అఫ్సర్ ని నేను ఇంతవరకూ ప్రత్యక్షంగా చూడలేదు. అయిదార్లు సార్లు తప్ప ఫోనుల్లోనూ పెద్దగా మాట్లాడుకోలేదు. మా ఇద్దరిదీ కవిత్వసంబంధం.
"అప్పటినుంచి ఇప్పటిదాకా" సంపుటిపై ఇటీవల వ్రాసిన వ్యాసంలోని కొన్ని వాక్యాలివి
//.......అనన్యత కొరకు చేసిన అనంతమైన పెనుగులాటే అఫ్సర్ కవిత్వం మొత్తం. తాను ఈ సమాజానికి అన్యుడనని అంగీకరించలేకపోవటం ఒక వైపు, తనను ఎందుకు అన్యుడిగా ఈ సమాజం భావిస్తున్నదో అంటో అన్వేషించుకొనే ప్రక్రియ మరో వైపు. ఈ రెండు దృవాల మధ్యా నలిగే హృదయఘర్షణ సంక్లిష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోంచి తన పరాధీనతను గానం చేస్తాడు అఫ్సర్. ఒక మైనారిటీ కవి అవటం వలన అతనిపై అదనపు భారం ఉంటుంది. అందరికీ చక్కగా కుదురుకొన్న వ్యవస్థలో అఫ్సర్ ను ఏదో తెలియని అశాంతి వెంటాడుతుంది.
మనచుట్టూ రక్తమాంసాలతో సంచరించే ఇండియన్ కు, సమకాలీన రాజకీయాలు నిర్మిస్తోన్న ఆదర్శ భారతీయునికి మధ్య పెరిగిపోతున్న అగాధం గురించి అఫ్సర్ కవిత్వం మాట్లాడుతుంది. ఒక అరాచక కట్టుకథ వాస్తవ రూపం దాల్చటం పట్ల సగటు మనిషి పొందే భీతిని పట్టుకొంటుంది. ఈ కవి ఈ నేల యొక్క శతాబ్దాల సామరస్యానికి ప్రతినిధి. తను పుట్టిన నేలపై “లవ్ హేట్” బంధాన్ని కలిగి ఉన్నాడు.....//
.
(నలభై ఏళ్ల వర్తమానం – అఫ్సర్ కవిత్వం-- 1/3/2020)
***
.
అఫ్సర్ రాసిన "యానాం వేమన ఏమనె..." నన్ను అప్పట్లో కలవరపెట్టింది. చాన్నాళ్ళు ఆలోచింపచేసింది, స్పష్టపరచింది. తెలుగు కవిత్వం ఒక సంధికాలంలో ఉన్నప్పుడు వచ్చిన కవిత అది. అప్పటికి ఇంకా అస్తిత్వవాద ఉద్యమాలు చిక్కబడలేదు.
ఆ సందర్భంలోంచి 2009 లో ఆ కవితను విశ్లేషించాను. అప్పటికి, ఇప్పటికీ పరిస్థితులు మరింత క్లిష్టతనొందాయి. స్వేచ్ఛగా, హేతుబద్దంగా, గౌరవప్రదంగా బ్రతకాలనుకొనే ప్రతీ సగటువ్యక్తి వెనుకా మింగేయటానికి భూతమొకటి పొంచిఉంది. కవులు కత్తిఅంచున నిలబడి మాట్లాడవలసివస్తోంది.
***
“యానాం వేమన ఏమనె….” అఫ్సర్ కవిత గురించి
బొల్లోజు బాబా - September 8, 2009
*****************************************************
అనుభవం నుంచి పుట్టే కవిత్వానికి ఆయుర్ధాయం ఎక్కువ. అనుభవాన్ని వెచ్చని స్పర్శగా మలచగలిగే కవి చేతిలో పడితే ఇక అది ఓ శిల్పమై నిలుస్తుంది. టౌనుల్లో కూర్చొని రాసే విప్లవగీతాల హోరులో, సుష్టుగా భోంచేసి అల్లిన ఆకలి కేకల కవిత్వం మధ్య, మూలాల్లో నిలుచుని పలికిన “యానం వేమన ఏమనె…..” కవితా వాక్యాలు నన్ను చాన్నాళ్లు కలవర పెట్టాయి. నా జీవనయాన రెపరెపల్లో చెక్కుచెదరక మరల మరల గుచ్చుకొంటూ, అదే బాధ, అదే అశాంతిని రగిల్చే కొన్ని వాక్యాలలో ఇవి మరపురానివి.
ఈ కవితను మొదటి సారిగా ఆంధ్రజ్యోతి పత్రికలో చదివాను (1992). ఈ కవి ఎవరో మా “యానాం” గురించి రాసాడన్న కుర్రతనపు ఉత్సుకత మొదట్లో ఉండినా, పదే పదే చదివినపుడు, ఈ కవితలో జీవిత సామస్త్యాన్ని ఇముడ్చుకొన్న ఒక “రక్త స్పర్శ” కనిపించింది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. “శ్రమైక జీవన సౌందర్యం” అని శ్రీశ్రీ వర్ణించినా, “మంచియన్నది మాలయైతే మాలనేనగుదున్” అని గురజాడ ప్రకటించినా, “శ్రమకు విశ్రాంతి కంటికి రెప్పలా ఉంటుంది” అని టాగోర్ అన్నా ఏదో వెలితి. ఒక ఆలోచన ఎప్పటికీ తెగేది కాదు. లోపలి దారం కనిపించనితనం వెంటాడుతూండేది.
ఆ మహాకవుల కాలంనుంచీ ఇప్పటిదాకా సామాజిక చైతన్యం వేయి దళాలతో వికసించటం వల్లనో ఏమో, ఆ కనిపించని దారమేదో ఈ కవితలో కవికి దర్శనమయ్యింది.
సందర్భం-: కవి యానాం వెళ్లినప్పుడు మాదేటి “సుబ్రమణ్యం” అనే ఒక దళితుడు కొన్ని వేమన పద్యాలు పల్లె పాటలు వినిపించాడు. ఆ యానాం వేమన ఆ రోజు “ఇన్నాళ్లుగా రాస్తుండారు, మా కష్టాలూ, కన్నీళ్లు మీకు ఆపడ్డయా దొరా. ఒకే దారి గుండా వచ్చాం కదా మన ఆకెందుకు ఎడమయ్యింది బాబయ్యా” అని సంధించిన ఒక ప్రశ్న కవిహృదయపు బుల్స్ ఐ కి గుచ్చుకుంది. అంతవరకూ కలల లోకంలో విహరించిన కవి ఆలోచనల్ని పేకమేడలా కూల్చివేసిందా ప్రశ్న. కూలిన ఆ ఆలోచనల్లోంచి ఓ ఫీనిక్స్ పక్షిలా ఈ కవిత పైకి లేచింది. కవుల్ని “నిజం చెప్పు” అంటూ శాసిస్తూంది ఈనాటికీ.
ఆ దళితుని ప్రశ్నకవిలో రగిల్చిన అంతర్మధనం ఈ కవిత లో కనపడుతుంది. ఏమిటీ పరిస్థితులలకు కారణం అనుకుంటూ తన లోపల్లోకంలో అన్వేషణ సాగిస్తాడు కవి. తన చదువునూ, జ్ఞానాన్ని తడిమి చూసుకుంటాడు. ఒక సమాధానంకోసం దోసిలి పట్టి అర్ధిస్తాడు కవి. ఆ వెతుకులాటలో ఎన్నోతరాలుగా మూసుకుపోయిన కనులు సాక్షాత్కరిస్తాయి. తన అంధత్వం తనకే గోచరమౌతుంది. బలవంతంగా వర్గాల మధ్య ఏర్పడిన కండిషనింగ్ తెలుస్తుంది. ఒక వర్గం సాగించిన వివక్ష కనపడుతుంది. ఆ అనుభవం ఇచ్చిన జ్ఞానంతో కవి “మాటకీ అక్షరానికీ చెమట చేతుల మోటుదనం కావాలిక” అని ప్రకటిస్తాడు. మట్టివాసనను, కన్నీటి జాడలనీ, కవిత్వం ప్రతిబింబించాలని ఒక దిశానిర్దేశం కావిస్తాడు.
కవిత్వంలో మనిషివాసన కన్నా చమట చేతుల మోటుదనం యొక్క అవసరతను ఈ కవితలోని అక్షరక్షరం ఎలుగెత్తి చాటింది. దళితకవిత్వ ఉద్యమంలో వస్తువుని నిర్ధిష్టంగా గుర్తించి వ్రాయబడ్డ కవితలలో ఈ కవిత ముందుంటుంది. ఎందుకంటే, ఈ కవితానంతర కాలంలో మహోత్తుంగ తరంగాల్లా ఎగసిపడ్డ దళిత, బహుజన, మైనారిటీ కవిత్వాలలో ఈ కవితాత్మే శత సహస్ర రూపాలతో సంచరించటం ఒక చారిత్రక పరిణామం.
నాకు ఈ కవితలో, వ్యక్తి అనుభవాన్ని కవిత్వంగా మార్చగలగటం, లోపల్లోకపు సంఘర్షణను నిజాయితీగా అక్షరీకరించటం, కవిత్వం సామజిక హితాన్ని కలిగించాలన్న దృక్పధము కనిపిస్తాయి. బహుసా మంచి కవిత్వానికి పై మూడు లక్షణాలు కొలబద్దలేమో కూడా.
నాకు నచ్చిన కవిత గురించి, ఆ కవిత కలిగించిన ఆలోచనలగురించి పంచుకొనే అవకాశాన్ని కలిగించిన పుస్తకం.నెట్ వారికి కృతజ్ఞతలు తెలియచేసుకొంటూ, అఫ్సర్ గారు వ్రాసిన యానం వేమన ఏమనె.. కవితను ఇలా మిత్రులతో పంచుకోవటాన్ని సంతోషిస్తూ……
యానాం వేమన ఏమనె……..
కలల పక్క మీంచి కలవరిస్తూ
నేల మీద దబ్బున పడిపోయినట్టు
చితికిపోయిన ఆకాశం మీంచి నువ్వు
నన్ను భూమ్మీదికి నెట్టినప్పుడు
నా ప్రపంచం మీద కొత్త సూర్యుడు పొడిచాడు
ఒకటి రెండు పదులు వందలుగా విస్తరించి నువ్వు
ఆకాశ శూన్యాన్ని నింపుకొని పోతున్నప్పుడు
నేను ఒఠ్ఠి శున్యాన్నై
శూన్య గోళాన్నయి నీ చుట్టూ పరిభ్రమిస్తూ ఉండి పోయాను.
నేను నిలబడినప్పుడు
మళ్లీ నన్నొక ప్రశ్నగా మార్చి
నా కాళ్ల కింద భూమిని తొలిచావు నువ్వు.
ఆ తర్వాత నేను
నా మొహం వెనుక
వేన వేల భూగోళాల్ని కొండకోనల్ని తవ్వుకుంటూ వెనక్కి వెళ్లిపోయాను
నేను తెచ్చుకున్న చదువునంతా పారబోసుకున్నాను
మళ్లీ దాహం తీర్చమని నీ ముందు దోసిలి ఎత్తాను
నువ్వు నీళ్లూ వొంపలేదు
నా దోసిలీ నిండలేదు
నా దాహం పిడచకట్టుకుని నేను ఎడారినయ్యాను.
నా వొడ్డున ఏ నీటి చుక్కయినా చేపపిల్లలా
విలవిల విల్లాడుతుందేమోనని
మళ్లీ మళ్లీ ఎదురుచూస్తూనే ఉంటాను నేను.
2.
ఎవడు పుట్టినా ఆడదానికేగా
ఏ ఆడదైతేనేం
ఎవడు పుట్టినా రక్తం లోంచేగా
ఏ రక్తం అయితేనేం, మరి
నా యిస్తరి దూరంగా ఎందుకు పెడ్తివి నా దొరా నా రాజా
అని ఈ భూమి కెదురుంగా నిలబడి
సూర్యుడిలా నువ్వు నన్ను పొడుస్తూనే ఉంటావా!
ఇంత తెలిసీ ఇంత చేసీ
నీ కష్టాన్నీ, నీ కన్నీళ్లనీ చూడలేని
అంధుణ్నయిపోయినందుకు
నా కన్రెప్పలకి నీ మాటల సూదులు వేలాడ్తూనే ఉన్నాయి నా మట్టి మనిషీ!
నేను వొట్టి మనిషినే అనుకున్నా
నువ్వూ వొట్టి మనిషివే అనుకున్నా
మనిద్దరి చీమూ రక్తవూ వొక్కటే అనుకున్నా
తోలు తిత్తి ఏదైతేనేం
మనిద్దరి కష్టాలూ వొక్కటే అనుకున్నా
అంతా వొట్టిదే నా మట్టి మనిషీ!
నా వొంటి మీద చొక్కా రంగుని బట్టీ
నా పెదవి మీద మాటల వాసన్ని బట్టీ
నా తల్లీదండ్రీ నాకు పంచిచ్చిన రక్తాన్ని బట్టీ
నా చేతుల మోటుదనాన్ని బట్టీ
తలపాగా తీసి నువ్వొచ్చినప్పుడు
నీ ముందు వొంగున్న తీరును బట్టి
నా మనిషితనం ఖాయమైపోతున్నప్పుడు
నేను వొట్టి మనిషిని ఎట్లవుతా?
3
మాటకీ
అక్షరానికీ
మనిషివాసన ఉంటే సరిపోద్దా?
పోదు,
ఏ మనిషి వాసనో గట్టిగా పసికట్టనీ.
మాటకీ అక్షరానికీ
చెమట చేతుల మోటుదనం కావాలిక!
మాటకీ
అక్షరానికీ
కళ్లకింద బాధతో ఏడుపుతో
తడిసీ నానీ
నల్లబారిన నీడ కావాలిక
మాట నిజంగా మాటయితే
మనువు మాటలో చెప్పాలంటే
అది కాళ్లలోంచి పుట్టాలి
మట్టి కాళ్లలోంచి పుట్టాలి.
– అఫ్సర్
No comments:
Post a Comment