యానాం - 1848
యానాం చర్చికి ఫాదర్ గా డ్యూపాంట్ వచ్చినప్పుడు, ఈ చిన్న ఫ్రెంచ్ కాలనీ అతనికి కొత్త ప్రపంచంలా అనిపించింది. సముద్రం వైపు సాగే గోదావరి పాయలు, వాటి ఒడ్డున పడవల రాకపోకలు, రేవు దగ్గర సరుకుల బస్తాలు మోసే కూలీలు, పడవల నుంచి సరుకులు కొనే వ్యాపారులు, బజారులో తిరిగే ప్రజలు, తెల్లటి దుస్తుల్లో కార్యాలయాలకు వెళ్లే ఫ్రెంచ్ అధికారులు—వీళ్లందరి కదలికలతో యానాం ఉదయం మొదలయ్యేది. ఫ్రెంచ్ అధికారుల కార్యాలయం దగ్గరికి వెళ్లే వీధిలో తెల్లటి గోడల మీద ఉదయపు వెలుగు పడేది. చర్చిగంట మోగేది. దాని శబ్దం రేవు దాకా వినిపించేది. అయితే ఆ సందడిని గమనిస్తూ ఉండగానే డ్యూపాంట్‌కు యానాంలో ఒక తీవ్రమైన లోటు కనిపించింది. కొంతకాలం క్రితం ఇక్కడి వైద్యుడు పిథోయిస్ మరణించాడు; ఆయన తర్వాత మరొక వైద్యుడు రాలేదు. జనసందడి ఉన్న పట్టణానికి సరైన వైద్య సదుపాయం లేదు. సాధారణ జ్వరం, గాయాలు, చిన్న చిన్న అనారోగ్యాలకు ప్రజలు ఇంటి చిట్కాలనే ఆశ్రయించేవారు. తీవ్రమైన జబ్బు వస్తే దేవుడిపై నమ్మకమే వారికి చివరి ఆధారం.
డ్యూపాంట్ వైద్యుడు కాదు. అయినప్పటికీ వైద్యుడి కొరతను చూసి ఊరుకోలేకపోయాడు. తనకు తెలిసిన కొంతమంది ఫ్రెంచి వైద్యుల వద్ద ప్రాథమిక వైద్యపద్ధతులు నేర్చుకున్నాడు. జ్వరం వచ్చినవారిని ఎలా చూసుకోవాలి, గాయాలను ఎలా శుభ్రం చేయాలి, నీరసించిన రోగికి నీళ్లు ఎలా అందించాలి, ఎలాంటి పరిస్థితుల్లో రోగిని ఒంటరిగా వదలకూడదు వంటి విషయాలను తనకు సాధ్యమైనంత వరకు తెలుసుకున్నాడు. పెద్దగా వైద్య విద్య నేర్చుకున్నవాడు కాకపోయినా, యానాంలో వైద్యుడే లేని పరిస్థితిలో తనకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానాన్ని ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని నిర్ణయించుకున్నాడు.
అతని ఆస్తి అంతా కొన్ని ప్రార్థనా పుస్తకాలు, ఒక చిన్న సిలువ, కొద్దిపాటి బట్టలు, ఇత్తడి మరచెంబు, చిన్న తోలుసంచిలో ఏవో కొన్ని పొడులు, ద్రవాలు అంతే. ఎవరైనా అనారోగ్యంతో తనను ఆశ్రయిస్తే, అది తన మతపరమైన బాధ్యత మాత్రమే కాదని, ఒక మనిషిగా తనకు ఉన్న బాధ్యత కూడా అని భావించి వారికి చేతనైనంత సేవ చేసేవాడు.
జబ్బుపడినవాళ్లు అతని దగ్గరకు రావడం మొదలుపెట్టారు.
ఒకసారి జ్వరం వచ్చిన బాలుడిని చూస్తూ రాత్రంతా అతని దగ్గరే కూర్చున్నాడు. మరోసారి గాయపడిన పడవ కార్మికుడి గాయాన్ని శుభ్రం చేశాడు. ఒక వృద్ధురాలికి మందు ఎలా వాడాలో చెప్పాడు.
ఆ సేవలు పెద్దగా కనిపించేవి కావు.
యానాంలో వైద్యుడు లేని రోజుల్లో అవి చిన్న విషయాలు కూడా కావు. అలా రెండేళ్లు గడిచాయి. 1848 వేసవిలో ఒకరోజు రేవు దగ్గర పనిచేసే ఒక కూలీకి అకస్మాత్తుగా తీవ్రమైన వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఉదయానికి పనికి వెళ్లిన మనిషి సాయంత్రానికి మంచం మీద కదలలేని స్థితిలో పడ్డాడు. అతని శరీరం నుంచి నీరు మొత్తం బయటకు వెళ్లిపోయినట్టుగా కళ్ల గుంటలు లోపలికి పోయాయి, పెదవులు ఎండిపోయాయి, చేతులు చల్లబడిపోయాయి.
రాత్రికి అతని భార్య పరుగెత్తుకుంటూ డ్యూపాంట్ దగ్గరకు వచ్చింది.
“ఫాదర్... మా ఆయనకు ఏదో అయింది.”
అతను వెంటనే వెళ్లి, తనకు తెలిసినంతవరకు రోగిని చూసి, కొద్దికొద్దిగా నీళ్లు అందించాడు.
అతని భార్య భయంతో ఏడుస్తోంది. “ఏమైంది ఫాదర్?”
డ్యూపాంట్ సమాధానం చెప్పలేదు. అతనికీ పూర్తిగా తెలియదు.
మరుసటి ఉదయం ఆ మనిషి చనిపోయాడు.
మరుసటి రోజు మరో ఇంట్లో అదే లక్షణాలు కనిపించాయి. రెండో రోజు మరొక ఇంట్లో. మూడో రోజు ఇంకో ఇంట్లో.
వారం తిరిగే సరికి ఆ వ్యాధికి ఒక పేరు వచ్చింది —కలరా. ఆ పేరు యానాం మీద పడిన పిడుగులా మారింది.
వెంటనే పట్టణం ముఖం మారిపోయింది.
మొదట తలుపులు మూసుకున్నాయి. తర్వాత వీధులు ఖాళీ అయ్యాయి. తర్వాత బజార్లు. పిల్లలను బయటికి రానివ్వలేదు.
రేవులో పని చేసే వాళ్లు పడవల దగ్గరకు వెళ్లడం తగ్గించారు. ఒక ఇంట్లో జబ్బు ఉందని తెలిస్తే పక్కింటివాళ్లు తలుపులు మూసుకునేవారు.
మధ్యాహ్నం వేళల్లో కూడా వీధులు ఖాళీగా కనిపించేవి. రాత్రి మరింత భయంకరంగా ఉండేది. గాలిలో శవాలు కాలిన వాసన ఎక్కడ చూసినా. యానాం మీద ఒక భయంకరమైన నిశ్శబ్దం పరుచుకుంది.
ఆ నిశ్శబ్దాన్ని అప్పుడప్పుడు ఏదో ఒక ఇంటి నుంచి వినిపించే ఏడుపు చీల్చేది. ఒక ఇంట్లో భర్తను కోల్పోయిన భార్య ఏడుస్తుంటే, మరో ఇంట్లో తల్లిని కోల్పోయిన పిల్లలు విలపించేవారు. కొన్నిసార్లు కొన్ని ఇళ్ల నుంచి ఏ శబ్దమూ వినిపించేది కాదు. అదే మరింత భయంకరం. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్లందరినీ కలరా తీసుకుపోయి ఉండవచ్చు. అలాంటి ఇంటి తలుపు తట్టడానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు. లోపల మనుషులు బతికున్నారో లేక శవాలే ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా ధైర్యం సరిపోయేది కాదు.
ఒక ఉదయం డ్యూపాంట్ చర్చి నుంచి బయటికి వచ్చేసరికి అతని చేతిలో ఒక చిన్న సంచి ఉంది. అందులో తనకు అందుబాటులో ఉన్న రెండు శుభ్రమైన బట్టలు, ఒక చిన్న సీసా, నీళ్ల మరచెంబు ఉన్నాయి. చర్చి ముందు నిలబడి ఉన్న వృద్ధుడు అతన్ని చూసి, “ఎక్కడికి ఫాదర్?” అని అడిగాడు. “కురసాంపేటకు,” అన్నాడు డ్యూపాంట్. వృద్ధుడు వెంటనే అతని చేతిని పట్టుకుని, “అక్కడికి వెళ్లకండి. కలరా ఉంది,” అన్నాడు. “తెలుసు,”
“అక్కడికి వెళ్లినవాళ్లు తిరిగి రావడం లేదు.” డ్యూపాంట్ కొద్దిసేపు అతని ముఖంలోకి చూసి, “అందుకే వెళ్లాలి,” అన్నాడు.
“మీరు డాక్టర్ కాదు కదా? మీ దగ్గర మందులు కూడా పెద్దగా లేవు.” డ్యూపాంట్ కాసేపు మౌనంగా ఉండి, “అందరికీ సరిపోకపోవచ్చు. మందు ఇవ్వలేకపోయినా నీళ్లు ఇవ్వగలను. అదీ చేయలేకపోతే కనీసం వాళ్ల పక్కన కూర్చోగలను,” అన్నాడు. వృద్ధుడు ఇంకేమీ మాట్లాడలేదు. డ్యూపాంట్ కురసాంపేట వైపు నడిచాడు.
కురసాంపేటలో మొదటి ఇల్లు. చిన్నదే. ముందర మట్టి అరుగు, పక్కన ఎండిపోయిన కొబ్బరి ఆకుల కుప్ప, తలుపు దగ్గర నీళ్ల కుండ. ఇంటి చుట్టూ వెదురు తడికలతో చేసిన కంచె. ఎవరూ కనిపించలేదు. డ్యూపాంట్ తలుపు తట్టాడు. లోపల నుంచి సమాధానం రాలేదు. మళ్లీ తట్టాడు. కొద్దిసేపటి తర్వాత చాలా బలహీనంగా ఒక మగ గొంతు వినిపించింది. “వెళ్లిపోండి.”
డ్యూపాంట్ తలుపు దగ్గరే నిలబడి, “నేను డ్యూపాంట్,”.
లోపల నుంచి, “నాకు కలరా ఉంది. మీకు అంటుకుంటుంది. వెళ్లిపోండి,” అని సమాధానం వచ్చింది. డ్యూపాంట్ తలుపు తెరవమని బలవంతం చేయలేదు. “అయితే నేను బయటే ఉంటాను. మీకు నీళ్లు కావాలంటే చెప్పండి,” అన్నాడు. కొద్దిసేపటికి తలుపు కొద్దిగా తెరుచుకుంది. లోపల నేలమీద ఒక వృద్ధుడు పడి ఉన్నాడు. అతని శరీరం నీరసంగా ఉంది. ముఖం మీద చెమట లేదు. పెదవులు ఎండిపోయి తెల్లగా మారాయి. కళ్ల గుంటలు లోపలికి వెళ్లిపోయాయి. పక్కనే అతని భార్య గోడకు ఆనుకుని నిలుచుని ఉంది. ఆమె కూడా రెండు రోజులుగా సరిగా తినలేదని స్పష్టంగా కనిపిస్తోంది.
డ్యూపాంట్ ముందుగా రోగి దగ్గర కూర్చుని అతని నాడిని చూడటానికి ప్రయత్నించాడు. అతని చేతి వేళ్లు చల్లగా ఉన్నాయి. “నీళ్లు,” అని ఆ వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు. డ్యూపాంట్ పాత్ర తీసుకుని ఒకేసారి ఎక్కువగా ఇవ్వకుండా కొద్దికొద్దిగా తాగించాడు. వృద్ధుడు రెండు గుక్కలు తాగగానే మళ్లీ వాంతి చేసుకున్నాడు. అతని భార్య భయంతో చేతులు తలపై పెట్టుకుంది. “బతుకుతాడా ఫాదర్,” అంది. డ్యూపాంట్ ఆమెను చూశాడు. అతని దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు.
“ఇప్పుడాయనకు కావాల్సింది నీళ్లు. మీరు భయపడకుండా దగ్గరగా ఉండండి,” అంటూ తన దగ్గరున్న మందు కొద్దిగా ఇచ్చి, తడి బట్టతో రోగి ముఖం తుడిచాడు.
ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసరికి మధ్యాహ్నం దాటిపోయింది. యానాం వీధిలో ఎండ మండుతోంది. సాధారణ రోజుల్లో ఆ సమయంలో రేవు వైపు వెళ్లే ఎద్దుబండ్లు, బస్తాలు మోసే కూలీలు, బజారులో తిరిగే జనంతో వీధి నిండిపోయేది. ఇప్పుడు వీధి కుక్కలు కూడా కనిపించలేదు. మూసిన తలుపులు మాత్రమే.
ఒక ఇంటి ముందు చిన్న దీపం వెలుగుతోంది. పక్కనే ఎవరూ లేరు. మరొక ఇంటి అరుగుపై పిల్లల ఆటబొమ్మలు పడి ఉన్నాయి. వాటిని చూసి డ్యూపాంట్ కాసేపు ఆగాడు. పిల్లలు ఎక్కడ? లోపల ఉన్నారా? అనారోగ్యంతో ఉన్నారా? లేక... ఆ ఆలోచనను పూర్తి చేయకుండా ముందుకు నడిచాడు.
***
ఆ రోజు నుంచి డ్యూపాంట్ తిరిగే దారులు పెరిగాయి.
కురసాంపేట, దరియాలతిప్ప, మాలపేట, మెట్టకుర్రు, కనకాలపేట. మధ్యలో యానాం వీధులు.
ఎక్కడి నుంచి వార్త వస్తే అక్కడికి వెళ్లేవాడు.
“ఫాదర్, మా ఇంట్లో ఇద్దరికి.” అతను వెళ్లేవాడు.
“ఫాదర్, మా అమ్మకు జబ్బు.” అతను వెళ్లేవాడు.
“ఫాదర్, మా ఇంట్లో ఎవరూ లేరు.” అక్కడికీ వెళ్లేవాడు.
అలాంటి ఇళ్లలో అడుగు పెట్టేటప్పుడు డ్యూపాంట్ గుండె వేగంగా కొట్టుకునేది. అతనికీ భయం ఉండేది. దానితోనే బతకడం, ముందుకు సాగడం, ఎదుటివారికి దానిని కనిపించనివ్వకపోవటం నేర్చుకున్నాడు.
***
ఎక్కడైనా ఇంటి తలుపు మూసి ఉంటే తట్టేవాడు.
“ఎవరైనా ఉన్నారా?”
లోపల నుంచి గొంతు వస్తే, “నీళ్లు కావాలా?” అని అడిగేవాడు.
సమాధానం రాకపోతే మళ్లీ తట్టేవాడు. కొన్ని తలుపులు తెరుచుకునేవి. కొన్ని తెరుచుకునేవి కావు.
కొన్ని ఇళ్లలో అతను వెళ్లేసరికి మనిషి చనిపోయి ఉండేవాడు.
అక్కడ కొద్దిసేపు కూర్చునేవాడు.
ప్రార్థన చేసేవాడు.
ఎవరూ లేని ఇంట్లో కూడా.
***
ఒక సాయంత్రం రేవు దగ్గర డ్యూపాంట్ ని చూసిన పడవనడిపే ముత్తయ్య అడిగాడు “ఫాదర్, మీరు రోజూ ఎన్ని ఇళ్లకు వెళ్తున్నారు?”
“తెలియదు, ఎవరు పిలిస్తే అక్కడకు వెళ్తాను.”
“ఎందుకు?”
“నా ప్రాణం నాకు ఎంత విలువో, ఆ ఇంట్లో ఒంటరిగా పడి ఉన్న మనిషి ప్రాణం కూడా అతనికి అంతే విలువ.”
“మీరు కూడా చనిపోవచ్చు.”
డ్యూపాంట్ నవ్వాడు. “అది నాకు తెలియదని అనుకుంటున్నావా?”
“అయితే?”
“ఒక మనిషి చనిపోతాడని తెలిస్తే అతన్ని ఒంటరిగా వదిలేయాలా?”
ముత్తయ్య ఏమీ మాట్లాడలేదు.
***
ఒక ఉదయం డ్యూపాంట్ ఒక ఇంటి ముందు నిలబడ్డాడు. తలుపు మూసి ఉంది. లోపల నుంచి బలహీనమైన దగ్గు వినిపించింది. తలుపు తట్టాడు.
సమాధానం లేదు.
మళ్లీ తట్టాడు.
“నేను డ్యూపాంట్.”
కొద్దిసేపటి తర్వాత లోపల నుంచి ఒక మగ గొంతు.
“వెళ్లిపోండి.”
“ఎందుకు?”
“నాకు ఇష్టం లేదు”
డ్యూపాంట్ కాసేపు మౌనంగా ఉన్నాడు.
“సరే. నేను ఇక్కడే కూర్చుంటాను.”
లోపల నుంచి గొంతు వచ్చింది.
“ఎందుకు?”
“మీరు ఒంటరిగా ఉండకూడదని.”
చాలాసేపు నిశ్శబ్దం.
తర్వాత తలుపు కొద్దిగా తెరుచుకుంది.
లోపల ముప్పై ఏళ్ల మనిషి. అతని శరీరం నీరసంగా ఉంది.
డ్యూపాంట్ లోపలికి వెళ్లాడు. అతనికి కొన్ని నీళ్లు ఇచ్చాడు.
ఆ మనిషి డ్యూపాంట్ ని చూస్తూ అడిగాడు:
“నన్ను తాకడానికి మీకు భయం లేదా?”
డ్యూపాంట్ అతని చెయ్యి పట్టుకున్నాడు.
“భయం ఉంది.”
ఆ మనిషి ఆశ్చర్యంగా చూశాడు. డ్యూపాంట్ మెల్లగా అన్నాడు:
“కానీ మిమ్మల్ని ఒంటరిగా వదిలేయడం నాకు ఇంకా ఎక్కువ భయం.”
ఆ మనిషి కళ్లలో నీళ్లు. అతను మొదటిసారి డ్యూపాంట్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు.
ఇద్దరూ అలాగే చాలాసేపు ఉండిపోయారు.
***
యానాంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
ప్రతి ఉదయం కొత్త మరణాలు. కొన్నిసార్లు పదుల సంఖ్యలో. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ. శవాలను మోసేవాళ్లు లేరు. రోగులను చూసేవాళ్లు లేరు. ఇళ్లలో అన్నం వండేవాళ్లు లేరు. కొన్ని కుటుంబాల్లో ఒకరే మిగిలారు. వాళ్లకూ జబ్బు వస్తే— ఆ ఇంటి కథ ముగిసినట్టే.
డ్యూపాంట్ నిద్ర అనే మాట మరచిపోయాడు
ఉదయం చర్చిలో ప్రార్థన. తరువాత ఎక్కడ అవసరం పడితే అక్కడకు. మందులు అయిపోయాయి. రోగుల వద్ద కూర్చుని వారికి ధైర్యం చెప్పటమో, ప్రార్థన చేయటమో మాత్రమే మిగిలింది.
అతని బట్టలు మురికిగా మారాయి. కొన్ని సార్లు రోగుల ఇళ్లలో వారిపక్కనే పడుకొనేవాడు. మరుసటి ఉదయం లేచి మరలా అదే దినచర్య.
ఒకరోజు రేవు దగ్గర ముత్తయ్య అతన్ని ఆపాడు.
“ఫాదర్.”
“ఏమిటి?”
“ఇక వెళ్లకండి.”
“ఎక్కడికి?”
“ఎక్కడికైనా.”
“ఎందుకు?”
“మీరు అలసిపోయారు.” డ్యూపాంట్ నవ్వాడు.
“అవును అలసిపోయాను.”
“అయితే విశ్రాంతి తీసుకోండి.”
“తీసుకుంటాను.”
“ఎప్పుడు?”
డ్యూపాంట్ రేవు వైపు చూశాడు.
“ఎవరూ నన్ను పిలవని రోజు.”
ముత్తయ్య ఏమీ మాట్లాడలేదు. తన పడవ నుంచి ఒక గుడ్డలో మూటకట్టిన అరటిపళ్ల అత్తలాన్ని తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు.
“కనీసం వీటినైనా తీసుకెళ్లండి.”
***
ఒక రోజు సాయంత్రం కురసాంపేట నుంచి చర్చికి తిరిగి వచ్చిన డ్యూపాంట్ కోసం ఒక ఫ్రెంచ్ అధికారి గుర్రపు బండితో ఎదురుచూస్తున్నాడు. “ఫాదర్, వెంటనే రావాలి. పెద్దొరగారి భార్యకు కలరా లక్షణాల్లా ఉన్నాయి,” అన్నాడు. డ్యూపాంట్ తన చిన్న వైద్య సంచిని తీసుకుని బండెక్కాడు. యానాం పెద్దొర Valère Hugot నివసించే ప్రభుత్వ భవనాన్ని చేరుకున్నాడు.
ఆ ఇంటి సేవకుల్లో ఆందోళన కనిపించింది. ఆయన భార్య మెత్తని పరుపు మంచం మీద పడుకొని ఉంది. డ్యూపాంట్ ఆమెను జాగ్రత్తగా పరిశీలించాడు. వాంతులు, విరేచనాలు ఎక్కువగా లేవు; నీటిని కోల్పోయిన కలరా రోగుల్లో కనిపించే శరీర లక్షణాలూ లేవు. కొన్ని ప్రశ్నలు అడిగి, నాడి చూసిన తర్వాత, “ప్రస్తుతం కనిపిస్తున్న లక్షణాలు కలరాను సూచించడం లేదు. అయినా ఈ సమయంలో జాగ్రత్త తప్పదు. రేపటి వరకు పరిస్థితిని గమనించాలి,” అన్నాడు.
హ్యూగోట్ కొంత ఊపిరి పీల్చుకున్నాడు. డ్యూపాంట్ సేవకురాలికి జాగ్రత్తలు చెప్పాడు. “శుభ్రమైన నీళ్లే ఇవ్వండి. కుండలు, పాత్రలు తరచూ శుభ్రం చేయండి. ఇంటి చుట్టూ మురికి నీరు నిలవనివ్వకండి. తేలికైన, మంచి ఆహారం ఇవ్వండి. గది మూసి ఉంచకుండా గాలి బాగా ఆడేలా చూడండి. వాంతులు, విరేచనాలు పెరిగితే వెంటనే నాకు కబురు పంపండి.”
“యానాంలో డాక్టర్ ఉంటే ఇంత భయపడాల్సిన అవసరం ఉండేది కాదు,” అన్నాడు హ్యూగోట్.
“అవును, అందుకే నాకు తెలిసినంతవరకు నేర్చుకున్నాను. ఈ వ్యాధి విషయంలో మనం జాగ్రత్తగా ఉండటమే ముఖ్యం.” అంటూ హ్యూగోట్ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు.
హ్యూగోట్ బల్ల మీదున్న ఫ్రెంచి అధికారిక పత్రిక Journal Officiel ను చేతిలోకి తీసుకున్నాడు. పాండిచ్చేరి నుంచి వచ్చే ఆ సంచికలో కలరా వ్యాప్తికి సంబంధించిన వార్తలు ఉన్నాయి. ఇద్దరూ కొద్దిసేపు వాటి గురించి మాట్లాడుకున్నారు.
వీడ్కోలు తీసుకునే ముందు డ్యూపాంట్ మళ్లీ హ్యూగోట్ భార్యను చూసి, “ఈ రాత్రి విశ్రాంతి తీసుకోండి. శుభ్రమైన నీళ్లు తాగండి. ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే కబురు పంపండి,” అన్నాడు.
బయటికి వచ్చిన డ్యూపాంట్‌కు సాయంత్రపు చల్లని గాలి తగిలింది. వెనుక పెద్దొర ఇంటి వెలుగు. ముందర కలరా చీకటిలో మునిగిన పేదల ఇళ్లు. ఆ రెండు ప్రపంచాల మధ్య డ్యూపాంట్ ఒక్క క్షణం నిలిచాడు. తర్వాత తన సంచిని భుజాన వేసుకుని చీకటి వైపే నడిచాడు.
***
ఒకరోజు సాయంత్రం డ్యూపాంట్ మాలపేటకు వెళ్లాడు. అక్కడ ఒక ఇంటి ముందు ఐదారుగురు మగవాళ్లు నిలబడి ఉన్నారు. వాళ్ల ముఖాల్లో భయం స్పష్టంగా కనిపించింది.
“లోపల ఎవరు?” అని డ్యూపాంట్ అడిగాడు.
“మా అక్క, ఆమె పిల్లలు,” అని ఒకడు చెప్పాడు.
“మీరెందుకు లోపలికి వెళ్లడం లేదు?” అతను సమాధానం చెప్పలేదు. అతని పక్కన ఉన్న వృద్ధుడు, “లోపలికి వెళ్లినవాళ్లకూ జబ్బు వస్తోంది ఫాదర్. మా ఇంట్లో ఇప్పటికే ఇద్దరు పోయారు,” అన్నాడు.
“భయం ఉండటం తప్పుకాదు, ఆ భయం వల్ల మనం వారిని వదిలేసినట్లు వాళ్ళకు అనిపించకూడదు”
అతను లోపలికి వెళ్లాడు.
ఆ ఇంట్లో ఒక నడివయసు స్త్రీ మంచం మీద పడి ఉంది. చెమటవల్ల ఆమె జుట్టు నుదుటికి అతుక్కుపోయింది. కళ్లను తెరవడానికి కూడా శక్తి లేదు. పక్కనే రెండేళ్ల పిల్లవాడు ఏడుస్తూ ఆమెను పట్టుకుని ఉన్నాడు. మరో మూలలో కొంచెం పెద్ద బాలుడు కూర్చుని ఉన్నాడు. అతని కళ్లలో కన్నీళ్లు లేవు; భయం మాత్రమే ఉంది. డ్యూపాంట్ పిల్లవాడిని ఎత్తుకుని, “ఏం తిన్నావు?” అని అడిగాడు. బాలుడు తల ఊపాడు. “ఏమీ లేదా?” మళ్లీ తల ఊపాడు. డ్యూపాంట్ తన సంచిలో ఉన్న కొద్దిపాటి అటుకులు తీసి వాని చేతిలో పెట్టాడు. పిల్లవాడు తినడం మొదలుపెట్టాడు. ఆ దృశ్యం చూస్తూ తల్లి కళ్లలో నీళ్లు వచ్చాయి. ఆమె మాట్లాడలేకపోయింది. డ్యూపాంట్ ఆమె దగ్గర కూర్చుని నీళ్లు ఇచ్చాడు. ఆ రాత్రి అతను ఆ ఇంటి నుంచి వెళ్లలేదు.
రాత్రి పెరిగేకొద్దీ ఇంటి లోపల వాసన మారింది. చెమట, వాంతులు, తడి బట్టలు, మూసిన గది ఉక్కపోత—అన్నీ కలిసిపోయాయి.
బయట వర్షం పడుతుందేమో అన్నట్టు గాలి బలంగా వీచింది. ఇంటి పైకప్పు తాటాకులు రుద్దుకుంటూ శబ్దం చేశాయి. డ్యూపాంట్ దీపాన్ని దగ్గరకు లాక్కొని రోగి శ్వాసను గమనిస్తూ కూర్చున్నాడు. కొన్నిసార్లు ఆమె శరీరం ఒక్కసారిగా వణికేది. పిల్లవాడు భయంతో తల్లి దగ్గరకు చేరేవాడు. “అమ్మకేమైంది?” అని ఒకసారి అడిగాడు. డ్యూపాంట్ సమాధానం చెప్పడానికి కాసేపు ఆగాడు. “ఇప్పుడు మనం ఆమెను చూసుకుంటున్నాం,” అన్నాడు. ఆ సమాధానం పిల్లవాడికి పూర్తిగా అర్థం కాకపోయినా ఇంకేమీ అడగలేదు.
మరుసటి ఉదయం ఆమె పరిస్థితి కొంత మెరుగుపడింది. డ్యూపాంట్ ఆమె దేహం మీద బట్టలు సరిచేసి, ప్రార్థన చేసి బయటకు వచ్చాడు. బయట నిలబడి ఉన్న కుటుంబ సభ్యుల్లో ఒకరు “ఫాదర్, మీరు భయపడరా?” అడిగాడు. డ్యూపాంట్ అతని వైపు చూసి, “భయపడతాను”.
“అయితే లోపల ఎందుకు కూర్చున్నారు?” డ్యూపాంట్ కొద్దిసేపు అతని వైపు చూసి
“ఎవరో తన దగ్గర ఉన్నారని ఆమె ధైర్యపడాలి” అన్నాడు.
ఆ మాట విని రాత్రంతా బయటే ఉండిపోయిన వాళ్లు మౌనంగా ఉండిపోయారు.
ఆ రోజు నుంచి డ్యూపాంట్ ఒక్కడే తిరగటం కాకుండా అతనితో మరి కొందరు రావడం మొదలుపెట్టారు. మొదట ముత్తయ్య. తర్వాత మాలపేటనుంచి ఇద్దరు యువకులు. డ్యూపాంట్ ముందుగా నడుస్తుంటే ధైర్యం తెచ్చుకొని వెనుక నడిచేవారు. ఒకడు నీళ్లు మోసేవాడు. మరొకడు డ్యూపాంట్ తోలుసంచి పట్టుకొనే వాడు. ఇంకొకడు చనిపోయినవారి కుటుంబాలకు అవసరమైన సహాయం చేసేవాడు. డ్యూపాంట్ వారికి పెద్దగా ఆదేశాలు ఇవ్వలేదు. “ఎవరికి ఏది చేతనైతే అది చేయండి,” అనేవాడు.
అయితే అందరూ అలా ముందుకు రాలేదు. కొందరు అతన్ని చూసి దూరంగా తప్పుకునేవారు. అతను కులభేదం చూడకుండా ప్రతి ఇంటికీ వెళ్తున్నాడన్న విషయం కొందరికి అసహనంగా మారింది. చర్చికి వచ్చే ఒక వ్యక్తి ఒకరోజు డ్యూపాంట్‌ను నిలదీశాడు. “ఫాదర్, మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మీకైనా తెలుసా? కిందికులాల ఇళ్లకు వెళ్లి వచ్చిన వెంటనే పైకులాల ఇళ్లలోకి వెళ్తున్నారు. మీరు చర్చిలో పూజారి. ఇలా ప్రతి కులం ఇంటికీ తిరిగితే మీ పవిత్రత ఏమవుతుంది? మీరు చేస్తున్న పని ఊరి కట్టుబాట్లను చెడగొడుతుంది.” అని నిలదీశాడు.
“జబ్బుపడిన మనిషి ఏ కులం వాడో అడిగి నేను లోపలికి వెళ్లాలా?” అని డ్యూపాంట్ ప్రశ్నించాడు.
“అది మీకు తెలియకపోవచ్చు. కానీ ఊరికి తెలుసు” అన్నాడా వ్యక్తి.
డ్యూపాంట్ మెల్లగా అన్నాడు, “జబ్బుపడిన మనిషిలో నాకు కనిపించేది కులం కాదు... ప్రాణం. ఈ మహమ్మారి తగ్గిన తర్వాత ఎవరు ఎవరితో ఎలా ఉండాలో మీ ఆచారాలు మీ ఇష్టం.”
ఆ వ్యక్తి ఇంకేమీ మాట్లాడలేదు.
***
కలరా యానాంలో మరింత విస్తరించింది.
ఒకరోజు డ్యూపాంట్ నడుస్తున్నప్పుడు మొదటిసారి అతని అడుగులు బరువుగా అనిపించాయి. ఈ మహమ్మారి మొదలైనప్పటి నుంచి అతను చూసిన మరణాలన్నీ అతని మనసులో తిరిగాయి. ఎన్ని ఇళ్లు? ఎన్ని ముఖాలు? ఎంతమంది పిల్లలు? తాను ఎంత మందిని కాపాడాడు? ఎంతమంది తన కళ్ళముందే కళ్లుమూసారు? ఏడాది కాలంగా జరిగిన సంఘటనలన్నీ అతని జ్ఞాపకాల్లో కదలాడాయి.
ఆ సాయంత్రం అతను చర్చి వెనుక చిన్న గదిలో చేతులు కడుక్కున్నాడు. ముఖం మీద నీళ్లు చల్లుకున్నాడు. అద్దంలో తనను తాను చూసుకున్నాడు. కళ్ల కింద నల్లటి వలయాలు. గడ్డం పెరిగింది. పెదవులు ఎండిపోయాయి. అతను కాసేపు కళ్లుమూసుకొన్నాడు. ఒంటరిగా కూర్చున్నాడు.
“నేను ఇంకా ఎంతకాలం ఇలా తిరగగలను?” అనే ప్రశ్న మొదటిసారి అతని మనసులో బలంగా వచ్చింది.
అప్పుడే బయట నుంచి తలుపు తట్టిన శబ్దం వచ్చింది.
“ఫాదర్! … ఫాదర్!”
డ్యూపాంట్ లేచాడు.
తలుపు తెరిచాడు. ముత్తయ్య నిలబడి ఉన్నాడు.
“కనకాలపేటలో ఒక మనిషి పరిస్థితి బాగోలేదట.”
డ్యూపాంట్ అతన్ని కొద్దిసేపు చూశాడు.
తర్వాత తన సంచిని తీసుకున్నాడు.
“వెళ్దాం.”
ముత్తయ్య అతని ముఖం చూశాడు. “మీరు అలసిపోయారు.”
“తెలుసు.”
“పోనీ కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి.”
డ్యూపాంట్ తలుపు మూస్తూ అన్నాడు, “ఆ మనిషికి కూడా అలసట ఉంటుంది. అతనికి ఆగే అవకాశం లేదు.”
ఇద్దరూ చీకటిలోకి నడిచారు.
****
కనకాలపేటలో ఆ ఇల్లు చాలా చిన్నది. తలుపు బయట ఒక మహిళ ఏడుస్తోంది. లోపల ఆమె భర్త నులకమంచంమీద పడుకొని ఉన్నాడు. పక్కనే నాలుగైదేళ్ల పిల్లవాడు తల్లిని పట్టుకుని ఉన్నాడు. ఆ తండ్రి శరీరం నీరసంగా ఉంది. కళ్లను తెరిచి ఉంచడానికి కూడా శక్తి లేదు. ఉదయం నుంచీ స్పృహలో లేడట. ఎగశ్వాస వస్తోంది. డ్యూపాంట్ అతని దగ్గర కూర్చుని సగం తెరచిన పెదవుల మధ్య నీళ్లు పోశాడు. ఒక్క నాలుగు చుక్కలు గొంతులోకి దిగగానే అతను కళ్లు తెరిచాడు.
“ఇంకొంచెం,” అన్నాడు డ్యూపాంట్.
“వద్దు.” బలహీనంగా అన్నాడు.
“కొద్దిగా మాత్రమే.”
రోగి కళ్లను తెరిచి అతన్ని చూశాడు. “నన్ను కాపాడగలరా?”
డ్యూపాంట్ మౌనంగా ఉన్నాడు.
“చెప్పండి.”
“నాకు తెలియదు.”
“అయితే మీరు ఎందుకు వచ్చారు?”
“మీరు ఒంటరిగా ఉండకూడదని,” అన్నాడు డ్యూపాంట్ అతని చేతిని చేతిలోకి తీసుకొని నొక్కుతూ.
రోగి కళ్ళార్పకుండా డ్యూపాంట్ నే చూస్తున్నాడు. అతని కళ్ల కొనల్లో నీళ్లు తిరిగి, చెంపల మీదుగా జారిపోయాయి. కొద్దిసేపటి తర్వాత అతని ఎగశ్వాస కొంచెం సద్దుమణిగింది.
ఆ రాత్రి అతని పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. ఉదయం అతను కొద్దిగా కూర్చోగలిగాడు. భార్య కళ్లలో మొదటిసారి ఆశ కనిపించింది. డ్యూపాంట్ బయటికి వచ్చేసరికి ముత్తయ్య నవ్వుతూ, “ఇవాళ ఒకరిని మనం బతికించాం,” అన్నాడు.
డ్యూపాంట్ నవ్వలేదు. “మనం కాదు. అతనే బతకాలని పోరాడాడు,” అన్నాడు.
***
కొన్నిరోజులకు యానాంలో పరిస్థితి కొంచెం మారింది. మరణాల సంఖ్య తగ్గడం మొదలైంది. కొత్తగా జబ్బుపడుతున్న వారి సంఖ్య కూడా కొంత తగ్గింది. అయినా భయం ఇంకా అలాగే ఉంది. కొందరు తమ ఇళ్ల నుంచి బయటికి రావడానికి ధైర్యం చేయలేదు. కొందరు బంధువులను కోల్పోయి మౌనంగా కూర్చున్నారు. రేవులో మళ్లీ ఒకటి రెండు పడవలు కదలడం మొదలైంది. బజారులో ఒక దుకాణం తలుపు తెరిచింది. ఆ తలుపు తెరుచుకోవడం యానాం ప్రజలకు చిన్న సంఘటన కాదు. అది పట్టణం మళ్లీ బతుకుతున్న సంకేతం.
ఒక సాయంత్రం డ్యూపాంట్ రేవు దగ్గర నిలబడి గోదావరి వైపు చూశాడు. ఎన్నో రోజుల తర్వాత అతనికి ఆ నది శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. మధ్యలో ముత్తయ్య వచ్చి, “ఫాదర్, ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకోండి,” అన్నాడు. డ్యూపాంట్ నవ్వుతూ, “ఇప్పుడు ఎవరు పిలవడం లేదు కదా,” అన్నాడు. ముత్తయ్య, “అదే మీకు విశ్రాంతి,” అన్నాడు.
అప్పుడే దూరంగా ఒక చిన్న బాలుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. “ఫాదర్! ఫాదర్!” అని అరిచాడు. డ్యూపాంట్ అతని వైపు చూశాడు. “మా అమ్మ లేచింది,” అన్నాడు బాలుడు. “నిజమా?” “అవును. మీరే రావాలని అంటోంది.” డ్యూపాంట్ కాసేపు ఆ బాలుడి ముఖాన్ని చూశాడు. తర్వాత తన సంచిని తీసుకున్నాడు.
ముత్తయ్య నవ్వుతూ, “ఇప్పుడే కదా విశ్రాంతి అన్నది,” అన్నాడు.
డ్యూపాంట్ కూడా నవ్వాడు. “అది మరో రోజు.”
బాలుడి వెంట అతను మళ్లీ నడిచాడు.
యానాం వీధుల్లో అప్పటికే చీకటి పడుతోంది. కొన్నిచోట్ల తలుపుల ముందు దీపాలు వెలిగాయి. ఒక ఇంటి నుంచి పిల్లవాడి నవ్వు వినిపించింది. మరో ఇంటి నుంచి ఎవరో పాత్రలు కడుగుతున్న శబ్దం వచ్చింది. దూరంగా రేవులో పడవ కదిలింది. చాలా రోజుల తర్వాత యానాం మళ్లీ తన మామూలు శబ్దాలను వెతుక్కుంటోంది.
డ్యూపాంట్ వెనక్కి తిరిగి పట్టణాన్ని చూశాడు. అతను ఎన్ని ప్రాణాలను కాపాడాడో ఎవరికీ తెలియదు. ఎంతమందిని కాపాడలేకపోయాడో కూడా ఎవరికీ తెలియదు. అతని సేవ గురించి తరువాత ఒక అధికారిక నమోదు మాత్రమే మిగిలింది— “యానాంలో వైద్యులు లేని సమయంలో 1848 కలరా బాధితులకు డ్యూపాంట్ సేవ చేశాడని.” ఆ చిన్న వాక్యం వెనుక అతను నడిచిన మైళ్ల దూరాలు, తెరిచిన తలుపులు, తాకిన జ్వరపీడిత దేహాలు, తుడిచిన కన్నీళ్లు, ఒంటరిగా గడిపిన రాత్రులు, తనలో తానే పోరాడిన సందర్భాలు ఏవీ కనిపించవు.
***
చాలా సంవత్సరాల తర్వాత రేవు దగ్గర ఓ వృద్ధుడు తన మనవడికి ఆ రోజులను చెబుతున్నాడు. అప్పుడు యానాంలో ఎంతమంది చనిపోయారో లెక్కలే లేవు.
“తాతయ్యా, అప్పట్లో అందరినీ ఎవరు కాపాడారు?”
వృద్ధుడు గోదావరి వైపు చూశాడు.
“అందరినీ ఎవరూ కాపాడలేకపోయారు. ఒక చర్చి ఫాదరు ఉండేవాడు.”
“డాక్టరా?”
“కాదు.”
“మరి?”
“కలరాతో బాధపడుతున్న వారి ఇళ్లకు వెళ్లేవాడు.”
ఎందుకు?
“ఎందుకంటే... అక్కడ ఎవరో అతనికోసం ఎదురు చూస్తూ ఉండేవారు.
మరణం ప్రతి ఇంటి తలుపు తట్టిన ఆ రోజుల్లో, తలుపులు మూసుకున్న పట్టణంలో ఒక్కో తలుపు తెరుస్తూ వెళ్ళిన వ్యక్తి అతను.”
వృద్ధుడు కాసేపు మౌనంగా ఉండి అన్నాడు…
“అప్పుడు అతన్ని చర్చి ఫాదరు అనుకున్నాం. ఇప్పుడు గుర్తు చేసుకొంటే... అతను మనిషి. అందరూ వెళ్ళిపోయిన చోట మనిషి పక్కన చివరి వరకూ నిలిచిన చివరి మనిషి”
గోదావరి మీద గాలి వీచింది చల్లగా.
బొల్లోజు బాబా
(ఈ కథ తెలువు ప్రభ పత్రికలో ప్రచురింపబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదములు)
చరిత్ర: 1848లో యానాంలో కలరా వ్యాపించినట్లు 27 అక్టోబర్ 1848న పాండిచ్చేరి Conseil d’Administration సమావేశంలో నమోదైంది. అనంతరం 24 జనవరి, 1849న French Minister of Colonies, రాసిన ఒక అధికారిక లేఖలో, వైద్యులు లేని యానాంలో చర్చి ఫాదర్ డ్యూపాంట్ (Dupont) కలరా బాధితులకు చూపిన నిస్వార్థ సేవ ప్రత్యేకంగా ప్రస్తావించబడింది.
కథలోని పాత్రలు, సంఘటనలు, సంభాషణలు, భావోద్వేగాలు రచయిత కల్పన.

No comments:
Post a Comment