Friday, September 25, 2026

ఆ రోజు పంది చావలేదు (ఫ్రెంచి యానాం కథలు)

ఆ రోజు పంది చావలేదు

(ఫ్రెంచి యానాం కథలు)

బొల్లోజు బాబా

1881 జూలై 14.

గోదావరి మీద తెల్లవారుజామున కమ్ముకున్న పొగమంచు ఇంకా పూర్తిగా చెదరలేదు. యానాం ఒడ్డున కొబ్బరిఆకులపైనుంచి మంచుబిందువులు బొట్లు బొట్లుగా జారుతున్నాయి.  ఎదురుగా కోరంగి దిక్కున మత్స్యకారుల పడవలు వలలు విసురుతుంటే, యానాం రేవులో అప్పటికే చలనం మొదలైంది. చిన్న చిన్న సరుకు పడవలు ఒడ్డుకు చేరుతున్నాయి. వాటిలో కొన్నింటిలో కొబ్బరి కురిడీ, పొగాకు కట్టలు, అరటిపళ్ళ గెలలు, ఇంకొన్నింటిలో వరి బస్తాలు నీలిమందు మూటలు. పడవవాళ్ల అరుపులు, ఎద్దులబళ్ళచక్రాల కీచుశబ్దాలు, గంటలమోతలు కలిసిపోయి పడవల రేవంతా ప్రత్యేకమైన ఉదయసంగీతాన్ని పలుకుతున్నాయి. దూరంగా గోదావరి ముఖద్వారం వైపు ఒక చిన్న ఆవిరి నౌక నల్లటి పొగను వెదజల్లుకుంటూ నెమ్మదిగా యానాం రేవువైపు కదులుతోంది.

యానాం పట్టణం అప్పటికే మేల్కొంది.

మట్టి తెలుగు నేలది. పాలన మాత్రం ఫ్రాన్స్ ది.  శివాలయం గంట, కేథలిక్ చర్చి గంట, ఫ్రెంచ్ ప్రభుత్వ బ్యాండ్‌ ట్రంపెట్—మూడు శబ్దాలూ ఒకే ఉదయంలో కలిసిపోయే ఏకైక పట్టణం యానాం.

ఫ్రెంచి అధికారుల బంగ్లాల ముందు కత్తులు ధరించిన సిపాయిలు కావలి కాస్తున్నారు. వాళ్ల నీలి యూనిఫారాలపై ఇత్తడి బటన్లు ఉదయపు కిరణాల్లో మెరుస్తున్నాయి. నడుముకు బిగించిన తోలు బెల్టు, భుజాన తుపాకి, తలపై ఎర్రటి కెపీ టోపీ—వాళ్లు నిలబడి ఉంటే కంచు విగ్రహాల్లా అనిపిస్తారు.

ఛీఫ్ దె సర్విసెస్ (పెద్దొర) భవనం ముందు ఒక గుర్రపు బగ్గీ ఆగింది.

దానిలో నుంచి దిగాడు యానాం పెద్దొర మొస్యూ సయిస్. తెల్లటి లినెన్ కోటు, నీలి శాష్ (sash), బంగారు ఎపాలెట్లు (epaulette), మెలితిరిగిన మీసాలు. అతని వెనుక లేత నీలిరంగు గౌను ధరించిన అతని భార్య మదామ్ సయిస్. చేతిలో లేసు గొడుగు, తలపై తెల్లటి ఈకల టోపీ. వాళ్లను చూసిన చిన్నపిల్లలు నోరు తెరిచి చూస్తుంటే, పెద్దవాళ్లు తలవంచి నమస్కరించారు.

"Bonjour, Monsieur!" (శుభోదయం సర్) అని ఒక అధికారి సెల్యూట్ చేశాడు.

ఆ ఇరువురూ పోలీసు వందనాన్ని స్వీకరించి తమ భవనంలోకి వెళ్ళారు. 

****

ఫ్రాన్స్‌లో బాస్టిల్ కోటను ప్రజలు కూల్చిన రోజును  ఫ్రెంచి ప్రభుత్వం జాతీయ ఉత్సవంగా (Fete de Nationale) జరుపుతుంది.

1881, జూలై పద్నాలుగు ఉత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఫ్రాన్స్ జాతీయ ఉత్సవం యానాంలో అధికారికంగా జరుపుతున్న తొలి సంవత్సరాల్లో ఇదొకటి. ఊరంతా దానిని "దొరల పండుగ" అని పిలుచుకొంటారు.  ప్రభుత్వం వారం రోజుల ముందే ఏర్పాట్లు ప్రారంభించింది.

ప్రభుత్వ భవనాలకు కొత్త సున్నాలు వేశారు. త్రివర్ణ పతాకాలతో వీధులు అలంకరించారు.

మన్యంవారి మేడ ఎదురుగా ఉన్న విశాలమైన మైదానాన్ని శుభ్రం చేసి ఎర్రమట్టి చల్లారు. తాటి ఆకులతో పందిళ్లు వేశారు. కంచెలు, బెంచీలు అమర్చారు. రంగురంగుల గాజు లాంతర్లు వేలాడదీశారు. రాత్రి బాణాసంచా పేల్చేందుకు ప్రత్యేక వేదిక కట్టారు. ఊరంతా ఒక్కసారిగా జాతరకు సిద్ధమవుతున్నట్టు మారిపోయింది.

మైదానం ఒక మూలలో నూనెరాసిన ‘కర్ర స్తంభం పైకి ఎగబాకే’ పోటీ కొరకు నూనె స్తంభం నిలబెట్టారు. గోనెసంచిలో నిల్చొని చేసే పరుగు పందానికి,  రెండుకాళ్ళు పాదాలవద్ద కట్టుకొని నడిచేపోటీలు, కోడి పందాలు, పందిని చేతులతో వేటాడటం వంటి పోటీలకొరకు అన్ని ఏర్పాట్లు చేసారు.

యానాం మేయర్ బెజవాడ బాపనయ్య వివిధ పోటీలలో నెగ్గబోయే విజేతలకు బహూకరించటానికి  కొత్త వెండి రూపాయిలను గుడ్డ మీద పరిచి లెక్కపెడుతున్నాడు. భోగం మేళ నాయకురాలు జక్కుల రత్నం తన బృందంతో సాధన చేస్తోంది. డోలు, సన్నాయి, తాళాల శబ్దాలు మన్యంజమిందారు మేడ ఎత్తైన గోడలకు తాకి ప్రతిధ్వనిస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ మండుతున్నా, జనం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాటాకులతో కట్టిన పందిళ్ల కింద ముసలాళ్లు చుట్టలు కాలుస్తూ కూర్చున్నారు.

పురుషులందరూ తలపాగాలు ధరించి ఊరంతా తిరుగుతున్నారు.  స్త్రీలు తమ తమ ఆభరణాలు ధరించి మల్లెపూల తురుముకొని ఇంటి అరుగులపై నిలుచుని వేడుకలను చూస్తున్నారు. పిల్లలు ఒక పందిరినుంచి మరొక పందిరికి కేరింతలు కొడుతూ పరుగులెడుతున్నారు.

ఊరంతా ఒకేమాట “ఈయేడు దొరల పండుగ మునుపెన్నడూ లేని విధంగా జరగబోతోందని, చాన్నాళ్ల వరకూ గుర్తుండి పోతుందని.

***

ఒక్కసారిగా ప్రభుత్వ సైనిక బ్యాండ్ ట్రంపెట్ మోగింది.

డోలు శబ్దం ఆగిపోయింది. భోగం మేళం కూడా కాసేపు నిశ్శబ్దమైంది. అందరి చూపులు మైదానానికి కూతవేటు దూరంలో ఉండే ప్రభుత్వ భవనం వైపు తిరిగాయి.

ముందుగా ఇద్దరు ఫ్రెంచి జెండాధారులు కవాతు చేస్తూ నడుస్తున్నారు.  వారి వెనుక నీలి యూనిఫారంలో సైనికులు. తర్వాత అలంకరించిన రెండు తెల్ల గుర్రాలు లాగుతున్న బగ్గీ వచ్చింది.

అందులో పెద్దొర మొస్యూ సయిస్. అతని పక్కనే మాదామ్ సయిస్. వెనుక గుర్రంపై పోలీసు అధికారి కెప్టెన్ బెర్నార్. మరో బగ్గీలో న్యాయమూర్తి మొస్యూ పియెర్ లారెంట్ వస్తున్నారు.

దుబాసీ రంగయ్య గట్టిగా కేక వేశాడు  "పెద్దొరగారికి దారి ఇవ్వండి!"

జనం రెండు వైపులా తొలగిపోయి మధ్యలో దారి ఇచ్చారు.  తెలుగువాళ్లు చేతులు జోడించి నమస్కరిస్తే...ఫ్రెంచివారు టోపీ అంచును కొద్దిగా పైకిలేపుతూ ప్రభుత్వ పెద్దలకు అభివాదం చేశారు. 

పెద్దొర మొస్యూ సయిస్ ఇతర అధికారులతో కలిసి జండా స్తంభం వద్దకు వెళ్ళి ఫ్రెంచి జాతీయపతాకాన్ని ఎగరవేశారు.  పోలీసులు, సైనికులు గౌరవవందనం చేసారు.

అనంతరం పెద్ద దొరగారు ఇతర అధికారులతో కలిసి అప్పటికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదికను చేరి తమ తమ స్థానాల్లో ఆశీనులయ్యారు.  తదుపరి కార్యక్రమం కొనసాగించవలసినదిగా దూబాసీ రంగయ్యను కోరారు.

బ్యాండ్‌ మోగడం ఆగగానే మైదానం మీద ఒక్కసారిగా ఒక విచిత్రమైన నిశ్శబ్దం పరుచుకుంది.

దుబాసీ రంగయ్య తన చేతిలో ఉన్న ఇత్తడి గంటను గట్టిగా మోగించి, "పందిని పట్టుకునే పోటీకి పేర్లు ఇచ్చిన వాళ్లు కంచె లోపలికి రండి!" అని అరిచాడు.

ఆ ఒక్క మాటతో మైదానంలొ కలకలం మొదలైంది. పిల్లలు, పెద్దలు ఎదరకు తోసుకువచ్చారు. ముసలాళ్లు ముందుకు తూలి కర్రల సాయంతో నిలదొక్కుకున్నారు. చెట్లెక్కిన యువకులు ఇంకా పైపై కొమ్మల మీదికి పాకుతున్నారు. మన్యంవారి మేడ పైడాబా మీద జమిందారీ ఆడవాళ్లు ఉత్సుకతతో ముందుకు జరిగారు. మేడ కిటికీల్లోంచి ఫ్రెంచి మేడమ్‌లు బయటకు తొంగిచూశారు.

***

పందిని ఇంకా  బరిలోకి  తీసుకురాలేదు. అది కంచె వెనుక  బలమైన వెదురు గూటిలో ఉంది. లోపల నుంచి అప్పుడప్పుడూ గుర్రుమంటోంది. ఆ శబ్దం విన్నప్పుడల్లా చిన్నపిల్లలు భయపడి వెనక్కి జరిగిపోతున్నారు.

"ఇది పంది కాదు రా... అడవి దెయ్యం."

పక్కనే ఉన్న ముసలాయన నవ్వాడు.

"దీన్నేనా వెంకడు పట్టేది?" అని ఒక కుర్రాడు అడిగాడు.

యానాంలో "వెంకడు" అంటే తెలియని వాళ్లు ఉండరు. అతని ఇంటిపేరు చాలామందికి తెలియదు. అతని వీరత్వం మాత్రం అందరికీ తెలుసు. పందిని పట్టుకోవడంలో అతనికి సాటి ఎవరూ లేరని ఊరంతా చెప్పుకునేది.

చేతిలో ఆయుధం ఉండదు. వల ఉండదు. తాడు ఉండదు. పరిగెత్తుతున్న అడవి పందిని రెండు చేతులతో పట్టుకుని నేలకూల్చే చాకచక్యం అతనికి ఉంది.

అది నేర్చుకున్న విద్య కాదు. తరతరాలుగా వచ్చిన వారసత్వం. అతని తాత కూడా అదే చేసేవాడు. తండ్రి కూడా అదే చేసేవాడు.  ఇప్పుడు వెంకడు.

యానాం దొరల పండుగలో పందిని పట్టుకునే పోటీ అంటే ముందుగా అందరి కళ్లూ వెతికేది అతడినే.

గత ఏడాది పోటీ ఇంకా జనాల జ్ఞాపకాల్లో ఉంది. మైదానం మధ్యలో వదిలిన నల్లటి అడవి పంది ఒక్కసారిగా దూసుకుపోయింది. పదిమంది వెంబడించారు. ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయారు.

వెంకడు మాత్రం దాని వెనకాల గాలి వేగంతో పరిగెత్తాడు. ఒక క్షణంలో దాని రెండు వెనుక కాళ్లను పట్టుకుని గిర్రున తిప్పి నేలకేసి కొట్టాడు. జనం చప్పట్లతో మార్మోగిపోయారు. అంతటితో ఆగలేదు. ఆ పందిని రెండు చేతులతో భుజాల మీదకు ఎత్తుకుని మైదానం చుట్టూ తిరిగాడు. దుమ్ము లేచింది.

జనం ఈలలు వేశారు. భోగం మేళం డోలు ఒక్కసారిగా గర్జించింది.

పెద్దొర తన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది.  పక్కనే నిలబడ్డ దుబాసీని పిలిచి ఏదో చెప్పాడు. కొద్దిసేపటికే కొత్తగా ముద్రించిన ఒక ఫ్రెంచి పది రూపాయిల నోటు వెంకడి చేతిలో పెట్టారు.

జనం ఒక్కసారిగా "Vive la France!"  (ఫ్రాన్స్ వర్ధిల్లాలి) అని అరిచారు. వాళ్లలో చాలామందికి ఆ మాట అర్థం తెలియదు. కానీ దొర సంతోషిస్తాడని తెలుసు. అందుకే అరుస్తారు.

వెంకడికి కూడా అర్థం తెలియదు. అతనికి తెలిసింది ఒక్కటే. ఆ నోటుతో తన ఇంట్లో కొన్నాళ్ళు జరుగుబాటు అవుతుందని. అంతే!

***

ఈ ఏడాది కూడా అదే ఆశతో ఉన్నాడు వెంకడు.

కానీ ఈసారి అతని ఇంట్లో ఒకరు ఆందోళన పడుతున్నారు.

"నాన్నా..." వెంకడు తలెత్తి చూశాడు.  తలుపు దగ్గర నిలబడి ఉంది అతని కూతురు.

ఇరవయ్యేళ్లు కూడా నిండలేదు. పురిటి నెలలు.  పెద్ద కడుపుతో నిలబడటానికే కష్టపడుతోంది.  "ఈసారి పోటీలకు వెళ్లొద్దు నాన్నా" అంది. వెంకడు నవ్వాడు.

"ఎందుకమ్మా?"

"రెండు రోజులుగా సరిగ్గా తినలేదు."

"అది కొత్తేమిటి?"

"మీ కాళ్లలో మునుపటి బలం లేదు."

"పంది చేతిలో మీనాన్న ఓడిపోతాడనుకొంటున్నావా ?" అన్నాడు నవ్వుతూ.

కూతురు నవ్వలేదు.  ఆమె తండ్రి ముఖాన్ని చూస్తోంది.

ఆ ముఖంలో ముడతలు కొత్తవి. గడ్డంలో తెల్ల వెంట్రుకలు కూడా. గత ఏడాది వరకూ కనిపించలేదు. ఆమె మెల్లగా అతని చేతిని పట్టుకుంది.

"ఈసారి గెలవకపోతే పరవాలేదు నాన్నా...

నువ్వు ఇంటికి తిరిగి రావడమే నాకు బహుమతి."

వెంకడు ఆ మాటకు సమాధానం చెప్పలేదు. గోడకు వేలాడుతున్న పాత తలపాగాను తీసుకుని దులిపాడు.  దాన్ని నెమ్మదిగా తలకు చుట్టుకుంటూ బయటికి నడిచాడు.

***

వెంకడు మైదానం అంచున నిలబడి తన పంచె మడతను మరోసారి బిగించాడు.

అతని దగ్గరకు జక్కుల రత్నం వచ్చింది. వెంకడి కళ్లలోకి చూసింది.

"ఈ రోజు నీ ఒళ్లు మునుపటిలా లేదు." అంది మెల్లగా.

వెంకడు నవ్వాడు. "ఒళ్లు కాదు రత్నం... వయసు మారింది."

"అయితే ఎందుకు?"

"ఇంట్లో పిల్ల పురిటికోసం వచ్చింది ఖర్చులకు ఉంటాయని” అన్నాడు నవ్వుతూ.

ఆ మాటకు జక్కుల రత్నం మాట్లాడలేదు.  కళాకారిణిగా ఎన్నో నవ్వులు చూసింది.

కానీ అవసరం ముందు నిలబడిన మనిషి నవ్వు...

అది వేరని ఆమెకు తెలుసు.

***

అదే సమయంలో వేదిక మీద మరో దృశ్యం జరుగుతోంది.

పెద్దొర మొస్యూ సయిస్ పక్కనే జిల్లా న్యాయమూర్తి మొస్యూ పియెర్ లారెంట్, పోలీసు అధికారి కెప్టెన్ బెర్నార్, ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ డెలోర్మ్ కూర్చున్నారు.

వాళ్ల ముందున్న బల్లమీద వెండి గ్లాసులు. వాటిలో లేత ఎరుపు రంగు ద్రాక్షసారాయి. వేదిక ముందు ఒక చిన్న ఇత్తడి తట్టలో బహుమతులు పేర్చారు. ఫ్రెంచి వెండి రూపాయలు, ఒక వెండి కడియం, కొత్త ఫ్రెంచి రూపాయి నోట్లు, పట్టు శాలువాలు.

మాదమ్ సయిస్ తన లేసు చేతి తొడుగులు తీసి పక్కన పెట్టి మైదానం వైపు ఆసక్తిగా చూస్తోంది.

ఆమెకు ఈ పందిపోటీ ఒక విచిత్రమైన వినోదం.

ఫ్రాన్స్‌లో ఇలాంటి ఆటలు లేవు.

యానాంలో మాత్రం వందలమంది ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.

మొస్యూ సయిస్ వెంకడి వైపు చూపిస్తూ అడిగాడు.

"Oui... Venkadou... le champion de l'année dernière."

దుబాసీ రంగయ్య ఆ మాట విని గర్వంగా నవ్వుకున్నాడు.  పక్కనే నిలబడ్డ బెజవాడ బాపనయ్యకు మెల్లగా చెప్పాడు.

"పెద్దొరగారు అంటున్నారు...'గత ఏడాది విజేత వెంకడేనా?' అని."

బాపనయ్య వెంటనే గర్వంగా తల ఊపాడు.

"యానాంలో పందిని పట్టుకోవాలంటే వెంకడే."

***

భోగం మేళం డోలు సన్నాయి మెల్లగా మోగడం మొదలైంది.

అదే సమయంలో ఫ్రెంచి బ్యాండ్ ట్రంపెట్ కూడా

రెండు సంగీతాలు. రెండు నాగరికతలు. రెండు ప్రపంచాలు.

కానీ... ఒకే మైదానం. ఒకే ఎండ. ఒకే జనసమూహం.

ఆ క్షణంలో యానాం అనేది ఫ్రాన్స్ కాదు. భారతదేశమూ కాదు. రెండింటి మధ్య పుట్టిన ఒక కొత్త ప్రపంచం.

రంగయ్య మళ్లీ గంట మోగించాడు.

"సిద్ధమా?"

వెంకడు తల ఊపాడు. వెదురు కంచె తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల నుంచి ముందుగా కనిపించింది... రెండు మెరిసే కోరలు. తర్వాత నల్లటి మూపురం. తర్వాత రక్తంలా ఎర్రగా మెరుస్తున్న రెండు కళ్లు.

వెదురు కంచె తలుపు పూర్తిగా తెరుచుకోగానే, లోపల కట్టేసిన అడవి పంది ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చింది. దాని మెడకు కట్టిన తాడు ఎవరో అప్పటికే కోసేశారు. కొన్ని క్షణాలు అది కదల్లేదు.

మైదానం నడుమ నిలబడి నాలుగు దిక్కులా చూసింది. ఎండలో దాని నల్లటి ఒళ్లు నూనె పూసిన రాతిలా మెరుస్తోంది. మూపురం మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉన్నాయి. చిన్న చిన్న కళ్ళలో భయం, అయోమయం.

తనను చుట్టుముట్టిన వేలాది మనుషులను అది బహుశా మొదటిసారిగా చూస్తోంది.

ఒక్క క్షణం... మైదానం మొత్తం నిశ్శబ్దమైంది. డోలు ఆగిపోయింది. బ్యాండ్ కూడా ఆగింది. పిల్లలు కూడా మాట్లాడడం మానేశారు.

అంతటి జనసమూహంలో వినిపిస్తున్న ఒకే ఒక్క శబ్దం... ఆ పంది ముక్కుతో నేలను వాసన చూస్తూ తీస్తున్న గుర్రుమనే ఊపిరి.

"Allez...!" (విజృంభించండి) అని కెప్టెన్ బెర్నార్ నవ్వుతూ అరిచాడు.

ఫ్రెంచి అధికారుల వేదిక మీద చిన్న నవ్వులు వినిపించాయి. వాళ్లకు ఇది ఒక గ్రామీణ వినోదం.

దుబాసీ రంగయ్య మాత్రం బిగ్గరగా ప్రకటించాడు.

"పోటీ మొదలైంది!"

ఆ ఒక్క మాటతో పదిమంది యువకులు ఒకేసారి పందివైపు దూసుకెళ్లారు.

పంది ఒక్క క్షణం కూడా ఆగలేదు. వెదురు కంచెను ఆనుకొని కుడివైపు తిరిగింది.

ఒక యువకుడు దాని తోక అందుకోవాలని ప్రయత్నించాడు. అది మెరుపులా పక్కకు తప్పుకుంది. మరో యువకుడు ముందు నుంచి అడ్డగించాడు. దాని కోరలు అతని పంచెను చింపేశాయి. జనం నవ్వులతో ఊగిపోయారు.

"పట్టుకో రా!" "అదిగో... అదిగో...!" అంటూ వందల గొంతులు ఒక్కసారిగా కేకలు వేస్తున్నాయి.

వెంకడు మాత్రం ఇంకా కదల్లేదు. రెండు చేతులలోకి మట్టి తీసుకొని రుద్దుకొన్నాడు.

అతని చూపు పంది మీదే ఉంది.

తన తండ్రి నేర్పిన ప్రతి పాఠం ఒక్కొక్కటిగా గుర్తుకొస్తోంది.

"పందిని చూసి పరిగెత్తకు."

"పందిని వెంబడించకు... అది నిన్ను వెంబడించే క్షణం కోసం ఎదురుచూడు."

“పంది అలసిపోయే వరకు ఎదురుచూడు."

అంతలో పంది ఒక్కసారిగా దిశ మార్చింది. సూటిగా వెంకడి వైపే పరిగెత్తింది. జనం అరుపులు. "వెంకడూ!" "జాగ్రత్త!"

డోలు ఒక్కసారిగా గట్టిగా మోగింది. ఆ శబ్దానికి పంది మరింత ఉలిక్కిపడింది. వెంకడు ఒక అడుగు ముందుకు వేశాడు. చివరి క్షణంలో పక్కకు తప్పుకున్నాడు.

అతని కుడిచేయి పంది వెనుక కాలి మీద పడింది.

ఇంకో చేయి తోక దగ్గరకు చేరింది. జనం ఒక్కసారిగా ఊపిరి బిగబట్టారు.

"పట్టేశాడు!" అని ఎవరో అరిచారు.

కానీ...

అది గత సంవత్సరం వెంకడు. ఈ సంవత్సరం కాదు. చేతుల్లో పట్టు మునుపటిలా లేదు. రెండు రోజుల ఆకలి. అరవై ఏళ్లకు దగ్గరపడుతున్న శరీరం.

ఒక్క క్షణం ఆలస్యం.

అంతే.

పంది వెనుక కాళ్లు గాల్లోకి ఎగిరాయి. వాని డెక్కలు వెంకడి మెడ వెనుక భాగాన్ని బలంగా తన్నాయి. ఒక పొడికొమ్మ విరిగినట్టుగా శబ్దం వినిపించింది. వెంకడు గాల్లో తూలి రెండు మూరల దూరంలో పడిపోయాడు.

జనం ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. ఆ నిశ్శబ్దం కూడా ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే పంది ఇంకా పరిగెడుతోంది. ఇప్పుడు అది మనుషులను కాదు... బయటపడే దారిని వెతుకుతోంది. అది ఒక మూలలో ఉన్న వెదురు కంచెను ఢీకొట్టింది. కంచె విరిగిపోయింది.

పంది మైదానం దాటి, దుమ్ము లేపుకుంటూ కొబ్బరి తోటల వైపు అదృశ్యమైంది.

కొన్ని క్షణాలు అందరూ అలాగే నిలబడి చూశారు. తర్వాత ఎవరో నవ్వారు.

"ఈసారి పందే గెలిచింది!" మరికొందరూ నవ్వారు.

కానీ ఆ నవ్వుల్లో భయం కలిసిపోయింది.  ఎందుకంటే...వెంకడు ఇంకా లేవలేదు.

జక్కుల రత్నం పరుగెత్తుకుంటూ వచ్చింది.

"వెంకడూ!" అని అతని భుజం పట్టుకుని కుదిపింది. అతను నెమ్మదిగా కళ్లు తెరిచాడు. నవ్వాలని ప్రయత్నించాడు. పెదవుల మూలలో మాత్రం రక్తం కనిపించింది. మెడ వెనుక నుంచి కారుతున్న రక్తం పంచె అంచుని ఎర్రగా తడుపుతోంది.

"ఏమీ కాలేదు..." అన్నాడు. కానీ తన గొంతే తన మాటను నమ్మలేదు.

వేదిక మీద మొస్యూ సయిస్ లేచి నిలబడ్డాడు.

కొద్దిసేపు వెంకడి వైపు చూశాడు.

తర్వాత పక్కనే నిలబడ్డ ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ డెలోర్మ్ వైపు తిరిగి మెల్లగా అన్నాడు—

"Allez voir." ("వెళ్లి చూడండి.")

డాక్టర్ దిగివచ్చేలోపే... ట్రంపెట్ మళ్లీ మోగింది. ఎందుకంటే... జాతీయోత్సవ కార్యక్రమాలు ఆగకూడదు.

డాక్టర్ డెలోర్మ్ మోకాళ్ల మీద కూర్చుని వెంకడి మెడ వెనుక గాయాన్ని పరిశీలించాడు. తెల్లటి చేతి రుమాలు తీసి రక్తం తుడిచాడు. తన నల్లటి తోలు సంచీలో నుంచి చిన్న సీసా తీసి గాయంపై ఏదో మందు పోశాడు. వెంకడు పళ్లు బిగించి నొప్పిని భరించాడు.

"Ce n'est pas grave..."అన్నాడు డాక్టర్. దుబాసీ రంగయ్య వెంటనే అనువదించాడు.

"ఏమీ ప్రమాదం లేదు. రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందంట." వెంకడు నవ్వాడు. ఆ నవ్వులో నొప్పి ఉంది. డాక్టర్ చెప్పిన మాటలో ఓదార్పు ఉంది. నిజం మాత్రం ఇద్దరికీ తెలియదు. మెడ ఎముకపై పడిన దెబ్బ కళ్లకు కనిపించదు.

మైదానం అవతల డోలు మళ్లీ మొదలైంది.

జక్కుల రత్నం మేళం "మోహన" రాగంలో చిన్న ఆలాపన అందుకుంది. దాని వెంటనే ఫ్రెంచి బ్యాండ్ లా మార్సెయేజ్ స్వరాన్ని జోడించింది. .

తెలుగు డోలు. ఫ్రెంచి ట్రంపెట్. రెండు స్వరాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టుండగా, యానాం గాలి వాటిని కలిపి ఒక కొత్త సంగీతంగా మార్చేసింది.

మదామ్ సయిస్ చిరునవ్వుతో చప్పట్లు కొట్టింది.

జక్కుల రత్నం కళ్లల్లో మాత్రం ఆందోళన. ఆమె చూపు మళ్లీ మళ్లీ వెంకడి వైపే వెళ్తోంది.

***

బెజవాడ బాపనయ్య బహుమతుల బల్ల దగ్గర నిలబడి పెద్దగా ప్రకటించాడు.

"నూనె స్తంభం ఎక్కిన మొదటి బహుమతి... కనకాలపేట సూరన్న!" చప్పట్లు.

"పరుగుపందెం పోటీలో... తాళ్లరేవు చిన్నబ్బాయి!" మరోసారి చప్పట్లు.

"పందిని పట్టుకునే పోటీలో..." అతను కాసేపు ఆగాడు. మైదానం అంతా నిశ్శబ్దమైంది. పంది దొరకలేదు. విజేత లేడు. బాపనయ్య గొంతు సవరించుకున్నాడు. "ఈ ఏడాది... ఎవరూ గెలవలేదు." జనం ఒక్కసారి నిరాశగా నిట్టూర్చారు. అయితే పెద్దొర వేదికపై నుంచి లేచి ఏదో సంకేతం చేశాడు.

దుబాసీ రంగయ్య పరుగెత్తుకుంటూ వచ్చి బాపనయ్య చెవిలో చెప్పాడు.

బాపనయ్య ఆశ్చర్యపోయాడు. తర్వాత గట్టిగా ప్రకటించాడు.

“పెద్ద దొర మొస్యూ సయిస్ గారి ఆదేశం ప్రకారం గత ఏడాది విజేత వెంకడికి ధైర్యసాహసాలకు గుర్తుగా ప్రత్యేక బహుమతి. ఒక వెండి రూపాయి. ఒక నీలి అంచుల శాలువా” అందచేస్తున్నాం.  చప్పట్లు మళ్లీ వినిపించాయి.

వెంకడు లేవడానికి ప్రయత్నించాడు. జక్కుల రత్నం చేయి అందించింది. "నేను నిలబడగలను." అన్నాడు. అతని స్వరం మాత్రం బలహీనంగా ఉంది. వేదిక మీదికి నడవడానికి పది అడుగులు మాత్రమే. కానీ ఆ పది అడుగులు అతనికి పది కోసుల్లా అనిపించాయి.

పెద్దొర మొస్యూ సయిస్ అతని చేతిలో వెండి రూపాయి పెట్టాడు. తన శైలిలో టోపీ కొద్దిగా ఎత్తి అభివాదం చేశాడు.

"Brave homme..."  దుబాసీ వెంటనే అనువదించాడు.- "పెద్దొరగారు అంటున్నారు... 'నువ్వు ధైర్యవంతుడివి' అని." వెంకడు రెండు చేతులతో రూపాయిని తీసుకున్నాడు. ఒక్క క్షణం దాన్ని చూస్తూ నిలబడ్డాడు.

***

సాయంత్రం అవుతోంది. గోదావరి మీద సూర్యుడు ఎర్రటి బంగారు బిళ్లలా కిందికి జారుతున్నాడు. ప్రభుత్వ భవనం ముందు మువ్వన్నెల ఫ్రెంచి జెండా ఇంకా గాలిలో రెపరెపలాడుతోంది.

వేదిక మీద  పెద్దొర మొస్యూ సయిస్ ప్రసంగిస్తున్నాడు. దుబాసీ రంగయ్య ప్రతి వాక్యాన్ని తెలుగులో చెబుతున్నాడు.

"స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు మహా సిద్ధాంతాల మీద నిలబడి ఉంది” అంటూ అతని గొంతు మైదానం అంతా మార్మోగుతోంది. “ఇది ప్రజల ఉత్సవం.  దీనిలో ప్రజలను తప్పని సరిగా భాగస్వామ్యులను చేయండి” అని గవర్నరుగారి ఇచ్చిన ప్రత్యేక ఉత్తర్వులననుసరించి- ఈరోజు వందల సంఖ్యలో వచ్చిన ప్రజలందరికీ అన్నసంతర్పణ, దుస్తుల పంపిణీ జరుగుతుంది.  ఎవ్వరూ వెళిపోకండి అనే ప్రకటన చేస్తున్నాడు మధ్య మధ్యలో.

ఆ మాటలు వింటూ వెంకడు నెమ్మదిగా ఇంటికి చేరుకొంటున్నాడు.

ఒక చేతిలో వెండి రూపాయి. మరో చేతితో మెడ వెనుక గాయాన్ని నొక్కుకుంటూ.

అతని వెనకాల పండుగ ఇంకా కొనసాగుతోంది. అతని ముందున్న దారిలో మాత్రం... నిశ్శబ్దం.

ఇంటి గుమ్మం దగ్గరకు చేరేసరికి వెంకడికి కాళ్లు సహకరించలేదు. అరుగు మీద కూర్చున్నాడు.  లోపల నుంచి అతని కూతురు. నెలలునిండిన కడుపును చేతులతో పట్టుకుని నడుస్తూ వచ్చింది.

"నాన్నా!" ఆమె గొంతు వణికింది.  వెంకడు జేబులో నుంచి వెండి రూపాయి తీసి ఆమె చేతిలో పెట్టాడు. "గెలిచావా?" అడిగింది.

"లేదు."

"అయితే..."

"ఇది...

ఓడిపోయినందుకు బహుమతి."

ఆమెకు ఆ మాట అర్థం కాలేదు.

రూపాయి తిరిగి అతని చేతిలో పెట్టబోయింది.

"నువ్వే ఉంచుకో. బిడ్డ పుడితే... వెండి కడియం చేయించు." అన్నాడు.

కూతురు అతని తల వెనుక గాయం చూసి ఉలిక్కిపడింది.

చెంబులో నీళ్లు తీసుకొచ్చింది. పాత చీర చించి కట్టు కట్టింది. గాయాన్ని కడుగుతుంటే వెంకడు ఒక్కసారిగా నొప్పితో కళ్లు మూసుకున్నాడు.

"డాక్టరు చూశారా?" అడిగింది.

"చూశారు." "ఏమన్నారు?" "ఏమీ కాదు అన్నారు." కొద్దిసేపు మౌనం.

బయట నుంచి డోలు శబ్దం మళ్లీ వినిపించింది. జక్కుల రత్నం మేళం చివరి ప్రదర్శన ఇస్తోంది. వెంకడు నులకమంచం మీద పడుకుని ఆ శబ్దం వింటున్నాడు. ఇంటి పైకప్పు వైపు చూస్తూ ఉండిపోయాడు.

ఆ కప్పు మీద వేలాడుతున్న ఎండిన సొరకాయ బుర్రలు, తాటి చాపలు, పొగతో నల్లబడిన వెదురు దూలాలు అతనికి చిన్ననాటి నుంచి పరిచయమే.

ఆ రాత్రి అవి ఎందుకో కొత్తగా కనిపించాయి.

మన్యంవారి మేడ దగ్గర జాతీయోత్సవం ముగింపు సూచనగా బాణాసంచా మొదలైంది. నీలి వెలుగులు. ఎర్రటి కాంతులు. బంగారు నక్షత్రాలు. యానాం ఆకాశం రంగులతో నిండిపోయింది. అదే వెలుగు వెంకడి ఇంటి గుమ్మం ముందు కూడా పడింది.

ఆ వెలుగులో అతని కూతురు ముఖం మెరిసింది.

వెంకడు ఆమెను చూస్తూ మెల్లగా అన్నాడు— "నీ బిడ్డ... ఏ పని చేసినా చేయనీ... కానీ... ఆకలి కోసం... జనం చప్పట్లు కొట్టే ఆటల్లో మాత్రం దింపకు." అవే వెంకడి చివరి మాటలు.

యానాం చరిత్రలో ఆ రోజు ప్రజల వినోదం కోసం పందిని చంపిన రోజు కాదు.

 

బొల్లోజు బాబా

1881 జూలై 14న యానాంలో జరిగిన ఫెతె దె నేషనల్‌ (Fête de Nationale) వేడుకల వర్ణన 1881 జూలై 28నాటి Journal Officiel de l’Inde Françaiseలో నమోదైంది. పండగ వాతావరణం, తుపాకీ కాల్పులు, “వీవ్ లె ఫ్రాన్స్” నినాదాలు, పూల అలంకరణలు, మన్యంవారి మేడ ఎదురుగా జరిగిన పోటీలు, పెద్దల ప్రసంగాలు, రాత్రి బాణాసంచా, అన్నసంతర్పణ, దుస్తుల పంపిణీ వంటి చారిత్రక వివరాలే ఈ కథకు నేపథ్యం.

వెంకడు, జక్కుల రత్నం, వెంకడికి జరిగిన ప్రమాదం, అతని కుటుంబం, సంభాషణలు, ఇతర వ్యక్తిగత సంఘటనలు  రచయిత కల్పనలు.


(పై కథ సెప్టెంబరు, 2025 సాహిత్య ప్రస్థానం మాస పత్రికలో ప్రచురితమైంది. ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను)









No comments:

Post a Comment