Thursday, November 30, 2023

భిన్నమతాలలో ఉమ్మడి పాత్రలు - యక్షులు


.
యక్షులు, నాగులు, గంధర్వులు, కుబేరుడు, మాతంగులు లాంటి వారు జైన, బౌద్ధ, హిందూ పురాణాలలో కనిపిస్తారు. BCE 3 వ శతాబ్దం నుంచి వీరి శిల్పాకృతులు లభిస్తున్నాయి.
యక్షులు
యక్షులు/వీరు నగరం, గ్రామం, వనం, సరస్సు, నుయ్యి లాంటి వాటిని సంరక్షించే ఇష్టదేవతలు. యక్షులను పూజించటం వేదాలకు పూర్వమే ఉన్న సంప్రదాయం. వేదాలలో వీరు “ఇతరజనులు” గా పేర్కొనబడ్డారు. యక్షుడు పురుష, యక్షిణి స్త్రీ.
బౌద్ధసాహిత్యంలో యక్షిణిలు వృక్షాలతో సహవాసం చేస్తూ ఉంటారు. BCE మూడోశతాబ్దానికి చెందిన సాంచి స్తూపంపై వృక్షదేవతా యక్షిణి ప్రతిమలు అనేకం ఉన్నాయి. ఈ బౌద్ధ వృక్షదేవత అర్ధసమ భంగిమలో ఒక చేతితో చెట్టుకొమ్మను పట్టుకొని, దేహాన్ని విల్లులా వంచి నిలబడే నర్తకి motif కాలక్రమేణా హిందూ శిల్పాలలో సాల వృక్షాన్ని (ఏగిస చెట్టు) ఆశ్రయించి సొగసుగా నిలుచునే సాలభంజిక గా రూపాంతరం చెందింది.
***
జైన తీర్థంకరుల మంచి చెడులు పర్యవేక్షించటానికి ఇంద్రుడు యక్షులను నియమించాడు. ఒక్కో తీర్థంకరుని విగ్రహం పైన కుడివైపున యక్షుడు, ఎడమవైపున యక్షిణి దంపతులు పూలమాలలు ధరించి ఉంటారు. నిజానికి మొదట్లో వీరు తీర్థంకరుల సేవకులు. క్రమేపీ అంబిక, సరస్వతి, పద్మావతి లాంటి సేవక యక్షులను నేరుగా పూజించసాగారు.
.
1. జైన అంబికా దేవి
.
ఇరవై రెండవ తీర్థంకరుడైన నేమినాథుని యక్షిణి అంబికాదేవి. ఈమె సింహవాహిని. సంతానాన్ని ఇచ్చే దేవత.. మామిడి చెట్టు క్రింద ఇద్దరు పిల్లలను ఎత్తుకొనిఉంటుంది. ఈమె తన భర్త అయిన శర్వణ/గోమేధ యక్షునితో కలసి కొన్ని శిల్పాలలో కనిపిస్తుంది. ఈమెకే కూష్మాండిని అనే పేరుకూడా కలదు. ఈమె కాకతీయుల కాకతిదేవి అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.
మహారాష్ట్ర, జున్నార్ గుహలలో CE 2వ శతాబ్దానికి చెందిన అంబికాదేవి శిల్పం అత్యంత ప్రాచీనమైనది. CE 6 వ శతాబ్దానికి చెందిన అంబిక శిల్పం అమెరికాలో Los Angeles County Museum of Art భద్రపరచబడి ఉంది. CE 8 శతాబ్దపు శిల్పం అమెరికా రాయల్ ఆంటారియో మ్యూజియంలో ఉంది. CE 9 వ శతాబ్దపు అంబికాదేవి శిల్పం ఎల్లోరా 34 వ నంబరు గుహలో కలదు.
హిందూ ఐకనోగ్రఫీలో సింహవాహిని - అంబిక, పార్వతి, దుర్గ, చండి, భద్రకాళి, సర్వమంగళ, అపరాజిత, వింధ్యవాసిని, మహిషాసుర మర్ధిని, కాళికాదేవి అంటూ వివిధపేర్లతో అనేక బాహువులతో, వివిధ ఆయుధాలతో దర్శనమిస్తుంది.
.
2. జైన సరస్వతి
.
బుద్ధి, జ్ఞానం, సంగీతాలకు అధిష్టాన దేవత సరస్వతి దేవి. సరస్వతీ నది ఒడ్డునే వేదవాజ్ఞ్మయం విలసిల్లింది. దిగంబర జైనులు కొలిచే సరస్వతి నెమలిని వాహనంగాను, శ్వేతాంబర జైనసరస్వతి లేదా హంస ను వాహనంగా కలిగి ఉండే యక్షిణిదేవత. ఈమెకు శృతదేవి (వాక్కు నిచ్చే దేవత) అని మరొక పేరు. జైన శిల్పాలలో సరస్వతిదేవి చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. జైన సరస్వతి శిల్పాలు CE 1 వ శతాబ్దం నుంచి కనిపిస్తాయి. బౌద్ధ సరస్వతిదేవి కి ప్రజ్ఞాపారమిత అని పేరు.
సరస్వతి దేవి శిల్పానికి నాలుగు చేతులుంటాయి. ఈ చేతులలో పుస్తకం, కమండలం, రుద్రాక్ష మాల మరొక చేయి వరదముద్రను కలిగి ఉంటాయి. కొన్ని శిల్పాలలో వీణ వాయిస్తూ ఉంటుంది.
అత్యంత ప్రాచీనమైన ఒకటో శతాబ్దానికి చెందిన జైన సరస్వతి ప్రతిమ మధురలో లభించింది. ఈమె కు రెండుచేతులు మాత్రమే కలవు. ఒకచేతిలో పుస్తకము, మరొక చేయి అభయహస్త ముద్రలో ఉన్నట్లు తెలుస్తుంది. తల లేదు.
.
3. జైన పద్మావతి

.
పార్శ్వనాథుని సేవించే యక్షిణి పద్మావతి. కామత్ అనే ఒక యోగి కట్టెలను మండిస్తూ యాగాన్ని నిర్వహిస్తుండగా, అలా మంటలతో యాగం నిర్వహించటం వల్ల జీవరాశి మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని- అప్పటికి తీర్థంకరునిగా ఇంకా మారని పార్శ్వనాథ యువరాజు కామత్ ను వారించాడు . ఆ మండుతున్న ఒక కట్టెలోంచి వేడిని తాళలేక రెండు పాములు బయటకు వచ్చి చనిపోయాయి. ఇవి తదుపరి జన్మలో నాగలోకంలో ధరణేంద్ర, పద్మావతి గా తిరిగి జన్మించాయి. కామత్ కూడా మేఘాలను శాసించే మేఘమాలిగా జన్మించాడు.
పార్శ్వనాథ యువరాజు ముప్పై ఏండ్లవయసులో ఈ లోకాన్ని పరిత్యజించి పార్శ్వనాథునిగా అవతరించాడు. ఒకనాడు ఈయన తపస్సు చేస్తున్నపుడు మేఘమాలి భీకరమైన వర్షాన్ని, ఉరుములను తీవ్రమైన వరదను పంపించి తపోభంగం కావించాలని ప్రయత్నించాడు. నాగలోకపు రాణి అయిన పద్మావతి ఆ ఉత్పాతం నుండి పార్శ్వనాథుని పైకి లేపి, తన పడగలతో గొడుగుపట్టి కాపాడింది. అందుకు గాను పార్శ్వనాథుడు ఆమెకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి గౌరవించాడు. ఏదేని జైన విగ్రహం తలపై ఏడు పడగల సర్పం ఉంటే ఆ విగ్రహం పార్శ్వనాథునిదని ఇట్టే గుర్తించవచ్చు.
 
జైన పద్మావతీదేవికి అనేక ఆలయాలు ఉన్నాయి. పద్మావతి దేవి విగ్రహాన్ని పద్మ ఆసనం, శిరస్సుపైన గొడుగుపట్టే నాగపడగలు, చేతిలో పద్మము, ఫలము, రుద్రాక్షమాల, అంకుశము లాంటి ప్రతిమా లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.
***

బౌద్ధ జైన సంప్రదాయాలలో యక్షులు రక్షణ, ఆరోగ్యం, సంపద మరియు సంతానాన్ని ప్రసాదిస్తారని ప్రజల విశ్వాసం. హిందూమతంలో యక్షుల ప్రత్యక్ష ఆరాధన కనిపించదు. బౌద్ధ జైన యక్ష ఐకనోగ్రఫికల్ నమూనాలను హిందూమతంలోని దేవతా మూర్తులుగా స్వీకరించటం గమనించవచ్చు.
 
బొల్లోజు బాబా









5 comments:

  1. హిందూ పురాణాలను కాపీ చేసి పేష్టు చేసుకుంటే పోలికలు రాక ఎలా ఉంటాయి?

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. హిందూపురాణాలు ఎప్పుడు రాయబడ్డాయో ఒకసారి తెలుసుకోండి. చాలామట్టుకు పురాణాలు క్రీశ 3 నుండి 10 వ శతాబ్దాల మధ్య రాయబడ్డాయి.

      రిఫరెన్స్- ON HINDUISM by Wendy Doniger chapter: A CHRONOLOGY OF HINDUISM, pn 22

      ఇక్కడ మాట్లాడుతున్నది క్రీపూ 3 వ శతాబ్దం నుండి లభిస్తున్న ఆర్కియలాజికల్ ఆధారాలు.

      Delete
  2. చూసారా మన చరిత్రను మనం పాశ్చాత్యులు చెప్పినట్లే తెలుసుకోవాలి. Wendy Doniger may have done some good work. A lot of westerns have done a lot of good work. They told us who we are and we know about ourselves only after they told us and not before. Any knowledge that existed before these westerners enlightened us is considered unauthentic and called useless. Great.

    ReplyDelete
    Replies
    1. మనవాళ్ళు చెప్పె
      30,67,20,000 సంవత్సరాలు, 30,84,48,000 సంవత్సరాలు,
      4,31,82,72,000 మానవ సంవత్సరాలు అంటు చెప్పే అశాస్త్రీయ లెక్కలను నమ్మేదెలా? మానవజాతి ఆవిర్భావం 3 లక్షల సంవత్సరాల క్రితం అని, నాగరికత ఐస్ ఏజ్ ముగిసిన 12000 సంవత్సరాలనుంచి అని సైన్సు చెబుతుంది. ఈ రెండిటికి కోట్ల సంవత్సరాల వ్యత్యాసం కనిపిస్తుంది. పొంతనే కుదరదు.

      విశ్వాసం తర్కాన్ని మింగేస్తుందనే విషయం మీకు తెలియనిదా సర్?

      Delete