Monday, December 4, 2023

నాగులు -ప్రాచీన భారతదేశ పాలకులు

ప్రాచీన భారతదేశాన్ని పాలించిన వారిలో నాగులు ముఖ్యమైన జాతి. సర్పారాధకులు. అనార్య, వేదపూర్వ, స్థానిక తెగలు. వీరిలో- Ahivritra, Ashwasena, Takshaka, Gonanda, Karkota, Brahmadutta, Sisunaga, Nanda, Andhra/satavahanas మొదలగు నాగజాతులు BCE 500 నుండి CE 500 వరకూ భారతదేశంలోని పలుప్రాంతాలను పాలించారు. వీరిని ”నాగులు” అని సంస్కృతంలో పిలవడానికంటే ముందు ఏ పేరుతో పిలువబడ్డారో తెలియరాదు.

సింధులోయ నాగరికత ప్రజలలో నాగారాధన ఉండేదని చెప్పే కొన్ని ముద్రలు లభించాయి.


1. సింధులోయ నాగరికత – నాగ ఆరాధన

భారతదేశానికి సంబంధించిన సామాజిక పరిణామక్రమంలో సింధులోయ నాగరికత (3300–1300BCE) అత్యంత పురాతనమైనది. ఈ కాలానికి చెందిన కొన్ని ముద్రలలో నాగ ఆకృతులు కనిపించటాన్ని బట్టి భారతీయ తాత్విక చింతనలో నాగారాధన అనేది ఒక ముఖ్యమైన భాగమని అని తెలుస్తుంది. ఒక ముద్రలో ఎద్దు తల కలిగిన ప్రధాన దైవానికి ఇరువైపులా ఇద్దరు భక్తులు చేతులుజోడించి నమస్కరిస్తూ ఉంటారు. ఒక్కొక్కరి వెనుక ఒక్కో సర్పము నిలబడి వారి శిరస్సును కప్పుతూ ఉండటం గమనించవచ్చు.

మరొక ముద్రలో ఒక యోధుడు వృషభంతో ఆయుధంతో పోరాడుతూంటాడు. ఆ వృషభానికి వెనుక ఒక సర్పము తోకపై నిలుచుని ఉంటుంది. ఈ ముద్ర ద్వారా ఏం చెప్పదలచుకొన్నారో ఇతమిద్దంగా అర్ధం కాదు కానీ సర్పము ఒక ప్రధాన చిహ్నంగా ఉండటం నాగారాధన యొక్క ప్రాచీనతను బలపరుస్తుంది.

నాగశిల్పాలు దక్షిణభారతదేశంలో అడుగడుగునా కనిపిస్తాయి. సంతానం లేని స్త్రీలు పిల్లలు పుట్టాలని, అవివాహితులు వివాహం కావాలని మొక్కుకొని, కోరికతీరాక నాగశిల్పాలను దానం చేస్తారు. వీటిని ఎక్కువగా ఊరిపొలిమెరల వద్ద, ఆలయాలలో రావి చెట్టు కింద లేదా కోనేరు గట్టున ప్రతిష్టిస్తారు. ఈ శిలలపై నాగుపాము పడగవిప్పి, మెలికలు తిరిగి, తోకపై నిలుచున్నట్లు ఉంటుంది. లేదా జంటనాగులు పెనవేసుకొని ఉంటాయి. ఈ సంప్రదాయపు మూలాలు ఐదువేల సంవత్సరాల క్రితపు సింధులోయనాగరికతలో ఉండటం ఈ నేల పురాతనత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

2. వేదాలలో నాగుల ప్రస్తావనలు

ఋగ్వేదంలో వృత్రాసురుడు అనే వేదపూర్వుని కథ కలదు. ఇతనికి అహి అనే పేరు కూడాఉంది. వృత్ర అంటే ఆవరించుట అని అర్ధం అహి అంటే సర్పం అని. వృత్రాసురుడు వివిధ సందర్భాలలో దస్య, దాస, అసుర అనే పేర్లతో సంబోధించబడ్డాడు. ఈ వృత్రాసురుడు నదులను ఒక పెద్ద సర్పం వలే ఆవరించి వాటి ప్రవాహాన్ని నిలుపుచేసాడట. ఇంద్రుడు వృత్రుని తో హోరా హోరీ యుద్ధం చేసి, ఇతని ధాటికి తాళలేక మూర్చపోయాడు. వృత్రుడిని గెలవటం కష్టమని తలచిన ఇంద్రుడు, బ్రహ్మ సలహాతో అతనితో వెయ్యేండ్లపాటు స్నేహం చేసి దెబ్బతీసే అవకాశం కొరకు ఎదురుచూడసాగాడు. వృత్రుడు శివభక్తుడు. ఒకరోజు శివపూజమరచిన సమయంలో ఇంద్రుడు విష్ణువు సహాయంతో వృత్రుడిని సంహరించాడు.

స్థానిక జాతులు (అనార్యు/వేదపూర్వ/Indigenous people) వ్యవసాయం చేసేవారు. వృత్రునికి అహి(సర్పము) అన్న పేరు కూడా ఉంది కనుక ఇతను స్థానిక నాగజాతి నాయకుడు కావొచ్చు. వైదిక మతస్థులు (ఆర్య/Indo-Aryan) పశుపాలకులు.

ప్రవాహాలకు అడ్డుకట్టలు కట్టి నీరుమళ్ళించటం వ్యవసాయానికి అవసరం. నీటి ప్రవాహాన్ని అడ్డుకొంటున్నారనే కారణంతో స్థానిక నాగులను, వైదిక మతస్థులు శత్రువులుగా చూసేవారు. ఇంద్రుడు వేదసంస్కృతికి ప్రతినిధి కాగా వృత్రుడు స్థానికుడు.

ప్రపంచవ్యాప్తంగా లభించేసాహిత్యంలో వ్యక్తుల మధ్య యుద్ధాలు దేవుళ్లమధ్య యుద్ధాలుగా వర్ణించటం కనిపిస్తుంది. ఇంద్రుడు, వృత్రాసురుడుల మధ్య ఘర్షణ రెండు చారిత్రిక జాతుల మధ్య నీటివినియోగం కొరకు జరిగిన పోరాటంగా గుర్తించాలి.


3.వేదమత క్షీణత- నాగుల పాత్ర

వేదిక సమాజంలో మతపరమైన /ధార్మిక విషయాలను నిర్ణయించటానికి మనువును నియమించుకొనేవారు. ఇతను ఒకరకంగా మతపెద్ద. వేదికమతం ఉచ్ఛస్థితిలో ఉన్న కాలంలో వరుసగా 14 మంది మనువులను నియోగించుకొన్నారు. ఒక మనువు పాలనా కాలాన్ని మన్వంతరం అంటారు. మొదటి మనువు స్వాయంభువుడు కాగా పద్నాలుగవ మనువు ఇంద్రసావర్ణి. ఇతని కాలం BCE 950. మహాభారత యుద్ధం కూడా BCE 950 లో జరిగింది. నిజానికి పదిహేనవ మనువు నియామకం జరగాల్సి ఉంది. కానీ BCE 950 తరువాత వేదిక సమాజంలో పెనుమార్పులు రావటంతో పదిహేనవ మనువు నియామకం జరగలేదు. దీనికి మూడు కారణాలు ఊహించారు చరిత్రకారులు

1. మహాభారత యుద్ధం కారణంగా గొప్ప విధ్వంసం జరిగింది. వైదికమతాన్ని పోషించిన రాజవంశాలు నశించిపోయాయి. రాజాశ్రయం దూరమవటంతో వైదికమతం సమాజంలో తనపట్టును కోల్పోయింది. అలా సమాజంలో ఏర్పడిన ఖాళీని క్రమక్రమంగా నాగజాతి భర్తీచేయసాగింది.

2. మధ్య ఆసియానుండి ప్రాచీన భారతదేశంలోకి వచ్చిన వివిధ వలసలలో BCE 800-1000 మధ్యలో, పశ్చిమ ఆసియాపై అస్సీరియనులు పదే పదే చేసే దాడుల వలన అక్కడి ప్రజలు భారతదేశంకి వలస వచ్చారని Dr. Naval Viyogi అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డారు [1]. వీరి యుద్ధనైపుణ్యం గొప్పది అంతే కాక కొత్తగా వచ్చిన ఇనుపలోహ ఆయుధాలు వీరి బలం. వీరు వేద సంస్కృతిని వ్యతిరేకించారు. అప్పటికే స్థానికంగా ఉన్న నాగులతో వీరు కలిసిపోవటంతో నాగులు మరింత బలపడ్డారు. వేదకాలానంతర సమాజంలో వైదికమతం స్థానంలోకి నాగసంస్కృతి ప్రవేశించసాగింది.

3. వేదాలను బలంగా ఎదిరించిన జైన, బౌద్ధ శ్రమణ సంస్కృతి వృద్ధినొందింది. ఈ శ్రమణ సంస్కృతిని నాగులు ముందుగా అందిపుచ్చుకొని దానిని మరింత బలపరిచారు. ఈ కలయిక వేదమతానికి వ్యతిరేకంగా పనిచేసి దాని క్షీణతకు కారణమయ్యింది.


4. బౌద్ధంలో నాగజాతి

బౌద్ధ, జైనాలలో నాగులు ప్రముఖంగా ప్రస్తావించబడ్డారు. హిందూఇతిహాసాలు, పురాణాలు ఒక్క ఆదిశేషుడిని తప్ప, ఇతర నాగులను- అసురులు, దస్యులు, రాక్షసులు, దానవులు, దైత్యులు అంటూ వివిధ పేర్లతో సూచిస్తూ న్యూనపరుస్తాయి. బౌద్ధ సాహిత్యం అలాకాక నాగులను గొప్ప గౌరవంతో వర్ణిస్తాయి. బుద్ధుని గొప్ప భక్తిప్రపత్తులతో నాగులు కొలిచారు. బౌద్ధ సాంస్కృతిక, ధార్మిక పరిణామంలో నాగులు, నాగినినులు ప్రముఖమైన పాత్ర పోషించారని వివిధ శిల్పాలద్వారా అర్ధమౌతుంది. ఆనాటి సమాజంలో నాగజాతి నెరపిన పాత్రకు ఆర్కియలాజికల్ ఆధారాలు బౌద్ధశిల్పాలలో దొరుకుతాయి.

***
సిద్ధార్థుడు జన్మించినపుడు మొదటిస్నానం చేయించటానికి అవసరమైన నీటిని నంద, ఉపనంద అనే సర్పరాజములు ఆకాశంనుండి కలశాలతో అందించారని లలితవిస్తార గ్రంథంలో ఉన్నది. ఈ సంఘటనను తెలిపే శిల్పాలు అమరావతి, సాంచీ స్తూపాలలో లభించాయి. ఈ ఉదంతం ద్వారా నాగులు బుద్ధుడు జన్మించినప్పటినుంచే ఆయనతో బంధాన్ని కలిగి ఉన్నారని తెలుపుతుంది
***
బోధివృక్షం క్రింద జ్ఞానోదయం అయిన అనంతరం ఉపవాసాన్ని ముగించేందుకు - బుద్ధభగవానునికి సుజాత అనే భక్తురాలు ఒక బంగారు పాత్రలో క్షీరాన్నం ఇచ్చింది. బుద్ధుడు నైరంజన నదిలో స్నానమాచరించి ఒడ్డుపై కూర్చున్నాడు. ఆ నది నాగులకు ఆవాసము. అచ్చట కొలువున్న నాగరాజు కుమార్తె బుద్ధభగవానుడు కూర్చునేందుకు ఒక బంగారు ఆసనాన్ని వేసింది. దానిపై కూర్చుని క్షీరాన్నాన్ని తిని ఖాళీపాత్రను నదిలోకి విడిచిపెట్టాడు. ఆ పాత్రను సాగరుడనే నాగరాజు తన నివాసంలో పూజామందిరంలో పెట్టుకొందామని తీసుకొని వెళుతుండగా, ఇంద్రుడు ఒక గద్దరూపంలో వచ్చి ఆ భిక్షాపాత్రను ఎత్తుకుపోవటానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం ఫలించకపోవటంతో ఇంద్రుడు తన నిజరూపాన్ని ధరించి బుద్ధభగవానుడు క్షీరాన్నం తిన్న పాత్రను తనకు ఇవ్వమని ప్రాధేయపడి దాన్ని దక్కించుకొని-స్వర్గంలో ఆ పాత్రను గొప్ప ఆనందోత్సాహాలతో ప్రతిష్టించి ప్రతిఏటా ఉత్సవము జరిపించసాగాడు. బుద్ధుడు కూర్చున్న బంగారు ఆసనాన్ని నాగరాజు కుమార్తె భద్రపరచి నిత్యంపూజలు జరిపించేది.

బౌద్ధం ప్రారంభదశలలో భిక్షాపాత్ర, వజ్రాసనము చిహ్నాలు బుద్ధునికి మారు రూపాలుగా పూజలందుకొన్నట్లు అనేక శిల్పాలలో కనిపిస్తుంది. బోధగయలో అశోకుడు నిర్మించాడని చెప్పబడే ఒక వజ్రాసనము నేటికీ ఉన్నది. అదే విధంగా బుద్ధుని భిక్షాపాత్రగా భక్తులు విశ్వసించే ఒక రాతిపాత్ర కాబూల్ నేషనల్ మ్యూజియం లో కలదు.

పై కథనం ద్వారా నాగజాతి బుద్ధుని పట్ల ప్రదర్శించిన అవ్యాజమైన భక్తి ప్రపత్తులు తెలుస్తాయి.

***
బుద్ధభగవానుడు బోధి వృక్షం కింద తపస్సు చేసుకొంటున్న సమయంలో భీకరమైన గాలులతో కూడ కుంభవృష్టి కురవసాగింది. ముచిలిందుడనే నాగరాజు భగవానునికి శీతవాతాదులవల్ల బాధ కలగకూడదని, తన దేహంతో ఆయనను చుట్టి, తలపై పడగలను విప్పి, ఏడురోజులపాటు సంరక్షించాడు. వాన తగ్గాక, ముచిలింద నాగరాజు తథాగతుని పాదాలకు తన శిరస్సుతో నమస్కరించి మూడు సార్లు ప్రదక్షణం చేసి వెనుతిరిగాడు.

***
బుద్ధుడు పరినిర్వాణం పొందినపుడు అతని దేహ అవశేషాల కొరకు ఆనాటి సమకాలీన ఎనిమిది మంది రాజులు యుద్ధానికి దిగారట. ద్రోన అనే బ్రాహ్మణుడు (Brahmin Drona) మధ్యవర్తిత్వం వహించి అవశేషాలను ఎనిమిది సమ భాగాలుగా చేసి ఇవ్వటంతో యుద్ధం ఆగిందని “మహాపరి నిర్వాణ సూత్ర” గ్రంథంలో చెప్పబడింది. ఆ ఎనిమిది అవశేషాలను ఆయా రాజ్యాల ప్రధాన పట్టణాలకు పంపి స్తూపాలను నిర్మించారు. అవి- రాజగృహ, వైశాలి, కపిలవస్తు, అల్లకప్ప, రమగ్రమ, పావ, కుశినగర్, వేతాదిప లు.

ఆ తరువాత బుద్ధుని ధాతువులు ఉన్న 8 స్తూపాలను అశోకుడు తెరచి ఆ ధాతువులను విభజించి వాటిపై 84 వేల స్తూపాలను నిర్మించదలిచాడు. ఏడు స్తూపాలను తెరచి వాటిలోని ధాతువులను సేకరించగలిగాడు అశోకుడు. నేపాల్ వద్ద ఉన్న Ramagrama స్తూపాన్ని తెరవటానికి ప్రయత్నించగా ఆ స్తూపాన్ని పరిరక్షిస్తున్న “నాగ” పేరుగల రాజు అభ్యంతరం తెలియచేసాడు. అశోకుడు నాగ రాజు విశ్వాసాలను గౌరవించి ఆ ఎనిమిదవ Ramagrama స్తూపాన్ని తెరవలేదు. ఈ మొత్తం ఉదంతం అమరావతి స్టోన్ స్లాబ్ (relief )చెక్కుడు శిల్పం గా చెప్పబడింది. ఈ శిల్పంలో- ఐదు తలలు కలిగిన మూడు సర్పాలు స్తూపాన్ని చుట్టుకొని దానికి రక్షణగా కల్పిస్తుంటాయి; స్తూపానికి ఇరువైపులా నాగరాజ దంపతులు ఉన్నారు; నాగరాణి చేతులు జోడించి స్తూపానికి నమస్కరిస్తుండగా, నాగరాజు పూలగుత్తినిచేత ధరించి ఉంటాడు, యజ్ఞోపవీతం ఉంది; స్తూపం దిగువన నాగినిలు శిరస్సు వంచి ప్రార్థిస్తుంటారు.

ఎలాపత్ర అనే నాగరాజు బుద్ధునిబోధనలను పాటించాడు. తధాగతుని నిర్వాణం అనంతరం ఎలాపత్ర బుద్ధ ధాతువులను దక్కించుకొన్నాడని హ్యుయాన్ త్సంగ్ తన యాత్రా కథనంలో వర్ణించాడు.

***
బుద్ధుడు సింహళద్వీపం వెళ్ళినపుడు అక్కడ మహోడరుడను నాగరాజు పాలిస్తూ ఉన్నాడు. బుద్ధుడు బౌద్ధ ధర్మమును ప్రచారం చేసి ఎనుబది కోట్ల నాగులను బౌద్ధులుగా మార్చాడని రత్నాకరి, రాజావళి బౌద్ధ చరిత్ర లాంటి బౌద్ధ సాహిత్యంలో చెప్పబడింది.

5. జైనం లో నాగులు


కామత్ అనే ఒక యోగి కట్టెలను మండిస్తూ యాగాన్ని నిర్వహిస్తుండగా, అలా మంటలతో యాగం నిర్వహించటం వల్ల జీవరాశి మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని- అప్పటికి తీర్థంకరునిగా ఇంకా మారని పార్శ్వనాథ యువరాజు ఆ కామత్ ను వారించాడు . అలా మండుతున్న ఒక కట్టెలోంచి వేడిని తాళలేక రెండు పాములు బయటకు వచ్చి చనిపోయాయి. ఇవి తదుపరి జన్మలో నాగలోకంలో ధరణేంద్ర, పద్మావతి గా తిరిగి జన్మించాయి. కామత్ కూడా మేఘాలను శాసించే మేఘమాలిగా జన్మించాడు.

పార్శ్వనాథ యువరాజు ముప్పై ఏండ్లవయసులో ఈ లోకాన్ని పరిత్యజించి పార్శ్వనాథునిగా అవతరించాడు. ఒకనాడు ఈయన తపస్సు చేస్తున్నపుడు మేఘమాలి భీకరమైన వర్షాన్ని, ఉరుములను తీవ్రమైన వరదను పంపించి తపోభంగం కావించాలని ప్రయత్నించాడు. నాగలోకపు రాజు అయిన ధరణేంద్రుడు ఆ ఉత్పాతం నుండి పార్శ్వనాథుని పైకి లేపి, తన పడగలతో గొడుగుపట్టి కాపాడాడు. అందుకు గాను పార్శ్వనాథుడు ఆమెకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి గౌరవించాడు. ఏదేని తీర్థంకరుని తలపై ఏడు పడగల సర్పం ఉంటే ఆ విగ్రహం పార్శ్వనాథునిదని ఇట్టే గుర్తించవచ్చు. ధ్యానం చేసుకొనే జైన తీర్థంకరులను సంరక్షించే దైవంగా సర్పానికి గౌరవ స్థానం ఇచ్చింది జైనమతం

6. బ్రాహ్మణవాద పురాణాలు -నాగజాతి

డా. అంబేద్కర్ బౌద్ధధర్మాన్ని స్వీకరించేటపుడు చేసిన నాగపూర్ ప్రసంగంలో- “బౌద్ధధర్మాన్ని తొలుత ప్రచారం చేసిన వారు నాగులు. వీరు ఆర్యులతో ఎన్నో యుద్ధాలు చేసారు. నాగజాతిని సమూలంగా తుడిచిపెట్టే ప్రయత్నంలో ఆర్యులు నాగులను మంటల్లో వేసి తగలబెట్టగా మిగిలిన వారి సంతతే మనం” అన్నారు

బ్రాహ్మణవాదం, బౌద్ధానికి మద్య మతపరమైన వైరుధ్యాలుండటంతో అవి ఒకదానినొకటి ఘర్షించుకొంటూ మనుగడసాగించాయి. నాగులు బౌద్ధాన్ని స్వీకరించారు. బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా చరిత్రలో పోరాడారు.

గుప్తుల పాలనలో బుద్ధిజం రాజాదరణకోల్పోయింది. బ్రాహ్మణవాదం ప్రోత్సహించబడింది. CE 335 లో సముద్రగుప్తుడు పాలన చేపట్టాక అత్యుత, నాగసేన వంటి ప్రముఖ నాగవంశ రాజులు పదమూడు మందిని నిర్మూలించాడు[1]. సంఘజీవనంలో కులాధారిత ఫ్యూడల్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. బౌద్ధమతాన్ని పోషించిన Craftguilds నాశనం చేసాడు. ఇక ఎప్పటికీ కోలుకోలేని విధంగా భారతదేశ ఆర్ధికవ్యవస్థ, రక్షణ వ్యవస్థల వెన్ను విరిచాడు. ఆ కారణంగా దేశప్రజలు బానిసత్వంలోకి, పేదరికంలోకి, అసమానతలలోకి, వెలివేతలలోకి బలవంతంగా నెట్టబడ్డారు. భారతదేశ చరిత్రలో అప్పటినుంచి చీకటిరోజులు ప్రారంభమైనాయి. విజేతలు రాసిన చరిత్ర కనుక గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా అభివర్ణించారు. గుప్తులకాలంలో వివిధ బ్రాహ్మణవాద పురాణాల రచన ప్రారంభమై పదోశాతాబ్దంవరకూ కొనసాగింది. ఈ పురాణాలు-అంతవరకూ ప్రధాన ఆరాధనా విధానాలుగా కొనసాగిన బౌద్ధ, జైన, చార్వాక దర్శనాలను ఖండిస్తూ, కొన్నిచోట్ల వాటిలోని ముఖ్య అంశాలను అప్రాప్రియేట్ చేసుకొంటూ కథలు, కల్పనలతో నిండి ఉంటాయి.

ఈ బ్రాహ్మణవాద పురాణాలలో బౌద్ధాన్ని ఆదరించిన నాగవంశ రాజులను- రాక్షసులుగా, పరాజితులుగ, బానిసలుగా, అసురులుగా వర్ణించారు. పురాణాలను, ఇతిహాసాలను పూర్తి కల్పనలుగా కొట్టిపడేయలేం. ఇవి ప్రతీకాత్మకంగా చెప్పబడిన చారిత్రిక అంశాలు అయిఉండే అవకాశాలు ఎక్కువ. ఈరోజు మనం గతంతో డిస్ కనక్ట్ అయి పోవటంవల్ల ఇవి పూర్తి ఊహాజనితాలుగా అనిపించటం సహజం.

***
మహాభారత కథలో ఉద్దేశపూర్వక నాగజాతి హనన ప్రయత్నాలు రెండు కనిపిస్తాయి. ఒకటి జనమేజయుడు సర్పయాగం చేసి నాగజాతిని అంతమొందించటం. రెండు ఖాండవవన దహనం ద్వారా అక్కడ నివశించే నాగజాతిని నిర్మూలింపచూడటం.

కశ్యపమునికి ఇద్దరు భార్యలు. కద్రువ, వినత. ఇద్దరూ ఒకేసారి గర్భవతులయ్యారు. కద్రువ అండములు పగిలి వేయిమంది పిల్లలు సర్పములుగా జన్మించారు.. అండములు ఎంతకీ పగలకపోవటంతో ఉత్సుకత ఆపుకోలేక వినత ఒక అండాన్ని పగలగొట్టగా, ఆ గుడ్డులోంచి సగమే తయారైన శిశువు వచ్చాడు. ఇతను సూర్యుని రధసారధి అయిన అనూరుడు. రెండవ గుడ్డునుండి వచ్చినవాడు గరుత్మంతుడు.

కద్రువకు జన్మించిన వేయిమంది సర్పములు- శేషుడు, వాసుకి, ఐరావతము, తక్షకుడు, కర్కాటకుడు, ధనుంజయుడు, కాళియుడు, మణినాగము, పూరణుడు, పింజరకుడు, ఏలాపాత్రుడు మొదలనవారు. వీరిలో శేషుడు తప్ప మిగిలినవారు వివిధ పురాణాలలో అనేక రకాలుగా పరాజితులైనట్లు వర్ణించబడ్డారు. వీటన్నిటినీ నాగ సంస్కృతిపై బ్రాహ్మణవాదం జరిపిన దాడులుగా, అణచివేతగా అర్ధం చేసుకోవాలి. ఓడినవారి చిహ్నాలు విజేతలు గ్రహించటం ఒక ఆచారం. అలా నాగచిహ్నం అయిన సర్పం – విష్ణువు శయనించే శేషపాన్పు అలా బ్రాహ్మణవాద మతం లోకి వచ్చి చేరిఉంటుంది.

***
కద్రు కొడుకు కాళీయుడు. ఇతను గరుడునితో చేసిన యుద్ధంలో ఓడిపోయి కాళింది అనే మడుగులో తలదాచుకొన్నాడు. మడుగులోని నీరు కాళీయుని వల్ల విషపూరితమవుతుందనే కారణంతో కృష్ణుడు కాళీయుడిని మర్ధించి ఓడించాడు. కాళీయుడు అతని భార్యలు శ్రీకృష్ణుని శరణువేడగా, అతనిని కాళింది నుంచి రమణక ద్వీపానికి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు. అక్కడ గరుడుని వల్ల తనకు ప్రమాదం ఉందని కాళీయుడు చెప్పగా, “నీ శిరస్సుపై నా పాదముద్రలు (Spectacle marks on hood) ఉన్నాయి కనుక వాటిని చూసి గరుడుడు నీకు హాని కలిగించడు” అని అభయం ఇవ్వటంతో కాళీయుడు కాళింది మడుగును ఖాళీ చేసి రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు.

ఈ కథ ఎంత హృద్యంగా అనిపించినప్పటికీ నాగులను ఒకచోటినుంచి మరొక చోటికి వెళ్ళగొట్టి తనకు విధేయులుగా చేసుకోవటం అనే విషయం అంతర్లీనంగా ధ్వనిస్తుంది.

***
మహాభారత యుద్ధం తరువాత జరిగిన కథ సర్పయాగం. అభిమన్యునికి, ఉత్తరకు పుట్టిన కొడుకు పరీక్షితుడు. ఇతను శాపవశాత్తూ తక్షకుడనే సర్పము కాటు చేత మరణించాడు. పరీక్షితుని కుమారుడు జనమేజయుడు. తన తండ్రిని చంపినందుకు ప్రతీకారముగా ఇతను నాగులందరిని అంతరింపచేయటం కొరకై సర్పయాగం తలపెట్టాడు. సర్పయాగం అంటే లోకంలోని పాములను అగ్నిలో కాల్చి నశింపచేయటం. మంత్రాలకు పాములన్నీ వచ్చి యజ్ఞగుండంలో పడి చనిపోతూ ఉన్నాయి. సర్పయాగ లక్ష్యం తక్షకుడు. అతను ఇంద్రుని శరణుకోరటంతో ఇంద్రునితో సహా వచ్చి యజ్ఞగుండంలో పడి నశించే సమయంలో- ఆస్తీకుడు అనే ఋషి వచ్చి జనమేజయుని సమాధానపరచి అతని చేత సర్పయాగం మానిపించాడు. అలా నాగజాతి సమూల హననం నివారించబడింది.

భారత యుద్ధ అనంతరం ఏర్పడిన అరాజక వ్యవస్థ వల్ల ఉత్తరపశ్చిమ భారతదేశంలో నాగుల సంఖ్య పెరిగింది. ఈ సమయానికి సరస్వతి, గంగ నదుల మధ్య భూభాగమైన పౌరవరాజ్యాన్ని, అర్జునుడి మనవడు పరీక్షితుడు పాలిస్తున్నాడు. గాంధార ప్రాంతంలో బలంపుంజుకొన్న నాగులు, ఈ పరీక్షితుని ఓడించి ఉంటారు. దీనికి ప్రతిగా పరీక్షితుని కుమారుడు జనమేజయుడు నాగవంశాన్ని నిర్మూలించటానికి చేసిన జాతిహననం ప్రయత్నమే ఈ సర్పయాగం కావొచ్చు. ఇదొక ప్రతీకాత్మక కథనం. కాగా, ఈ కథ విన్నవారికి సకలసంపదలు కలుగుతాయని, సర్పబాధలు తొలగుతాయని బ్రహ్మణవాద కవులు ప్రచారించుకొన్నారు.

***

శ్వేతకి అనే మహారాజు వందేళ్లపాటు చేసిన ఒక బృహత్తర యజ్ఞంలో పోసిన ఆజ్యం అరగక అగ్నిదేవునికి అజీర్తి చేసింది. బ్రహ్మదేవుని పరిష్కారం అడుగగా, దివ్యఓషదులు అలాగే దేవతలకు శత్రువులైన కొన్ని జంతువులు ఉన్న ఖాండవ వనాన్ని దహించితే నీకు స్వస్థతకలుగుతుంది అని చెప్పాడు. ఖాండవవనం నాగులకు నాయకుడైన తక్షకుడు, తన అసంఖ్యాకమైన అనుచరులతో ఉండే నివాస స్థలం. అగ్నిదేవుడు అర్జునుని సహాయంతో ఖాండవవనాన్ని దహించసాగాడు. అగ్నికీలలలో దహించబడుతూ అనేక సర్పములు ప్రాణభీతితో పరుగులు పెట్టాయి. వాటిని అర్జునుడు తన బాణములతో సంహరించాడు. తక్షకుని భార్య, కొడుకు అశ్వసేనుడు ఖాండవవనంలో చిక్కుకొన్నారు. వారిని కూడా అర్జునుడు చంపబోతే గురితప్పి వారు ప్రాణాలు దక్కించుకొన్నారు. ఈ మొత్తం హననానికి లక్ష్యమైన తక్షకుడు ఆ సమయంలో ఖాండవవనంలో కాక మరొకచోట ఉండటం వల్ల ప్రాణాలు దక్కించుకొన్నాడు.

పై ఉదంతం మొత్తం బ్రాహ్మణవాదమతానికి, నాగజాతికి మధ్య జరిగిన ఘర్షణ. జాతిహనన ప్రయత్నం. ఖాండవవనంలో దేవతలకు శత్రువులైన కొన్ని జంతువులు ఉంటున్నాయని బ్రహ్మ దేవుడు అన్న వాక్యం నాగుల గురించే. బ్రాహ్మణీయ సాహిత్యం నాగులను శత్రువులుగాను, జంతువులుగాను చూసింది. ఖాండవదహనం చేసి ఆక్రమించిన నాగుల రాజ్య స్థానంలో, పాండవులు అక్కడ ఇంద్రప్రస్థ అనే నగరాన్ని నిర్మించటం నాగుల అణచివేతలో భాగం. బహుసా ఈ కారణంతోనే నాగులు మహాభారతయుద్ధంలో కౌరవులతరపు పోరాడారు.

***
మానస శివుని కుమార్తె. ఈమె పార్వతీదేవికి జన్మించలేదు. నాగుల తల్లి అయిన కద్రు ఆడపిల్లలు లేరు అని చింతిస్తూ చెక్కిన ఒక శిల్పంపై శివుని వీర్యం పడటం వలన ఈమె జన్మించినది అని ఐతిహ్యం. ఈమె సోదరుడు పేరు వాసుకి. ఈమెకు జరత్కారుడు అనే ఋషితో తో పెండ్లి జరిగింది. మానస కోపధారి కావటంచే భర్త, తండ్రి, పార్వతి ఆమెను విడిచిపెట్టేసారు.

మానసాదేవి జరత్కారుడుల కొడుకు ఆస్తీకుడు. జనమేజయుడు తలపెట్టిన సర్పయాగం వల్ల నాగవంశం అంతరించిపోతున్న సమయంలో ఈ ఆస్తీకుడు జనమేజయుడిని తన పాండిత్యంతో మెప్పించి అంతవరకూ జరుగుతున్న సర్పహవనాన్ని నిలుపు చేయించాడు. అలా నాగజాతి అంతరించిపోకుండా కాపాడాడు.

బెంగాలులో మానసను భక్తితో కొలుస్తారు. ఈమెకు రూపం లేదు. సర్పాకృతిని కానీ చెట్టుకొమ్మను కానీ మానసాదేవిగా భావించి పూజిస్తారు. ఈమె పాముకాటునుండి కాపాడేదేవతగా, కాలక్రమేణా మసూచికి, ఆటలమ్మ వ్యాధులను నయంచేసే దేవతగా పూజింపబడుతున్నది.

సామాన్య జనులలో నాగ సంప్రదాయం ఎలా చొచ్చుకొని పోయిందో మానస కథ తెలియచేస్తుంది. నాగులలో వాసుకి, శేషుకి వంటివారు మంచి నాగులుగా వినుతినెక్కి, బ్రాహ్మణవాద సాహిత్యంలో గౌరవప్రదమైన పాత్రలు పొందారు. కశ్యప, కద్రుల పుత్రులలో పెద్దవాడయిన శేషుకి తమ్ముళ్లతో కలవక విడిగాఉంటూ భక్తి ప్రపత్తులతో జీవించేవాడు. ఇతని నడవడికను మెచ్చిన బ్రహ్మదేవుడు, ఈ భూమిని సంరక్షించే అనంతునిగా, విష్ణుమూర్తి శయనించే తల్పంగా ఉండే వరాలు ఇచ్చాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేను సర్పాలలో వాసుకిని అంటాడు

వాసుకి నాగలోకానికి రాజు. శేషుని తమ్ముడు. పరమశివుని మెడను అలంకరించే అర్హత పొందాడు. అలా కొందరు మంచి సర్పాలకు ప్రతీకగా మిగిలితే తక్షకుడు చెడు సర్పానికి ప్రతీకగా చిత్రించబడ్డాడు. బహుశా ఆనాటి సమాజంలో ఒకే సమూహంలో భిన్న దృక్ఫథాలు కలిగి ఉండటానికి వీరు ఉదాహరణ.

***
బ్రాహ్మణవాద సాహిత్యంలో అనేకమంది వీరులు నాగకన్యలను పెండ్లాడినట్లు ఉంటుంది. ఇది బహుశా ఓడించిన రాజ్యాలకు చెందిన కన్యలను గెలిచిన రాజులు తమ అంతఃపురకాంతలుగా స్వీకరించటం కావొచ్చు. అర్జునుడు నాగకన్య ఉలూచిని పెండ్లాడాడు. కాశి రాజైన బ్రహ్మదత్తుడు నాగి ని పెండ్లాడాడు. రాముని తనయుడు కుశుడు కుముదావని అనే నాగకన్యను పెండ్లాడాడు. జరత్కారుడు వాసుకి చెల్లెలు మానసను పెండ్లాడాడు.

చారిత్రికంగా అయితే- సముద్రగుప్తుని కొడుకు చంద్రగుప్త II, కుబేర నాగ పేరుకల నాగ రాణిని పెండ్లాడాడు. పల్లవ వంశమూలపురుషుడైన అశ్వత్థామ నాగ కన్యను వివాహమాడాడని తొమ్మిదో శతాబ్దపు రాయకోట దాన శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ వివాహాలన్నీ Indo-Aryan జాతులు స్థానిక జాతులతో కలిసి కరిగిపోవటాన్ని సూచిస్తాయి.

***
7. శాసనాలలో నాగుల ప్రస్తావనలు

ప్రాచీన భారతదేశ ఆర్కియాలజి శోథనలలో ఇబ్బడిముబ్బడిగా నాగుల ప్రస్తావనలు లభిస్తాయి.

భారతదేశములో నాగారాధన ఉండేదని క్రీస్తుపూర్వపు గ్రీకు చరిత్రకారుడు Aelian ప్రస్తావించాడు. BCE 600 నుండి 300 మధ్య నాటి నాగ ముద్రలు కలిగిన అనేక పంచ్ మార్క్ డ్ నాణాలు లభించాయి.

తక్షశిల వద్ద లభించిన క్రీ.పూ మూడు/నాలుగవ శతాబ్దాలకు చెందిన నాణాలపై సర్పచిహ్నం ఉన్నది. ఇది చతురశ్రాకారపు నాణెం. దీనిపై త్రిరత్న చిహ్నము, స్తూపం, క్రింది భాగాన మెలికలు తిరిగిన సర్పచిహ్నము కలదు. (ఫొటో)

అలహాబాదుకు 30 కిమీ దూరంలోని Kosam (జైన కోశాంబి) వద్ద లభించిన క్రీపూ 200 నాటి పర్వత రాజు వేయించిన నాణాలపై సర్ప ముద్రలు కలవు[2].

BCE 150 నుంచి 100 మధ్యలో అయోధ్యను పాలించిన విశాఖదేవ, ధనదేవ, కుముదసేన[3] రాజులు వేయించిన నాణాలలో సర్పముద్రలు కలవు. కుముదసేనుడి నాణంపై ఒకవైపు నంది, సర్పముద్ర, మరోవైపున బుద్ధుని త్రిరత్న చిహ్నము గమనించవచ్చు. (చూడుడు ఫొటో)

కుషానుల తరువాత మధురను పాలించిన వీరసేనుడు (175-180 AD) నాగజాతికి చెందిన రాజు. ఇతను వేయించిన నాణాలపై నాగగుర్తులు కలవు[4].

***
BCE రెండో శతాబ్దంలో శాతవాహన చక్రవర్తి మొదటి శాతకర్ణి భార్య నాగనిక నానాఘాట్ శాసనాన్ని వేయించింది. ఈ శాసనంలో ఆనాటి నాగదేవతా ఆరాధనను nagavaradayiniya అనే వాక్యం సూచిస్తుంది. ఇదే శాసనంలో సైన్యాద్యక్షుడు పేరు nakayiro. నాగనిక, నాగవరదాయిని, నాగాయిరో లాంటి పేర్లను బట్టి శాతవాహనులు తాము బ్రాహ్మణులమని చెప్పుకొన్నప్పటికీ నాగవంశమూలాలను కలిగి ఉన్నారని తెలుస్తుంది.

CE 113 లో ఖరోష్టి భాషలో వేయించిన ఒక గాంధార శాసనంలో- థెరా నోర (Thera Nora) అనే వ్యక్తి నాగుల కొరకు ఒక చెరువును తవ్వించినట్లు ఉంది థేరనొరా ఒక గ్రీకు దేశస్థుడు. అప్పట్లో గ్రాంధార ప్రాంతంలో బుద్ధిజాన్ని స్వీకరించిన గ్రీకు, బాక్ట్రియన్ దేశస్థులు అధికసంఖ్యలో ఉండేవారు.[5]

CE మొదటి శతాబ్దాలలో మధురనుండి నాగ ఆరాధనకు సంబంధించి అనేక శాసనాలు దొరికాయి. ఒక నాగశిల్పం క్రిందిభాగంలో – మొక్కుకున్న విధంగా సంతానం కలిగినందుకు తలనీలాలు సమర్పించుకొని నాగశిల్పాన్ని ప్రతిష్టించినట్లు ఉంది.[6] . పిల్లలు లేకపోతే నాగ ప్రతిమలను దానం చేస్తానని మొక్కుకోవటం నేటికీ ఒక ఆచారంగా కొనసాగుతున్నది.

పేరు చివర నాగ అని ఉన్న జయనాగ, మహానాగ, నాగ బహుతికియ, నాగదిన, నాగదత్త, నాగవతి, నాగపియ, నాగసేన లాంటి అనేక పేర్లు వివిధ శాసనాలలో కనిపిస్తాయి.

సముద్రగుప్తుని CE 350 నాటి అలహాబాదు ప్రశస్థి శాసనంలో గనపతినాగ, నాగశేన అనే ఆర్యావర్త నాగ రాజుల పేర్లు కనిపిస్తాయి. విదిశ, మధురలలో గణపతినాగ నాణాలు కనిపించాయి. సముద్రగుప్తుని కొడుకు చంద్రగుప్త II, కుబేర నాగ పేరుకల నాగ రాణిని పెండ్లాడాడు.

CE మొదటి నాలుగు శతాబ్దాలలో భారతదేశంలోని చాలా భూభాగం నాగ కల్ట్ ప్రభావంలో ఉండేదని. ఉత్తర భారతదేశంలో మధుర, విదిశ రాజ్యాలను నాగులు పాలించారు. నాణాలను కూడా విడుదల చేసారు[7].

కాశ్మీరులో సాగిన నాగవంశ పాలనవివరాలు ఎనిమిదోశతాబ్దపు నీలమతపురాణం అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది.

దక్షిణాపథంలో పదోశతాబ్దం వరకూ కొన్ని నాగవంశాలు తమ ప్రాబల్యాన్ని నిలుపుకొన్నాయి. నాగవంశానికి చెందిన రాజులమని – కాశ్మీర, మణిపూర్, నాగపూర్, చోళులు, పల్లవులు లాంటి అనేక రాజవంశాలు తమనుతాము సంబోధించుకొన్నాయి.

కాశ్మీరరాజులు తాము కర్కోటక నాగరాజు సంతతి అని నాగపూరు రాజులు తాము పుండరీక నాగరాజు సంతతి అని చెప్పుకొనేవారు. ఎల్లోరా గుహలు, నాగార్జునకొండ, ధూళికట్ట వద్ద లభించిన బౌద్ధ శిల్పాలలోనాగరాజు ప్రతిమలు విస్తారంగా లభించాయి. నాగరాజుకు తలపై ఐదు పడగలు, నాగినికి ఒకపడగా ప్రతిమా లక్షణాలు. నాగ శిలలు, నాగకల్లులు దేశమంతటా కనిపిస్తాయి. పిల్లలు కలగటానికి, పెండ్లి అవటానికి నాగదేవతకు మొక్కుకొని నాగాకృతులు ఉన్న శిలలను దేవాలయాలలో దానం ఇవ్వటం ఒక సంప్రదాయం.

8. ఆంధ్రదేశం నాగుల దేశం

బౌద్ధసాహిత్యం ప్రకారం ఆంధ్రదేశం నాగులదేశం. శంఖపాల (SanKapala) జాతకకథలో, కృష్ణాతీరం (Kannabenna) నాగలోకమని చెప్పబడింది. అమరావతి బౌద్ధ స్తూపశిల్పాలలో తలపై సర్పం పడగ కలిగి ఉన్న స్త్రీ, పురుష రూపాలు అనేకం కనిపిస్తాయి. మూడో శతాబ్దపు బౌద్ధ రచన అయిన Gandavyuha లో మంజుశ్రీ దక్షిణాపథంలోని ధాన్యకటక లో నివసిస్తూ అక్కడ నివసించే నాగులను పెద్దసంఖ్యలో బౌద్ధంలోకి మార్చాడని ఉన్నది.

నల అనే నాగరాజు కృష్ణానదీ తీరంలో ఉన్న Maherika అనే చోట నివసించేవాడని సింహళ కథనం Mahavamsa లో చెప్పబడింది. థాయిలాండ్ ప్రాచీన Siamese సాహిత్యం క్రిష్ణా డెల్టాను నాగభూమిగా వర్ణించింది.

దీపావళి అమావస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండగ జరుపుకోవటం తెలుగువారి ఆచారం. ఈ పండుగను ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, కొంతమేరకు కర్ణాటక, తమిళనాడులలో జరుపుకోవటం అనేది తెలుగు వారికి అనాదిగా నాగులతో ఉండిన చారిత్రిక సంబంధాన్ని తెలియచేస్తుంది.

9. ముగింపు - జన్యు శోధనలు

భారతఉపఖండంలోకి ప్రధానంగా మూడు విడతలుగా జరిగిన వలసల వలన ఇది జనావాసంగా మారింది.

65 వేలఏండ్లక్రితం “Out of Africa” వలస ద్వారా ఆఫ్రికానుంచి ప్రపంచంలోని పలు చోట్లకు ఆఫ్రికా ప్రజలు విస్తరించారు. ఇది మొదటి వలస. అలా భారతదేశంలోకి వచ్చిన “మొదటి భారతీయులు” నేటి భారతదేశ జనాభాలో 50-65% వరకూ ఉన్నారు.

రెండవ వలస 9000-5000 వేల ఏండ్ల క్రితం మధ్య ఇరాన్ పీఠభూమినుంచి వచ్చిన Iranian Agriculturalists. వీరు భరతఖండలోకి వ్యవసాయాన్ని తీసుకొనివచ్చారు. వీరి వల్ల బార్లి, గోధుమ వ్యవసాయం భారతదేశంలో విస్తరించింది. సింధులోయ నాగరికత అభివృద్ధిచెందింది.

ఇక మూడవ విడత వలస వలన భారతదేశ సాంస్కృతిక సామాజిక రాజకీయ రంగాలలో పెనుమార్పులు వచ్చాయి. IVC (సింధులోయ నాగరికత) ఆర్కియలాజికల్ తవ్వకాలలో భాగంగా హర్యానలోని రాఖిఘర్ ఇంకా ఇతర సింధులోయనాగరికత సైట్లు వద్ద లభించిన అవశేషాలపై జరిపిన DNA పరీక్షలు, ఆధునిక జన్యుశోధనల, భాషా అధ్యయనాల ద్వారా తెలుసుకొన్న విషయాలు ఇవి.[8]

1. భారతీయ ఉపఖంఢంలోకి మూడవ విడత వలస ద్వారా c2000 BCE లో Pontic-Caspian steppe (ఉక్రయిన్, రష్య, కజకిస్తాన్) ప్రాంతాలనుంచి Yamnaya Steppe pastoralist లు భారతదేశంలోకి ప్రవేశించారు . వీరు పశుపాలకులు. వీరు తమతో pre-Sanskrit and pre-Indo-Aryan భాషలను తీసుకొని వచ్చారు. వీటినుంచి సంస్కృతం, ఇతర కొన్ని భారతీయ భాషలు ఆవిర్భవించాయి.

మధ్యఆసియాప్రాంతపు భాష అయిన జెండ్ అవిస్టా భాషకు సంస్కృత భాషకు అనేక సామ్యాలు ఉండటం కూడా ఈ రకపు వలసలను ధృవపరుస్తుంది. (See picture). ఈ వలస వచ్చినవారు మొదట జెండ్ అవిస్తా భాషను మాట్లాడేవారని, భరతఖండంలోకి ప్రవేశించాక తమ మూల జెండ్ అవిస్టా భాషను సంస్కృత భాషగా సంస్కరించుకొన్నారు. ఈ క్రమంలో వీరు తమతో పాటు పూర్వ మూల జెండ్ అవిస్టా లిపిని మధ్య ఆసియానుండి తెచ్చుకోకపోవటంతో సంస్కృత భాషకు మొదట్లో బ్రహ్మి లిపి, తరువాత శారద లిపి క్రీశ 7 వ శతాబ్దం నుంచి దేవనాగరి లిపిని వాడుకోవటం జరిగిందని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

2. సింధులోయ నాగరికత c1900 BCE నాటికి క్షీణించి పోయింది. రాఖిఘర్ వద్ద లభించిన సింధులోయనాగరికతకు చెందిన అవశేషాలనుండి సేకరించిన DNA- పైనచెప్పిన రెండు వలసల ప్రజలైన Iranian agriculturalists లతో అతి స్వల్పంగా సారూప్యతను కలిగి ఉండగా, Yamnaya Steppe pastoralists ల DNA తో ఏ రకమైన సారూప్యత కలిగిలేదు. అంటే సింధులోయ నాగరికత ప్రజలు పై రెండు వలసలతో నిమిత్తం లేకుండా భారతదేశంలోనే అనాదిగా మనుగడ సాగిస్తూ వచ్చిన స్థానిక జాతులుగా భావించాలి.

3. c2000 BCEలో వచ్చిన Yamnaya Steppe pastoralist ప్రజల జన్యువులు ఆ తరువాతి కాలంలో భారతదేశ ప్రజలలో విస్తరించిన విధానం ఆసక్తికరం.

a. ఈ Steppe పురుషుల జన్యువులు స్థానిక పురుషల జన్యువులను తొలగించటం ద్వారా సమాజంలోకి వచ్చి చేరాయి. అంటే Steppe pastoralist పురుషులు, indigenous పురుషులను ఓడించి లేదా నిర్మూలించి వారి స్త్రీలను గ్రహించటం ద్వారా తమ జన్యువులను సంతానం రూపంలో జనాభాలో ప్రవేశపెట్టారు.[9]. Steppe pastoralist migrant పురుషులు, indigenous పురుషుల మధ్య ఘర్షణలు జరిగాయనటానికి ఇది సంకేతం.

b. మరొక ఆశ్చర్యం కలిగించే అంశం- Steppe ancestry ని సూచించే R1 haplogroup జన్యువు ఆధునిక భారతసమాజంలో బ్రాహ్మణులలో అధికంగా ఉన్నట్లు గుర్తించారు. [10] ఈ Steppe ancestry కి మార్కర్ గా ఉండే జన్యువు అత్యధికంగా 72.22 శాతం పశ్ఛిమబెంగాలు బ్రాహ్మణులలో కనిపించింది. ఇతర రాష్ట్రాలలో ఈ జన్యువు ఉనికి శాతం ఇలా ఉంది.


ఉత్తరప్రదేష్ బ్రాహ్మణులు - 67.7%
బీహారి బ్రాహ్మణులు - 60.53%
హిమాచల్ బ్రాహ్మణులు -47.37 %
మహరాష్ట్ర బ్రాహ్మణులు – 43.33%
చిత్ పవన్ బ్రాహ్మణులు – 40.00%
సౌరాష్ట్ర బ్రాహ్మణులు - 39.1%
మధ్యప్రదేష్ బ్రాహ్మణులు – 38.1%
పంజాబ్ బ్రాహ్మణులు – 35.71%
గుజరాత్ బ్రాహ్మణులు – 32.81%

దక్షిణ రాష్ట్రాల బ్రాహ్మణులలో ఈ జన్యువు సుమారు 30% శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు.

ఇక భారతదేశ క్రిందితరగతి ప్రజలలో (Lower Castes/దళిత,బహుజనులు) ఈ జన్యువు 15.7 శాతం మందిలో కనిపించింది. అదే విధంగా భారతీయ గిరిజనులలో ఈ జన్యువు 7.9% మందిలో మాత్రమే గుర్తించారు.

Steppe ancestry అనేది భారతీయ సమాజంలో అగ్రకులాలుగా పేరుగాంచిన బ్రాహ్మణులలో గణనీయంగాను, దళిత బహుజన గిరిజనులలో స్వల్పంగాను ఉన్నట్లు పై పరిశోథన ద్వారా తెలుస్తుంది. దళిత బహుజనులలో Steppe ancestry ని సూచించే జన్యువులు తక్కువగా ఉండటం వారు ఈ నేలపై సింధులోయ నాగరికత కాలంనుంచీ నివసిస్తున్న స్థానికులని స్పష్టమౌతుంది. భారతీయసమాజంలో అనాదిగా అగ్రకులాలుగా ఉన్న బ్రాహ్మణులలో Steppe ancestry ని సూచించే జన్యువులు అధికంగా ఉండటం వారి స్థానికేతర మూలాలను పట్టిచూపుతుంది. వీరినే ఆర్యులు అని Aryan Migration Theory చెప్పింది. ఆధునిక జన్యు పరీక్షలు కూడా ఇదే విషయాన్ని ధృవపరచటం గమనార్హం.

ఇక పై జన్యు పరిశోధనావిష్కరణలు ప్రాచీన భారతదేశంలో నాగజాతి పరిణామక్రమంతో స్పష్టంగా సరిపోలుతాయి.

1. నాగులు, సింధులోయ నాగరికతనుంచీ ఏ వలసలచే ప్రభావితం కాని భారతదేశ మూలనివాసులు. వీరు నేడు Steppe ancestry జన్యువులు పెద్దగా కనిపించని దళితబహుజనులు కావొచ్చు

2. ఈ నాగులను అణచివేసినట్లు లేదా నాగస్త్రీలను పెండ్లాడినట్లు బ్రాహ్మణవాద సాహిత్యంలోను, ఇతర శాసనాలలోను అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ఈ దృగ్విషయం, జన్యు పరీక్షలలో చెప్పిన Steppe pastoralist పురుషులు స్థానిక పురుషులను జయించి/నిర్మూలించి వారి స్త్రీలను చేపట్టి ఉంటారనే ప్రతిపాదనతో సరిపోలుతుంది.

3. బౌద్ధాన్ని, జైనాన్ని పూర్తిగా నిర్మూలించటం ద్వారా, నాగ రాజులను సంహరించటం ద్వారా Steppe pastoralist/ఆర్యులు నాగులపై ఆధిపత్యం పొందారు. ఇక చివరగా వారిని దుష్టులుగా, రాక్షసులుగా చిత్రీకరించి, బానిసలుగా కులవ్యవస్థలో ఇరికించి, వారి సాంస్కృతిక చిహ్నాలైన నాగారాధన, నాగచిహ్నాలను కైవసం చేసుకొంది బ్రాహ్మణవాద మతం. “నాగజాతిని సమూలంగా తుడిచిపెట్టే ప్రయత్నంలో ఆర్యులు నాగులను మంటల్లో వేసి తగలబెట్టగా మిగిలిన వారి సంతతే మనం” అని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినది దీనిగురించే.



సంప్రదించిన పుస్తకాలు


1. Nagas, The Ancient Rulers of India, thier Origin and History, Dr. Naval Viyogi
2. The Nagas in Indian History and Culture, TV Mahalingam
3. Indian Serpent-Lore, J.PH. Vogel
4.Development of snake worship in ancient India, PhD thesis by Rao, Josyula Nageswara
5.The Disguises of the Demon,Wendy Doniger, Editor
6. The Triumph of the Snake Goddess, Kaiser Haq
7. పురాణాలు మరోచూపు, బి. విజయభారతి
8. Journal of the Asiatic Society of Bengal, vol 49
9. V. A. Smith, Catalogue of the coins of the Indian Museum, pp. 148-150
10 Early Indian Religions, by Banerjee, pn102.
11.. అంతర్జాలం



[1] Nagas, the ancient rulers of India, their origin and history, Dr. Naval Viyogi p.n 173.
[2] V. A. Smith, Catalogue of the coins of the Indian Museum, pp. 155
[3] Pn. 138, Journal of the Asiatic Society of Bengal, vol 49
[4] V. A. Smith, Catalogue of the coins of the Indian Museum, pp. 148-150
[5] Early Indian Religions, by Banerjee, pn102.
[6] Ibid pn 103
[7] Early Indian Religions p.n 114
[8] 1. V. Shinde, V. Narasimhan et al. “An Ancient Harappan Genome Lacks Ancestry from Steppe Pastoralists or Iranian Farmers” (_Cell_ 179, 1-7, Oct 17, 2019)
2. Vagheesh M. Narasimhan et al., "The formation of human populations in South and Central Asia" (_Science_, Sep 5, 2019)
[9] Steppe migrants “were more successful at competing for local mates than men from the local groups”
[10] https://en.wikipedia.org/wiki/Y-DNA_haplogroups_in_populations_of_South_Asia

6 comments:

  1. మీరు చెప్పేదాన్నిబట్టి.. నాగులకి వ్యవసాయంతో అంతగా పనిలేదు. మరి నీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరమేమొచ్చింది?

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ
      నాగులు స్థానికులు. వారు వ్యవసాయదారులు. వారికి నీరు అవసరం. నదులకు వంతెనలు కట్టారు. వైదికులు పశుపాలకులు. వీరికి వంతెనలు అడ్డు.

      Delete
    2. అర్ధమయ్యింది. Thank you.

      Delete
  2. బాబా గారూ నేను వేర్వేరు చోట్ల ఇందులోని కొన్ని సంగతులు తెలుసుకున్నాను గానీ ఇంత సమగ్రంగా ఇన్ని రెఫరెన్సులతో ఇంత పెద్ద సమాచారం ఒకచోట చుడడం ఇక్కడే! ఇన్నాళ్ళూ ఇది నాకంట ఎందుకు పడలేదో!
    మీ కృషికి వేవేల దండాలు!
    -- ప్రసాద్ చరసాల

    ReplyDelete