Saturday, November 4, 2023

భిన్నమతాలలో ఉమ్మడి పాత్రలు - ఇంద్రుడు, బ్రహ్మ

వైదికమతంలో ఇంద్రుడు దేవతల అధిపతి. అత్యంత ముఖ్యమైన దేవుడు. సోమరసాన్ని సమర్పిస్తూ ఋగ్వేదంలో అనేక శ్లోకాలు ఇంద్రుని కీర్తిస్తూ ఉంటాయి. దుష్టశక్తులను సంహరించటం, వర్షాలు కురిపించటం, కోర్కెలు నెరవేరటం కొరకు ఇంద్రుని ప్రార్ధించేవారు. రాక్షసులనుండి, బలవంతులైన నరులనుండి దేవతలను రక్షించటం ఇంద్రుని ప్రధాన విధి.
సనాతన విశ్వాసాలు హిందూమతంగా రూపుదిద్దుకొన్నాకా వేదాలలో ప్రముఖపాత్ర వహించిన ఇంద్రుని పాత్ర క్రమేపీ తన ప్రాభవాన్ని కోల్పోయింది.
 
అహల్యతో ఇంద్రుడు శారీరికంగా కలిసి ఆమె భర్త గౌతముని ఆగ్రహానికి గురయి, ఆ కారణంగా - ఇంద్రుడు వంధ్యత్వాన్ని శాపంగా పొందాడని రామాయణంలో; శరీరమంతా వెయ్యి యోనులను కలిగిఉండేటట్లు శపించబడ్డాడని భారతంలోను భిన్న కథనాలు కనిపిస్తాయి. అప్పటికే ప్రాధాన్యత కోల్పోయిన దేవలోకపాలకుడయిన ఇంద్రుడిని ఒక నరుడు, ఒక బ్రాహ్మణుడు శపించినట్లు చెప్పటం దేవతలపై కూడా బ్రాహ్మణ వర్గం తమ ఆధిపత్యం చూపగలదు అని చెప్పటం కొరకేనని జర్మన్ ఇండాలజిస్ట్ SöhnenThieme అభిప్రాయపడ్డారు.
 
***
బౌద్ధ, జైన మతాలలో కూడా ఇంద్రుని పాత్ర కనిపిస్తుంది. కానీ ఈ మతాలలో ఇంద్రుడు సాత్వికగుణాలు కలిగిఉంటాడు. ఉదాహరణకు బౌద్ధంలోని ఇంద్రుడిపేరు “శక్ర”. ఇతను సంహారకునిగా, స్త్రీలను వశపరచుకొనేవానిగా, సోమరసాస్వాదకునిగా కాక శాంతికాముకునిగా, స్త్రీలను రక్షించేవానిగా, ఇంద్రియనిగ్రహుడిగా కనిపిస్తాడు.
 
చెట్లపై గరుడపక్షులగూళ్ళు చెదరకూడదని సైన్యాన్ని దారిమళ్ళించాడట. కుంభజాతకంలో రాజు మద్యపానాన్ని సేవించినట్లయితే రాజ్యం నాశనం అవుతుందని రాజుకు హితోపదేశం చేసి అతనిని దుర్వసనాలనుండి మరల్చాడట. Mahājanaka-jātaka కథలో భర్త మరణించి, రాజ్యం కోల్పోయి, అప్పటికే గర్భవతిగా ఉండిన ఒక పట్టపురాణిని, వృద్ధుని రూపంలో వచ్చి రక్షించాడట. ఈ ఉదంతాలన్నీ ఇంద్రుని సుగుణాలను వెల్లడిస్తాయి.
 
బౌద్ధసాహిత్యంలో ఇంద్రుడు అనేక సందర్భాలలో స్త్రీలను చెరలనుంచి విడిపించినవాడిగా, సంతానాన్ని ప్రసాదించిన దైవంగా చిత్రించబడటాన్ని బట్టి ఈ పాత్ర ఉదాత్త వ్యక్తిత్వాన్ని కలిగిఉన్నట్లు భావించాలి.

జైన సాహిత్యంలో- ఇంద్రుడు పూర్వజన్మలో యుద్ధవీరుడని జైనం స్వీకరించి మరణించే వరకూ ఆహారం తినకుండా ఉండే సల్లేఖనా వ్రతం చేసి చనిపోయినట్లు ఉంటుంది. (Bhagavatī Sūtra; 18.2)

జైన తీర్థంకరులు క్షత్రియ గర్భంలో జన్మించటం ఒక ఆచారం. జైన మహావీరుడు దేవనంద అనే ఒక బ్రాహ్మణ స్త్రీ గర్భంలో పెరుగుతున్నట్లు తెలుసుకొన్న ఇంద్రుడు, నైగమేష అనే మేకతల దైవానికి చెప్పి – ఆ దేవనంద గర్భంలో పెరుగుతున్న పిండాన్ని త్రిశల అనే పేరుగల క్షత్రియ స్త్రీ గర్భంలోకి మార్పించినట్లు జైన సాహిత్యంలో కలదు.
ఇరవైనాలుగవ తీర్థంకరుడైన మహావీరునికి ఇంద్రుడు స్వర్ణవస్త్రాన్ని సమర్పించుకొన్నట్లు మరొక జైనకథనం.

బౌద్ధ జైన మతాలలోని ఇంద్రుడు/శక్ర సాత్వికునిగా జీవిస్తూ జిన, బుద్ధ దేవులను సేవించుకొంటూ గడిపినట్లు ఉండగా; హిందూ మత ఇంద్రుడు మాత్రం యుద్ధప్రీతి, సురాపానం, స్త్రీలోలత్వం లాంటి దుర్లక్షణాలతో కనిపిస్తాడు.
.
బ్రహ్మ
.
ముల్లోకాలను సృష్టించిన వాడిగా బ్రహ్మకు హిందూమతం పెద్దపీట వేసింది. బ్రహ్మ వేదవాజ్ఞ్మయంలో కనిపించడు. బ్రహ్మకు బదులుగా ప్రజాపతి, బృహస్పతి లు వేదాలలో బ్రహ్మ పాత్రను నిర్వహిస్తారు. పురాణకాలం వచ్చేసరికి బ్రహ్మ ప్రాముఖ్యత పెరిగి త్రిమూర్తులలో ఒకరిగా కొలువుదీరటం జరిగింది.
 
పురాణాలప్రకారం బ్రహ్మకు మూడు పాత్రలు. ఒకటి, ఈ చరాచర లోకాన్ని, వేదాల్ని, ధర్మశాస్త్రాలను సృష్టించటం; రెండు, దేవతలకు పురోహితుడిగా వ్యవహరించటం: మూడు, విపత్కర పరిస్థితులలో లోకకల్యాణం కొరకు పరిష్కారమార్గాలు చెప్పటం. వీటిని జాగ్రత్తగా గమనిస్తే భూమిపై “బ్రాహ్మణుడు” నిర్వహించే పనులుగా గుర్తించవచ్చు. బ్రాహ్మణులు తాము ఐహికంగా పోషిస్తున్న పాత్రను బ్రహ్మదేవుడిగా పురాణాలలో లిఖించుకొన్నారు. కాలక్రమేణా బ్రహ్మ దేవుని పాత్ర ప్రాభవాన్ని కోల్పోయి – శతృసంహారం కొరకు యుద్ధాలు చేస్తూ అధికారాన్ని ఆధిపత్యాన్ని చలాయించే విష్ణువుకు ప్రాధాన్యత పెరగటం గమనించవచ్చు.
 
***
బౌద్ధజైనాల ప్రకారం ఈ జగతి సృష్టించబడలేదు.. ఆ మేరకు బౌద్ధ జైన మతాలలో కనిపించే బ్రహ్మ పాత్రకు ముల్లోకాలను సృష్టించే పని ఇవ్వలేదు.
 
జైనమతంలో మొదటి తీర్థంకరుడైన రిషభనాథుడు (BCE 9వ శతాబ్దం) జన్మించినపుడు బంగారం వర్షించింది కనుక హిరణ్యగర్భ (Golden womb/egg) అనే పేరుకూడా ఉంది. (హిరణ్యగర్భంనుంచి ప్రజాపతి ఆవిర్భవించాడని రుగ్వేదంలోని హిరణ్యగర్భసూక్తం చెబుతుంది. విశ్వకర్మ సూక్తం, హిరణ్య గర్భ/Golden egg అనేది విశ్వకర్మ నాభి నుంచి వచ్చిందని చెబుతుంది. ( నాభి నుంచి బ్రహ్మ పుట్టటం అనే భావన క్రమేపీ విష్ణుమూర్తికి అన్వయించారు.)

అలా జన్మించిన రిషభనాధుడు పెరిగి నగరాలను, పట్టణాలను, గ్రామాలను, శాస్త్రాలను, కళలను సృష్టించి ఈ లోకానికి ఇచ్చి తాను అన్నింటిని త్యజించి తీర్థంకరునిగా మారాడు.
రిషభనాథుని కుమారుడు భరతుడు భరతవర్షానికి మొదటి చక్రవర్తి అని, మనవడు ఆదిత్యయశ (Adityayasa) ఇక్ష్వాకువంశానికి మూలపురుషుడని- రిషభనాథుని జీవితచరిత్రను తెలిపే పౌమచరియ (Paumacariya) అనే గ్రంథంద్వారా తెలుస్తుంది.
 
తొమ్మిదో శతాబ్దానికి చెందిన జినసేనుడు రచించిన ఆదిపురాణంలో- రిషభనాథుడిని బ్రహ్మ యొక్క విశేషణాలైన ప్రజాపతి, స్వయంభు అంటూ కొన్ని చోట్ల సాక్షాత్తూ బ్రహ్మ అనే పేరుతోనే సంబోధించాడు.
జైనంలో బ్రహ్మకు సృష్టికర్త పాత్రలేదు. ఆ పాత్ర చేసే పనులను రిషబనాథుడు నిర్వహించినట్లు చెప్పటం ద్వారా, జైన సాహిత్యంలో బ్రహ్మపాత్ర ఉన్నప్పటికి ఆయన ఒక మామూలు దేవుడు.
బ్రహ్మదేవుడు బ్రహ్మ లోకంలో నివసిస్తాడని అన్ని మతగ్రంధాలలో ఉంది. జైన బ్రహ్మలోకానికి ఏ ప్రత్యేకతా లేదు.
 
బౌద్ధంలోని బ్రహ్మలోకం మానవ, జంతు, రాక్షస, నరకలోకాలకన్నా ఉన్నతమైన లోకం. బౌద్ధ బ్రహ్మలోకంలో ఒక బ్రహ్మ మాత్రమే ఉండడు, అనేకులు ఉంటారు. భూమిపై ఉత్తమజీవనాన్ని గడిపిన నిష్కామపరులు బ్రహ్మలోకంలో బ్రహ్మలుగా అవతరిస్తారు. వీరు ఇతరబౌద్ధ దేవతల వలే చావుపుటుకలు కలిగి ఉంటారు. దయ, కరుణ, సహానుభూతి, సహిష్ణుత లక్షణాలు కలిగి ఉండటం బ్రహ్మలోక అర్హతగా బుద్ధభగవానుడు తన శిష్యులకు భోదించాడు. బక బ్రహ్మ, ఘటికార బ్రహ్మ, సహంపతి బ్రహ్మ, సనత్కుమార బ్రహ్మ పేర్లతో పాలి సాహిత్యంలో అనేక బ్రహ్మలు కనిపిస్తారు. వీరందరూ బుద్ధుని సేవిస్తూంటారు.
 
బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు తన 29 వ ఏట- ఒక ముసలి వ్యక్తిని, రోగపీడితుడిని, కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూసి, హృదయము ద్రవించి ప్రజల దుఃఖానికి గల కారణాలు కనుగొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం పరివ్రాజక జీవితం స్వీకరించాడు. బుద్ధుడు తన అంతఃపురాన్ని, రాజభోగాలను విడిచిపెట్టటానికి ప్రేరణ కలిగించిన- ఆ నాలుగు సంకేతాలను (ముదుసలి, రోగి, శవం, సన్యాసి) పంపించింది Ghaṭīkāra Brahmā అని బౌద్ధ Mahāvastu గ్రంథంలో ఉంది.

***
మూడు మతాలలోను బ్రహ్మ పాత్ర కనిపిస్తుంది. బౌద్ధ జైనాలలో బ్రహ్మ బుద్ధభగవానుని, తీర్థంకరులను సేవించుకొనే ద్వితీయశ్రేణి పాత్ర. బౌద్ధ సాహిత్యంలో బ్రహ్మదేవుని ప్రస్తావనలు ఉంటాయితప్ప ఇతర త్రిమూర్తులైన విష్ణువు శివుడు గురించి ఉండవు.
 
హిందూ మతంలో బ్రహ్మ మొదట్లో త్రిమూర్తులలో ఒకరిగా పూజలందుకొన్నాడు. సామాన్యశకం తొలి శతాబ్దాలవరకు ఉత్తరభారతదేశం లో బ్రహ్మదేవుడు ప్రధానపూజలు అందుకొనేవాడని The Mythology of Brahma పుస్తకంలో Greg Bailey అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు.
 
క్రమేపీ విష్ణువు శివుడు ఎక్కువ ప్రాధాన్యత పొందటం వల్ల బ్రహ్మ దేవుని ఆరాధన సర్వత్రా తగ్గిపోయింది.

 
బొల్లోజు బాబా







No comments:

Post a Comment