Saturday, July 18, 2020

సప్తశతి గాథలలో సామాజిక వ్యవస్థ: పేదరికం - పార్ట్ 10


.
(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు)
.
పేదరికం
ఆనాటి సమాజంలో ధనిక పేద అంతరాలు ఉన్నాయి. ఇళ్ళలో కుడ్యచిత్రాలు, ఉద్యానవనాలు, అలకా మందిరాలు, రత్నాలు పొదిగిన ఆభరణాలు, రంగురంగుల దుస్తులు కలిగిన ధనికులు ఒకవైపు; కటిక దరిద్రాన్ని అనుభవించే నిరుపేదలు మరోవైపు నివసించటాన్ని ఈ ప్రాచీన గాథాకారులు గుర్తించారు. రెండిటినీ తమ గాథలలో పొందుపరిచారు.
***
.
ధరించేందుకు ఒకటే వస్త్రం ఉంది ఆ నిరుపేదకు.
ఉతికినప్పుడు పీలికలైన దాని అంచుల నుండి
జారే నీటి బొట్లు
కన్నీళ్లను తలపిస్తున్నాయి. (18)
.
దుర్భర దారిద్ర్యాన్ని సూచిస్తుందీ గాథ. చివికిపోయి పీలికలైన వస్త్రానికి వ్యక్తిత్వారోపణ చేసి అదికూడా ఆ నిరుపేద కష్టానికి చలించి శోకిస్తున్నది అనటం లోతైన కల్పన.
***
పీలికలైన పాతకంబళి కప్పుకొని
పిడకల పొగ కంపుకొడుతూ
పొగచూరి నల్లబడిన దేహంతో
చలికి ఒణుకుతూ కనిపించే అతనిని
నిరుపేద అని ఇట్టే గుర్తుపట్టొచ్చు (329)
.
ఆనాటి ఒక నిరుపేద శీతాకాలంలో ఏ విధంగా కనిపించేవాడో కళ్ళకు కడుతుందీ గాథ. నిజానికి మూలంలో Dry Cow-Dung అని ఉంది పిడకలు అని కాదు. (అది అనువాదానికి లొంగక పిడకలుగా అనువదించాను) ఎండిన ఆవుపేడ ముద్దలను ఏరుకొని వాటిని మండించుకొని వెచ్చదనం పొందుతున్నాడట. ఇతనికి బహుసా పాకలాంటిది కూడా లేదేమో. ఆరుబయటే నిద్రించాల్సిన పరిస్థితేమో.
ఆనాటి ఒక పేదరికపు దృశ్యానికి ప్రతీ తరంలోనూ పదే పదే ప్రాణం నింపుతూ బ్రతికిస్తూన్నదీ గాథ.
***
.
తుఫానుకు ఆ ఇంటిపై గడ్డి చెదిరిపోగా
ఆ చిల్లులలోంచి వాననీరు కారుతున్నప్పుడు
భర్త వచ్చే రోజుకోసం గోడపై వేసుకొన్న గీతలలెక్కలు
చెరిగిపోకుండా చెయ్యి అడ్డం పెడుతోందా ఇల్లాలు. (170)
.
ఆనాటి సామాన్య ప్రజలు గడ్డి ఇండ్లలో నివసించేవారని, పైకప్పుకు చిల్లులు పడి వర్షపునీరు ఇంట్లోకి కారేదని పై గాథ ద్వారా అర్ధం చేసుకొనవచ్చును. ఒక యాదృచ్ఛిక భౌతిక స్థితిని వర్ణిస్తూనే మరో ఉప్పొంగే కరుణనిండిన ఉద్వేగాన్ని పండిస్తాడీ గాథాకారుడు.
***
.
పొందిన మర్యాదలను
తన పేదరికంవలన
బదులు తీర్చలేని సజ్జనుడు పడే దుఃఖం
అతడిని అవమానించినపుడు కూడా పడడు. (320)
.
మనిషిలోని ఆత్మగౌరవాన్ని పట్టిచూపుతుందీ గాథ. ఎదటివారు చేసిన వాటికి తప్పక రుణం తీర్చుకోవాలనుకోవటం, పేదరికంవల్ల అలా చేయలేకపోతే అది అవమానకరంగా భావించటం అనేది ఇచ్చిపుచ్చుకొంటూ చేసే సహజీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ గాథలోని భావాన్ని విలోమం చేస్తే “పొసగి మేలు చేసి పొమ్మనుటే చావు” అనే వేమన పద్యపాదం తగులుతుంది.
***
.
గర్బం ధరించిన కోడలు పిల్లను
"నీకు ఏం తినాలని ఉందో చెప్పు" అని
పదే పదే అత్తమామలు అడుగుతూంటే
తన అత్తవారింటి పేదరికాన్ని
తన భర్తకు కలిగే సంకట స్థితిని దృష్టిలో ఉంచుకొని
ప్రతీసారీ "నీళ్ళు, నీళ్ళు" అంటుందామె. (472)
.
మానవసంబంధాలకు చెందిన ఒక ఉదాత్త దృశ్యమది. అవకాసం వచ్చింది కదా అని వడ్డాణం కావాలనో, వెండి పట్టీలు కావాలనో కోరుకోకుండా ఉత్తనీళ్ళు అడగటంలో అమాయకత్వం కన్నా పరిస్థితులను అర్ధం చేసుకొని సర్దుకుపోవటం అనే గుణమే కనిపిస్తుంది. ఆనాటి సమాజంలో vertical లేదా horizontal mobility కి అవకాసాలు మృగ్యం. పుట్టిన వర్ణము, ఆ వర్ణానికి స్మృతులు నిర్ధేశించిన స్థానము తప్ప వేరే రకంగా బ్రతికే వీలు లేదు. వీటికి తోడు జీవితాలను అతలాకుతలంచేసే కరువుకాటకాలు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు.
ఇన్ని ఉన్నప్పటికీ ఆనాటి ప్రజలు ఉన్నంతలో ఆత్మగౌరవంతో సంతోషంగా జీవించారని ఈ గాథలు సాక్ష్యమిస్తాయి.

బొల్లోజు బాబా

No comments:

Post a Comment