Sunday, February 9, 2020

గాధాసప్తశతిలో మానవసంబంధాలు -1



రెండువేల సంవత్సరాలనాటి గాథాసప్తశతిలో ఆనాటి సామాన్యులు ఎలాంటి మానవసంబంధాలను కలిగి ఉండేవారు అనేది చాలా ఆశక్తికరమైన అంశం. గ్రామపెద్ద, తల్లి, పిన్ని, అత్త, భర్త, భార్య, ప్రియుడు, ప్రియురాలు, దూతలు, మరిది, సవతి, కోడలు, పిల్లలు లాంటి పాత్రలతో చెప్పించిన అనేక గాథలద్వారా వారు నెరపిన మానవీయబంధాలు తెలుస్తాయి. ఆనాటి కుటుంబ, సాంఘికజీవనాలు ఎలానడిచాయన్నది అర్ధమౌతుంది.

సప్తశతి గాథలన్నీ గ్రామీణజీవనానికి సంబంధించినవి. పరిపాలనకు సంబంధించి ఒక గ్రామ పెద్ద, పన్నులు వసూలు చేసే అధికారి ఉండేవారని ఈ గాధల ద్వారా తెలుస్తుంది. ఆ పై స్థాయి పరిపాలనా అంతస్తుల వివరాలు తెలియరావు. ఆనాటి గ్రామాలు స్వతంత్రతను, కొంతవరకూ స్వయంపాలనను కలిగిఉండేవని అనుకోవచ్చు.

1. గ్రామాన్ని సంరక్షించటం గ్రామపెద్ద విధి. అది బహుసా దొంగలు, బందిపోట్ల ముఠాలనుంచి కావొచ్చు. ఆ విధినిర్వహణలో అతను వీరోచితంగా వ్యవహరించి, గాయాలపాలయ్యేవాడని అర్ధమౌతుంది ఈ క్రింది గాథద్వారా...

ఊరికాపు అయిన మగని చాతీ
మానిన గాయాలతో ఎగుడుదిగుడుగా ఉంది.
దానిపై తలాన్చి పడుకొన్న భార్యకు నిద్రపట్టటం లేదు.
ఊరు మాత్రం ప్రశాంతంగా నిదురపోతోంది. (31)

2. గ్రామపెద్ద విధి వంశపారంపర్యం. కాబోయే గ్రామపెద్ద చిన్నతనం నుండే తండ్రివద్ద ఊరిని సంరక్షించే విద్యలను నేర్చుకొని, అవసరమైనప్పుడు తన సాహసాన్ని ప్రదర్శించటం లాంటివి కొన్ని గాధలలో కనిపిస్తుంది.

అతని బంధువులు శంకించినట్లు
శత్రువులు భయపడినట్లు
ఊరికాపు కొడుకు, చిన్నవాడైనప్పటికీ
గ్రామాన్ని కాపాడటంలో
అసామాన్యమైన ధైర్యసాహసాలు
ప్రదర్శించాడు. (630)

3. తనకు నిర్ధేశించబడిన ధర్మాన్ని ఆచరించటమే జీవనపరమార్ధమని ప్రాచీన భారతీయసంస్కృతి చెపుతుంది.

మరణశయ్యపై ఉన్న ఊరికాపు
తన కొడుకును దగ్గరకు తీసుకొని ఇలా అన్నాడు
"నాయినా! నా పేరు చెప్పుకోవటానికి
సిగ్గుపడేలా ప్రవర్తించకు ఏనాడూ" (634)

పై గాథలో ఆ ఊరికాపు తన ధర్మాచరణలో ఏ తప్పూ చేయలేదని ఎంత ఆత్మతృప్తితో ఉన్నాడో అర్ధమౌతుంది. ఎంతటి నిష్కల్మష జీవితాలు అవి!

4. గ్రామానికి సంబంధించిన బాగోగులు చూసుకోవటంలో తలమునకలై "సంసారిక బాధ్యతలను" విస్మరించే గ్రామపెద్దలు/మల్లయోధుల ప్రస్తావనలు కొన్ని ఉన్నాయి.

ఓసి పిచ్చిదానా!
ఆనందంతో గంతులు వేస్తావెందుకూ?
ఇది సిగ్గుపడాల్సిన సందర్భం.
కుస్తీపోటీలో నీ భర్త విజయం సాధించినందుకు
మోగిస్తున్న విజయభేరి
నీ సంసారంలో సుఖం లేకపోవటాన్ని
ఊరంతా చాటింపు వేస్తున్నది. (687)

5. ఊరికాపు, పన్నులు వసూలు చేసే అధికారి, ధనికరైతులు ఆనాటి సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు. ఆనాటి ప్రజలు స్వేచ్ఛా శృంగార ప్రియులు. గొల్ల, వెలమ, మంగలి, కాపు, కంసాలి వంటి కులాల ప్రస్తావన ఉన్నప్పటికీ శృంగారపరంగా కులమతాల ప్రస్తావన ఎక్కడా కనిపించదు.

ఊరిపన్నులు వసూలు చేసే అధికారి భార్య
రోజూ ఇచ్చే మధురమైన వంటకాల రుచిమరిగిన
ఆ పాలెకాపుకు మరే ఇతర తిండి సయించటమే లేదు.

ఆ డబ్బున్న స్త్రీ, పాలెకాపును ముగ్గులోకి దించినట్లుంది. ధనవంతులు తినే ఖరీదైన, రుచికరమైన వంటకాలను అతని పేద భార్య ఎక్కడనుంచి తేగలదూ?

6. తన తొలిప్రేమను తల్లితో చెప్పుకొనే యవ్వనవతులు ఈ గాథలలో అనేకమంది కనిపిస్తారు.

అమ్మా
నదిలో నేను స్నానం చేసేటపుడు
కుంకుడు రసంతో చేదెక్కి పారే నీళ్ళను
ఆ యువకుడు దోసిళ్లతో తాగుతున్నప్పుడు
నా హృదయాన్ని కూడా తాగినట్లు అనిపించిందే!

పై గాథలో తను ఇష్టపడిన అమ్మాయి శరీరాన్ని తాకి ప్రవహించే చేదునీళ్ళు కూడా తీయగానే ఉన్నాయి అని ఒక అబ్బాయి తెలియచేయటం, ఆ సంకేతాన్ని గ్రహించిన అమ్మాయి తన తల్లితో పంచుకొని మిగిలిన వ్యవహారాలు మీరు చక్కబెట్టండి అని అన్యాపదేశంగా చెప్పటం ఎంతో హృద్యంగా అనిపిస్తుంది.

7. అత్తా కోడళ్ల మధ్య సంబంధాలు కొన్ని చోట్ల స్నేహంగా, కొన్ని చోట్ల మోసపూరితంగా, మరికొన్ని చోట్ల శత్రుభావాలతో ఉంటాయి చాలా గాథలలో.

అత్తా
పదాలు ఒకటే కావొచ్చు
అవి ప్రేమతో పలికిన మాటలా లేక
పైపై పలుకులా అనే దానిని బట్టి
కాని వాటి అర్దాలు మారిపోతాయి (450)

అత్తతో తన వేదనను చెప్పుకొంటోంది పై అమ్మాయి. స్త్రీలు చేసే అలాంటి అభియోగాలకు ఈనాటికీ కూడా ఏ మగవాడూ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేడు. ఇది మగజాతికి సంబంధించి ఒక అనాది తీయని సలపరింత. అలాంటివన్నీ కలహానంతర సమాగమాన్ని ప్రకాశింప చేయటానికే.

8. తనకు లేని సుఖం పొందుతున్నారు కనుక అని ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని, తన అధికారం చేజారిపోతూండటం వల్లేనని ఏడ్లర్ సిద్దాంతాన్ని - దేన్ని అనువర్తింపచేసుకున్నప్పటికీ అత్తా కోడళ్ళ విరసాలు ఈనాటివి కావు. భార్య మోజులో పడి కొడుకు పతనమైపోతున్నాడని ఆరోపించటం అనేక గాథల్లో కనిపిస్తుంది.

వర్తకుడా!
నీకు ఏనుగు దంతాలు, పులిచర్మాలు
ఇదివరకట్లా ఎలా సరఫరా చేయగలం?
కొత్తకోడలు వయ్యారంగా పిరుదులు
తిప్పుకుంటూ ఇంట్లో తిరుగుతూంటే! (951)

కోడలు కొంగుపట్టుకొని తిరుగుతూ ఇదివరకట్లా వేటకు వెళ్ళి ఏనుగుల్ని పులుల్ని వేటాడి తేవటం లేదని దెప్పుతోంది అత్తగారు.
అంతే కాదు మరికొన్ని గాథల్లో -భార్యగుర్తుకు రావటంతో లేడి జంటపై ఎక్కుపెట్టిన విల్లును దించేసిన విలుకాళ్ళు కూడా కనిపిస్తారు. అది భార్యాభర్తల అన్యోన్యతకు సంకేతం.

9. ఈ క్రింది గాథ మానవసంబంధాలలోని సంక్లిష్టతను ప్రతిబింబిస్తుంది.

బదులు చెప్పు
అనుచిత సమయంలో, కాని చోట
విసిగిస్తే నీకు కోపం రాదా?
శృంగారంలో మునిగి ఉన్నప్పుడు
ఎంతటి గారాల బిడ్డయినా ఏడ్చుకొంటూ దరిచేరితే
ఏ తల్లి తిట్టుకోకుండా ఉంటుందీ?

విషయం స్పష్టమే. నిజానికి ఈ గాథలోని రెండవ ఉదంతం, మొదట జరిగిన ఒక సంఘటనను సమర్ధించుకోవటానికి చెప్పినట్లు తెలుస్తుంది. ఒక ప్రియుడు తన ప్రియురాలిని కాని చోట విసిగించి ఉండొచ్చు. అప్పుడు ఆమె తిరస్కరించటమో, కోపం వచ్చి తిట్టటమో చేసి ఉంటుంది.

ఆమె చేసిన పనిని సమర్ధించటానికి ఈ ప్రాచీన గాథాకారుడు ఎంత శక్తివంతమైన దృష్టాంతాన్ని తీసుకొచ్చాడో ఆశ్చర్యం కలిగించక మానదు.

10. మానవసంబంధాలు మాత్రమే మానవుడిని జీవరాశిలో ఉత్తమంగా నిలబెట్టాయి. ఈ బంధాల వెనుక ఉండే ఆర్థ్రతను సాహిత్యం మాత్రమే లిఖించగలదు. ఈ క్రింది గాథ చదివాకా హృదయం ద్రవిస్తుంది.

గర్బం ధరించిన కోడలు పిల్లను
"నీకు ఏం తినాలని ఉందో చెప్పు" అని
పదే పదే అత్తమామలు అడుగుతూంటే
తన అత్తవారింటి పేదరికాన్ని
తన భర్తకు కలిగే సంకట స్థితిని దృష్టిలో ఉంచుకొని
ప్రతీసారీ "నీళ్ళు, నీళ్ళు" అంటుందామె. (472)

పై గాథలోని కుటుంబం బహుసా తిండికి కూడా కష్టమయిన పేదరికంలో ఉండొచ్చు. అయినా సరే ఏదోలా, గర్బవతి అయిన కోడలి కోర్కెలు తీర్చాలన్న ప్రేమ ఉంది. ఆ ఇంటిని పోషించే నాథుడు తన భర్తే కావొచ్చు. అలాంటి స్థితిలో ఆమె అనుచితకోర్కెలు కోరితే, అవి వారు తీర్చలేక పోతే- వారందరిలో అపరాధనా భావం ఎక్కడ మిగిలిపోతుందోనని ఆమె పాటించే సంయమనం ముచ్చటేస్తుంది.
గొప్ప మానవసంబంధాల గిజిగూడు ఈ గాథ.

అనువాదాలు- బొల్లోజు బాబా

1 comment:

  1. నమస్కారం బొల్లోజు బాబా గారు,
    గాథా సప్తశతీ గురించి అద్భుతమైన వ్యాసాలు వ్రాసారు. మీరు చేసిన గాథల అనువాదాలు చాలా బాగున్నాయి. మీరు శ్రీ గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి గారు తెనుగించిన ఒక పద్యము ముందుమాటలో ఉదాహరించారు కదా, వారి అనువాద పుస్తకము PDF ఫైల్ కానీ లింక్ కానీ share చేయగలరు.

    ReplyDelete