Tuesday, July 14, 2020

(చాన్నాళ్ళ క్రితం గోదావరి జిల్లాలలోని ఇంగ్లీషు వారి వ్యాపార గిడ్డంగుల పై మోనొగ్రాఫ్ రాద్దామని చేసిన విషయసేకరణ. One more unfinished dream :-( )


Rough Notes
(చాన్నాళ్ళ క్రితం గోదావరి జిల్లాలలోని ఇంగ్లీషు వారి వ్యాపార గిడ్డంగుల పై మోనొగ్రాఫ్ రాద్దామని చేసిన విషయసేకరణ. One more unfinished dream :-( )
 
1. మాధవపాలెం ఫాక్టరీ
 
Madapollam: ఇది నర్సాపురం దగ్గర మాధవపాలెం పేరుతో పిలవబడుతున్న ఒక గ్రామం. ఇక్కడ 17 వశతాబ్దం చివర్లో బ్రిటిష్ ఫాక్టరీ/గిడ్డంగి ఉండేది. ఇక్కడ చేనేత, అద్దకం పని చేసే కుటుంబాలు ఎక్కువ సంఖ్యలో నివసించేవి.
ఇక్కడ నేసిన బట్టలు చాలా మంచి నాణ్యత కలిగి ఉండటంతో బ్రిటన్ లో వాటికి చాలా గిరాకీ ఉండేది. ఉత్తమ నాణ్యత కలిగిన బట్టలకు Madapollam దుస్తులు అనే బ్రాండ్ పేరు కూడా వచ్చింది. ఓడలలో తీసుకువెళ్ళేటపుడు తుఫాన్లకు ఈ బట్టలు తడిచిపోయినా ఏ రకమైన రంగును కోల్పోక తెల్లగా ఉండటం వీటి ప్రత్యేకత.
***
1662 నుంచీ Madapollam లో కంపనీ కార్యకలాపాలు జరుగిన ఆనవాళ్లు లభిస్తాయి. వీరవాసరం Madapollam లలో ఒకదానిని మాత్రమే ఉంచుకొనే ఉద్దేసంతో- కంపనీ కోర్డు ఫిబ్రవరి 1662 లో Madapollam లోఉన్న Sir Edward Winter ఇంటిని వ్యాపార అవసరాలకొరకు పనికొస్తుందో లేదో పరిశీలించమని Nicholas Buckridge అనే ఆసామీని కోరగా ఆయన ఆ ఇల్లు Sir Edward Winter విడిది కొరకు కట్టించుకొన్న ఇల్లు అని, అది ఫాక్టరీ అవసరాలకు పనికిరాదు అని రిపోర్ట్ ఇచ్చాడు.
1669 నాటికి Madapollam లో జరుగుతున్న వ్యాపార కలాపాలు పెద్ద లాభదాయకంగా ఉండేవి కావు. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపనీ అధిపతులకు Madapollam ను వదిలించుకొందామనే ఆలోచనలు వచ్చాయి. దీనిపై రిపోర్టు ఇవ్వమని మచిలీపట్నం చీఫ్ Mr. Mohun ను అడగగా అతను 14, జూన్ 1670 లో - ఇక్కడ మచిలీపట్నం కన్న 20 శాతం తక్కువకు బట్టలు లభిస్తున్నాయి. నేతకార్మికుల సంఖ్య ఎక్కువ. సరైన పెట్టుబడులు పెట్టినట్లయితే ఇక్కడ వ్యాపారం బాగా వృద్దిచెందుతుంది- అని రిపోర్టు ఇచ్చాడు. 1673 లో Fryer ఈ ప్రాంతంలో ఇంగ్లీషు వారి ప్రాబల్యం పెరగాలంటే Madapollam చాలా కీలకమైనదని రికమండ్ చేసాడు.
***
మచిలీపట్నం చీఫ్ అయిన Mr Mohun అనేక ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డాడని, కంపనీ సొమ్ము వాడుకొని 1672-73 ల మధ్య Madapollam ఫాక్టరీలో విలాసవంతమైన భవనం కట్టుకొన్నాడని - అంటూ George Chamberlains 23 మే 1676 న ఇచ్చిన ఒక వాజ్మూలాన్ని బట్టి తెలుస్తుంది. (Diary and consultation book 1672-78- Records of Fort St. George)
25 ఆగస్టు 1673 లో మచిలీపట్నం ఆఫీసు రికార్డులలో Madapollam ఇల్లుకు మరమ్మత్తులు చేసి ఫాక్టరీ అవసరాలకు తగినట్లు విస్తరించినట్లు తెలుస్తుంది. Mr Mohun ఇల్లు కంపనీ డబ్బులతో కట్టినది కనుక స్వాధీనం చేసుకొనిఉంటారు.
అయినా సరే మద్రాసు లోని కంపనీ కోర్టు Madapollam, వీరవాసరం, పెట్టిపొలు, (తరువాత నిజాంపట్నం) మచిలిపట్నం ఈ నాలుగింటిలో ఉంచుకోవాల్సినవి ఏవి తీసేయాల్సినవి ఏవి అని అడగ్గా 9 అక్టోబరు, 1673 మచిలిపట్నం చీఫ్ Major Puckle - మచిలీపట్నానికి Madapollam, వీరవాసరం అనుబంధంగా ఉన్నట్లయితే గొప్ప వ్యాపారం చేయవచ్చు అని రిపోర్టు ఇచ్చాడు. ఆ సమయంలోMadapollam కి Robert Fleetwood చీఫ్ గా ఉన్నాడు అతని తరువాత 1676 లో Christopher Hatton తరువాత వరుసగా John field Samuel Wales, John Field లు పనిచేసారు.
***
క్రమంగా Madapollam గిడ్డంగి మచిలీపట్నం గిడ్డంగికి అనుబంధంగా పనిచేసేది. అంటే ఇక్కడ కొన్న లేదా నేసిన బట్టలను మచిలీపట్నం పంపితే అక్కడనుంచి బ్రిటన్ కు ఎగుమతి అవేవి.
***
మచిలీపట్నం రికార్డులలో 7th September 1676 నుండి 30th December ఇంకా 1684 2nd January 1684 నుండి 31st December 1686 వరకూ జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలలో Madapollam ప్రస్తావన పదే పదే వస్తుంది.
***
ఈస్ట్ ఇండియా కంపనీ ప్రముఖ భాగస్వామి అయిన Streynsham Master మద్రాస్ ఏజెంటుగా ఉన్న సమయంలో ఏప్రిల్ 9, 1679 న Madapollam వచ్చాడు. అప్పుడు Madapollam చీఫ్ John Tivill . ఇక్కడి వ్యాపార అవకాసాలను గుర్తించి 30000 పగోడాలను కేటాయించాడు.
1683 -84 మధ్య లో Thomas Lucas అనే ఆంగ్లేయుడు Madapollam ఫాక్టరీ ఛీఫ్ గా పనిచేసాడు. (రి. The Diaries Of Streynsham Master (1675-1680) Vol-ii)
Thomas Faucett అనే మచిలీపట్నం వ్యాపారి 1706 లో ఈ గిడ్డంగినుంచి వ్యాపార కార్యక్రమాలు విరమించుకొందామని ప్రయత్నించినట్లు Dairy and Consultation book 1706 ద్వారా తెలుస్తున్నది.
1752 నాటికి John Andrews అనే ఆంగ్లేయుడు Madapollam లో ఉంటూ బ్రిటిష్ వారి వ్యాపారకలాపాలను పర్యవేక్షిస్తూ ఉన్నాడని అతని మిత్రులైన Saunders, Starke తదితరులు 24 ఏప్రిల్ 1752 న వ్రాసిన ఉత్తరం ద్వారా తెలుస్తున్నది (రి. Letters from Fort St George 1751-52).
14 ఆగస్టు 1752 లో వ్రాసిన ఒక ఉత్తరం ద్వారా ఖర్చులనిమిత్తం Madapollam కు అయిదువేల పగోడాలు (బంగారు నాణాలు) పంపించారు. అప్పట్లో ఇక్కడ కూడా పెద్ద ఎత్తునే వ్యాపారం జరిగేది. (రి. ibid)
Madapollam లో1688 నుంచి 1698 మధ్య వ్యాపార కార్యక్రమాలు నిలిపివేయబడ్డాయి. 1705 లోకూడా దీనిని మూసేద్దామని అనుకొని విరమించుకొన్నారు. అప్పటికి రెండు గిడ్డంగులు ఉండేవి. 1757 లో Madapollam ను ఫ్రెంచి వారు కైవసం చేసుకొని తిరిగి 1759 లో బ్రిటిష్ వారికి ఇచ్చేసారు.
***
కంపనీ పెట్టుబడులు పెట్టటం తగ్గించేసిన కారణంగా Madapollam లో వ్యాపారకార్యక్రమాలు 1827 నాటికి సన్నగిల్లి క్రమక్రమంగా పూర్వ వ్యాపార ప్రాముఖ్యతను కోల్పోయింది. (ref. A descriptive and historical account of the Godavery District by Morris)
Madapollam అనే పదానికి మెత్తని కాటన్ వస్త్రం అర్ధంతో ఇంగ్లీషు భాషలోకి చేరిపోయింది. (Madapollam is a soft cotton fabric manufactured from fine yarns with a dense pick laid out in linen weave.) ఈ పదానికి మూలం నర్సాపురం వద్ద నేటికీ కల మాధవపాలెం అనే ఊరు పేరు కావటం గమనార్హం. madapollam ఇంగ్లీషువారు కాలుమోపకముందు డచ్ స్థావరంగా ఉండేది.
 
.
2. ఇంజరం ఫాక్టరీ
ఇంజరంలో ఫాక్టరీ 1708 లో తెరచారు. పొడవైన చేనేత బట్టలకు ఇంజరం ప్రసిద్ధి. 1757 లో ఇక్కడి ఇంగ్లీషు ఫాక్టరీని బుస్సీ కైవసం చేసుకొన్నాడు (చెక్). 1829 వరకూ ఇంజరం నుంచి వ్యాపారం బాగానే జరిగింది. ఆ తరువాత తగ్గిపోయింది. 1839 లో వచ్చిన పెద్దతుఫాను ఇంజరంలో ఎంతో భీభత్సాన్ని సృష్టించింది.
ఇంజరం ఫాక్టరీ నిర్వాహకులు స్థానికంగా లభించే వస్త్రాలను కొనుగోలు చేసి మచిలీపట్నం పంపించేవారు. అప్పటికే ద్రాక్షారంలో ఇదే వ్యాపారంలో ఉన్న డచ్చి వారు ఇంజరం ఇంగ్లీషు వ్యాపారస్తులకు అనేక ఆటంకాలు సృష్టించేవారు.
1712 may 21 న విశాఖపట్నం ఫాక్టరి నుంచి వ్రాసిన ఒక లేఖలో Faucett కు వ్యాపారసహాయం చేయటానికి బుద్ది నర్సు అనే విశాఖపట్నం వ్యాపారి వెళ్లినట్లు తెలుస్తున్నది. (Letters to Fort St. George, 1712)
***
కంపనీ గవర్నరైన Edward Harrison కు విశాఖపట్నం ఛీఫ్ Hastings 4 జూన్, 1712 నవ్రాసిన ఒక లేఖలో - ద్రాక్షారంలో ఉన్న డచ్చి వ్యాపారులు ఇంజరం ఫాక్టరీ ద్వారా జరుతున్న వ్యాపారాలకు ఆటంకం కలిగిస్తున్నారని, సరుకులను ఎక్కువ ధరలు చెల్లించి కొంటున్నారని, నేతగాళ్లని వస్త్రాలను తమకే అమ్మమని వారిపై వత్తిడి తెస్తున్నారని, అయినప్పటికీ ఇంజరం చీఫ్ Faucett స్థానిక రాజుల మద్దతు కూడగట్టి (విజయనగరం) సమస్యను పరిష్కరించినట్లు - అర్ధమౌతుంది.
***
ఇంజరం Richard Prince 8 మే 1742 న ఒక ఉత్తరం ద్వారా ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకొంటున్నందుకు రాజమండ్రి నవాబు అనుచరులు వీరిని పదే పదే డబ్బులు ఇవ్వమని పీడించేవారని తెలుస్తుంది.
రాజమండ్రి నవాబు బంధువు ఒకడు Richard Prince ని 2000 పగోడాలు అప్పుగా అడిగితే ఇవ్వనన్నందుకు ఇక్కడనుంచి వ్యాపారకలాపాలు ఎలా సాగిస్తారో చూస్తాను అని బెదిరించాడట. వాచ్ మేన్ ని కొరడాలతో కొట్టి, అక్కడి వ్యాపారులను భయపెట్టాడట. అంతేకాక కాకినాడ డచ్ దుబాషీని ఎలాగైతే శిక్షించానో అలాగే మీపని కూడా పడతానని హెచ్చరించాడట.
ఈ విషయాన్ని రాజమండ్రి నవాబును కలిసి చెప్పినప్పుడు ‘మీకు ఇబ్బంది కలగకుండా చూసుకొంటానని హామీ ఇచ్చాడట’ మొత్తం ఉదంతంలో ఇంజరం ఫాక్టరీ ఎన్ని ఒడిదుడుకులని ఎదుర్కొని నిలదొక్కుకుందో అర్ధమౌతుంది.
***
Saint Fort George నుండి 7 జూన్ 1742 న ఇంజరం వ్యాపారి Richard Prince కు అతని వ్యాపారభాగస్వామ్యులైన మిత్రుల ఉత్తరం ఇలా ఉంది.
సర్
నువ్వు 23, 24 మార్చ్, 11 మే న రాసిన ఉత్తరాల ద్వారా మారాఠాలు వెళిపోయినట్లు, మరలా తిరిగి రాకపోవచ్చునేమోనన్న నీ ఆశాభావాన్నిఅర్ధం చేసుకొన్నాము. నిన్ను నీకు సరుకు సరఫరాచేసే వ్యాపారులను అవమానించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇబ్బందులన్నీ తొలగిఉంటాయని భావిస్తున్నాము. ఆగస్టులోగా రెండువందల బేళ్ల వస్త్రాలను అనుకొన్నట్లుగా సేకరించి సెప్టెంబరులో అక్కడకు వస్తున్న ESSEX Brigantine ద్వారా పంపించగలవని ఆశిస్తున్నాము.
Honble Masters 6 ఫిబ్రవరి 1735 న లేఖలో ఇచ్చిన అనుమతి ప్రకారం ఇంజరంలో నువ్వు ఉండటానికి ఇల్లు కట్టుకోవటానికి ముందు నవాబు వద్దనుండి స్థలాన్ని పొందు. ఆయన వెంటనే ఇస్తాడు. వెయ్య పగోడాల లోపు ఖర్చుతో ఇల్లుకట్టుకోవటానికి మాకు అభ్యంతరం లేదు.
7 జూన్ 1742
నీ ప్రియ మిత్రులు
Richard Benyon
Randall Fowke
Nicholas Morse
పై ఉత్తరం ద్వారా ఇంజరం స్థానికంగా ఉండే ఫాక్టరీ యజమానికి సొంత ఇల్లు ఉండేది కాదనే విషయం అర్ధమౌతుంది. అప్పట్లో భూమి అంతా రాజు చేతుల్లో ఉండేది. ఇల్లుకట్టుకొనేందుకు అయే ఖర్చు కంపనీ భరించేదనే అనుకోవాలి.
***
ఇంజరం చీఫ్ Richard Prince 23 మే 1741 లో రాసిన ఒక లేఖలో మచిలిపట్నం చీఫ్ Mr Goddard తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడని అతని యోగక్షేమాలు విచారించటానికి Mr. Andrews (maddapollam చీఫ్) ని మరియు ఫ్రెంచి యానం చీఫ్ ని అభ్యర్ధించి అక్కడి యానాం వైద్యుడిని మచిలీపట్నం పంపించానని; వీళ్ళు అక్కడకు వెళ్ళేసరికే Goddard అపస్మారక స్థితికి చేరుకొని ఆ మరుసటిరోజే చనిపోయాడని ఉంది. అంటే ఎంత శత్రువులుగా వ్యాపారాకలాపాలు చేస్తున్నా ఆపత్సమయాలలో ఒకరికొకరు సహాయపడటం గమనించవచ్చు. (Richard Prince 1749 లో నాటికి డిప్యూటి గవర్నెర్ అయి 1752 వరకూ ఆ పదవిలో ఉన్నాడు. )
***
Thomas Pitt 1743 జూన్ లో విసాఖపట్టనానికి చీఫ్ గా వెళ్ళగా ఇంజరానికి Thomas Saunders వచ్చాడు.
***
Anthony Sadleir 1776 లో ఇంజరం resident గా Anthony Sadleir ఒక చేనేత కార్మికుని హింసించి, గాయపరచినట్లు George Mackay చేసిన ఎంక్వయిరీలో తేలటంతో సస్పెండ్ చేయబడ్డాడు. (రి ndian Records Series Vestinges Of Old Madras Vol III)
***
ఇంజరం కంపనీ రికార్డులు ఏడాదికి మూడు కాపీలు తీసి ఒకటి మచిలీపట్నానికి, మరొకటి Fort St. George కి మూడోది లండను కు పంపాలి.
కంపనీ డబ్బులను పెట్టెలో పెట్టి మూడు తాళం కప్పలు వేసి వాటి కీస్ చీఫ్ వద్ద ఒకటి, ఆ తదుపరి వరుసలోని అధికారులవద్ద ఒక్కొక్కటి ఉంచాలి. చీఫ్ వద్ద 2000 పగోడాలు, 5000 రూపాయిలు ఉంచుకోవచ్చును. చీఫ్ స్థానికంగా ఉండే అందరూ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొనేలా చూడాలి. ఎవరినైనా ఎవరినైనా బంధించినట్లయితే మూడు రోజులలో విచారణ జరిపి పై అధికారులకు నివేదించాలి. (రి., విశాఖపట్నంలోని Charles Simpson కు 14 ఫిబ్రవరి 1740 న కంపనీ అధికారులనుండి వచ్చిన ఉత్తరం)
***

Thomas Pitt ఉదంతం
తుఫానులో చిక్కుకొని శిధిలావస్థలో ఉప్పాడ కు కొట్టుకొచ్చిన ఒక ఓడలోని విలువైన వస్తువులను చేజిక్కించుకోవటానికి సంబంధించిన చిత్రమైన ఉదంతం ఆశక్తికరంగా ఉంటుంది.
Thomas Pitt ఉప్పాడలో పనిచేసే కంపనీ ఉద్యోగి. ఇతను 1742 సెప్టెంబరులో ఉప్పాడ ఒడ్డుకు ఒక ఓడ కొట్టుకువచ్చిందని, దానిలోని వస్తువులను స్థానికులు కొల్లకొట్టుకుపోతున్నారనే విషయాన్ని పై అధికారులకు నివేదించాదు. ఆ ఓడ పేరు జగన్నాథ్ ప్రసాద్ అని అది బాలాసోర్ కు చెందిన ఒక వ్యాపారిదని, దానిలోని విలువైన వస్తువులను బధ్రపరచమంటూ బాలాసోర్ కు చెందిన John Hall నుండి 10 మే 1943 న Thomas Pitt కు ఒక ఉత్తరం వచ్చింది. అలా కూలిపోయిన ఓడలలోని సంపద స్థానికులదయితే స్థానిక నవాబులకు చెందుతుంది. ఇంగ్లీషువారిదయితే కంపనీ వర్తకులకు చెందటం బహుసా ఆనవాయితీగా వస్తున్నది కాబోలు. ఈ ఓడ ఇంగ్లీషు వారిదా, స్థానికులదా (పేరును బట్టి) అనే విషయం మొదట్లో తెలియదు అనేక ఉత్తర ప్రత్యుత్తరాల తరువాత అది ఇంగ్లీషువారిదే అని తెలుస్తుంది. అది ఇంగ్లీషువారిదే అని నిర్ధారించుకొన్నాక 1744 ఏప్రిల్ లో Pitt దానిని చేరి అందులోని వస్తువుల చిట్టా తయారు చేసాడు. 2511 రూపాయిల సొత్తు, కొద్ది పగోడాలు, ( ఒక్కో పగోడా నాణెం 15 గ్రాముల బంగారం అరువు), కొన్ని దుస్తులు, బంగారం రజను (బట్టల అద్దకం కొరకువాడేవారు) లాంటివి ఉన్నాయని వాటిని ఇంజరం చీఫ్ వద్ద బద్రపరచానని పై అధికారులకు లేఖ ద్వారా తెలియచేసాడు.
ఈ విషయాన్ని తెలుసుకొన్న రాజమండ్రి నవాబు అనుచరులు మే నెలలో Thomas Pitt ను పిలిపించి, ఓడగురించి వివరాలు అడిగి, అది ఇంగ్లీషు వారి ఓడ అని ఎంతచెప్పినా వినకుండా 9000 రూపాయిలు తమ వాటాగా చెల్లించమని ఒత్తిడి చేసారు. రెండురోజుల పాటు తిండిపెట్టక బంధించి, కొరడాలతో హింసిస్తూంటె భరించలేక చివరకు 6000 ఇస్తానని ఒప్పుకొని బ్రతుకుజీవుడా అని బయటపడ్డాడు. జరిగిన విషయాన్ని పై అధికారులకు విన్నవించుకొన్నా వారు పెద్దగా స్పందించరు. బహుసా అవమానాన్ని భరించలేకో లేక దెబ్బల ధాటికో Thomas Pitt 8 సెప్టెంబరు1744 న లో ఉప్పాడలో చనిపోయాడు. (రి Madras Records Calendar For 1744)
***
M. Yeats ఇంజరంలో నివసించే ఇంగ్లీష్ వ్యక్తి. ఇతను బహుసా ఇంజరం ఫాక్టరీ ఉద్యోగి లేదా వ్యాపారి కావొచ్చు. ఇతను సమీపయానాంలో ఫ్రెంచి వాళ్ళు బానిసవ్యాపారం చేస్తున్నారని 1762 లో పాండిచేరి ఫ్రెంచి గవర్నరుకు ఒక లేఖలో ఆధారాలతో కంప్లైంట్ చేసాడు. ((Ref: Asiatic Jour. Vol. 26 No.156)
ప్రజలవద్దనుండి వచ్చిన విజ్ఞప్తులపై విచారణ నిమిత్తం యేట్స్ యానాం వెళితే చాలామంది యానాం వాస్థవ్యులు ఆయనను చుట్టుముట్టి, సుమారు మూడువందలకు పైగా వారి బంధువులను ఎత్తుకుపోయారని గగ్గోలు పెడుతూ తమ గోడును వెళ్లబోసుకొన్నారు. చిన్నపిల్లలను కూడా విడిచిపెట్టలేదని కన్నీరు మున్నీరై విలపించారు. ఈ మొత్తం ఉదంతంపై యానాం ఫ్రెంచి అధికారి ఐన సొన్నరెట్ ను వివరణ కోరగా అలాంటిదేం లేదని మొదట్లో వాదించి, చివరకు కావాలంటే నౌకను తనిఖీ చేసుకోవచ్చునని అనుమతినిచ్చాడు. దరిమిలా ఒక ఫ్రెంచి అధికారి, స్కోబీ అనే ఒక ఇంగ్లీషు అధికారి పర్యవేక్షణలో ఒక కమిటీ ఏర్పడి నౌక తనిఖీ కి కోరంగి వెళ్ళారు. కానీ నౌక కెప్టైన్ వీరిని లోనికి రాకుండా అడ్డుకొని, ఏవిధమైన వివరణలు ఇవ్వకుండా కమిటీని వెనక్కు పంపించేసి కోరంగి రేవునుండి నౌకతో సహా జారుకోవటం జరిగింది.
యానాం పెద్దొర తన విచక్షణాధికారాలను ఉపయోగించి నౌకను నిలుపు చేసి ఉన్నట్లయితే ఆ స్థానికుల తరలింపు నివారింపబడి ఉండేదని M. Yeats, Major Wynch అనే బ్రిటిష్ అధికారికి వ్రాసిన లేఖలో పేర్కొన్నాడు.
 
అప్పట్లో ఇంజరం బ్రిటిష్ వారి పాలనలోను, యానాం ఫ్రెంచి వారి పాలనలోను ఉండేవి. ఈ రెండు ప్రాంతాలు పక్కపక్కనే ఉండటంతో పన్నులలో ఉండే తేడాల వలన అనేక ఇబ్బందులు ఏర్పడేవి. బహుసా ఆ ఇబ్బందులను ఎదుర్కొన్న ఇదే M. Yeats 8 జూన్, 1784 న మచిలిపట్నం బ్రిటిష్ అధికారికి వ్రాసిన ఒక లేఖలో అసలు "యానాం కు ఉన్న హక్కులేమిటి, ఆ వివరాలు తెలుపవలసినది" అంటూ ఉత్తరం వ్రాసాడు. ఏం జవాబొచ్చిందో వివరాలు తెలియరావు. (ఇటీవల ఒక ఐలాండ్ హక్కులగురించి ఆంధ్రా, యానాం అధికారుల మధ్య ఇలాంటి విచారణే జరిగింది)
ఈ ఏట్స్ ను ఒకనాటి బాధ్యతకలిగిన సామాజిక కార్యకర్తగా అనుకోవచ్చు.

 
బొల్లోజు బాబా

No comments:

Post a Comment