Showing posts with label ఓడంగి. Show all posts
Showing posts with label ఓడంగి. Show all posts

Tuesday, May 17, 2011

ఓడంగి (రవీంద్రుని "క్రిసెంట్ మూన్" కు తెలుగు అనువాదం)

రేవులో కలాసి మధు పడవ లంగరు వేసిఉంది
పడవంతా గోగునార తో నింపారు అనవసరంగా
చాలా కాలంగా అలానే జరుగుతూంది.

అతను తన పడవను నాకు ఇస్తేనా....
దానికి ఓ వంద తెడ్లూ అయిదో ఆరో ఏడో తెరచాపల్నీ బిగిస్తాను
దానిని ఈ పిచ్చి బజారులవైపు నడిపించను
ఇంద్రజాలలోకపు సప్త సముద్రాలు, పదమూడు నదులవైపు నడిపిస్తాను.

అమ్మా! అలా మూల కూర్చొని నాకొరకు బాధపడకు.
రామచంద్రునిలా పద్నాలుగేళ్ళ అనంతరం రావటానికి నేను
అడవులకు పోవటం లేదు కదా!

నువ్వు చెప్పిన కధలో రాకుమారునిలా మారిపోయి
ఇష్టమైన వాటితో నా పడవను నింపుతాను.
నా మిత్రుడు చంటిని కూడా తోడ్కొని వెళతాను.
మేమిద్దరం కలసి ఇంద్రజాల లోకపు సప్త సముద్రాలను,
పదమూడునదులను వేడుకగా చుట్టివస్తాను.

ఉషాకాంతిలో మా ప్రయాణాన్ని మొదలుపెడతాము
మధ్యాహ్నం నీవు కొలనువద్ద స్నానంచేసే వేళకు
మేము మరో ప్రపంచంలో ఉంటాం.
పగడపుదీవులను దాటుకొంటో, మరుగుజ్జు లోకపు
రేవులమీదుగా ముందుకు సాగుతాం.

మేం తిరిగి వచ్చేసరికి చీకటి పడుతుంటూంది.
మా ప్రయాణపు వింతలు విశేషాల్ని నీకు చెపుతాను.

అతను తన పడవను నాకు ఇస్తేనా....
ఇంద్రజాలలోకపు సప్తసముద్రాలను, పదమూడు నదులనూ
వేడుకగా చుట్టివస్తాము.

(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Sailor   గీతం)