Tuesday, July 28, 2020

సప్తశతి గాథలలో స్త్రీల వస్త్రధారణ - part 11

సప్తశతి గాథలలో స్త్రీల వస్త్రధారణ - part 11
(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు)
ప్రాచీన భారతదేశపు స్త్రీల వస్త్రధారణపై చరిత్రకారులకు ఈనాటికీ స్పష్టమైన అవగాహన ఏర్పడలేదు. లభిస్తోన్న పరస్పర విరుద్దమైన ఆధారాల వలన భిన్న అభిప్రాయాలు నెలకొని ఉన్నాయి.
1. వేదాలలో దేహానికి పై భాగంలో ధరించే వస్త్రాన్ని vasahantaram అని క్రిందిభాగంలో ధరించేదానిని paridhanam అనే ఉంది తప్ప స్త్రీపురుషులకు వేరు వేరు దుస్తులున్నట్లు చెప్పబడలేదు.
2. స్త్రీలు తమ నాభి కనిపించకుండా పాదాలవరకు ఉండే దుస్తులను ధరించాలని ధర్మశాస్త్రాలు (శంఖస్మృతి - క్రీపూ. 600-200) బోధించాయి.
3. క్రీపూ ఒకటో శతాబ్దానికి చెందిన తిరుక్కురళ్ లో "ఆ యువతి చనుధ్వయాన్ని కప్పుతోన్న వస్త్రం, మదమెక్కిన ఏనుగు కళ్లకు కట్టిన గంతల వలె ఉన్నది" (Kural No : 1087) అనే వాక్యం ద్వారా ఆనాటి స్త్రీలు తమ వక్షోజాలను రవికెలతో కప్పి ఉంచేవారని తెలుస్తుంది.
పైన చెప్పిన మూడు అంశాలకు విరుద్దంగా మధ్య, దక్షిణ భారతదేశ ప్రాచీన చిత్రాలు, శిల్పాలలో స్త్రీల వక్షద్వయం ఏ అచ్ఛాదనా లేకుండా ఉండటాన్ని గమనించవచ్చు. ఉదాహరణకు
* అజంతా కుడ్యచిత్రాలలో అనేక బొమ్మలలో స్త్రీలకు రవికెలు లేవు. (2nd century BC to 4 century AD)
* సాంచి స్తూపం పై ఉన్న స్త్రీ శిల్పాల పైభాగం నగ్నంగా ఉండి క్రిందిభాగంలో వడ్డాణం, చీరలాంటి అమరిక కనిపిస్తుంది. (1st Century BC)
* కొన్ని అమరావతి శిల్పాలలో కూడా స్త్రీ శరీర పైభాగం అనాచ్ఛాదితంగా ఉంటుంది (1st or 2nd century AD)
.
ప్రాచీన భారతీయ శిల్పాలు Top-less గా ఉండటంపై వివిధ ప్రతిపాదనలు చేయబడ్డాయి.
1. భారతదేశానికి ముస్లిములు రాకముందు ఆనాటి సమాజంలో అర్ధనగ్నంగా ఉండటం ఆక్షేపణీయం కాదని, అందుకనే ప్రాచీన భారతదేశపు వివిధ కళాకృతులలో స్త్రీ ప్రతిమలు అర్ధనగ్నంగా ఉంటాయని Cunningham అభిప్రాయపడ్డాడు. కానీ క్రీపూ ఒకటో శతాబ్దానికి చెందిన గాంధార బౌద్ధ శిల్పాలలో (Greeco-Roman Style) స్త్రీ మూర్తులు చీర, మోచేతులవరకూ ఉండే రవికెను కలిగిఉండటం, అయిదో శతాబ్దానికి చెందిన గంగామాత శిల్పం రవికెలాంటి పట్టీని ధరించిఉండటం లాంటి విషయాలు Cunningham వాదనను బలహీనపరుస్తాయి.
2. శిల్పాలు అర్ధనగ్నంగా చెక్కబడినా, వాటికి రంగులు లేదా సున్నం పూత దుస్తులను ఏర్పరచి ఉండచ్చని Havell ప్రతిపాదించాడు. అనేక శిల్పాలలో, ముడుతలతో, అల్లికలతో కూడిన చీర అకారము స్పష్టంగా కన్పిస్తుంది కానీ రవికెలు ధరించినట్లు ఉండదు. అందమైన కంఠాభరణాలు కూడా ఉంటాయి. సున్నంపూత అవసరపడదు. అంతే కాక అజంతా కుడ్యచిత్రాలలో స్త్రీల వక్షభాగం నగ్నంగా ఉంటుంది. ఆ లెక్కన Havell ప్రతిపాదన అర్ధరహితమని భావించవచ్చు.
3. సాంస్కృతికంగా రవికెలు, చీరలు ధరించటం ఉత్తర భారతీయ సంస్కృతి అని, దక్షిణభారత స్త్రీలు అక్కడి వాతావరణ ఉష్ణోగ్రతలకు, విశ్వాసాలకు అనుగుణంగా కొద్దిపాటి దుస్తులే ధరించేవారని ఒక వాదన బలంగా వినిపిస్తుంది. పద్దెనిమిదో శతాబ్దం వరకూ కేరళలో దేవుని ఎదుట తప్ప మరెక్కడా ఛాతీని కప్పిఉంచరాదనే విశ్వాసం కారణంగా- రాజవంశ స్త్రీలతో సహా అందరూ రవికలు ధరించకపోవటాన్ని దీనికి ఆధారంగా చెబుతారు.
4. కులీన వర్గ స్త్రీలు రవికలు ధరించేవారని క్రిందితరగతి స్త్రీలు శరీర పైభాగంపై ఏ ఆచ్ఛాదనము లేక నగ్నంగా ఉండేవారని మరొక వాదన కలదు. కేరళలో ఇరవయ్యవ శతాబ్ద ప్రారంభంలో కులీన స్త్రీలు రవికలు ధరించగా, దిగువతరగతి స్త్రీలు అర్ధనగ్నంగా ఉండేవారని ఈ వాదనకు ఆధారంగా చూపుతారు. భారతదేశం అంతా అలా జరిగి ఉంటుందా అని అనుకోవటానికి వీలుపడదు ఎందుకంటే చాలా అజంతా చిత్రాలలో రాజవంశ స్త్రీలు రవికలు లేకుండా కనిపిస్తారు. అశోకుడు, అతని భార్యలు అని చెప్పబడిన ఒక శిల్పంలో ఆ రాణులకు రవికలు లేవు. పదో శతాబ్దానికి చెందిన చోళ రాణుల శిల్పాలలో కూడా అనాచ్ఛాదిత చన్నులను చెక్కడం గమనించవచ్చు. మరణించిన వీరుల (వీళ్ళు ఎక్కువగా సామాన్య వ్యక్తులు కావొచ్చు) స్మృత్యర్ధం చెక్కిన వీరగల్లుల లోని స్త్రీ ప్రతిమలు కూడా రవికలు లేకుండానే ఉండటం ఆశ్చర్యం కలిగించకమానదు. స్త్రీలను ఈ విధంగా చెక్కడటం 17వ శతాబ్దం వరకూ కొనసాగింది.
మొత్తం మీద ఏ వాదనా సంపూర్ణమైన సత్యాన్ని ఆవిష్కరించదు. ప్రాచీన భారత స్త్రీల వస్త్రధారణ విషయంలో లిఖిత ఆధారాలు ఒకలా ఉంటే, శిల్పాలు, చిత్రాలకు సంబంధించిన ఆధారాలు మరొక లాగ ఉన్నాయి.
***
సప్తశతి గాథలు ఈ పీటముడిని విప్పటంలో కొంత సహాయపడతాయి. ఆ కాలంలో స్త్రీలు పొడవైన కొంగు ఉన్న చీరలు కట్టుకొన్నారని, కొందరు రవికలు ధరించగా మరికొందరు Top-less గా ఉండేవారని ఈ గాథలద్వారా స్పష్టంగా తెలుస్తుంది.
.
సుందరీ!
నీ ముఖారవిందాన్ని చీర కొంగుతో కప్పిఉంచకు
దేన్ని తాకితే ఎక్కువ సుఖమో
దినకరుడినే తేల్చుకోనీ!
నీ ముఖాన్నా, కమలాన్నా అనేది. (269)
ఇదొక చమత్కార గాథ. ఆమె ముఖం కమలం వలె ఉన్నది అని చెప్పటానికి, కమలాప్తునికే పరీక్ష పెడుతున్నాడీ గాథాకారుడు. పై గాథావర్ణనద్వారా ఆనాటి స్త్రీలు పొడవైన కొంగుకలిగిన చీరలను ధరించేవారని అర్ధమౌతుంది.
***
.
అందగాడా!
నీవు చంద్రుని అన్ని కళలను చూడాలనుకొంటే
ఆమె రవికను మెల్లమెల్లగా పైకి తొలగిస్తున్నప్పుడు
తన ముఖబింబాన్ని తదేకంగా గమనించు. (674)
.
ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంటుంది అని ఎంతగడుసుగా చెపుతున్నాడీ ఈ ప్రాచీనకవి. చంద్రుడు ఒక్కో తిథిన ఒక్కో కళను కలిగి ఉంటాడు. పదహారు తిథులలో పదహారు కళలను ప్రదర్శిస్తాడు. వీటిని షోడశ కళలు అంటారు. పై గాథలో పున్నమినాటి చంద్రుని వలె ప్రకాశించే ఆమె ముఖం, రవికెను పైకి తొలగిస్తున్నప్పుడు చంద్రునిలా క్రమక్రమంగా తెరమరుగై పూర్తిగా రవికతో కప్పబడి అమావాస్యను తలపిస్తుంది అని అర్ధం చెప్పుకొనవచ్చును. ఆనాటి స్త్రీలు రవికెలు ధరించేవారని ఈ గాథ చెబుతుంది.
***
.
ఆ యువతి తన చన్నులను
యువకులకు మచ్చుకు చూపించటానికా అన్నట్లు
నీలంరంగు రవికెను కొద్దిగా తీసిన తలుపులా
కొంచెం తెరచి ఉంచింది (622)
.
బిగుతైన నీలిరంగు రవికె నుండి
బయటకు ఉబికి వచ్చిన ఆమె గుండ్రని పయోధరము
నీలి మేఘాల వెనుకనుంచి తొంగిచూసే
చంద్రబింబం వలె ఉన్నది. (395)
పై రెండు గాథల ద్వారా సప్తశతి కాలపు స్త్రీలు రవికెలు ధరించేవారని నిర్ధారించవచ్చును.
***
ఈ హోలీ పండుగ రోజున
రంగులు అద్దిన చన్నులతో
మద్యం ఎక్కువై ఎరుపెక్కిన కళ్ళతో
కలువపూవులు తురుముకొన్న జడతో
మామిడి చివురు దోపుకొన్న కొప్పుతో
ఓ యువతీ!
నువ్వీ గ్రామానికే ఒక శోభ. (826)
పై గాథ అనాటి సమాజంలోని ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేస్తుంది. మామిడి చివుర్లను చెవుల వెనుక ఉంచుకొనుట యువకులకు ఇచ్చే ఒక సంకేతం. మామూలు రోజులలో స్వైరిణిలను గుర్తుపట్టటానికి అదొక చిహ్నం. అందరూ హాయిగా ఆటపాటలతో క్రీడించే హోలీ రోజున మామిడి చివురు ధరించటం, సారాయి సేవించటం సాధారణం అనుకోవాలి. ఈ గాథలో రంగులు చల్లిన చన్నులు అన్న పదం ద్వారా ఆ స్త్రీ రవిక ధరించిలేదని భావించాలి.
**
పండగ కొరకు దంచుతున్న పిండి ఎగిరిపడి
తెల్లగా మారిన ఆమె చన్నులు రెండూ
కలువపూవు లాంటి ఆమె మొఖం నీడలో
ముడుచుకు కూర్చున్న హంసల్లా ఉన్నాయి (626)
పై వర్ణన ముందు ఆముక్తమాల్యదలోని "పిండీకృత శాటులన్" పద్యం వెలవెలపోతుంది. ఈ గాథద్వారా ఆ యువతి రవిక ధరించలేదని నిర్ధారించవచ్చును.
***
సప్తశతిలో చాలా గాథలలో వక్షోజాలను వర్ణించినా పైన ఉదహరించిన గాథలలో ఆరుబయట Top-less స్థితి స్పష్టంగా చెప్పబడింది.
స్త్రీలు రవిక ధరించాలా వద్దా అనేది ఒకప్పుడు ఐచ్చికంగా ఉండేదని భావించవచ్చు. ప్రాంతాన్ని, కాలాన్ని (శీతాకాలం), ఆర్ధిక స్థోమతను, అవసరాలను (బిడ్డకు పాలు ఇవ్వటం, విటులను ఆకర్షించటం) బట్టి ఆనాటి స్త్రీలు వివిధరకాల వస్త్రధారణ చేసుకొని ఉంటారు. అంతే కాక శిల్పాలు, చిత్రాలలో కళాసౌందర్యం ఉట్టిపడటానికి అర్ధనగ్నంగా చిత్రించి ఉండవచ్చునన్నది కూడా కాదనలేం.
బొల్లోజు బాబా


























సప్తశతి గాథల భౌగోళికత - పార్ట్ 12

సప్తశతి గాథల భౌగోళికత - పార్ట్ 12
.
ఒకటో శతాబ్దానికి చెందిన శాతవాహన వంశానికి చెందిన హాలచక్రవర్తి గాథాసప్తశతిని సంకలనపరిచాడు. సప్తశతి గాథల భౌగోళికతను గుర్తించటానికి శాతవాహన సామ్రాజ్యస్వరూపాన్ని అర్ధం చేసుకోవలసి ఉంటుంది.
ఉత్తరాదికి చెందిన మౌర్యవంశపాలకులకు సామంతులుగా ఉండి పరిపాలన సాగించిన శాతవాహనులు క్రీపూ 232 లో అశోకుని మరణం తరువాత స్వతంత్ర్యం ప్రకటించుకొని (శ్రీముఖుడు) సొంతంగా రాజ్యం ఏలటం మొదలుపెట్టారు. సాతవాహనుల Home Town ఎక్కడ అనేదానిపట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీరు తెలంగాణలోని కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పాలించినట్లు Ajay Mitra Shastri మొదట్లో ప్రతిపాదించినా తరువాత ఆయన ఆ వాదనను వెనక్కు తీసుకొన్నారు. James Burges, Barnet వంటి చరిత్రకారులు శాతవాహనుల మొదటి రాజధాని శ్రీకాకుళం, తరువాత అమరావతి పిదప ప్రతిష్టానపురం గా పేర్కొన్నారు. P.T Srinivasa Iyyangar VV Mirashi లు వీరు మొదట ప్రతిష్టానపురం, తరవాత అమరావతిగా పేర్కొన్నారు.

కోటిలింగాల ఇంకా సమీప ప్రాంతాలలో శాతవాహనులకు చెందిన విలువైన నాణాలు దొరికాయి. వీటి ఆధారంగా శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల అని చెప్పటానికి ఖారవేలుని హాతిగుంఫ శాసనము, నాసిక్ శాసనాలు, అమరావతి శాసనాలు, ఇటీవల కర్ణాటకలో బయటపడ్డ కనగనహళ్ళి శాసనాలు ప్రతిబంధకమౌతాయి. ఎందుకంటే వాటిలో ఎక్కడా దీని ప్రస్తావన లేదు. బహుసా మెగస్తనీస్ చెప్పిన 32 మహా నగరాలలో కోటిలింగాల కూడా ఒకటి కావొచ్చు.
శాతవాహనులు తూర్పు దక్కను ప్రాంతంలో ఉద్భవించి ఉండవచ్చని ఆర్.జి. భండార్కరు వంటి కొందరు చరిత్రకారులు భావించారు. ఇది కృష్ణాజిల్లాలో ఉన్న శ్రీకాకుళం అయి ఉండవచ్చునని ఒక ఊహ. దీనిప్రకారం శాతవాహనులు మొదట్లో కృష్ణా, గోదావరి నదుల డెల్టా ప్రాంతంలో ఉద్భవించి ధరణికోట కేంద్రంగా పాలన సాగించారు. తరువాత మహారాష్ట్ర, పశ్చిమ, మధ్య భారతదేశానికి విస్తరించి, జన్నూరు (పూనె), ప్రతిష్టానపురం (మహారాష్ట్ర) లను రాజధానులుగా చేసుకొన్నారు. శాతవాహనులు అయిదు శాఖలుగా విడిపోయారు. వీటిలో ఒకటి కుంతల రాజ్యం. ఇది నేటి కర్ణాటక రాష్ట్రంలో కలదు. హాలుడు కుంతల రాజు గా చెప్పబడ్డాడు. ఇతను నాలుగేండ్లు మాత్రమే పాలన సాగించాడు (క్రీశ. 20-24).
క్రీశ. 220 వరకూ వీరి పాలన కొనసాగింది. శాతవాహనులు ఉత్తర దక్షిణభారతదేశ భాగాలను అంటె సుమారు యాభైశాతం భారత భూభాగాన్ని, 450 సంవత్సరాలపాటు పాలించిన ఆంధ్ర రాజులు. ఇంతటి ఘన చరిత్ర మౌర్యులు, గుప్తులు, మొఘలులు చివరకు బ్రిటిష్ వారికి కూడా లేదు.
***
వింధ్యపర్వతాలనుండి తుంగభద్రా నది వరకుఉన్న భారతదేశభూభాగాన్ని దక్షిణాపథం అంటారు. దీనికి పైన ఉన్న ప్రాంతాన్ని ఉత్తరాపథం అని, క్రిందన దక్షిణ దేశం (నేటి తమిళనాడు కేరళలు) గా పిలుస్తారు. శాతవాహనులు నేటి ఆంధ్ర, తెలంగాణ, మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల భూభాగాన్ని ఏకంచేసి పరిపాలన సాగించారు.
సప్తశతి గాథలలో గోదావరి, తపతి, నర్మద/రేవా వంటి నదులు, వింధ్యపర్వతాల యొక్క ప్రస్తావనలు విరివిగా కనిపిస్తాయి. ఉత్తరభారతదేశపు భౌగోళిక చిహ్నాలయిన హిమాలయాలు, గంగ, యమున (ఒక గాథలో మాత్రమే) లాంటివి కనిపించకపోవటాన్ని బట్టి ఈ గాథలు పూర్తిగా దక్షిణభారత ప్రాంతానికి రచనలుగా భావించవచ్చు.
శాతవాహన రాజ్యం తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియన్ సముద్రాలను హద్దులుగా కలిగి ఉండటంచే సముద్ర ఉత్పత్తులైన ముత్యాలు, శంఖాల గురించి చాలా గాథలలో కనిపిస్తుంది.
1. పర్వతాలు
.
వింధ్యపర్వతాలు మధ్యప్రదేష్, రాజస్థాన్, గుజరాత్ లలో విస్తరించిన పర్వతశ్రేణి. సాత్పూరా పర్వత శ్రేణిని కూడా ప్రాచీన రచనలలో వింధ్య పర్వతాలుగానే వర్ణించారు. ప్రాచీన ఉత్తరభారత సంస్కృత సాహిత్యానికి, దక్షిణభారత ప్రాకృత సాహిత్యానికి వింధ్యపర్వతశ్రేణి సరిహద్దుగా నిలిచింది. సప్తశతి వ్రాయబడిన కాలం తరువాత ఈ సరిహద్దు క్రమేపీ చెరిగిపోయింది. శాతవాహనులు ఉత్తర దక్షిణ భారతీయ సంస్కృతులకు వారధిగా నిలిచారు.
.
శాతవాహన రాజులకు సంస్కృతం రాదు అనేది చెప్పటానికి ఒక గాథ ప్రచారంలో ఉంది. ఒకనాడు శాతవాహన రాజు జలక్రీడ సమయంలో రాణిపై నీటిని చల్లినపుడు ఆమె “మా మోదకై స్తాడయ’ (నన్ను నీటితో కొట్టవద్దు) అన్నదట. ఆ వాక్యాన్ని అర్థంచేసుకోలేని రాజు, మోదకాలు (లడ్లు)తో కొట్టమంటున్నదని భావించి- ఓ బుట్టతో లడ్లు తెప్పించాడట. రాణి పకపక నవ్వటం చేత, ఆ అవమానాన్ని భరించలేక ఆ రాజు ఆరునెలలలో సంస్కృతం నేర్చుకొని నిష్ణాతుడయ్యాడట. పై గాథలోని రాజు హాలుడేనని అంటారు. ఈ గాథద్వారా- దక్షిణ భారతదేశ రాజులకు/ప్రజలకు సంస్కృతం రాదని, వారు తొందరలోనే ఆ భాషను నేర్చుకొని నగరీకులు అయ్యారని అర్ధం చేసుకోవాలి. ఈ సాంస్కృతిక మార్పు ఫలితంగా ప్రాకృత, పైశాచి, పాళి భాషలు నశించిపోయాయి.
***
సప్తశతిలో వింధ్యపర్వత ప్రస్తావన ఏడు గాథలలో కనిపిస్తుంది. వింధ్యపర్వతలోయల్లో తిరుగుతున్న నల్లని మబ్బులను పుళిందులు నల్లని ఏనుగుల మంద అని భ్రమించారట; వింధ్యపర్వత సానువులకు కాసేపు అతుక్కొని విడిపోయే మబ్బులు, వింధ్యపర్వతాలు విడుస్తున్న చర్మపుపొరలవలె ఉన్నాయట.
.
కారుచిచ్చువల్ల నల్లబడ్డ వింధ్యపర్వత శ్రేణి
తెల్లని మబ్బులతో కలసి
క్షీరసాగరమధన సమయంలో
ఎగసిపడిన పాలతుంపరలు పడ్డ విష్ణుమూర్తిలా ఉన్నది. (117)
.
వింధ్యపర్వతాల అందాలను వర్ణించే అందమైన గాథ ఇది. వింధ్యపర్వతాలను విష్ణుమూర్తితోను, మబ్బుల్ని పాలచుక్కలతోను పోల్చటం ఎంతో రమ్యమైన భావన.
***
.
వింధ్యపర్వత శిఖరములపైకెక్కి చేసిన యుద్ధములో
క్షతగాత్రుడై ఇంటికి తిరిగి వచ్చిన సంగతి ఎవరూ మాట్లాడకండి
గ్రామపెద్దకు ఇంకా ఊపిరాడుతోంది
ఆ మాట వింటే అవమాన భారంతో ప్రాణాలు వదిలేస్తాడు. (731)
.
పై గాథలో వింధ్యపర్వతాలు ఎక్కి చేసిన యుద్ధం గురించి ప్రస్తావించబడింది. వింధ్యపర్వతాలు దక్షిణాపథానికి పెట్టని కోట. భారతదేశ ఉత్తర పశ్చమప్రాంతాలను పాలించిన - ఇండోగ్రీకులు, సిథియనులు (చైనా), పార్థియనులు,, క్షాత్రపులు (పెర్షియా), కుషానులతో (మంగోలియా)- శాతవాహనులు అనేక యుద్ధాలు చేసారు. ఆ క్రమంలో జరిగిన ఒక యుద్ధాన్ని పై గాథ చెపుతున్నది. యుద్ధంలో గాయపడి ఇంటికి రావటం అవమానకరమని ఆనాటి ప్రజలు భావించేవారని అనుకోవాలి. ఈ సంఘటనలో వర్ణించిన మానవీయకోణం అద్వితీయమైనది.
వింధ్యపర్వతం కాక మందర పర్వత ప్రస్తావన ఉన్నప్పటికీ అది పౌరాణిక వర్ణనగా భావించాలి. అలాగే అనేక గాథలలో మలయపవనాలు ప్రేమోద్దీపన కలిగించినట్లు ఉన్నప్పటికి వాటికి భౌగోళికతను ఆపాదించలేం.
.
2. నదులు
సప్తశతి గాథలలో నర్మద (కొన్ని గాథలలో రేవానది పేరుతో), తపతి, గోదావరి నదుల ప్రస్తావనలు విరివిగా కనిపిస్తాయి.
ఈ నదులు మధ్యప్రదేష్, గుజరాత్ మహరాష్ట్రా, తెలంగాణ, ఆంధ్రప్రదేష్, కర్ణాటక రాష్ట్రాలలో ప్రవహిస్తాయి.
.
ఒప్పుకొంటాను
ఇతర నదులకు కూడా మెత్తని తీరాలు, పక్షుల కూజితాలు
ఇరువైపులా పొడవైన గుబురు వనాలు, చల్లని నీళ్ళు
అన్నీ ఉండొచ్చు కానీ రేవా నది అందాలు వేరే!
నిరుపమానమైనవి. (678)
.
స్వర్గమైనప్పటికీ సొంతఊరుకు సాటిరాదు అంటాడో సినీకవి. మన బాల్య యవ్వనాలతోముడిపడి ఉండే వూరి వాగు, వంకలు, నదీ తీరాల అందాలు ఏనాటికీ నిరుపమానమైనవే.
***
.
ఓసీ నర్మదా!
ఈ రోజు నీవు నీ ప్రియుడైన వరదప్రవాహంతో కూడి
వెదురుపొదలలో నిర్లజ్జగా ఆడిన సరసాలను
నీ భర్త అయిన సముద్రునితో చెబుతాను. (760)
.
Image may contain: text that says "WESTERN SATRAPS Ujjaini Map 7: The Satavahana (Andhra) heartland 150 Bce- 200C 200 Vidisha Sanchi Narmada Baruch 100 miles 100 200kms Tapri Ajanta Nasik Thal Ghat Sopara Kanheri Junnar Nane Ghat Pratisthana Karle Arabian Sea KALINGA Kirishna KONKANA Nagarjunakonda Rajahmundry Amaravati Bay of Bengal"పై గాథ ఏదో బ్లాక్ మెయిల్ వ్యవహారంలా కనిపిస్తున్నప్పటికీ ఆ గాథలోని బిగి ఆశ్చర్యం కలిగిస్తుంది. నదిని స్త్రీగా, సముద్రుడిని పురుషునిగా వారిరువురిని భార్యభర్తలుగా వర్ణించే పద్దతి పౌరాణిక సాంప్రదాయమే. పై గాథలో అందం ఎక్కడ ఉందంటే- సాధారణంగా నది వరదల సమయంలో మాత్రమే పొంగి పొర్లి తీరంపై ఉండే పొదలను ముంచెత్తుతుంది. నదీతీరపు వెదురు పొదలలో యువతీయువకులు సాగించిన స్వేచ్ఛా ప్రణయాలను వర్ణించిన గాథాకారుడు నర్మదా నది కూడా తన వరదప్రియునితో సరసాలాడటానికి వెదురుపొదలలోకి దూరిందనటం ఎలా ఉందంటే- కాల్పనికతకు అంతం అనేది ఎక్కడ ఉంటుంది అని ప్రశ్నిస్తే ఇదిగో ఇక్కడ ఉంటుంది అని ఉదహరించే విధంగా ఉంది.
***
.
గోదావరి రేవు మెట్లు ఎగుడుదిగుడుగా ఉన్నాయనే సాకుతో
ఆమె అతని చాతీకి అతుక్కుపోయింది
అతనుకూడా నిజంగా అదే ఉద్దేశంతో
ఆమెను బలంగా కౌగిలించుకొన్నాడు (193)
.
అందమైన దృశ్యమిది. ఆమెకు అతడంటే ఇష్టం. గోదావరి నీళ్ళరేవు మెట్లు ఎగుడుదిగుడుగా ఉన్నాయనే వంకతో తన ఇష్టాన్ని అతనికి తెలియచేసింది. బహుసా అతనికి కూడా ఆమంటే ప్రేమే కావొచ్చు. ఆమె జారి పడిపోకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే బిగికౌగిలిలో బంధించాడట. గొప్ప తోడుదొంగలు ఇరువురూ…. పట్టపగలే పదిమందిలో పట్టుబడకుండా తమ ప్రేమను ప్రకటించుకొన్నారు.
.
అతని మగసిరికి దక్కిన అదృష్టము
నా ఆడతనం చూపిన బరితెగింపు
ఉప్పొంగి తొంగిచూసిన గోదావరికి ఇంకా
వానాకాలపు రాత్రులకు మాత్రమే తెలుసు (231)
.
పై గాథ రెండువేల సంవత్సరాల నాటిది. కాలగమనంలో ఈ గోదావరి తన ఇసుకతిన్నెల పరుపులపై సుఖించిన ఎన్నెన్ని జంటల రహస్యాలను తన అలల కనులతో చూసిఉంటుందీ!.
***
Image may contain: text that says "Shravasti Gadhasapthasati Geography Satavahana Dynasty First Century Bec Second Century CE Vindhyas Narmada Tapati Madhyapradesh Naneghat junnar Paithan Maharashtra Arabian Sea Godavari Bay of Benga Telangana Karnataka Krishna Amaravathi (Dhanyakataka) Andhra Pradesh"మొత్తం గాథలలో నర్మదా/రేవా నది ప్రస్తావన అయిదు గాథలలో, తపతినది ఒక గాథలో, గోదావరి పన్నెండు గాథలలో కనిపిస్తాయి. ఈ గాథలు ప్రధానంగా గోదావరి నది ప్రవహించే మహరాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందినవిగా నిర్ధారించవచ్చును. ఈ గాథలలో ఎక్కడా సముద్రం, గుర్రాలు, బ్రాహ్మణుల గురించి లేకపోవటం గమనార్హం.
.
పిచ్చిపిల్లా!
యవ్వనం వరదపొంగులాంటిది
పగళ్ళు పరుగులు పెడతాయి
రాత్రులు తిరిగిరావు
ఎందుకు నీకీ పెంకి అలక? (45)
.
పై గాథ ఉత్త సంభాషణ. మగనిమీదో, ప్రియుని మీదో అలిగి దూరంగా ఉంటున్న ఒక అమ్మాయికి, ఆమె అత్తో, స్నేహితురాలో ఇస్తున్న సలహా అది. యవ్వనం వరదపొంగులా వచ్చిపోతుంది, అది ఉన్నప్పుడే జీవితాన్ని అనుభవించు అంటూందామె. ఇందులో తత్వమూ ఉంది, మానవసంబంధాలను ముడివేసే తార్కికతా ఉంది. "వయసుకాస్త ఉడిగినాక మనసుండీ వ్యర్ధమూ" అంటూ ఆత్రేయ చేసిన హెచ్చరికలాంటిది కూడా ఉంది.
.
వరదలో కొట్టుకుపోతున్న
చెట్టుకొమ్మ చివరన గూటిలో ఉన్న తన పిల్లలను
కాపాడాలని వరదను వెంబడిస్తోంది తల్లి కాకి. (202)
.
ఇదొక కరుణపూరిత దృశ్యం. వరదలు జీవనాన్ని అతలాకుతలం చేస్తాయి. వాటి బీభత్సం నదీపరివాహక ప్రాంతాలలో నివసించేవారు మాత్రమే నిక్షిప్తం చేయగలిగే దృష్టాంతం. పై గాథలో వర్ణించబడిన తల్లి కాకి రక్షణకు, మాతృత్వభావనకు సూచిక. ఇది సర్వకాల సర్వావస్థలలోను పశుపక్ష్యాదులలోనే కాదు మానవులకూ వర్తించే సార్వజనీన దృగ్విషయం.
***
సప్తశతి గాథలలో వర్ణించబడిన ప్రదేశాలను బట్టి ఇవన్నీ వింధ్యపర్వతాలకు దక్షిణప్రాంతానికి చెందినవని, నర్మద, తపతి, గోదావరి నదీ తీరప్రాంతానికి చెందినవని భౌగోళికంగా నేటి మహరాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేష్ రాష్ట్రాలకు చెందినవని భావించవచ్చు.
బొల్లోజు బాబా



Wednesday, July 22, 2020

ప్రవహించే వాక్యం - మూడో కన్నీటి చుక్క

శ్రీ సుంకర గోపాల్ ఎంతో ప్రేమ తో "మూడోకన్నీటి చుక్క" కవిత్వం పై కవి సంధ్య రజతోత్సవ సంచికలో చేసిన సమీక్ష. థాంక్యూ గోపాల్ గారు... థాంక్యూ గురువుగారూ
***..
ప్రవహించే వాక్యం - మూడో కన్నీటి చుక్క
బొల్లోజు బాబా గురించి పరిచయం అక్కర్లేదు. ఆకుపచ్చని తడిగీతం, వెలుతురు తెర ద్వారా కవిత్వానికి పరిచయం. "కవిత్వ భాష" అంటూ చాలా సులభశైలిలో కవితా నిర్మాణ రహస్యాలను చేరవేసారు. ఇప్పుడు మూడో కవితా సంపుటి "మూడో కన్నీటి చుక్క" ద్వారా పలకరిస్తున్నాడు. తన కవిత్వంతో పలవరించమంటున్నాడు. మార్మికంగా చెబుతూనే పాఠకులు అందుకొనే కవిత్వాన్ని సిద్దం చేశాడు. సున్నితమైన భాష, కవితాపరమైన నిర్మాణం, చెప్పాలనుకొన్నది చెప్పడం ఈ పుస్తకంలో గమనించదగిన విషయాలు. ఫ్రాగ్మెంట్స్ అదనపు ఆకర్షణ.
ఈ పుస్తకంలో రెండో కవిత "కలలు"
"జీవితం అనే పదునైన కత్తి
కాలాన్ని
ఆఫీసు, అనుబంధాలు, స్వప్నాలుగా
ముక్కలు ముక్కలు చేసి వడ్డిస్తుంది
దినాంతాన
స్వప్నాలు మాత్రమే
మన జేబులో మిగిలే
చివరి చిల్లర నాణేలు"
ఎలాంటి వ్యాఖ్యానం అక్కరలేకుండా 8 వాక్యాల్లో స్పష్టంగా 'జీవితం' లో ఏం మిగులుతాయో చెప్పాడు.
'చక్కగా ప్రేమించుకోక' కవిత ముగింపు వాక్యాలు ఎంత బావున్నాయో చూడండి
/ఒక్కసారిగా అనిపించింది
తిరస్కరించిన తరువాత
ద్వేషించక్కర లేదని
చక్కగా ప్రేమించుకోవచ్చనీ/
జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని చూపుతున్నాడు కవి.
ఇందులో స్త్రీని కేంద్రంగా చేసుకొని కొన్ని కవితలు ఉన్నాయి. "ఏం పని ఉంటుంది నీకూ...." అనే మగవాడి ప్రశ్నకు ఓ రోజు 'స్త్రీ' ఇంటిని పట్టించుకోకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అద్భుతంగా చెప్పాడు.
/ఇల్లు మొత్తం
క్వారీ పక్కన జుత్తు నెరసి
కాంతి నశించిన చెట్టులా ఉంది
అతను ఇంకెప్పుడూ అలా అనలేదు.
కవిత్వంలో సంక్షిప్తతకి బాబా బాగా ప్రాధాన్యం ఇచ్చారు. చాలా గంభీరమైన విషయాల్ని 6 లేదా 8 వాక్యాలలో చెప్పేశారు. అద్భుతమైన వ్యక్తీకరణ బాబా సొంతం.
భూమంటే విద్యుత్ కాంతుల్లో
బెల్లీడాన్స్ చేసే ఆటకత్తె - వాడికి
భూమంటే నొసటన దిద్దుకొనే
ఆకుపచ్చని వీభూతిపండు - వీడికి
యుద్ధానంతరం
భూమికి వీరిద్దరూ
ఓ ఆరడుగుల బాధ్యత (భూసేకరణ)
సెజ్ లు, రాజధానులు, ప్రొజెక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం జరిగే భూసేకరణ దృష్ట్యా ఈ కవిత రాశారు. మొదటి రెండు వాక్యాలు వ్యాపారివి, తరువాత రెండు వాక్యాలు రైతువి, చివరి వాక్యాలు 'భూమి' వి. భూమికి తేడా ఉండదు ఇద్దరిని కలిపేసుకుంటుంది.
ఈ మధ్య 'ఇసుక' బంగారమైన సంగతి మనకు తెలుసు ఇసుకాసురులు నదీగర్భాల్ని ఎలా నాశనం చేస్తున్నారో 'క్షతగాత్ర నది' అనే కవితలో బాబా అద్భుతమైన భావన చేశాడు. నదిని యూనిట్లు యూనిట్లుగా ఎడారి నగర నిర్మాణాల కొరకు తరలిస్తున్నారంటూ...
'మెలికలు తిరిగి, లుంగచుట్టుకొని
తరుచ్ఛాయల్ని తలచుకొంటూ
బుల్ డోజర్ కింద ఆదీవాసీ చేసిన
అరణ్యరోదన గుర్తు చేసుకుంటూ
అపుడెపుడో మేసిన వెన్నెల్ని
చందమామ రజనుగా రోడ్డుపై కార్చుకుంటూ
క్షతగాత్ర నది ట్రక్కులు ట్రక్కులుగా
ప్రవహిస్తోంది నగరం వైపు
ఈ చిన్న కవితలో బాబాగారు వాడిన పదాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఎండిన కన్నీటి చారికలానది, ఎడారి నగరాల నిర్మాణం, ఆదీవాసీ అరణ్యరోదన, చందమామ రజను. ఈ పదాలు వాడి కవి చిత్రం చూపాడు. దృశ్యం గీచాడు. ఇది కవిత్వం చేసే గొప్పపని. ఆ రహస్యం బాబాకి తెలుసు. అందుకే ఈ పుస్తకంలో కవితలు ఏవీ మనల్ని నిరాశపరచవు.
కవితను అనుభవేకవేద్యం చేస్తూనే కవి చుట్టూ ఉన్న విధ్వంసాన్ని చూపాడు.
'గులకరాయి' కోరంగి మాంగ్రోవ్స్, కవితలు చాలా ప్రత్యేకమైనవి. మారేడు మిల్లి, కోరంగి ప్రదేశాలకు చాలామంది వెళ్ళి ఆస్వాదించి ఫొటోలు దిగి వస్తారు. కానీ బాబా కవి కావడం మూలాన. దాన్ని రికార్డు చేశాడు. 'గులకరాయి' కవితలో మొదటి మూడు నన్ను అబ్బురపరచింది.
'వాచీలో అపుడు సమయం మారేడుమిల్లి' ఈ కవితలో చివరిమాట 'వాచీలో అపుడు సమయం అడవి'. ఎంత మంచి ఊహలో చూడండి. కవిత్వం అది ఇవ్వగలగాలి. బాబా కవిత్వానికి హృదయం ఇచ్చాడు.
పుస్తకం చివరిలో ఉన్న 'ఫ్రాగ్మెంట్స్' ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం.
'ఏదో చేప వలలో చిక్కింది
భారంగా ఒడ్డుకీడ్చుకొచ్చారు
అదృశ్య కన్నీళ్ళకు
సంద్రం అనాదిగా ఉప్పుతేరుతూనే ఉంది'
ఇలా ఈ పుస్తకంలో వస్తువైవిధ్యం ఉంది. శిల్పనైపుణ్యం ఉంది. గుండెలతో హత్తుకునే కవిత్వం ఉంది. వెంటాడే దృశ్యాలున్నాయి. ఓ కథలా చెబుతూనే వాస్తవాలను, తన ఫిలాసఫిని బాబా నేరుగా మనల్ని తన వాక్యంలోకి తీసుకెళతాడు.
బాబా గారి కవిత్వంలో నినాదాలు ఉండవు. కథనాత్మక శైలిలో హాయిగా చదువుకుంటూనే మనకు ముల్లుగుచ్చుకుంటూ ఉంటుంది. ముల్లు తీయించుకోవడం ఉంటుంది.
కుట్రలు, భయ్యా! నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను, రక్తహేల, పర్సనల్ లాంటి కవితల్లో తన మార్గాన్ని స్పష్టంగా చెప్పాడు. అనుభూతి కవిత్వంలో సామాజికతను తప్పిపోనివ్వలేదు. తన గొంతును ధైర్యంగా వినిపించాడు. దాపరికాలు లేవు. కవితా నిర్మాణ రహస్యం తనకి తెలుసు. ఎంత క్లుప్తంగా కవిత్వాన్ని బట్వాడా చేయగలడో కవి.
గులకరాయి, కోరంగి మాంగ్రోవ్స్, తదుపరి ఎత్తు వస్తుపరంగా విభిన్నమైన కవితలు
జీవితం అప్పుడపుడూ కాసేపాగి
తన సెల్ఫీ తానే తీసుకుంటుంది
ఒక్కో ఫొటో రక్తమూ, కన్నీళ్ళూ నింపుకున్న కవిత్వమై
చరిత్రలోకి ఇంకిపోతుంది - (సెల్ఫి)
ఈ విధంగా బాబా అన్నట్టు 'గుండెపూడిక' ఎవరైనా తీస్తే బాగున్ను అన్నాడుగానీ గుండెపూడిక తీయగల కవిత్వం రాసిన బాబా అభినందనీయులు.
శ్రీ సుంకర గోపాల్
No photo description available.

Saturday, July 18, 2020

సప్తశతి గాథలలో సామాజిక వ్యవస్థ: పేదరికం - పార్ట్ 10


.
(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు)
.
పేదరికం
ఆనాటి సమాజంలో ధనిక పేద అంతరాలు ఉన్నాయి. ఇళ్ళలో కుడ్యచిత్రాలు, ఉద్యానవనాలు, అలకా మందిరాలు, రత్నాలు పొదిగిన ఆభరణాలు, రంగురంగుల దుస్తులు కలిగిన ధనికులు ఒకవైపు; కటిక దరిద్రాన్ని అనుభవించే నిరుపేదలు మరోవైపు నివసించటాన్ని ఈ ప్రాచీన గాథాకారులు గుర్తించారు. రెండిటినీ తమ గాథలలో పొందుపరిచారు.
***
.
ధరించేందుకు ఒకటే వస్త్రం ఉంది ఆ నిరుపేదకు.
ఉతికినప్పుడు పీలికలైన దాని అంచుల నుండి
జారే నీటి బొట్లు
కన్నీళ్లను తలపిస్తున్నాయి. (18)
.
దుర్భర దారిద్ర్యాన్ని సూచిస్తుందీ గాథ. చివికిపోయి పీలికలైన వస్త్రానికి వ్యక్తిత్వారోపణ చేసి అదికూడా ఆ నిరుపేద కష్టానికి చలించి శోకిస్తున్నది అనటం లోతైన కల్పన.
***
పీలికలైన పాతకంబళి కప్పుకొని
పిడకల పొగ కంపుకొడుతూ
పొగచూరి నల్లబడిన దేహంతో
చలికి ఒణుకుతూ కనిపించే అతనిని
నిరుపేద అని ఇట్టే గుర్తుపట్టొచ్చు (329)
.
ఆనాటి ఒక నిరుపేద శీతాకాలంలో ఏ విధంగా కనిపించేవాడో కళ్ళకు కడుతుందీ గాథ. నిజానికి మూలంలో Dry Cow-Dung అని ఉంది పిడకలు అని కాదు. (అది అనువాదానికి లొంగక పిడకలుగా అనువదించాను) ఎండిన ఆవుపేడ ముద్దలను ఏరుకొని వాటిని మండించుకొని వెచ్చదనం పొందుతున్నాడట. ఇతనికి బహుసా పాకలాంటిది కూడా లేదేమో. ఆరుబయటే నిద్రించాల్సిన పరిస్థితేమో.
ఆనాటి ఒక పేదరికపు దృశ్యానికి ప్రతీ తరంలోనూ పదే పదే ప్రాణం నింపుతూ బ్రతికిస్తూన్నదీ గాథ.
***
.
తుఫానుకు ఆ ఇంటిపై గడ్డి చెదిరిపోగా
ఆ చిల్లులలోంచి వాననీరు కారుతున్నప్పుడు
భర్త వచ్చే రోజుకోసం గోడపై వేసుకొన్న గీతలలెక్కలు
చెరిగిపోకుండా చెయ్యి అడ్డం పెడుతోందా ఇల్లాలు. (170)
.
ఆనాటి సామాన్య ప్రజలు గడ్డి ఇండ్లలో నివసించేవారని, పైకప్పుకు చిల్లులు పడి వర్షపునీరు ఇంట్లోకి కారేదని పై గాథ ద్వారా అర్ధం చేసుకొనవచ్చును. ఒక యాదృచ్ఛిక భౌతిక స్థితిని వర్ణిస్తూనే మరో ఉప్పొంగే కరుణనిండిన ఉద్వేగాన్ని పండిస్తాడీ గాథాకారుడు.
***
.
పొందిన మర్యాదలను
తన పేదరికంవలన
బదులు తీర్చలేని సజ్జనుడు పడే దుఃఖం
అతడిని అవమానించినపుడు కూడా పడడు. (320)
.
మనిషిలోని ఆత్మగౌరవాన్ని పట్టిచూపుతుందీ గాథ. ఎదటివారు చేసిన వాటికి తప్పక రుణం తీర్చుకోవాలనుకోవటం, పేదరికంవల్ల అలా చేయలేకపోతే అది అవమానకరంగా భావించటం అనేది ఇచ్చిపుచ్చుకొంటూ చేసే సహజీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ గాథలోని భావాన్ని విలోమం చేస్తే “పొసగి మేలు చేసి పొమ్మనుటే చావు” అనే వేమన పద్యపాదం తగులుతుంది.
***
.
గర్బం ధరించిన కోడలు పిల్లను
"నీకు ఏం తినాలని ఉందో చెప్పు" అని
పదే పదే అత్తమామలు అడుగుతూంటే
తన అత్తవారింటి పేదరికాన్ని
తన భర్తకు కలిగే సంకట స్థితిని దృష్టిలో ఉంచుకొని
ప్రతీసారీ "నీళ్ళు, నీళ్ళు" అంటుందామె. (472)
.
మానవసంబంధాలకు చెందిన ఒక ఉదాత్త దృశ్యమది. అవకాసం వచ్చింది కదా అని వడ్డాణం కావాలనో, వెండి పట్టీలు కావాలనో కోరుకోకుండా ఉత్తనీళ్ళు అడగటంలో అమాయకత్వం కన్నా పరిస్థితులను అర్ధం చేసుకొని సర్దుకుపోవటం అనే గుణమే కనిపిస్తుంది. ఆనాటి సమాజంలో vertical లేదా horizontal mobility కి అవకాసాలు మృగ్యం. పుట్టిన వర్ణము, ఆ వర్ణానికి స్మృతులు నిర్ధేశించిన స్థానము తప్ప వేరే రకంగా బ్రతికే వీలు లేదు. వీటికి తోడు జీవితాలను అతలాకుతలంచేసే కరువుకాటకాలు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు.
ఇన్ని ఉన్నప్పటికీ ఆనాటి ప్రజలు ఉన్నంతలో ఆత్మగౌరవంతో సంతోషంగా జీవించారని ఈ గాథలు సాక్ష్యమిస్తాయి.

బొల్లోజు బాబా

Tuesday, July 14, 2020

సింహాచలం - కొన్ని సంగతులు


చాన్నాళ్ళక్రితం హంపి సందర్శించినపుడు అక్కడ పాక్షికంగా విరూపం చేయబడిన విగ్రహాలను చూపిస్తూ ఆ గైడు ఇదంతా ముస్లిమ్ దాడులవల్ల జరిగింది అంటూ అత్యుత్సాహంతో చెప్పటం ఎందుకో నచ్చలేదు. అది రాజ్యకాంక్ష. మనుష్యుల కుత్తుకలను తెగనరికే రక్తదాహం. అక్కడ మత ప్రసక్తి అనవసరం అనిపించింది.
ఇటీవల సింహాచలం వెళ్ళినపుడు అక్కడి అంతరాలయంలోని అందమైన శిల్పాలను నాశనం చేసింది మహమ్మదీయ పాలకులే అంటూ వెనుకవైపునుంచి ఎవరో మాట్లాడుకోవటం విన్నప్పుడు కూడా అదే అనిపించింది. బహుసా ఏ సారాయి తాగిన సైనికుడో పెద్ద సుత్తి తీసుకొని ఆ సుందరశిల్పాల్ని ఒక్కొక్కటీ బద్దలుకొట్టుకొంటూ ఆ ఉన్మత్తతలో వికటాట్టహాసం చేసుకొంటూ మిత్రుల ముందు ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు అతను పొంగిపోతూ చెలరేగిపోయిన దృశ్యాన్ని ఊహించుకొన్నాను. ఇక్కడ మతం కన్నా మనుషుల్లోని అరాసిక్యం పెద్దదిగా కనిపించింది.
చలం ఎక్కడో “ఈ ప్రపంచంలోని సుందరమైన శిల్పాలను నిలబెడితే వాటికి నీ వీపు ఆన్చి రుద్దుకొని దురదతీర్చుకొంటావు” అంటాడు. శిల్పులు ఏళ్ళతరబడి కష్టపడి చెక్కిన అద్భుతమైన సృజనని క్షణాల్లో నాశనం చేయటం దాదాపు అలాంటి అరసికతే.
***
సింహాచలం ఆలయం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
.
1. స్థలపురాణం
ఈ ఆలయస్థలపురాణంలో విష్ణుమూర్తి నరసింహావతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుని సంహరించటం ప్రహ్లాదుని అనుగ్రహించటం ప్రధాన వస్తువు.
సాధారణంగా ఆలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. సింహాచల ఆలయం పశ్చిమముఖంగా ఉంటుంది. దీనికి వివరణగా ఒక గాధ ప్రచారంలో ఉంది. ఈ ఆలయాన్ని మొదట తూర్పుముఖంగానే నిర్మించారట. ఆ ఆలయ శిల్పికి అతని కొడుకుకి వచ్చిన ఒక గొడవకారణంగా ఇది పశ్చిమ దిక్కుగా మారిపోయిందట. ఆలయ ప్రధాన శిల్పికి అంతవరకూ తల్లి సంరక్షణలో పెరిగి తండ్రిని చేరుకొనే అతని కొడుకుకు మధ్య జరిగే సంవాదాలలాంటివి – కోనార్క్, హళేబీడు (జక్కన్న) లాంటి ఇతర ఆలయాల స్థలపురాణాలలో కూడా కనిపించే నేరేటివ్స్. ఒకే కథ అనేక ఆలయాల స్థలపురాణాలలో పునరావృతం కావటం ఆసక్తికరం.
వివిధస్థలపురాణాలలాగే సింహాచల స్థలపురాణం కూడా పదిహేనో శతాబ్దం తరువాత పురాణాల ఆధారంగా వ్రాయబడి ఉండొచ్చు.
2. రామానుజాచార్యుని రాక
పదకొండవ శతాబ్దంలో రామానుజాచార్యుడు సింహాచల క్షేత్రానికి వచ్చాడని, అప్పటివరకూ శివాలయంగా ఉన్న ఈ ఆలయాన్ని వైష్ణవాలయంగా మార్చాడని ఒక స్థానిక కథనం కలదు.
రామానుజాచార్యుడు వచ్చి ఇక్కడి స్థానికులకు శివుడు, విష్ణువులలో ఎవరు గొప్ప అనేది తేల్చటానికి – కొంత విభూతి, తులసి ఆకులను దేవుని ఎదుట ఉంచి ఉదయానికల్లా తులసిఆకులు మాత్రమే ఉండటాన్ని విష్ణుమహిమగా చూపి వారిని ఒప్పించారట.
రాత్రికి రాత్రి ఆ ఆలయంలోని శివలింగాన్ని విష్ణువిగ్రహంగా మార్చమని శిల్పులను ఆదేశించగా వారు అలా చేస్తున్నప్పుడు ఆ అసంపూర్ణ శిల్పం రక్తం కార్చటం చూసి ఆ శిల్పులు భయపడి నిలిపివేసారట. రామానుజాచార్యులు వెంటనే శిల్పానికి చందనం కప్పి మూసివేసారట. నేటికీ మూలవిరాట్టు విగ్రహం అసంపూర్ణంగా ఉంటుందంటారు. అందుకనే నిత్యరూపదర్శనం లింగాకారంగాను, నిజరూపదర్శనం ఏడాదికి ఒకరోజు మాత్రమే ఉండటం స్వామి అభీష్టంగా భావిస్తారు.
1087, 1096 CE నాటి ఆలయశాసనాలను బట్టి సింహాచలాలయంలో అప్పటికే విష్ణువు కొలువు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. కనుక రామానుజాచార్యుని గాధలోని చారిత్రకతను నిర్ధారించలేము. పదకొండవ శతాబ్దానికి పూర్వం ఈ ఆలయమొక ఆదివాసీ ఆరాధన కేంద్రం అయి ఉండవచ్చు.
1268 లో నరసింహదేవ I ఆలయాన్ని పునర్నిర్మాణం గావించాడు. అంతకు పూర్వం కల సుమారు 18 శాసనాలు కల రాళ్లను సాధ్యమైనంతమేరకు తిరిగి ఆలయనిర్మాణంలో వాడుకొన్నారు.
3. కృష్ణదేవరాయుని సందర్శన
కృష్ణదేవరాయలు 30 మార్ఛ్ 1516 న సింహాచల ఆలయాన్ని దర్శించాడు. రాయల వారు 991 ముత్యాలు కలిగిఉన్న కంఠహారాన్ని ఇతర విలువైన కానుకలను సమర్పించుకొన్నాడు. ప్రతాపరుద్రుడిని జయించి అతని భార్యలను తన గుర్రాలకు నాడాలు కొట్టే శ్రామికులకు ఇచ్చివేస్తాను అని ఒక శాసనం వేయించినట్లు న్యూనెజ్ తన విస్మృతసామ్రాజ్యం లో చెప్పాడు కానీ అలాంటి శాసనమేదీ సింహాచలంలో కనిపించదు.
4. ఆలయంపై దాడి
గోల్కొండను కులికుతుబ్ షా పాలిస్తున్న కాలంలో (1580-1612) లో ఈ ఆలయంపై దాడి జరిగింది. 1580 లో ఈ ప్రాంతాన్ని అంతవరకూ పాలిస్తున్న స్థానిక రాజులు గోల్కొండ రాజ్యం పై తిరుగుబాటు చేసారు. అలా తిరుగుబాటు చేసిన వారిలో హిందూ రాజులే కాక అలం ఖాన్ , ఖాన్ ఖానాన్ లాంటి ముస్లిం జాగీర్ దారులు కూడా ఉన్నారు. అలా చాలా చోట్ల గోల్కొండ ఆధిపత్యాన్ని తిరస్కరిస్తూ కప్పాలు కట్టకుండా స్వీయపాలన కొరకు అనేక అలజడులు జరిగాయి.
ఈ అల్లర్లను అణచివేయటానికి కుతుబ్ షా తనవద్ద మంత్రిగా ఉన్న మల్కా అమిన్ కు సైన్యాన్ని తోడిచ్చి ఈ ప్రాంతానికి పంపించాడు. ఇతను మొదటగా ఉదయగిరి రాజు కౌలానందుడి తలనరకటంతో తన నరమేధాన్ని మొదలు పెట్టాడు. ఇతను కృష్ణా నది దాటి కోస్తా ఆంధ్ర ప్రాంతాలలోని వందలాది సామంతులను చంపుతూ అల్లర్లను క్రమక్రమంగా అణచివేస్తూ 1599 నాటికి శ్రీకూర్మం చేరుకొన్నాడు.
ఇతను శ్రీకూర్మంలో అనేకమంది స్థానిక జమిందార్లను సంహరించాడు. శ్రీకూర్మ ఆలయాన్ని ధ్వంసం చేసాడు. ఇదే సమయంలో సింహాచల ఆలయంపై కూడా దాడి చేసాడు.
ఇలా ఆలయాల ధ్వంసం జరుగుతున్నదనే విషయాన్ని కొద్దిమంది స్థానికులు కులి కుతుబ్ షాకు నివేదించటంతో సింహాచలం, శ్రీకూర్మం లోని పరిస్థితులను చక్కదిద్దమని అశ్వారాయుడు అనే ఒక హిందూ అధికారిని ఇక్కడకు పంపించాడు. ఈ అశ్వారాయుడు పద్మనాయక వంశానికి, విప్పర్ల గోత్రానికి చెందిన వ్యక్తి. ఇతను కళింగదేశములో మల్కా అమిన్ చేసిన దౌర్జన్యాలకు బలయిపోయిన వారిని శాంతపరచి ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను తిరిగి నెలకొల్పాడు.
1604 నాటి ఒక శాసనం ద్వారా- రాజప్రతినిధిగా వచ్చిన అశ్వారాయుడు ఈ ఆలయాలను తిరిగి తెరిపించి, ధార్మిక విధులను కొనసాగేలా చేసాడని తెలుస్తున్నది.
గోగులపాటి కూర్మనాధ అనే శతకకవి వ్రాసిన సింహాద్రి నరసింహ శతకంలో మహమ్మదీయ సైనికులు సింహాచలంపై దాడికి వస్తున్నప్పుడు ఆ కవిగారికి కోపం వచ్చి నరసింహస్వామిని నిందాస్తుతి చేయగా, తేనెటీగల దండును ఆ సైన్యంపై పంపి వారిని చెల్లాచెదురు చేయటం ద్వారా స్వామి మహమ వెల్లడయినట్లు వర్ణణలు కలవు.
కూర్మనాథ కవి 1750 ప్రాంతాలలో ఈ శతకం వ్రాసినట్లు తెలుస్తున్నది. కానీ ఈ సమయంలో ఆలయంపై దాడులు జరిగిన చారిత్రిక ఆధారాలు లేవు. కనుక ఈ శతకం బహుసా 1599 లో మల్కా అమిన్ చేసిన దాడిని దృష్టిలో ఉంచుకొని వ్రాసినది కావొచ్చును.
***
సుమారు వేయి సంవత్సరాల చరిత్రకలిగిన ఆలయమిది. ఆలయాలను నిర్మించేది, పోషించేది వాటిమీద వచ్చే ఆదాయం కొరకు అనే చాణుక్యనీతి తెలిసినా ఆలయాలు లేని మానవజాతిని ఊహించలేం.
నేడు మనచుట్టూ చేతులు తెగిన, కాళ్ళునరికిన, ముక్కులు చెక్కిన శిల్పాలతో అనేక ఆలయాలు కనిపిస్తాయి. వీటన్నిటికీ కారణం మతమనే బూచిని చూపటం నేడు ఎక్కువైపోయింది. అందమైన శిల్పాకృతులు నాశనం అయ్యాయే అనే సగటు హిందువు బాధను తెలివిగా ఒక మతంమీద ద్వేషంగా కన్వర్ట్ చేయబడుతోంది. అలాంటి దుశ్చర్యలను వ్యక్తులు చేసిన దౌష్ట్యాలుగా ఎందుకు చూడరాదు?
పై ఉదంతంలో మల్కా అమిన్ ఒక్క హిందువులను మాత్రమే చంపలేదు. సాటి ముస్లిములను కూడా అణచివేసాడు. అప్పటి రాజనీతి అది. ఇప్పటి విలువలతో పోల్చలేం. గోల్కొండ నవాబు చేయగలిగినంత డామేజ్ కంట్రోల్ చేయటానికి ప్రయత్నించాడు. దేశం అంతటా ఇదే జరిగి ఉంటుందని చెప్పలేను. కనీసం సింహాచల శిల్పాల విరూపీకరణలో ఇవి కొన్ని మరుగునపడిన విషయాలు అని భావిస్తాను.
బొల్లోజు బాబా
సంప్రదించిన పుస్తకాలు
1. The Simahachalam Temple by Dr. K.sundaram
2. DV Potdar Commemoration Volume Edited by Surendranath Sen 1950
3. The_Aravidu_Dynasty_Of_Vijayanagar_Vol_I by Henry_Heras
Thank you విష్వక్సేనుడు గారు for mentioning me in this essay.
You are right kavisangamam is game changer in Telugu literary world
No photo description available.

అయాన్ రాండ్ ఫౌంటైన్ హెడ్ – శ్రీ రెంటాల వారి తెలుగు అనువాదం


Bolloju Baba
8 February ·



అయాన్ రాండ్ ఫౌంటైన్ హెడ్ – శ్రీ రెంటాల వారి తెలుగు అనువాదం
అయాన్ రాండ్ పేరును మొదటిసారిగా ఒక యండమూరి నవలలో చదివాను. నాకు అన్నీ తెలుసు అంటూ గొప్పలు పోయే ఒక పాత్ర అయాన్ రాండ్ ప్రస్తావన వచ్చినపుడు- “నాకు అతను తెలుసు, వాడి నవలలు అనేకం నేను చదివాను. భలేగా రాస్తాడు” అంటూ వాగుతుంటే “అయాన్ రాండ్ అతను కాదు ఆమె” అంటుంది మరోపాత్ర.
ఆ తరువాత ఈ అయాన్ రాండ్ పేరు చాలా వ్యాసాల్లో, రచనల్లో విన్నాను. యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఫౌంటైన్ హెడ్ చదవటం మొదలెట్టి ముగించలేకపోయాను.
గనారా గారు ఈ పుస్తకపరిచయ సభ మనం చెయ్యాలి అన్నప్పుడు “నాకు ఈ పుస్తకంపై మాట్లాడే అవకాసం ఇవ్వండి” అని అడిగాను. ఎప్పటినుంచో తీరని కోరికను ఈ వంకనైనా తీర్చుకొందామని.
***
శ్రీ రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదేమీ ఉండదు. మీ అందరిలాగే నేను కూడా ఆయన అభిమానిని. వారు పెర్ ఫెక్షనిస్ట్. రెంటాల వారు రాసే గజలైనా, విమర్శనా వ్యాసమైనా చెక్కిన శిల్పంలా ఉంటుంది. ఒక్క మాట పొల్లుపోదు, ఒక్క వాక్యం హద్దు మీరదు.
అనువాదరచనలలోని వాక్యనిర్మాణం ఒక్కోసారి గుర్రబ్బండి ప్రయాణంలా కుదుపులతో ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఒక భాషలోని సౌందర్యం మరొక భాషలోకి తీసుకురావటం అంత సామాన్యమైన విషయం కాదు. ఈ అనువాదం విషయానికి వస్తే హాయిగా ఉంది వచనం. ఏ కుదుపులూ లేని పడవ ప్రయాణంలా ఉందీ అనువాదం.
అనువాద రచనలను పరిశీలించినపుడు ఆ అనువాదకుడు మూలానికి విధేయుడై ఉన్నాడా, లేక పాఠకునికి విధేయుడై ఉన్నాడా అనే రెండు విషయాలు పరిశీలనార్హం.
ఈ రచనను చదివాకా ‘ రెంటాల వారు మధ్యేమార్గాన్ని ఎన్నుకొన్నట్లు నాకు అనిపించింది. అంటే మూలానికి నిబద్ధులై ఉంటూనే సమకాలీన పాఠకులను దృష్టిలో ఉంచుకొని సరళమైన భాషను వాడారు. మనం రోజూ వాడుకునే మాటలనే వాడారు. వందలాది ఇంగ్లీషు పదాలను యధాతథంగా ఉంచేసారు. సుదీర్ఘంగా సాగే వాక్యాలను చిన్న చిన్న వాక్యాలుగా విడగొట్టారు చాలా చోట్ల. ఇదంతా అనువాదకునిగా ఆయన తీసుకొన్న శ్రద్ధ, చూపించిన ప్రతిభ.
నిజానికి అనువాద రచనలపై మాట్లాడటం కత్తి మీద సాము. ఈ మాటలలో అనువాదకుని కన్నా మూల రచయితగురించీ, మూల కృతి గురించి ఎక్కువ మాట్లాడుకోవాలివస్తుంది. ఇది ఒకరకంగా అనువాదకునికి ఇబ్బందిగా ఉండొచ్చు- కానీ అనువాదం యొక్క ముఖ్య లక్ష్యం “మూల రచన గురించి చర్చించటం” కనుక అది తప్పదు.
***
ఫౌంటైన్ హెడ్ అనువాద నవలను నాలుగు అంశాలుగా పరిశీలిద్దాం.
1. ఫౌంటైన్ హెడ్ కథ, పాత్రలు,
2. ఈ నవల చెప్పే ఫిలాసఫీ ఏమిటి?
3. సమకాలీన సమాజం లో ఫౌంటైన్ హెడ్ నవల ప్రాసంగికత ఏమిటి?
4. అనువాద విశ్లేషణ
1. ఫౌంటైన్ హెడ్ కథ పాత్రలు,
అయాన్ రాండ్ 1905 లో రష్యాలో జన్మించింది. 1926 లో అమెరికా వలస వచ్చి అక్కడే స్థిరపడింది. ఫౌంటైన్ హెడ్ నవలను ఈమె 1943 లో రచించింది. ఈ నవల ముప్పై భాషలలోకి అనువదించబడింది. ఇప్పుడు దీన్ని ముప్పై ఒకటిగా భావించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఫౌంటైన్ హెడ్ పుస్తకాలు అమ్ముడుపోయాయి. ఈ నవలకు మొదట “సెకండ్ హాండర్స్” అనే పేరు పెడదామని భావించి అది నెగటివ్ అర్ధాన్ని ఇస్తున్న కారణంగా నదీ మూలం (Source of Stream) అనే అర్ధం వచ్చేలా ఫౌంటైన్ హెడ్ అన్న పేరు పెట్టింది అయాన్ రాండ్.
ఫౌంటైన్ హెడ్ ఆర్కిటెక్చర్ నేపథ్యంలో అల్లబడిన సుమారు ఎనిమిదివందల పేజీల నవల. కథాకాలం సుమారు 1920-30 లు. కథా ప్రాంతం న్యూయార్క్. ఈ నవలలో ప్రధానమైన అయిదు పాత్రలను గుర్తించవచ్చు.
హోవార్డ్ రోర్క్
ఇతను ఈ నవలకు హీరో. గొప్ప ఆర్కిటెక్ట్. ఇతని పాత్ర ఒక ఆదర్శపురుషునిగా చిత్రించబడుతుంది. పేదకుటుంబంలో పుట్టి చిన్నచిన్న పనులు చేసుకొంటూ చదువుకొంటాడు. ఇతనికి జీవితం పట్లా వృత్తి పట్ల కొన్ని నిర్ధిష్టమైన అభిప్రాయలు ఉంటాయి. ఇతరుల కొరకు తన అభిప్రాయాలను మార్చుకోవటానికి ఇష్టపడడు. రోర్క్ గీసిన బిల్డింగ్ ప్లాన్ లను ఎవరెన్ని చెప్పినా మార్చటానికి ఎంతమాత్రమూ ఒప్పుకోడు. ఈ క్రమంలో చాలా గొప్ప గొప్ప వ్యాపార అవకాసాలను రోర్క్ కోల్పోవలసి వస్తుంది.
వ్యక్తివాదానికి రోర్క్ పాత్రను ప్రతీకగా నిలుపుతుంది అయాన్ రాండ్. స్థిరమైన అభిప్రాయాలను కలిగిఉన్న రోర్క్ పాత్రకు, మిడిమిడి జ్ఞానంతో సమాజం ఎటు నడిపితే అటు కొట్టుకుపోయే ఇతర పాత్రలకు మధ్య నడిచిన నాటకీయతే ఫౌంటైన్ హెడ్ నవల. ఈ పాత్ర ఒక రకంగా ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ పాత్రలా అనిపిస్తుంది.
డొమినిక్ ఫ్రాంకన్
డోమిన్క్ పాత్ర నిగూఢతను కలిగి ఒక పట్టాన అర్ధం కాదు. ఆమెకు ఏం కావాలో, ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తున్నదో అంతుచిక్కదు. వ్యక్తి స్వేచ్ఛ సిద్దాంతానికి రోర్క్ పురుషరూపం అనుకొంటే డోమినిక్ స్త్రీరూపమని అన్వయం చేసుకోవాలి.
ఈమె ఈ నవలకు హీరోయిన్. నవల ప్రారంభంలో తన చుట్టూ ఉండే మిడిమిడి జ్ఞానం కలిగిన మనుషుల పట్ల డొమినిక్ విసుగుచెంది, ఈ ప్రపంచం అంతా కుళ్ళిపోయింది అనే అభిప్రాయాన్ని ఏర్పరచుకొంటుంది. ఇలాంటి కుళ్ళిన సమాజంలో స్వతంత్ర ఆలోచనలకు తావు లేదు అని నమ్ముతుంది. పరిపూర్ణ మానవుడి కోసం చేసిన అన్వేషణలో డొమినిక్ మొదట పీటర్ కీటింగ్ ని, తరువాత గెయిల్ వేనాండ్ ని పెళ్లి చేసుకొని నవల చివరలో రోర్క్ ని చేరుకొని తన అన్వేషణను ముగిస్తుంది. డొమినిక్ ప్రవర్తన ఒక్కోసారి అనూహ్యంగా ఉండటం వల్ల ఆమె ఒక న్యూరోటిక్ అని విమర్శకులు విమర్శించారు.
పీటర్ కీటింగ్
ఇతడు రోర్క్ క్లాస్ మేట్. స్వంత అభిప్రాయాలను కలిగి ఉండడు. స్వశక్తిని నమ్ముకోకుండా ఇతరులపై ఆధారపడుతూంటాడు. వృత్తిలో విజయాలు సాధించుకోవటం కొరకు అబద్దాలు ఆడటం, దొంగతనం చేయటం చివరకు పెద్ద కంట్రాక్ట్ ఇస్తానంటే భార్య అయిన డొమినిక్ ను వైనాండ్ కు ఇచ్చేస్తాడు/అమ్మేస్తాడు కూడా. మిడిమిడి జ్ఞానంతో సమాజం ఎటునడిపితే అటునడిచే ఒక మిడియోక్ర్ వ్యక్తి కీటింగ్.
గెయిల్ వైనాండ్
ఈ నవలలో వైనాండ్ పాత్రను చిత్రించిన తీరు ఉద్వేగ భరితంగా ఉంటుంది. వైనాండ్ పాత్రరూపకల్పనలో జర్మన్ తత్వవేత్త నీషే ఫిలాసఫీ ప్రభావం ఉందని విమర్శకులు అంటారు. గంజి నుంచి బెంజి వరకు అన్నట్లు మురికివాడలనుంచి న్యూస్ పేపర్ ప్రపంచానికి అధినేతగా ఎదిగి, సమాజాన్ని శాసించే స్థాయికి చేరతాడు వైనాండ్. ఇతను వ్యాపారప్రపంచంలో ఎదిగిన తీరు నేటి తెలుగు రాజకీయాలను శాసిస్తున్న రెండుపత్రికలు, ఒక పెద్ద న్యూస్ చానెల్ యజమానుల్ని తలపిస్తుంది. ఇతరులను శాసించటమే మానవ లక్ష్యమని భావిస్తాడు. ఈ క్రమంలో డొమినిక్ ను పెండ్లాడతాడు. రోర్క్ యొక్క నిబద్దతను గుర్తించి అతని స్నేహితుడౌతాడు. వ్యాపారంలో వైఫల్యం చెంది నవల చివరలో ఆత్మహత్యకు సిద్ధపడతాడు. (సినిమాలో ఆత్మహత్య చేసుకొన్నట్లు చూపించారు)
`
రోర్క్ పాత్ర ఒక రాయిలాగా ఏ స్పందనలను చూపించదు. గైల్ వైనాండ్ పాత్ర ఎంతో ఆకర్షిస్తుంది. తన నమ్మకాలకు, సమాజం ఆశిస్తున్న దానికి మధ్య వైరుధ్యాలున్నప్పుడు ఆ వ్యక్తి పడే ఘర్షణ వైనాండ్ పాత్రలో కనిపించింది. వైనాండ్ పాత్ర వల్లే ఈ నవల సాహిత్యరూపం పొందింది. వైనాండ్ పాత్ర లేకపోతే ఈ నవల వ్యక్తివాదానికి, సమిష్టి వాదానికి మధ్యనడచిన సిద్ధాంత చర్చగా మిగిలిపోయి ఉండేది.
ఎల్స్ వర్త్ టూహీ
టూహీ అందరికీ ఒక తెలివైన ఆధ్యాత్మిక వేత్తగా కనిపిస్తూ తెరవెనుక గోతులు తవ్వే పాత్ర. ఈ నవలలో విలన్ టూహి. త్యాగం చేయటం ఉత్తమ మానవ విలువ, మనకోసం కాక ఇతరుల కోసం బ్రతకటంలోనే జీవిత పరమార్ధం ఉంటుంది అని టూహి ప్రవచిస్తూ ఇతరులను వ్యక్తిత్వం లేనివారిగా మార్చేస్తూంటాడు. టూహి ఒక రకంగా – భక్తులలో మూఢనమ్మకాలు పెంచుతూ, వారి ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసే దొంగ ఆధ్యాత్మిక ప్రవచనకారుడి లా అనిపిస్తాడు.
రాండ్ ఈ పాత్రను చాలా తెలివిగా తీర్చిదిద్దింది. తన అభిప్రాయాలను గౌరవించి తన ఔన్నత్యాన్ని అంగీకరించిన వారితో టూహీ కి ఏ సమస్యా లేదు. అలా అంగీకరించకుండా స్వతంత్రంగా ఆలోచించే రోర్క్ లాంటి వ్యక్తులపట్ల టూహి కక్ష పెంచుకొని వాళ్ళని నాశనం చేయటానికి ప్రయత్నిస్తాడు. టూహిని సోషలిజానికి ప్రతినిధి గా నిలబెడుతుంది రాండ్.
కథ
స్టాంటన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చదువుకొంటున్న హావార్డ్ రోర్క్, లెక్చరర్లను విమర్శించినందుకు సస్పెండ్ చేయబడటంతో నవల మొదలౌతుంది. రోర్క్ ఆర్కిటెక్ట్ గా అవకాసాలు వెతుక్కొంటూ న్యూయార్క్ చేరుకొంటాడు. ఇతని క్లాస్ మేట్ అయిన పీటర్ కీటింగ్ కూడా న్యూయార్క్ చేరుకొని అంచలంచెలుగా ఎదిగిపోతూంటాడు. కస్టమర్లు కోరిన విధంగా బిల్డింగు ప్లానులు మార్చని కారణంగా రోర్క్ ఉద్యోగం కోల్పోయి, న్యూయార్క్ విడిచిపెట్టి ఓ మారుమూల గ్రామానికి వెళ్లిపోయి అక్కడ ఒక గ్రానైట్ క్వారీ లో వర్కర్ గా పనిచేస్తుంటాడు. అక్కడ ఒకరోజు రోర్క్ ఆ గ్రానైట్ ఓనర్ కూతురైన డొమినిక్ ని కలుస్తాడు. ఒకరికొకరు ఆకర్షితులౌతారు. ఆ క్రమంలో రోర్క్ ఆమెను రేప్ చేస్తాడు.
రోర్క్ కు ఒక క్లయింటు నుండి పిలుపు రావటంతో న్యూయార్క్ తిరిగి వచ్చేస్తాడు. డొమినిక్ కూడా వస్తుంది. డొమినిక్ మొదట కీటింగ్ ను తరువాతా న్యూస్ పేపర్ అధినేత అయిన వైనాండ్ ను పెండ్లాడుతుంది.
రోర్క్ కు క్రమక్రమంగా క్లయింట్లు పెరుగుతూంటారు. ఎల్స్ వర్త్ టూహి రోర్క్ కారీర్ ని నాశనం చేయటానికి ప్రయత్నిస్తూంటాడు.
కీటింగ్ కు వచ్చిన ఒక పెద్ద ప్రొజెక్టును తను చెయ్యలేక, రోర్క్ తో డిజైన్ చేయించుకొంటాడు. ఈ ప్లాన్ ను ఏమాత్రం మార్చను అన్న మాట తీసుకొని రోర్క్ డిజైన్ చేసి ఇస్తాడు. ఇచ్చినమాటకు విరుద్ధంగా ఆ ప్రొజెక్టులో అనేక మార్పులు చేయటంతో రోర్క్ ఆ బిల్డింగులు మొత్తాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తాడు. పోలీసులు రోర్క్ ను అరెస్టుచేస్తారు. రోర్క్ ను పోలీసులు అరస్టు చేయటాన్ని వైనాండ్ తన పేపర్ లో ఖండించినందుకు ప్రజల అసహనానికి గురయి దివాళా తీస్తాడు అరస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినపుడు “ఆ ప్లాను నాది, దాన్నిపై సర్వహక్కులు నాకుంటాయి. దాన్ని మార్చటానికి కుదరదు అనే ఒప్పందం పైనే చేసి ఇచ్చాను. అదే నా ఫీజు గా భావించాను. కానీ ఆ ప్రొజెక్టు డిజైన్ ను మార్చినందుకు దాన్ని పేల్చివేసాను. ఇది నా వ్యక్తిత్వానికి, నాకు ఉండే వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయం అని వాదించి నిర్దోషిగా విడుదలవుతాడు.
నవల చివరలో రోర్క్ పేరున్న ఆర్కిటెక్ట్ గా మారతాడు. డొమినిక్ రోర్క్ ను చేరటంతో కథ ముగుస్తుంది.
2. ఈ నవల చెప్పే ఫిలాసఫీ ఏమిటి?
ఈ నవలలో- ప్రసంగాలలాగ అనిపించే సంభాషణలు, హీరోయిన్ పాత్ర చిత్రణను ఫెమినిష్టులే అంగీకరించలేకపోవటము, రోర్క్ కొన్ని సంఘటనలలో అసహజంగాను, మూర్ఖునిగాను కనిపించటం, మానవ సంబంధాలను బలోపేతం చేసే త్యాగాన్ని ఉత్త నాన్సెన్స్ వ్యవహారంగా కొట్టిపాడేయటం వంటి సాహిత్యపరమైన అనేక లోపాలున్నప్పటికీ- ఫౌంటైన్ హెడ్ నవల నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతూ ఉండటానికి ప్రధాన కారణం ఆ నవలలో అయాన్ రాండ్ చొప్పించిన ఫిలాసఫీ.
అయాన్ రాండ్ ఈ పుస్తకంలోని చొప్పించిన ఫిలాసఫీని ఆబ్జెక్టివిజం పేరుతో పిలుచుకొంది. అంటే మనకోసం మనం బ్రతకటం, చేసే పనిద్వారా, సొంత ఆలోచనలద్వారా, ప్రవర్తన ద్వారా ఆనందాన్ని పొందటం. కష్టపడటం ద్వారా విజయాన్ని చేరుకొనవచ్చు అని నమ్మటం.
ఈ రకపు ఆలోచనలు వ్యక్తిప్రధానంగా సాగుతాయి. అయాన్ రాండ్ తన ఈ అభిప్రాయాలను రోర్క్ పాత్రద్వారా చాలా బలంగా, ఏ నాన్చుడూ లేకుండా చెప్పింది.
వ్యక్తివాదానికి ప్రతిరూపంగా నిలిచిన హావార్డ్ రోర్క్ ఈ నవలలో మూడు రకాల వ్యక్తుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటాదు.
ఒకటి సాంప్రదాయవాదులు. రెండు కన్ ఫర్మిస్టులు, మూడు సోషలిష్టులు. సంప్రదాయ వాదులు పూర్వీకులు చెప్పిన వాటిని అనుకరించే వ్యక్తులు. కన్ ఫర్మిస్టులు సమకాలీన ఆలోచనలను అనుకరించేవ్యక్తులు. సోషలిస్టులు వ్యక్తి స్వేచ్ఛ, స్వతంత్ర ఆలోచనలను తప్పు పట్టేవ్యక్తులు. ఈ ముగ్గురినీ “సెకండ్ హాండర్స్” అంటుంది రాండ్. వీళ్లందరూ సమిష్టివాదానికి ప్రతినిధులు.
వ్యక్తివాదంలో వ్యక్తికి స్వేచ్ఛ, స్వతంత్రత ఉంటాయి. సమిష్టివాదంలో వ్యక్తి స్వేచ్ఛకు, అతని ఆలోచనలకు ఏ విలువా ఉండవు, సమాజంకొరకు అతను స్వేచ్ఛను, సొంత ఆలోచనలను త్యాగం చేయవలసి ఉంటుంది.
ఈ నవలలో సోషలిజాన్ని టూహి పాత్రద్వారా చర్చకు పెడుతుంది అయాన్ రాండ్. ప్రతిమనిషి సమాజం కొరకు త్యాగం చేయాలి, వ్యక్తిగత ఇష్టాలకు తావుండకూడదు, సమాజ హితమే మనిషి తన ధ్యేయంగా కలిగి ఉండాలి అంటూ టూహి పాత్ర ద్వారా చెప్పిస్తుంది రాండ్. ఈ అభిప్రాయాలను వంటపట్టించుకొన్న టూహి మేనగోడలు సామాజిక సేవ చేయటంలో మొదట్లో ఆనందాన్ని పొందినా క్రమేపీ ఒక యాంత్రిక జీవనాన్ని గడిపే విఫలురాలిగా మిగిలిపోతుంది. స్వతంత్రంగా ఆలోచించే రోర్క్ ని మార్చటానికి ప్రయత్నిస్తాడు టూహి, అతను మారడని తెలుసుకొని అతన్ని పతనం చేయటానికి ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్నీ చేస్తాడు.
టూహి పాత్ర ద్వారా సోషలిజాన్ని చెడ్డదిగాను రోర్క్ పాత్రద్వారా వ్యక్తివాదం మంచిదిగా ను అయాన్ రాండ్ సూత్రీకరిస్తుంది.
నవల చివరలో సంప్రదాయవాదుల్ని, కన్ఫర్మిష్టులను, సోషలిస్టులను హోవార్డ్ రోర్క్ జయించటం ద్వారా వ్యక్తి స్వేచ్ఛ, స్వతంత్ర ఆలోచనలను కలిగి ఉండటమే ఉత్తమ మానవ విలువగా అయాన్ రాండ్ ప్రతిపాదించినట్లు అర్ధమౌతుంది.
3. సమకాలీన సమాజం లో ఫౌంటైన్ హెడ్ నవల ప్రాసంగికత ఏమిటి?
సమిష్టివాదం కన్న వ్యక్తివాదం ఉత్తమమైనదని చాలా ప్రతిభావంతంగా అయాన్ రాండ్ ఈ పుస్తకంద్వారా చెప్పింది. ఈ ప్రతిపాదన ప్రజల్ని విపరీతంగా ఆకర్షించింది. ఈ నవల 1930 లలో వ్రాయబడింది. అప్పటికి ప్రపంచం రెండు ధృవాలుగా విడిపోయిఉంది. ఒక వైపు రష్యా ప్రాతినిధ్యం వహిస్తున్న సోషలిజం మరొక వైపు అమెరికా ప్రాతినిధ్యం వహిస్తున్న కేపిటలిజం. ఈ రెండు ధృవాలలో దేన్ని ఎంచుకోవాలనే డైలమాలో ప్రపంచం ఉంది.
సరిగ్గా అలాంటి సమయంలో ఫౌంటైన్ హెడ్ విడుదలైంది. సమిష్టివాదంలోని డొల్లతనాన్ని బట్టబయలు చేసిందీ నవల. మనిషి స్వేచ్ఛను కలిగిఉండటం ఎంత అవసరమో చెప్పింది. కాలక్రమేణా రష్యా పతనమవ్వటము, కేపటలిస్టిక్ పంధాలో ప్రపంచం ముందుకు సాగటము కాలానుగుణ పరిణామాలు.
పరమ దుర్మార్గమైన కేపిటలిస్టిక్ వ్యవస్థను అంగీకరించటానికి ప్రజలను సమాయుత్తపరచిందనే ఆరోపణ - ఫౌంటైన్ హెడ్ పై వచ్చిన విమర్శలన్నింటిలో నేటికీ అత్యంత ప్రధానమైనది.
ఫౌంటైన్ హెడ్ లో మానవ జీవితానికి సంబంధించిన మౌలిక మైన అంశాలైన ఎలా బ్రతకాలి, గౌరవ ప్రదమైన విజయవంతమైన జీవనానికి మార్గాలేమిటి, అలాంటి జీవనమార్గాలకు అవరోధాలేమిటి? అనే ప్రశ్నలకు అయాన్ రాండ్ సమాధానాలు పాత్రల ద్వారా చెప్పించింది.
ఈ ప్రశ్నలు సార్వజనీనమైనవి, సర్వకాలాలకూ వర్తించేవి. ప్రతీ తరం వేసుకొంటుంది.
వ్యక్తి వాదము, సమిష్టి వాదముల మధ్య ఘర్షణను ఫౌంటైన్ హెడ్ చర్చకు తెస్తుంది. ఈ ఘర్షణ రాజకీయపరమైనది కాదు మనిషి హృదయంలో జరిగేది అని అయాన్ రాండ్ చెప్పినప్పటికీ ఈ చర్చ సోషలిజాన్ని ఇరుకున పెట్టిందని అంగీకరించక తప్పదు.
మన దైనందిక జీవితంలో ఎక్కువగా ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడటం భారతీయ సమాజ లక్షణం. సమూహం ఎలా ఆలోచిస్తే అలాగే జీవించటానికి ప్రయత్నిస్తాం మనం. నలుగురితో నారాయణా, గుంపుతో గోవిందా అనటం సర్వసాధారణం.
ఇప్పుడిప్పుడే నేటి యువతఆలోచనలలో మార్పులు వస్తున్నాయి. నన్ను ఆలోచించుకోనీ, అది నా తత్వానికి సరిపడదు, నేను ఇంతే ఇలాగే ఉంటాను, నాక్కొంచెం స్పేస్ కావాలి లాంటి మాటల్ని నేటి యువతరం ఎక్కువగా వాడుతుంది. సరిపడని సంసారాలలో మగ్గిపోయి క్షోభపడే కంటే విడాకులు తీసుకొని స్వతంత్రంగా బ్రతకటం నేడు సాధారణమైంది. నేడు నిందితులకు కూడా మానవ హక్కులు ఉంటాయని సమాజం అంగీకరిస్తున్నది. ఇది కాలధర్మం.
అమెరికన్ సమాజం ఆలోచించినట్లుగా భారతదేశ సమాజం ఆలోచించటానికి యాభై ఏళ్ళు పడుతుంది అని అంటారు. ఈ పుస్తకంలోని భావజాలాన్ని అంగీకరించటానికి భారతీయ సమాజం నేడు తెరుచుకొని ఉంది. ఆ రకంగా చూస్తే సరైన సమయంలో వచ్చిన అనువాదం ఇది.
4. అనువాద విశ్లేషణ
A. హృద్యమైన అనువాదం:
రోర్క్ చదువుతున్న కాలేజ్ డీన్ తో సంభాషణ ఇది. రెంటాల వారి అనువాదం ఎంత ఆహ్లాదంగా, హాయిగా ఉందో ఈ వాక్యాలద్వారా అర్ధం చేసుకొనవచ్చును.
I don’t intend to build in order to have clients. I intend to have clients in order to build. నేను క్లయింట్లకోసం కట్టాలనుకోను. కట్టడం కోసం క్లయింట్లు కావాలని కోరుకొంటాను.
"My dear fellow, who will let you?"
"That’s not the point. The point is, who will stop me?
“ఓరినాయినా! ఎవరు కట్టనిస్తాడు నిన్ను?
ఎవరు కట్టనిస్తారు అన్నది కాదండి విషయం. ఎవరు ఆపుతారు అన్నది పాయింటు”
ఒకచోట స్వేచ్ఛను నిర్వచిస్తూ డొమినిక్ ఇలా అంటుంది.
To ask nothing. To expect nothing. To depend on nothing.”
ఏమీ కావాలనుకోకపోవటం. ఏమీ ఆశించకపోవడం. దేనిమీదా ఆధారపడి ఉండకపోవటం.
రోర్క్ ఒక సందర్భంలో వైనాండ్ తో ఇలా అంటాదు.
“I could die for you. But I couldn't, and wouldn't, live for you.”
మీకోసం చనిపోగలను గాని మీకోసం బతకలేను, బతకను.
B. మూలం పట్ల విధేయత
"Howard--anything you ask. Anything. I’d sell my soul..."
ఏదడిగినా సరే. ఏదైనా. నా ఆత్మని ఇచ్చేస్తాను.
“To sell your soul is the easiest thing in the world. That's what everybody does every hour of his life. If I asked you to keep your soul - would you understand why that's much harder?”
నీ ఆత్మని ఇచ్చేయడం అన్నింటికన్నా తేలిక. ప్రతివాడూ ప్రతినిముషం చేస్తున్నపనే అది. నీ ఆత్మని నువ్వు ఉంచుకో అని చెప్పాననుకో, అది ఎందుకు మరింత కష్టతరమౌతుందో తెలుసా?
పై సంభాషణలో రెంటాల వారు Sell my soul అన్న ఇడియంను “ఆత్మను అమ్ముకోవటం” గా అనువదించలేదు. Sell my soul అన్నమాట రెండు సార్లు వచ్చింది. ఆత్మను అమ్ముకోవటం అనే మాట రోర్క్ సంభాషణకు పొసుగుతుందేమో కానీ కీటింగ్ సంభాషణకు పొసగదు. అందుకని రెండుచోట్లా అతికే “ఆత్మను ఇచ్చేయటం” అనే మాట వాడారు. ఇది మూలం పట్ల విధేయతగా భావించవచ్చు.
తాగుడికి బానిస అయిన సందర్భంలో “ పీతలాగ తాగేస్తున్నాడు” అని అనటం తెలుగు వాడిక. He drinks like a fish. అనే వాక్యాన్ని చేపలాగ తాగేస్తున్నాడు అని అనువదించారు. ఇది కూడా మూలం పట్ల విధేయతగానే అనుకొంటాను.
C. పాఠకుని పట్ల విధేయత
ఈ క్రింది సంభాషణ వైనాండ్ కి డొమినిక్ కి మధ్య జరుగుతుంది.
“I love you so much that nothing can matter to me - not even you...Only my love- not your answer. Not even your indifference”
నేను నిన్ను ప్రేమిస్తున్నాను. డొమినిక్, ఎంతగా ప్రేమిస్తున్నానంటే, దేన్నీ పట్టించుకోను- నిన్నుకూడా. అర్ధమైందా? కేవలం నా ప్రేమ ఒక్కదాన్నే పట్టించుకొంటాను. నీ స్పందనని కాదు. నీ పట్టించుకోనితనం కూడా పట్టదు నాకు.
మూలంలో రెండువాక్యాలుగా ఉన్న భావాన్ని తెలుగులోకి అయిదువాక్యాలుగా అనువదించారు. మూలంలో లేని డొమినిక్ అన్న సంబోధన, అర్ధమైందా అనే ప్రశ్నా? లాంటివి ఆ సందర్భంలోని లోతును, గంభీరతను చదువరికి అర్ధం చేయించటానికి చేసిన ప్రయత్నంగా భావించవచ్చు.
చాలా చోట్ల ఇంగ్లీషు పదాలను యధాతథంగా ఉంచేసారు. ఇంటర్వ్యూ, ఆర్కిటెక్టు, ప్రొజెక్టు, డెస్క్, డెజైన్, పెయింట్, గ్రానైట్, లైబ్రేరీ, అపార్ట్ మెంటు, ఫీలింగు లాంటి వందలాది ఇంగ్లీషు పదాలకు తెలుగు చేయలేదు. దీన్ని కూడా ఒకరకంగా పాఠకుల పట్ల విధేయతగానే గుర్తించాలి.
స్థిర తిరస్కృతులు (firm refusals), పరివేషం (Halo), అసుఖం (uncomfortable), క్షయీకృత (emaciated), విరసప్రశాంతి (serenity), ఉపన్యాస శృంఖల (series of Lectures) లాంటి అనువాదాలు ఇబ్బంది పెట్టాయి. అది సద్యస్ఫురణ కావొచ్చు.
మొత్తం మీద అనువాదం హృద్యంగా ఉంది. మూలానికి విధేయంగా ఉంటూనే అందంగా మంచి బిగితో సాగింది.
***
ఫౌంటైన్ హెడ్ లో అయాన్ రాండ్ స్వేచ్ఛ, స్వతంత్ర ఆలోచన, ఇంటిగ్రిటీ మానవులకు ఉండాల్సిన ఉత్తమ లక్షణాలు అంటుంది. మొదటి రెండు మానవులుగా మన హక్కులు అనుకొంటే ఇంటిగ్రిటీతో జీవించటం మన బాధ్యతగా భావించాలి.
ఫౌంటైన్ హెడ్ పుస్తకం ఈనాటికైనా తెలుగులో రావటం ఆనందించదగిన సందర్భం. రెండు మూడు తరాలుగా ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేస్తున్న నవల ఇది. ఈ పుస్తకాన్ని ప్రేమించేవాళ్లు ఎంతమందైతే ఉన్నారో ద్వేషించే వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. అందుకనే ముందుమాటలో శ్రీ రెంటాల వారు “విభేదించటానికి అయినా చదవాల్సిన రచయిత్రి అయాన్ రాండ్” అంటారు. నామట్టుకు నేను ఆత్మశోధన చేసుకోవటానికి ఈ పుస్తకం తప్పని సరిగా చదవాలని అనుకొంటాను.
ఫౌంటైన్ హెడ్ పుస్తకం ఒక మానసిక ఆవరణం. అక్కడ మానవ జీవితానికి సంబంధించిన అనేక దృక్ఫధాలు యుద్ధం చేసుకొంటూ కనిపిస్తాయి. ఆ భిన్న దృక్ఫధాల మధ్య మనం ఎక్కడ ఉన్నామో తరచి చూసుకోవటానికైనా ఈ పుస్తకాన్ని ప్రతిఒక్కరూ చదవాలి.
బొల్లోజు బాబా
8/2/2020

శ్రీ అదృష్టదీపక్ గారు

శ్రీ అదృష్టదీపక్ గారు "మానవత్వం పరిమళించే" కవిగా సుప్రసిద్ధులు. వీరి సప్తతిపూర్తి సందర్భంగా "దీపం" పేరుతో అభినందన సంచిక, "తెరచినపుస్తకం" పేరుతో వ్యాససంపుటి వెలువరించారు.
***
శ్రీ అదృష్టదీపక్ ద్రాక్షారం కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా పనిచేసారు. ఓ ఇరవై ఏళ్లక్రితం నేను ఏలేశ్వరంలో లెక్చరర్ గా పనిచేసే రోజుల్లో వీరిని స్పాట్ వాల్యూయేషన్ కాంపులో చూసేవాడిని. అదృష్టదీపక్ గారని తెలుసుకానీ వెళ్ళి పరిచయం చేసుకోలేదు అప్పట్లో. వీరితో పాటు సన్నగా పొడుగ్గా మరో లెక్చరర్ వచ్చేవారు. కాంటీన్ వద్ద వీరి సంభాషణలపై ఒక చెవి పారేసేవాడిని. మంచి సాహిత్యవిషయాలు దొర్లుతుండేవి. ఒకరోజు వీరిమాటల్లోంచి జారిన "Life is nothing but skipping from one routine to another" అనే మాట భలే పట్టుకొంది నన్ను. ఆ వాక్యాన్ని ఫుట్ నోట్సులో ఇస్తూ ఓ కవితను వ్రాసుకొని నా మొదటి సంకలనం "ఆకుపచ్చని తడిగీతం"లో దాచుకొన్నాను.
ఆ తరువాత చాలా సభల్లో కలిసాను. పరిచయం చేసుకొన్నాను. వారి వాత్సల్యాన్ని పొందుతున్నాను. శ్రీ అదృష్టదీపక్ గారు నిగర్వి, స్నేహశీలి, భోళామనిషి. నా "కవిత్వ భాష" పుస్తకాన్ని వారికి ఇచ్చినపుడు ఆ పుస్తకంలోని అంశాలపై గంటసేపు మాట్లాడారు ఆ పుస్తకంలోని లోతుపాతుల్ని చర్చిస్తూ, సూచనలు ఇస్తూ.
అప్పుడు అర్ధమైంది వారి పరిశీలన ఎంత సునిశితమైనదో!
***
అదృష్టదీపక్ గారు ప్రముఖ సాహితీవేత్తలతో తనకున్న అనుభవాలను తలచుకొంటూ వ్రాసిన వ్యాససంపుటి "తెరచిన పుస్తకం".
శ్రీశ్రీ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఒక పాట రాయించుకొనే సందర్భంగా ఆయనను కలుసుకొన్నప్పుటి అనుభవాన్ని అదృష్టదీపక్ గారు ఒక పోస్ట్ కార్డ్ పై వ్రాసి పురాణం గారికి పంపగా వారు ఆంధ్రజ్యోతి వీక్లీలో ప్రచురించారట. ఆ వాక్యాలు ఇవి
"అనారోగ్యంతో మంచంమీద ఉన్న మహాకవి శ్రీశ్రీ ని కలిసాను
పెరిగిన చిరుగడ్డంతో విప్లవమూర్తి లెనిన్ లా కనిపించారు"
.
ఇది జరిగిన ఒక వారానికి శ్రీశ్రీ మరణించారు.
గజ్జెల మల్లారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి, చాసో, చెరబండరాజు, స్మైల్, సి. నారాయణరెడ్డి, చందు సుబ్బారావు, టి. కృష్ణ, మాదాల రంగారావు లాంటి ప్రముఖలపై వ్రాసిన వ్యాసాలు ఆసక్తికరంగా సాగుతాయి.
వీటన్నింటినీ చదివినపుడు శ్రీ అదృష్టదీపక్ గారు మానవసంబంధాలను ఎంత ఆత్మీయతతో నిలుపుకొన్నారో, ఎంత ఆర్థ్రతతో నింపుకొన్నారో అనిపించకమానదు. వీరి యాభై సంవత్సరాల సామాజిక జీవనంలో పరిమళించిన అనుభవాలతో అల్లిన మాలికలు ఈ వ్యాసాలు.
ఇదే సంపుటిలో శ్రీ అదృష్టదీపక్ తన చిన్ననాటి జ్ఞాపకాలను, తను వ్రాసిన సినిమాపాటల నేపథ్యాలను వివరిస్తూ వ్రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి.
ఈ పుస్తకం అభ్యుదయ రచయితగా, అరసం కార్యకర్తగా ఒక హృదయమున్న మనిషి జీవితాన్ని మనముందు పరుస్తుంది. అర్ధశతాబ్దపు తెలుగు సాహిత్యచరిత్రను తడితడిగా స్పృశిస్తుంది.
***
శ్రీ అదృష్టదీపక్ సప్తతిపూర్తి సందర్భంగా "దీపం" పేరుతో వెలువడిన పుస్తకంలో మిత్రులు వీరిపై ప్రేమతో వ్రాసిన సుమారు ముప్పైవ్యాసాలు ఉన్నాయి. బి.వి.పట్టాభిరాం, మందలపర్తి కిషోర్, చందు సుబ్బారావు, ఆవంత్స సోమసుందర్, మాకినీడి సూర్యభాస్కర్, సుధామ, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు లాంటి ప్రముఖుల అభిప్రాయాలతో కూడిన అభినందన సంచిక ఇది.
ఈ వ్యాసాలు శ్రీ అదృష్టదీపక్ సాహిత్యస్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి. ఒక అభ్యుదయవాదిగా, కవిగా, కథకునిగా, సినీ కవిగా, ఒక సాహిత్య కార్యకర్తగా తెలుగు సాహితీలోకంలో శ్రీ అదృష్టదీపక్ ప్రస్థానాన్ని, పదిలపరచుకొన్న స్థానాన్ని మరొక్కసారి గుర్తుచేస్తాయీ వ్యాసాలు.
1978 లో వెలువరించిన "ప్రాణం" కవిత్వ సంపుటిలోంచి ఈ కవితావాక్యాలు నేటికీ తాజాగానే ఉన్నాయి
.
//కన్నీళ్ళ సముద్రంలో/కత్తుల కెరటాలు లేస్తాయి (పదును)
.
అయోమయంలోంచి అక్షరాలు ఉదయించవు
నైరాశ్యంలోంచి విప్లవాలు ఉప్పొంగవు (చిట్లిన ఈ వ్రేళ్ళకు కట్లు కట్టండి)
.
అక్షరాలకు శిక్షలు రద్దుచేసారనే అందమైన కల వచ్చింది (జండా)
.
కాంతిమార్గానికి అడ్డం వస్తే
కంటిరెప్పలనైనా సరే కోసేయండి (విద్యుద్గీతం)
***
శ్రీ అదృష్టదీపక్ మంచి కవి, కథకులు, విమర్శకులు. అభ్యుదయభావాలున్న అనేక సినీగీతాలు రచించారు.
వీరు దశాబ్దాలుగా వివిధ పత్రికలలో పదకేళి ఫీచర్ ని నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు వీరి పదకేళిలను నేను నింపేవాడిని. ఇప్పుడు ప్రతివారం మా అమ్మాయి ఎంతో ఆసక్తిగా నింపుతుంది. "దీన్ని రూపొందించిన సారు నాకు తెలుసు... తెలుసా" అని చాలాసార్లు మా అమ్మాయి వద్ద గొప్పలు పోయాను నేను.
అదృష్ట దీపక్ గారు మీకు సప్తతి శుభాకాంక్షలు.
మీరు నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి, మా మనవరాలు కూడా మీ పదకేళి నింపటానికి పోటీపడాలి...
బొల్లోజు బాబా
Image may contain: 2 people, people smiling, glasses, text that says "తెరచిన పుస్తకం 6 అదృష్టదీ దీపం సప్తతిపూర్తి అభినందన సంచిక అదృష్టదీపక్"

రూమీ

ఒక మంచి పని చేసి
నదిలోకి విసిరేయ్
ఏదో ఒక రోజు ఎడారిలో
అది నీవద్దకు తిరిగి వస్తుంది -- రూమీ

శ్రీ యాకూబ్ సర్ పరిచయం

Kavi Yakoob
చదివిన పుస్తకం:
Bolloju Baba : ఇదేమిటి, ఈ మధ్యకాలంలో వస్తున్న కవితాసంపుటాలు ఒకదానిని మించి ఇంకొకటి మనసును హత్తుకునే స్థాయిలో ఉంటున్నాయి!?
అందులో ఈ బొల్లోజు బాబాను చదువుతుంటే మనసు ఉప్పొంగింది. ఎంత సున్నితంగా పదాలను లోపలికి జొప్పిస్తున్నాడు అన్పిస్తోంది. కవిత్వమర్మం ఎరిగిన అనుభవజ్ఞుడిలా ప్రతి పుటలోనూ కవిత్వాన్ని వారబోసాడు. అందులోంచి బయటికి రావడం కష్టమే.
ఇదివరకటి పుస్తకాలకు భిన్నమైన నడకను ఇందులో సాధించాడు. మార్మికతను అక్షరాలకు తొడిగాడు. సున్నితమైన అంశాలను ఒడుపుగా చెప్పే నిర్మాణాన్ని చిక్కించుకున్నాడు. అలతి అలతిగా చెప్పే పద్ధతి మరొక ప్రత్యేకత. కవిత్వంలో నిండుదనం ఉంది. సుకుమార భాష. ఎలుగెత్తి చాటాల్సిన అంశాన్నైనా ఒడుపుగా, ఒద్దికగా చెప్పడం. ఇవన్నీ కలగలిసి అత్యుత్తమ కవిత్వంగా ఈ కవితాసంపుటిలోని ప్రతి కవితా ఆకట్టుకుంటుంది.
ఇంతకీ అతని కవిత్వమేమిటీ?
ఏ రెండు
కన్నీటి చుక్కలు ఒకేలా ఉండవు

మూడో కన్నీటి చుక్క పుస్తక సమీక్ష శ్రీ అరవింద జాషువా



Aravind Jashua మిత్రమా... నేనెలా స్పందించాలో కూడా తెలియటం లేదు.
ఒకటి మాత్రం అర్ధమైంది. నా పుస్తకం చేరాల్సిన ఒక "సహృదయుని" కి చేరింది...... అంతే... అంతకు మించి నాకు ఇంకేమీ తట్టటం లేదు... మన్నించు
బొల్లోజు బాబా
***
Bolloju Baba గారు ఏదో నన్ను ప్రేమించి తన "మూడో కన్నీటి చుక్క" కవితల పుస్తకం పంపించారు గానీ నిజానికి ఆ పుస్తకం గురించి విశ్లేషించే అర్హత నాకేమీ లేదు. ఆయన కవితలు fb లో పోస్ట్ చేయగానే చదవడం, ఆయన శైలికి, భావవ్యక్తీకరణ లోని నిజాయితీకి అచ్చెరువొందడం, ఆపుకోలేక ఆ కవితలలో ఒకదాన్ని నాకు ఒచ్చిన english లోకి మార్చి రాయడం తప్ప. నేను జీవితంలో నిజంగా చదివిన కవితల పుస్తకాలు రెండే. 1) శ్రీ శ్రీ మహాప్రస్థానం 2) తిలక్ అమృతం కురిసిన రాత్రి. ఈ రెండూ కాకుండా రష్యన్ కవి పుష్కిన్ కవితలు కొన్ని ఇంగ్లీష్ లో చదివాను అంతే. వీటినే మాటిమాటికీ చదవడం తప్పించి కవితలు పెద్దగా చదివింది లేదు. మహాప్రస్థానం ఇంట్లో ఉండేది కాబట్టి చిన్నప్పుడు చదివినా ఒకటీ రెండు కవితలు తప్పించి మిగతా కవితల్లోని పదాలకి మనకి అర్ధాలే తెలియకపోవడం వల్ల, శ్రీ శ్రీ గారి ఆవేశం తో మా నాన్నగారు relate చేసుకున్నట్టుగా నేను relate చేసుకోలేకపోవడం వల్ల అది తిరిగి పుస్తకాల షెల్ఫ్ లోపలికి వెళ్ళిపోయింది.
ఇక మిగిలింది అమృతం కురిసిన రాత్రి. దాన్నే సంవత్సరాల తరబడి చదువుతూ, అనుభూతి చెందుతూ వస్తున్నా. మహాప్రస్థానం కంటే అమృతం కురిసిన రాత్రి నన్ను ఆకర్షించడం వెనక రెండు కారణాలు ఉన్నాయనుకుంటున్నా. 1) నాకు కమ్యూనిజం లాంటి విప్లవ భావాలకన్నా ప్రేమ లాంటి సున్నిత భావాలు ఉండడం. 2) అమృతం కురిసిన రాత్రి సరళమైన, సులభమైన మామూలు మాటలలో రాయబడడం. నిజానికి మొదటికారణం కన్నా రెండోదే బలమైనది అనుకుంటా. ఆ సింప్లిసిటీ వల్లే అమృతం కురిసిన రాత్రి ప్రభావం మరింత ఎక్కువగా నా మీద ఉంది. బాబా గారి కవిత్వం పట్ల నాలాంటి మామూలు, కవి రచయితల సంఘాలలో అస్సలు కనిపించని వ్యక్తి కి ఆకర్షణ కలగడానికి కారణం అదే సరళత్వం, అదే సింప్లిసిటీ.
నిజానికి కవిత అనే formatలో ఏదైనా భావాన్ని వ్యక్తీకరించే రోజులు ఇంకా ఉన్నాయా అని అనిపిస్తోంది కొన్నిసార్లు. రొమాంటిసిజానికి రోజులు కావు ఇవి. బాబా గారు అన్నట్టు
జీవితం అనే పదునైన కత్తి
కాలాన్ని-
ఆఫీసు, అనుబంధాలు, స్వప్నాలుగా
ముక్కలు ముక్కలు చేసి వడ్డించే" రోజులు ఇవి. ఒక 20 ఏళ్ల క్రితం నేను కవిని అని చెప్పుకుంటే ఎలాఉండేదో తెలియదు కానీ, ఈ రోజుల్లో నేను కవిని అని చెప్పుకుంటే జనం అవసరమా అన్నట్టు చూస్తారని అనిపిస్తుంది. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో, ముందుకన్నా మరెక్కువగా మనకి కవుల, రచయితల, చిత్రకారులు, సినిమా దర్శకుల అవసరం ఉంది. మార్కెట్ అనే Molekh మన మెడకు డబ్బు అనే కేరట్ కట్టి గాడిద తన ఇరుసులో తిరుగుతున్నట్టుగా మనల్ని materialism చుట్టూ తిప్పుతూ, అవసరమైతే మత మౌఢ్యాన్నీ, కుల పిచ్చినీ కూడా మనకి inject చేసి మనం మనుషులం అని మర్చిపోయేలా చేస్తున్న ఈ రోజుల్లో, కవుల అవసరం మరింత ఉంది. రచయితల, చిత్రకారులు, గాయకుల, సినిమా దర్శకుల అవసరం మరింత ఉంది. మానవత్వం వైపు (ఒంటరిగా అయినా, వెలివేయబడి అయినా)నించుని గొంతెత్తి నిజాన్ని మానవత్వాన్ని, సరైన జీవిత ప్రధాన్యతలని చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రేమని పంచాల్సిన అవసరం ఉంది. ఒక alternative దృక్కోణం అవసరం ఇప్పుడు మరింతగా ఉంది. అదే బాబా గారి కవితల్లో నాకు కనిపించింది. కవిత్వం విషయంలో పామరుడినైన నన్ను ఆయన కవితలవైపు ఆకర్షించింది. ఎందుకంటే కవులు, కళాకారులు బాబా గారే "సృజన" అనే కవితలోఅన్నట్టుగా -
ఏవి
అంతకుముందు లేవో
వాటిని కొందరు
గొప్ప కాంక్షతో, దయతో
అన్వేషించి
అక్షరాల్లో మనోప్రపంచాల్ని,
శిలల్లో భంగిమలని
రంగుల్లో ప్రవహించే దృశ్యాలను
అవిష్కరిస్తుంటారు.
వాటిని కొందరు
గొప్ప విభ్రమతో, లాలసతో
అలా చూస్తూనే ఉండిపోతారు ఏనాటికీ".
అదీ విషయం. సృజనాత్మకత, సృజనశీలుల అవసరం ఉంది. ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది.
***
మతం పేరుతో మారణకాండ జరుపుతూ , ఆవు పేరుతో సాటి మనుషుల్ని హత్యకావిస్తున్న ఈ రోజుల్లో- ఆవుని పూజించడం ఈ దేశంలోని హిందువుల సంస్కృతి అన్నది ఎంత నిజమో అది వొట్టిపోతే కబేళా కి పంపించి కొత్త అవుని కొనుక్కోవడం అంతే సహజం అని "కుట్రలు" అనే కవితలో బాబాగారు చెప్పినట్టుగా ధైర్యంగా చెప్పే కవుల అవసరం ఉంది.
"ఇపుడీ దేశానికి ఏమైంది
ఎవరిని వదశాలకు పంపడానికి
ఇన్ని కుట్రలు పన్నుతోంది?"
(కుట్రలు)
అని ఖుల్లంఖుల్లాగా నిజాలుచెప్పగల మానవత్వం గల కవుల, కవితల అవసరం ఉంది.
"భయ్యా! నేనన్నీ గమనిస్తూనే ఉన్నాను" అన్న కవితలో ఇన్నేళ్ల మా స్నేహంలో ఇటు పులిహోర బూరెలు అటు
అటు సేమియా బిర్యానీలు ఇటూ ప్రవహిస్తూనే ఉన్నాయి" అన్న వాక్యంలో మనందరం మన ముస్లిం స్నేహితులని చూసుకుంటాం. కానీ తర్వాత వచ్చే పంక్తులే
"కానీ మొన్న జండాల పండగ రోజున
మైకులో "వందేమాతర గీతం వస్తుంటే దాన్ని
కూడబలుక్కుంటూ
వచ్చి రాని ఉచ్చారణ లో వణుకుతూ అందరికీ వినబడేలా
అతను పైకి పాడడం చూసాక నాకు భయం వేసింది"
- ఎలా మనం మన సోదరులని betray చేశామో గుర్తుచేస్తాయి.
***
చలం గురించి ఆయన స్నేహితుడు రామ్మూర్తి ఇలా అన్నాడట "chalam is a man with a woman's heart" అని. గొప్ప రచనలు గొప్ప కవితలు రాయాలంటే అమ్మాయిల మనసుకి ఉండే సున్నితత్వం ఉండాలి. స్పందించాలంటే, ఆక్రోశించాలంటే గుండెలో ఇంకా చెమ్మ ఉండాలి. అది ఉంది కాబట్టే బాబా గారు సమాజంలో జరుతున్న ప్రతీ విషయం గురించీ స్పందించారు. అది ఎంత చిన్న విషయం అయినా అది ఆయన దృష్టి ని దాటిపోలేదు. పోలవరం బోటు ప్రమాదం జరిగినప్పుడు ముందూ వెనకా ఆలోచించకుండా గోదావరిలో దూకి అనేకమందిని రక్షించిన చదువూ సంధ్యా లేని అనాగరికులైన గిరిజనుల గురించి ఎవరు వీళ్లంతా? అని మనం ఆలోచించామా? వాళ్ళు ఎవరో బాబా గారు ఇలా చెప్పారు.
"ఐస్ ఏజ్ నుంచి డిజిటల్ ఏజ్ దాకా
మానవజాతి నౌకాయానానికి
ఏ చరిత్రా గుర్తించని
కనిపించని తెడ్లు వీళ్ళు.
మనుషులుగా మనం పూర్తి వైఫల్యం
చెందలేదనడానికి మిగిలున్న
ఒకే ఒక సాక్ష్యం వీళ్ళు"
(ఎవరు వీళ్లంతా).
***
ఈ కవితా సంపుటి అంతా కొన్ని అద్భుతమైన expressions తో నిండివుంది. కొన్ని ప్రశ్నించేవి, కొన్ని తీవ్రంగా అనుభూతి చెందించి "wow"అనిపించేవి. పిచ్చుకల గురించి, చెట్లగురించి, కొండల గురించి, పాపల గురించి, నాన్నల గురించి, తనప్రియుడి పేరు పచ్చబొట్టు పొడిపించుకున్న అమాయకురాలైన ప్రేమికురాలిగురించి, చావు గురించి, బతకడంలోని మజా గురించి ,బతుకులో అస్తిత్వం కాపాడుకోవాల్సిన అవసరం గురించీ, అమ్మాయిల ఆ "మూడు రోజుల" గురించీ ఇంకా ఎన్నో. ఈ పుస్తకం గురించి ఇంకా రాయాల్సింది బోల్లంత ఉంది. మనసుని తట్టే మాటలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. బహుశా గత 25 యేళ్లుగా నేను అమృతం కురిసిన రాత్రి చదువుతున్నట్టే అనేక సంవత్సరాలు "మూడో కన్నీటి చుక్క" చదువుతూనే ఉంటాను. పూర్తిగా నాలో ఇంకేవరకూ.
***
వైవిధ్యమే అందం. ఎదుటిమనిషిని judge చేస్తూ ఉన్నంతకాలం, ఎదుటివారికన్న నైతికంగా ఉన్నతులం అని భావిస్తున్నంత కాలం మనం వాళ్ళని ప్రేమించలేం. జీవితాన్ని ఆస్వాదించలేం.
బాబాగారు అన్నట్టుగా -
ఏ రెండు
కన్నీటి చుక్కలూ ఒకేలా ఉండవు.
వాటిని చూసినపుడు
జారిన మూడో కన్నీటి చుక్క
కవిత్వం.
***
ఇంతకీ బాబా గారిని నేనెప్పుడూ కలవలేదు. కానీ కలిసినపుడు ఏం మాటాడతాను? నేనేమీ కవినీ critic కాదు కాబట్టి ఆయన తన "ప్రవహించే వాక్యం" లో అన్నట్టుగా "నిర్మాణ వ్యూహాల గురించీ ఇప్పుడు బలంగా వీస్తున్న పరిణామాల" గురించీ అయితే మాట్లాడు కోము for sure. బహుశా "ఒక కవిని కలిశాను" కవితలోలా ఆయన చేతిని నాచేతుల్లోకి తీసుకుంటాను.
"పావురం కన్నా మెత్తగా
నీరెండకన్నా వెచ్చగా
కవిగా బ్రతికిన క్షణాల వాసన వేస్తూ" ఉన్న ఆ చేయిని అదిమి నా కృతజ్ఞతలు తెలియచేస్తాను.