Wednesday, November 1, 2023

వేదబాహ్యులు

వేదబాహ్యులు 

భారతీయ తాత్విక పరంపరలో వేదాలను ప్రమాణంగా అంగీకరించని దర్శనాలలో బౌద్ధం, జైనం, చార్వాక, ఆజీవిక లు ముఖ్యమైనవి.

చార్వాకమతం

చార్వాకుడు అంటే అందమైన మాటలు (చారు-అందమైన, వాక్కు -మాటలు) చెప్పేవాడు అని అర్ధం. చార్వాకుడు ఒకడు కాదు. అనేకులు. ప్రాచీనభారతదేశంలో నాస్తికవాదానికి ప్రాతినిధ్యం వహించిన ఒకే ఒక శాఖ చార్వాకమతం. వివిధ కాలాలలో ఇది బృహస్పత్య, లోకాయత, వైతండిక అనే పేర్లతో పిలవబడింది. చార్వాకులు భిన్నకాలాలలో బార్హస్పతులు, లోకాయతులు, వైతండికులు అంటూ వివిధ పేర్లతో చెప్పబడ్డారు. వారందరినీ చార్వాకులుగా నేడు గుర్తిస్తున్నారు. అజితకేశకంబలి, మక్కలిగోశాలి, పూర్ణకాశ్యపుడు పాయాసి ఇంకా జాబాలి ఋషి, హరి వంశములో వేనరాజు లాంటి వారు చార్వాక భావాలను ప్రచారం చేసారు. హిందూ, (Naiyayika’s, Vedantins) బౌద్ధ, జైన మతాలు సైద్ధాంతికంగా చార్వాకులతో విభేదించి వారిని విమర్శించాయి.
***

చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణమును మాత్రమే అంగీకరించారు. ఇంద్రియములకు అందనివాటిని అంగీకరించలేదు. కొన్ని ప్రత్యక్ష ప్రమాణముకు తెలియవు. ఉదాహరణకు కొండపైన నిప్పు ఉందో లేదో చెప్పలేము. కానీ అక్కడ పైకి ఎగసే పొగ కనిపిస్తుంది. అప్పుడు ప్రత్యక్షప్రమాణముకు తెలిసే పొగను బట్టి నిప్పు ఉన్నదని ఊహ చేయవచ్చు. దీనినే అనుమానము అంటారు. పాపపుణ్యాలు, ధర్మాధర్మములు లాంటివి ఇంద్రియాలకు తెలియకున్నా వాటిని అనుమాన ప్రమాణముగా తీసుకొంటారు. జైన, బౌద్దులు ప్రత్యక్షము, అనుమానము అను రెండిటిని అంగీకరించారు.
ఇవి కాక- పిల్లిని బట్టి పెద్దపులిని ఊహించగలిగే జ్ఞానాన్ని ఉపమాన ప్రమాణం అని, ఇతరుల అనుభవాల ద్వారా తెలుసుకొన్న విషయాలను శబ్దప్రమాణమని అంటారు. ఈ నాలుగు ప్రమాణాల ద్వారా ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకొని జీవితంలో ధర్మార్ధ కామమోక్షాలనే పురుషార్ధాలను పొందాలని భారతీయ దర్శనాల సారాంశం . (దర్శనకర్తలు – దర్శనములు by చర్ల గణపతిశాస్త్రి)
చెవి, కన్ను, నాలుక, ముక్కు, చర్మము అనే పంచేంద్రియములు చెప్పినవి మాత్రమే ప్రమాణములుగా అంగీకరిస్తుంది చార్వాకమతం. ధర్మాధర్మములు, పాపపుణ్యములు , దేవుడు, జన్మాంతర విషయాలు లాంటివి అభౌతికాలు, ఇంద్రియగోచరములు కావు కనుక వాటిని చార్వాకులు అంగీకరించలేదు.
***
బార్హస్పత్య (Bārhaspatya/బార్హస్పత్య) పేరుమీదుగా “బార్హస్పత్య సూత్ర” గ్రంధం ఒకటి ఉండేదని ఇతర గ్రంధాల ద్వారా తెలుస్తుంది తప్ప అసలు ప్రతి లభించలేదు. ఇంతవరకూ “బార్హస్పత్య సూత్ర” గ్రంధంనుండి లభించిన సుమారు 60 శ్లోకాల ద్వారా ఇది భౌతిక వాదానికి చెందిన గ్రంథమని, దీనిలో నాస్తిక/చార్వాక సిద్ధాంతాలు స్పష్టంగా చెప్పబడ్డాయని అర్ధమౌతుంది. BCE 2 వ శతాబ్దానికి చెందిన “పతంజలి మహాభాష్య” లో బార్హస్పత్య సూత్ర ఉటంకించబడింది కనుక ఇది అంతకు పూర్వమే గ్రంథస్థం చేయబడి ఉండాలి. చార్వాక మతం బార్హస్పత్య పేరుతో కొన్నాళ్ళు మనుగడ సాగించింది.

చార్వాకమతానికే మరో పేరు లోకాయత. లోకమును మాత్రమే పట్టించుకొనే శాస్త్రం కనుక లోకాయతం అని పేరువచ్చింది. అంటే లోకులు పాటించేది అని అర్ధం. ఒక రకంగా “జనవేదాంతం”. తర్కం ప్రధానంగా ఉండే “లోకాయతం వేదవిరోధిని” అని మహాభారత వ్యాఖ్యాత నీలకంఠాచార్యుడు అన్నాడు.
లోకాయుత అన్న పదం మొదటగా కౌటిల్యుని అర్ధశాస్త్రంలో కనిపిస్తుంది. కౌటిల్యుడు లోకంలో- యోగ, సాంఖ్య, లోకాయత అంటూ మూడురకాల అన్వీక్షికులు (తర్కవేదాంతులు) ఉన్నారని వీరు తమ తర్కంతో, మతం వ్యాపారం న్యాయం వంటి వివిధ రంగాలను పరీక్షించి వాటిలోని లోపాలను ఎత్తిచూపుతారు” అంటాడు. ఇక్కడ చెప్పిన యోగ, సాంఖ్య స్కూల్స్ తో లోకాయత ఇమడదు ఎందుకంటే మొదటి రెండు వేదాలను అంగీకరిస్తాయి లోకాయత వేదవ్యతిరేకం. బహుశా తార్కికంగా వాదిస్తుంది కనుక కౌటిల్యుడు అలా చేర్చి ఉంటాడు.
 
CE 5 వ శతాబ్దపు బుద్ధఘోషుడు లోకాయతులను వైతండికులు అని వారి శాస్త్రాన్ని వైతండవాద శాస్త్రం (vitandavadasattham/ Science of Disputation) అని చెప్పాడు. లోకాయతులు(చార్వాకులు) ఇతరుల విశ్వాసాలను ఖండిస్తూ, వారికి ఏ విలువా ఇవ్వకుండా వాదిస్తారు కనుక వారిని వైతండికులని (vaitandika) పిలిచేవారు. అందరు లోకాయతులు అలా ఉండేవారు కారేమో అందుకే- తొమ్మిదోశతాబ్దపు కాశ్మిరీ జైన పండితుడు జయంత భట్ట- చార్వాకులను, ధూర్తులు, సుశిక్షితులు, గొప్ప పండితులు అని మూడురకాలుగా విభజించాడు. (రి. Lokāyata/Cārvāka: A Philosophical Inquiry Pradeep P. Gokhale పేనం. 15)

శంకరాచార్యులు భౌతికవాదులను/నాస్తికుల గురించి చెప్పవలసి వచ్చినపుడు వారిని లోకాయతికులు అన్నాడు తప్ప చార్వాక అన్న పదం వాడలేదు.
***
చార్వాక సిద్ధాంత మూలగ్రంథమైన Cārvākasūtra ఇంతవరకూ లభించలేదు కానీ దానిపై Aviddhakarṇa, Kambalāśvatara, Purandara లాంటి వారు రాసిన వ్రాసిన వ్యాఖ్యల ద్వారా చార్వాక సూత్రాలను కొంతమేరకు గుర్తించగలిగారు.
 
లోకాయుత/బృహస్పత్య/వైతండిక మతాన్ని ప్రచారం చేసే వ్యక్తులను సూచించటానికి చార్వాక అనే పదాన్ని మొదటగా ఉపయోగించినవాడు CE 7వ శతాబ్దానికి చెందిన పురందర (Purandara). ఇతను తనను, తన సహచరులను చార్వాకులని చెప్పుకొన్నాడు.
CE 8 వ శతాబ్దం వరకూ నాస్తిక/భౌతిక వాదాన్ని చెప్పటానికి బృహస్పత్య, లోకాయత, వైతండిక, చార్వాక అనే పేర్లు పర్యాయపదాలుగా వాడారు. క్రమేపీ చార్వాక అన్న పదం స్థిరపడింది. 15 వ శతాబ్దం వరకూ చార్వాకవాదం పై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఇక ఆధునిక కాలానికి వచ్చేసరికి చార్వాకుల గురించి మొదటగా Henry Thomas Colebrooke 1827 లో ఒక వ్యాసంలో ప్రస్తావించాడు. బౌద్ధ, జైన, హిందూ రచనలలో లభించే అనేక చార్వాక వాక్యాలను D.R. Shastri సేకరించి Cārvāka Darśana (1959) గ్రంథాన్ని రచించారు. సమకాలీనంగా Pradep P. Gokhale, Debiprasad Chattopadhyaya, Ramakrishna Battacharya వంటి వారు చార్వాకదర్శనంపై గొప్ప పరిశోధనా గ్రంథాలు వెలువరించారు.
****
.
చార్వాకమత సిద్ధాంతములు
.
చార్వాక దర్శనంలో ప్రదానమైన అంశాలు నాలుగు
ఎ. ప్రత్యక్షప్రమాణము మాత్రమే అంగీకారయోగ్యం
బి. చైతన్యం భౌతికమైనది
సి. జీవించేది సుఖించటానికే
డి. దేవుడు లేడు, స్వర్గనరకాలు లేవు. మరణాంతరజీవితం లేదు.

చార్వాకులు సూత్రీకరించిన అంశాలు, సంధించిన ప్రశ్నలు
.
1. భూమి, నీరు, నిప్పు, గాలి నాలుగు మాత్రమే ప్రత్యక్షములు. ఆకాశము లేదు.
 
2. ధర్మాధర్మములు, పాప పుణ్యములు, స్వర్గ నరకములు, అదృష్ట దురదృష్టములు అగోచరములు కనుక లేవు.
 
3.దేహంలో ఉండే చైతన్యమే ఆత్మ. వేరుగా ఆత్మలేదు

4. దేహంలోంచి ప్రాణం పోవటమే మోక్షం. కనుక మోక్షం కొరకు ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు తపస్సులు చెయ్యక్కరలేదు.
 
5. యజ్ఞంలో హింసించబడే పశువుకు స్వర్గప్రాప్తి లభించేటట్లయితే తండ్రినే హింసించి చంపి నేరుగా స్వర్గానికి పంపొచ్చు కదా!

6. శ్రాద్ధము మరణించినవారికి చేరేటట్లయితే, దూరదేశమేగినవారికి ఇంటినుంచే భోజనము పంపవచ్చు కదా!

7. ఇక్కడ ఇచ్చిన దానము పైలోకములలోని వారికి చేరేటట్లయితే, మేడ క్రింద ఇచ్చిన దానము మేడపై ఉండేవారికి చేరుతుందా!

8. జీవించినంతకాలమే ఆనందించగలం. చావుతరువాత ఏమీ లేదు
 
9. మరణించిన వ్యక్తి వేరేలోకాలకు వెళితే బంధువులను చూడటానికి ఒకసారైనా తిరిగిరాడేమి? ప్రేతకార్యాదులు కొందరకు ఒక రకమైన జీవనోపాధి

10. వేదాలు, ఆగమ శాస్త్రాలు వంటి ఏ మతగ్రంథాలనైనా జ్ఞాన హేతువులుగా భావించరాదు. వేదాలను రచించినవారు విదూషకులు, మోసగాళ్ళు, రాక్షసులు.
 
11. ఓ, దిగంబరులారా! (O,Jains), ఓ సన్యాసులారా! (O, Buddhists) దేహాన్ని కష్టపెట్టుకొంటూ అలా కఠోరమైన నియమనిష్టలతో జీవించమని మీకు ఎవరు చెప్పారు?

12. ఇంద్రియములకు తెలిసే జ్ఞానం మాత్రమే మనిషి వద్ద ఉంటుంది. విపరీతంగా చదువుకొన్న పండితులు మాత్రం “మిత్రమా చూసావా! ఈ తోడేలు పాదముద్ర ఏవేం సత్యాలు చెబుతోందో” అంటూ ప్రసంగిస్తారు. 

(తోడేలు పాదముద్ర అనేది ఒక పిట్టకథ. చార్వాకులు చెప్పారని ప్రచారంలో ఉంది.
ఒకడు తన చేతితో తోడేలు పాదముద్రను నేలపై చిత్రించి అదేమిటని సన్యాసులను అడుగగా, అది ఒక మనిషి చిత్రించి ఉండవచ్చనే కనీసఆలోచన లేకుండా వారు-- ఒక తోడేలు ఇక్కడ నిన్న రాత్రి సంచరించింది, తోడేలు పాదముద్ర కనిపించటం అదృష్టమని చెప్పినట్లుగా, కొందరు తెలివైన వంచకులు ఏ రకమైన హేతువు లేకుండా ఎదుటివారు ఏంతినాలి, ఏం తినకూడదు, ఎప్పుడు సంయోగం జరుపుకోవాలి, ఎప్పుడు జరుపుకోకూడదు, స్వర్గంలో ఏ ఏ రకాలైన సుఖాలుంటాయి అని చెబుతూ మోసగిస్తారు. ఏవి ప్రత్యక్ష ప్రమాణానికి అందుతాయో వాటినే విశ్వసించాలని, అగోచరాలు, ఊహాజనితాలు అయిన వాటిని నమ్మరాదని ఈ కథ అంతరార్థం.)

13. తపస్సు చేయటం దేహాన్ని బాధించుకోవటమే. ఉపవాసాలుండటం జీవితంలోని ఆనందాలను దూరంచేసుకోవటమే. యజ్ఞయాగాదులు చిన్నపిల్లల ఆటలు.
 
14 ఇంకా నిరూపించాల్సి ఉన్న అంశాలైన ఆత్మ, దేవుడు, మరో జన్మ, స్వర్గనరకాలు వంటి వాటి ద్వారా నిష్కపట మనస్కులు ఏ కొత్త జ్ఞానాన్ని పొందలేరు, వారి మనస్సులు కుటిల తార్కికులచే కలుషితం కానంతవరకూ (Bhattacharya, Ramakrishna. Studies on the Carvaka/Lokayata p.n 92)
***

చార్వాకులు సుఖవాదులని; వారికి నైతిక విలువలు ఉండవని; దేవుడిని అంగీకరించరని;, పాపపుణ్యాలను, ధర్మాధర్మాలను పాటించరని అటు బౌద్ధ, జైనులు, ఇటు బ్రాహ్మణవాదులు విమర్శించారు.
 
“ప్రాణం ఉండగనే దేన్నైనా ఆనందించగలం. అప్పులపాలైనా సరే నేతిని ఆరగించండి. కాలి బూడిదయ్యాకా దేహం తిరిగొస్తుందా” (jāvaj jīvet sukhaṃ jīved ṛṇaṃ kṛtvā ghṛtaṃ pibet | bhasmībhūtasya dehasya punar āgamanaṃ kutaḥ. ||)
 
పై వాక్యం ప్రసిద్ధిగాంచి మొత్తం చార్వాకవాదాన్నే నవ్వులపాలు చేసింది. 14 పైన వివిధ ప్రతుల్లో nāsti mṛtyor agocaraḥ అనే వాక్యం ఉండగా, సాయన-మాధవ సంగ్రహపరచిన “సర్వదర్శన సంగ్రహ” అనే ఒక గ్రంథంలో మాత్రమే ṛṇaṃ kṛtvā ghṛtaṃ pibet కనిపిస్తుంది. అంటే ఎవరో తుంటరి “ఎవరూ మృత్యువుకు అతీతులు కారు” అన్న చోట “అప్పులపాలైనా నేతిని ఆరగించండి” అనే వాక్యాన్ని ప్రక్షిప్తం చేసాడు. ఇది ఒకరకంగా చార్వాకసిద్ధాంతాన్ని చులకనచేయటానికే అంటాడు Bhattacharya, Ramakrishna (Bhattacharya, Ramakrishna. Studies on the Carvaka/Lokayata pno73, 124)


పురాణాలలో చార్వాకమతం

భారతీయపురాణాలు కాల్పనికత, చరిత్రల సమ్మేళనం. అనేక చారిత్రిక పాత్రలు పురాణపాత్రలుగా రూపుదిద్దుకోవటం గమనించవచ్చు. వాస్తవికతకు దగ్గరగా ఉండే పురాణ ఉదంతాల ద్వారా చారిత్రిక పాత్రలను సులభంగానే పోల్చుకోవచ్చును. చార్వాకదర్శనం యొక్క సూత్రాలు బ్రాహ్మణవాద సాహిత్యంలో అక్కడక్కడా కనిపిస్తాయి.
.
1. రామాయణంలో చార్వాక మతం (Ayodhya Kanda in Prose Sarga 109)

శ్రీరామచంద్రుడు తండ్రిమాటమీద అరణ్యవాసానికి బయలుదేరినపుడు ధశరధుని ఆస్థానపండితుడైన జాబాలి అనే బ్రాహ్మణుడు – “రామా! మనిషి ఒంటరిగా పుట్టి ఒంటరిగా మరణిస్తాడు. తల్లిదండ్రులపట్ల వాత్సల్యం కలిగినవాడు పిచ్చివాడు. తండ్రిమాటపై రాజ్యాన్ని త్యజించి అడవులలో నిన్ను నీవు హింసపెట్టుకోవటం నీ పని కాదు.
ఓ యువరాజా! అయోధ్య నీకొరకు ఎదురుచూస్తోంది. రాజభోగాలు అనుభవించు. తండ్రి ఎవరు నీకు? తండ్రికి నీవెవ్వడవు? మీ తండ్రిగారి శ్రాద్ధకర్మల పేరిట ఆహారాన్ని వృధాచేస్తున్నారు. మృతి చెందినవాడు తింటాడా? బలులు, దానాలు, యాగాలు ఇవన్నీ ప్రజలను లొంగదీసుకోవటానికి, ధనార్జనకు తెలివైన వారు పన్నిన పన్నాగం.
 
ఓ జ్ఞానీ! కంటికి కనిపించేవాటికి ప్రాధాన్యత ఇవ్వండి, అగోచరమైనవాటిని తిరస్కరించండి”- అని అన్నాడు.
 
జాబాలి మాటలకు రాముడు- “ఓ బ్రాహ్మణా! ఇది కర్మభూమి. దీనియందు పుణ్యపురుషులెప్పుడూ వేదవిహిత కార్యములు, పుణ్యకర్మలు ఆచరించాలి. నూరు యాగములు చేసి ఇంద్రుడు స్వర్గాధిపతి పదవిని సంపాదించెను. తపోనిష్టలతో ఎల్ల ఋషులు స్వర్గము పొందిరి. మీ సలహా వైదిక విరుద్ధము. అధర్మమార్గమున నడిచే నీవంటి నాస్తికుని, దుష్టుడని చేరదీసినందుకు నా తండ్రిని నిందించాలి.
 
వేద ప్రామాణ్యమంగీకరింపనట్టి నాస్తికుడును, బుద్ధుడును చోరునివలె నిరాకరింపదగినవారు. అట్టి వేదబాహ్యుడైన నాస్తికునితో వివేకి వ్యవహరింపరాదు” అన్నాడు. (అయోధ్యా కాండము, శ్రీమతి శ్రీమత్తిరుమల పెద్దింటి వెంకట సీతమ్మ)

పై సంభాషణ ద్వారా జాబాలి తనమాటలలో చార్వాకవాదాన్ని స్పష్టంగా పలికించాడు. దాని ఖండనను "రామో విగ్రహవాన్ ధర్మః'' అని కీర్తించబడిన రాముడి నోటి ద్వారా చెప్పించి చార్వాకవాదాన్ని పూర్వపక్షం చేయటానికి వాల్మీకి ప్రయత్నించినట్లు అర్ధం చేసుకోవాలి.
వేదాలను అంగీకరింపక శూద్రుడైన శంబూకుడు తపస్సు ఆచరించినందుకు శ్రీరాముడు అతడిని వధించిన రామాయణ ఉదంతం కూడా వేదాలను తిరస్కరించే నాస్తికులకు ఒక హెచ్చరిక.

2. భారతంలో చార్వాకుడి ప్రస్తావన

చార్వాకుడనెడి వాడు ఒక రాక్షసుడని, ధుర్యోధనుడి మిత్రుడని భారతములో ఉన్నది.
మహాభారతయుద్ధం ముగిసాక ధర్మరాజు విరాగియై రాజ్యం చేపట్టనని ఖిన్నుడై ఉండగా, మహర్షులు అతనికి కర్తవ్యం భోధించి రాజ్యాభిషిక్తుడిని చేసిన సందర్భములో చార్వాకుడు ఒక బ్రాహ్మణుడి వేషములో అక్కడకు వచ్చి ధర్మరాజును “నువ్వు స్వజనుల క్షయం గావించావు, నీవు ప్రజాపాలనకు తగవు, జ్ఞాతినాశనము, గురుజనహింస చేసిన నీవు జీవించుటకంటే మరణించుట మేలు” అని నిందించగా ఆ సభలోని విప్రోత్తములందరూ మీదపడి గాయపరచగా చార్వాకుడు చనిపోయాడు.
 
అలా మాట్లాడిన వ్యక్తి తమ వాడు కాదని, అతను ధుర్యోధనుని స్నేహితుడని, బ్రాహ్మణరూపంలో వచ్చిన రాక్షసుడని ధర్మరాజుకు ఆ బ్రాహ్మణులు సర్దిచెప్పారు.
ఆనాడు సమాజంలో ఆదరణ పొందుతున్న చార్వాక నెరేటివ్ ని ఖండించే కౌంటర్ నెరేటివ్ ఇది. కానీ ఇందులో "చార్వాక " పేరుతో చెప్పింది నాస్తికవాదం కాక యుద్ధం చేసి నువ్వు హింసకు పాల్పడ్డావు అంటూ అహింసావాదాన్ని చెప్పటం గమనార్హం.

3. చార్వాక మతంలో బృహస్పతి పాత్ర

బృహస్పతి దేవగురువు. అసురులు వేదోక్తంగా యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ తత్ఫలితంగా అమేయబలసంపన్నులై దేవతలను జయించసాగారట. దేవతలకు అసురులవలన కలుగుతున్న బాధలను తొలగించటానికి ఒక ఉపాయము చేసాడట. దీనిప్రకారం- అసురులకు వేదాలపట్ల గౌరవం తగ్గి, వారిని వేద నిందకులుగా మార్చటానికి, తద్వారా వారు నిర్వీర్యులవటానికి కొన్ని సూత్రాలను రచించాడట.
 
బృహస్పతి ఈ సూత్రాలను చార్వాకుడు అనే తన శిష్యుని ద్వారా ప్రచారింపచేసాడని, వాటి కారణంగా రాక్షసులు వేదనిందకులై యజ్ఞయాగాదులను నిలిపివేసి బలహీనులుకాగా వారిని దేవతలు సులువుగా ఓడించారని దేవీ భాగవతంలో ఉంది.
అలా చార్వాక మతం చేసిన బోధనలను దేవతల గురువైన బృహస్పతి చేసిన ఒక "యోచన"గా హిందూ పురాణాలు అప్రాప్రియేట్ చేసుకొన్నాయి. (ఇదే తరహా ఉదంతం ద్వారా మాయామోహనుడు పేరుతో బుద్ధుని బోధనలను అప్రాప్రియేట్ చేసుకొన్నట్లు విష్ణుపురాణంలో కూడా కనిపిస్తుంది)

4. భగవద్గీతలో చార్వాకదర్శనం

భగవద్గీత 16 వ అధ్యాయం, దైవాసురసంపద్విభాగ యోగం లో అసుర దైవ లక్షణాలను వివరిస్తూ కృష్ణుడు చార్వాకభావాలను అసురులకు ఆపాదిస్తూ ఇలా అంటాడు – “అసుర స్వభావం కలవారు ప్రవృత్తిని కాని నివృత్తిని గాని ఎరుగరు. వాళ్ళలో శౌచమూ, ఆచారమూ, సత్యమూ ఉండవు. జగత్తు మిధ్య అనీ, దానికి ధర్మా ధర్మాలు ఆధారము ఉండవని, ఈశ్వరుడే లేడనీ ఈ ప్రపంచములోని ప్రాణులు స్త్రీ పురుషుల కలయిక వలననే పుట్టాయని వారు అంటారు. అందుచేత ఈ జగత్తుకి కారణం కామమే అంటారు అసుర జనులు. ఈ దృష్టినే పట్టుకుని వేలాడుతూ వీళ్ళు ధర్మ భ్రష్టులై సంకుచిత బుద్ధులై, ప్రపంచానికి శత్రువులై, కౄరకర్ములై లోక నాశనం కోసం పుడతారు. (వికీ సోర్స్)
పై వాక్యాలు చార్వాకవాదానికి ప్రతివిమర్శగా రాసారని ఇట్టేపోల్చుకోవచ్చును. “అప్పుచేసైనా నెయ్యి తిను” అని ప్రక్షిప్తం చేసినట్లుగానే “ఈ జగత్తుకు కారణం కామమే” అని చార్వాకులు అన్నట్లు ప్రచారించారు. దీనికి ఆధారంగా చార్వాకమతానికి చెందినదని చెప్పబడే “kāma evaikaḥ puruṣārthaḥ” (కామం మాత్రమే పురుషార్ధం) అనే వాక్యాన్ని చూపుతారు. ధర్మార్ధకామ మోక్షాలను పురుషార్ధాలుగా చెప్పటం బ్రాహ్మణీయభావజాలం. తదుపరి జన్మ, మోక్షం లాంటి భావాలను అంగీకరించక, స్వేచ్ఛాజీవనాన్ని ప్రవచించిన చార్వాకులు పురుషార్ధాలు అనే చట్రాన్ని అంగీకరించి ఉంటారా అని Battacharya ramkrishna ప్రశ్నిస్తారు.

మహాభారతం వనపర్వంలో (33:57) చిన్నప్పుడు తండ్రి ఒడిలో కూర్చుని ఒక బ్రాహ్మణుడు చెప్పే బార్హస్పత్య సూత్రాలను ఏపనీ లేకపోయినా ఏదో పనికల్పించుకొని వెళ్లి వినేదానినని ద్రౌపతి ధర్మరాజుతో చెబుతుంది. (వనపర్వం నీతిం బృహస్పతిప్రొక్తాం భరాతౄన మే ఽగరాహయత పురా/తేషాం సాంకద్యమ అశ్రౌషమ అహమ ఏతత తథా గృహే)

ఆరుగురు గురువులు

BCE 5 వ శతాబ్దానికి చెందిన మగధరాజైన అజాతశత్రు ఒకరోజు రాజభవనం మిద్దెపై కూర్చుని తాత్వికచర్చ చేయటానికి సరైన సన్యాసి ఎవరున్నారు అని తన మంత్రులను అడగగా వారు- అజితకేశ కంబళ, పూరన కస్సప, మఖలి గోశాల, పకుధకచ్ఛాయన, సంజయబేలత్తిపుత్త, నిగంత్తనాతపుత్త అనే ఆరుగురి పేర్లు చెప్పి; వీరందరూ చాలాకాలంగా సన్యాసిజీవనాన్ని గడుపుతున్నారని, ప్రతిఒక్కరు తమదైన తాత్విక సంప్రదాయాన్ని నెలకొల్పి దానికి గురువులుగా ఉంటూ దాన్ని ప్రచారం చేసుకొంటున్నారని చెప్పారు. అదే సమయంలో అజాతశత్రు వ్యక్తిగత వైద్యుడైన జీవకుడు, ఆసమయంలో రాజగ్రుహలో సమీపంలో బసచేసి ఉన్న బుద్ధుని వద్దకు అజాతసత్రుని తీసుకొని వెళ్లాడని బౌద్ధ గ్రంథం Samannaphala Sutta లో ఉంది.

1. అజిత కేశకంబళ

BCE 6 వ శతాబ్దానికిచెందిన అజిత కేశకంబళ మొట్టమొదటి భౌతికవాది. ఇతను బుద్ధుని సమకాలీనుడు. ఇతనికి పూర్వం ప్రాచీనభారతీయ సాహిత్యంలో భౌతిక వాద ఛాయలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తిగా అజితకేశకంబళ పేరు ప్రాచీన భారతవేదాంత గ్రంధాలన్నింటిలో కనిపిస్తుంది. ఇతడు చెప్పినబోధనలకు సంబంధించిన వివరాలు నేరుగా దొరకవు. బౌద్ధ పాలి, జైన ప్రాకృత రచనలలో ఇతని గురించిన ప్రస్తావనలు విరివిగా లభిస్తాయి. వారు ఇతని సిద్ధాంతాన్ని స్మశానవైరాగ్యంగా అభివర్ణించారు. బౌద్ధ, జైన మతాలు అజితకేశకంబలను వారికి పోటీ దారునిగా చూసిన కారణంగా వారి వ్యాఖ్యలు అంత విశ్వసనీయమని భావించలేం. (రి. Studies on Carvaka/Lokayata by Battacharya ramkrishna pno28 )

అజితకేశ కంబళ బుద్ధుని కంటే వయసులో పెద్ద. ఇతను మనిషివెంట్రుకలతో చేసిన కంబళి వేసుకొని తిరిగేవాడు. Anguttara Nikaya (3.135) లో బుద్ధుడు అజితకేశ కంబళునిగురించి ఇలా అన్నాడు-“ఇతను వేసుకొనే వెంట్రుకల దుస్తులు చాలా అసౌకర్యం. వేసవిలో వెచ్చగా, శీతాకాలంలొ చల్లగా, దుర్వాసనవేస్తూ, దురదలు కలిగిస్తూ ఉంటాయి ” (The historical buddha, The times, Life and Teachings of the founder of Buddhism, Hans Wolfgang Schumann pn 221)

మగథ రాజైన అజాతశతృతో అజితకేశకంబళి చేసిన సంభాషణ Sāmañña-phala-sutta లో ఇలా ఉంది.
“ఓ మహారాజా! దానాలు, బలులు, నైవేద్యాల వల్ల ఏ ఫలితమూ లేదు. మంచి చెడు కర్మలంటూ ఏమీ లేవు. ఈ లోకము లేదు పర లోకమూ లేదు”.
పై వాఖ్యలోని చివరిభాగం మహాభారతంలో కనిపిస్తుంది. భీష్ముడు యుధిష్టిరునితో “కొంతమంది “ఈ లోకము లేదు పర లోకమూ లేదు” అని భావిస్తారు. అటువంటి నాస్తికులను నమ్మరాదు” అంటాడు. (శాంతిపర్వం131.13)

దాదాపు అదే వాక్యం భగవద్గీతలో కూడా కనిపిస్తుంది (4.40) సంశయంలో పడ్డవాడికి “ఈ లోకము లేదు పర లోకమూ లేదు”. సుఖం కూడా లేదు.

సమాధానం ఇవ్వకతప్పని వాదన చేసాడు అజితకేశకంబళ. దానికి ఒక చోట అలాంటి వారిని నమ్మరాదని, మరో చోట వారు సంశయవాదులని, వారికి సుఖం ఉండదని మహాభారతం ద్వారా బ్రాహ్మణవాదులు సమాధానం ఇచ్చారు. అజితకేశకంబళ చేసిన భావవాదపు శక్తి అది.
Dlgha Nikaya 2.23 లో అజితకేశకంబల ఇతర ప్రవచనాలు ఇలా ఉన్నాయి

1. మంచి చెడు కర్మలంటూ ఏమీ లేవు.
2. స్వర్గ నరకాలు ఏమీ లేవు.
3. తల్లి దండ్రి అంటూ ఎవరూ లేరు. వారికి చేసే మంచి చెడులకు ఫలితాలు ఏమీ ఉండవు
4. మరణించాక మరుజన్మ, ఆత్మ అంటూ ఏమీ ఉండవు. ఈ దేహంలోని మట్టి మట్టిలో, నీరు నీటిలో, గాలి గాలిలో, వెచ్చదనం నిప్పులో, ఆలోచనలు శూన్యంలో కలిసిపోతాయి.
5. మూర్ఖుడు, జ్ఞాని చనిపోయాకా ఒకేలా మట్టిగా మారతారు.
6. శవాన్ని నలుగురు స్మశానానికి మోసుకెళతారు. కొన్నాళ్లకు పావురంరంగులోకి మారి వెలిసిపోయిన ఎముకలు మాత్రమే స్మశానంలో మిగులుతాయి.
6. చనిపోయిన వ్యక్తిపేరిట దానదర్మాలు చేయటం అవివేకం
అజిత కేశకంబళి నెలకొల్పిన సంప్రదాయం CE 6 వ శతాబ్దపు చార్వాకుల వరకూ కొనసాగి ప్రశ్నించటం, వాదించటం, ధిక్కరించటం ఈ దేశ సంస్కృతికి, బహుళత్వానికి వెన్నుగర్ర అని నిరూపించింది.

2. పూర్ణ కాశ్యప/పూరన కస్సప

పూర్ణకాశ్యపుని గురించిన ఆధార గ్రంథాలు లభించవు. జైన బౌద్ధ రచనలలో ఇతనిని విమర్శిస్తూ చేసిన కథనాల ద్వారా ఇతను వేదాలను తిరస్కరించి, దిగంబరంగా సంచరిస్తూ, భౌతికవాదాన్ని ప్రవచించాడని అర్ధమౌతుంది. ఇతను- ఒక గృహబానిస అని, ఇంటినుండి పారిపోగా, దారిలో దొంగల దోపిడీకి గురయి కట్టుబట్టలుకూడ కోల్పోయి దిగంబరంగా సంచరిస్తూ, అందరిని అపహాస్యం చేస్తూ చివరకు నిరాశతో, దుఃఖితుడై చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడని బుద్ధ ఘోషుడు తన “సుమంగళ విలాసిని” అనే గ్రంథంలో పేర్కొన్నాడు (రి. Lokayata a Study in Ancient Indian Materialism, Debiprasad Chatopadhyaya pn 513)
 
పూర్ణ కాశ్యపుడు చాన్నాళ్ళు గృహస్థుగా జీవించాడని, సన్యసించాక తనకు వచ్చే భిక్షాన్ని నాలుగుభాగాలు చేసి మూడుభాగాలు బాటసారులకు, కుక్కలకు, కాకులకు, చేపలకు పంచి నాలుగోభాగాన్ని తను తినేవాడని - “భాగవతీ సూత్ర” అనే జైన గ్రంథంలో కనిపిస్తుంది.
పూర్ణ కాశ్యప బోధించిన వాటిలో ముఖ్యమైన అంశాలు-యజ్ఞయాగాదులు, కర్మకాండలు , పాపపుణ్యాలు, స్వర్గనరకాలు లేవు. మంచి చేస్తే పుణ్యం రాదు, చెడు చేస్తే పాపం అంటదు. దానధర్మాలు అర్ధరహితం. ఈ ప్రపంచం నియతిజనితం (ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది అనే వాదన /Every thing is born of destiny).
 
15 వ శతాబ్దపు జైనపండితుడు గుణరత్న తాను రచించిన “తర్క రహస్య దీపిక” అనే గ్రంథంలో పూర్ణ కాశ్యపుడు ప్రవచించిన నియతివాదాన్ని ప్రస్తావించాడు. పాలిరచనల్లో చెప్పిన పూర్ణ కాశ్యపుని బోధనలు రెండువేల ఏండ్ల తరువాత కూడా ఉటంకించబడటం భౌతికవాద దృక్ఫథపు బలంగా భావించాలి.

3. మఖలి గోశాల (చూడుడు అంతర్ధానమైన ఆజీవిక మతం వ్యాసం.)

4. పకుధ కచ్ఛాయన /ప్రకృత కాత్యాయనుడు
.
పకుధ కచ్చాయన భౌతికవాది. ఇతను కర్మవాదాన్ని అంగీకరించలేదు. ప్రకృతిలో భూమి, నీరు, అగ్ని, గాలి తో పాటు జీవితము, సుఖ, దుఃఖాలు కూడా ఉంటాయని చెప్పాడు. ఈ ఏడు అంశాలు స్థిరమైనవి, మార్పులేనివి ఒకదానిని మరొకటి ప్రభావితం చేయలేనివి అంటాడు. భౌతిక అంశాలతో పాటు అభౌతికాలైన జీవితము, సుఖదుఃఖాలను చేర్చటం అనేది కచ్ఛాయన సిద్ధాంతంలోని ప్రత్యేకతగా భావించాలి.

5. సంజయబేలత్తిపుత్త

సంజయబేలత్తిపుత్త స్పష్టమైన భౌతిక వాది. గోచరమైనవి తప్ప మిగిలినవాటిని నమ్మరాదని ప్రవచించాడు. ఇది కొంతమేరకు చార్వాకుల వాదం. ఇతను ఏ సమకాలీన సిద్ధాంతాలను అంగీకరించనూ లేదు ఖండించనూ లేదు. ఈ లోకంలో దేనిమీదా సంపూర్ణమైన అవగాహన ఉండదని, ఒకే అంశాన్ని భిన్నవిధాలుగా వ్యాఖ్యానించవచ్చుకనుక, ఇది మంచి, ఇది చెడు, ఇది సరైనది, ఇది తప్పు అని వాదులాడుకోవటం అర్ధరహితమని ఇతను అభిప్రాయపడ్డాడు. ఇది ఒక రకంగా సంశయవాదం. (skepticism). బుద్ధుని వద్ద శిష్యులుగా చేరకముందు సరిపుత్త, మహామొగ్గల్లన లాంటివారు సంజయవద్ద కొంతకాలం శిష్యరికం చేసారు.

6. నిగంత్తనాతపుత్త

జైన మతానికి చెందిన 24 వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు బౌద్ధసాహిత్యంలో నిగంత్తనాతపుత్త గా చెప్పబడ్డాడు. నిర్గ్రంథులతో (దిగంబరులు) చేతులు కలిపిన నాత వంశీకుడు అని అర్ధం. ఇతని నిజజీవిత పేరు వర్థమాన. సైన్యాద్యక్షుడైన తండ్రిపేరు సిద్థార్ధ, తల్లి త్రిశల. వైశాలి సమీపంలో ఇతను BCE 557 లో జన్మించాడు. ఇతనికి జైన మహావీర అనే బిరుదు కలదు. ఇతని తల్లిదండ్రులు పార్శ్వనాథుని బోధనలను ఆచరించేవారు. వారు సల్లేఖవ్రతం (Fast onto death) చేపట్టి మరణించాకా, వర్ధమాన మహావీరుడు తన ముప్పై ఏండ్లవయసులో ఇంటిని విడిచిపెట్టి శ్రమణ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతని బోధనలు జైన ధర్మానికి చెందినవి.
.
***
పాయాసి

ఇతను ఒక రాజు. బౌద్ధ, జైన, బ్రాహ్మణవాద మతాలకు వివిధ కాలాలలో వివిధ రాజుల ఆదరణ లభించి అవి ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. చార్వాక వాదానికి ఏ రకమైన రాజాదరణ లభించలేదు కానీ పాయసి అనే రాజు భౌతికవాదాన్ని కొన్ని జుగుప్సాకర ప్రయోగాల ద్వారా పరీక్షించి వాటి నిగ్గు తేల్చాలని చూసినట్లు కొన్ని బౌద్ధ జైన రచనలలో కనిపిస్తుంది.
ఆత్మ లేదు అని చార్వాకులు చెప్పారు. ఆత్మ ఉందాలేదా అనే విషయాన్ని తెలుసుకోవటానికి పాయాసి- ఒక దొంగను పెద్ద ఇత్తడి పాత్రలో ఉంచి దానిమూతను తగరంతో అతికింపచేసాడు. ఆ పాత్రలో దొంగచనిపోతే ఆత్మ ఏ విధంగా బయటకు వెళుతుందో చూడాలనుకొన్నాడు. మరొక ప్రయోగంలో పెద్దపాత్రలో ఉంచిన వ్యక్తి బరువు చనిపోకముందు చనిపోయాకా ఏమైనా తేడా ఉందా లేదా అని కూడా పరీక్ష చేసాడు. ఈ ప్రయోగాలన్నీ దేహాత్మవాదం నిగ్గు తేల్చటానికే.

ముగింపు

బౌద్ధజైనాలు చార్వాకులను అంగీకరించకపోవటానికి కారణం వారు పునర్జన్మను, నైతిక, ధార్మిక జీవనాన్ని విశ్వసించారు. ఈ లోకంలో తర్కం వెర్రితలలు వేయకుండా కొన్ని మతగ్రంథాలను ఏర్పరచుకొని వాటి ఆధారంగా ఒక పరిధి విధించుకొని జీవించటం ఉత్తమజీవనం అని నమ్మారు. వారికి చార్వాకుల తర్కం విచ్చలవిడితనంగాను, వితండవాదంగాను కనిపించింది. ఆకారణంగా బౌద్ధ, జైనులు చార్వాక సిద్ధాంతాన్ని తిరస్కరించి తమ గ్రంథాలలో చార్వాకసిద్ధాంతాలను ఖండించారు.
 
కూర్మపురాణం (CE 550-800) బౌద్ధులు, జైనులు, పంచరాత్రలు, కాపాలికులు, పశుపతులు అంటూ ఐదురకాల వేదబాహ్యులను పేర్కొనింది. పంచరాత్ర కల్ట్ మొదట్లో వేదబాహ్యంగా ఉన్నప్పటికీ క్రమేపీ వైష్ణవంలో కలిసిపోయి వేదావలంబిగా మారిపోయింది.
 
పదిహేనవ శతాబ్దంలో ఆంధ్రదేశంలో బౌద్ధులు, చార్వాకులు, జైనులే కాక పాషండులు, కాపాలికులు, పాశుపతులు పేర్లతో నాస్తికులు ఉన్నారని శృంగార నైషద పద్యంలో (7-127) శ్రీనాథుడు చేసిన వర్ణనను బట్టి తెలుగునేలపై ప్రాచీన వేదబాహ్య జీవనవిధానాలు నిన్నమొన్నటి వరకూ మనుగడ సాగించాయని, ఇక్కడి ప్రజలు సాంస్కృతికంగా వైవిధ్యాన్ని కలిగిఉండేవారని అర్ధమౌతుంది.
***
భిన్న ప్రాచీన భారతీయ దర్శనాలు ఒకదానినొకటి కబళించే శతృశిబిరాలుగా లేవు. వేరు వేరు సంప్రదాయ శాస్త్రాలుగా సమాంతరంగా మనుగడ సాగించాయి. ఇవి ఒకదాని లోపాలను మరొకటి ప్రశ్నించుకొంటూ ఒకదానినొకటి పూరించుకొంటూ సాగాయి తప్ప ఒకదానినొకటి తొలగించుకోలేదు. అగ్నివేషుడు, కౌటిల్యుడు, వాల్మీకి, వ్యాసుడు లాంటి వారు తాము నమ్మిన విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అప్పటికి ప్రచారంలో ఉన్న అన్ని దర్శనాలను తమరచనలలో ఉటంకించారు. వాటిలోని అసంబద్దతలను ఖండించారు. వైరుధ్యాలను కలిగిఉండటం మానవ మేథ యొక్క భిన్నపార్శ్వాల ఆవిష్కరణగా చూసారు.

 
బొల్లోజు బాబా


సంప్రదించిన పుస్తకాలు

1. Bhattacharya, Ramakrishna. Studies on the Carvaka/Lokayata
2. The historical buddha, The times, Life and Teachings of the founder of Buddhism, Hans Wolfgang Schumann
3. Lokayata a Study in Ancient Indian Materialism, Debiprasad Chatopadhyaya
4. దర్శనకర్తలు – దర్శనములు by చర్ల గణపతిశాస్త్రి
5.Lokāyata/Cārvāka: A Philosophical Inquiry Pradeep P. Gokhale
6. History and Doctrines of THE AJIVIKAS, AL Bhasham
7. ON HINDUISM Wendy Doniger
8. చార్వాక దర్శనం – డా. కత్తి పద్మారావు
9. ఆస్తికత్వము by వారణాసి సుబ్రహ్మణ్యం
10. అయోధ్యా కాండము, శ్రీమతి శ్రీమత్తిరుమల పెద్దింటి వెంకట సీతమ్మ

1 comment: