Monday, January 16, 2023
“శంబుక వధ” నాటకం ఒక పరిశీలన
Wednesday, January 11, 2023
థేరీ గాథలు…ఒక అనుసృజన
థెరీగాథల పుస్తకం ఆత్మను ఇముడ్చుకొన్న ఈ ఒక్క వాక్యం చాలు .... థాంక్యూ మేడం గారు ఈ గొప్ప కాన్కకు...
.
ఈ వ్యాసాన్ని సృజనసాహిత్య పేజీలో ప్రచురించినందుకు శ్రీ విల్సన్ రావు గారికి ధన్యవాదములు.
బొల్లోజు బాబా
.
థేరీ గాథలు…ఒక అనుసృజన
.
బొల్లోజు బాబా గారు కవి, సాహిత్య విశ్లేషకులు, వక్తగా అందరికీ పరిచితమే. ఆయన ఎంచుకున్న మరో ప్రత్యేకమైన బాట చారిత్రక రచన. ఇప్పటికే చారిత్రక విభాగంలో ఆయన రెండు గ్రంథాలను రచించిన, తన అభిరుచిని, అధ్యయనాన్ని చాటుకున్నారు.
కవి రక్తంలో ఆవేశం, ఆవేదన కలిసి ప్రవహిస్తుంటాయి. సృజనాత్మకతకు విస్తృతమైన సాహిత్య పరిశీలన అవసరం అన్నది నిర్వివాదాంశం.
బాబా గారు అప్పుడప్పుడు సచ్చిదానంద గారి కవితల అనువాదం తమ ముఖ పుస్తక పేజీలో ప్రకటిస్తుంటారు. మరో భాషలో వచ్చిన సున్నితమైన భావోద్వేగాలు మనసును ఎంతగానో వెంటాడితే తప్ప వాటిని మాతృభాషలోకి అనువాదం చేయలేరనిపిస్తుంది.
ఈ మధ్య బాబా గారి కవితాత్మకు, చారిత్రక నేపథ్యం తోడై 'థేరిగాథలు' కవితా సంకలనం వెలుడింది.
మానవ అస్తిత్వంలో 'తాత్విక ధోరణి' అత్యంత ఉన్నతమైంది. భూమిపైన జీవానుక్రమంలో జరిగిన రూపాంతరాలలో మనిషి పుట్టుకే శ్రేష్టం. ఆలోచనలు, భావనలు అని మనం వేర్వేరుగా వర్గీకరించుకునే నైరూప్యత ఒక అభివ్యక్తిని పొందడం మానవ మేధకు పరాకాష్ట.
అవసరాలు, కాంక్షలు తీరినప్పుడు సుఖం, తీరనప్పుడు దుఃఖం సహజం. చిత్రంగా సుఖదుఃఖాల్లో మానవుడు తనను తాను మరొకరితో పోల్చుకుంటాడు. ఈ పోలిక సుఖం విషయంలో అసూయ, విద్వేషం ప్రతీకారం, హింసగా పరిణమిస్తుంది.
అదే దుఃఖం కలిగితే నిస్పృహ, నిరాశ, బాధ నిండిపోతాయి. అందరూ బాగున్నారు, నాకే కష్టం వచ్చిందనే క్రుంగుబాటు వస్తుంది. ఆ సమయంలో సరైన సాంత్వన లభించినట్లైతే నిత్య జీవన సరళి లోకి పునఃప్రవేశించి, ఉపశమనం వైపు నడక నేర్చుకుంటాడు. పుట్టిన తరువాత నేర్చుకునే నడక ఎంత గొప్పదో ఈ నడక కూడా అంతే ముఖ్యం. ప్రధానం కూడా. ఈ ప్రయాణానికి అవసరమైన ఆర్ద్రతను సర్వ మానవులకు పంచిపెట్టిన సంపూర్ణ బోధకుడే బుద్ధుడు.
తన దుఃఖం కోసం కాక పరుల దుఃఖం పట్ల సహానుభూతి చూపాడాయన. అందుకే దుఃఖ మూల కారణాన్ని అన్వేషించేందుకు సిద్ధపడి, సాధించాడు. కోరికలే విషాదానికి కారణమని తెలుసుకున్న క్షణమే బుద్ధుని కళ్ళకు లోకంలోని సమస్త జీవజాలం సమానంగా కనబడింది. అందుకే, లింగ, వర్గ, వర్ణ భేదాలు లేకుండా అందరితో సంభాషించ గలిగాడు. ధనం, అధికారం సాటి వారిని పీడించేలా మనిషినెంత కఠినంగా మారుస్తాయో గమనించాడు.
బుద్ధ బోధనలకు పీడిత జనమంతా ఆకర్షితులయారు. ముఖ్యంగా స్త్రీలు ప్రభావితమయ్యారు. వారినందరినీ ఆదరించి భిక్షుణులుగా వచ్చేందుకు అనుమతించి, మహిళలను జనజీవన స్రవంతిలో భాగం చేసిన తొలి తత్వవేత్త బుద్ధుడే. ఈ సూత్రాన్నే మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య సమరంలో అవలంబించాడు. అలా బుధ్ధ మార్గంలోకి వచ్చిన బౌద్ధ బిక్షుణులు వ్రాసుకున్న కవితలు 'థేరీ గాథలు'.
'మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా' ద్వారా 'థేరీగాథ' ఛార్లెస్ హాలిసే గారి ఇంగ్లీష్ సంకలనం ఒకప్పుడు వాడ్రేవు చినవీర భద్రుడు గారు సూచించిన తరువాత నేను తెప్పించుకుని చదవడం జరిగింది. ఇది 2016 లో జరిగిన విషయం. పచ్చి గాయాన్ని మోస్తున్న నా హృదయానికి ఈ ప్రతి బౌద్ధ బిక్షుణి కవితా, ఓదార్పునిచ్చి బుజ్జగించాయి.
దుఃఖ గాథలు, ముఖ్యంగా స్త్రీల వ్యక్తిగతమైన దుఃఖ గాథలు ఎక్కడ దొరుకుతాయి? మాతృస్వామ్య వ్యవస్థ తొలగిపోయాక స్త్రీకి భర్త, బిడ్డలు, కుటుంబం అనే మూడు భౌతిక, మానసిక సంకెళ్లు పడ్డాయి. సంఘం చెక్కిన చెరసాలలో ప్రపంచ నాగరికతలన్నిటా ఈ ధోరణి కనబడుతుంది.
సున్నిత హృదయం వలనో, ప్రేమమూర్తి గానో స్త్రీ వాటిని బంధనాలుగా కాకుండా బంధాలుగా చూసింది. భర్త నిరాదరణ, కుటుంబ కలహాలు, బిడ్డల నిర్లక్ష్యం, భర్త లేదా బిడ్డ మరణం ఇవన్నీ స్త్రీ జీవితాన్ని బహిరంతరాలలో కృంగదీసినపుడు మరో విధంగా బతకలేని నిస్సహాయత ఆవరిస్తుంది.
'థేరీగాథ'లు బుద్ధుని కాలంలో సామాజికంగా, వ్యక్తిగతంగా స్త్రీ ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను, విషాదాలను లిఖిత పూర్వకంగా రికార్డు చేశాయని చెప్పవచ్చు. అటువంటి 'థేరీగాథల'ను తెలుగులోకి అనుసృజన చేయటం బొల్లోజు బాబా గారి సున్నితమైన సహానుభూతి గల హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.
బాబా గారు గొప్ప ఆసక్తితో ఎన్నో ప్రామాణిక గ్రంథాలను సేకరించి, వాటిలోంచి మేలైన మణిపూసలను ఎన్నుకుని (తె)వెలుగులోకి తెచ్చారు.
ఎందరో స్త్రీలు సంపన్నులు. అధికారి భార్య ఒకరైతే, వ్యాపారి కూతురు మరొకరు. అన్ని స్థాయిలకు చెందినవారు ఉన్నారిందులో. వీరంతా ఇంటి నుంచి, ఈతిబాధలకు విసిగి తమ పరిమితులను ఛేదించి, కుటుంబాన్ని ఎదిరించి బుధ్ధ భగవానుని అనుసరించారు.
'సామ','ముత్త', 'పున్న'--గా పిలవబడే ఎందరో బౌద్ధ బిక్షుణుల కవితలు బాబా గారు ఇందులో చేర్చారు.
"breakthrough all that is dark with wisdom made full".....
"సంపూర్ణ జ్ఞానంతో ఈ సువిశాల చీకట్లను ఛేదించు "
బౌద్ధ బోధనల సారం ప్రబోధ కవితలుగా కొత్త రూపు దిద్దుకుంది. బాబా గారి సరళమైన భాష వలన మూలంలోని జటిలమైన ఉద్బోధ కూడా పాఠకునికి స్పష్టంగా అర్ధమౌతుంది.
కోరికలను జయించడమే కాదు, తిరిగి వాటివైపు ఆకర్షితులు కాని వారే నిజమైన ముక్తి సాధించగలరు అనే జ్ఞాన బోధ ఒక్కో కవితతో మరింతగా వ్యక్తిగత బాధ్యతను గుర్తుచేస్తుంది.
"From all that holds you back"
"వెనక్కులాగే అన్ని శక్తుల నుండి " అంటూ బాబా గారు మన వాడుకలో,లోతైన విషయాన్ని సూటిగా పరిచయం చేసే ప్రయత్నం చేశారు.
"What does being a woman have to do with it?.......and that one sees what really is!"
'సోమ' అనే మహిళ తీక్షణమైన ఈ ప్రశ్నను, 'సత్యదర్శనం సరిగా ఉన్నపుడు స్త్రీ అయితే ఏంటటా?" అంటారు బాబాగారు.
"నా శ్రవణం స్ఫుటిత పడింది "
"అన్ని దుఃఖాలు,వాటి మూలాలు అర్ధమయ్యాయి "
"పులు కడిగిన ముత్యంలా వారు (పరివ్రాజకులు)దోష రహితులు "
"వారికి దుఃఖ నాశనం తెలుసు"
"నడవాల్సిన మార్గంలో నడక ఆరంభించేసాను నేను "
"ఈ దేహాన్ని అలంకరించి వివాహం అనే బంధంలో అమ్ముకోమంటున్నావా?"
"సముద్రంలో తప్పిపోయిన నావికుడు తీరాన్ని చేరుకొన్నట్లు నీకు కూడా గమ్యం దొరుకుతుందిలే"
పై వాక్యాలను పేరు సైతం చెప్పుకోని బౌద్ధ భిక్షుణిలు పలికారు. అవి మానవ చరిత్రలో తాత్విక చింతనలో పరమోన్నత వాక్యాలయ్యాయి. ఇది మహిళ తన స్వరాన్ని స్పష్టంగా, సమున్నతంగా, వెలిబుచ్చిన బృహత్ సందర్భం.
ఆనాటి మహిళలో తెగువ, వైరాగ్యం, అస్తిత్వ ప్రకటన అన్నీ బుధ్ధుడు తెరచిన ద్వారాల వలన మాత్రమే సాధ్యపడ్డాయి. అవన్నీ నేటికీ ఏ స్త్రీ ఐనా తెలుసుకోదగ్గ సత్యాలు. మానసిక స్థైర్యం ఇచ్చే అమృత గుళికలు.
మూలగ్రంధంలోని తాత్విక పరిమళం రవ్వంతైనా పొల్లుపోకుండా మనకు అందించడంలో బాబాగారు కృతకృత్యులయ్యారు.
ఈ పుస్తకం చదివేది కాదు. మన మానసిక స్థితి వలన ఈ పుస్తకంలోకి మనం ప్రయాణిస్తాం.
అదే మార్గం, ఆ మార్గమే గమ్యం కూడా.
కాళ్ళకూరి శైలజ.
పై వ్యాసంపై మిత్రులు చేసిన ఆత్మీయ వ్యాఖ్యలు. అందరకూ కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
.
నేను ఇటీవల ఇష్టంగా కొని చదివిన పుస్తకం థేరీగాథలు...నిజంగా కవి,చరిత్రాకారుడు బొల్లోజు బాబా గారి కృషికి
అభినందనలు
చెప్పాలి.
ఆ నాటి తల్లుల హృదయాన్ని వాక్యాలుగా మన ముందుంచారు.వేల ఏళ్ల కిందటే స్త్రీ మూర్తుల హృదయ స్పందనలు, వారి కళాత్మక వ్యక్తీకరణ అబ్బురపరుస్తుంది.ఈ పూట మళ్లీ ఒకసారి చదవాలనిపించింది.ఈ పుస్తకం పై కాళ్లకూరి శైలజ మేడంగారు అందించిన వ్యాసం ఆసక్తిగా చదివించింది.ఈ పుస్తకం మనం చదివేది కాదు.మన మానసిక స్థితి అన్న వాక్యాలు అక్షర సత్యాలు..మేడంగారికి ధన్యవాదాలు. @పల్లిపట్టు నాగరాజు
.
తాత్విక కి చింతనకు పరాకాష్టగా భావించే బౌద్ధ భిక్షుణుల కవితల్ని థేరీ గాధలు పేరుతో తెలుగులో అందించిన బొల్లోజు బాబా కవిత్వాన్ని కాళ్లకూరి శైలజ చక్కగా విశ్లేషించారు. @ డాక్టర్ కొత్వాలు అమరేంద్ర
.
బొల్లోజు బాబాగారి అనుసృజన "థేరీగాధలు" మూల గ్రంధం చదివిన కాళ్ళకూరి శైలజ గారు ఆ పుస్తకంలో ప్రయాణించి సమీక్షించడం వల్ల చాలా విషయాలు తెలిశాయి. మనకూ ఓ టికెట్ కొనిచ్చి మనల్నీ ప్రయాణించమని ఆ మార్గాన్ని గమ్యంగా చూపినందుకు ధన్యవాదాలు. జంధ్యాల రఘుబాబు
.
కాళ్ళకూరి శైలజ గారి "థేరీ గాథలు - ఒక అనుసృజన"లో ప్రముఖ రచయిత బొల్లోజు బాబా గారి ఆవేదనను ఆవేశాన్ని సున్నిత భావోద్వేగాల సమాహారాన్ని చాలా చక్కగా వివరించారు.@కరిపే రాజ్ కుమార్
.
థేరీ గాథలు ఒక Monumental Work.బొల్లోజు బాబా గారి వర్క్స్ లో ఇది ప్రధానంగా నిలిచిపోతుంది.మంచి రివ్యూ అందించినందుకు శైలజ గారికి ధన్యవాదాలు. బాబా గారికి ఆలింగన నమస్సులు.@శ్రీనివాస గౌడ్
Sunday, January 8, 2023
Tonight I Can Write - poem by Pablo Neruda
ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను.
“దూరంగా వణుకుతోన్న నీలి నక్షత్రాల ఈ రాత్రి” లాంటివి.
రాత్రి గాలి, ఆకాశంలో సుళ్లుతిరుగుతూ పాడుతూంది.
ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను.
తనను నేను ప్రేమించాను. ఒక్కోసారి తనుకూడా నన్ను.
ఇలాంటి రాత్రులలోనే నేన్తనని నా చేతుల్తో చుట్టేసి
అనంత ఆకాశం క్రింద పదే పదే ముద్దులాడేవాడిని.
ఆమె నన్ను ప్రేమించింది. ఒకోసారి నేను కూడా తనను.
తదేకంగా చూసే ఆమె విప్పారిన కళ్ళను ప్రేమించకుండా ఎలా ఉండగలను.
ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను
నాకామె లేదనీ, నేనామెను కోల్పోయానని తెలుసుకొనటానికి
ఆమెలేనితనం వల్ల మరింత చిక్కబడ్డ రాత్రిని వినటానికి
పచ్చికపై రాలే మంచులా పదాలు హృదయంపై కురుస్తున్నాయి.
నా ప్రేమ ఆమెనెందుకు నిలువరించలేకపోయిందనేది కాదు సమస్య
ఈ తారల రాత్రి ఆమె నాతో లేకపోవటమే.
అంతే! అంతకు మించేమీ లేదు. దూరంగా ఎవరో పాడుతున్నారు.
తనను పోగొట్టుకున్నందుకు నా మనసుకు అశాంతి మిగిలింది. అంతే!
నా చూపు ఆమెను వెతుకుతోంది, తనను నా దరి చేర్చటానికై.
నా హృదయం ఆమెకై చూస్తోంది. ఆమె నాతో లేదు.
అదే రాత్రి అవే చెట్లు అదే వెలుతురు
కానీ మేమిరువురమూ అప్పటిలా లేము.
ఇకపై నేనామెను అంతలా ప్రేమించకపోవచ్చు. నిజంగానే.
కానీ ఆమెను నేను ఎంతెలా ప్రేమించానూ?
నా స్వరం గాలిలో తడుముకొంటోంది, ఆమె చెవుల కోసమై.
మరొకరిది. ఆమె మరొకరిది. నేను తనను ముద్దులు పెట్టుకోకముందు లాగానే
తన స్వరం, తన మేని మిసిమి, తన విప్పారిన కళ్లు అన్నీను.
ఇకపై నేనామెను అంతలా ప్రేమించకపోవొచ్చు. అది నిజం. ఏమో ప్రేమించవచ్చేమో!
ప్రేమ క్షణికమే, మరిచిపోవటం సుదీర్గంగా ఉంటుంది.
ఇలాంటి రాత్రులలో ఒకప్పుడు తను నా కౌగిట ఉన్నందుకేనేమో
తనను కోల్పోయింనందుకు నా హృదయంలో అశాంతి.
బహుశా ఇదే తను నాకు చేసే చివరి గాయం.
ఇవే నేనామెకు వ్రాసే ఆఖరి వాక్యాలు.
(* పాబ్లో నెరూడా (Pablo Neruda) ‘పుయేదో ఎస్క్రిబీర్‘ అన్న స్పానిష్ కవిత ఆంగ్లానువాదం ‘Tonight I can write‘ ఆధారంగా).
Monday, January 2, 2023
అయ్యప్ప కల్ట్ -చారిత్రిక విశ్లేషణ
.
దక్షిణభారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన ఒక ఆరాధన విధానం అయ్యప్ప స్వామి. అయ్యప్పస్వామికి మణికంఠ, శబరినాథ, ధర్మశాస్త అనే వివిధ పేర్లు కలవు. దక్షిణభారత దేశ ప్రతిమలలో ఈయన పులిని స్వారీచేస్తున్నట్లు, శ్రీలంకదేశపు ప్రతిమలలో తెల్లని ఏనుగుపై ఊరేగుతున్నట్లు ఉంటుంది.
.
జన్మవృత్తాంతం
క్షీరసాగరమథనం అనంతరం దేవతలకు రాక్షసులకు విష్ణుమూర్తి అమృతం పంచేందుకు మోహినిగా అవతారం ధరించాడు. ఈ మోహినీ అవతారాన్ని చూసి ఆకర్షింపబడిన శివుడు, ఆమెను కూడగా శివకేశవుల అంశతో అయ్యప్ప జన్మించాడు. అందుకు ఈయనకు హరిహర సుతుడు అనే పేరువచ్చింది. అదేసమయంలో పందళదేశ రాజు అయిన రాజశేఖరుడు వేటకు వచ్చి ఈ బాల అయ్యప్పను/హరిహరసుతుని చూసి తనకు సంతానం లేనందుకు భగవంతుడు ఇలా అనుగ్రహించాడని భావించి, ఆ శిశువును ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకోసాగాడు. మహారాజు ఈ అయ్యప్పకు రాజ్యపాలన అప్పగించాలని భావించాడు. ఒక ఆలయాన్ని నిర్మించి ఇమ్మని అయ్యప్ప తండ్రిని కోరగా నిర్మించిన ఆలయమే శబరిమల ఆలయం. అక్కడ అయ్యప్ప స్వామి స్థిరనివాసం ఏర్పరుచుకొని భక్తుల పూజలందుకొంటున్నాడని పురాణకథనం.
.
ఇతర కథనాలు
1. అయ్యప్పస్వామి ఒక ఫూజారి కుమారుడు. ఇతను తన తండ్రిని చంపిన ఉదయానన్ అనే క్రూరమైన బందిపోటుదొంగను సంహరించి, అతను బంధీగా చేసిన పాండ్యరాకుమార్తెను విడిపించినట్లు ఒక కథనం కలదు.
2. అయ్యనారే అయ్యప్ప: తమిళనాడులో అయ్యనార్ గ్రామాన్ని రక్షించే అనార్య దేవుడు. శూద్రులదైవం. అయ్యనార్ విగ్రహానికి అయ్యప్ప విగ్రహానికి పోలికలు ఉండటాన్ని బట్టి అయ్యప్ప స్వామి కి అయ్యనార్ కు చారిత్రిక సంబంధాలు ఉండవచ్చునని, గ్రామీణ శూద్ర దైవం కాలక్రమేణ హైందవీకరణ చెంది ఉండవచ్చునని ప్రముఖ చరిత్రకారుడు T.A. Gopinatha Rao అభిప్రాయపడ్డారు.
3. Sreedhara Menon అనే చరిత్రకారుడు – అయ్యప్ప ఆలయానికి బ్రాహ్మణిజంతో కంటే బుద్ధిజంతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయని ప్రతిపాదించాడు. అయ్యప్ప భక్తులు దీక్షలో ఉన్నప్పుడు శాఖాహారభోజనం, మాల దుస్తులు పవిత్రంగా ధరించటం, నేలపై శయనించటం, భిక్ష ద్వారా ఆహారం స్వీకరించటం, బ్రహ్మచర్యం పాటించటం, దురలవాట్లు మానుకోవటం- లాంటి బౌద్ధసన్యాసులు నిత్యం పాటించే నియమాలు ఆచరిస్తారు.
బౌద్ధ రచనల్లో సాహ్య పర్వతశ్రేణులపై “నీలకంఠ అవలోకేశ్వర” ఆలయం నిర్మించినట్లు ఉటంకింపులు కలవు. నీలకంఠ అవలోకేశ్వరుని విగ్రహం అయ్యప్పస్వామి విగ్రహంతో సారూప్యతలు కలిగి ఉంటుంది కనుక అయ్యప్ప కల్ట్ బుద్ధిజానికి దగ్గర అని శ్రీథర మీనన్ అభిప్రాయపడ్డారు.
4. అరేబియానుంచి వచ్చిన ఒక ముస్లిమ్ యోగి అయిన వావర్ తో అయ్యప్పస్వామి ఆథ్యాత్మిక సంబంధాలు కలిగి ఉన్నాడని మరొక జనశృతి కలదు. అయ్యప్పస్వామి వావర్ యోగి స్నేహితులుగా ఉండేవారట. శబరిమలై ప్రధాన ఆలయం పక్కనే వావర్ స్వామికి చిన్న గుడి ఉంటుంది. ఇక్కడ ఒక ముస్లిమ్ పూజారి నేటికీ పూజలు నిర్వహిస్తుంటాడు. అయ్యప్పస్వామే స్వయంగా పందళదేశరాజుకు కలలో కనిపించి వావర్ స్వామికి మసీదు నిర్మించమని ఆదేశించాడట. అలా నిర్మించిన వావర్ స్వామి మసీదు శబరిమలైకు వెళ్ళే దారిలో ఉంటుంది. శబరిమలై భక్తులు దీనిని కూడా తమ యాత్రలో భాగంగా దర్శించుకొంటారు.
ఈ వావర్ కు సంబంధించిన చారిత్రిక వివరాలేవీ లభించవు. బహుశా ముస్లిముల ప్రాబల్యాన్ని అంగీకరించే ప్రక్రియలో హిందూమతం చేసుకొన్న ఒక సర్దుబాటుగా ఈ వావర్-అయ్యప్ప ఉదంతాన్ని చూడాలని Eliza Kent అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు.
5. కేరళ ఆళపుర జిల్లాలో అర్థంగల్ అనే ఊరిలో సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఉంది. ఇది 16 శతాబ్దంలో నిర్మించబడింది. 1584 లో దీనికి Fr Jacomo Fenicio చర్చిఫాదర్ గా ఉండేవారు. ఇతని కాలంలోనే శబరిమలైను ఈ అర్థంగళ్ చర్చి ని కలిపే ఐతిహ్యం రూపుదిద్దుకొంది.
Fr Jacomo Fenicio తన ప్రేమపూర్వక మాటలతో, స్వస్థపరచే మహిమలతో స్థానిక ప్రజల ప్రేమను అభిమానాన్ని సంపాదించుకొన్నాడు. ఇతనికి హిందూ సంస్కృతి, ఆచారాలపట్ల అపారమైన గౌరవం ఉండేదట. ఆ సంగతులతో కూడిన ఒక పుస్తకాన్ని కూడా లాటిన్ భాషలో రచించాడు.
అయ్యప్పస్వామికి ఈ చర్చిఫాదరు స్నేహితుడు కావటంవలనే ఇన్ని మహిమలు చూపించగలుగుతున్నాడని ప్రజలు విశ్వసించారు. క్రమేపీ శబరిమలై దర్శించిన భక్తులు ఈ చర్చిని కూడా దర్శించుకోసాగారు. ఈ ప్రక్రియ ఈనాటికీ కొనసాగటం విశేషం.
***
ప్రధాన స్రవంతిలో మనుగడలో ఉండే భావజాలం ఎప్పటికప్పుడు ఎక్కువమంది ప్రజలు దేన్నైతే విశ్వసిస్తున్నారో దాన్ని own/appropriate చేసుకోవటం జరుగుతుంది. చారిత్రికంగా అయ్యప్ప కల్ట్ లో అదే జరిగింది అని అర్ధమౌతుంది.
నిజానికి విష్ణువుకి, శివుడికి పుట్టిన స్వామిగా అయ్యప్పను సృష్టించటానికి కారణం – అప్పట్లో లక్షలాది ప్రాణాలను తీసిన శైవ వైష్ణవ ఘర్షణలను సర్దుపరచటానికే అనే వాదన కూడా కలదు. మోహిని-శివుని వృత్తంతం ఉన్న భాగవత పురాణంలో అయ్యప్ప స్వామి జన్మించిన ప్రస్తావనలు లేవు కనుక ఈ హరిహర సుతుడు అన్న భావన ఆ తరువాత కల్పించినదని కొందరి అభిప్రాయం.
మళయాల జానపద గీతాలలో అయ్యప్పస్వామి కొండలలో తిరిగే ఒక యోధుడు. విల్లంబులను ధరించి, దారిదోపిడి దొంగలనుంచి బాటసారులను, వ్యాపారులని కాపాడే రక్షకుడు
అయ్యప్పస్వామి కల్ట్ వివిధ దశలలో వివిధ ఆరాధనా విధానాలను ఇముడ్చుకొన్న తీరు విస్మయపరుస్తుంది. ఒక ఆదివాసీ దేవుడిగా, ఒక శూద్రదేవుడిగా, హరిహరుడనే పేరుతో ఒక పురాణ పురుషుడిగా భిన్నకాలాలలో కనిపిస్తుంది. ఇంకా భిన్న పాలనలలో ఇస్లాం, క్రిష్టియన్ మత విశ్వాసాలను గౌరవించి అంగీకరించిన విధానం చారిత్రికంగా ఒక గొప్ప పరిణామంగా భావించాలి. ఇది సర్వమానవ ఐక్యతకు తోడ్పడింది తప్ప మనుషుల్ని వారివారి విశ్వాసాల ఆధారంగా ముక్కలు చేయటానికి ప్రయత్నించలేదు.
***
హిందూ మతవిశ్వాసాలు బహుముఖీనమైనవి. ప్రజలందరినీ ఐఖ్యపరచటానికి కాలానుగుణంగా అనేక మార్పులు చేర్పులు చేసుకొంటూ భిన్న ఆరాధన విధానాలను గౌరవించటం గమనించవచ్చు.
కేరళలోని సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఒకప్పటి శివాలయమని నేడు కొందరు రాజకీయనాయకులు వాదిస్తున్నట్లు –హిందూభావజాలం ప్రజలు మత ఆధారంగా విడిపోయి విచ్ఛిన్నమైపోవాలని ప్రయత్నించలేదు చారిత్రికంగా.
.
బొల్లోజు బాబా
Monday, November 14, 2022
ఒక అనాది కథ
ఒక తాగుబోతు
తన అప్రాప్త ప్రేయసికి
ఫోన్ చేసి
ఆమె కట్ చేసిన తరువాత కూడా
మోసం, ద్రోహం అంటూ
ఏవేవో మాట్లాడాడు
ఆ మాటల్లోంచి
అతని ప్రేయసి
నడుచుకొంటూ వచ్చి
అతడిమొఖాన్ని చేతుల్లోకి తీసుకొని
పెదాలపై చిన్న ముద్దు ఉంచి
నడుచుకొంటూ
ఎటో వెళిపోయింది...
***
దేవుడు మనిషిని
స్త్రీ పురుషులనే రెండు సగభాగాలుగా
విభజించి చెరో దిక్కుకూ విసిరేసాడట
తన అర్ధభాగం కొరకు
మనిషి చేసే వెతుకులాట ఇదంతా....
.
బొల్లోజు బాబా
Friday, November 4, 2022
శ్రీ అవధానుల మణిబాబు
కాకినాడసాహితీ మిత్రుల మధ్య చిరపరిచితమైన పేరు శ్రీ అవధానుల మణిబాబు. ఏదైనా అంశంపై ఎవరు మాట్లాడగలరు అని చర్చ వచ్చినప్పుడు శ్రీ మణిబాబు పేరు తప్పక వినిపిస్తుంది. వ్యక్తిగా మృధు స్వభావి. కవిగా స్వాప్నికుడు, సున్నిత భావుకుడు. అంశాన్ని తులనాత్మకంగా తూకం వేస్తూ లోతుగా మూల్యాంకనం చేయగల విమర్శకుడు. శ్రోతలను తనతో పాటూ అనుభూతి పడవలో ప్రయాణం చేయించగల చక్కని వక్త. అది ఆథ్యాత్మిక ప్రసంగమైనా, ఆధునిక కవిత్వంపై ఉపన్యాసమైనా.
శ్రీ అవధానుల మణిబాబు రాసిన పుస్తకాలు మొత్తం ఎనిమిది. వేటికవే ప్రత్యేకం. ఇతను విస్తృత అధ్యయన శీలి. ఎంత గొప్ప రచన చేసినా అంతకంత ఒదిగి ఉండటం మణిబాబు వినయం. ఇతను రచించిన అన్ని పుస్తకాలను నేడు ఆర్చైవ్. ఆర్గ్ లో అందరకూ అందుబాటులో ఉంచాడు. వాటిని అక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకొని చదువు కొనవచ్చును. క్రింద కామెంటులో లింక్ ఇచ్చాను చూడగలరు.
.
1. నాన్న...పాప...2018
.
శ్రీ మణిబాబుకు ఎక్కువ పేరు తీసుకొచ్చిన పుస్తకం. పిల్లలు ఎదుగుతూన్న దశలో మనం చూసిన ఎన్నో మధురమైన అనుభవాలను అనుభూతులుగా మలచుకొని దాచుకొంటాం వాటికి అక్షరరూపమిచ్చి గొప్ప కవితా వాక్యాలుగా సారస్వతంలో నిక్షిప్తం చేసారు శ్రీ మణిబాబు
.
పాప దీపం వెలిగించింది
ఒక దీపం మరో దీపాన్ని వెలిగించడమంటే
ఈ రోజు కొత్తగా అర్ధమైంది
.
పైకి సౌందర్యవంతంగా కనిపిస్తున్నా రేపు ఆ పాపే తల్లై మరో పాపను వెలిగించబోతోందన్న సృష్టి రహస్యం లేదూ పై మూడు వాక్యాలలో.
.
.
2. . స్ఫురణ... స్మరణ (ప్రసంగాలు, సమీక్షలు) - 2017
.
తెలుగు సాహిత్యలోకంలో ఒక విమర్శకునిగా శ్రీ మణిబాబు స్థానాన్ని పదిల పరచిన పుస్తకమిది.
ఈ పుస్తకానికి ముందుమాట రాసిన శ్రీ ఇంద్రగంటి వారు ".......పలురచనలు చదివి స్వతంత్రబుద్ధితో ఆలోచించి అంచనాలు వేయగల నైపుణ్యం ఉండటం వల్ల సాహిత్య విమర్శవైపు దృష్టి పెట్టారని- ఈ వ్యాసాలు చదవడం ద్వారా నాకు అర్ధమైంది" అంటారు. సాహిత్యకృషిలో మర్రిచెట్టులా విస్తరించిన ఒక వ్యక్తి, అప్పుడప్పుడే శాఖలూనుతున్న ఒక చిన్న వ్యక్తిపట్ల వేసిన అంచనా అది. పెద్దల అంచనాలు భవిష్యత్ దర్శనాలు.
ఈ పుస్తకంలో శ్రీ గోపి, శ్రీ భగ్వాన్, శ్రీ దాట్ల, శ్రీ శిఖామణి లాంటి లబ్దప్రతిష్టులపై వ్యాసాలు ఉన్నాయి. ఒక్కొక్కరిగురించి శ్రీ మణిబాబు చేసిన ప్రతిపాదనలు, పరిశీలనలు అపూర్వమైనవి.
.
.
3. అన్నవి అనుకొన్నవి (ప్రసంగాలు, సమీక్షలు) 2015
.
ఈ పుస్తకానికి ముందుమాట రాసిన శ్రీ రెంటాల వారు ".... మీ పఠన వైవిధ్యం బావుంది, మీరు విశాలంగా చదువుతున్నట్టున్నారు, కేవలం చదవడం మాత్రమే కాక విలువైనవీ, అందమైనవీ ఎన్నో వాక్యాలను, పద్యాలను గుర్తుపెట్టుకుంటున్నారని గమనించాను. మీ రచనలో అవి జీడిపప్పుల్లా తగిలి రుచిని పెంచుతున్నాయి. వాల్మీకిని, రూమీని, ఫ్రాయిడ్ నీ డేల్ కార్నిగిని, టాగూర్ నీ ముకుందమాలాకారుణ్ణీ.... ఆయా సందర్భాలలో మీరు ఉటంకిస్తూ వచ్చిన పద్దతి బాగుంది" అనే గమనింపు శ్రీ మణిబాబు రచనావ్యాసంగంపై కాదు, అతని మొత్తం వ్యక్తిత్వంపైనే అని భావిస్తాను. శ్రీ మణిబాబు విశ్లేషణ బలం మొత్తం అతని తులనాత్మక అన్వయంలో దాగి ఉంటుందని నా అభిప్రాయం.
ఈ పుస్తకంలో శ్రీ ఓలేటి వారి ఉపాయనము, మునిమాణిక్యం కథలు, శ్రీ ఆవంత్స సోమసుందర్ తో ఇంటర్వ్యూ, కరుణశ్రీ సాహిత్యం, అద్దేపల్లి దీర్ఘకవిత తెరలు, ఆరుద్ర లేఖా సాహిత్యం లాంటి భిన్న సాహిత్య ప్రక్రియలపై అంతే వైవిద్యభరిత విశ్లేషణా వ్యాసాలు ఉన్నాయి.
.
.
4. నేనిలా... తానలా - 2019
.
శ్రీ మణిబాబు సముద్రంతో తనకున్నఅనుబంధాన్ని"నేనిలా...తానలా" పేరుతో ఒక దీర్ఘకవితగా మలచారు. ఈ శీర్షికలో నేను ఇలను, తాను అల అనే గడుసైన శ్లేష ఉంది.
ఈ దీర్ఘకవితను మూడు భాగాలుగా విభజించుకొంటే మొదటిభాగంలో తన బాల్యం నుండి సముద్రంతో తనకు ఉన్న జ్ఞాపకాలను తలపోసుకొంటాదు. రెండవ భాగంలో వర్తమానంలో సముద్రంతో చేసిన తాత్విక సంభాషణ ఉంటుంది. మూడవభాగంలో సముద్రం కవితో చేసిన సంభాషణలో పలికించిన పర్యావరణ స్పృహ చదువరిని ఆలోచింపచేస్తుంది.
.
.
5. అందినంత చందమామ - 2016
.
ఇది సారస్వత మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్ గారి రచనలపై చేసిన విపుల వ్యాఖ్యానం. శ్రీ సోమసుందర్ గారి వాక్యం క్లిష్టంగా ఉంటుందని విమర్శకుల అభిప్రాయం. అందినంత చందమామ అన్న పేరులోనే శ్రీ మణిబాబు ఆ విమర్శను సూచ్యప్రాయంగా చేసాడా అనిపిస్తుంది. సోముడికి పర్యాయపదం చందమామ. అలాగ, అందినంత సోమసుందర్ అని ఈ పుస్తకం పేరుని అర్ధం చేసుకోవచ్చు.
శతాధిక గ్రంధకర్త అయిన శ్రీ సోమసుందర్ ను నాకు అందినంతమేరకే నేను ఈ వ్యాసాలలో చూపించగలుగుతున్నాను అనే వినయం ఒక పక్క, ఆయన అందని చందమామ అనే శ్లేష మరో పక్కా ఇమడ్చటంగా నేను అనుకొంటాను.
ఈ వ్యాసాలన్నీ శ్రీ సోమసుందర్ ను సుందరంగా, సరళంగా ఆవిష్కరిస్తాయి.
.
.
6. పరమం - 2020
.
సుమారు ఇరవై పుస్తకాలు, వాటిలో సగం స్వతంత్ర్యరచనలు, మిగిలినవి అనువాదములు. భాసుని నాటకములు, ఆదిశంకరుని ఆత్మబోధ, క్షేమేంద్రుని చారుచర్య, పూర్ణసోమసుందరం, తిరువల్లువరు, తులసీదాసు పార్వతీ కల్యాణం, కబీరు, నామదేవుడు ఇలా భిన్నకాలాలకు చెందిన భక్తిమార్గాల అంతస్సూత్రాన్ని గుర్తెరిగి రచనలు చేసారు పరమయోగి శ్రీ మధునాపంతుల వేంకట పరమయ్య గారు. వారి రచనలను సూత్రప్రాయంగా స్పృశిస్తూ, వారి కృషికి సందర్భం వచ్చినచోటల్లా ప్రణమిల్లుతూ రాసిన వ్యాస సంపుటి పరమం.
ఆధునిక కవిత్వంపై విమర్శనా వ్యాసాలు రాసే వారు అనేకమంది. కానీ పరమయ్యగారిలాంటి వేదాంతి, పద్యకవి రచించిన ఆథ్యాత్మిక కావ్యాలను సమీక్షించటం ఒక సవాలు. శ్రీ మణిబాబు సవ్యసాచిత్వం ఈ పుస్తకంలో కనిపిస్తుంది.
.
.
7. లోనారసి - 2022
.
ఇది తాజా ప్రచురణ. వివిధ విమర్శనా వ్యాసాల సంపుటి. ఈ పుస్తకంలో శ్రీ మణిబాబు వాక్యం పదునుదేరింది. చేస్తున్న వ్యాఖ్యానాన్ని సమర్ధించటం కొరకు భిన్న రచనలలోంచి ఉటంకింపులు అలవోకగా తీసుకురావటం గమనించవచ్చు. ఈ పుస్తకంలో డా. ఎన్ రామచంద్ర గారి కుముద్వతీ తీరకథలు, శిఖామణి యానాం కథలు, పైడిపాల నూటపదహార్లు, శ్రీ మధునా పంతుల నాన్న కుర్చీ, సంగివేని రవీంద్ర చౌరస్తాలో సముద్రం, శ్రీ చందుసుబ్బారావు చందన చర్చ, విధ్వాన్ విశ్వం పెన్నేటి పాట లాంటిరచనలపై వ్రాసిన విమర్శనా వ్యాసాలు ఉన్నాయి. అన్నీ చక్కని పఠానుభవాన్ని కలిగిస్తాయి.
***
.
శ్రీ అవధానుల మణిబాబు గొప్ప సహృదయుడు. విస్తృత అధ్యయన శీలి. తను రాయాల్సిన లేదా ప్రసంగించాల్సిన పుస్తకాన్ని చాలా లోతుగా అధ్యయనం చేస్తాడు. దాని సారాన్ని అప్పటికే వచ్చిన వివిధ అటు ప్రాచీన ఇటు ఆధునికరచనలతో తులనాత్మకంగా పోల్చి ఒక అంతస్సారాన్ని పాఠకునికి చూపే ప్రతిభకలిగిన విశ్లేషకుడు.
పైన చెప్పిన పుస్తకాలను అన్నింటిని ఆర్చైవ్. ఆర్గ్ లో డౌన్ లోడ్ కొరకు అందుబాటులో ఉంచారు శ్రీ మణిబాబు.
ఆసక్తి కలిగినవారు తప్పక డౌన్ లోడ్ చేసుకోగలరు. క్రింద కామెంటు రూపంలో లింకు కలదు.
భవదీయుడు
బొల్లోజు బాబా
శ్రీ దడాల రఫేల్ రమణయ్య
శ్రీ దడాల రఫేల్ రమణయ్య పోలీస్ సబ్ ఇన్ స్పెక్టరు ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్రెంచిపాలనకు వ్యతిరేకంగా జరిగిన విమోచన ఉద్యమంలోకి వచ్చారు. తన జీవితాన్ని "My Struggle for the Freedom of French India" పేరుతో అక్షరబద్దం చేసారు. ఇంగ్లీషులో వెలువడిన తొలి తెలుగు దళిత ఆత్మకథ ఇదే కావొచ్చు. మా కాలేజ్ లో దళిత ఆత్మకథలపై జరిగిన సెమినార్ లో వీరిపై ఒక పేపర్ కూడా సమర్పించాను.
2006 లో "శ్రీ దడాల రఫేల్ రమణయ్య జీవితం పోరాటం" పేరుతో ఒక మోనోగ్రాఫ్ రాయటం కొరకు సమాచారం సేకరించి కొంత వర్క్ చేసాను. ఆ కాగితాలు నిన్న పుస్తకాలు సర్దుతుంటే కనిపించాయి. ఆ తరువాత ఆ ప్రోజెక్టు ఎందుకో ముందుకు సాగలేదు. (వారి వారసులు మేమే రాస్తున్నాం అని చెప్పినట్లు గుర్తు). రాసినంత మేరకు ఇ.బుక్ గా రూపొందించి పబ్లిక్ డొమైన్ లో ఉంచుదామని అనుకొంటున్నాను. సమాచారం కొరకు నెట్ లో వెతుకుతోంటే యానాం విమోచనానికి సంబంధించిన ఫొటోలు జూన్ 20, 1954 నాటి ఆంధ్రపత్రికలో కనిపించాయి.
ఆ తరువాత 27 జూన్ న మరోసారి భారతదేశ జండాను ఎగరేయటం జరిగింది. ఈ ఫొటోలే నేడు ప్రచారంలో ఉన్నాయి. (చూడుడు-సూటు బూట్లతో ఉన్న మరో ఫొటో) జూన్ 13 నాడు లాగులతో, పంచెలతో ఉన్న ఆనాటి నాయకులు దిగిన ఫొటోలు చాలా అరుదైనవి.
ఆనాటి సంఘటనను నేను రచించిన "యానాం విమోచనోద్యమం" పుస్తకంలో ఇలా వర్ణించాను.
బొల్లోజు బాబా
.
అది ఆదివారం, జూన్ 13, 1954. ఆ రోజు ఉదయాన్నే శ్రీ దడాల రఫేల్ రమణయ్య, శ్రీ మద్దింశెట్టి సత్యానందం, శ్రీ కనకాల తాతయ్య, శ్రీ యర్రా సత్యన్నారాయణ, శ్రీ కామిశెట్టి పరుశరామ్, శ్రీ కోన నరసయ్య, కాకినాడకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ భయంకరాచారి మరియు సుమారు ఓ వేయిమంది అనుచరులు ఒక సమూహంలా యానాంలోకి ప్రవేశ్రించారు. ఈ బృందం యానాం ఎడ్మినిస్ట్రేటర్ బంగళావైపు కదంతొక్కుతూ కదిలింది. ఆ బంగళాను ముట్టడించి అక్కడి ఫ్రెంచ్ జండాను తొలగించి భారత జండాను ఎగురవేయాలన్నది వీరి ఉద్దేశ్యం.
శ్రీ దడాల ఒక మెగాఫోన్ లో- మేము సంఖ్యాపరంగా ఎక్కువ- సాయుధలమై ఉన్నాము. మీరు ప్రతిఘటించినట్లయితే అది నిష్ప్రయోజనమౌతుంది- అని హెచ్చరిస్తూ దయచేసి సహకరించండి అని ఫ్రెంచి అధికారులను కోరుతూ ముందుకు కదిలారు. అయినప్పటికీ వినకుండా ఫ్రెంచి పోలీసులు కొన్ని చేతి బాంబులను వీరివైపు విసిరారు. అవి వీరికి దగ్గరలో పెద్ద శబ్దం చేసుకుంటూ పేలాయి. దానికి వీరంతా మన్యం వారి మేడ గోడకు ఆనుకొని రక్షణ పొందారు. దీనికి ప్రతిచర్యగా విమోచన ఉద్యమ బృందంలో ఉన్న సాయుధ పోలీసులు అనేక రౌండ్ల కాల్పులు జరిపి, చాలా చాకచక్యంతో వ్యవహరించి, ఏ విధమైన పౌరనష్టం జరగకుండా ఫ్రెంచి పోలీసులను నిర్వీర్యం చేసి నిరాయుధులను చేసారు. (శ్రీ దడాల ఆత్మకథ)
వీళ్ళ రాక తెలుసుకొన్న ఫ్రెంచి విధేయ శక్తులు తలోదిక్కుకు పరిగెట్టి దాక్కున్నారు. కొంతమంది ఎదుర్లంక, ఇతరప్రాంతాలకు పారిపోయారు. మరికొంతమంది అటకలపైన, గుళ్ళలోనూ, సురక్షితమనుకున్న ఇతరప్రాంతాలలోను తలదాచుకొన్నారు. కొంతమందైతే ఆత్మరక్షణ కొరకు తుపాకీ చెంతనుంచుకొన్నారు (రి. జర్నల్ ఆఫ్ హిస్టారికల్ సొసైటీ వాల్యూమ్ 20, 2001)
ఆ విధంగా విమోచనోద్యమకారులు అడ్మినిస్ట్రేటర్ బంగళాను చేరుకొని అప్పటి అడ్మినిస్ట్రేటర్ ఇన్ చార్జ్ శ్రీ శివా గారినుండి అధికారాలను స్వాధీన పరచుకున్నారు. జూన్ 13 న ఉద్యమకారులకు ఏ విధమైన ప్రతిఘటనా ఏర్పడలేదు.
అనంతరం ఉద్యమనాయకులు ఫ్రెంచ్ జండాను తొలగించి బారతదేశ మువ్వన్నెల జండాను ఎగురవేసారు. బహిరంగ సభ ఏర్పాటు చేసి యానాం విమోచనమైందని ప్రకటించారు.
తదుపరి "యానాం విమోచనమైందని, భారత ప్రభుత్వం దీని పరిపాలన చేపట్టి, ఈ ప్రాంతాన్ని భారతావనిలో విలీనం చేసుకోవాలని, ప్రధానమంత్రి నెహ్రూకు, ఫ్రాన్స్ ప్రధానమంత్రికి, పాండిచేరీలోని ఫ్రెంచి గవర్నరుకు టెలిగ్రాములు ఇచ్చారు.
(యానాం విమోచనోద్యమం పుస్తకం నుండి- క్రింద లింకునుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును)
గాంధీ
గాంధీని విభేదించటమో, అభిమానించటమో చాలా సులువు. బ్లాక్ అండ్ వైట్ అంతే. గాంధిని అర్ధం చేసుకోవటంలో- స్పెషల్ ఎలక్టొరేట్ విషయంలో ధృఢంగా నిలబడటం లాంటి కొన్ని గ్రే ఏరియాస్ అడ్డుపడతాయి
అయినప్పటికీ--- ఈరోజు గాడ్సె, సావార్కర్ భావజాలాలు పైకిరావటం రాజకీయ ప్రేరేపితం.
ఈ పనిచేసేవారు హిందూ ఐక్యతను కోరుకొంటారు తప్ప గాంధి చెప్పిన భిన్నమతాల, భారతదేశ ప్రజలందరి ఐక్యతను కోరుకోరు.
ఇలాంటి ధోరణుల వెంటబడటం మేధావులు చేయకూడని పని అని అనుకొంటాను.
Wednesday, November 2, 2022
ఇలతో అల చేసిన సంభాషణ – మణిబాబు “నేనిలా…తానలా” దీర్ఘకవిత
ఇలతో అల చేసిన సంభాషణ – మణిబాబు “నేనిలా…తానలా” దీర్ఘకవిత
కొన్ని కవితావస్తువులు కవి జీవితంతో మమేకమైపోతాయి. వాటితో ఆ కవి సుదీర్ఘమైన ఆత్మైక ప్రయాణం చేసి ఉంటాడు. ఆ వస్తువుతో కవికి ఉన్న అనుభవాలతో అతని హృదయంనిండి పొంగిపొర్లుతూ ఉంటుంది. అలాంటి స్థితిని అనువదించటానికి ఓ పాతిక ముప్పై పాదాలు సరిపోవు. ఇలాంటి నేపథ్యంలో ఆ కవి తన ఉద్వేగాలను దీర్ఘకవితగా మలుస్తాడు. అదొక అనివార్యమైన వ్యక్తీకరణ రూపం. తీసుకొన్న వస్తువును దాని భిన్నపార్శ్వాలతో కవిత్వీకరించి, తనదైన ఒక దృక్కోణాన్ని ఆ వస్తువుకు ఆపాదిస్తూ వ్రాసిన విస్త్రుతమైన రచననే దీర్ఘకవితగా నిర్వచించుకోవచ్చును.
కవి, విమర్శకులు శ్రీ అవధానుల మణిబాబు సముద్రంతో తనకున్న అనుభంధాన్ని ఒక దీర్ఘ కవితగా మలచి “నేనిలా… తానలా” పేరుతో ఇటీవల వెలువరించారు. దీర్ఘకవితను వ్రాసేటపుడు ప్రణాళిక అవసరం. లేనట్లయితే అతివిస్తరణ, శాఖాచక్రభ్రమణం కావ్యాత్మను పాడుచేస్తాయి. మణిబాబు ఈ దీర్ఘకవితను చక్కని ప్రణాళికతో నడిపించాడు. ఈ దీర్ఘకవితను మూడుభాగాలుగా విభజించుకొంటే మొదటి భాగంలో తన బాల్యంనుండి సముద్రంతో తనకు ఉన్న జ్ఞాపకాలను తలపోసుకొంటాడు. రెండవ భాగంలో వర్తమానంలో సముద్రంతో చేసిన తాత్విక సంభాషణ ఉంటుంది. మూడవ భాగంలో సముద్రం కవితో చేసిన సంభాషణలో పలికించిన పర్యావరణ స్పృహ చదువరిని ఆలోచింపచేస్తుంది. నాస్టాల్జియా, సమకాలీనత, అన్యాపదేశంగా చెప్పిన హెచ్చరికా ఈ దీర్ఘకావ్యానికి సమగ్రతను తెచ్చిపెట్టాయి. దీర్ఘకవితలకు సమగ్రత ఆత్మవంటిది.
దండి తన “కావ్యాదర్శం” లో కావ్యంలో అష్టాదశవర్ణనలు ఉండాలంటాడు. “నేనిలా… తానలా” దీర్ఘకవితలో వివిధ సందర్భాలలో చేసిన - నగరం, సముద్రం, రుతువు, సూర్యోదయం, సలిలక్రీడ, విప్రలంభం, వివాహం, కుమారోదయం, దూత్యం, నాయకాభ్యుదయం అనే పదిరకాల వర్ణణలను పోల్చుకోవచ్చును. సముద్రాన్ని వస్తువును స్వీకరించి రచనలు చేసిన శ్రీ అద్దేపల్లి, శ్రీ గరికపాటి, శ్రీ రామకృష్ణ శ్రీవత్స, శ్రీ గనారా వంటి తన “పూర్వకవుల ప్రస్తావన” కూడా చేయటం గమనించవచ్చు. ఇవి కాక ఆధునిక కావ్య లక్షణాలైన సామాజిక చైతన్యం, పర్యావరణ కాలుష్యం పట్ల వ్యాకులత, చారిత్రిక స్పృహలు అద్భుతంగా పలికాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొన్నప్పుడు “నేనిలా… తానలా” దీర్ఘకవిత అటు సాంప్రదాయక, ఇటు ఆధునిక లక్షణాలను పొదువుకొన్న ఒక “మిని కావ్యం”గా అనిపించక మానదు. .
***
“నేనిలా…తానలా” కావ్యంలో పైకి కవి తన ఎదుటగా ఉన్న సముద్రంతో చేసిన సంభాషణలా కనిపిస్తున్నప్పటికీ అది మానవజాతికి, ఆద్యంతరహితమైన సాగరానికి ఉన్న అనాది అనుబంధానికి అక్షరరూపం.
“ఎందుకు నీవంటే అపేక్ష” అని కవి సముద్రాన్ని ప్రశ్నించినపుడు సముద్రం ఇలా సమాధానం ఇచ్చిందట
వెర్రివాడా!
నువ్వు నా సంక్షిప్త రూపానివి
నేను నీ సమగ్ర స్వరూపాన్ని
నేను అర్ణవం
నువ్వు అక్వేరియం.
నీ భాషలో
త్వమేవాహం- అంతే.
మనిషి సముద్రానికి సంక్షిప్తరూపం అనటం నవ్యమైన ఊహ. పడిలేచే లేదా లేచిపడే కెరటాలు, బడబాగ్నులు, ఉప్పెనలు, నిర్జన ఒంటరితనాలు, నిగూఢతా, నిర్మలతా మనిషి లేదా మానవజాతి లక్షణాలు కూడాను.
సముద్రఘోషను కవులు భిన్న సందర్భాలకు భిన్నరకాలుగా భాష్యం చెప్పి తమ ఊహలకు ఊతంగా, ఆయా సందర్భాలను ఉన్మీలనం చేసేలా వాడుకొన్నారు. ఈ దీర్ఘకవితలో “మేము తీరంపై రాసిన రాతల్ని, ముద్రల్ని ఎందుకు చెరిపేస్తావు నువ్వు” అని సముద్రాన్ని ప్రశ్నించినపుడు సముద్రం ఇలా బదులిచ్చిందట
చెరిపిపోవటం కాదు
వాటిని నాలో దాచుకోవటం
భాషతెలియక ఘోషనుకొంటారు గానీ
నా శబ్దాలన్నీ మీ రాతల కలవరింతలే
మీ ఆటల తలపోతలే. --- ఇదొక నవ్యమైన ఊహ. సముద్రఘోష అనేది, సముద్రతీరంపై మనం రాసుకొన్న రాతలు, ఆడుకొన్న ఆటలే అనటం చక్కని సందర్బోచిత నిర్వచనం. చెప్పే విషయాలలో అన్వయసారళ్యత ఎంత తేటగా ఉంటే ఆ కవిత అంత బిగిగా ఉంటుందనటానికి చక్కని ఉదాహరణ ఇది.
ధనుష్కోటిలో
తేలుతున్న రాయిని చూసి
ప్రత్యేకత రాయిదా? నీటిదా?
ఆలోచిస్తూ
కిటికీలోంచి చీకటిని చూస్తూ
నిదరోతున్న రైలులో
ఒక్కడినే మెలకువగా ఉన్నపుడు
“సాంద్రమైనదేదో వీడగలిగితే
తేలడం నీకైనా సాధ్యమే
బెండులా తేలిక కావాలంటే
గుండె మెత్తబరచుకో”
చెవి దగ్గరకొచ్చి చెప్పిపోయావ్ గుర్తుందా…! … అంటూ సముద్రం తనతో చేసిన సంభాషణను తలపోసుకొంటాడు కవి ఒకచోట. హృదయకాఠిన్యాన్ని తొలగించుకొంటే తేలికపడతాం, మార్ధవంగా మారతాం అనే ఒక గొప్ప ప్రాపంచిక సత్యాన్ని చెప్పటానికి “ధనుష్కోటిలో తేలుతున్న రాయి” అంటూ అంతే గొప్ప సాదృశ్యాన్ని తీసుకొన్నాడిక్కడ కవి. ప్రభోధాలను నేరుగా కాక పరోక్షంగా చెప్పటం సమకాలీన కవిత్వలక్షణం. అందుకే ఆ పాఠాన్ని వాచ్యంగా కాక ప్రతీకాత్మకంగా సముద్రం బోధపరచినట్లుగా చెపుతున్నాడు. చక్కటి శిల్పవ్యూహం ఇది.
నువ్వో వ్యాపార కేంద్రం
రణరంగం
కార్య క్షేత్రం
విలాస స్థానం
ఏం కావాలో పట్టుకెళ్లడం వచ్చినవాడి సత్తా
చెంబుడు నీళ్లా
ఇన్ని గులకరాళ్ళా?
ఖనిజాలా? ఇంధనాలా?
మరో దేశంపై పెత్తనమా?//
నాడైనా నేడైనా
నీటిని నెగ్గినవాడే
నేలకు రాజు -- పై వాక్యాలలో కవి చారిత్రిక దృష్టి ద్యోతకమౌతుంది. అవి చదివినపుడు అనేకానేక దృశ్యాలు మదిలో మెదులుతాయి. జలగండానికి భయపడి చెంబుడునీళ్ళు తీసుకొని ఒడ్డునే పవిత్రస్నానం చేసే భక్తుడో; //గజఈతగాళ్ళు ముత్యాలను శోధిస్తూంటారు. ఓడల్లో వ్యాపారం జరుతూంటుంది. పిల్లగాండ్రు మాత్రం గులకరాళ్ళను సేకరించి మరలా విసిరేస్తూంటారు// అనే టాగూర్ వాక్యాలో; “ఓడలు సముద్రాలమీద రహదార్లను గీస్తాయి” అంటూ భారతదేశానికి బ్రిటిష్ వారి రాకను వర్ణించిన కొప్పర్తి వాక్యాలో; భవిష్యత్తులో నీటికొరకు యుద్ధాలు జరుగుతాయన్న హెచ్చరికలో గుర్తుకు రాకమానవు. తక్కువ ఖర్చుతో లవణజలాల్ని త్రాగునీరుగా మార్చే ఆవిష్కరణకు నోబుల్ బహుమతి ఇవ్వటానికి ప్రపంచమిపుడు ఎదురుచూస్తుంది. “నీటిని నెగ్గినవాడే నేలకు రాజు” వాక్యాలు కవి చారిత్రిక అవగాహనకు, సమకాలీన వాస్తవాలకు, భవిష్యత్ దర్శనానికి అద్దంపడతాయి.
కడుపులో ప్లాస్టిక్ నింపుకున్న
షార్క్ ల మృతదేహాలు
వలల నిండా జీవంలేని తాబేళ్ళు//
వేల అడుగుల క్రింద చేరిన
వ్యర్ధాలను తొలగించేది ఎవరు?
సరిదిద్దుకోలేని నీకు
తప్పుచేసే హక్కెవరిచ్చారు?—అంటూ సముద్రం పలికిన మాటలు ఈ మొత్తం దీర్ఘకావ్యానికి ఆయువుపట్టు. నేడు తెలుగులో పర్యావరణ విధ్వంసంపై వచ్చే కవిత్వం చాలా తక్కువ. దీర్ఘకవితలకు సంబంధించి కొల్లేరు విధ్వంసం పై ఎస్.ఆర్. భల్లం వ్రాసిన “కొల్లేరు” దీర్ఘకవిత, అంతరించిపోతున్న పక్షులపై అద్దేపల్లి ప్రభు వ్రాసిన “పిట్టలేని లోకం” ఈ సందర్భంలో ప్రస్తావించుకోదగినవి. మణిబాబు వ్రాసిన “నేనిలా…తానలా” దీర్ఘకావ్యంలో సింహభాగం సాగర కాలుష్యాన్ని దానివల్ల కలిగిన దుష్పరిణామాలను శక్తివంతంగా ఆవిష్కరించింది. కనుక ఈ దీర్ఘకావ్యాన్ని పర్యావరణ కవిత్వంగా భావించవచ్చు.
ఆధునిక మానవుడు చేస్తున్న కాలుష్యం వలన మానవజాతి మనుగడ ప్రమాదంలో పడింది. గ్లోబల్ వార్మింగ్ వలన హిమశిఖరాలు కరిగి, సముద్రమట్టాలు పెరిగి, భూమి అంతా జలమయం అయ్యే అవకాసం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఇదొక సాంకేతిక అంశం. ఇలాంటి వాటిని కవిత్వీకరించటం సులభం కాదు. ఈ అంశాన్ని ఇలా అక్షరీకరిస్తాడీ కవి.
ఇదే కొనసాగితే
నా నుండి విడివడిన భూమి
మళ్ళీ నాలో కలవడం
మరెంతో దూరంలో లేదు
అపుడు
వేదన వినిపించేందుకు
నాకు మనిషి దొరకడు
తలబాదుకొనేందుకు
ఒడ్డు మిగలదు. --- ఒక ప్రాచీన మహాఖండం కాంటినెంటల్ డ్రిఫ్ట్ వల్ల నేడు ఉన్న భిన్న ఖండాలుగా విడిపోయిందని పాంజియా సిద్ధాంతం చెపుతుంది. ఆ సిద్ధాంతాన్ని రేఖామాత్రంగా స్పృశిస్తున్నాడిక్కడ కవి. మానవులు ఇలాగే పర్యావరణ విధ్వంసాన్ని కొనసాగించినట్లయితే నానుండి విడిపడిన భూమి నాలో కలిసిపోతుంది అని హెచ్చరిస్తున్నాడు. ఇంతవరకూ వ్రాసి వదిలేస్తే అదేమంత గొప్పవిషయం కాబోదు. ఆ తరువాతి వాక్యాలే మణిబాబుని ఉత్తమకవి అని నిరూపిస్తాయి. జలప్రళయం జరిగాకా సముద్రం మాట్లాడుకోవటానికి మనిషి ఉండడట, ఒడ్డూ మిగలదట. ఈ మాటల్ని సముద్రంతో అనిపించటం లోతైన కల్పన. ఇక్కడ సముద్రాన్ని కవి ఎలా ఊహించుకొంటున్నాడు అని ఆలోచిస్తే - ఒక తల్లి, ఒక స్నేహితుడు, ఒక గురువు ఇంకా ఒక నైరూప్య అనంత స్వరూపునిగా భిన్నరూపాల్లో దర్శనమౌతుంది.
***
ఈ మొత్తం రచనను
ఇదంతా
నీలో దోసెడు నీళ్ళు తీసి
మరలా నీలోనే విడిచిపెట్టటం – అంటాడు కవి ఒకచోట. ఇది పైకి వినయంగా అనిపించినా త్వమేవాహం అని మొదట్లో అన్నమాటకు అందమైన ముక్తాయింపు. “నేనిలా…తానలా” అనే శీర్షికలో నేను ఇలను, తాను అల అనే గడుసైన శ్లేష ఉంది.
శ్రీ అవధానుల మణిబాబు కవిత్వంలో గహనమైన సిద్ధాంతాల చట్రాలుండవు. నిత్యం తనను జ్వలింపచేసే మానవానుభవాలకు తాత్విక పరిమళాలు అద్ది కవిత్వంగా మార్చటం ఇతని కవిత్వరహస్యం. జీవితానుభవాలను గ్రహించటంలో- సున్నితత్వం, కరుణ, అమితమైన ప్రేమ, హృదయ నైర్మల్యం ఇతని కవిత్వాన్ని హృద్యమైన అనుభవంలా మార్చుతాయి.
రచయిత ఫోన్: 9948179437
బొల్లోజు బాబా
