శ్రీ త్రిపురనేని రామస్వామి గారి జయంతి సందర్భంగా ఆయన శంబుక వధ నాటకంపై వ్రాసిన వ్యాసాన్ని ప్రచురించిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
బొల్లోజు బాబా
“శంబుక వధ” నాటకం ఒక పరిశీలన
.
భారతీయ తాత్విక చింతనలో భావవాదం, భౌతికవాదం వేదకాలం నుంచీ సమాంతరంగా ప్రయాణిస్తూ ఉన్నాయి. భావవాదం మతాన్ని నిర్మించి మనిషిని మూఢవిశ్వాసాలలో కూరుకుపోయేలా చేయగా, భౌతిక వాదం కార్యాలకు కారణాలను అన్వేషించే హేతువాదాన్ని నిర్మించింది. హేతువాదం అంటే ఒక ఆలోచనా విధానం.
కర్మసిద్ధాంతం, పాపపుణ్యాలు, స్వర్గనరకాలకు ప్రాధాన్యతనివ్వకుండా కార్యకారణ సంబంధాలను విశ్లేషించి సత్యాన్వేషణ చేయటం.
హేతువాదులు వేదనిందకులు కనుక వారిని గౌరవించరాదని మనుస్మృతి చెప్పింది. ఆంధ్రదేశంలో హేతువాదం భిన్న రూపాలలో మనుగడసాగించింది. శ్రీనాథుడు తన కాశీఖంఢంలో - బౌద్ధులు, చార్వాకులు, జైనులు, లోకాయుతులు, వైతండికులు, పాషండులు, కాపాలికులు, దిగంబరులు, పాశుపతులు అనే తొమ్మిదిరకాలైన నాస్తికులు ఆంధ్రదేశంలో ఉన్నట్లు వర్ణించాడు. వీరందరూ భౌతికవాదులు. వేమన జీవించిన కాలంలో ఆంధ్రనాట నాస్తిక విశ్వాసాలు ప్రజలలో ప్రచారంలో ఉండేవని అతని అనేక పద్యాలద్వారా తెలుస్తుంది. ఆధునిక కాలంలో స్వామినేని ముద్దునరసింహనాయుడు, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి లాంటి వారు – అంధవిశ్వాసాలను, మతమౌఢ్యాన్ని ఖంఢించి హేతువాద భావాలను ప్రచారం చేసిన క్రాంతదర్శులు. వీరిలో వివిధ సాహిత్య ప్రక్రియలద్వారా హేతువాదాన్ని ప్రచారం చేయటానికి జీవితకాలం పాటుపడిన వ్యక్తిగా త్రిపురనేని రామస్వామి ముఖ్యులు.
త్రిపురనేని రామస్వామి హేతువాద దృక్పథంతో పురాణ కథలను, పాత్రలను, ఘట్టాలను తీసుకొని వాటిలోని అహేతుక అంశాలను, అనౌచిత్యాలను చర్చిస్తూ కురుక్షేత్ర సంగ్రామం, ఖూని, శంబుక వధ, సూతపురాణం, కుప్పుస్వామి శతకం, వివాహవిధి లాంటి రచనలుచేసారు. వీటిలో-వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణ కొరకు, బ్రాహ్మణ మునుల ఒత్తిడితో శ్రీరాముడు శంబుకుడిని వధించే ఘట్టాన్ని “శంబుక వధ” పేరుతో 1920 లో రచించిన నాటకం ఎంతో సంచలనాన్ని సృష్టించి నేటికీ ఆధునిక ఆంధ్రసాహిత్యంలో ఒక నిరుపమాన రచనగా నిలిచింది. తదనంతర కాలంలో చలం, నార్ల వెంకటేశ్వరరావు, జి.వి కృష్ణారావు, ముద్దుకృష్ణ లాంటి రచయితలు ఇదే కోవలో మరిన్ని రచనలు చేయటానికి ఈ రచన ప్రేరణ అనటంలో సందేహం లేదు.
1. శంబుక వృత్తాంతం
శంబుక వృత్తాంతం రామాయణ ఉత్తరకాండలోనిది. రామరాజ్యంలో అకాలమరణాలు ఉండేవి కావట. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు తన కొడుకును కోల్పోయాడు. “యశ్య రాష్ట్రే నృపాలష్య తురీయశ్చ తపోదన! తత్ర తధ్యం భవత్యేన విప్ర బాలస్య మారణం” - ఏ రాజ్యంలో శూద్రులు తపస్సు చేస్తారో అక్కడ బ్రాహ్మణ కుమారులు అకాలమరణం పొందుతారని స్మృతి వాక్యం. దీని ఆధారంగా చేసుకొని రామరాజ్యంలో ఎక్కడో ఒక శూద్రుడు తపస్సు ఆచరిస్తున్నాడని దాని కారణంగా వర్ణధర్మాచరణకు భంగం కలిగిందని అందుచే ఈ బ్రాహ్మణ బాలకుడు అకాలమరణం చెందాడని నారదుడు, వసిష్ఠ్యాది రుషులు శ్రీరామునితో చెప్పగా, రాముడు తన వాయువాహనంపై రాజ్యమంతా నేరస్తుని కొరకు గాలించాడు. దక్షిణాదిన ఒక సరస్సు తీరంపై శంబుకుడనే ఒక శూద్రుడు తలక్రిందులుగా తపస్సు చేస్తున్నట్లు గుర్తించి రాముడు అతని శిరస్సు ఖండించాడు. శంబుకుని శిరస్సు నేలపై పడగానే ఎక్కడో అయోధ్యలో ఉన్న మరణించిన బ్రాహ్మణ బాలకుడు తిరిగి శ్వాసపీల్చుకోవటం ఆరంభించాడట. స్థూలంగా శంబుక వృత్తాంతం ఇది.
పై మూల కథను మార్చకుండా రామస్వామిగారు హేతువాద దృక్ఫథంతో వర్ణధర్మ ఆచరణలోని అనౌచిత్యాన్ని, అన్యాయాన్ని ప్రశ్నిస్తారు శంబుకవధలో. దానికొరకు నాలుగు అంకాలలో గొప్ప ప్లాట్ ను నిర్మించి తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేసారు.
2. శంబుక వధ నాటకం
ఈ నాటకానికి రామస్వామిగారు రాసుకొన్న 27 పేజీల ముందు మాటలో రామాయణానికి సంబంధించిన చారిత్రిక, సామాజిక, భౌగోళిక అంశాలను, ఆర్య అనార్య విషయాలను చర్చించారు. ఈ నాటకంలో అంగదుడు, హనుమంతుడు, శంబుక శిష్యులు, చయనులు, సోమయాజులు లాంటి మూలంలో లేని పాత్రలు సృష్టించారు. అంతేకాక శంబుకునికి చిదానందాశ్రమము నెలకొల్పి శిష్యులకు ద్రవిడజాతి హక్కులను గురించి బోధనలు చేస్తున్నట్లు చెప్పటం, శ్రీరామ చంద్రుడు శంబుకుని కలిసి తత్వచర్చలు చేయటం లాంటి అమూల కల్పనల ద్వారా తను చెప్పదలచుకొన్న హేతువాద అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పారు.
నాటకంలో మొత్తం 4 అంకాలు కలవు. మొదటి అంకంలో తన ఆశ్రమానికి వచ్చిన అంగదునితో శంబుకుని సంభాషణ. రెండవ అంకములో శంబుకుని తపస్సుగురించి బ్రాహ్మణుల చర్చలు, కుట్రలు, రామచంద్రునితో శంబుకుని గురించి వసిష్ఠుడు చెప్పటం. మూడవ అంకంలో అంగదుడు శంబుకునితో బ్రాహ్మణులు జరుపుతున్న పన్నాగం గురించి చెప్పి వారించటం. వారి మధ్య పండిత చర్చలు. నాలుగవ అంకంలో రామునిచే శంబుక వధ.
3. వివిధ పాత్రల చిత్రణ
శ్రీరామచంద్రుడు: శంబుకుడు వర్ణధర్మాలను ధిక్కరిస్తున్నాడని తెలిసిన శ్రీరాముడు అతనిని రాజసభకు పండితుల సమక్షంలో తన వాదనను వినిపించుకోవలసినదిగా ఒక ఉత్తరమును పంపిస్తాడు; చిదానందాశ్రమంలో తపస్సు చేసుకొంటున్న శంబుకుని కలిసి అతనితో చర్చలు జరుపుతాడు; శంబుకుడు చెబుతున్నవిషయాలతో ఏకీభవించి ఇతను నిరపరాధి అని వెనుతిరుగుతాడు; మరలా వసిష్ఠుడు, ఇతర బ్రాహ్మణుల ఒత్తిడిమేరకు చేసేదేమిలేక తిరిగి వచ్చి శంబుకుని వధించటం జరుగుతుంది. మూలంలో రాముడు శంబుకునితో ఏ విధమైన చర్చలు లేకుండా నేరుగా వధిస్తాడు.
ఈ కల్పనల వెనుక రామస్వామిగారి ఉద్దేశం రాముని పాత్ర లోని దుర్గుణాలను చర్చించటం కాక, భావవాదంలోని (వర్ణధర్మాచరణ) క్రూరత్వాన్ని నిరూపించటంగా భావించాలి. అంతే కాక రాముని దైవంగా భావించే జనబాహుళ్యపు మనోభావాలను కించపరచకుండా బ్రాహ్మణాధిక్యం ఏమేరకు పాలకులను కూడా ప్రభావితం చేసి సమాజంలోని శూద్రులకు అన్యాయం చేసిందో అనే అంశాన్ని అంగీకరింపచేసే యోచనకూడా ఉండవచ్చు.
`
శంబుకుడు: ఈ నాటకంలో శంబుకుడు పాత్ర శూద్రజాతి ప్రతినిధిగా శాంత స్వభావునిగా, అతిధిమర్యాదలు తెలిసిన వ్యక్తిగా, వేదవేదాంగములు, స్మృతులు చదువుకొన్న జ్ఞానిగా తీర్చిదిద్దటం జరిగింది.
అంగదుడు, శంబుకుల మధ్య సంభాషణలలో - స్మృతులు బ్రాహ్మణులకొరకు రాసుకొన్నవని; వాటిలో శూద్రులకు స్థానం లేకపోగా వారిపట్ల పక్షపాత ధోరణి కలిగి ఉన్నవని; ఆర్యులచే పరాజితలమైన మనం వారితో సమాన స్వాతంత్ర్యమును హక్కులను పొందాలి, దానికై నేను హింసాపరాజ్ఞ్ముఖుడనై ఆశ్రమము స్థాపించి తపస్సుసాగిస్తున్నాను; ఒకవేళ ఆ రామచంద్రుడే వచ్చి నన్నీ జపతపంబులు మాని ద్విజసేవ చేయమన్నను నా అంతరాత్మకు వ్యతిరేకముగా దానినొనొర్పజాలను- అంటూ మాట్లాడించటం ద్వారా శంబూకుడిని సొంత వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తిగా చిత్రీకరిస్తారు రామస్వామి గారు.
రాముడు నిన్ను వధించే అవకాశం ఉంది అని అంగదుడు అన్నప్పుడు, శంబుకుడు “నా మరణము వలన ఆర్యులకు కలుగు లాభముకన్న అనార్యులకు కలుగు లాభము మెండుగనుండును.” అని బదులిస్తాడు. ఇది రచయిత క్రాంతదర్శనానికి నిదర్శనం. ఈ నాటకం వచ్చిన అరవై ఏండ్లకు తెలుగునాట వెల్లివిరిసిన అస్తిత్వ ఉద్యమసమయంలో శంబుకుడిని బహుజన అస్తిత్వానికి ప్రతీకగా తీసుకొని గొప్పకవిత్వం వచ్చింది.
శంబుకుడు రాజసభలో పండితుల సమక్షంలో తన వాదనను వినిపించుకోవలసినదిగా శ్రీరాముడు ఆహ్వానించినపుడు శంబూకుని శిష్యుడు - మన వాదనను ఎంతకాలం రహస్యంగా ఉంచుకొంటాం? రామభద్రుని మధ్యవర్తిగా ఉంచుకొని ఆర్యులతో శాస్త్రవాదనలు చేసి మనహక్కులను నిలబెట్టుకొందామని సలహా ఇస్తాడు. దానికి శంబుకుడు - వారు వేద ప్రామాణ్యామునంగీకరింపరు మనము స్మృతి ప్రామాణ్యము నంగీకరింపము. ఉత్తరములో స్మృతి తిరస్కారులమని మనపై అభియోగం చేసారు. అలాంటప్పుడు ఇక వాదించటానికి ఏముంటుంది. మీరు వేదాన్ని ప్రమాణంగా తీసుకొంటే చర్చలకు వస్తామని స్మృతులని ప్రమాణంగా తీసుకోదలిచితే రాలేమని సమాధానం ఇప్పించాడు శంబుకుడు.
శ్రీరాముడు శంబుకుని ఆశ్రమానికి వచ్చినపుడు జరిగిన చర్చలలో- “మీరు శూద్రులు మీకు వేదములను చదువటానికి కానీ మతప్రసంగములు చేయటానికి కానీ అర్హత లేదు అనగా అది ఎవరి ఆదేశము” అని తిరిగి ప్రశ్నిస్తాడు శంబుకుడు
పై సన్నివేశాల ద్వారా శంబుకుడు వేద వేదాంగ విద్యాపారంగతుడని, వేదాలను అంగీకరించినా వర్ణధర్మాలను స్థిరపరుస్తోన్న స్మృతులను వ్యతిరేకించి, ప్రజలందరకు సమానహక్కులుండాలని వాదించే జ్ఞానసంపన్నుడిగా చిత్రించారు రచయిత.
అంగదుడు: ఈ పాత్ర బహుశా రామస్వామి గారే అనుకోవచ్చు ఎందుకంటే మొత్తం నాటకంలో వివిధ పాత్రల వ్యక్తిత్వాలను విశ్లేషిస్తూంటుందీ పాత్ర. రచయిత తన అభిప్రాయాలను అంగదుడు పాత్ర ద్వారా ధారాళంగా చెప్పగలిగారు.
శంబుకుని వధించటానికి బ్రాహ్మణబాలకుని మరణం కారణం. అలా జరగటానికి రాజు వైఫల్యం అని చెప్పే స్మృతివాక్యం దోహదకారి. రామస్వామి గారు బ్రాహ్మణ బాలకుని మరణం కట్టుకథ అని చెప్పటానికి అంగదుని పాత్రను వాడుకొని ఇలా చెప్పించారు రచయిత.
//"ఔరా! యౌరా యేమి యీ కుట్ర! ఏమి యీతంత్రము! ఏమి యీ ఛద్మకౌశలము! ఇప్పుడంతయు నర్ధమయినది; వసిష్ఠులవారెంత తంత్రజ్ఞులు! మొన్నసాయింకాలము, వసిష్ఠులవారశ్వనీ దేవతలతో గుసగుసలు వోవుటకు గారణమిదియా! అశ్వనీ దేవతల సాహాయ్యమున నీకుఱ్ఱవానిని మూర్ఛపోగొట్టి శంబుకర్షితపముచే మరణించెనని చెప్పవచ్చిరి//
అశ్వనీదేవతలు ఆది వైద్యులు. వారి సహాయంతో వసిష్ఠ్యాదులు ఒక కుర్రవాడిని కొద్దిసేపు శవరూపంలో పడుకొని ఉండేటట్లు చేసి, ఆ సమయంలో అతను శంబూకుని తపస్సువల్ల చనిపోయాడని రాముని వద్ద నాటకములాడి రాముడుని శంబుకునిపై ఉసిగొల్పినట్లుగా కల్పన చేయటం ద్వారా రామస్వామి గారు వర్ణధర్మాన్ని పరిరక్షించటానికి ఎంతటి కుట్రలకైనా బ్రాహ్మణులు పాల్పడేవారని నిరూపించయత్నించారు.
వసిష్ఠ్యాదులు: వసిష్ఠునికి శ్రీరాముడు నమస్కరించగానే “వర్ణాశ్రమాచార పరిరక్షణ సామర్థ్యమస్తు” అని దీవిస్తాడు. ఈ దీవెనలోనే నాటకం ఆత్మ మొత్తం ఇమిడిపోయింది. వసిష్ఠుడు, చైనులు, సోమయాజి అనే పాత్రలు రాముడిని ప్రేరేపించి వర్ణధర్మాలు కలుషితంకాకుండాచూసే మిషతో శంబుకుని వధించేలా చేస్తారు.
4. శంబుక వధ నాటక ప్రాసంగిత
స్మృతుల రూపంలో భావవాదం, బ్రాహ్మణాధిక్యత అనేవి భారతీయ సమాజాన్ని ఏ మేరకు ప్రభావితం చేసి ప్రజలను విడదీసిందో చెప్పటం ఈ నాటక రచనా లక్ష్యము. ఈ నాటకంద్వారా రామస్వామిగారు సంధించిన ప్రశ్నలు నేటికీ ప్రాసంగితను కోల్పోలేదు.
ఎ. ఇట్లు వ్రాయబడిన శాస్త్రములు మన శాస్త్రము లెట్లగును? మనకుగా వ్రాసిరా? మన అభిప్రాయములంగొనిరా? కాని నేడు మనమేల వానిచే బంధింపబడవలయు?
శాస్త్రములు శూద్రులకు తపస్సు చేయుట నిషేదించింది కదా అని అంగదుడు ప్రశ్నించినపుడు శంబూకుడు ఇచ్చిన జవాబు అది. రుషులు కల్మషమతులై పక్షపాతముతో శాస్త్రములు చెప్పితిరని అంటాడు శంబూకుడు.
బి. ద్విజేతరులు తపంబు చేసిన యెడల ఆ ద్విజశిశువులెట్లు మరణింతురు? అని హనుమంతుని ద్వారా వేయించిన ప్రశ్న చాలా విలువైనది. తార్కికమైనది. ఇక్కడ హనుమంతుడు ఒక ద్రవిడ స్థానంలో ఉండి ఆర్య వసిష్ఠుడిని ప్రశ్నిస్తున్నాడు. పై ప్రశ్న అడిగినందుకు హనుమంతునితో ఒక బ్రాహ్మణ ప్రతినిధి - "ఆంజనేయా! శ్రమపడి ప్రశ్ననడిగితివిగాని, నీకు శాస్త్ర చర్చ చేయునధికారము లేదెరుంగుదువువా! మా బోంట్లు ధర్మ సూక్ష్మములు నీకు జెప్పనుదగదు, నీవు విననుదగదు" అంటూ చెప్పించిన సమాధానం హిందూ మతంలో శతాబ్దాలపాటు నడిచిన బ్రాహ్మణాధిక్యతకు అద్దంపడుతుంది. "అయ్యా! మాకెందులకు జెప్పకూడదో ఇప్పుడు తెలిసినది" అని హనుమంతునితో అనిపించటంలో- ప్రశ్నిస్తామనే భయంతోనే మాకు శాస్త్రాలను నిషిద్దం చేసారనే అధిక్షేపణ దాగిఉంది.
సి. "వేదజ్ఞానమును గ్రహించిన వారు, గ్రహింపనిష్టపడిన వారు హిందువులనబడుచుండిరి. హిందువులయ్యినా లాభమును బొందజాలని వారు మాబోంట్లు, కాన మేమెట్లు వేదములను బొందగూడదో! యెట్లు భగవద్ధ్యానము జల్పుకొనగూడదో దేవరవారే యోజింతురుగాక." -- ఇవి శంబూకుడు శ్రీరామునితో పలికిన పలుకులు. శూద్రులకు వేదజ్ఞానము నిషిద్ధము. వేదాన్ని అంగీకరించినవాడు హిందువు. హిందువులమయ్యికూడా వేదాలకు మమ్ములను ఎందుకు దూరం చేస్తున్నారు అనే శంబూకుని వాదనలో ఆలయప్రవేశం నిషేదించినందుకు మతం మార్చుకోవలసివచ్చింది అనే సమకాలీన వాదన కూడా ఇమిడి ఉంది. బ్రాహ్మణులకే పరిమితం చేయబడిన వేదజ్ఞానం మాకూ కావాలనటంలో, నిచ్చెనమెట్ల వ్యవస్థను నిర్మూలించమని, అందరికీ సమాన హక్కులు కల్పించమని కోరటంగా అర్ధం చేసుకోవాలి.
***
హిందూమత చరిత్రలో బ్రాహ్మణిజపు కుట్రలను, కుతంత్రాలను సామాన్య ప్రజలకు అవగతం చెయటానికి శంబుక వధ నాటకాన్ని రచించారు రామస్వామి గారు. భావవాదానికి ప్రాతినిధ్యం వహించే పురాణాలను హేతుదృష్టితో చూడాల్సిన అవసరాన్ని, విచారించే తత్వాన్ని తెలిపారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికిల్ 51 ఏ నందు, శాస్త్రీయదృక్పథం, మానవత్వాన్ని పెంపొందించుకోవడం, విచారించే తత్వాన్ని అలవర్చుకోవడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యతగా చెప్పబడింది. తదనుగుణంగా ప్రజలలో శాస్త్రీయ దృక్ఫథం పెరగాలి విశ్వాసాలకు మూఢవిశ్వాసాలకు గల తేడా తెలుసుకోగలగాలి. ఇతరులపట్ల ఇతరమత విశ్వాసాలపట్ల సహిష్ణుత కలిగి ఉండాలి. ఇవన్నీ హేతువాదాన్ని జీవనవిధానంగా చేసుకొన్నప్పుడు సాధించగలం. దీనికి సాహిత్యం దోహదపడుతుంది.
ఎనభైల తరువాత రైట్ వింగ్ రాజకీయాలు ప్రబలమవ్వటం వల్ల ప్రజలు మరింత అంధవిశ్వాసాలలోకి కూరుకుపోవటం జరుగుతోంది. ఉన్నత స్థానంలో ఉన్న నాయకులే- వినాయకుడిని చూపించి మన పూర్వీకులకు ప్లాస్టిక్ సర్జరీ తెలుసని మాట్లాడుతున్నారు; మనుషులకు వయసుపెరగటం వల్ల శరీరం అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక గ్లోబల్ వార్మింగ్ అంటున్నారంటూ ఆధునిక విజ్ఞానాన్ని తక్కువచేస్తారు. ఒక మంత్రి న్యూటన్ నియమాలు వేదాల్లో ఉన్నాయంటాడు; మరొకరు ఆవు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుందంటాడు; ఇంకొకడు భారతదేశం వేల సంవత్సరాల క్రితమే టెలివిజను, ఇంటర్నెట్ కనుగొన్నదని అంటాడు.
పై వ్యాఖ్యలు అనాలోచితమైనవి కావు. అవి రైట్ వింగ్ రాజకీయాలకు ఉపయోగపడే అంశాలు. నాయకులు తమ రాజకీయ లబ్దికొరకు ప్రజలను పోలరైజ్ చేయటానికి వీటిని పదే పదే వల్లిస్తున్నారు. నేటి యువత వీరి వలలో చిక్కకుండా ఉండాలంటే యుక్తాయుక్త విచక్షణ కలిగిన శాస్త్రీయ దృక్ఫథం అవసరం.
ఇలాంటి రాజకీయ సామాజిక నేపథ్యంలో త్రిపురనేని రామస్వామి సాగించిన హేతువాద పోరాటం యొక్క ప్రాసంగిత మరింత పెరిగింది.
రామస్వామి గారి రచనలలో దైవ దూషణ కనిపించదు. భావవాదపు అహేతుక, అమానవీయ అంధ విశ్వాసాలను, కుట్రలను మాత్రమే ఖంఢించారు తప్ప ప్రజల విశ్వాసాలను గాయపరిచేలా రచనలు చేయలేదు. ఈ నాటకంలో కనిపించేది బ్రాహ్మనిజంపైన ద్వేషమే తప్ప బ్రాహ్మణ ద్వేషం కాదు. ఈ లక్షణాలను సమకాలీన హేతువాద వ్యాఖ్యాతలు అలవర్చుకొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
త్రిపురనేని రామస్వామి గారి పోరాటాన్ని తలచుకోవటం, వారు స్వప్నించిన నిర్మాణాత్మక భౌతికవాదాన్ని ముందుకు తీసుకెళ్ళటం చారిత్రిక అవసరం.
This comment has been removed by a blog administrator.
ReplyDeleteplease comment relevantly
Deleteఈ అర్య-ద్రావిడ సిధ్ధాంతమే గొప్ప అసత్యం. ఇంక దీనిని ప్రాతిపదికగా తీసుకొని అల్లిన కల్పనాసాహిత్యం అంతా చెత్తతో నిండి చెత్తభావాలను ప్రతిఫలిస్తుంది తప్ప సత్యాన్ని ఎలా చూపుతుంది? ఇకపోతే హేతువాదం హేతువాదం అంటారు కాని అంతా హేతువుకు అందుతుందా? ఒకప్పుడు శబ్దాన్ని కాని దృశ్యాన్ని కాని దూరం నుండి పరోక్షంగా గ్రహించటం సాధ్యమంటే అప్పటి సైన్సు ప్రకారం హేతువాదులు వీరంగం త్రొక్కేవారే కదా హేతువుకు నిలువదని? ఇప్పుడు అవి ప్రత్యక్షసత్యాలు కదా! మాట్లాడితే హేతువాదం అన్న కాష్ఠవాదంతో స్వప్రయోజనపరులు చెడును సృజించి ప్రచారం చేయటాన్ని హర్షించలేము.
ReplyDeleteమీ అభిప్రాయాలను గౌరవిస్తాను సర్.
Delete