ఇద్దరు సితాఫ్ ఖాన్ లు
సీతాఫిఖానుడు, సీతాపతి, సీతడు, సీతాపతి రాజు అనే వివిధ పేర్లతో పిలువబడ్డ సితాప్ ఖాన్ గురించి రాజమహేంద్రవరం, బోయినపూడి, కిమ్మూరు కైఫీయత్తులలో వస్తుంది. ఈ కైఫీయత్తులన్నింటిలో సితాప్ ఖాన్ వృత్తాంతం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. కొంత కల్పన, కొన్ని వాస్తవాల కలగలుపు అది.
చరిత్రలో మూడు చోట్ల సితాఫ్ ఖాన్ పేరును స్పష్టంగా పోల్చుకోవచ్చు.
1504 నాటి వరంగల్ శాసనంలోని షితాబు ఖాను. ఇతనే ఖుష్ మహల్ నందు దర్బార్ నిర్వహించేవాడు.
1516 లో శ్రీకృష్ణదేవరాయలను ఎదిరించిన చితాపుఖానుడు
1572 లో ఇబ్రహిమ్ కుతుబ్ షా (మల్కిభరాముడు) కాలంలో, రాజమహేంద్రవరం లో ఓడిపోయి పారిపోయిన సీతాఫిఖానుడు.
1516 లో శ్రీకృష్ణదేవరాయలను ఎదిరించిన చితాపుఖానుడు
1572 లో ఇబ్రహిమ్ కుతుబ్ షా (మల్కిభరాముడు) కాలంలో, రాజమహేంద్రవరం లో ఓడిపోయి పారిపోయిన సీతాఫిఖానుడు.
పై మూడు సందర్భాల కాలాలను గమనిస్తే మొదటి రెండు చోట్ల కనిపించే సితాఫ్ ఖానుడు ఒకవ్యక్తే కావచ్చని, రాజమహేంద్రవరంలోని సితాఫ్ ఖాన్ వేరే వ్యక్తి కావచ్చనేది స్పష్టమౌతుంది.
ఎందుకంటే 1504 నాటి శాసనంలోని సితాఫ్ ఖాన్ కు కల భార్యలలో దేవాంబికకు అవధూత ఖాన్, పురాంతక పేర్లతో ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిలో పురాంతక అనే కొడుకు వివిధ యుద్ధాలలో అనేకమంది వీరులను సంహరించాడట. మరొక భార్య అయిన అనుమాంబ కు అమర, బోగి, రామ అనే ముగ్గురు కొడుకులు. వీరిలో పెద్దకొడుకు యుద్ధంలో చనిపోయాడట. ఈ వివరాలను బట్టి వరంగల్ శాసనం వేయించిన సితాఫ్ ఖాన్ వయసు నలభై- ఏభై ఏళ్ళ మధ్యలో ఉండొచ్చు. 1516 లో కృష్ణదేవరాయలితో యుద్ధం చేసే నాటికి ఇతనికి అరవై ఏళ్ల వయసు ఉండొచ్చు. అది సంభవమే కనుక వరంగల్ శాసనం వేయించిన సితాఫ్ ఖాన్, కృష్ణదేవరాయలతో యుద్ధం చేసిన సీతాఫ్ ఖాన్ ఒకడే అయ్యే అవకాసాలు ఎక్కువ.
ఎందుకంటే 1504 నాటి శాసనంలోని సితాఫ్ ఖాన్ కు కల భార్యలలో దేవాంబికకు అవధూత ఖాన్, పురాంతక పేర్లతో ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిలో పురాంతక అనే కొడుకు వివిధ యుద్ధాలలో అనేకమంది వీరులను సంహరించాడట. మరొక భార్య అయిన అనుమాంబ కు అమర, బోగి, రామ అనే ముగ్గురు కొడుకులు. వీరిలో పెద్దకొడుకు యుద్ధంలో చనిపోయాడట. ఈ వివరాలను బట్టి వరంగల్ శాసనం వేయించిన సితాఫ్ ఖాన్ వయసు నలభై- ఏభై ఏళ్ళ మధ్యలో ఉండొచ్చు. 1516 లో కృష్ణదేవరాయలితో యుద్ధం చేసే నాటికి ఇతనికి అరవై ఏళ్ల వయసు ఉండొచ్చు. అది సంభవమే కనుక వరంగల్ శాసనం వేయించిన సితాఫ్ ఖాన్, కృష్ణదేవరాయలతో యుద్ధం చేసిన సీతాఫ్ ఖాన్ ఒకడే అయ్యే అవకాసాలు ఎక్కువ.
ఇక 1572 లో ఇబ్రహిమ్ కుతుబ్ షా సమకాలీనుడిగా చెప్పబడిన రాజమహేంద్రవరం సితాఫ్ ఖాన్ ఖచ్చితంగా మరొక వ్యక్తి అయి ఉండాలి. ఇతను ఎవరనే ప్రశ్నకు సరైన చారిత్రిక సమాధానాలు కనిపించవు. వరంగల్ సితాఫ్ ఖాన్ ను 1512 లో Quli Qutb-ul-Mulk ఓడించాకా ఇతను ఒరిస్సా పారిపోయి గజపతి రాజుల వద్దకు వెళ్ళితలదాచుకొన్నాడు. బహుసా గజపతి రాజులవద్ద సేనాధిపతిగా కుదిరి ఉంటాడు. అందుకనే కృష్ణదేవరాయలు గజపతి రాజులపై దండెత్తి వస్తున్నప్పుడు నిలువరించటానికి వీరోచితంగా ప్రయత్నించాడు. ఆ యుద్ధంతరువాత ఇతని ప్రస్తావన ఎక్కడా వినిపించదు బహుసా ఆ యుద్ధంలో ఇతను చనిపోయి ఉండాలి.
1572 ల నాటి రాజమహేంద్రవరం సితాఫ్ ఖాన్ వరంగల్ సితాఫ్ ఖాన్ మనవడు అవటానికి అవకాశాలు కనిపిస్తాయి. తాత వలే తనుకూడా గజపతి రాజుల వద్దే కొలువులో ఉండి, సేవలందిస్తూ పేరుతెచ్చుకొని రాజమహేంద్రవరానికి అధికారిగా నియమితుడై ఉంటాడు.
***
***
I. వరంగల్ సితాఫ్ ఖాన్ హిందువా ముస్లిమా?
వరంగల్ శాసనాన్ని బట్టి సితాఫ్ ఖాన్ ను హిందువుగా పరిగణించాలి. ఎందుకంటే ఈ శాసనంలో – ఇతను భోగి (బోయి ?) కులానికి చెందిన వ్యక్తిగా చెప్పబడ్డాడు. ఇతని భార్యలు, పిల్లల పేర్లన్నీ హిందూ నామాలే. ముస్లిములు నాశనం చేసిన కృష్ణుని విగ్రహాన్ని (పాంచాలరాయుడు), కాకతీయుల కులదైవమైన కాకతి విగ్రహాన్ని తిరిగి పునప్రతిష్ట గావించాడని చెప్పబడింది. అంతే కాక శాసనం ఆఖరున ఏకశిలానగరంలో (వరంగల్) ఉన్న శివాలయములో నిత్యం పూజలు చేయటం వలన సితాఫ్ ఖాన్ కు ఇన్ని సుగుణాలు, ఐశ్వర్యాలు సిద్ధించాయి అని ఉంది.
Shitab Khan of Warangal అనే పుస్తకాన్ని వ్రాసిన Dr. Hirananda Sastri – సీతాఫ్ ఖాన్ హిందువని, ఇతను బోయకులానికి చెందినవాడు కావొచ్చునని అన్నారు.
దక్కను సుల్తానుల చరిత్రను వ్రాసిన ఫెరిష్టా సితాఫ్ ఖాన్ గురించి “ఖమ్మంమెట్టు రాజు, Fearless infidel (అవిశ్వాసి) అన్నాడు. 1829 లో ఫెరిస్టా రాతలను ఇంగ్లీషులోకి అనువదించిన Col. Briggs కు సితాప్ ఖాను ను హిందువుగా పరిగణించి అతని గురించిన ప్రస్తావనలను అన్నింటిని మూలంలో సితాప్ ఖాను అని ఉన్నప్పటికీ సీతాపతి (Seetaputty) గా అనువదించాడు.
సితాఫ్ ఖాన్ ఒరిస్సాకు చెందిన గజపతి రాజులకు సన్నిహితుడైన హిందువని, ముస్లిం రాజ్యంలో మనుగడకొరకు ముస్లిమ్ పేరు పెట్టుకొన్నాడని అంటారు మరికొందరు చరిత్రకారులు.
సితాఫ్ ఖాన్ హిందు ద్వేషిగా, చతుర్ముఖేశ్వర, ఇంకా ఇతర ఆలయాలను ధ్వంసం చేసినవాడిగా ఏకశిలానగర కైఫియత్తు లో ఉన్నది.
Glimpses of the Nizam’s Dominions (1898) లో Campbell, A. Claude వరంగల్ ను చేజిక్కించుకొన్న “మొదటి ముసల్మాన్” సితాఫ్ ఖాన్ అని పేర్కొన్నాడు.
బహుమని సుల్తానులకు సితాఫ్ ఖాన్ ఒక సామంతుగా ఉంటూ ఆ సామ్రాజ్యం కూలిపోతున్న సమయంలో హిందూ రాజుల ప్రాపకం సంపాదించుకొని వరంగల్, హనుమకొండ ప్రాంతాలకు తానొక స్వతంత్ర రాజుగా ప్రకటించుకొన్న renegade Musalman (ముస్లిం మతభ్రష్టుడు) అని అభిప్రాయపడతాడు col T.W. Haig తన Landmarks of the Deccan అనే పుస్తకంలో.
ఇలా పొంతన లేని ఆధారాల వల్ల సితాఫ్ ఖాన్ హిందువా, ముస్లిమా అన్న ప్రశ్నకు నేటికీ స్పష్టమైన సమాధానం లభించదు.
II. కృష్ణదేవరాయలను నిలువరించిన వరంగల్ సితాఫ్ ఖాన్
కృష్ణదేవరాయలు కళింగదేశంపై దండయాత్ర చేసిన సమయంలో 1516 లో సితాఫ్ ఖాన్ తన అరవై వేల మంది సైన్యంతో కృష్ణదేవరాయలును నిలువరించటానికి ప్రయత్నించాడనే విషయం “రాయవాచకం” లో ఇలా ఉంది.
//చితాపుఖానుడనేవాడు అరవై వేలు సింగ్గాణి రౌతులతోడట్టు కనుమ మార్గమున పొయ్యే రౌతు రాణువమీద చిత్త వాన గురిసినరీతి అమ్ముల గురియించ్చగా అంమ్ముల నుండ్డి తప్పించుకొనువారున్ను ఆయంమ్ములకు యెదురై నిలిచిన వారున్ను ముంద్దు వెనక తెలియక నిలిచిన వారున్ను ఆడాడ దిగ్బ్రమ పడివున్న వారున్ను యీరీతిని వుండ్డగా చితాపుఖానునికి యెదురులేదు గనక జగడం శేయగా ఆ సమయాన కర్నాటకం కైజీతం రౌతులు చితాపుఖానునికి పెడతలపోటుగా యిరుపార్శ్వాల కనమల పొడువున నెక్కి చితాపు ఖానుని వెనకదిక్కులకై వచ్చి సింగ్గాణులమతనున్ను, కడ్గముల చేతనున్ను బరిజీల చేతనున్ను వేటారు తునకలుగా నరకగా చితాపుఖానుని తెగలకు కనుమలో నిలువకూడక విరిగి పొరగ వెంబ్బడించ్చి తరుముకబోయి వారిని దుర్గంచొర దోలి తిరుగా వచ్చిరి.// (రాయల సైన్యం అడవిమధ్యలో వెళుతుండగా అకస్మాత్తుగా సితాఫ్ ఖాన్ సైన్యం బాణాల వాన కురిపిస్తే మొదట్లో కంగారు పడ్డ రాయల సైన్యం, కొండలపైకెక్కి సితాఫ్ ఖాన్ సైన్యంపై బాణాలతో, బరెసెలతో దాడిచేసి వారిని తునకలుగా నరికి, సుదూరంగా తరిమివేసిందట)
రాయలను కళింగవైపు రాకుండా అడ్డుకోవటానికి కటకం గజపతి రాజుల ఆదేశాలతో, సితాఫ్ ఖాన్ ఈ దాడి చేసి ఉండొచ్చు. ఈ దాడి తరువాత సితాఫ్ ఖాన్ వివరాలు ఎక్కడా కనిపించకపోవటాన్ని బట్టి రాయల సైన్యం ఎదురుదాడిలో వరంగల్ సితాఫ్ ఖాన్ మరణించి ఉంటాడని భావించవచ్చు.
III. రాజమహేంద్రవరం సితాఫ్ ఖాన్
కటకంలో సింహాసనం అధిష్టించి పాలిస్తున్న ముకుందదేవు గజపతి మేనల్లుడైన రాజవిద్యాధరుడు, సీతాభిఖానుడు కలిసి రాజమహేంద్రవరాన్ని కేంద్రం గా చేసుకొని ఆ ప్రాంతాన్ని పాలించేవారు.
తెలుగు కవులచే కీర్తించబడిన గోల్కొండ పాలకుడు ఇబ్రహిమ్ కుతుబ్ షా ఆదేశాలమీద అతని దండనాయకుడు, రుస్తుంఖాన్ పదివేలమంది అశ్వదళంతో 1572లో రాజమండ్రిని జయించటానికి వచ్చాడు. మొదటగా పెద్దాపురం (Pentapoor) కోటను ముట్టడించి వశపరచుకొన్నాడు. అక్కడ ఉన్న సీతాభిఖానుడు రాజపూడి కోటకు పారిపోయాడు. రుస్తుం ఖాన్ రాజపూడి కోటపై దాడి చేయగా, సీతాభిఖానుడు అక్కడనుంచి తప్పించుకొని రాజమండ్రి కోటను చేరుకొని అక్కడ ఉంటున్న విద్యాధరునితో కలసి రుస్తుం ఖాన్ సైన్యం పై ఎదురుదాడి చేయటం మొదలు పెట్టాడు. అలా నాలుగునెలల పాటు యుద్ధం జరిగింది. చివరకు సీతాపతి, విద్యాధరులు, రుస్తుం ఖాన్ తో సంధి కుదుర్చుకొని, విద్యాదరుడు కంశింకోటకు, సీతాపతి బీజానగర్ కు ప్రాణాలు దక్కించుకొని వెళ్ళిపోయారు.
రాజమండ్రి సీతాభిఖానుడి గురించి క్లుప్తంగా లభించే చారిత్రిక సమాచారం.
IV. మెకంజీ కైఫియత్తులలో వర్ణించబడిన సితాఫిఖానుడు
1. అవసరాల పెద్దిరాజు అనే బ్రాహ్మణుడి ఇంట సీతడు అనే ఒక శూద్రదాని కొడుకు దూడలు కాస్తూ ఉండేవాడు. ఒకనాడు సీతడు తాడిచెట్టునీడను పడుకొని ఉండగా ఒక పెద్ద సర్పము తనపడగను విప్పి అతనిపై ఎండపడకుండా గొడుగుపట్టటం పెద్దిరాజు చూసి, వీడు ఏనాటికైనా గొప్ప అదృష్టవంతుడు అవుతాడని ఊహించి ఆరోజునుంచి అతనితో దూడలు కాయించటం మాని విద్యలు చెప్పించటం మొదలెట్టాడు.
2. అలా విద్యలు నేర్చుకొన్న సీతడు ఓరుగల్లు వెళ్ళి సైన్యంలో చేరి చురుకుగా పనిచేస్తూ ప్రభువు ఆదరణకు పాత్రుడైనాడు. సీతడు సీతాఫిఖానుడు అనే బిరుదు పొందాడు.
3. కొన్నాళ్ళకు ఓరుగల్లుని తురకలు ఆక్రమించుకోగా, సీతాఫిఖానుడు ఓరుగల్లు విడిచి కటకం చేరాడు. అక్కడి గజపతి ముకుందదేవుని విశ్వాసం చూరగొనటంతో ఆయన సీతాఫిఖానుడికి రాజమహేంద్రవరం సంరక్షణా బాధ్యతలను అప్పగించాడు.
4. సీతాఫిఖానుడు రాజమహేంద్రవరం వచ్చి, తనకు చిన్నతనంలో సహాయం చేసిన అవసరాల పెద్దిరాజును పిలిపించి అతనికి దివానుగిరీ ఇచ్చి రాజమహేంద్రవరాన్ని గజపతిరాజు ప్రతినిధిగా పాలించటం మొదలెట్టాడు.
5. వీరిద్దరికి పొరపొచ్చాలు రావటంతో పెద్దిరాజు కనుగుడ్లు పీకించాడు సీతాఫిఖానుడు.
6. గుడ్డివాడైన పెద్దిరాజు పల్లకిలో రాజమహేంద్రవరం నుండి గోలకొండకు పోయి అక్కడ విభురాం పాదుషా (ఇబ్రహిమ్ కుతుబ్) గారిని దర్శించుకొని, సీతాఫిఖానుడు తనకు చేసిన అన్యాయాన్ని చెప్పుకొని, తనకు సైనిక మద్దతు ఇచ్చినట్లయితే రాజమహేంద్రవరం కోటను మీ పరం చేస్తాను అని విన్నవించుకొన్నాడు. దీనికి పాదుషా గారు అంగీకరించి, పెద్దిరాజుకి సహాయంగా పటాలాన్ని పంపించాడు.
7. గోల్కొండ నవాబు సేనలు 1572 క్రీ.శ. లో రాజమహేంద్రవరం కోటను ముట్టడించినపుడు సీతాఫిఖానుడు వారి ధాటికి తాళలేక కోట విడిచి పారిపోయాడు.
8. రాజమహేంద్రవరం నుంచి పారిపోయి తోటపిల్లి అడవిలో దాక్కొన్న సీతాఫిఖానుడిని తురకసైన్యం పట్టుకొని తలనరికి చంపేసారు. (బోయినపూడి, రాజమహేంద్రవరం, కిమ్మూరు కైఫీయతులు)
***
***
V. మెకంజీ కైఫీయత్తులు మౌఖిక సాంప్రదాయంలో భద్రపరచబడిన చరిత్ర. నిజానికి సితాఫ్ ఖాన్ కు సంబంధించి మెయిన్ స్ట్రీమ్ చరిత్రే అష్టవంకరలు పోయిన పరిస్థితి ఉంది. అలాంటపుడు కైఫియత్తులలో నిర్ధిష్టమైన తారీఖులు, పేర్లు ఉంటాయని ఆశించలేం.
పై ఎనిమిది పాయింట్లను గమనిస్తే…
మొదటి పాయింటులో కనిపించే పాము పడగ విప్పి నీడపట్టటం అనే కథనం ఒక వ్యక్తి దైవాంశసంభూతుడు అని చెప్పటానికి ఉద్దేశించబడే ఒక మెటాఫర్. ఇది సర్వాయి పాపన్న, ముమ్మిడివరం బాలయోగి లాంటి వ్యక్తుల జీవితచరిత్రలలో కూడా కనిపిస్తుంది.
రెండు మూడు పాయింట్లలో ఈ కైఫియత్ వ్రాయసగాడు వరంగల్ సీతాఫ్ ఖాన్ , రాజమండ్రి సీతాఫ్ ఖాన్ ల చరిత్రను కలగాబులగం చేసినట్లు అనిపిస్తుంది.
అయిదు, ఆరు, ఎనిమిది పాయింట్లలో చెప్పబడిన కథనాలు పూర్తిగా స్థానీయమైనవి.
ఇవి విశ్వసనీయంగా ఉంటూ ఇతర చారిత్రిక సంఘటనలతో సరిపోతూంటాయి. ప్రధానస్రవంతి చరిత్రలోకి ఎక్కని ఇలాంటి వందలకొలదీ సంఘటనలు కైఫీయత్తులలో దొరుకుతాయి. వీటికోసమైనా కైఫీయత్తులను అధ్యయనం చేయాలి.
ఇవి విశ్వసనీయంగా ఉంటూ ఇతర చారిత్రిక సంఘటనలతో సరిపోతూంటాయి. ప్రధానస్రవంతి చరిత్రలోకి ఎక్కని ఇలాంటి వందలకొలదీ సంఘటనలు కైఫీయత్తులలో దొరుకుతాయి. వీటికోసమైనా కైఫీయత్తులను అధ్యయనం చేయాలి.
( రానున్న నా తదుపరి పుస్తకం “తూర్పుగోదావరి జిల్లా- మెకంజీ కైఫియత్తులు” నుండి)
బొల్లోజు బాబా
సంప్రదించిన పుస్తకాలు
1. Shitab Khan of Warangal - Dr Hirananda Sastri
2. Andhra Pradesh District Gazetteers: East Godavari
3. Historic Land Marks Of The Deccan by Lt. Col. T. W. Haig
4. The Qutb Shahi Kings of Golconda by S. Hanumanth Rao (Essay)
5. రాయవాచకము- సివి రామచంద్రరావు
6. History Of The Rise Of The Mahomedan Power In India Vol. 3 by Briggs, John
7. Warangal inscription of Annul Report Of The Archaeological Department Of His Highness The Nizams Dominions 1934-35 p.no 33
8. Inscribing the Self: Hindu-Muslim Identities in Pre-Colonial India - Cynthia Talbot
1. Shitab Khan of Warangal - Dr Hirananda Sastri
2. Andhra Pradesh District Gazetteers: East Godavari
3. Historic Land Marks Of The Deccan by Lt. Col. T. W. Haig
4. The Qutb Shahi Kings of Golconda by S. Hanumanth Rao (Essay)
5. రాయవాచకము- సివి రామచంద్రరావు
6. History Of The Rise Of The Mahomedan Power In India Vol. 3 by Briggs, John
7. Warangal inscription of Annul Report Of The Archaeological Department Of His Highness The Nizams Dominions 1934-35 p.no 33
8. Inscribing the Self: Hindu-Muslim Identities in Pre-Colonial India - Cynthia Talbot
No comments:
Post a Comment