Friday, September 23, 2011

ఎంతదృష్టం......

ఎంతదృష్టం!
కనులున్నాయి
కనులు కనే
కలలున్నాయి
కలలు ఆవిష్కరించే
హాయైన లోకాలున్నాయి
ఎంతదృష్టం!


గాయాల్ని
ఇముడ్చుకొనే
హృదయముంది
హృదయ గాయాల్ని
నయం చేసే
కాలం ఉంది
కాలాన్ని వేటాడే
జీవితం మిగిలే ఉంది
ఎంతదృష్టం!


అన్ని వైఫల్యాలనూ
అక్కున చేర్చుకొనే
ప్రకృతుంది
ప్రకృతి పొరల్లో
ప్రాణాన్ని గింజను చేసి
పాతిపెట్టే మృత్యువుంది
మృత్యు స్పర్శను
నిత్యం స్వప్నించే
కనులున్నాయి......
ఎంతదృష్టం!


లేకపోతేనా
ఇన్ని వైరుధ్యాలున్న లోకాన్ని
దాటటం ఎంత కష్టం!


బొల్లోజు బాబా

4 comments:

  1. "ప్రకృతి పొరల్లో
    ప్రాణాన్ని గింజను చేసి
    పాతిపెట్టే మృత్యువుంది"

    ఆహ..హ..హ..!!
    Death is neither the beginning not the ending. Its just the ending of the beginning.

    ReplyDelete
  2. ఇది వేదాంతమా..ఓదార్పా..రెండూ కలసిన పరిణితా. ఏదీ తేల్చుకోలేకుండా వున్నాను. ఈ కవిత చదవడం మాత్రం అదృష్టమే.

    ReplyDelete
  3. "హృదయ గాయాల్ని " అనడానికి బదులు "గాయాల హృదయాన్ని" లేదా 'గాయపడిన హృదయాన్ని' అంటే మీ శిల్పం ... మీరింతవరకూ చెప్పిన క్రమం (ముక్తపద విషయం అనొచ్చేమో) ... తప్పకుండా ఉంటుంది అని నా భావన. పై పంక్తిలో 'హృదయం' గా ముగిసిన విషయం, క్రింది పంక్తిలో హృదయానికి బదులు 'గాయాలై' కూర్చుంది. గమనించగలరు. అందుకే ఇది suggest చేశాను. కలలు కనే కళ్ళు, కలలు ఆవిష్కరించే లోకాలు, (లోకాలు చేసే గాయాలు... అప్రకటిత సత్యం), గాయాల్ని ఇముడ్చుకునే హృదయం, గాయపడిన హృదయాన్ని నయం చేసే కాలం, కాలాన్ని వేటాడే జీవితం, జీవితాన్ని "recycle" చేసే మృత్యువూ... ఈ సీక్వెన్సు బాగా వచ్చింది. అభినందనలు.
    N S మూర్తి.

    ReplyDelete
  4. మూర్తిగారికి
    నమస్తే
    కవితను విశ్లేషించినందుకు ధన్యవాదములు
    హృదయం గాయంగా మారటం అన్న విషయంలో మీ పరిశీలన కరక్టే. ఫ్లో లో తేడా వస్తుంది. సూచించినందుకు కృతజ్ఞతలు.

    మెర్విన్ కవితకు మీ అనువాదం బాగుంది. అదే పోస్టులో ఇచ్చిన లింకు ద్వారా ఆ కవితపై జరిగిన చర్చను చూసారా. వీలైతే చూడండి. ఆశక్తికరంగా ఉంటుంది.

    http://pisaller.wordpress.com/2008/12/21/separation/

    మినర్వాగారికి థాంక్యూ సార్
    జ్యోతిర్మయి గారికి
    మూర్తిగారి కామెంటులో మీకు కొంత సమాధానం దొరకచ్చనుకొంటాను.
    థాంక్యూ

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete