Tuesday, July 14, 2020

సప్తశతి గాథలలో మత ప్రస్తావనలు – పార్ట్ 3


(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. )
***
.
చేతికి ఆభరణముగా ఉన్న పామును చూసి
పెండ్లికూతురు భయపడుతోందని గ్రహించిన
పరమశివుడు దాన్ని పైపైకి తోస్తున్నపుడే
పార్వతి సౌభాగ్యాన్ని చెలులు గ్రహించారు (69)
.
దేవుళ్ళను తమ సాటిమానవులుగా భావించి ప్రేమించటం, కోపగించుకోవటం, అలగటం, దూషించటం వంటి అనేక ప్రక్రియలలో భక్తులు తమ ఆరాధనను ప్రకటించుకొంటారు. ఎనిమిదిరకాల భక్తి విధములలో ఇలాంటి భక్తి భాగవతవాత్సల్యముగా చెప్పబడింది. ఈ రకమైన ధోరణి హిందూ సంస్కృతిలో కనిపించే విశిష్టగుణం కావొచ్చు.
పై గాథలో శివపార్వతుల కల్యాణం ఏదో మన ఇంట్లో జరిగినట్లు, అక్కడ చూసిన ఒక ఘటనను బట్టి కొత్తదంపతుల దాంపత్యం ముందుముందు ఎంతో అన్యోన్యంగా ఉంటుంది అని చేసిన ఊహ రమ్యంగా ఉండటమే కాక- ఒక మతానికి ప్రతినిధిగా ఉండే దేవుడిని ఆనాటి ప్రజలు ఎంత క్రిందకు దింపి, ప్రేమతో సొంతం చేసుకొన్నారో అనే భావన అచ్చెరువు కలిగిస్తుంది.
***
.
ఒకప్పుడు యువకులు ప్రేమోద్రేకంలో
నా తలకింద దిండుగా ఉంచిన ఆ గణేషుని విగ్రహానికే
నేను నిత్యం నమస్కరిస్తున్నాను.
దిక్కుమాలిన వార్ధక్యమా…. నీకు సంతోషమే కదా! (372)
.
పవిత్రమైన మత భావనలను ఆనాటి ప్రజలు ఏమేరకు ఆచరించారో పై గాథలో తెలుస్తుంది. కన్ను,మిన్నూ కానని యవ్వనకాల ఉద్రేకాలనుంచి మానవజీవితం చేసిన ప్రయాణంగా కూడా దీన్ని అర్ధం చేసుకోవచ్చు. చివరి వాక్యంలోని వ్యంగ్యాన్ని వార్ధక్యపు నిస్సహాయత అనుకోవాలో లేక కాలగమనం వల్ల వచ్చిన పరిణితి అనుకోవాలో పఠితకే విడిచిపెట్టేస్తాడు ఆ ప్రాచీన గాథాకారుడు. ఈ గాథలోని భావం మానవజాతి ఉన్నంతవరకూ, పశ్చాత్తాపం పొందిన ప్రతి సందర్బంలోనూ మనిషిని వెంటాడే తీరుతుంది.
***
.
చండాలుని ఇంటిలో వెలిగే అగ్నే
యజ్ఞవాటికలోను వెలుగుతుంది
స్థానాన్ని బట్టి వ్యక్తుల్ని తృణీకరించరాదు. (227)
.
పై గాథలో చండాలుడు, యజ్ఞకాండల ప్రస్తావన ఉంది. క్రీపూ.450 నాటికే సమాజంలో అస్పృశ్యత ప్రవేసించింది. ఈ అస్పృశ్యత క్రీశ.450 వరకూ చండాలురకే పరిమితమై ఉండేది. ఇతరులకు లేదు. శూద్రులలో అంతర్వివాహాలు జరిగేవి. క్రీశ 950 నాటికి హైందవేతర మతాలకు చెందిన వారిపట్ల, నిమ్నకులస్థులపట్ల అస్పృశ్యత విస్తరించింది. పెళ్ళిల్లు స్వజాతిలోనే జరుపుకోవటం మొదలైంది. క్రీశ 1050 నాటికి ఆహారాదుల్లో అంటు, స్వజాతి, స్వవర్గంలోనే పెళ్ళిళ్ళు జరిగేవి. క్రీశ 1150 నాటికి హిందువులు - స్వదేశీ బౌద్దువులు, ముస్లిములు, నిమ్నకులస్థుల పట్లా అస్పృశ్యత బలంగా పాటించేవారు. క్రీశ 1350 నుంచి బౌద్ధం పేరు వినిపించదు. హిందూ ఇస్లామ్ లే ముఖ్యమతాలు. (రుగ్వేద ఆర్యులు – రాహుల్ సాంకృత్యయన్ - కల్లూరి భాస్కరంగారి సౌజన్యంతో)
అస్పృశ్యతాభావన పరిణామ క్రమాన్ని గమనించినట్లయితే, సప్తశతీకాలానికి చండాలుడు మాత్రమే అంటరానివాడు. పై గాథ అంటరానితనాన్ని నిరసిస్తుంది. ఇది సిద్ధాంతరీత్యా సర్వమానవ సమానత్వాన్ని బోధించిన బౌద్ధ, జైన మతాల భావజాలం.
***
గాథాసప్తశతి కాలానికి జైనమతం కూడా మంచి స్థానాన్ని కలిగి ఉంది. కాని దాని ప్రస్తావన ఎక్కడా కనిపించదు.
గాథాసప్తశతి లానే ప్రాకృతభాషలో వ్రాయబడిన మరికొన్ని శతకాలలో వజ్జలగ్గ, గాహారయనకోశ (Gaahaarayanakosa) ముఖ్యమైనవి. వజ్జలగ్గ సంకలన కర్త జయవల్లభుడు. ఇతను జైన మతస్థుడు. ఇది కూడ ఏడువందల గాథలు కలిగిన సంకలనము. గాహరయనకోశము పన్నెండో శతాబ్దానికి చెందిన ఎనిమిది వందల గాథల సంకలనము. దీనిని సంకలనపరచిన జినేశ్వరసూరి జైనుడు. వజ్జలగ్గ లోని గాథలలో వందవరకూ గాహరయనకోశములో పునరుక్తమయ్యాయి. ఈ రెండిటినీ హాలుడు సేకరించిన సప్తశతిగాథలతో పోల్చినపుడు మొత్తం 55 గాథలు పునరుక్తం అయ్యాయి. ప్రాకృత గాథాకారులు కొంతమేరకు ఒకే దృక్ఫథాన్ని కలిగి ఉన్నారని భావించవచ్చు.
ప్రాకృతభాషలో వ్రాయబడిన జైన సాహిత్యం సంస్కృత సాహిత్యానికి సమాంతరంగా నడిచింది. ప్రాకృతభాష ప్రజలభాష, సంస్కృతం పండితుల భాష. ప్రాకృత రచయితలు ప్రజలతో మమేకం అయి సామాన్యజనాల నాడిని పట్టుకొని వారి సుఖదుఃఖాలను తమ వ్రాతలలో ప్రతిబింబింపచేసారు. అందుకనే వీరి వ్రాతలు జీవితానికి దగ్గరగా ఉంటాయి, ఊహాలోకాలలో విహరించవు. కాళిదాసు, దండి, భవభూతి లాంటి కవులు ప్రాకృతభాషలోని వర్ణణలను యధేచ్ఛగా వాడుకొన్నారు. భామహుడు, రుద్రటుడు, ఆనందవర్ధనుడు ఇంకా తదనంతర ఆలంకారికులు సుమారు 2800 ప్రాకృత గాథలను ఉదాహరణలుగా వాడుకొన్నారంటే, అప్పట్లో ప్రాకృత సాహిత్యం ఏమేరకు సాహిత్యలోకాన్ని ప్రభావితం చేసిందో ఊహించుకొనవచ్చును. (Studies in Jain Literature p.no 478).
ఇక గాథాసప్తశతిలోని ఏడువందల గాథలలో 44 హాలుని విరచితములని, మిగిలిన వాటిని సుమారు మూడువందలమంది వివిధ గాథాకారులు రచించినట్లు గుర్తించారు. వీటిలో ఎక్కడా జైన మత ప్రస్తావనలు కనిపించకపోయినప్పటికీ ఆ గాథలను సృజించిన వారిలో జైనులు ఉండే ఉంటారన్న ఊహ సత్యదూరం కాబోదు.
(తదుపరి - గాథాసప్తశతిలో వివిధ వృత్తులు)
బొల్లోజు బాబా

No comments:

Post a Comment