Tuesday, July 14, 2020

సప్తశతి గాథలలో సామాజిక వ్యవస్థ – పార్ట్ 5


(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు)
***
వేట
సప్తశతి గాథలద్వారా వ్యవసాయం తరువాత ఎక్కువమందికి ఉపాధిని ఇచ్చిన వృత్తిగా వేటను గుర్తించవచ్చును. వింధ్యపర్వతాటవులలో పుళిందులు నివసించేవారు. వీరు అక్కడ లభించే వివిధ అటవీఉత్పత్తులను సేకరించి సమీప గ్రామాలలో విక్రయించేవారు. ఈ గాథలలో వచ్చే వేటగాని ప్రస్తావనలు ఎక్కువగా భార్యపట్ల మిక్కిలి అనురాగాన్ని చెప్పే సందర్భాలు.
.
వర్తకుడా!
నీకు ఏనుగు దంతాలు, పులిచర్మాలు
ఇదివరకట్లా ఎలా సరఫరా చేయగలం?
కొత్తకోడలు వయ్యారంగా పిరుదులు
తిప్పుకుంటూ ఇంట్లో తిరుగుతూంటే! (951)
ఇండియా ఎగుమతి చేసిన ఏనుగుదంత ప్రతిమలు నేటికీ గ్రీకు రోమను శిథిలాలలో లభిస్తున్నాయి. పాంపేలో లభించిన ఒకటో శతాబ్దానికి చెందిన Pompeii Lakshmi (లక్ష్మిదేవి కాదు యక్షిణి) దంతప్రతిమ శాతవాహనుల రాజ్యానికి చెందినదిగా గుర్తించారు. పై గాథలోని వేటగాడే Pompeii Lakshmi ప్రతిమకు వాడిన ఏనుగుదంతాన్ని సేకరించి ఉంటాడని అనటం శృతిమించిన కల్పన కావచ్చేమో కానీ ఆ ఊహే గమ్మత్తుగా అనిపిస్తుంది.
గాథలోని చమత్కారాన్ని, దాంపత్యానురక్తిని పక్కన పెడితే - రెండువేల ఏండ్లనాటి సమాజంలో కూడా దళారి వ్యవస్థ ఉన్నట్లు గుర్తించవచ్చు. వీరు అడవులలో నివసించే గిరిజనుల ఇండ్లవద్దకే వచ్చి వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి నగరాలలో అమ్ముకొనేవారని తెలుస్తుంది.
***
.
ఊరి మధ్యలో అందరిముందూ ఆ విలుకాడు
బరువైన విల్లును చెక్కి చిన్నదిగా చేస్తున్నప్పుడు
మా అత్త
మొగుడుపోయినప్పటికంటే ఎక్కువ శోకాలు పెట్టింది (119)
విలుకాడు పెళ్ళయ్యాక శక్తిహీనుడై అంతకుముందు అవలీలగా ధరించిన విల్లును మోయలేక దానిని చెక్కి చెక్కి చిన్నదిగా చేసినట్లు అనేక వర్ణనలు ఉంటాయి ఈ గాథలలో. ఒక గాథలో అయితే – నా కొడుకు ఇదివరకు ఏనుగును చంపటానికి ఒక్కబాణం పట్టుకెళ్ళేవాడు, నా కోడలు వాడిని పిరికివాడిగా మార్చేసింది; ఇప్పుడు పొదినిండా బాణాలతో వేటకు వెళుతున్నాడు- అంటుందో తల్లి.
మరో గాథలో – ఆ వేటగాని ఇంటిముందు వింటిని చెక్కిన చిత్రికపేళ్ళు గాలికి పైకిలేచి వారి సుఖసంసారాన్ని విజయకేతనంలా ఎగరేస్తున్నాయి- అంటాడో ప్రాచీన కవి.
ఇవన్నీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ సుఖాలు అనుభవించాలని, భాద్యతగా మెలగటం పిరికితనం కాదని తెలియచేస్తాయి.
తనకు లేని సుఖం పొందుతున్నారు అంటూ అని ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని, తన అధికారం చేజారిపోతూండటం వల్లేనని ఏడ్లర్ సిద్దాంతాన్ని - దేన్ని అనువర్తింపచేసుకున్నప్పటికీ అత్తా కోడళ్ళ విరసాలు ఈనాటివి కావు.
***
.
ఉరుము గర్జనలను తలపింపచేసే
తన మగని వింటి నారిధ్వనిని విన్న ఆమె
తన సహ బంధీలుగా ఉన్న రాజవంశస్త్రీలతో
ఇక మీరు కన్నీరు చిందించనక్కర లేదు అన్నది (54)
గాథాసప్తశతి వ్రాయబడిన కాలంలో శాతవాహన సామ్రాజ్యం అనేక రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంది. హాలుడు నాలుగేండ్లు మాత్రమే పాలన సాగించాడు (క్రీశ. 20-24). ఆ తరువాత వరుసగా వచ్చిన నలుగురు రాజులు మొత్తం పన్నెండేళ్ళు మాత్రమే పాలించారు. అదంతా సంక్షోభసమయం. యవనులు, శకులు, పహ్లావాలు లాంటి వివిధ శత్రురాజులు శాతవాహన రాజ్యాన్ని అన్నివైపులనుంచీ ముట్టడించటంతో అది చాలా మేరకు క్షీణించింది. తిరిగి గౌతమీపుత్ర శాతకర్ణి హయాంలో పునర్వైభవం పొందింది. (క్రీశ 103-127)
ఈ గాథలో రాజకుటుంబ స్త్రీలు బంధీలుగా ఉన్నారని చెప్పటం ఆనాటి రాజకీయ సంక్షోభాన్ని కళ్లకుకడుతుంది.
ధనుష్టంకారావాన్ని చేసిన విలుకాడి వీరత్వాన్ని చెపుతున్నట్లు పైకి కనిపించినా, భర్త పరాక్రమంపై సంపూర్ణ విశ్వాసం కలిగిన ఒక స్త్రీ, సాటి బంధీలను ఓదార్చటం అనే గొప్ప మానవీయ కోణాన్ని కూడా అంతే బలంగా ప్రకటిస్తుందీ గాథ. Image may contain: 2 people
***
.
ఆడుజింకకు కాపుగా నిలిచింది మగజింక
బాణాన్ని ఎదుర్కునేందుకు.
అది గమనించిన ఆడుజింక మగజింకకు అడ్డంగా నిలిచింది
కన్నీళ్ళతో తడిచిన విల్లును క్రిందకు దించాడా విలుకాడు. (603)
సాటిమనిషికొరకు ప్రాణాలివ్వటం అనేది ఒక ఉదాత్తమైన చర్య. దాంపత్యంలో ఉండే వ్యక్తులు కూడా ఒకరి కొరకు మరొకరు అన్నట్లుగా కలిసిమెలసి జీవించాలని పై గాథ చెపుతూంది. జంతువులే అలా ఉంటున్నాయి, అలాటి జంట అన్యోన్యతను చూసిన కిరాతుడే కన్నీరుపెట్టుకొంటున్నాడు అని చెప్పటంలోని విరోధాభాస ఆ ఉద్వేగాన్ని ఉచ్ఛస్థితికి చేర్చి గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.
(ఇంకా ఉంది)
బొల్లోజు బాబా

No comments:

Post a Comment