం అతని పేగుల్ని చీల్చుకొని చాతీ నుంచో మెడ దగ్గరనుంచో వెలుపలకి వస్తుంది. అప్పటికింకా ఆ నేరస్థుడు పై గాథలో చెప్పినట్లు సత్తువుకోల్పోయిన చేతులతో, వేలాడేసిన మెడతో బ్రతికే ఉండొచ్చు కూడా. అలా కొర్రువేసిన వ్యక్తిని ఆ దూలంనుంచి దింపినవాళ్ళకి కూడా కొర్రుదండనం వేయమని చాణుక్యుని అర్ధశాస్త్రం చెపుతుంది.
బహుశా ఈ గాథాకారుడు కొర్రు వేసిన దృశ్యాన్నేదో చూసేఉంటాడు. ఒక భయానక బౌతిక దృశ్యాన్ని మరో ప్రకృతి దృశ్యానికి జతచేసిన కల్పన ఈ గాథలో కనిపిస్తుంది.
***
గ్రామానికి సంబంధించిన మరో ఉన్నత శ్రేణి వ్యక్తి వైద్యుడు. వైద్యుని ప్రస్తావన కొన్ని గాథలలో కనిపిస్తుంది.
.
తేలు కుట్టిందనే వంకతో
భర్త కళ్ళముందే ఆమెను
తెలివైన చెలులు ఎత్తుకొని తీసుకువెళ్ళి
వైద్యుడైన ప్రియుని ఇంటికి చేర్చారు. (237)
.
పై గాథలో శృంగారేచ్ఛకన్నా మానవసంబంధాలలోని 'గ్రే షేడ్స్ ' చిత్రణ ప్రతిభావంతంగా కనిపిస్తుంది. ఇలాంటి గాథలే తరువాతి కాలంలో స్త్రీల చుట్టూ ఆంక్షలు బిగుసుకు పోవటానికి దోహదపడి ఉంటాయి. (ఇంకా ఉంది)
బొల్లోజు బాబా

No comments:

Post a Comment