1. చరిత్ర
గోళకి మఠము శైవమతానికి చెందిన ఒక ధార్మిక మఠము. దీని ప్రధాన కేంద్రం నర్మదా, గంగా నదుల మధ్యకల త్రిపురి అనే పట్టణంలో ఉండేది. ఇది ప్రస్తుత జబల్ పూర్ సమీపంలోని తివూరు పట్టణం.
పదో శతాబ్దం లో "సద్బవ శంభు" గోళక మ ఠానికి ప్రధాన గురువు. కాలచూరి రాజైన యువరాజదేవుడు ఈ మఠానికి మూడు లక్షల గ్రామాలు దానం ఇచ్చాడు. (మధ్యభారత దేశాన్ని పాలించిన ఒక రాజవంశం పేరు కాలచూరి).
సద్బవ శంభు తరువాత వచ్చిన "సోమ శంభు" అనే గురువు "సోమ శంభు పద్దతి" పేరుతో గోళకీ మఠాల నిర్వహణ విధానాలను, సంప్రదాయ పద్దతులను రచించాడు.
సోమ శంభు తరువాత మఠగురువుగా వచ్చిన "వామ శంభు" కాలచూరి రాజులకు (క్రీశ 1052 ) రాజ గురువుగా ఉన్నాడు.
ఈ మఠానికి చెందిన తదనంతర పీఠాధిపతులలో "విశ్వేశ్వర దేవ" ప్రముఖుడు. ఇతను కాకతీయ రాజైన గణపతి దేవునికి దీక్షా గురువుగా ఉండేవాడు. ఇతని ప్రస్తావన ప్రసిద్ధ మల్కాపుర శాసనంలో ప్రముఖంగా ఉంది. ఇతనికి గల వివిధ బిరుదులు - గోళకి వంశ క్రితాభిషేక, మహిసుర, నైష్టిక దేశికేంద్ర, శైవాచార్య మొదలగునవి.
గోళకి మఠాలు గౌడదేశం (బెంగాలు) లో పదవశతాబ్దానికి ముందే విస్తరించి ఉన్నాయని వేటూరి ప్రభాకరశాస్త్రి బసవపురాణానికి వ్రాసిన ముందుమాటలో అన్నారు.
***
దక్షిణభారతదేశంలో శైవమతం ప్రాచీనకాలంనుండీ చిలవలు పలవలుగా విస్తరించి ఉంది. పురాతన పశుపతినాథ ఆరాధన నుండి అతి వికృతమైన కాపాలిక తెగ వరకూ అనేక పాయలు కనిపిస్తాయి. పదో శతాబ్దానికి వచ్చేసరికి శుద్ధ శైవము, కాలముఖము ప్రముఖ శాఖలుగా మిగిలాయి. గోళకి మఠం శుద్ధశైవానికి చెంది రాజాశ్రయాన్ని పొంది పదకొండు పన్నెండు శతాబ్దాలలో ప్రాచుర్యంలో ఉండింది. కానీ కాలక్రమేణా ఈ రెండు శాఖలు కలిసిపోయినట్లు తెలుస్తుంది. గోళకి మఠ గురువులైన ఈశాన దేవ, క్రియాశక్తి లు వారు శుద్ధశైవులైనప్పటికీ తదనంతరం కృష్ణదేవరాయుల సమయానికి కాలముఖులుగా పేర్కొనబడ్డారు.
గోళకి మఠం వీరశైవ అఘోరా పద్దతులకు-వేదాలకు మధ్యేమార్గంగా అవతరించిన సంప్రదాయపద్దతి అని వేటూరి ప్రభాకర శాస్త్రి అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ఈ మఠాధిపతులు వీరశైవులని, అఘోరాలని, తాంత్రిక వాదులనీ పేర్కొనబడ్డారు. (రి. పుష్పగిరి శాసనం)
అప్పట్లో ప్రతిశివాలయములోను గోళకి మఠం ఉండేది. దీనిని మహేశ్వరి, శైవయోగిని ల పేరుతో పిలువబడే శైవ సన్యాసినిలు నిర్వహించే వారు. వీరి వివరాలు పదమూడవ శతాబ్దానికి చెందిన కర్నూలు శాసనాలలో విరివిగా కనిపిస్తాయి. పూజాదికాలు మాత్రం లింగధారులు, జంధ్య ధారులు అయిన బ్రాహ్మణులు జరిపేవారు. వీరు శైవాగమన పద్దతులు మరియు వేదాలకు అనుగుణంగ పూజలు చేసేవారు. వీరిని శుద్ధశైవ బ్రాహ్మణులుగా మల్కాపుర శాసనంలో పేర్కొనబడ్డారు. కాల క్రమంలో వీరు వేదాలను ఎక్కువగా అనుసరించటంతో ఆరాధ్య బ్రాహ్మణులు అని పిలవబడ్డారు.
శైవమత పునరుద్దరణకు పూనుకొన్న పండిత త్రయంలోని "శివలెంక మంచన" గోళకిమఠ నియమనిబంధల గ్రంధమైన "సోమ శంభు పద్దతి" ని వ్రాసిన సోమశంభుని మనుమడు.
****
2. గోళకిమఠానికి చెందిన ప్రముఖులు
ఈ మఠానికి చెందిన ప్రముఖులు దక్కను నుండి కేరళ వరకు విస్తరించారు వారిలో ముఖ్యులు
* పన్నెండో శతాబ్దపు కాలచూరి వంశానికి చెందిన బిజ్జల దేవునికి దీక్ష ఇచ్చిన కాలచూరి క్షంపాల దీక్ష గురువు
* కేరళకు చెందిన ఈశాన శివాచార్య. ఇతను రాజరాజ చోళునికి రాజ గురువు
* కాకతి గణపతిదేవుని దీక్షనిచ్చిన విశ్వేశ్వర శివ. ఇతనిని గణపతిదేవుడు తన తండ్రిలాగ పేర్కొన్నాడు. ఇతను కృష్ణా తీరంలో మంధర (నేటి మందటం) ప్రాంతంలో ఆశ్రమం కట్టుకొని స్థిరపడ్డాడు.
గోళకిపీఠాధిపతి విశ్వేశ్వర శివుడు కాకతీయ రాజులకు గురువే కాక- చోళులకు, మాళవులకు, కాలచూరి రాజులకు కూడా గురువేనని ఇంకా వందలాది వీరశైవ ఆచార్యులకు అధిపతి అని చెప్పబడ్డాడు.
* పుష్పగిరి మఠాన్ని స్థాపించిన "సోమశివాచార్య" గోళకి సంప్రదాయానికి చెందిన గురువు. ఇతని విగ్రహం వెడికల్లి లో కలదు. (పుష్పగిరి ? పుష్పగిరి చెన్నకేశవ ఆలయంలో క్రీ.శ. 1501 నాటి శాసనం లో అఘోరశివాచార్యులు శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ శిఖరాన్ని నిర్మించట్లు ఉన్నది)
*శ్రీనాథుడు ఓడించిన డిండిమ భట్టు గోళకి పరంపరకు చెందిన వ్యక్తి.
* విరూపాక్ష, పుష్పగిరి అద్వైత మఠాలు గోళకి వంశస్థులు నెలకొల్పినవే.
* ఆంధ్ర ప్రాంతంలో పుష్పగిరి, త్రిపురాంతక ఆలయాలలో గోళకి మఠాలు ఉండేవి.
* విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన విద్యారణ్య స్వామి గోళకి మఠ సంప్రదాయానికి చెందిన వ్యక్తి.
గోళకి వంశస్థులు ఆ తరువాత అనేక శతాబ్దాలు ఆంధ్ర దేశంలో తమ ఉనికిని నిలుపుకొన్నారు. కాళేశ్వరం, శ్రీశైల ఆలయాలలో తమ మఠాలను నెలకొల్పి తమ సంప్రదాయాలను ప్రచారం చేసుకొన్నారు.
****
3. గోళకి మఠం - సామాజిక సంస్కరణ
శ్రీకంఠ శివాచార్యుడు ఆలయంలోకి కులాలతో సంబంధంలేకుండా భక్తులందరకీ ప్రవేశం కల్పించాడు. (మల్కాపుర శాసనంలో కూడా బ్రాహ్మణులమొదలు చండాలుర వరకూ అందరకూ ఉపయోగపడే సత్ర నిర్మాణం చేసినట్లు ఉంది). శివుని నామోచ్ఛారణ ద్వారా చండాలుడు కూడా ఉత్తముడౌతాడని ప్రభోదించాడు.
ఒక చండాలుడు శివుని నామాన్ని ఉఛ్ఛరించాకా ఇతరులందరూ అతనితో మాట్లాడవచ్చు, కలిసి జీవించవచ్చు, కలిసి భుజించవచ్చు " అని ముండకోపనిషత్తులో చెప్పబడింది అని శ్రీకంఠుడు ప్రవచించేవాడట (ఈ శ్లోకం లభించటం లేదు, బహుసా తొలగించి ఉంటారు అని టి.ఎన్. మల్లప్ప అన్నారు)
ఆ తరువాత వచ్చిన బసవేశ్వరుడు: శివదీక్ష తీసుకొన్న స్త్రీలు, పురుషులు; బ్రాహ్మణులు, శూద్రులు; అంటతగినవారు, అంటరానివారు; - అందరూ ఒకేరకమైన హక్కులు కలిగి ఉంటారని; లింగము, కులము, వర్ణములకు అతీతంగా అందరూ మోక్షమును పొందే అర్హత కలిగి ఉంటారని ప్రవచించాడు. బసవేశ్వరుని బోధనలుగా చెప్పబడుతున్న పై అంశాలన్నీ అప్పటికే అమలులో ఉన్న గోళకి మఠ సంప్రదాయాలని వేటూరి ప్రభాకరశాస్త్రి అభిప్రాయపడ్డారు.
ప్రతాపరుద్రుని మరణంతో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయినపుడు ఈ గోళకిమతస్థులు ఆంధ్రనుంచి, కర్ణాటకవైపు వలసపోయి విద్యారణ్య స్వామి ఆశీర్వాదాలతో హరిహర, బుక్కరాయల సారధ్యంలో విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించారు.
***
4. గోళకి మఠం తాంత్రిక పీఠమా?
గోళకిమఠం (Circular Lodge) ప్రారంభదశలలో శక్తి ఆరాధనకు, తాంత్రిక విద్యలకు నిలయంగా ఉండేదనే ఒక అభిప్రాయం కలదు.
గోళకిమఠానికి మూడులక్షల గ్రామాలను దానం చేసిన కాలచూరి రాజులు పదోశతాబ్దంలో (975-1025 క్రీశ) జబల్ పూర్ లో నిర్మించిన Chausath Yogini Temple/Bhedaghat temple ఈ వాదనకు సాక్ష్యంగా నిలుస్తుంది. (చూడుడు: గోళాకార యోగిని ఆలయ ఫొటో)
ఈ ఆలయంలో శివుడు, దుర్గమాత, అరవైనాలుగు యోగినిలు కొలువై ఉన్నారు. యోగినుల విగ్రహాలు శృంగారోద్దీపన కలిగించే విధంగా ఉంటాయి. ఈ ఆలయంలో- తాంత్రిక విద్యలుగా భావించబడే మూలాధార చక్రం, కుండలిని స్థానాల ఆధారంగా వివిధ యోగినిల పేరుతో అరవై నాలుగు ఆలయగదులు ఉన్నాయని, ఇవన్నీ తంత్రసాధనకొరకు ఉపయోగపడి ఉండొచ్చని RK Sharma అభిప్రాయపడ్డాడు. (Kiss of the Yogini by Gordan White)
****
గోళకిమఠం ఎలా ప్రారంభమైనా దాని కల్ట్ ఒక గొప్ప రాజకీయ సామాజిక మార్పులకు ఆధారమయ్యిందనేది ఒక చారిత్రిక సత్యం.
గోళకి మఠం ఉత్తరాదిలో స్థాపించబడినదైనప్పటికీ రాజకీయ ఒడిదుడుకుల వల్ల క్రమక్రమంగా దక్షిణాదివైపుకు జరుగుతూ వచ్చింది.
అలా కర్ణాటక, కేరళ, తమిళ ఆంధ్రదేశాలలో విస్తరించినపుడు ఇక్కడి శైవ సంప్రదాయాన్ని ప్రభావితం చేసి ఒక ప్రత్యేకమైన "Golaki School of Shaivism" గా రూపాంతరం చెందింది.
శైవం లోని దుష్ట సంప్రదాయాలను (అఘోరాలు, శక్తి ఆరాధన, శారీరిక హింస, యోగినీ ఆరాధన లాంటివి) క్రమక్రమంగా వదిలించుకొని ఈ సమాజంలోని ప్రజలందరూ సమానమేననే సిద్ధాంతాన్ని ఉద్భోదించిన ఒక ఉత్తమ మత సంప్రదాయంగా గోళకిమఠాన్ని నేడు గుర్తించవచ్చు.
కృష్ణదేవరాయుల కాలంలో గోళకి మత సాంప్రదాయం హిందువులను అప్పటి ఉమ్మడి శతృవులకు వ్యతిరేకంగా ఏకీకృతం చేయటంలో సహాయపడింది.
శివదీక్ష తీసుకొన్న ప్రజలందరూ దేవుడిముందు సమానమే అని చెప్పిన హిందూశాఖ ఈ గోళకిమఠం. మరి అంతటి గొప్ప ప్రభోధనలనుండి మరలా ఇంతదూరం ఎందుకు జరిగిపోయామో ప్రతిఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం.
రిఫరెన్సులు
1. Kriya Sakti Vidyaranya by T.N Mallappa)
2. Kiss of the Yogini by Gordan White
3. http://mahavarnam.blogspot.com/2010/03/blog-post_05.html
4. వికిపిడియ
బొల్లోజు బాబా
No comments:
Post a Comment