Wednesday, October 11, 2023

మహామాయ దేవి-గజలక్ష్మి

సిద్ధార్థుని తల్లి పేరు మహామాయ. తండ్రి శుద్ధోధనుడు. ఒకనాడు ఈమె ఆరు దంతములు కలిగిన తెల్లని ఏనుగు ఆకాశం నుండి దిగివచ్చి తన గర్భంలోకి కుడివైపునుండి ప్రవేశించినట్లు స్వప్నంలో దర్శించింది. ఈ విషయాన్ని భర్త శుద్ధోదనుడికి తెలియచేసింది. శుద్ధోదనుడు ఆస్థాన పండితులను పిలిచి ఈ స్వప్నం గురించి తెలిపి ఇది దేనికి సంకేతమని అడిగాడు. ఆ పండితులు మహామాయ గర్భంలో గొప్ప అర్హంతుడు జన్మించబోతున్నట్లు చెప్పారు.
పదినెలల తరువాత మహామాయ పుట్టింటికి వెళుతూ దారిమధ్యలో పురిటినొప్పులు రాగా, లుంబిని వనంలో ఒక శాలవృక్షం క్రింద సిద్ధార్ధునికి జన్మనిచ్చి ఏడవరోజున మరణించింది. అది BCE 623వ సంవత్సరం.
 
భారతదేశం నలుమూలలా ఒకప్పుడు విస్తరించిన బౌద్ధమతం- బుద్ధుని జీవిత చరిత్రను, కథలను, సంఘటనలను, ముద్రలను, భంగిమలను- శిల్పాలు, చెక్కుడు ఫలకల రూపంలో కాలంలో నిక్షిప్తం చేసింది. భారతదేశంలో ఏ మూల తవ్వినా నేటికీ అవి ఏదో ఓ రూపంలో దర్శనమిస్తూనే ఉన్నాయి. బుద్ధుని జననం, జ్జానోదయం, మొదటి భోధన, పరినిర్వాణం లాంటి ముఖ్యమైన జీవిత ఘట్టాలను చెక్కుడు ఫలకలుగా చేసి ప్రదర్శించటం ద్వారా బౌద్ధమతం సామాన్య ప్రజలలోకి సమర్ధవంతంగా చేరగలిగింది.
 
పైన చెప్పిన మహామాయ స్వప్న వృత్తాంతాన్ని వివరించే చెక్కుడు ఫలకలు నేడు పదుల సంఖ్యలో లభిస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో దొరికిన ఈ ప్రతిమలలో ఒకే రకమైన వివరాలు, భంగిమలు కలిగి ఉండటం – తొలితరం శిల్పకారులు తమ కళను ఏమేరకు ప్రామాణికరించారనేదానికి అద్దం పడుతుంది. మహామాయ స్వప్న వృత్తాంత చెక్కుడు ఫలకలలో ఈ క్రింది వివరాలు ఉమ్మడిగా కనిపిస్తాయి (Fig.1)

1. మహామాయా దేవి మంచంపై ఎడమవైపుకు తిరిగి పడుకొని ఉంటుంది
2. ఎత్తైన తలగడలపై ఎడమచేతిని ఆన్చి తలను నిలబెట్టి నిద్రిస్తూంటుంది
3. రవికె, తలపాగ, కర్ణాభరణాలు, కంఠాభరణం, గాజులు, పాదాలను కప్పుతూ దేహ వస్త్రం- ఇదీ ఆమె ఆహార్యం
4. గుండ్రని తేజో మండలము పై తొండము క్రిందకు చాపిన ఒక ఏనుగు బొమ్మ ఉంటుంది.
5. మంచానికి నగిషీ చెక్కిన కోళ్ళు, మంచం దిగటానికి వీలుగా వేసినఎత్తు తక్కువ పీట, పరుపు క్రిందనుండి అందంగా ముడతపెట్టి నేలవైపుకు వేలాడుతున్న దుప్పటి- లాంటి వివరాలు 2300 సంవత్సరాల నాటి రాణిగారి శయనాగారపు సౌందర్యాన్ని కళ్ళకు కడతాయి.
6. మంచం వెనుకవైపున సన్నని దీపస్తంభం
7. మంచం పక్కనే చేత కత్తిబళ్ళెం ధరించిన యవని సేవిక. ఆమెకు కూడా తలపాగ, దేహం చుట్టూ చుట్టబడిన వస్త్రం, కర్ణ, కంఠాభరణాలు, గాజులు ఉంటాయి.
మహామాయ స్వప్నోదంతంతో ఇంతవరకూ లభించిన అనేక ఫలకాలలో పై వర్ణనలు చిన్నచిన్న మార్పులతో కనిపిస్తాయి.
***
సిద్ధార్ధునికి జన్మనిచ్చిన వారంలో మహామాయ మరణించింది. బౌద్ధ iconography లో మాయాదేవి రూపం ఆ తరువాతకూడా అనేక స్తూపాలలో పద్మంపై నిలుచుని లేదా కూర్చుని ఇరువైపులా రెండు ఏనుగులు తమ తొండాలతో నీటిని అభిషేకం చేస్తున్నట్లు కనిపిస్తుంది.
ఇలా ఏనుగుల అభిషేకంతో మహామాయాదేవి ప్రతిమా లక్షణాలమూలాలు పాలి సాహిత్యంలో ఇలా ఉన్నాయి

సిద్ధార్థుడు జన్మించినపుడు మహామాయ, సిద్ధార్థుల పై ఆకాశం నుండి రెండు ధారలుగా నీరు వర్షించి వారిని శుభ్రపరచినట్లు ఒక బౌద్ధ జాతక కథలోని ఈ వాక్యాలు akasato dve udaka dhara nikkhamitvaa సూచిస్తున్నాయి.
 
మహామాయ స్వప్నంలో కనిపించిన ఏనుగులు, బుద్ధుని జనన సందర్భంగా రెండుధారల నీటిని ఆమెపై వర్షించటం -ఏనుగుల అభిషేకం చేస్తున్న మహమాయ ప్రతిమకు మూలంగా చెబుతారు. [1].
***

రెండు ఏనుగుల మధ్య పద్మాలను చేతబూనిన మహామాయ ప్రతిమ మొదటగా మధ్య ప్రదేష్ లోని 125-100 BCE కి చెందిన బౌద్ధ స్థూపం Bharhut లో కనిపిస్తుంది. BCE ఒకటో శతాబ్దానికి చెందిన మహామాయాదేవి టెర్రకోట మట్టి ప్రతిమ అమెరికా LACM మ్యూజియంలో కలదు. CE ఐదవ శతాబ్దానికి చెందిన ఒరిస్సా రత్నగిరి బౌద్ధ ఆరామ గుమ్మంపైన రెండు ఏనుగులు అభిషేకం చేస్తున్న మహామాయాదేవి ప్రతిమ ఉన్నది.
 
***
9 వ శతాబ్దం నుంచి ఈ మహామాయా దేవి హిందూ ఐకనోగ్రఫీ లో గజలక్ష్మిగా రూపాంతరం చెందటం గమనించవచ్చు. దీనికి కారణం అదృష్టాన్ని ఇచ్చే మోటిఫ్ గా మహామాయాదేవి శిల్పం అప్పటికే ప్రజలలో చొచ్చుకొని పోయి ఉండటం కావొచ్చు. అందుకనే కొన్ని జైన దేవాలయ ప్రవేశద్వారాలపైన కూడా గజలక్ష్మి ప్రతిమలు కనిపిస్తాయి. ఉదాహరణకు కర్ణాటకలోని ఇంద్రగిరి జైన ఆలయం.

నిజానికి అత్యంత ప్రాచీనమైనదనీ, బౌద్ధం కంటే పూర్వపుదని చెప్పే శ్రీ సూక్తంలో లక్ష్మి దేవి “ శ్రీ”, “ లక్ష్మి” లాంటి పేర్లతో చెప్పబడుతుంది తప్ప "గజలక్ష్మి" అన్న మాట లేదు. ఆ పదం ఆ తరువాతి పరిణామం.

“గజలక్ష్మి” అన్న పదం హిందూ sanskrit iconographic texts లలో ఎక్కడా కనిపించదని ప్రముఖ చరిత్రకారుడు N. K. Bhattasali అంటారు. ఆయన హిందూ గజలక్ష్మి పదానికి బదులుగా కమలాదేవి అనే పదాన్ని ఉపయోగించారు. [2].
 
12 శతాబ్దంనుండి బౌద్ధమతం కనుమరుగైపోయినప్పటికీ బౌద్ధ మోటిఫ్ లు హిందూ గాథల మూలాంశాలుగా కొనసాగాయి. ఎన్నో కథలు, కథనాలు, పాత్రలు, వస్తువులు హిందూమతంలోకి చేరి కలిసి కరిగిపోయాయి. ఈ మహామాయాదేవి గజలక్ష్మిగా మారటం కూడా అలాంటిదే.
 
బొల్లోజు బాబా

[1] pn. 22 Elements of Buddhist Iconography, by AK Coomaraswamy
[2]. pn 107, Studies in Art, Iconography, architecture and archaelogy of India and Bangladesh -Gouriswar Bhattacharya




























No comments:

Post a Comment