Showing posts with label సాహిత్యం కవిత్వం. Show all posts
Showing posts with label సాహిత్యం కవిత్వం. Show all posts

Sunday, January 8, 2012

జీవితం

1.
ఎవరూ నడవని
దారి కదాని
ఉత్సాహంగా
ముందుకుపోతూంటే
జీవితం నవ్వుతో
“ఓయ్ పిచ్చిమొద్దూ
నేనిక్కడుంటే అటెక్కడికి
పోతున్నావ్? అంది 
వెనుకనుంచి.



2. 
ఒక మధ్యాహ్నం
ఒంటరిగా సాగిపోతూంది
నేనూ ఒంటరిగానే గదిలో
స్వారీ చేసే నిశ్శబ్దంతో

ఒకే ఫాను
ఒకే కుర్చీ
ఒకే టేబులు
ఒకే నేను
నిశ్శబ్దంగా
మధ్యాహ్నంలోకి
ఒలికిపోయాం
ఇక అది మమ్మల్ని మోసుకొంటూ...

సూర్యుని మొహం
ఎర్రగా కందిపోయింది అసూయతో



బొల్లోజు బాబా

Friday, September 23, 2011

ఎంతదృష్టం......

ఎంతదృష్టం!
కనులున్నాయి
కనులు కనే
కలలున్నాయి
కలలు ఆవిష్కరించే
హాయైన లోకాలున్నాయి
ఎంతదృష్టం!


గాయాల్ని
ఇముడ్చుకొనే
హృదయముంది
హృదయ గాయాల్ని
నయం చేసే
కాలం ఉంది
కాలాన్ని వేటాడే
జీవితం మిగిలే ఉంది
ఎంతదృష్టం!


అన్ని వైఫల్యాలనూ
అక్కున చేర్చుకొనే
ప్రకృతుంది
ప్రకృతి పొరల్లో
ప్రాణాన్ని గింజను చేసి
పాతిపెట్టే మృత్యువుంది
మృత్యు స్పర్శను
నిత్యం స్వప్నించే
కనులున్నాయి......
ఎంతదృష్టం!


లేకపోతేనా
ఇన్ని వైరుధ్యాలున్న లోకాన్ని
దాటటం ఎంత కష్టం!


బొల్లోజు బాబా