Wednesday, November 8, 2023

భిన్నమతాలలో ఉమ్మడి పాత్రలు - విష్ణుమూర్తి


వైదిక మతంలో విష్ణువు ప్రస్తావనలు రుగ్వేదంలో కనిపిస్తాయి. నారాయణుడే సత్యము, నిత్యము, ఆకాశమూ భూమి, యజ్ఞము విష్ణు స్వరూపము అంటూ విష్ణుమూర్తి రుగ్వేదంలో కీర్తించబడ్డాడు. అయినప్పటికీ విష్ణువు ఇంద్రుడు, అగ్ని లవలె ప్రధాన దైవం కాదు. యుద్ధాలలో ఇంద్రునికి సహాయంగా ఉండేవాడు కనుక విష్ణువును ఉపేంద్రుడు అన్నారు.
BCE రెండవ శతాబ్దంలో పంచరాత్ర కల్ట్ ప్రముఖ ఆరాధనా విధానంగా ఉండేది. వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షన, బలరామ మరియు అనిరుద్ధ అనే ఐదుగురు దేవుళ్ళను కొలిచే విధానం ఇది. ఈ కల్ట్ వేదాలను అంగీకరించలేదు. ఈ పంచరాత్ర లోని వాసుదేవుని పేరు మీదుగా గ్రీక్ అంబాసిడర్ Heliodores విదిశ లో గరుడ స్తంభాన్ని నిలబెట్టాడు. ఈ కల్ట్ ప్రబలంగా ఉండే కాలానికి విష్ణువు ఇంకా ప్రధాన దైవంగా మారలేదు.
గుప్తుల కాలంలో CE నాలుగు నుంచి ఆరో శతాబ్దం మధ్య వైష్ణవం ప్రధాన ఆరాధనా విధానంగా రూపుదిద్దుకొంది. పురాణకాలం నాటికి ఇంద్రుడు, అగ్ని, మైత్రి, ప్రజాపతి లాంటి వైదిక దేవుళ్ల స్థానాన్ని విష్ణువు స్వీకరించాడు. వేదాలలో ప్రజాపతి (బ్రహ్మ) నిర్వహించిన అవతారాలు ఎత్తటం అనే ప్రక్రియ విష్ణువుకు బదలాయించారు.
***

బౌద్ధ జైనాలలో విష్ణువు కనిపించడు. విష్ణువే బుద్ధునిగా, రిషభనాథునిగా అవతారాలు ఎత్తినట్లు హిందూ పురాణాలలో కనిపిస్తుంది.

మాయామోహనుడు

విష్ణుపురాణంలో మాయామోహనుడు పేరుతో ఒక కథ ఉంది. ఒక కాలమందు అసురులు వేదవేదాంగములను అధ్యయనం చేసి, వైదిక యజ్జయాగాదులు నిర్వహిస్తూ శక్తివంతులై దేవతలచే ఓటమిలేనివారైనారు. దేవతలందరూ శ్రీ మహావిష్ణువును కలిసి మొరపెట్టుకోగా, ఆయన తనకు మారుగా ఒక మాయామోహన రూపాన్ని సృష్టించి రాక్షసులను ఓడించటానికై దేవతలకు సహాయపడమని పంపించాడు. ఈ మాయామోహనుడు ఒక సన్యాసి రూపం ధరించి నర్మదా నదీతీరములో తపస్సుఆచరిస్తున్న రాక్షసులచెంతకు పోయి వారి గౌరవపూజలందుకొని వారిని దీవించి వారితో ఇలా అన్నాడు “మీరు పరలోక సుఖములు పొందాలని వేదపారంగతులై జీవిస్తున్నారు, కానీ పరలోకం అంటూ ఏమీ ఏమీ లేదు, వేదశాస్త్రములు అబద్దములు, యజ్ఞయాగాదులు ఆచరించిన ముక్తి పొందుతారనటం అసత్యం” అంటూ అనేక వేదనిందా సమర్ధములైన శాస్త్రాలను వారికి బోధించగా, వారు మాయామోహనుడి మాటలను నమ్మి వేదాలను విడిచి వైదిక క్రియలను మరచి యజ్జయాగాదులను నిందించసాగారట. ఆ రాక్షసులు మాయామోహనుడి మాయకులోబడి వేదబహ్యులుగా మారగానే దేవతలు వారిపై దాడిచేసి చాలా సులభంగా వారిని జయించారట. [1]

పైన మాయామోహన రూపంలో విష్ణుమూర్తి చెప్పినవి బౌద్ధ, జైన, చార్వాక బోధనలుగా ఇట్టే పోల్చుకొనవచ్చును. పై కథ ద్వారా హిందూధర్మావలంబులు అప్పటికి ప్రత్యర్ధిగా ఉండిన అన్యమతస్థులను ఎలా నిర్మూలించేందుకు యత్నించారో తెలుస్తుంది.

పై కథలో మాయామోహన వ్యక్తి ఎవరో పోల్చుకోలేము కానీ ఆ తరువాతి గాథలలో ఆ వ్యక్తి బుద్ధునిగా, విష్ణువు అవతారాలలో ఒకటిగా చెప్పటం ద్వారా ఆ వ్యక్తి బుద్ధుడని ఊహించవచ్చు. ఈ మాయా మోహన ఉదంతం బుద్ధుని బోధనలైన అహింస, జంతుబలుల నిరసన గంపగుత్తగా హిందూ ధర్మంలోకి తీసుకొనే ప్రయత్నమని అర్ధమౌతుంది. అదే సమయంలో ఆ మాయామోహన వ్యక్తి- "నగ్నంగా, నెమలి ఈకలగుత్తి చేతబూనిన ముని" అంటూ చేసిన వర్ణనల ద్వారా అతన్ని జైన మునిగా కూడా పోల్చుకొనవచ్చును. ఎందుకంటే జైన మునులు దిగంబరులు, నేలపై నడిచేటపుడు కీటకములకు హానికలుగకుండా నెమలీకల గుత్తితో నేలను చిమ్ముకొంటూ నడిచేవారు. [2]

విష్ణుపురాణం CE 4-6 శతాబ్దాల గుప్తులకాలంలో రాయబడింది. అప్పట్లో జైన బౌద్ధాలు సమాజంలో ప్రబలంగా పాతుకొని ఉన్నాయి. ప్రజలను తమవైపు తిప్పుకోవటానికి బౌద్ధ జైన బోధనలు “విష్ణుమాయ” గా అభివర్ణించటం ద్వారా జైన బౌద్ధ విశ్వాసులను ఆకర్షించే యత్నంగా ఈ మొత్తం ఉదంతాన్ని అర్ధం చేసుకోవాలి.
***

జైనమత మొదటి తీర్థంకరుడైన రిషభనాథుని చరిత్రను తెలుపుతూ తొమ్మిదో శతాబ్దంలో జినసేనుడు రచించిన ఆదిపురాణంలో - ఈ చరాచర సృష్టిని కల్పించిన హిందూపురాణాలలోని బ్రహ్మపాత్రను రిషభనాథునికి ఆపాదించి బ్రహ్మను ఒక మామూలు దేవుడిగా వర్ణించాడు.
ఈ చర్యకు ప్రతిగా అన్నట్లు పదోశతాబ్దంలో రాయబడిన భాగవత పురాణంలో రిషభనాథుడిని విష్ణుమూర్తి అంశగా చెప్పటం ద్వారా జైనమత స్థాపకుడినే హిందూధర్మం తనలో ఒక పాత్రగా కలుపుకోవటం జరిగింది.

ప్రజలలో ఉన్న జంతుబలులను అరికట్టటానికి విష్ణువు బుద్ధునిగా అవతరించాడు అని పన్నెండో శతాబ్దపు గీతగోవిందంలో జయదేవుడు అనటాన్ని- బౌద్ధ జైన ప్రబోధాలను హిందూమతం తనలో విలీనం చేసుకోవటమే కాక వాటి ఉపదేశాలలోని మంచిని గ్రహించే ప్రయత్నంగా కూడా దీన్ని చూడాలి. [3]

ధర్మసంస్థాపన కొరకు విష్ణుమూర్తి వివిధ అవతారాలు ఎత్తినట్లు చెప్పే పురాణాలన్నీ హిందువులు తమ చరిత్రను నిక్షిప్తం చేసుకొన్న రచనలు. ఇదే తరహాలో బౌద్ధ జైనాలు కూడా తమ చరిత్రను సాహిత్యం ద్వారా వ్యక్తీకరించుకొన్నాయి. 24 తీర్థంకరులు జన్మించి, సన్యసించి, ప్రవచించి సిద్ధలోకాలను చేరుకొన్నట్లు జైన మత సాహిత్యం చెబుతుంది. వీరిలో BCE తొమ్మిదో శతాబ్దపు రిషభనాథుడు తొలితీర్థంకరుడు కాకా, BCE ఆరోశతాబ్దపు మహావీరుడు చివరి తీర్థంకరులు. CE మూడవ శతాబ్దంలో రాయబడిన Paumacariya జైన గ్రంథంలో ఈ ఇరవై నలుగురు తీర్థంకరులగురించి ఉంది.

బౌద్ధ థెరెవాదానికి చెందిన “బుద్ధవంశ” గ్రంధంలో ఇరవై నలుగురు బుద్ధులు ఉన్నారు. వీరి వరుస దీపాంకర బుద్ధుడు తో మొదలై చారిత్రిక గౌతమ బుద్ధునితో ముగుస్తుంది. వీరు వివిధ యుగాల్లో జీవించినట్లు, వారి బోధనలు, కార్యాలను ఈ గ్రథం వివరిస్తుంది. ఈ బుద్ధవంశ గ్రంథం BCE 2/3 శతాబ్దాలలో రాయబడిందని చరిత్రకారుల అభిప్రాయం. ఇక ఈ 24 అనే సంఖ్యను జైనుల నుంచి బౌద్ధులు గ్రహించారా లేక బౌద్ధులనుంచి జైనులు గ్రహించారా అనేది ఇతమిద్దంగా చెప్పలేం. 24 సంఖ్య అనేది ఆయా ఆథ్యాత్మిక మార్గాలలో బోధనలందించిన గురుపరంపరగా గుర్తించాలి.
***

బౌద్ధంలో కనిపించే అవలోకితేశ్వర బోధిసత్వునికి, విష్ణుమూర్తి విగ్రహానికి; శయనించే బుద్ధునికి, శేషతల్పంపై పడుకొన్న అనంతశయన విష్ణుమూర్తి కి ఐకనోగ్రాఫికల్ పోలికలు కనిపిస్తాయి. ఏది ముందు ఏది వెనుక అనేది నిర్ధిష్టంగా చెప్పలేం కానీ బౌద్ధ, వైష్ణవ శిల్పరీతులు ఒకదానినొకటి ప్రభావితం చేసుకొన్నాయని సులభంగానే అర్ధమౌతుంది.

బొల్లోజు బాబా

[1]ఆంధ్ర శ్రీవిష్ణుపురాణము by వెన్నలకంటి సూర్యనారాయణ పే.నం. 186
[2]Shared Characters in Jain, Buddhist and Hindu Narrative by Naomi Appleton pn. 83
[3]Doniger O’Flaherty, The Origins of Evil, 204–11.





No comments:

Post a Comment