(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. )
సప్తశతి గాథలు భౌగోళికంగా దక్కను భూభాగానికి చెందినవి. ఉత్తర భారతదేశంలో స్థిరపడిన ఆర్యనైజేషన్ క్రమక్రమంగా దక్షిణభారతదేశానికి విస్తరిస్తూ వస్తున్న కాలంలో సప్తశతీగాథలు వ్రాయబడ్డాయి. పరిపాలన, సామాజిక, ఆర్ధిక, మతం, సాహిత్యం, కళలు లాంటి అన్ని రంగాలు ఆర్యనైజేషన్ అనే మూసలోకి ఒదిగిపోతున్న లేదా బలవంతంగా ఒదిగించబడుతోన్న కాలమది. (History of andhras p. no 41).
గాథాసప్తశతి కాలానికి బౌద్ధజైనాలు ప్రధాన మతాలుగా ఉండేవి. సప్తశతి లోని గాథలు ప్రాకృతభాష లో వ్రాయబడినవి. ఆ భాష బౌద్ధమతానికి ఆలవాలంగా ఉన్న కారణంగా వైదిక ప్రచారకులు ఆ భాషలో ఉన్న పుస్తకాలను తగలపెట్టారు. ఆ మారణక్రతువు నుంచి గాథా సప్తశతి ఎలాగో తప్పించుకొంది. (శ్రీశాలివాహన గాథాసప్తశతీసారము పేనం. 12). కానీ నేడు మనకు లభిస్తున్న గాథలలో బుద్ధదేవుని ప్రస్తావన పెద్దగా కనిపించదు. బహుసా తరవాతక్రమంలో తొలగించబడి ఉండవచ్చు. కాగా వైదికసంస్కృతికి చెందిన పశుపతి, గౌరి, రుద్ర, పార్వతి, లక్ష్మి, నారాయణుడు లాంటి దేవుళ్లప్రస్తావన పదే పదే కనిపిస్తుంది.
హిందూమత ప్రధాన లక్షణమైన వర్ణ వ్యవస్థ సప్తశతి గాథలలో లేదు. ఈ గాథలన్నీ గ్రామీణజీవితానికి సంబంధించినవి కనుక అప్పటికి ఇంకా వర్ణవ్యవస్థ గ్రామాలలోకి చొచ్చుకుపోలేదని భావించవచ్చు. స్త్రీలు స్వేచ్ఛను కలిగి ఉండి సమాజంలో ప్రముఖపాత్ర వహించారని ఆనాటి శాసనాల ద్వారా తెలుస్తుంది. అది గాథలలో కూడా ప్రతిబింబించింది. శృంగారం పురుషార్ధంగా చెప్పబడింది. బహుభార్యత్వం ఉంది. సతీసహగమనమూ ఉంది. వైదిక సంస్కృతి క్రమక్రమంగా హిందూమతంగా స్థిరపడుతూన్న కాలం ఈ గాథలలో నిక్షిప్తం చేయబడింది. ఈ గాథలన్నీ ఆనాటి సమాజంలోని సామాన్యుల జీవితానుభవాలు.
గాథాసప్తశతి శివస్తుతితో మొదలై శివుని మంగళ స్తుతితో ముగుస్తుంది. రెండు గాథలలో పార్వతీపరమేశ్వరుల అన్యోన్యదాంపత్యం ధ్వనిప్రధానంగా కనిపిస్తుంది.
అర్ఘ్యమివ్వటానికి అర్ధనారీశ్వరుడు
గంగను చేతిలోకి తీసుకొన్నప్పుడు
అసూయతో ఎరుపెక్కిన గౌరీదేవి మోము
దోసిటిలో కమలమై ప్రతిబింబించింది.
ఆ అంజలి జలాలకు వందనమిడు. (1)
.
ఈశ్వరునికి శిరస్సుపై గంగ, దేహంలో సగభాగమై పార్వతీదేవి ఉన్నారు. జానపద సాహిత్యంలో “గంగా గౌరీ సంవాదం” పేరిట పాటలు ఉన్నాయి. ఈశ్వరుడు సంధ్యావందనం చేసే సమయంలో “గంగను” చేతిలోకి తీసుకోవలసి వచ్చినపుడు, పార్వతీదేవి ఏవిధంగా కనిపించిందో అని ఈ ప్రాచీనకవి చేసిన ఊహ ఎంతో అందంగా ఉంటుంది.
***
సంధ్యవార్చగ దోసిలిలో తీసుకొన్న నీటిలో
ప్రతిఫలిస్తున్న గౌరీదేవి ముఖాన్ని చూసి
మంత్రం మరచిపోయి ఊరకనే పెదవులు కదుపుతున్న
శివునికి నమస్కరించు. (700)
.
ఇది గాథాసప్తశతిలోని చివరి గాథ. హాలుని విరచితము. ఇదొక మంగళస్తుతి. భార్యాభర్తలు ఒకరిలో ఒకరు లీనమై ఆదిదంపతుల్లా ఒకరిపట్ల ఒకరు అనురాగంతో కలసిమెలసి జీవించాలని చెపుతున్నాడు. అంతటి ప్రేమమూర్తి అయిన శివునికి నమస్కరించమంటున్నాడు. మొదటి చివరి గాథలు పార్వతీపరమేశ్వరుల అర్ధనారీశ్వరలక్షణాన్ని ప్రధాన అంశంగా చేసుకొని చెప్పబడినవి. అర్ధనారీశ్వరత స్త్రీపురుషుల అన్యోన్యతకు సంకేతం.
***
.
కొత్తగా కాపాలిక మతం తీసుకొన్న ఆ యువతి
తన ప్రియుని చితాభస్మాన్ని ఒంటిపై ఎంత పూసుకొన్నా
తనివి తీరటం లేదు సరికదా
గత అనుభవాలు స్మరణకు వచ్చి శరీరం పులకరిస్తోంది (408)
.
కాపాలిక మతం శైవానికి సంబంధించిన ఒక సంప్రదాయం. ఇది అతి ప్రాచీనకాలంనుండి పదమూడవ శతాబ్దం వరకూ ఆంధ్ర, మహరాష్ట్ర ప్రాంతాలలో ప్రబలంగా ఉండేది. ఈ మతాన్ని అవలంబించేవారు ఒంటినిండా చితాభస్మాన్ని పూసుకొని, ఒక చేతిలో కపాలాన్ని, మరొక చేతిలో త్రిశూలాన్ని ధరించి భిక్షాటన చేస్తారు. మధ్యసేవనం, శృంగారం, తాంత్రిక పూజలు, మనుషులను బలిచ్చి ఆ మాంసాన్ని భక్షించటం లాంటి క్రతువుల ద్వారా శివైక్యం పొందవచ్చునని ఈ మతస్తుల విశ్వాసంగా ఉండేది. ఇహలోక సుఖాలే మోక్షమార్గమని వీరి నమ్మకం.
.
బ్రహ్మదేవుని శిరస్సును ఖండించిన శివుని వలె వీరు కూడా పన్నెండేళ్లపాటు తపస్సు చేసి ఒక బ్రాహ్మణుడిని బలి ఇవ్వటాన్ని ఒక ఆచారంగా పాటించేవారు. ఇలాంటి జుగుప్సాకర పద్దతులవలన కాపాలికామతం ఇతర మతాల కోపానికి గురయ్యేది. కాలక్రమేణా కాపాలికా మతం కొన్ని సంప్రదాయాలను త్యజించుకొని, నేటికీ అఘోరాల రూపంలో అక్కడక్కడా పాటించబడుతూనే ఉన్నది.
పై గాథ కాపాలికా మత ఆచారాలను ప్రస్తావించే మొట్టమొదటి చారిత్రిక ఆధారం. ఈ గాథలో ప్రియుని చితాభస్మం ఒంటికిపూసుకోవటం ఒక పార్శ్వమైతే, అతని చితాభస్మాన్ని తాకగానే అతనితో గడిపిన అనుభవాలు జ్ఞప్తికి వచ్చి శరీరం పులకరించటం మరొక పార్శ్వం. పారడాక్సికల్ మానవానుభవపు వ్యక్తీకరణకు ఈ గాథ ఒక పరాకాష్ట.
.
ఈ గాథలో గమనించాల్సిన మరొక అంశం ఏమిటంటే మతవిశ్వాసాల మార్పిడి చేసుకొనే స్వేచ్ఛను కలిగి ఉండటం. హిందూధర్మం లోని క్రతువులలో కులీన స్త్రీలకు, శూద్రులకు పెద్దగా స్థానం లేకపోవటంచే అప్పట్లో వీరు బౌద్ధం, జైనం, శాక్తేయం, కాపాలికా, చార్వాకం వంటి ఇతర మతసాంప్రదాయాలను అనుసరించేవారు.
.
ఆనాటి సమాజంలో మతస్వేచ్ఛ ఉండేదని పై గాథద్వారా తెలుస్తుంది. ఎప్పుడైతే వైదిక సంస్కృతి హిందూ మతంగా మారి చాతుర్వర్ణ వ్యవస్థను స్థిరీకరించుకొందో- కొత్తగా హిందూమతంలోకి వచ్చే వ్యక్తిని ఏ వర్ణంలోకి తీసుకోవాలో రాసుకోకపోవటం వల్ల దాంట్లోంచి బయటకు పోవటమే తప్ప లోనికి వచ్చే మార్గం మూసుకుపోయింది. (ఇంకా ఉంది)
బొల్లోజు బాబా
No comments:
Post a Comment