Friday, September 30, 2011

అదే గులాబీ.....

చేతిలో రంగుల ఉత్తరం
గులాబీ పువ్వుతో
ఆ అబ్బాయి బస్సుకై
ఎదురుచూస్తున్నాడు

తను గుర్తుకొచ్చింది
ఒకనాటి
పూర్తికాని చుంబన పరిమళం
ఎదంతా పరచుకొంది

ఆ అబ్బాయి కళ్ళు
ఆగిన ప్రతి బస్సునీ
వెతుకుతున్నాయ్.


అతను అచ్చునాకులానే
ఉన్నాడనిపించింది
అవే కళ్ళు ...
అవే చూపులు ...
అదే గులాబీ ...


ఏమో నేనే
ఆ అబ్బాయినేమో!
ఆ అబ్బాయే
నేనేమో!

మరోసారి తడుముకొన్నాను
జెబులోని
గులాబీ రేకల గరగరల్ని


బొల్లోజు బాబా
చేతిలో రంగుల ఉత్తరం
గులాబీ పువ్వుతో
ఆ అబ్బాయి బస్సుకై
ఎదురుచూస్తున్నాడు

తను గుర్తుకొచ్చింది
ఒకనాటి
పూర్తికాని చుంబనపరిమళం
ఎదంతా పరచుకొంది
ఎక్కడుందో! ఏంచేస్తూందో!

ఆ అబ్బాయి కళ్ళు
ఆగిన ప్రతి బస్సునీ
వెతుకుతున్నాయ్.
అతను అచ్చునాకులానే
ఉన్నాడనిపించింది
అవే కళ్ళు
అవే చూపులు
అదే గులాబీ

ఏమో నేనే
ఆ అబ్బాయినేమో!
ఆ అబ్బాయే
నేనేనేమో!

మరోసారి తడుముకొన్నాను
జెబులోని
గులాబీ రేకల గరగరల్ని.

Friday, September 23, 2011

ఎంతదృష్టం......

ఎంతదృష్టం!
కనులున్నాయి
కనులు కనే
కలలున్నాయి
కలలు ఆవిష్కరించే
హాయైన లోకాలున్నాయి
ఎంతదృష్టం!


గాయాల్ని
ఇముడ్చుకొనే
హృదయముంది
హృదయ గాయాల్ని
నయం చేసే
కాలం ఉంది
కాలాన్ని వేటాడే
జీవితం మిగిలే ఉంది
ఎంతదృష్టం!


అన్ని వైఫల్యాలనూ
అక్కున చేర్చుకొనే
ప్రకృతుంది
ప్రకృతి పొరల్లో
ప్రాణాన్ని గింజను చేసి
పాతిపెట్టే మృత్యువుంది
మృత్యు స్పర్శను
నిత్యం స్వప్నించే
కనులున్నాయి......
ఎంతదృష్టం!


లేకపోతేనా
ఇన్ని వైరుధ్యాలున్న లోకాన్ని
దాటటం ఎంత కష్టం!


బొల్లోజు బాబా

Monday, September 12, 2011

కవిత్వం


ఆమె వచ్చి కూర్చొంది
ఇద్దరి మధ్యా నిశ్శబ్దం
రివ్వున వీస్తోంది

ఎక్కడి నుంచైతే నా భవిష్యత్తుని
ప్రారంభించానో ఆ పెదవులు
సన్నగా కంపిస్తున్నాయి

కానీ
ఆ నాటి కరుణ స్పందన కాదిది

ఇరువురి మౌనం
ఆ క్షణాల్ని కోసుకొంటూ సాగుతోంది
నదిని చీల్చుకొంటూ సాగే నావలా

హృదయ వేదికపై
మృత   జ్ఞాపకాల
కరాళ నృత్యం

శకలాల్ని ఒక్కొక్కటీ
ఏరుకొంటున్నాను

జారిపోతున్న చీకటినంతా
కూడదీసుకొని
"ఇక వెళ్తాను" అని లేచింది
"వెళ్ళొస్తాను" అను
"వస్తే....... వెళుతున్నానుగా!" అంది

నా నిస్సహాయ చూపుల్ని
విడిపించుకొని
ఆమె వెళిపోయింది
.............

రెండోసారీ
పునర్జన్మించాల్సినంత
జీవన కాంక్ష
ఎంతకీ కలగట్లేదు

ఇక శలవ్!

బొల్లోజు బాబా


Tuesday, May 17, 2011

ఓడంగి (రవీంద్రుని "క్రిసెంట్ మూన్" కు తెలుగు అనువాదం)

రేవులో కలాసి మధు పడవ లంగరు వేసిఉంది
పడవంతా గోగునార తో నింపారు అనవసరంగా
చాలా కాలంగా అలానే జరుగుతూంది.

అతను తన పడవను నాకు ఇస్తేనా....
దానికి ఓ వంద తెడ్లూ అయిదో ఆరో ఏడో తెరచాపల్నీ బిగిస్తాను
దానిని ఈ పిచ్చి బజారులవైపు నడిపించను
ఇంద్రజాలలోకపు సప్త సముద్రాలు, పదమూడు నదులవైపు నడిపిస్తాను.

అమ్మా! అలా మూల కూర్చొని నాకొరకు బాధపడకు.
రామచంద్రునిలా పద్నాలుగేళ్ళ అనంతరం రావటానికి నేను
అడవులకు పోవటం లేదు కదా!

నువ్వు చెప్పిన కధలో రాకుమారునిలా మారిపోయి
ఇష్టమైన వాటితో నా పడవను నింపుతాను.
నా మిత్రుడు చంటిని కూడా తోడ్కొని వెళతాను.
మేమిద్దరం కలసి ఇంద్రజాల లోకపు సప్త సముద్రాలను,
పదమూడునదులను వేడుకగా చుట్టివస్తాను.

ఉషాకాంతిలో మా ప్రయాణాన్ని మొదలుపెడతాము
మధ్యాహ్నం నీవు కొలనువద్ద స్నానంచేసే వేళకు
మేము మరో ప్రపంచంలో ఉంటాం.
పగడపుదీవులను దాటుకొంటో, మరుగుజ్జు లోకపు
రేవులమీదుగా ముందుకు సాగుతాం.

మేం తిరిగి వచ్చేసరికి చీకటి పడుతుంటూంది.
మా ప్రయాణపు వింతలు విశేషాల్ని నీకు చెపుతాను.

అతను తన పడవను నాకు ఇస్తేనా....
ఇంద్రజాలలోకపు సప్తసముద్రాలను, పదమూడు నదులనూ
వేడుకగా చుట్టివస్తాము.

(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Sailor   గీతం)



Sunday, May 15, 2011

ఒక పాత కామెంటు


వెబ్ లో వెతుకుతూంటే చాన్నాళ్ళ క్రితం ఓ బ్లాగులో చేసిన ఓ కామెంటు కనపడింది.  బాగున్నట్టనిపించి ఇక్కడ పంచుకొంటున్నాను. పూర్ణిమ గారికి ధన్యవాదములతో........


Your absence has gone through me
Like thread through a needle.
Everything I do is stitched with its color.

– W.S. Merwin

పై కవితకు అనుసృజనగా నే  వ్రాసిన కొన్ని రూపాలు

1.నీవియోగం నన్ను చీల్చుకొంటో పోయింది.
పూమాలలోంచి దారంలా
నా హృదయం నిండా నీజ్ఞాపకాల పరిమళాలే.

2. నీవు లేని ఆ క్షణం ఒక దారమై
నా మనసనే సూది గుండా దూసుకుపోయి
నా ప్రతి ఆలోచనకూ నీవర్ణాన్నే అద్దుతోంది.

3.దారానికి సూది వేలాడినట్లుగా
నీ వియోగానికి నా హృదయం వేలాడుతోంది.
ఎంత ప్రయాణించినా నీ వృత్తంలోనే నడకలు.


ఆ పాత పోస్టు లింకు ఇక్కడ

http://pisaller.wordpress.com/2008/12/21/separation/

మాయా లోకం (రవీంద్రుని "క్రిసెంట్ మూన్" కు తెలుగు అనువాదం)


నా రాజభవంతి ఎక్కడుందో ఎవరికైనా తెలిసిపోయిందంటే అది గాలిలో మాయమైపోతుంది తెలుసా!  దానికి వెండి గోడలు బంగారపు పై కప్పు ఉంటాయి.

ఏడు మండువాలున్న ఆ నగరులో రాణీగారుంటారు.  ఆమె మెడలో మణి సప్తరాజ్యాల సంపదంత విలువ.

నా రాజభవంతి ఎక్కడుందో నీకు చెప్పనా అమ్మా! ఎవరికీ చెప్పకూడదు మరి. మన మిద్దెపై మూలనున్న తులసి కోటవద్ద.

ఎవరూ దాటలేని సప్తసాగరాల సుదూర తీరంపై రాకుమారి శయనిస్తూంటుంది.  ఆమెను నేను తప్ప ఈ లోకంలో మరెవ్వరూ కనిపెట్టలేరు.

ఆమె చేతికి గాజులు, చెవులకు ముత్యాల దుద్దులు ఉంటాయి.  ఆమె కురులు నేలను తాకుతూంటాయి.

నా మంత్ర దండంతో తాకితే ఆమె నిదురలేస్తుంది.
ఆమె నవ్వితే నోటివెంట ముత్యాలు రాలుతాయి.

గొప్ప రహస్యం చెపుతాను విను అమ్మా!
మన మిద్దె పై మూలనున్న తులసికోటే ఆమె నివాసం.

ఏటి స్నానానికి నీవు వెళ్ళినపుడు నేను మిద్దె పైకి చేరి గోడల నీడలు కలుసుకొనే ఆ మూలన కూర్చుంటాను.  చిట్టిని మాత్రమే నాతో రానిస్తాను.  ఎందుకంటే కథలోని మంగలి ఎక్కడుంటాడో తనకే తెలుసు.

కథలో మంగలి ఎక్కడుంటాడనేది ఒక రహస్యం.  నీ చెవిలో చెపుతాను విను.
అతనుండేది మన మిద్దె పై మూలనున్న తులసికోటవద్ద. 

(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని Fairy Land   గీతం)

బొల్లోజు బాబా

Monday, May 9, 2011

న్యాయాధిపతి (రవీంద్రుని "క్రిసెంట్ మూన్" కు తెలుగు అనువాదం)


నా చిన్నారి గురించి 
నువ్వెన్ని మాటలు చెప్పినా
నాకు తెలుసు వాని దోషాలు.
ఉత్తమమైనవాడని కాదు 
నేను వాడిని ప్రేమించేది
నా చిన్నారి శిశువు కనుక.

వాని అర్హతలను దోషాలతో తూకం వేసే మీకు
వాడు నాకెంత ప్రియమైన వాడో 
ఎలా తెలుస్తుంది?

వాడిని దండించేటపుడు 
వాడు నాలో భాగమై ఉంటాడు.

వాడికి కంటనీరు తెప్పించేటపుడు
వానితో కలసి నా  హృదయమూ ఏడుస్తుంది.

వాడిని నిందించటానికి కానీ 
దండించటానికి కానీ
నాకే అధికారముంది ఎందుకంటే
ఎవరైతే ప్రేమిస్తారో వారే శిక్షించగలరు.

(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Judge గీతం)

బొల్లోజు బాబా

Saturday, May 7, 2011

సిద్ధాంతి (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)



నేనన్నానూ

"మునిమాపు వేళ నిండుచందమామ ఆ కాదంబరీ చెట్టు
కొమ్మలలో చిక్కుకున్నది.  ఎవరైనా దానిని అందుకోగలరా?" అని

పెద్దన్నయ్య నవ్వి "నాకు తెలిసి అతి పెద్ద తెలివి తక్కువ పిల్లవు నీవు, చెల్లీ!
చంద్రుడు సుదూరంగా ఉంటాడు, ఎవరైనా ఎలా పట్టుకోగలరూ?" అన్నాడు

నేనన్నానూ
"అన్నయ్యా నువ్వెంత అమాయకుడవూ!  మనం ఆడుకొనేపుడు
కిటికీ నుండి చూస్తూ నవ్వే అమ్మ మనకు సుదూరంగా ఉందా? అని

నీవు నిజంగా తెలివి మాలిన దానవే! చందమామ పట్టేంత పెద్దవల
నీవు సంపాదించగలవా? అన్నాడు

నేనన్నానూ
"నీ చేతులతోనే పట్టుకోగలవు" అని

అన్న మళ్ళీ నవ్వి "నీవు నిజంగా వెర్రిదానవే, చందమామ దగ్గరగా వస్తే
నీకు తెలుస్తుంది అదెంత పెద్దదో" అన్నాడు

నేనన్నానూ
"అన్నయ్యా నీకు బడిలో అర్ధంలేని విషయాలేవో చెపుతున్నారు
అమ్మ మనల్ని ముద్దిడ వంగినపుడు ఆమె మోము చాలా పెద్దదిగా ఉంటుందా?

"నీవు తెలివి తక్కువ పిల్లవే" అన్న ఇంకా అంటూనే ఉన్నాడు.



(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Astronomer గీతం)



బొల్లోజు బాబా


Tuesday, April 5, 2011

ఫ్రెంచి పాలనలో యానాం - యానాంలోని ఫ్రెంచి సమాధులు


యానాం లో ఫ్రెంచి పాలనా కాలంలో ఇక్కడ గతించిన వారి సమాధులు ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళుగా నేటికీ నిలిచే ఉన్నాయి. ఫ్రెంచి ఇండియా చరిత్రను గ్రంధస్థం చేసిన  గొదార్,  పాట్రిక్ పిథోఫ్, జె.బి.పి మోర్, గాబ్రియల్ పెస్సీ, ఎస్.పి.సేన్,  జార్జ్ మాల్లిసన్   వంటి చరిత్రకారులు పాండిచేరీ కి సంబంధించిన విషయాలనే ఎక్కువగా పరిగణలోకి తీసుకొని,  యానాన్ని దాదాపు విస్మరించటం జరిగింది. (ఒక్క జె.బి.పి. మోర్ మినహా)


మైకేల్ గొదార్ పాండిచేరీలోని కొన్ని వందల ఫ్రెంచి సమాధి ఫలకాలను డీకోడ్ చేసి ఆయా వ్యక్తుల జీవిత చిత్రణలతో పెద్ద గ్రంధమే రచించాడు.  దీనిలో యానాంలో ఉన్న ఫ్రెంచి సమాధి ఫలకాల వివరాలు పొందుపరచక పోవటం శోచనీయం. అందుచేత కొంతమంది ఫ్రెంచి దేశస్థుల వివరాలు వివిధ రికార్డులలో, ఆర్చైవులలో లభిస్తున్నా వారి సమాధులు యానాంలో ఉన్నాయన్న విషయం  ప్రపంచానికి తెలియకుండా పోయింది.


నేను వ్రాసిన “ఫ్రెంచి పాలనలో యానాం” అనే పుస్తకం లో (ప్రస్తుతం ఒక స్థానిక పత్రికలో సీరియలైజ్ అవుతున్నది, త్వరలో పుస్తకరూపంలోకి తీసుకువస్తాను)  ఒక చాప్టరులో యానాం ఫ్రెంచి సమాధులు లోని వ్యక్తుల వివరాలు పొందుపరచటం జరిగింది.  ఆ చాప్టరు యధాతధంగా .......


భవదీయుడు 


బొల్లోజు బాబా




french cemetaries