Saturday, November 4, 2023

భిన్నమతాలలో ఉమ్మడి పాత్రలు - ఇంద్రుడు, బ్రహ్మ

వైదికమతంలో ఇంద్రుడు దేవతల అధిపతి. అత్యంత ముఖ్యమైన దేవుడు. సోమరసాన్ని సమర్పిస్తూ ఋగ్వేదంలో అనేక శ్లోకాలు ఇంద్రుని కీర్తిస్తూ ఉంటాయి. దుష్టశక్తులను సంహరించటం, వర్షాలు కురిపించటం, కోర్కెలు నెరవేరటం కొరకు ఇంద్రుని ప్రార్ధించేవారు. రాక్షసులనుండి, బలవంతులైన నరులనుండి దేవతలను రక్షించటం ఇంద్రుని ప్రధాన విధి.
సనాతన విశ్వాసాలు హిందూమతంగా రూపుదిద్దుకొన్నాకా వేదాలలో ప్రముఖపాత్ర వహించిన ఇంద్రుని పాత్ర క్రమేపీ తన ప్రాభవాన్ని కోల్పోయింది.
 
అహల్యతో ఇంద్రుడు శారీరికంగా కలిసి ఆమె భర్త గౌతముని ఆగ్రహానికి గురయి, ఆ కారణంగా - ఇంద్రుడు వంధ్యత్వాన్ని శాపంగా పొందాడని రామాయణంలో; శరీరమంతా వెయ్యి యోనులను కలిగిఉండేటట్లు శపించబడ్డాడని భారతంలోను భిన్న కథనాలు కనిపిస్తాయి. అప్పటికే ప్రాధాన్యత కోల్పోయిన దేవలోకపాలకుడయిన ఇంద్రుడిని ఒక నరుడు, ఒక బ్రాహ్మణుడు శపించినట్లు చెప్పటం దేవతలపై కూడా బ్రాహ్మణ వర్గం తమ ఆధిపత్యం చూపగలదు అని చెప్పటం కొరకేనని జర్మన్ ఇండాలజిస్ట్ SöhnenThieme అభిప్రాయపడ్డారు.
 
***
బౌద్ధ, జైన మతాలలో కూడా ఇంద్రుని పాత్ర కనిపిస్తుంది. కానీ ఈ మతాలలో ఇంద్రుడు సాత్వికగుణాలు కలిగిఉంటాడు. ఉదాహరణకు బౌద్ధంలోని ఇంద్రుడిపేరు “శక్ర”. ఇతను సంహారకునిగా, స్త్రీలను వశపరచుకొనేవానిగా, సోమరసాస్వాదకునిగా కాక శాంతికాముకునిగా, స్త్రీలను రక్షించేవానిగా, ఇంద్రియనిగ్రహుడిగా కనిపిస్తాడు.
 
చెట్లపై గరుడపక్షులగూళ్ళు చెదరకూడదని సైన్యాన్ని దారిమళ్ళించాడట. కుంభజాతకంలో రాజు మద్యపానాన్ని సేవించినట్లయితే రాజ్యం నాశనం అవుతుందని రాజుకు హితోపదేశం చేసి అతనిని దుర్వసనాలనుండి మరల్చాడట. Mahājanaka-jātaka కథలో భర్త మరణించి, రాజ్యం కోల్పోయి, అప్పటికే గర్భవతిగా ఉండిన ఒక పట్టపురాణిని, వృద్ధుని రూపంలో వచ్చి రక్షించాడట. ఈ ఉదంతాలన్నీ ఇంద్రుని సుగుణాలను వెల్లడిస్తాయి.
 
బౌద్ధసాహిత్యంలో ఇంద్రుడు అనేక సందర్భాలలో స్త్రీలను చెరలనుంచి విడిపించినవాడిగా, సంతానాన్ని ప్రసాదించిన దైవంగా చిత్రించబడటాన్ని బట్టి ఈ పాత్ర ఉదాత్త వ్యక్తిత్వాన్ని కలిగిఉన్నట్లు భావించాలి.

జైన సాహిత్యంలో- ఇంద్రుడు పూర్వజన్మలో యుద్ధవీరుడని జైనం స్వీకరించి మరణించే వరకూ ఆహారం తినకుండా ఉండే సల్లేఖనా వ్రతం చేసి చనిపోయినట్లు ఉంటుంది. (Bhagavatī Sūtra; 18.2)

జైన తీర్థంకరులు క్షత్రియ గర్భంలో జన్మించటం ఒక ఆచారం. జైన మహావీరుడు దేవనంద అనే ఒక బ్రాహ్మణ స్త్రీ గర్భంలో పెరుగుతున్నట్లు తెలుసుకొన్న ఇంద్రుడు, నైగమేష అనే మేకతల దైవానికి చెప్పి – ఆ దేవనంద గర్భంలో పెరుగుతున్న పిండాన్ని త్రిశల అనే పేరుగల క్షత్రియ స్త్రీ గర్భంలోకి మార్పించినట్లు జైన సాహిత్యంలో కలదు.
ఇరవైనాలుగవ తీర్థంకరుడైన మహావీరునికి ఇంద్రుడు స్వర్ణవస్త్రాన్ని సమర్పించుకొన్నట్లు మరొక జైనకథనం.

బౌద్ధ జైన మతాలలోని ఇంద్రుడు/శక్ర సాత్వికునిగా జీవిస్తూ జిన, బుద్ధ దేవులను సేవించుకొంటూ గడిపినట్లు ఉండగా; హిందూ మత ఇంద్రుడు మాత్రం యుద్ధప్రీతి, సురాపానం, స్త్రీలోలత్వం లాంటి దుర్లక్షణాలతో కనిపిస్తాడు.
.
బ్రహ్మ
.
ముల్లోకాలను సృష్టించిన వాడిగా బ్రహ్మకు హిందూమతం పెద్దపీట వేసింది. బ్రహ్మ వేదవాజ్ఞ్మయంలో కనిపించడు. బ్రహ్మకు బదులుగా ప్రజాపతి, బృహస్పతి లు వేదాలలో బ్రహ్మ పాత్రను నిర్వహిస్తారు. పురాణకాలం వచ్చేసరికి బ్రహ్మ ప్రాముఖ్యత పెరిగి త్రిమూర్తులలో ఒకరిగా కొలువుదీరటం జరిగింది.
 
పురాణాలప్రకారం బ్రహ్మకు మూడు పాత్రలు. ఒకటి, ఈ చరాచర లోకాన్ని, వేదాల్ని, ధర్మశాస్త్రాలను సృష్టించటం; రెండు, దేవతలకు పురోహితుడిగా వ్యవహరించటం: మూడు, విపత్కర పరిస్థితులలో లోకకల్యాణం కొరకు పరిష్కారమార్గాలు చెప్పటం. వీటిని జాగ్రత్తగా గమనిస్తే భూమిపై “బ్రాహ్మణుడు” నిర్వహించే పనులుగా గుర్తించవచ్చు. బ్రాహ్మణులు తాము ఐహికంగా పోషిస్తున్న పాత్రను బ్రహ్మదేవుడిగా పురాణాలలో లిఖించుకొన్నారు. కాలక్రమేణా బ్రహ్మ దేవుని పాత్ర ప్రాభవాన్ని కోల్పోయి – శతృసంహారం కొరకు యుద్ధాలు చేస్తూ అధికారాన్ని ఆధిపత్యాన్ని చలాయించే విష్ణువుకు ప్రాధాన్యత పెరగటం గమనించవచ్చు.
 
***
బౌద్ధజైనాల ప్రకారం ఈ జగతి సృష్టించబడలేదు.. ఆ మేరకు బౌద్ధ జైన మతాలలో కనిపించే బ్రహ్మ పాత్రకు ముల్లోకాలను సృష్టించే పని ఇవ్వలేదు.
 
జైనమతంలో మొదటి తీర్థంకరుడైన రిషభనాథుడు (BCE 9వ శతాబ్దం) జన్మించినపుడు బంగారం వర్షించింది కనుక హిరణ్యగర్భ (Golden womb/egg) అనే పేరుకూడా ఉంది. (హిరణ్యగర్భంనుంచి ప్రజాపతి ఆవిర్భవించాడని రుగ్వేదంలోని హిరణ్యగర్భసూక్తం చెబుతుంది. విశ్వకర్మ సూక్తం, హిరణ్య గర్భ/Golden egg అనేది విశ్వకర్మ నాభి నుంచి వచ్చిందని చెబుతుంది. ( నాభి నుంచి బ్రహ్మ పుట్టటం అనే భావన క్రమేపీ విష్ణుమూర్తికి అన్వయించారు.)

అలా జన్మించిన రిషభనాధుడు పెరిగి నగరాలను, పట్టణాలను, గ్రామాలను, శాస్త్రాలను, కళలను సృష్టించి ఈ లోకానికి ఇచ్చి తాను అన్నింటిని త్యజించి తీర్థంకరునిగా మారాడు.
రిషభనాథుని కుమారుడు భరతుడు భరతవర్షానికి మొదటి చక్రవర్తి అని, మనవడు ఆదిత్యయశ (Adityayasa) ఇక్ష్వాకువంశానికి మూలపురుషుడని- రిషభనాథుని జీవితచరిత్రను తెలిపే పౌమచరియ (Paumacariya) అనే గ్రంథంద్వారా తెలుస్తుంది.
 
తొమ్మిదో శతాబ్దానికి చెందిన జినసేనుడు రచించిన ఆదిపురాణంలో- రిషభనాథుడిని బ్రహ్మ యొక్క విశేషణాలైన ప్రజాపతి, స్వయంభు అంటూ కొన్ని చోట్ల సాక్షాత్తూ బ్రహ్మ అనే పేరుతోనే సంబోధించాడు.
జైనంలో బ్రహ్మకు సృష్టికర్త పాత్రలేదు. ఆ పాత్ర చేసే పనులను రిషబనాథుడు నిర్వహించినట్లు చెప్పటం ద్వారా, జైన సాహిత్యంలో బ్రహ్మపాత్ర ఉన్నప్పటికి ఆయన ఒక మామూలు దేవుడు.
బ్రహ్మదేవుడు బ్రహ్మ లోకంలో నివసిస్తాడని అన్ని మతగ్రంధాలలో ఉంది. జైన బ్రహ్మలోకానికి ఏ ప్రత్యేకతా లేదు.
 
బౌద్ధంలోని బ్రహ్మలోకం మానవ, జంతు, రాక్షస, నరకలోకాలకన్నా ఉన్నతమైన లోకం. బౌద్ధ బ్రహ్మలోకంలో ఒక బ్రహ్మ మాత్రమే ఉండడు, అనేకులు ఉంటారు. భూమిపై ఉత్తమజీవనాన్ని గడిపిన నిష్కామపరులు బ్రహ్మలోకంలో బ్రహ్మలుగా అవతరిస్తారు. వీరు ఇతరబౌద్ధ దేవతల వలే చావుపుటుకలు కలిగి ఉంటారు. దయ, కరుణ, సహానుభూతి, సహిష్ణుత లక్షణాలు కలిగి ఉండటం బ్రహ్మలోక అర్హతగా బుద్ధభగవానుడు తన శిష్యులకు భోదించాడు. బక బ్రహ్మ, ఘటికార బ్రహ్మ, సహంపతి బ్రహ్మ, సనత్కుమార బ్రహ్మ పేర్లతో పాలి సాహిత్యంలో అనేక బ్రహ్మలు కనిపిస్తారు. వీరందరూ బుద్ధుని సేవిస్తూంటారు.
 
బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు తన 29 వ ఏట- ఒక ముసలి వ్యక్తిని, రోగపీడితుడిని, కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూసి, హృదయము ద్రవించి ప్రజల దుఃఖానికి గల కారణాలు కనుగొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం పరివ్రాజక జీవితం స్వీకరించాడు. బుద్ధుడు తన అంతఃపురాన్ని, రాజభోగాలను విడిచిపెట్టటానికి ప్రేరణ కలిగించిన- ఆ నాలుగు సంకేతాలను (ముదుసలి, రోగి, శవం, సన్యాసి) పంపించింది Ghaṭīkāra Brahmā అని బౌద్ధ Mahāvastu గ్రంథంలో ఉంది.

***
మూడు మతాలలోను బ్రహ్మ పాత్ర కనిపిస్తుంది. బౌద్ధ జైనాలలో బ్రహ్మ బుద్ధభగవానుని, తీర్థంకరులను సేవించుకొనే ద్వితీయశ్రేణి పాత్ర. బౌద్ధ సాహిత్యంలో బ్రహ్మదేవుని ప్రస్తావనలు ఉంటాయితప్ప ఇతర త్రిమూర్తులైన విష్ణువు శివుడు గురించి ఉండవు.
 
హిందూ మతంలో బ్రహ్మ మొదట్లో త్రిమూర్తులలో ఒకరిగా పూజలందుకొన్నాడు. సామాన్యశకం తొలి శతాబ్దాలవరకు ఉత్తరభారతదేశం లో బ్రహ్మదేవుడు ప్రధానపూజలు అందుకొనేవాడని The Mythology of Brahma పుస్తకంలో Greg Bailey అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు.
 
క్రమేపీ విష్ణువు శివుడు ఎక్కువ ప్రాధాన్యత పొందటం వల్ల బ్రహ్మ దేవుని ఆరాధన సర్వత్రా తగ్గిపోయింది.

 
బొల్లోజు బాబా







Wednesday, November 1, 2023

వేదబాహ్యులు

వేదబాహ్యులు 

భారతీయ తాత్విక పరంపరలో వేదాలను ప్రమాణంగా అంగీకరించని దర్శనాలలో బౌద్ధం, జైనం, చార్వాక, ఆజీవిక లు ముఖ్యమైనవి.

చార్వాకమతం

చార్వాకుడు అంటే అందమైన మాటలు (చారు-అందమైన, వాక్కు -మాటలు) చెప్పేవాడు అని అర్ధం. చార్వాకుడు ఒకడు కాదు. అనేకులు. ప్రాచీనభారతదేశంలో నాస్తికవాదానికి ప్రాతినిధ్యం వహించిన ఒకే ఒక శాఖ చార్వాకమతం. వివిధ కాలాలలో ఇది బృహస్పత్య, లోకాయత, వైతండిక అనే పేర్లతో పిలవబడింది. చార్వాకులు భిన్నకాలాలలో బార్హస్పతులు, లోకాయతులు, వైతండికులు అంటూ వివిధ పేర్లతో చెప్పబడ్డారు. వారందరినీ చార్వాకులుగా నేడు గుర్తిస్తున్నారు. అజితకేశకంబలి, మక్కలిగోశాలి, పూర్ణకాశ్యపుడు పాయాసి ఇంకా జాబాలి ఋషి, హరి వంశములో వేనరాజు లాంటి వారు చార్వాక భావాలను ప్రచారం చేసారు. హిందూ, (Naiyayika’s, Vedantins) బౌద్ధ, జైన మతాలు సైద్ధాంతికంగా చార్వాకులతో విభేదించి వారిని విమర్శించాయి.
***

చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణమును మాత్రమే అంగీకరించారు. ఇంద్రియములకు అందనివాటిని అంగీకరించలేదు. కొన్ని ప్రత్యక్ష ప్రమాణముకు తెలియవు. ఉదాహరణకు కొండపైన నిప్పు ఉందో లేదో చెప్పలేము. కానీ అక్కడ పైకి ఎగసే పొగ కనిపిస్తుంది. అప్పుడు ప్రత్యక్షప్రమాణముకు తెలిసే పొగను బట్టి నిప్పు ఉన్నదని ఊహ చేయవచ్చు. దీనినే అనుమానము అంటారు. పాపపుణ్యాలు, ధర్మాధర్మములు లాంటివి ఇంద్రియాలకు తెలియకున్నా వాటిని అనుమాన ప్రమాణముగా తీసుకొంటారు. జైన, బౌద్దులు ప్రత్యక్షము, అనుమానము అను రెండిటిని అంగీకరించారు.
ఇవి కాక- పిల్లిని బట్టి పెద్దపులిని ఊహించగలిగే జ్ఞానాన్ని ఉపమాన ప్రమాణం అని, ఇతరుల అనుభవాల ద్వారా తెలుసుకొన్న విషయాలను శబ్దప్రమాణమని అంటారు. ఈ నాలుగు ప్రమాణాల ద్వారా ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకొని జీవితంలో ధర్మార్ధ కామమోక్షాలనే పురుషార్ధాలను పొందాలని భారతీయ దర్శనాల సారాంశం . (దర్శనకర్తలు – దర్శనములు by చర్ల గణపతిశాస్త్రి)
చెవి, కన్ను, నాలుక, ముక్కు, చర్మము అనే పంచేంద్రియములు చెప్పినవి మాత్రమే ప్రమాణములుగా అంగీకరిస్తుంది చార్వాకమతం. ధర్మాధర్మములు, పాపపుణ్యములు , దేవుడు, జన్మాంతర విషయాలు లాంటివి అభౌతికాలు, ఇంద్రియగోచరములు కావు కనుక వాటిని చార్వాకులు అంగీకరించలేదు.
***
బార్హస్పత్య (Bārhaspatya/బార్హస్పత్య) పేరుమీదుగా “బార్హస్పత్య సూత్ర” గ్రంధం ఒకటి ఉండేదని ఇతర గ్రంధాల ద్వారా తెలుస్తుంది తప్ప అసలు ప్రతి లభించలేదు. ఇంతవరకూ “బార్హస్పత్య సూత్ర” గ్రంధంనుండి లభించిన సుమారు 60 శ్లోకాల ద్వారా ఇది భౌతిక వాదానికి చెందిన గ్రంథమని, దీనిలో నాస్తిక/చార్వాక సిద్ధాంతాలు స్పష్టంగా చెప్పబడ్డాయని అర్ధమౌతుంది. BCE 2 వ శతాబ్దానికి చెందిన “పతంజలి మహాభాష్య” లో బార్హస్పత్య సూత్ర ఉటంకించబడింది కనుక ఇది అంతకు పూర్వమే గ్రంథస్థం చేయబడి ఉండాలి. చార్వాక మతం బార్హస్పత్య పేరుతో కొన్నాళ్ళు మనుగడ సాగించింది.

చార్వాకమతానికే మరో పేరు లోకాయత. లోకమును మాత్రమే పట్టించుకొనే శాస్త్రం కనుక లోకాయతం అని పేరువచ్చింది. అంటే లోకులు పాటించేది అని అర్ధం. ఒక రకంగా “జనవేదాంతం”. తర్కం ప్రధానంగా ఉండే “లోకాయతం వేదవిరోధిని” అని మహాభారత వ్యాఖ్యాత నీలకంఠాచార్యుడు అన్నాడు.
లోకాయుత అన్న పదం మొదటగా కౌటిల్యుని అర్ధశాస్త్రంలో కనిపిస్తుంది. కౌటిల్యుడు లోకంలో- యోగ, సాంఖ్య, లోకాయత అంటూ మూడురకాల అన్వీక్షికులు (తర్కవేదాంతులు) ఉన్నారని వీరు తమ తర్కంతో, మతం వ్యాపారం న్యాయం వంటి వివిధ రంగాలను పరీక్షించి వాటిలోని లోపాలను ఎత్తిచూపుతారు” అంటాడు. ఇక్కడ చెప్పిన యోగ, సాంఖ్య స్కూల్స్ తో లోకాయత ఇమడదు ఎందుకంటే మొదటి రెండు వేదాలను అంగీకరిస్తాయి లోకాయత వేదవ్యతిరేకం. బహుశా తార్కికంగా వాదిస్తుంది కనుక కౌటిల్యుడు అలా చేర్చి ఉంటాడు.
 
CE 5 వ శతాబ్దపు బుద్ధఘోషుడు లోకాయతులను వైతండికులు అని వారి శాస్త్రాన్ని వైతండవాద శాస్త్రం (vitandavadasattham/ Science of Disputation) అని చెప్పాడు. లోకాయతులు(చార్వాకులు) ఇతరుల విశ్వాసాలను ఖండిస్తూ, వారికి ఏ విలువా ఇవ్వకుండా వాదిస్తారు కనుక వారిని వైతండికులని (vaitandika) పిలిచేవారు. అందరు లోకాయతులు అలా ఉండేవారు కారేమో అందుకే- తొమ్మిదోశతాబ్దపు కాశ్మిరీ జైన పండితుడు జయంత భట్ట- చార్వాకులను, ధూర్తులు, సుశిక్షితులు, గొప్ప పండితులు అని మూడురకాలుగా విభజించాడు. (రి. Lokāyata/Cārvāka: A Philosophical Inquiry Pradeep P. Gokhale పేనం. 15)

శంకరాచార్యులు భౌతికవాదులను/నాస్తికుల గురించి చెప్పవలసి వచ్చినపుడు వారిని లోకాయతికులు అన్నాడు తప్ప చార్వాక అన్న పదం వాడలేదు.
***
చార్వాక సిద్ధాంత మూలగ్రంథమైన Cārvākasūtra ఇంతవరకూ లభించలేదు కానీ దానిపై Aviddhakarṇa, Kambalāśvatara, Purandara లాంటి వారు రాసిన వ్రాసిన వ్యాఖ్యల ద్వారా చార్వాక సూత్రాలను కొంతమేరకు గుర్తించగలిగారు.
 
లోకాయుత/బృహస్పత్య/వైతండిక మతాన్ని ప్రచారం చేసే వ్యక్తులను సూచించటానికి చార్వాక అనే పదాన్ని మొదటగా ఉపయోగించినవాడు CE 7వ శతాబ్దానికి చెందిన పురందర (Purandara). ఇతను తనను, తన సహచరులను చార్వాకులని చెప్పుకొన్నాడు.
CE 8 వ శతాబ్దం వరకూ నాస్తిక/భౌతిక వాదాన్ని చెప్పటానికి బృహస్పత్య, లోకాయత, వైతండిక, చార్వాక అనే పేర్లు పర్యాయపదాలుగా వాడారు. క్రమేపీ చార్వాక అన్న పదం స్థిరపడింది. 15 వ శతాబ్దం వరకూ చార్వాకవాదం పై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఇక ఆధునిక కాలానికి వచ్చేసరికి చార్వాకుల గురించి మొదటగా Henry Thomas Colebrooke 1827 లో ఒక వ్యాసంలో ప్రస్తావించాడు. బౌద్ధ, జైన, హిందూ రచనలలో లభించే అనేక చార్వాక వాక్యాలను D.R. Shastri సేకరించి Cārvāka Darśana (1959) గ్రంథాన్ని రచించారు. సమకాలీనంగా Pradep P. Gokhale, Debiprasad Chattopadhyaya, Ramakrishna Battacharya వంటి వారు చార్వాకదర్శనంపై గొప్ప పరిశోధనా గ్రంథాలు వెలువరించారు.
****
.
చార్వాకమత సిద్ధాంతములు
.
చార్వాక దర్శనంలో ప్రదానమైన అంశాలు నాలుగు
ఎ. ప్రత్యక్షప్రమాణము మాత్రమే అంగీకారయోగ్యం
బి. చైతన్యం భౌతికమైనది
సి. జీవించేది సుఖించటానికే
డి. దేవుడు లేడు, స్వర్గనరకాలు లేవు. మరణాంతరజీవితం లేదు.

చార్వాకులు సూత్రీకరించిన అంశాలు, సంధించిన ప్రశ్నలు
.
1. భూమి, నీరు, నిప్పు, గాలి నాలుగు మాత్రమే ప్రత్యక్షములు. ఆకాశము లేదు.
 
2. ధర్మాధర్మములు, పాప పుణ్యములు, స్వర్గ నరకములు, అదృష్ట దురదృష్టములు అగోచరములు కనుక లేవు.
 
3.దేహంలో ఉండే చైతన్యమే ఆత్మ. వేరుగా ఆత్మలేదు

4. దేహంలోంచి ప్రాణం పోవటమే మోక్షం. కనుక మోక్షం కొరకు ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు తపస్సులు చెయ్యక్కరలేదు.
 
5. యజ్ఞంలో హింసించబడే పశువుకు స్వర్గప్రాప్తి లభించేటట్లయితే తండ్రినే హింసించి చంపి నేరుగా స్వర్గానికి పంపొచ్చు కదా!

6. శ్రాద్ధము మరణించినవారికి చేరేటట్లయితే, దూరదేశమేగినవారికి ఇంటినుంచే భోజనము పంపవచ్చు కదా!

7. ఇక్కడ ఇచ్చిన దానము పైలోకములలోని వారికి చేరేటట్లయితే, మేడ క్రింద ఇచ్చిన దానము మేడపై ఉండేవారికి చేరుతుందా!

8. జీవించినంతకాలమే ఆనందించగలం. చావుతరువాత ఏమీ లేదు
 
9. మరణించిన వ్యక్తి వేరేలోకాలకు వెళితే బంధువులను చూడటానికి ఒకసారైనా తిరిగిరాడేమి? ప్రేతకార్యాదులు కొందరకు ఒక రకమైన జీవనోపాధి

10. వేదాలు, ఆగమ శాస్త్రాలు వంటి ఏ మతగ్రంథాలనైనా జ్ఞాన హేతువులుగా భావించరాదు. వేదాలను రచించినవారు విదూషకులు, మోసగాళ్ళు, రాక్షసులు.
 
11. ఓ, దిగంబరులారా! (O,Jains), ఓ సన్యాసులారా! (O, Buddhists) దేహాన్ని కష్టపెట్టుకొంటూ అలా కఠోరమైన నియమనిష్టలతో జీవించమని మీకు ఎవరు చెప్పారు?

12. ఇంద్రియములకు తెలిసే జ్ఞానం మాత్రమే మనిషి వద్ద ఉంటుంది. విపరీతంగా చదువుకొన్న పండితులు మాత్రం “మిత్రమా చూసావా! ఈ తోడేలు పాదముద్ర ఏవేం సత్యాలు చెబుతోందో” అంటూ ప్రసంగిస్తారు. 

(తోడేలు పాదముద్ర అనేది ఒక పిట్టకథ. చార్వాకులు చెప్పారని ప్రచారంలో ఉంది.
ఒకడు తన చేతితో తోడేలు పాదముద్రను నేలపై చిత్రించి అదేమిటని సన్యాసులను అడుగగా, అది ఒక మనిషి చిత్రించి ఉండవచ్చనే కనీసఆలోచన లేకుండా వారు-- ఒక తోడేలు ఇక్కడ నిన్న రాత్రి సంచరించింది, తోడేలు పాదముద్ర కనిపించటం అదృష్టమని చెప్పినట్లుగా, కొందరు తెలివైన వంచకులు ఏ రకమైన హేతువు లేకుండా ఎదుటివారు ఏంతినాలి, ఏం తినకూడదు, ఎప్పుడు సంయోగం జరుపుకోవాలి, ఎప్పుడు జరుపుకోకూడదు, స్వర్గంలో ఏ ఏ రకాలైన సుఖాలుంటాయి అని చెబుతూ మోసగిస్తారు. ఏవి ప్రత్యక్ష ప్రమాణానికి అందుతాయో వాటినే విశ్వసించాలని, అగోచరాలు, ఊహాజనితాలు అయిన వాటిని నమ్మరాదని ఈ కథ అంతరార్థం.)

13. తపస్సు చేయటం దేహాన్ని బాధించుకోవటమే. ఉపవాసాలుండటం జీవితంలోని ఆనందాలను దూరంచేసుకోవటమే. యజ్ఞయాగాదులు చిన్నపిల్లల ఆటలు.
 
14 ఇంకా నిరూపించాల్సి ఉన్న అంశాలైన ఆత్మ, దేవుడు, మరో జన్మ, స్వర్గనరకాలు వంటి వాటి ద్వారా నిష్కపట మనస్కులు ఏ కొత్త జ్ఞానాన్ని పొందలేరు, వారి మనస్సులు కుటిల తార్కికులచే కలుషితం కానంతవరకూ (Bhattacharya, Ramakrishna. Studies on the Carvaka/Lokayata p.n 92)
***

చార్వాకులు సుఖవాదులని; వారికి నైతిక విలువలు ఉండవని; దేవుడిని అంగీకరించరని;, పాపపుణ్యాలను, ధర్మాధర్మాలను పాటించరని అటు బౌద్ధ, జైనులు, ఇటు బ్రాహ్మణవాదులు విమర్శించారు.
 
“ప్రాణం ఉండగనే దేన్నైనా ఆనందించగలం. అప్పులపాలైనా సరే నేతిని ఆరగించండి. కాలి బూడిదయ్యాకా దేహం తిరిగొస్తుందా” (jāvaj jīvet sukhaṃ jīved ṛṇaṃ kṛtvā ghṛtaṃ pibet | bhasmībhūtasya dehasya punar āgamanaṃ kutaḥ. ||)
 
పై వాక్యం ప్రసిద్ధిగాంచి మొత్తం చార్వాకవాదాన్నే నవ్వులపాలు చేసింది. 14 పైన వివిధ ప్రతుల్లో nāsti mṛtyor agocaraḥ అనే వాక్యం ఉండగా, సాయన-మాధవ సంగ్రహపరచిన “సర్వదర్శన సంగ్రహ” అనే ఒక గ్రంథంలో మాత్రమే ṛṇaṃ kṛtvā ghṛtaṃ pibet కనిపిస్తుంది. అంటే ఎవరో తుంటరి “ఎవరూ మృత్యువుకు అతీతులు కారు” అన్న చోట “అప్పులపాలైనా నేతిని ఆరగించండి” అనే వాక్యాన్ని ప్రక్షిప్తం చేసాడు. ఇది ఒకరకంగా చార్వాకసిద్ధాంతాన్ని చులకనచేయటానికే అంటాడు Bhattacharya, Ramakrishna (Bhattacharya, Ramakrishna. Studies on the Carvaka/Lokayata pno73, 124)


పురాణాలలో చార్వాకమతం

భారతీయపురాణాలు కాల్పనికత, చరిత్రల సమ్మేళనం. అనేక చారిత్రిక పాత్రలు పురాణపాత్రలుగా రూపుదిద్దుకోవటం గమనించవచ్చు. వాస్తవికతకు దగ్గరగా ఉండే పురాణ ఉదంతాల ద్వారా చారిత్రిక పాత్రలను సులభంగానే పోల్చుకోవచ్చును. చార్వాకదర్శనం యొక్క సూత్రాలు బ్రాహ్మణవాద సాహిత్యంలో అక్కడక్కడా కనిపిస్తాయి.
.
1. రామాయణంలో చార్వాక మతం (Ayodhya Kanda in Prose Sarga 109)

శ్రీరామచంద్రుడు తండ్రిమాటమీద అరణ్యవాసానికి బయలుదేరినపుడు ధశరధుని ఆస్థానపండితుడైన జాబాలి అనే బ్రాహ్మణుడు – “రామా! మనిషి ఒంటరిగా పుట్టి ఒంటరిగా మరణిస్తాడు. తల్లిదండ్రులపట్ల వాత్సల్యం కలిగినవాడు పిచ్చివాడు. తండ్రిమాటపై రాజ్యాన్ని త్యజించి అడవులలో నిన్ను నీవు హింసపెట్టుకోవటం నీ పని కాదు.
ఓ యువరాజా! అయోధ్య నీకొరకు ఎదురుచూస్తోంది. రాజభోగాలు అనుభవించు. తండ్రి ఎవరు నీకు? తండ్రికి నీవెవ్వడవు? మీ తండ్రిగారి శ్రాద్ధకర్మల పేరిట ఆహారాన్ని వృధాచేస్తున్నారు. మృతి చెందినవాడు తింటాడా? బలులు, దానాలు, యాగాలు ఇవన్నీ ప్రజలను లొంగదీసుకోవటానికి, ధనార్జనకు తెలివైన వారు పన్నిన పన్నాగం.
 
ఓ జ్ఞానీ! కంటికి కనిపించేవాటికి ప్రాధాన్యత ఇవ్వండి, అగోచరమైనవాటిని తిరస్కరించండి”- అని అన్నాడు.
 
జాబాలి మాటలకు రాముడు- “ఓ బ్రాహ్మణా! ఇది కర్మభూమి. దీనియందు పుణ్యపురుషులెప్పుడూ వేదవిహిత కార్యములు, పుణ్యకర్మలు ఆచరించాలి. నూరు యాగములు చేసి ఇంద్రుడు స్వర్గాధిపతి పదవిని సంపాదించెను. తపోనిష్టలతో ఎల్ల ఋషులు స్వర్గము పొందిరి. మీ సలహా వైదిక విరుద్ధము. అధర్మమార్గమున నడిచే నీవంటి నాస్తికుని, దుష్టుడని చేరదీసినందుకు నా తండ్రిని నిందించాలి.
 
వేద ప్రామాణ్యమంగీకరింపనట్టి నాస్తికుడును, బుద్ధుడును చోరునివలె నిరాకరింపదగినవారు. అట్టి వేదబాహ్యుడైన నాస్తికునితో వివేకి వ్యవహరింపరాదు” అన్నాడు. (అయోధ్యా కాండము, శ్రీమతి శ్రీమత్తిరుమల పెద్దింటి వెంకట సీతమ్మ)

పై సంభాషణ ద్వారా జాబాలి తనమాటలలో చార్వాకవాదాన్ని స్పష్టంగా పలికించాడు. దాని ఖండనను "రామో విగ్రహవాన్ ధర్మః'' అని కీర్తించబడిన రాముడి నోటి ద్వారా చెప్పించి చార్వాకవాదాన్ని పూర్వపక్షం చేయటానికి వాల్మీకి ప్రయత్నించినట్లు అర్ధం చేసుకోవాలి.
వేదాలను అంగీకరింపక శూద్రుడైన శంబూకుడు తపస్సు ఆచరించినందుకు శ్రీరాముడు అతడిని వధించిన రామాయణ ఉదంతం కూడా వేదాలను తిరస్కరించే నాస్తికులకు ఒక హెచ్చరిక.

2. భారతంలో చార్వాకుడి ప్రస్తావన

చార్వాకుడనెడి వాడు ఒక రాక్షసుడని, ధుర్యోధనుడి మిత్రుడని భారతములో ఉన్నది.
మహాభారతయుద్ధం ముగిసాక ధర్మరాజు విరాగియై రాజ్యం చేపట్టనని ఖిన్నుడై ఉండగా, మహర్షులు అతనికి కర్తవ్యం భోధించి రాజ్యాభిషిక్తుడిని చేసిన సందర్భములో చార్వాకుడు ఒక బ్రాహ్మణుడి వేషములో అక్కడకు వచ్చి ధర్మరాజును “నువ్వు స్వజనుల క్షయం గావించావు, నీవు ప్రజాపాలనకు తగవు, జ్ఞాతినాశనము, గురుజనహింస చేసిన నీవు జీవించుటకంటే మరణించుట మేలు” అని నిందించగా ఆ సభలోని విప్రోత్తములందరూ మీదపడి గాయపరచగా చార్వాకుడు చనిపోయాడు.
 
అలా మాట్లాడిన వ్యక్తి తమ వాడు కాదని, అతను ధుర్యోధనుని స్నేహితుడని, బ్రాహ్మణరూపంలో వచ్చిన రాక్షసుడని ధర్మరాజుకు ఆ బ్రాహ్మణులు సర్దిచెప్పారు.
ఆనాడు సమాజంలో ఆదరణ పొందుతున్న చార్వాక నెరేటివ్ ని ఖండించే కౌంటర్ నెరేటివ్ ఇది. కానీ ఇందులో "చార్వాక " పేరుతో చెప్పింది నాస్తికవాదం కాక యుద్ధం చేసి నువ్వు హింసకు పాల్పడ్డావు అంటూ అహింసావాదాన్ని చెప్పటం గమనార్హం.

3. చార్వాక మతంలో బృహస్పతి పాత్ర

బృహస్పతి దేవగురువు. అసురులు వేదోక్తంగా యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ తత్ఫలితంగా అమేయబలసంపన్నులై దేవతలను జయించసాగారట. దేవతలకు అసురులవలన కలుగుతున్న బాధలను తొలగించటానికి ఒక ఉపాయము చేసాడట. దీనిప్రకారం- అసురులకు వేదాలపట్ల గౌరవం తగ్గి, వారిని వేద నిందకులుగా మార్చటానికి, తద్వారా వారు నిర్వీర్యులవటానికి కొన్ని సూత్రాలను రచించాడట.
 
బృహస్పతి ఈ సూత్రాలను చార్వాకుడు అనే తన శిష్యుని ద్వారా ప్రచారింపచేసాడని, వాటి కారణంగా రాక్షసులు వేదనిందకులై యజ్ఞయాగాదులను నిలిపివేసి బలహీనులుకాగా వారిని దేవతలు సులువుగా ఓడించారని దేవీ భాగవతంలో ఉంది.
అలా చార్వాక మతం చేసిన బోధనలను దేవతల గురువైన బృహస్పతి చేసిన ఒక "యోచన"గా హిందూ పురాణాలు అప్రాప్రియేట్ చేసుకొన్నాయి. (ఇదే తరహా ఉదంతం ద్వారా మాయామోహనుడు పేరుతో బుద్ధుని బోధనలను అప్రాప్రియేట్ చేసుకొన్నట్లు విష్ణుపురాణంలో కూడా కనిపిస్తుంది)

4. భగవద్గీతలో చార్వాకదర్శనం

భగవద్గీత 16 వ అధ్యాయం, దైవాసురసంపద్విభాగ యోగం లో అసుర దైవ లక్షణాలను వివరిస్తూ కృష్ణుడు చార్వాకభావాలను అసురులకు ఆపాదిస్తూ ఇలా అంటాడు – “అసుర స్వభావం కలవారు ప్రవృత్తిని కాని నివృత్తిని గాని ఎరుగరు. వాళ్ళలో శౌచమూ, ఆచారమూ, సత్యమూ ఉండవు. జగత్తు మిధ్య అనీ, దానికి ధర్మా ధర్మాలు ఆధారము ఉండవని, ఈశ్వరుడే లేడనీ ఈ ప్రపంచములోని ప్రాణులు స్త్రీ పురుషుల కలయిక వలననే పుట్టాయని వారు అంటారు. అందుచేత ఈ జగత్తుకి కారణం కామమే అంటారు అసుర జనులు. ఈ దృష్టినే పట్టుకుని వేలాడుతూ వీళ్ళు ధర్మ భ్రష్టులై సంకుచిత బుద్ధులై, ప్రపంచానికి శత్రువులై, కౄరకర్ములై లోక నాశనం కోసం పుడతారు. (వికీ సోర్స్)
పై వాక్యాలు చార్వాకవాదానికి ప్రతివిమర్శగా రాసారని ఇట్టేపోల్చుకోవచ్చును. “అప్పుచేసైనా నెయ్యి తిను” అని ప్రక్షిప్తం చేసినట్లుగానే “ఈ జగత్తుకు కారణం కామమే” అని చార్వాకులు అన్నట్లు ప్రచారించారు. దీనికి ఆధారంగా చార్వాకమతానికి చెందినదని చెప్పబడే “kāma evaikaḥ puruṣārthaḥ” (కామం మాత్రమే పురుషార్ధం) అనే వాక్యాన్ని చూపుతారు. ధర్మార్ధకామ మోక్షాలను పురుషార్ధాలుగా చెప్పటం బ్రాహ్మణీయభావజాలం. తదుపరి జన్మ, మోక్షం లాంటి భావాలను అంగీకరించక, స్వేచ్ఛాజీవనాన్ని ప్రవచించిన చార్వాకులు పురుషార్ధాలు అనే చట్రాన్ని అంగీకరించి ఉంటారా అని Battacharya ramkrishna ప్రశ్నిస్తారు.

మహాభారతం వనపర్వంలో (33:57) చిన్నప్పుడు తండ్రి ఒడిలో కూర్చుని ఒక బ్రాహ్మణుడు చెప్పే బార్హస్పత్య సూత్రాలను ఏపనీ లేకపోయినా ఏదో పనికల్పించుకొని వెళ్లి వినేదానినని ద్రౌపతి ధర్మరాజుతో చెబుతుంది. (వనపర్వం నీతిం బృహస్పతిప్రొక్తాం భరాతౄన మే ఽగరాహయత పురా/తేషాం సాంకద్యమ అశ్రౌషమ అహమ ఏతత తథా గృహే)

ఆరుగురు గురువులు

BCE 5 వ శతాబ్దానికి చెందిన మగధరాజైన అజాతశత్రు ఒకరోజు రాజభవనం మిద్దెపై కూర్చుని తాత్వికచర్చ చేయటానికి సరైన సన్యాసి ఎవరున్నారు అని తన మంత్రులను అడగగా వారు- అజితకేశ కంబళ, పూరన కస్సప, మఖలి గోశాల, పకుధకచ్ఛాయన, సంజయబేలత్తిపుత్త, నిగంత్తనాతపుత్త అనే ఆరుగురి పేర్లు చెప్పి; వీరందరూ చాలాకాలంగా సన్యాసిజీవనాన్ని గడుపుతున్నారని, ప్రతిఒక్కరు తమదైన తాత్విక సంప్రదాయాన్ని నెలకొల్పి దానికి గురువులుగా ఉంటూ దాన్ని ప్రచారం చేసుకొంటున్నారని చెప్పారు. అదే సమయంలో అజాతశత్రు వ్యక్తిగత వైద్యుడైన జీవకుడు, ఆసమయంలో రాజగ్రుహలో సమీపంలో బసచేసి ఉన్న బుద్ధుని వద్దకు అజాతసత్రుని తీసుకొని వెళ్లాడని బౌద్ధ గ్రంథం Samannaphala Sutta లో ఉంది.

1. అజిత కేశకంబళ

BCE 6 వ శతాబ్దానికిచెందిన అజిత కేశకంబళ మొట్టమొదటి భౌతికవాది. ఇతను బుద్ధుని సమకాలీనుడు. ఇతనికి పూర్వం ప్రాచీనభారతీయ సాహిత్యంలో భౌతిక వాద ఛాయలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తిగా అజితకేశకంబళ పేరు ప్రాచీన భారతవేదాంత గ్రంధాలన్నింటిలో కనిపిస్తుంది. ఇతడు చెప్పినబోధనలకు సంబంధించిన వివరాలు నేరుగా దొరకవు. బౌద్ధ పాలి, జైన ప్రాకృత రచనలలో ఇతని గురించిన ప్రస్తావనలు విరివిగా లభిస్తాయి. వారు ఇతని సిద్ధాంతాన్ని స్మశానవైరాగ్యంగా అభివర్ణించారు. బౌద్ధ, జైన మతాలు అజితకేశకంబలను వారికి పోటీ దారునిగా చూసిన కారణంగా వారి వ్యాఖ్యలు అంత విశ్వసనీయమని భావించలేం. (రి. Studies on Carvaka/Lokayata by Battacharya ramkrishna pno28 )

అజితకేశ కంబళ బుద్ధుని కంటే వయసులో పెద్ద. ఇతను మనిషివెంట్రుకలతో చేసిన కంబళి వేసుకొని తిరిగేవాడు. Anguttara Nikaya (3.135) లో బుద్ధుడు అజితకేశ కంబళునిగురించి ఇలా అన్నాడు-“ఇతను వేసుకొనే వెంట్రుకల దుస్తులు చాలా అసౌకర్యం. వేసవిలో వెచ్చగా, శీతాకాలంలొ చల్లగా, దుర్వాసనవేస్తూ, దురదలు కలిగిస్తూ ఉంటాయి ” (The historical buddha, The times, Life and Teachings of the founder of Buddhism, Hans Wolfgang Schumann pn 221)

మగథ రాజైన అజాతశతృతో అజితకేశకంబళి చేసిన సంభాషణ Sāmañña-phala-sutta లో ఇలా ఉంది.
“ఓ మహారాజా! దానాలు, బలులు, నైవేద్యాల వల్ల ఏ ఫలితమూ లేదు. మంచి చెడు కర్మలంటూ ఏమీ లేవు. ఈ లోకము లేదు పర లోకమూ లేదు”.
పై వాఖ్యలోని చివరిభాగం మహాభారతంలో కనిపిస్తుంది. భీష్ముడు యుధిష్టిరునితో “కొంతమంది “ఈ లోకము లేదు పర లోకమూ లేదు” అని భావిస్తారు. అటువంటి నాస్తికులను నమ్మరాదు” అంటాడు. (శాంతిపర్వం131.13)

దాదాపు అదే వాక్యం భగవద్గీతలో కూడా కనిపిస్తుంది (4.40) సంశయంలో పడ్డవాడికి “ఈ లోకము లేదు పర లోకమూ లేదు”. సుఖం కూడా లేదు.

సమాధానం ఇవ్వకతప్పని వాదన చేసాడు అజితకేశకంబళ. దానికి ఒక చోట అలాంటి వారిని నమ్మరాదని, మరో చోట వారు సంశయవాదులని, వారికి సుఖం ఉండదని మహాభారతం ద్వారా బ్రాహ్మణవాదులు సమాధానం ఇచ్చారు. అజితకేశకంబళ చేసిన భావవాదపు శక్తి అది.
Dlgha Nikaya 2.23 లో అజితకేశకంబల ఇతర ప్రవచనాలు ఇలా ఉన్నాయి

1. మంచి చెడు కర్మలంటూ ఏమీ లేవు.
2. స్వర్గ నరకాలు ఏమీ లేవు.
3. తల్లి దండ్రి అంటూ ఎవరూ లేరు. వారికి చేసే మంచి చెడులకు ఫలితాలు ఏమీ ఉండవు
4. మరణించాక మరుజన్మ, ఆత్మ అంటూ ఏమీ ఉండవు. ఈ దేహంలోని మట్టి మట్టిలో, నీరు నీటిలో, గాలి గాలిలో, వెచ్చదనం నిప్పులో, ఆలోచనలు శూన్యంలో కలిసిపోతాయి.
5. మూర్ఖుడు, జ్ఞాని చనిపోయాకా ఒకేలా మట్టిగా మారతారు.
6. శవాన్ని నలుగురు స్మశానానికి మోసుకెళతారు. కొన్నాళ్లకు పావురంరంగులోకి మారి వెలిసిపోయిన ఎముకలు మాత్రమే స్మశానంలో మిగులుతాయి.
6. చనిపోయిన వ్యక్తిపేరిట దానదర్మాలు చేయటం అవివేకం
అజిత కేశకంబళి నెలకొల్పిన సంప్రదాయం CE 6 వ శతాబ్దపు చార్వాకుల వరకూ కొనసాగి ప్రశ్నించటం, వాదించటం, ధిక్కరించటం ఈ దేశ సంస్కృతికి, బహుళత్వానికి వెన్నుగర్ర అని నిరూపించింది.

2. పూర్ణ కాశ్యప/పూరన కస్సప

పూర్ణకాశ్యపుని గురించిన ఆధార గ్రంథాలు లభించవు. జైన బౌద్ధ రచనలలో ఇతనిని విమర్శిస్తూ చేసిన కథనాల ద్వారా ఇతను వేదాలను తిరస్కరించి, దిగంబరంగా సంచరిస్తూ, భౌతికవాదాన్ని ప్రవచించాడని అర్ధమౌతుంది. ఇతను- ఒక గృహబానిస అని, ఇంటినుండి పారిపోగా, దారిలో దొంగల దోపిడీకి గురయి కట్టుబట్టలుకూడ కోల్పోయి దిగంబరంగా సంచరిస్తూ, అందరిని అపహాస్యం చేస్తూ చివరకు నిరాశతో, దుఃఖితుడై చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడని బుద్ధ ఘోషుడు తన “సుమంగళ విలాసిని” అనే గ్రంథంలో పేర్కొన్నాడు (రి. Lokayata a Study in Ancient Indian Materialism, Debiprasad Chatopadhyaya pn 513)
 
పూర్ణ కాశ్యపుడు చాన్నాళ్ళు గృహస్థుగా జీవించాడని, సన్యసించాక తనకు వచ్చే భిక్షాన్ని నాలుగుభాగాలు చేసి మూడుభాగాలు బాటసారులకు, కుక్కలకు, కాకులకు, చేపలకు పంచి నాలుగోభాగాన్ని తను తినేవాడని - “భాగవతీ సూత్ర” అనే జైన గ్రంథంలో కనిపిస్తుంది.
పూర్ణ కాశ్యప బోధించిన వాటిలో ముఖ్యమైన అంశాలు-యజ్ఞయాగాదులు, కర్మకాండలు , పాపపుణ్యాలు, స్వర్గనరకాలు లేవు. మంచి చేస్తే పుణ్యం రాదు, చెడు చేస్తే పాపం అంటదు. దానధర్మాలు అర్ధరహితం. ఈ ప్రపంచం నియతిజనితం (ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది అనే వాదన /Every thing is born of destiny).
 
15 వ శతాబ్దపు జైనపండితుడు గుణరత్న తాను రచించిన “తర్క రహస్య దీపిక” అనే గ్రంథంలో పూర్ణ కాశ్యపుడు ప్రవచించిన నియతివాదాన్ని ప్రస్తావించాడు. పాలిరచనల్లో చెప్పిన పూర్ణ కాశ్యపుని బోధనలు రెండువేల ఏండ్ల తరువాత కూడా ఉటంకించబడటం భౌతికవాద దృక్ఫథపు బలంగా భావించాలి.

3. మఖలి గోశాల (చూడుడు అంతర్ధానమైన ఆజీవిక మతం వ్యాసం.)

4. పకుధ కచ్ఛాయన /ప్రకృత కాత్యాయనుడు
.
పకుధ కచ్చాయన భౌతికవాది. ఇతను కర్మవాదాన్ని అంగీకరించలేదు. ప్రకృతిలో భూమి, నీరు, అగ్ని, గాలి తో పాటు జీవితము, సుఖ, దుఃఖాలు కూడా ఉంటాయని చెప్పాడు. ఈ ఏడు అంశాలు స్థిరమైనవి, మార్పులేనివి ఒకదానిని మరొకటి ప్రభావితం చేయలేనివి అంటాడు. భౌతిక అంశాలతో పాటు అభౌతికాలైన జీవితము, సుఖదుఃఖాలను చేర్చటం అనేది కచ్ఛాయన సిద్ధాంతంలోని ప్రత్యేకతగా భావించాలి.

5. సంజయబేలత్తిపుత్త

సంజయబేలత్తిపుత్త స్పష్టమైన భౌతిక వాది. గోచరమైనవి తప్ప మిగిలినవాటిని నమ్మరాదని ప్రవచించాడు. ఇది కొంతమేరకు చార్వాకుల వాదం. ఇతను ఏ సమకాలీన సిద్ధాంతాలను అంగీకరించనూ లేదు ఖండించనూ లేదు. ఈ లోకంలో దేనిమీదా సంపూర్ణమైన అవగాహన ఉండదని, ఒకే అంశాన్ని భిన్నవిధాలుగా వ్యాఖ్యానించవచ్చుకనుక, ఇది మంచి, ఇది చెడు, ఇది సరైనది, ఇది తప్పు అని వాదులాడుకోవటం అర్ధరహితమని ఇతను అభిప్రాయపడ్డాడు. ఇది ఒక రకంగా సంశయవాదం. (skepticism). బుద్ధుని వద్ద శిష్యులుగా చేరకముందు సరిపుత్త, మహామొగ్గల్లన లాంటివారు సంజయవద్ద కొంతకాలం శిష్యరికం చేసారు.

6. నిగంత్తనాతపుత్త

జైన మతానికి చెందిన 24 వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు బౌద్ధసాహిత్యంలో నిగంత్తనాతపుత్త గా చెప్పబడ్డాడు. నిర్గ్రంథులతో (దిగంబరులు) చేతులు కలిపిన నాత వంశీకుడు అని అర్ధం. ఇతని నిజజీవిత పేరు వర్థమాన. సైన్యాద్యక్షుడైన తండ్రిపేరు సిద్థార్ధ, తల్లి త్రిశల. వైశాలి సమీపంలో ఇతను BCE 557 లో జన్మించాడు. ఇతనికి జైన మహావీర అనే బిరుదు కలదు. ఇతని తల్లిదండ్రులు పార్శ్వనాథుని బోధనలను ఆచరించేవారు. వారు సల్లేఖవ్రతం (Fast onto death) చేపట్టి మరణించాకా, వర్ధమాన మహావీరుడు తన ముప్పై ఏండ్లవయసులో ఇంటిని విడిచిపెట్టి శ్రమణ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతని బోధనలు జైన ధర్మానికి చెందినవి.
.
***
పాయాసి

ఇతను ఒక రాజు. బౌద్ధ, జైన, బ్రాహ్మణవాద మతాలకు వివిధ కాలాలలో వివిధ రాజుల ఆదరణ లభించి అవి ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. చార్వాక వాదానికి ఏ రకమైన రాజాదరణ లభించలేదు కానీ పాయసి అనే రాజు భౌతికవాదాన్ని కొన్ని జుగుప్సాకర ప్రయోగాల ద్వారా పరీక్షించి వాటి నిగ్గు తేల్చాలని చూసినట్లు కొన్ని బౌద్ధ జైన రచనలలో కనిపిస్తుంది.
ఆత్మ లేదు అని చార్వాకులు చెప్పారు. ఆత్మ ఉందాలేదా అనే విషయాన్ని తెలుసుకోవటానికి పాయాసి- ఒక దొంగను పెద్ద ఇత్తడి పాత్రలో ఉంచి దానిమూతను తగరంతో అతికింపచేసాడు. ఆ పాత్రలో దొంగచనిపోతే ఆత్మ ఏ విధంగా బయటకు వెళుతుందో చూడాలనుకొన్నాడు. మరొక ప్రయోగంలో పెద్దపాత్రలో ఉంచిన వ్యక్తి బరువు చనిపోకముందు చనిపోయాకా ఏమైనా తేడా ఉందా లేదా అని కూడా పరీక్ష చేసాడు. ఈ ప్రయోగాలన్నీ దేహాత్మవాదం నిగ్గు తేల్చటానికే.

ముగింపు

బౌద్ధజైనాలు చార్వాకులను అంగీకరించకపోవటానికి కారణం వారు పునర్జన్మను, నైతిక, ధార్మిక జీవనాన్ని విశ్వసించారు. ఈ లోకంలో తర్కం వెర్రితలలు వేయకుండా కొన్ని మతగ్రంథాలను ఏర్పరచుకొని వాటి ఆధారంగా ఒక పరిధి విధించుకొని జీవించటం ఉత్తమజీవనం అని నమ్మారు. వారికి చార్వాకుల తర్కం విచ్చలవిడితనంగాను, వితండవాదంగాను కనిపించింది. ఆకారణంగా బౌద్ధ, జైనులు చార్వాక సిద్ధాంతాన్ని తిరస్కరించి తమ గ్రంథాలలో చార్వాకసిద్ధాంతాలను ఖండించారు.
 
కూర్మపురాణం (CE 550-800) బౌద్ధులు, జైనులు, పంచరాత్రలు, కాపాలికులు, పశుపతులు అంటూ ఐదురకాల వేదబాహ్యులను పేర్కొనింది. పంచరాత్ర కల్ట్ మొదట్లో వేదబాహ్యంగా ఉన్నప్పటికీ క్రమేపీ వైష్ణవంలో కలిసిపోయి వేదావలంబిగా మారిపోయింది.
 
పదిహేనవ శతాబ్దంలో ఆంధ్రదేశంలో బౌద్ధులు, చార్వాకులు, జైనులే కాక పాషండులు, కాపాలికులు, పాశుపతులు పేర్లతో నాస్తికులు ఉన్నారని శృంగార నైషద పద్యంలో (7-127) శ్రీనాథుడు చేసిన వర్ణనను బట్టి తెలుగునేలపై ప్రాచీన వేదబాహ్య జీవనవిధానాలు నిన్నమొన్నటి వరకూ మనుగడ సాగించాయని, ఇక్కడి ప్రజలు సాంస్కృతికంగా వైవిధ్యాన్ని కలిగిఉండేవారని అర్ధమౌతుంది.
***
భిన్న ప్రాచీన భారతీయ దర్శనాలు ఒకదానినొకటి కబళించే శతృశిబిరాలుగా లేవు. వేరు వేరు సంప్రదాయ శాస్త్రాలుగా సమాంతరంగా మనుగడ సాగించాయి. ఇవి ఒకదాని లోపాలను మరొకటి ప్రశ్నించుకొంటూ ఒకదానినొకటి పూరించుకొంటూ సాగాయి తప్ప ఒకదానినొకటి తొలగించుకోలేదు. అగ్నివేషుడు, కౌటిల్యుడు, వాల్మీకి, వ్యాసుడు లాంటి వారు తాము నమ్మిన విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అప్పటికి ప్రచారంలో ఉన్న అన్ని దర్శనాలను తమరచనలలో ఉటంకించారు. వాటిలోని అసంబద్దతలను ఖండించారు. వైరుధ్యాలను కలిగిఉండటం మానవ మేథ యొక్క భిన్నపార్శ్వాల ఆవిష్కరణగా చూసారు.

 
బొల్లోజు బాబా


సంప్రదించిన పుస్తకాలు

1. Bhattacharya, Ramakrishna. Studies on the Carvaka/Lokayata
2. The historical buddha, The times, Life and Teachings of the founder of Buddhism, Hans Wolfgang Schumann
3. Lokayata a Study in Ancient Indian Materialism, Debiprasad Chatopadhyaya
4. దర్శనకర్తలు – దర్శనములు by చర్ల గణపతిశాస్త్రి
5.Lokāyata/Cārvāka: A Philosophical Inquiry Pradeep P. Gokhale
6. History and Doctrines of THE AJIVIKAS, AL Bhasham
7. ON HINDUISM Wendy Doniger
8. చార్వాక దర్శనం – డా. కత్తి పద్మారావు
9. ఆస్తికత్వము by వారణాసి సుబ్రహ్మణ్యం
10. అయోధ్యా కాండము, శ్రీమతి శ్రీమత్తిరుమల పెద్దింటి వెంకట సీతమ్మ

Tuesday, October 24, 2023

బౌద్ధ చిహ్నారాధన - పార్టు 3

4. బుద్ధుని పాదముద్రలు
.
గురువులు, పెద్దల పాదాలను పూజించటం, వాటికి శిరస్సుముట్టించి ప్రార్ధించటం ఒక సంప్రదాయం. బుద్ధునికి ప్రతిరూపంగా బుద్ధ పాదాలను పూజించటం ఆ కోవకు చెందినదే.
ద్రోన (Drona) అనే పేరుకల బ్రాహ్మణుడు ఒకనాడు బుద్ధభగవానుని పాదముద్రలను చూసి, అవి అపూర్వమైనవని గుర్తించి ఆ పాదముద్రలను విడిచిన వ్యక్తికొరకు అన్వేషించి బుద్ధభగవానుని కలిసాడట. ఆయనవద్ద అనేక ఆథ్యాత్మిక సందేహాలకు సమాధానాలు దొరకటంతో, బుద్ధభగవానుడే “మహాపురుషుడు” అని గుర్తించిన ద్రోన, బౌద్ధసంఘంలో చేరినట్లు బౌద్ధసాహిత్యం ద్వారా తెలుస్తున్నది. [1] . ఈ కథద్వారా బుద్ధపాదాలు బుద్ధభగవానుని చేర్చే సాధనాలు అని చెబుతున్నట్లు అర్ధం చేసుకోవాలి.
రాతిపై పల్లముగా (concave) చెక్కిన పాద ఆకృతి బుద్ధభగవానుడు ఆ ప్రదేశంలో నడయాడినదానికి సూచన. రాతిపై ఉబ్బెత్తుగా (convex) చెక్కిన ముద్రలు బుద్ధభగవానుడి పాదాలు. ఇవి భక్తులకు ఆథ్యాత్మిక మార్గదర్శనం చేసే చిహ్నాలు.
బుద్ధపాదాలకు ప్రత్యేకమైన మందిరాలు నిర్మించి పూజించటం జరిగేదని తొట్లకొండ, బావికొండ బౌద్ధ శిథిలాల ద్వారా తెలుస్తుంది. అమరావతి శిథిలాలలో లభించిన బుద్ధపాదాలలో-పద్మం, ధర్మచక్ర, స్వస్తిక, త్రిరత్న చిహ్నాలు ఉంటాయి. ఆ తరువాత కాలంలో చెక్కిన బుద్ధపాదాలపై, 8 (అష్టమంగళ), 16(షోడశ) 108 (అష్టశత) చిహ్నాలవరకూ ఉండటం ఒక పరిణామం. [2]
ఈ నేలపై నడయాడిన పుణ్యపురుషులు విడిచిన పాదముద్రలను పవిత్రంగా చూసుకోవటం అన్నిమతాలలోను కనిపిస్తుంది. Domine Quo Vadis చర్చ్ లో ఒక పాలరాతిపై ఉన్న పాదముద్రలు ఏసుక్రీస్తువని భక్తుల విశ్వాసం. జెరుసలెం లో Dome in the Rock వద్ద ఉన్న గురుతులు మహమ్మదు ప్రవక్త పాదముద్రలని నమ్ముతారు.
భారతదేశం నలుమూలలా కనిపించే పాదముద్రలు విష్ణువు, శ్రీరాముడు, భీముడు వంటి పురాణపురుషులవని హిందువులు భావిస్తారు.
BCE రెండోశతాబ్దానికి చెందిన భార్హౌత్ స్తూపం పై లభించే బుద్ధునిపాదముద్రలు భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనవి.


***
5.బుద్ధుని భిక్షాపాత్ర
.
బుద్ధుడు ఉపయోగించిన భిక్షాపాత్రను ఆయన చిహ్నంగా అనేక శిల్పాలలో చూపబడింది. బుద్ధభగవానుడు Kusinara వెళుతూ వెళుతూ తన భిక్షాపాత్రను వైశాలి ప్రజలకు ఇచ్చివేసాడు. రెండో శతాబ్దంలో కనిష్కుడు దీనిని వైశాలినుండి నేటి Peshawar కు తరలించాడు. చైనా యాత్రికులు దీనిని చూసినట్లు వారి కథనాలలో నమోదు చేసారు. ఇస్లామిక్ పాలనలో ఈ భిక్షాపాత్ర ఒక మసీదునుండి మరొక మసీదుకు మారుతూ చివరకు Kandahar చేరింది. ఆ సమయంలో ఈ పాత్రపై ఖురాన్ వాక్యాలు లిఖించబడ్డాయి. బ్రిటిష్ చరిత్రకారులు ఈ భిక్షాపాత్రపై ఉన్న శాసనాలను చదవటానికి ప్రయత్నించారు.
ఇటీవలి కాలంలో తాలిబాన్లు అనేక బౌద్ధ చిహ్నాలను నాశనం చేసినప్పటికీ ఈ భిక్షాపాత్రపై ఖురాన్ వాక్యాలు ఉండటంతో దీనిని ఏమీ చెయ్యలేదు. ఇది ప్రస్తుతం కాబూల్ నేషనల్ మ్యూజియం లో ఉంది.
ఈ భిక్షాపాత్ర 400 కేజీల బరువు ఉంటుంది. ఒక మనిషి ఎత్తలేడు. ఇది బహుశా అసలైన భిక్షాపాత్రకు నమూనాగా భక్తులు పూజించటానికి పెద్ద ఆకారంలో చేయించినది కావొచ్చు.
6. త్రిరత్న, వజ్రాసన చిహ్నాలు
.
బుద్ధుడు ప్రవచించిన మూడు ప్రధాన ధర్మాలైన బుద్ధ, దమ్మ, సంఘ లను త్రిరత్న చిహ్నం సూచిస్తుంది. ఈ త్రిరత్న చిహ్నం సాంచి స్తూపం పై కనిపిస్తుంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ఆసనాన్ని వజ్రాసనంగా భావిస్తారు. బౌద్ధ శిల్పాలలో బోధి వృక్షం క్రింద ఒక ఖాళీ ఆసనం రూపంలో వజ్రాసనం కనిపిస్తుంది.
****
ముగింపు
.
బుద్ధుడు BCE 623 ఆరోశతాబ్దంలో జన్మించాడు. బౌద్ధమతం ఒకప్పుడు భారతదేశం నలుమూలలా విస్తరించింది. భారతదేశంలో ఏ మూల తవ్వినా బౌద్ధమతపు ఆనవాళ్ళు నేటికీ శిల్పాలు, చెక్కుడు ఫలకల రూపంలో లభిస్తాయి. బుద్ధుని జననం, జ్జానోదయం, మొదటి భోధన, పరినిర్వాణం లాంటి ముఖ్యమైన జీవిత ఘట్టాలను చెక్కుడు ఫలకలుగా చేసి ప్రదర్శించటం ద్వారా బౌద్ధమతం సామాన్య ప్రజలలోకి సమర్ధవంతంగా చేరగలిగింది. వేల మైళ్ళ దూరంలో, వందల సంవత్సరాల వ్యత్యాసంతో చెక్కిన శిల్పాలు ఒకే రకమైన ప్రతిమాలక్షణాలను కలిగి ఉండి ఆనాటి శిల్పులు సాధించిన ప్రామాణికతకు అద్దంపడతాయి. భారతీయ శిల్పశాస్త్ర ఆవిర్భావ సమయంలో/పరిణామక్రమంలో బౌద్ధమతం ఇచ్చిన ఊతం సామాన్యమైనది కాదు.
బుద్ధుడు BCE ఆరోశతాబ్దానికి చెందినవాడైనప్పటికీ మానవరూపంలో ఉన్న బుద్ధ ప్రతిమలు CE ఒకటో శతాబ్దం నుంచి మాత్రమే కనిపిస్తాయి. BCE 332 లో అలెగ్జాండర్ బారతదేశంపై చేసిన దండయాత్రఫలితంగా భారత గ్రీకు సంస్కృతుల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. పెద్దసంఖ్యలో గ్రీకు సైనికులు, వ్యాపారులు భారతదేశంలో స్థిరపడ్డారు. వారు తమతో పాటు గ్రీకు భాష, కళలు, సంస్కృతులను తీసుకొచ్చారు. భారతీయ-గ్రీకుల సాంస్కృతిక సమ్మేళనం వలన ఇండో- హెలినిస్టిక్ సంస్కృతి అనే కొత్త సాంస్కృతిక ఒరవడి ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ ఉన్న గాంధార ప్రాంతంలో ఒక కొత్త శిల్పకళాశైలి ఏర్పడింది. దానిని గాంధారశిల్పశైలి అంటారు. ఈ శైలిలో అంతవరకూ చిహ్నాలరూపంలో ఉన్న బుద్ధుడు, బౌద్ధమతపాత్రలు మొదటిసారిగా మానవరూపంలో చిత్రీకరించటం జరిగింది. బౌద్ధమత పరిణామక్రమంలో ఇదొక ముఖ్యమైన మలుపు.
కూర్చొని ఉన్న బుద్ధుని శిల్పాలలో ధ్యానముద్ర, భూమిస్పర్శ ముద్ర, ధర్మచక్రముద్ర లతో ఉన్నవి , అలాగే నిలుచుని ఉన్న అవలోకేశ్వర, , శయనస్థితిలో ఉండే Reclining బుద్ధుని ప్రతిమలు భారతదేశంలో విరివిగా లభిస్తాయి.
బౌద్ధ ప్రతిమాశాస్త్రం ఆ తదుపరి కాలంలో వచ్చిన హిందూ ప్రతిమలను తీర్చిదిద్దటానికి ప్రేరణగా నిలిచి ఉంటుంది.
[1] pn.15, Buddhapada and the Bodhisattva Path, Hamburg Buddhist Studies 8
[2] The Significance of the signs and symbols on the foot prints of the buddha, TB Karunaratne, Jestor 5.
బొల్లోజు బాబా
ఈ సీరిస్ రాయటానికి సంప్రదించిన పుసకాలు
1. Yaksha cult, Ram Nath Misra
2. The Art and Architecture of India, Benjamin Rowland
3. Le Huu Phuoc, Buddhist Architecture
4. Iconography of the Hindus Buddhists, and Jains, RS Gupte
5. Gouriswar Bhattacharya, Essays on Buddhist Hindu Jain iconography and epigraphy
6. The Art of Ancient India, Buddhist, Hindu, Jain
7. Elements of Buddhist Iconography, Ananda K Coomaraswamy
8. పురాణాలు-మరోచూపు, బి. విజయభారతి

















Thursday, October 19, 2023

పాలస్తీనియన్ కవిత్వం

ప్రస్తుతం పాలస్తీనియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇదివరలో నేను అనువదించిన పాలస్తీనియా కవిత్వాన్ని మరొకసారి తరచి చూసుకొన్నాను. వీటిని అనువదించేటపుడు నేను అనుభవించానో లేదో గుర్తురావటం లేదు కానీ .... నేడు మాత్రం ఆ వాక్యాల వెనుక గూడుకట్టుకొన్న ఒక వేదన బలంగా తెలుస్తోంది.
ఎంత దుఃఖం..... ఎంత దుఃఖం.... కవిత్వం అంటేనే దుఃఖం కదా!
.
బొల్లోజు బాబా

****

1.
FADY JOUDAH
.అనుకరణ -- by Fady Joudah
తన సైకిల్ హేండిల్స్ మధ్య
గూడుకట్టుకొన్నసాలెపురుగుని
రెండువారాలుగా
అదిలించ లేదు మా అమ్మాయి
దానంతట అదే వెళిపోయే వరకూ
ఎదురుచూసింది.
నీవు దాని గూటిని తొలగించి ఉన్నట్లయితే
అది తెలుసుకొనేది కదా "ఈ ప్రదేశం తన ఇల్లు కాదని;
నీవూ చక్కగా సైకిల్ తొక్కుకొని ఉండేదానవు" అన్నాను నేను
మనచుట్టూ ఎంతోమంది
నిరాశ్రయులు అవుతున్నది అలానే కదూ?'
అంది మా అమ్మాయి.
 
Poem by Palestinian poet Fady Joudah
30-07-2016

****

2.
DARWISH, MOHMOUD
ముహమ్మద్ దర్విష్ (1941-2008) ఒక పాలస్తీనా కవి. అతని కవితలు శక్తివంతమైన రాజకీయ ప్రకటనలు గా ఉంటాయి. అతని కవితలు పాలస్తీనా ప్రజల యొక్క దుఃఖం మరియు ఆశలను వ్యక్తం చేస్తాయి.


దాహంతో చచ్చిపోయిన ఒక నది –A river dies of thirst
ఇక్కడ ఒక నది ఉండేది, ఇరు తీరాలతో.
ఆ నదిని వానచినుకులతో పోషించే
స్వర్గలోకపు అమ్మ కూడా ఉండేదిక్కడ.
కొండకోనల్లోంచి జారుతో
మందగమనంతో పారేది అది.
ఓ అందమైన అతిధిలా గ్రామాలను సందర్శిస్తూ
లోయలకు పచ్చదనాన్ని, కొండఫలాల్ని అందించేది.
రాత్రివేళల తీరాలపై దొర్లే సరదాప్రియులను చూసి
నవ్వుకొంటూ సాగేది
“మబ్బు పాలను తాగి, పశువులకు నీళ్ళు తాపి
జెరుసెలేమ్ కు, డమాస్కస్ కు ఉరకలెత్తిన నది”
అప్పుడప్పుడూ అది వీరోచితంగా గానం చేసేది
ఒక్కోసారి ఉద్రేకంతో.
ఇక్కడ ఒక నది ఉండేది, ఇరు తీరాలతో.
వానచినుకులతో ఆ నదిని పోషించే
స్వర్గలోకపు అమ్మ కూడా ఉండేది
కానీ వాళ్లు దాని అమ్మను అపహరించాక
ఆ నదికి నీరు లభించక
క్రమక్రమంగా చచ్చిపోయింది, దాహంతో
మూలం: A river dies of thirst
 
2. ఉదాసీనుడు - The indifferent one
.
అతను దేనినీ లక్ష్యపెట్టడు.
వాళ్ళు అతని ఇంటికి కుళాయి నిలుపుచేస్తే:
‘పరవాలేదు! వానాకాలం దగ్గరలోనే ఉంది’ అంటాడు.
కరంటు ఆపు చేస్తే: ఆవులిస్తూ
“పరవాలేదు, ఈ వెలుగు సరిపోతుంది’ అంటాడు
నీ జీతం తగ్గిస్తాం అని వాళ్ళు బెదిరిస్తే,
‘పరవాలేదు! మద్యం, సిగరెట్లు మానేస్తాను’ అంటాడు
అతన్ని వాళ్లు జైలులో పెట్టినపుడు
‘పరవాలేదు, జ్ఞాపకాలతో కొంతకాలం ఏకాంతంగా
గడపవచ్చు’ అంటాడు.
ఇంటివద్ద దిగపెట్టినపుడు:
‘పరవాలేదు! ఇది నా ఇల్లు’ అంటాడు
ఒకసారి అతణ్ణి కోప్పడుతూ అడిగాను
‘రేపు ఎలా జీవించాలనుకొంటున్నావు’ అని
అతనన్నాడూ
‘ఈ రేపు నన్ను బాధించదు.
అదొక ఒఠి ఊహ. నన్ను ఆకర్షించదు
నేను నేను మాత్రమే: నన్ను ఏదీ మార్చలేదు
నేను దేన్నీ మార్చలేనట్లుగానే,
నా సంతోషాల్ని దూరం చేయకు.
‘నేనేమీ Alexander the Great లేదా
Diogens ని’ కాదులే అన్నాను
‘నిర్లిప్తత అనేది ఒక వేదాంతం
ఒకరకమైన ఆశావహ దృక్ఫథం కూడా’ అన్నాడతను.
.
మూలం: The indifferent one
Date: 15-02-2019


3. ఇద్దరు అపరిచితులు - Two strangers by Darwish

ఆకాశం వైపు చూసాడు
ఒక నక్షత్రం అతని వైపే చూస్తోంది
లోయలోకి చూసాడు
అతని సమాధి అతనివైపే చూస్తోంది
తనను బాధించిన, ఆనందింపచేసిన
స్త్రీ వైపు చూసాడు
ఆమె ఇతని వైపు చూడటం లేదు
అద్దంలో చూసుకొన్నాడు
దాన్లోంచి అతని లాంటి మరో అపరిచితుడు
అతన్నే తొంగి చూస్తున్నాడు
మూలం Two strangers by Darwish
Date: 13-02-2019
*****

3.
SAMIH AL-QASIM
Samih al-Qasim జోర్డాన్ లో జన్మించిన పాలస్తీనియన్ కవి. ఇతను అనేకసార్లు రాజకీయకారణాల వల్ల జైలు పాలయ్యాడు. ఇతర కవుల్లా ఇతను పాలస్తీనియాను విడిచిపెట్టి పోలేదు దానికి కారణం నా మాతృభూమిపై నా అనుబంధమే అని ప్రకటించుకొన్నాడు. తన జీవితంలో ఎక్కువకాలం గృహనిర్భంధంలోనే గడిపాడు "The only way I can assert my identity is by writing poetry" అనేది Samih al-Qasim కవిత్వ వస్తువు మరియు శిల్పము. Samih al-Qasim 2014 లో మరణించాడు.
Samih al-Qasim కవితల అనువాదాలు ఇవి.
 
1.
Travel Tickets
నన్ను చంపినరోజు
నా జేబులో Travel Tickets గమనిస్తావు నువ్వు
శాంతిలోకి
పంటపొలాలలోకి, వానలోకి
మనుషుల అంతరాత్మలలోకి
తీసుకెళ్ళే Travel Tickets
ప్రియమైన నా హంతకుడా
ఆ టికెట్లను వృధాచేయకు.
వాటిని వాడుకో.
దయచేసి ప్రయాణించు

2.
Slit lips
చనిపోయిన
ఒక కోకిల కథను
నేను నీకు చెప్పి ఉండేవాడిని.
వాళ్ళు నా నాలుకను
చీల్చి ఉండకపోతే
ఆ కథను నీకు......

3.
Abandoning
నేను చూసాను ఆమెను
నేను చూసాను ఆమెను కూడలిలో
నేను చూసాను కూడలిలో ఆమె రక్తంచిందించటం
నేను చూసాను కూడలిలో ఆమె నడవలేకపోవటం
నేను చూసాను కూడలిలో ఆమె చంపబడటం
నేను చూసాను... నేను చూసాను....
ఈమె సంరక్షకుడు ఎవరని అతను బిగ్గరగా అరచినప్పుడు
నాకు ఆమె పరిచయమే అనే విషయాన్ని చెప్పలేదు
ఆ కూడలిలో ఆమెనలా విడిచిపెట్టేశాను
ఆ కూడలిలో రక్తమడుగులో ఆమెనలా విడిచిపెట్టేసాను
ఆ కూడలిలో నడవలేకపోతున్న ఆమెనలా విడిచిపెట్టేసాను
ఆ కూడలిలో మృత్యువుకి ఆమెనలా విడిచిపెట్టేసాను
ఆమెనలా విడిచిపెట్టేసాను....

4.
End of Discussion with a Jailer
నా జైలుగది కిటికీలోంచి
నన్ను చూసి నవ్వే చెట్లు
నా ప్రజలతో నిండిన ఇంటికప్పులు
నాకోసం విలపిస్తూ ప్రార్ధించే కిటికీలు కనిపిస్తాయి
నా ఇరుకైన గది తలుపురంద్రంలోంచి
నీ విశాలమైన గది కూడా కనిపిస్తుంది.

5. Confession at Midday
.
ఒక చెట్టును నాటాను
దాని ఫలాల్ని తృణీకరించి
మానుని కలపగా వాడుకొన్నాను
కొమ్మలను వీణగా చేసి
గొప్ప రాగాల్ని పలికించాను
వీణ పగిలిపోయింది
రాగాలు ఆగిపోయాయి
ఫలాలు పోగొట్టుకొన్నాను
ఇప్పుడు చెట్టు కొరకు దుఃఖిస్తున్నాను.
,
మూలం- Samih al-Qasim
20-05-2021

***
4.
RAFEEF ZIADAH We teach life sir

నేడు నా దేహం టీవీలో చూపించే ఒక ఊచకోత
నేడు నా దేహం sound-bites కి పదాల పరిమితికి లోబడి
టీవీలో చూపించే ఒక ఊచకోత
నేడు నా దేహం sound-bites కి పదాల పరిమితికి లోబడి ఉంటూ
సరిపడినన్ని గణాంకాలు కలిగి ఉన్న టీవీలో చూపించే ఒక ఊచకోత.
నేను ఇంగ్లీషు నేర్చుకొన్నాను, నా UN resolutions తెలుసుకొన్నాను
అయినప్పటికీ అతను నన్ను అడిగాడూ...
Ms. Ziadah "మీరు మీ పిల్లలకు ద్వేషాన్ని నేర్పటం నిలిపివేస్తే
పరిస్థితులన్నీ చక్కదిద్దుకొంటాయి కదా" అని
మౌనం...
ప్రశాంతంగా ఉండేందుకు శక్తికోసం నేను నా లోపలకు తొంగిచూసుకొన్నాను
Gaza పై బాంబులు జారవిడిచే సమయాన ప్రశాంతత నా నాలుక చివర ఉండదు
ప్రశాంతత నన్ను విడిచి వెళిపోయింది
మౌనం...చిరునవ్వు
మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
Ziadah నవ్వుతూ ఉండు
మౌనం..

మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
వారు మా చివరి ఆకాశాన్ని కూడా ఆక్రమించేసాకా
పాలస్తీనియన్లమైన మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
మా ఆకాశాన్ని కబళించి ఎత్తైన వివక్షా ప్రహరీలతో వాళ్ళ భవంతులు నిర్మించుకొన్నాకా
మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
సరే పోనీయండి
ఈ మొత్తాన్ని ఒక కథగా ఎలా చెబుతారు? ఒక మానవ గాథలా?
వివక్ష, ఆక్రమణ లాంటి పదాలు లేకుండా
రాజకీయాలు లేకుండా
కొంచెం సహాయం చెయ్యండి"

నేడు నా దేహం టీవీలో చూపించే ఒక ఊచకోత
Gaza లో ఒక స్త్రీకి అత్యవసర మందులు అవసరపడ్డాయి అనే కథగా చెబుతారా?
మీ సంగతేమిటి?
సూర్యుడిని కప్పటానికి సరిపడా విరిగిన ఎముకల చేతులు ఉన్నాయా మీకు?
చనిపోయిన మీ బంధువుల జాబితా ఇవ్వండి
పన్నెండు వందల పదాల పరిమితికి లోబడి

నేడు నా దేహం టీవీలో చూపించే ఒక ఊచకోత
అది sound-bites కి పదాల పరిమితికి లోబడి ఉంటూ
ఉగ్రవాదుల రక్తానికి స్పందించటం మానేసిన వారిని కదిలించాలి.
కానీ వారు విచారం వ్యక్తం చేసారు
Gaza లో పశువులు మరణించినందుకు విచారం వ్యక్తం చేసారు
వారికి UN resolutions, గణాంకాలు ఇచ్చాను.
మేం ఖంఢిస్తాం, మేం గర్హిస్తాం, మేం తిరస్కరిస్తాం
ఇక్కడ ఇరుపక్షాలు సరిజోడీ కాదు.
ఒకరు ఆక్రమణదారులు మరొకరు ఆక్రమితులు
వందమరణాలు ఒకవైపు, వేయిమరణాలు మరోవైపు
యుద్ధము, ఊచకోత

మేము పరదేశీయులం కాదు, టెర్రరిస్టులం కాము అని ప్రకటిస్తున్నాను
వందల వేల మృతుల్ని పదే పదే లెక్కిస్తున్నాను
ఎవరైనా ఉన్నారా? వింటున్నారా?

ప్రతి ఒక్క శరణార్ధుల శిబిరంలోకి వెళ్ళి అక్కడి ప్రతి ఒక్క శిశువుని ఎత్తుకొని
మరే బాంబు శబ్దాలను వినకుండా వారి చెవులను నా చేతులతో కప్పాలని ఉంది
నేడు నా దేహం టీవీలో చూపించే ఒక ఊచకోత
UN resolutions ఎందుకూ పనికి రాకుండా పోయాయి
నేను ఇంగ్లీషు ఎంతగొప్పగా నేర్చుకొన్నా no sound-bite
And no sound-bite
ఏ sound-bite వారిని బ్రతికించలేదు
ఏ sound-bite దీన్ని బాగుపరచలేదు

మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
పాలస్తీనియన్లమైన మేము ఉదయాన్నే నిద్రలేచి
ఈ ప్రపంచానికి జీవితాన్ని నేర్పుతున్నాం సర్

Source: Rafeef Ziadah We teach life sir

(Rafeef Ziadah పాలస్తీనియన్ జర్నలిస్టు. పై కవితలో తమ భూభాగాలను కోల్పోయి, తమ సొంత నేలపైనే పరాయి వారిగా బ్రతకాల్సిన దుస్థితి వర్ణించబడింది. తమపై జరుగుతున్న వివక్ష, ఊచకోతలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటం పై కవితలో కవయిత్రికి, ఆమె సహచర మిత్రునికీ మధ్య జరిగిన సంభాషణా రూపంలో వ్యక్తీకరించబడింది)

1, June 2021

అనువాదం:  బొల్లోజు బాబా

బౌద్ధ చిహ్నారాధన - పార్టు 2


3. స్తూపం (thube)

బుద్ధుని రూపం బదులుగా ఆరాధించబడిన చిహ్నాలలో స్తూపం ఒకటి. ప్రాచీన బౌద్ధనిర్మాణాలలో స్తూపారాధన శిల్పాలు తప్పక కనిపిస్తాయి. స్తూపం అంటే అర్ధవృత్తాకారంలో లేదా గంట ఆకారంలో ఉండే నిర్మాణం అని అర్ధం.
 
బుద్ధుడు పరినిర్వాణం పొందినపుడు అతని దేహ అవశేషాల కొరకు ఆనాటి సమకాలీన ఎనిమిది మంది రాజులు యుద్ధానికి దిగారట. ఆ సంఘటనను సాంచిస్తూప దక్షిణ ద్వారంపై శిల్పరూపంగా మలచారు. ఇందులో బుద్ధునిదహనం చేసిన చోటుకు ఇరువైపులా సేనలు మొహరించి ఉండటం చూడవచ్చు. (photo). ద్రోన అనే బ్రాహ్మణుడు (Brahmin Drona) మధ్యవర్తిత్వం వహించి అవశేషాలను ఎనిమిది సమ భాగాలుగా చేసి ఇవ్వటంతో యుద్ధం ఆగిందని “మహాపరి నిర్వాణ సూత్ర” గ్రంథంలో చెప్పబడింది. ఆ సంఘటనను శిల్పంగా మలచిన ఫలకం నేడు టోక్యో మ్యూజియంలో ఉంది. (see photo).
 
ఆ ఎనిమిది అవశేషాలను ఆయా రాజ్యాల ప్రధాన పట్టణాలకు పంపి స్తూపాలను నిర్మించారు. అవి- రాజగృహ, వైశాలి, కపిలవస్తు, అల్లకప్ప, రమగ్రమ, పావ, కుశినగర్, వేతాదిప లు. ఆర్కియాలజిస్టులు వీటిలో ఇంతవరకూ రాజగ్రిహ, వైశాలి, రమగ్రమ, కుశినగర్ కపిలవస్తు ల వద్ద నిర్మించిన స్తూపాలను గుర్తించగలిగారు. మిగిలినవాటి వివరాలు తెలియరావు. Piprahwa/కపిలవస్తు స్తూపం వద్ద ఒక భరిణిలో దొరికిన బుద్ధునివని చెప్పబడే అవశేషాలను 1971 లో K.M. Srivastava కార్బన్ డేటింగ్ చేయించి అవి క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దానికి చెందినవని నిర్ధారించాడు. [1]
 
ఆ తరువాత అశోకచక్రవర్తి వాటిని తవ్వించి ఆ దాతువులను మరల కొన్ని వేల భాగాలుగా చేసి చేసి దేశమంతటా 84 వేల స్తూపాలు నిర్మించినట్లు బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తుంది. ఈ స్తూపాలవద్ద అశోకుడు రాతి స్తంభాలను పాతించి దానిపై తన శాసనాలను లిఖింపచేసాడు. ఈరోజు దేశంలో ఏ ప్రాంతంలో తవ్వినా దొరకే బౌద్ధ అవశేషాలు అశోకుడు స్థాపించినవే కావొచ్చు.
గాజు, లేదా బంగారు భరణెలో బుద్ధుని భౌతిక అవశేషాలు ఉంచి దానిపై నిర్మించిన స్తూపాన్ని Relic stupa అంటారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా దంతపురంవద్ద బుద్ధుని దంతం కలిగిన Relic స్తూపం ఉండేదట. ఆ పవిత్రదంతాన్ని శ్రీలంక అనురాధపురానికి తరలించుకొని పోగా దంతపురం అనే ఊరిపేరు, అక్కడ కొన్ని స్తూప శిథిలాలు మాత్రం ప్రస్తుతం మిగిలాయి.
 
నిత్యం దర్శించుకొని ఆరాధన చేయటం కొరకు నిర్మించిన స్తూపాన్ని Votive stupa అంటారు. విశాఖపట్టణం సమీపంలో బావికొండ, సాలిహుండంల వద్ద వీటి అవశేషాలు కనిపిస్తాయి.
బౌద్ధ స్తూపం చుట్టూ ప్రదక్షణ చేయటానికి వీలుగా ఒక మార్గం, దానికి వెలుపల పిట్టగోడలాంటి ప్రాకారం ఉంటుంది. దీన్ని Guard rails (వేదిక) అంటారు. ఇది నిలువు, అడ్డ రాతి స్తంభాల వెదురుబద్దల అల్లికవంటి బిగింపుతో నిర్మితమై ఉంటుంది. వీటిపై అందమైన బౌద్ధ శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఈ రాతి వేదిక (railing) ఐహిక ప్రపంచాన్ని, ఆథ్యాత్మిక ప్రపంచాన్ని వేరుచేసి, భక్తులను స్తూపం చుట్టూ ఉన్న ప్రదక్షణ మార్గం మీదకు నడిపిస్తుంది. స్తూపం చుట్టూ మూడుసార్లు ప్రదక్షణం చేయాలని బౌద్ధనియమావళి.
 
బౌద్ధ స్తూపాలు, కొండగుహలు, చైత్యాలు ప్రస్ఫుటమైన శైలిని కలిగిన స్వతంత్రనిర్మాణాలు.
బోధగయలో CE 150 కి చెందిన మహాబోధి ఆలయ గోపురం 180 అడుగుల ఎత్తుఉండే ఇటుకల నిర్మాణం. గోపురశిఖరంపై బౌద్ధ స్తూపం ఉంటుంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధివృక్షానికి దగ్గరలో ఈ ఆలయం ఉందికనుక దీన్ని Great Awakening Temple అని అంటారు.
400-425 CE మధ్య నిర్మించిన సాంచి 17 వ నంబరు బౌద్ధ ప్రతిమాగృహం భారతదేశంలో అత్యంతపురాతనమైన freestanding ఆలయం. ఇది చాలా సరళమైన నిర్మాణాన్ని కలిగిఉంటుంది. చతురస్రాకారపు గర్భగుడి దాని పైన చదునైన కప్పు, ద్వారమండపాన్ని నిలబెడుతూ ముందువైపున నాలుగు స్తంభాలు వాటిపై పద్మాలు, సింహాలు చెక్కబడి ఉంటాయి.
పైన చెప్పిన బౌద్ధ ఆలయాల నిర్మాణశైలి కొన్ని శతాబ్దాల అనంతరం నిర్మించిన హిందూ ఆలయాలనిర్మాణ శైలికి స్పూర్తి కావొచ్చు.[2]
 
బొల్లోజు బాబా

1. The Relics of Culture, Vol I William Anderson Gittens- pn.78
2. Buddhist Architecture, Le Huu Phuoc 2010 pn. 252, 254

















Tuesday, October 17, 2023

బౌద్ధ చిహ్నారాధన - పార్టు 1


.
వైదికదేవతలు విగ్రహాలరూపంలో పూజలందుకొన్నట్లు ఆధారాలు లేవు. BCE మూడో శతాబ్దంలో మొదట చిహ్నాలరూపంలో బౌద్ధమత ఆరాధన సాగి క్రమేపీ మానవరూప ప్రతిమల ఆరాధన వచ్చింది. ఈ దశలలో ధర్మచక్రం, బోధి వృక్షం, స్తూపం, త్రిరత్న, వజ్రాసనం, పద్మం, బుద్ధుని పాదముద్రలు, భిక్షపాత్ర లాంటి వివిధ చిహ్నాల ఆరాధన జరిగేది. ఇవి ఎక్కువగా అమరావతి, సాంచి, భార్హుత్, బోధగయ లాంటి బౌద్ధ నిర్మాణాలలో కనిపిస్తాయి.
.
1. ధర్మచక్రం (dhammacakka): బౌద్ధమతంలో ధర్మచక్రం అనేది బుద్ధునికి, బౌద్ధధర్మానికి సంకేతం. బుద్ధుడు సారనాథ్ లో మొదటిసారిగా చేసిన బోధనను “ధమ్మచక్క పవత్తన సుత్తం” అంటారు. ఈ ప్రసంగంలో బుద్ధుడు జీవితం యొక్క అర్ధం, విముక్తి సాధించే మార్గం గురించి భోధించాడు. ఈ ధర్మచక్రం అనేది శాంతి, జ్ఞానం, విముక్తులకు చిహ్నం. ఈ విలువలను బోధించటం ద్వారా బుద్ధభగవానుడు ప్రపంచంలో Wheel of Law ను తిరిగేలా చేసాడని బౌద్ధుల విశ్వాసం.
BCE 1 వ శతాబ్దానికి చెందిన సాంచి స్తూపశిల్పాలలో పశ్చిమతోరణం పై ఒక స్తంభంమీద 32 ఆకులుకలిగిన ధర్మచక్రానికి అశోకుడు తనపరివారంతో భక్తితో నమస్కరిస్తూ ఉండటం చూడవచ్చు. (See Photo)
BCE రెండవ శతాబ్దానికి చెందిన భార్హుత్ వద్ద లభించిన ధర్మచక్రం అత్యంత ప్రాచీనమైనది. భారతదేశ అధికారిక ముద్రలో, జండాపై ఉండే ధర్మచక్రం బౌద్ధచిహ్నమే.
ఈ భూమిపై ధర్మం అందరికి సమానంగా అందేలా ఎవరైతే ఈ చక్రాన్ని తిప్పుతారో అతనే చక్రవర్తి అని (He who turns the Wheel) బౌద్ధసాహిత్యం చెబుతుంది.
***

2. బోధి వృక్షం: సిద్ధార్థుడు తనదైన దర్శనాన్ని పొందటానికి ముందు అప్పటికి ప్రచారంలో ఉన్న అన్ని దర్శనాలను అధ్యయనం చేసాడు. కొంతకాలం వాటితో నడిచాడు. ఒకనాడు ఆహారాదులు సేవించి బోధి వృక్షం కూర్చుని నలభై ఐదు రోజుల పాటు ధ్యానం చేసి ఒక నూతన దర్శనాన్ని పొందాడు. జ్ఞానోదయం పొందిన సిద్ధార్థుడు బుద్ధునిగా మారాడు.
బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధివృక్షం భౌగోళికంగా బోధగయవద్ద ఉంది. బుద్ధుడు పరినిర్వాణం చెందిన మూడు శతాబ్దాల తరువాత అశోకచక్రవర్తి BCE 242 లో ఆ బోధివృక్షం చుట్టూ రాతి ఆవరణాన్ని ఏర్పరచి దానినొక పవిత్ర దర్శనీయస్థలంగా తీర్చిదిద్దాడు. ఆ వృక్షంనుంచి ఒక కొమ్మను శ్రీలంక అనురాధాపురానికి పంపి అక్కడ నాటింపచేసాడు. నేడు శ్రీలంకలో పూజలందుకొంటున్న బోధి వృక్షం (Bo tree) అశోకుడు పంపించినదే అంటారు.
అశోకుని నాల్గవభార్య “తిస్సరక్క”, తన భర్త తనను పట్టించుకోకుండా ఆ వృక్షం పైనే ఎక్కువ ఆసక్తిపెడుతున్నాడని బోధగయలోని బోధి వృక్షాన్ని నాశనం చేయించిందట. ఈ కథ ద్వారా బుద్ధుడు జ్ఞానోదయం పొందిన అసలైన బోధివృక్షం అశోకునికాలానికే అంతరించిపోయినట్లు అర్ధంచేసుకోవాలి. తిరిగి ఆ ప్రాంతంలో మొలిచిన మరొక బోధివృక్షాన్ని 7 వ శతాబ్దంలో శైవమతానికి చెందిన శశాంకుడనే బెంగాలు రాజు బోధగయమీదుగా వెళుతూ కూకటి వేళ్లతో పెకలించి నాశనం చేసినట్లు హుయాన్ త్సాంగ్ తన రాతలలో తెలిపాడు. [1]
 
1862 Cunningham బోధగయ సందర్శించినపుడు- “ప్రసిద్ధిగాంచిన బోధివృక్షం ఇంకా ఉంది. చాలాభాగం పాడయింది. మూడుకొమ్మలు ఉన్నాయి. ఒకటిమాత్రమే పచ్చని ఆకులతో ఉంది. ముప్పై అడుగుల ఎత్తు ఉంటుంది. అరవై ఏళ్ళక్రితం 1811 లో Hamilton ఈ చెట్టును చూసి వందేళ్ల వయసుంటుందని లెక్కగట్టాడు” - అని రికార్డు చేసాడు.
 
బోధివృక్షం బౌద్ధులకు ఒక ఆరాధనీయ శిల్పంగా మారింది. భర్హౌత్, సాంచి, మథుర, అమరావతి స్తూపాలలో బోధివృక్ష నిర్మాణాలు, దానిని పూజిస్తూ పరివారము కనిపిస్తాయి. బౌద్ధ సాహిత్యంలో ఈ వృక్షాన్ని జీవన ఫలాలను ఇచ్చే kappa rukka (కల్పవృక్షం) గా చెప్పబడింది.

బౌద్ధం ప్రారంభదశలలో బోధివృక్షం బుద్ధుని రూపంగా పూజలందుకొనేది. BCE 1 వ శతాబ్దానికి చెందిన అమరావతి రాతిఫలకలో బోధివృక్షం పూజలందుకొంటున్న దృశ్యం చూడవచ్చు. ఇందులో అందమైన తలపాగలు, బరువైన ఆభరణాలు ధరించిన పురుషులు, చక్కని ఆకులతో రావి చెట్టు, చెట్టు మొదలులో ఒక ఆసనము, దానిముందు ఒక జత పాదముద్రలు కనిపిస్తాయి. ఒక భక్తుడు పాదుకలకు శిరస్సువంచి నమస్కరిస్తుంటాడు. రెండువేల ఏండ్ల క్రితపు తెలుగు ప్రజల ఆహార్యాన్ని, ఆరాధనను పై ఫలక ప్రతిబింబిస్తుంది. (see photo)

బుద్ధుడు బోధివృక్షంకింద జ్ఞానోదయం పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు డిసంబరు 8 న Bodhi Day గా జరుపుకొంటారు. ఇది మతపరమైన శలవు దినం. ఆ రోజున Budu saranai/బుద్ధుని శాంతి నీదే అగుగాక అని ఒకరినొకరు అభివాదాలు తెలుపుకొంటారు.
 
బొల్లోజు బాబా

[1] The Historical Buddha, Hans Wolfgang Schumann, pn 60



















Sunday, October 15, 2023

పిచ్చుకలు ఎగిరిపోయాయి....

.
పార్కు బెంచీపై ఒంటరిగా కుర్చొన్నాను
కేరింతలు వినబడనంత దూరంగా
పిల్లలు ఆడుకొంటున్నారు

ఎక్కడినుంచి వచ్చాయో కిచకిచమంటూ
పిచ్చుకల గుంపొకటి నా ముందు వాలింది
రొద... రొ..ద...రొ...ద
ఒకటే శబ్దబీభత్సం
పాడు పిచ్చుకలు... పాడుపిచ్చుకలు

చెట్లను తప్పించుకొంటూ
గుంపుగా పైకి లేస్తూ వాలుతూ
రొద... రొ..ద... ఒకటే రొద
చెవులు గళ్ళెత్తిపోతున్నాయి
సన్నని తీగలా నొప్పి మొదలైంది
రెండుచెవుల్లో

దూరంగా వెళిపోదామనుకొనే లోపే
రెక్కలు తపతపలాడించుకొంటు
ఎటో ఎగిరిపోయాయి

భయంకరమైన నిశ్శబ్దం

బొల్లోజు బాబా

Wednesday, October 11, 2023

మహామాయ దేవి-గజలక్ష్మి

సిద్ధార్థుని తల్లి పేరు మహామాయ. తండ్రి శుద్ధోధనుడు. ఒకనాడు ఈమె ఆరు దంతములు కలిగిన తెల్లని ఏనుగు ఆకాశం నుండి దిగివచ్చి తన గర్భంలోకి కుడివైపునుండి ప్రవేశించినట్లు స్వప్నంలో దర్శించింది. ఈ విషయాన్ని భర్త శుద్ధోదనుడికి తెలియచేసింది. శుద్ధోదనుడు ఆస్థాన పండితులను పిలిచి ఈ స్వప్నం గురించి తెలిపి ఇది దేనికి సంకేతమని అడిగాడు. ఆ పండితులు మహామాయ గర్భంలో గొప్ప అర్హంతుడు జన్మించబోతున్నట్లు చెప్పారు.
పదినెలల తరువాత మహామాయ పుట్టింటికి వెళుతూ దారిమధ్యలో పురిటినొప్పులు రాగా, లుంబిని వనంలో ఒక శాలవృక్షం క్రింద సిద్ధార్ధునికి జన్మనిచ్చి ఏడవరోజున మరణించింది. అది BCE 623వ సంవత్సరం.
 
భారతదేశం నలుమూలలా ఒకప్పుడు విస్తరించిన బౌద్ధమతం- బుద్ధుని జీవిత చరిత్రను, కథలను, సంఘటనలను, ముద్రలను, భంగిమలను- శిల్పాలు, చెక్కుడు ఫలకల రూపంలో కాలంలో నిక్షిప్తం చేసింది. భారతదేశంలో ఏ మూల తవ్వినా నేటికీ అవి ఏదో ఓ రూపంలో దర్శనమిస్తూనే ఉన్నాయి. బుద్ధుని జననం, జ్జానోదయం, మొదటి భోధన, పరినిర్వాణం లాంటి ముఖ్యమైన జీవిత ఘట్టాలను చెక్కుడు ఫలకలుగా చేసి ప్రదర్శించటం ద్వారా బౌద్ధమతం సామాన్య ప్రజలలోకి సమర్ధవంతంగా చేరగలిగింది.
 
పైన చెప్పిన మహామాయ స్వప్న వృత్తాంతాన్ని వివరించే చెక్కుడు ఫలకలు నేడు పదుల సంఖ్యలో లభిస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో దొరికిన ఈ ప్రతిమలలో ఒకే రకమైన వివరాలు, భంగిమలు కలిగి ఉండటం – తొలితరం శిల్పకారులు తమ కళను ఏమేరకు ప్రామాణికరించారనేదానికి అద్దం పడుతుంది. మహామాయ స్వప్న వృత్తాంత చెక్కుడు ఫలకలలో ఈ క్రింది వివరాలు ఉమ్మడిగా కనిపిస్తాయి (Fig.1)

1. మహామాయా దేవి మంచంపై ఎడమవైపుకు తిరిగి పడుకొని ఉంటుంది
2. ఎత్తైన తలగడలపై ఎడమచేతిని ఆన్చి తలను నిలబెట్టి నిద్రిస్తూంటుంది
3. రవికె, తలపాగ, కర్ణాభరణాలు, కంఠాభరణం, గాజులు, పాదాలను కప్పుతూ దేహ వస్త్రం- ఇదీ ఆమె ఆహార్యం
4. గుండ్రని తేజో మండలము పై తొండము క్రిందకు చాపిన ఒక ఏనుగు బొమ్మ ఉంటుంది.
5. మంచానికి నగిషీ చెక్కిన కోళ్ళు, మంచం దిగటానికి వీలుగా వేసినఎత్తు తక్కువ పీట, పరుపు క్రిందనుండి అందంగా ముడతపెట్టి నేలవైపుకు వేలాడుతున్న దుప్పటి- లాంటి వివరాలు 2300 సంవత్సరాల నాటి రాణిగారి శయనాగారపు సౌందర్యాన్ని కళ్ళకు కడతాయి.
6. మంచం వెనుకవైపున సన్నని దీపస్తంభం
7. మంచం పక్కనే చేత కత్తిబళ్ళెం ధరించిన యవని సేవిక. ఆమెకు కూడా తలపాగ, దేహం చుట్టూ చుట్టబడిన వస్త్రం, కర్ణ, కంఠాభరణాలు, గాజులు ఉంటాయి.
మహామాయ స్వప్నోదంతంతో ఇంతవరకూ లభించిన అనేక ఫలకాలలో పై వర్ణనలు చిన్నచిన్న మార్పులతో కనిపిస్తాయి.
***
సిద్ధార్ధునికి జన్మనిచ్చిన వారంలో మహామాయ మరణించింది. బౌద్ధ iconography లో మాయాదేవి రూపం ఆ తరువాతకూడా అనేక స్తూపాలలో పద్మంపై నిలుచుని లేదా కూర్చుని ఇరువైపులా రెండు ఏనుగులు తమ తొండాలతో నీటిని అభిషేకం చేస్తున్నట్లు కనిపిస్తుంది.
ఇలా ఏనుగుల అభిషేకంతో మహామాయాదేవి ప్రతిమా లక్షణాలమూలాలు పాలి సాహిత్యంలో ఇలా ఉన్నాయి

సిద్ధార్థుడు జన్మించినపుడు మహామాయ, సిద్ధార్థుల పై ఆకాశం నుండి రెండు ధారలుగా నీరు వర్షించి వారిని శుభ్రపరచినట్లు ఒక బౌద్ధ జాతక కథలోని ఈ వాక్యాలు akasato dve udaka dhara nikkhamitvaa సూచిస్తున్నాయి.
 
మహామాయ స్వప్నంలో కనిపించిన ఏనుగులు, బుద్ధుని జనన సందర్భంగా రెండుధారల నీటిని ఆమెపై వర్షించటం -ఏనుగుల అభిషేకం చేస్తున్న మహమాయ ప్రతిమకు మూలంగా చెబుతారు. [1].
***

రెండు ఏనుగుల మధ్య పద్మాలను చేతబూనిన మహామాయ ప్రతిమ మొదటగా మధ్య ప్రదేష్ లోని 125-100 BCE కి చెందిన బౌద్ధ స్థూపం Bharhut లో కనిపిస్తుంది. BCE ఒకటో శతాబ్దానికి చెందిన మహామాయాదేవి టెర్రకోట మట్టి ప్రతిమ అమెరికా LACM మ్యూజియంలో కలదు. CE ఐదవ శతాబ్దానికి చెందిన ఒరిస్సా రత్నగిరి బౌద్ధ ఆరామ గుమ్మంపైన రెండు ఏనుగులు అభిషేకం చేస్తున్న మహామాయాదేవి ప్రతిమ ఉన్నది.
 
***
9 వ శతాబ్దం నుంచి ఈ మహామాయా దేవి హిందూ ఐకనోగ్రఫీ లో గజలక్ష్మిగా రూపాంతరం చెందటం గమనించవచ్చు. దీనికి కారణం అదృష్టాన్ని ఇచ్చే మోటిఫ్ గా మహామాయాదేవి శిల్పం అప్పటికే ప్రజలలో చొచ్చుకొని పోయి ఉండటం కావొచ్చు. అందుకనే కొన్ని జైన దేవాలయ ప్రవేశద్వారాలపైన కూడా గజలక్ష్మి ప్రతిమలు కనిపిస్తాయి. ఉదాహరణకు కర్ణాటకలోని ఇంద్రగిరి జైన ఆలయం.

నిజానికి అత్యంత ప్రాచీనమైనదనీ, బౌద్ధం కంటే పూర్వపుదని చెప్పే శ్రీ సూక్తంలో లక్ష్మి దేవి “ శ్రీ”, “ లక్ష్మి” లాంటి పేర్లతో చెప్పబడుతుంది తప్ప "గజలక్ష్మి" అన్న మాట లేదు. ఆ పదం ఆ తరువాతి పరిణామం.

“గజలక్ష్మి” అన్న పదం హిందూ sanskrit iconographic texts లలో ఎక్కడా కనిపించదని ప్రముఖ చరిత్రకారుడు N. K. Bhattasali అంటారు. ఆయన హిందూ గజలక్ష్మి పదానికి బదులుగా కమలాదేవి అనే పదాన్ని ఉపయోగించారు. [2].
 
12 శతాబ్దంనుండి బౌద్ధమతం కనుమరుగైపోయినప్పటికీ బౌద్ధ మోటిఫ్ లు హిందూ గాథల మూలాంశాలుగా కొనసాగాయి. ఎన్నో కథలు, కథనాలు, పాత్రలు, వస్తువులు హిందూమతంలోకి చేరి కలిసి కరిగిపోయాయి. ఈ మహామాయాదేవి గజలక్ష్మిగా మారటం కూడా అలాంటిదే.
 
బొల్లోజు బాబా

[1] pn. 22 Elements of Buddhist Iconography, by AK Coomaraswamy
[2]. pn 107, Studies in Art, Iconography, architecture and archaelogy of India and Bangladesh -Gouriswar Bhattacharya




























Sunday, October 8, 2023

చలిరాత్రి రాసిన కవిత by JIE XISI (1274–1344)



.
మంచురాలే ఆకాశంలో పలుచగా
పరచుకొన్న తారలు చలికి గడ్డకట్టాయి
ప్రవహించే చందమామ
అడవిని ముంచెత్తింది
ఆగాగి వినిపించే రాలేఆకుల శబ్దాల మధ్య
ఈ ఖాళీ ఇంట్లో నాకు నిద్రపట్టదు
.
అనువాదం: బొల్లోజు బాబా
Source: Written on a Cold Night by JIE XISI (1274–1344)
.
JIE XISI నిరుపేదకుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకొని రాజాస్థానంలో చరిత్రకారునిగా స్థిరపడ్డాడు. ఇతని వచనం పొందికగా, క్లుప్తంగా ఉంటుందని పేరు. ఇతని కవిత్వం "మూడురాత్రులు ముగిసిన పెళ్ళికూతురు" లా ఉంటుందని ఇతని సమకాలీన కవి అయిన Yu Ji వ్యాఖ్యానించాడట.

Monday, October 2, 2023

సుఖ శాంతులతో పొంగిపొరలే పల్లెజీవనం by XIN QIJI (1140–1207)


ఏటిఒడ్డున గరికపొదలమధ్య
ఎత్తుతక్కువ తాటాకు పాక
సారాయి నింపుకొన్న
రెండు గొంతుకలు Wu మాండలీకంలో
పలికే తియ్యని మాటలు

జుత్తునెరిసిన ఆ ముదుసలి ఎవరు?

ఆమె పెద్దకొడుకు ఏటికి అవతల
ఎండిన కంది కట్టలను కర్రతో నూర్చుతున్నాడు
ఆమె మధ్యకొడుకు
వెదురుబద్దలతో కోళ్లగూడు అల్లుతున్నాడు
ఆమె చిన్నకొడుకు తుంటరి
ఏటి ఒడ్డుపై వెల్లకిలా పడుకొని
తామరకాయని చీల్చి లోపలేముందో చూస్తున్నాడు
 
మూలం: Village Life, to the Tune of “Clear Peaceful Happiness” by XIN QIJI (1140–1207)
అనువాదం: బొల్లోజు బాబా

XIN QIJI (1140–1207) సైన్యంలో వివిధ హోదాలలో పనిచేసి పదవీవిరమణ చేసాక కవిత్వం ఇతనికి పునర్జీవనాన్ని ఇచ్చింది. ఆదర్శవాదం, దేశభక్తి, సైనికజీవనం ఇతని కవిత్వంలో పెద్దగా కనిపించవు. 600 పైన కవితలు రచించాడు. ప్రకృతి, ప్రేమ, వేదాంత ధోరణి లు కవితా వస్తువులు.