Sunday, May 15, 2011

మాయా లోకం (రవీంద్రుని "క్రిసెంట్ మూన్" కు తెలుగు అనువాదం)


నా రాజభవంతి ఎక్కడుందో ఎవరికైనా తెలిసిపోయిందంటే అది గాలిలో మాయమైపోతుంది తెలుసా!  దానికి వెండి గోడలు బంగారపు పై కప్పు ఉంటాయి.

ఏడు మండువాలున్న ఆ నగరులో రాణీగారుంటారు.  ఆమె మెడలో మణి సప్తరాజ్యాల సంపదంత విలువ.

నా రాజభవంతి ఎక్కడుందో నీకు చెప్పనా అమ్మా! ఎవరికీ చెప్పకూడదు మరి. మన మిద్దెపై మూలనున్న తులసి కోటవద్ద.

ఎవరూ దాటలేని సప్తసాగరాల సుదూర తీరంపై రాకుమారి శయనిస్తూంటుంది.  ఆమెను నేను తప్ప ఈ లోకంలో మరెవ్వరూ కనిపెట్టలేరు.

ఆమె చేతికి గాజులు, చెవులకు ముత్యాల దుద్దులు ఉంటాయి.  ఆమె కురులు నేలను తాకుతూంటాయి.

నా మంత్ర దండంతో తాకితే ఆమె నిదురలేస్తుంది.
ఆమె నవ్వితే నోటివెంట ముత్యాలు రాలుతాయి.

గొప్ప రహస్యం చెపుతాను విను అమ్మా!
మన మిద్దె పై మూలనున్న తులసికోటే ఆమె నివాసం.

ఏటి స్నానానికి నీవు వెళ్ళినపుడు నేను మిద్దె పైకి చేరి గోడల నీడలు కలుసుకొనే ఆ మూలన కూర్చుంటాను.  చిట్టిని మాత్రమే నాతో రానిస్తాను.  ఎందుకంటే కథలోని మంగలి ఎక్కడుంటాడో తనకే తెలుసు.

కథలో మంగలి ఎక్కడుంటాడనేది ఒక రహస్యం.  నీ చెవిలో చెపుతాను విను.
అతనుండేది మన మిద్దె పై మూలనున్న తులసికోటవద్ద. 

(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని Fairy Land   గీతం)

బొల్లోజు బాబా

No comments:

Post a Comment