(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. )
సప్తశతీ గాథలు వ్రాయబడిన కాలంలో రాజ్యం అనేక రాష్ట్రాలు/ఆహార లుగా విభజింపబడి పాలన జరిగేది. ప్రతి రాష్ట్రానికి కొన్ని నిగమాలు (నగరాలు) వాటికి అనుబంధంగా అనేక గ్రామాలు ఉండేవి. ఈ రాష్ట్రాలను మహారధి, మహాభోజ పేర్లు కల సామంతులు పాలించేవారు. ఉత్పత్తిలో ఆరోభాగం రాజుకు కప్పంగా చెల్లించాలి. ఈ నిగమాలు, గ్రామాలలో అమాత్య పేరుగల అధికారులు ఉంటూ పర్యవేక్షణ చేసేవారు. గ్రామాలు, నిగమాలు అత్యంత క్రిందిస్థాయి పరిపాలనా విభాగాలు కనుక చాలామేరకు స్వతంత్రతను కలిగి ఉండేవి.
ఆర్యుల రాకతో నగరాలు అభివృద్ది చెందాయి. వ్యాపారాల విస్తరణ జరిగింది. అడవులను నరికి భూములను వ్యవసాయానికి అనుగుణంగా మార్చటంతో కొత్త కొత్త గ్రామాలు వృద్దినొందాయి. వ్యాపారాల నిమిత్తం ప్రజలు నిత్యం సంచరిస్తూ ఉండేవారు. అలా సంచరించే బాటసారుల, దేశాంతరాలు వెళ్ళే భర్తల గాథలు అనేకం కనిపిస్తాయి. గ్రామాలు ఇచ్చే సంపదతో నగరాలు బలపడి వ్యాపారాలను విస్తరించుకొన్నాయి. వివిధ వృత్తికారులు నైపుణ్యాలు పెంపొందించుకొని ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారుచేసారు. వాటిని వ్యాపారులు విదేశాలకు ఎగుమతి చేసేవారు.
***
సప్తశతి గాథలు ఆనాటి గ్రామీణ ప్రజల సాంఘిక జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. వ్యవసాయం ప్రధానవృత్తి. దీని ప్రస్తావన సుమారు ముప్పై గాథలలో ఉంది.
1. వ్యవసాయం
వరి, పత్తి, బార్లీ పంటలసాగు ఎక్కువగా జరిగేది. పంట కోసేవరకు రైతు దాన్ని సాకుతూ ఉండాలి. నీరుపెట్టటం, పక్షులను అదిలించటం, అడవి జంతువులనుండి పంటను కాపాడుకోవటం చెయ్యాలి. ఇంతచేస్తేకానీ పంట చేతికిరాదు. అతని భార్య ఈ పనులలో సహాయం చేసేది. తొలకరిలో నేలను మొదటిసారిగా దున్నుతున్నప్పుడు రైతు భార్య నాగలికి, బొట్లు పెట్టి పూజచేసినట్లు ఒక గాథలో ఉంది. ఇది నేటికీ నిలిచిఉన్న ఒక ఆచారం. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు. ఇంటిలో దొరకని ఏకాంతమేదో ఆనాటి రైతులకు పంటచేలవద్ద దొరికేదేమో! పొలంవద్ద జరిగే శృంగారవిషయాలు అనేక గాథలలో కనిపిస్తాయి.
***
ఇదే చోట్లో కొన్నాళ్ళలో ఆమెతో జరపబోయే శృంగారాన్ని
ఊహించుకొంటూ విత్తనాలు జల్లుతున్నాడా రైతు
చెమర్చిన చేతులకు అతుక్కున్న విత్తనాలు
జారిపడటం లేదు పాపం [358]
పై గాథలో ఒక రైతు విత్తనాలు జల్లే నాడే, మునుముందు తాను పొందబోయే ఆనందాల్ని తలచుకొని ఉద్రేకపడుతున్నాడు. చేతులు చెమర్చటం అనే క్రియ అనేక గాథలలో శృంగార ఉద్దీపనను సూచించేందుకు వాడబడింది. మరోగాథలో మధ్యాహ్నం భోజనం తీసుకొస్తున్న భార్యను చూడగానే, కంగారులో ఓ కొత్తరైతు ఎద్దుకి పలుపుతాడు బదులు ముక్కుతాడు విప్పేసినట్లు చెప్పబడింది. ఇలాంటి గాథలు ఉత్త చమత్కారమే కావొచ్చు కానీ వాటిలో రెండువేలేండ్లనాటి సమాజం, ఆనాటి ప్రజల రోజువారి జీవనము కనిపిస్తాయి.
***
పంటబోదిలో పాదాలను ఉంచి
నీటిని మళ్ళిస్తోంది కాపు వనిత.
నిశ్చలంగా ఉన్న ఆమె పాదాల చుట్టూ తుమ్మెదలు
తిరుగాడుతున్నాయి. (692)
ఇదొక అందమైన దృశ్యం. కొన్ని అత్యవసర సందర్భాలలో చేలో నీరు బయటకు పోకుండానో లేక లోపలకు రాకుండానో కాసేపు అడ్డుగా నిల్చుని నిలువరిస్తారు రైతులు. భర్త బోది మరమ్మత్తు చేస్తుండగా భార్య బోదిలో నిలబడి నీటిని మళ్ళిస్తున్న దృశ్యాన్ని ఊహించుకోవచ్చు పై గాథలో. ఆనాటి సమాజంలో సంపదఉత్పత్తిలో స్త్రీపురుషులు కలిసి పనిచేసారని అనుకోవచ్చుకూడా.
ఆమె పాదాలు కలువల వలె ఉన్నాయని ఎంతో రమ్యంగా, ధ్వన్యాత్మకంగా చెబుతుందీ గాథ.
***
వింద్యపర్వతాల అడవి వరిమొక్కలని విడిచిపెట్టి
గుప్పెడు కంకుల కొరకు వరిచేనులో పడే ఏనుగు
ఏనాటికైనా మందకు నాయకత్వం వహించగలదా? (788)
రైతులు తమ పంటలను అడవి జంతువులనుండి కాపాడుకోవటం నాటినుంచి నేటివరకూ జరుగుతున్నదే. నిజానికి నేడు చూస్తున్నంత వన్యప్రాణి ఆవాసాల ధ్వంసం ఆనాడు ఉండకపోవచ్చు. వింధ్య అడవిలో గ్రాసం పుష్కలంగా లభిస్తుండగా వరిచేలో కక్కుర్తి పడే ఖర్మ ఎందుకూ? అని ఈ గాథాకారుడు ఆశ్చర్యం ప్రకటిస్తున్నాడు. అల్పవిషయాలకు ప్రలోభపడితే అర్హమైన విషయాలకు దూరమౌతామనే సూచన పై గాథలో కనిపిస్తుంది.
***
నేను పొలం వెళ్ళను
చిలుకలు పంట తినేస్తే తినేయనీ
అక్కడ ఉంటే
దారిన పోయే ప్రతీ బాటసారీ
ఈ దారెటు పోతుందని అడుగుతున్నారు
వారికి తెలిసినప్పటికీ. [821]
ఒక చిన్నది ఇంట్లో అమ్మతో చెప్పుకొంటున్న ఒక పిర్యాదు కాబోలు ఇది. పంటపోతే పోనే అనటం అమాయకత్వం అనుకోవచ్చు, కానీ ఒక మగవాడు ఎందుకు మాటలు కలపాలనుకొంటున్నాడో అర్ధంకాకపోవటం స్వచ్ఛమైన ముగ్దత్వం.
అమ్మాయిలతో మాటలు కలపి మెల్లమెల్లగా ముగ్గులోకి దింపాలని యత్నించే వ్యక్తులుండటం ఒక పురాతన సలపరింత ఈ సమాజానికి.
***
ప్రియమైన భార్యగతించాకా
ఆమె లేక పాడుపడిన ఇంటికి వెళ్ళాలనిపించక
పనేం లేకపోయినా పొలం వద్దే ఉంటున్నాడా రైతు. (169)
ఇల్లాలు లేక ఇల్లుపాడుపడిందనటం ఒక ఉదాత్తమైన భావన. ఫలవంతంగా నడచిన అన్యోన్య దాంపత్యానికి సంకేతమది.
అప్పట్లో బహుభార్యత్వం ఉన్నట్లు అనేక గాథలలో చెప్పబడింది. బహుసా అది కులీనవర్గాలకు పరిమితమై ఉండొచ్చు. పై గాథలో ఆ రైతు ఇంటికి వెళ్ళలేకపోవటానికి చెపుతున్న కారణం ఒక నిర్మలమైన మానవోద్వేగం. కలయిక, వియోగం అనేవి ప్రేమ అనే నాణానికి రెండు పార్శ్వాలు. (ఇంకా ఉంది)
బొల్లోజు బాబా
No comments:
Post a Comment