Tuesday, October 17, 2023

బౌద్ధ చిహ్నారాధన - పార్టు 1


.
వైదికదేవతలు విగ్రహాలరూపంలో పూజలందుకొన్నట్లు ఆధారాలు లేవు. BCE మూడో శతాబ్దంలో మొదట చిహ్నాలరూపంలో బౌద్ధమత ఆరాధన సాగి క్రమేపీ మానవరూప ప్రతిమల ఆరాధన వచ్చింది. ఈ దశలలో ధర్మచక్రం, బోధి వృక్షం, స్తూపం, త్రిరత్న, వజ్రాసనం, పద్మం, బుద్ధుని పాదముద్రలు, భిక్షపాత్ర లాంటి వివిధ చిహ్నాల ఆరాధన జరిగేది. ఇవి ఎక్కువగా అమరావతి, సాంచి, భార్హుత్, బోధగయ లాంటి బౌద్ధ నిర్మాణాలలో కనిపిస్తాయి.
.
1. ధర్మచక్రం (dhammacakka): బౌద్ధమతంలో ధర్మచక్రం అనేది బుద్ధునికి, బౌద్ధధర్మానికి సంకేతం. బుద్ధుడు సారనాథ్ లో మొదటిసారిగా చేసిన బోధనను “ధమ్మచక్క పవత్తన సుత్తం” అంటారు. ఈ ప్రసంగంలో బుద్ధుడు జీవితం యొక్క అర్ధం, విముక్తి సాధించే మార్గం గురించి భోధించాడు. ఈ ధర్మచక్రం అనేది శాంతి, జ్ఞానం, విముక్తులకు చిహ్నం. ఈ విలువలను బోధించటం ద్వారా బుద్ధభగవానుడు ప్రపంచంలో Wheel of Law ను తిరిగేలా చేసాడని బౌద్ధుల విశ్వాసం.
BCE 1 వ శతాబ్దానికి చెందిన సాంచి స్తూపశిల్పాలలో పశ్చిమతోరణం పై ఒక స్తంభంమీద 32 ఆకులుకలిగిన ధర్మచక్రానికి అశోకుడు తనపరివారంతో భక్తితో నమస్కరిస్తూ ఉండటం చూడవచ్చు. (See Photo)
BCE రెండవ శతాబ్దానికి చెందిన భార్హుత్ వద్ద లభించిన ధర్మచక్రం అత్యంత ప్రాచీనమైనది. భారతదేశ అధికారిక ముద్రలో, జండాపై ఉండే ధర్మచక్రం బౌద్ధచిహ్నమే.
ఈ భూమిపై ధర్మం అందరికి సమానంగా అందేలా ఎవరైతే ఈ చక్రాన్ని తిప్పుతారో అతనే చక్రవర్తి అని (He who turns the Wheel) బౌద్ధసాహిత్యం చెబుతుంది.
***

2. బోధి వృక్షం: సిద్ధార్థుడు తనదైన దర్శనాన్ని పొందటానికి ముందు అప్పటికి ప్రచారంలో ఉన్న అన్ని దర్శనాలను అధ్యయనం చేసాడు. కొంతకాలం వాటితో నడిచాడు. ఒకనాడు ఆహారాదులు సేవించి బోధి వృక్షం కూర్చుని నలభై ఐదు రోజుల పాటు ధ్యానం చేసి ఒక నూతన దర్శనాన్ని పొందాడు. జ్ఞానోదయం పొందిన సిద్ధార్థుడు బుద్ధునిగా మారాడు.
బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధివృక్షం భౌగోళికంగా బోధగయవద్ద ఉంది. బుద్ధుడు పరినిర్వాణం చెందిన మూడు శతాబ్దాల తరువాత అశోకచక్రవర్తి BCE 242 లో ఆ బోధివృక్షం చుట్టూ రాతి ఆవరణాన్ని ఏర్పరచి దానినొక పవిత్ర దర్శనీయస్థలంగా తీర్చిదిద్దాడు. ఆ వృక్షంనుంచి ఒక కొమ్మను శ్రీలంక అనురాధాపురానికి పంపి అక్కడ నాటింపచేసాడు. నేడు శ్రీలంకలో పూజలందుకొంటున్న బోధి వృక్షం (Bo tree) అశోకుడు పంపించినదే అంటారు.
అశోకుని నాల్గవభార్య “తిస్సరక్క”, తన భర్త తనను పట్టించుకోకుండా ఆ వృక్షం పైనే ఎక్కువ ఆసక్తిపెడుతున్నాడని బోధగయలోని బోధి వృక్షాన్ని నాశనం చేయించిందట. ఈ కథ ద్వారా బుద్ధుడు జ్ఞానోదయం పొందిన అసలైన బోధివృక్షం అశోకునికాలానికే అంతరించిపోయినట్లు అర్ధంచేసుకోవాలి. తిరిగి ఆ ప్రాంతంలో మొలిచిన మరొక బోధివృక్షాన్ని 7 వ శతాబ్దంలో శైవమతానికి చెందిన శశాంకుడనే బెంగాలు రాజు బోధగయమీదుగా వెళుతూ కూకటి వేళ్లతో పెకలించి నాశనం చేసినట్లు హుయాన్ త్సాంగ్ తన రాతలలో తెలిపాడు. [1]
 
1862 Cunningham బోధగయ సందర్శించినపుడు- “ప్రసిద్ధిగాంచిన బోధివృక్షం ఇంకా ఉంది. చాలాభాగం పాడయింది. మూడుకొమ్మలు ఉన్నాయి. ఒకటిమాత్రమే పచ్చని ఆకులతో ఉంది. ముప్పై అడుగుల ఎత్తు ఉంటుంది. అరవై ఏళ్ళక్రితం 1811 లో Hamilton ఈ చెట్టును చూసి వందేళ్ల వయసుంటుందని లెక్కగట్టాడు” - అని రికార్డు చేసాడు.
 
బోధివృక్షం బౌద్ధులకు ఒక ఆరాధనీయ శిల్పంగా మారింది. భర్హౌత్, సాంచి, మథుర, అమరావతి స్తూపాలలో బోధివృక్ష నిర్మాణాలు, దానిని పూజిస్తూ పరివారము కనిపిస్తాయి. బౌద్ధ సాహిత్యంలో ఈ వృక్షాన్ని జీవన ఫలాలను ఇచ్చే kappa rukka (కల్పవృక్షం) గా చెప్పబడింది.

బౌద్ధం ప్రారంభదశలలో బోధివృక్షం బుద్ధుని రూపంగా పూజలందుకొనేది. BCE 1 వ శతాబ్దానికి చెందిన అమరావతి రాతిఫలకలో బోధివృక్షం పూజలందుకొంటున్న దృశ్యం చూడవచ్చు. ఇందులో అందమైన తలపాగలు, బరువైన ఆభరణాలు ధరించిన పురుషులు, చక్కని ఆకులతో రావి చెట్టు, చెట్టు మొదలులో ఒక ఆసనము, దానిముందు ఒక జత పాదముద్రలు కనిపిస్తాయి. ఒక భక్తుడు పాదుకలకు శిరస్సువంచి నమస్కరిస్తుంటాడు. రెండువేల ఏండ్ల క్రితపు తెలుగు ప్రజల ఆహార్యాన్ని, ఆరాధనను పై ఫలక ప్రతిబింబిస్తుంది. (see photo)

బుద్ధుడు బోధివృక్షంకింద జ్ఞానోదయం పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు డిసంబరు 8 న Bodhi Day గా జరుపుకొంటారు. ఇది మతపరమైన శలవు దినం. ఆ రోజున Budu saranai/బుద్ధుని శాంతి నీదే అగుగాక అని ఒకరినొకరు అభివాదాలు తెలుపుకొంటారు.
 
బొల్లోజు బాబా

[1] The Historical Buddha, Hans Wolfgang Schumann, pn 60



















1 comment:

  1. చాలా బావుందండి.

    Historic Buddha by Hans Wolfgang , (If I remember correctly he was German ambassador in India ), is quite an interesting and captivating book to read(/Depth of the subject)

    ReplyDelete