బరువుగా వీపున కూర్చున్న
ఈ సాయింత్రమొక ఇసుకమూట
రద్దీ నగరం తీగలు తెగిన ఒక వయొలిన్
కలల్ని కన్నీళ్ళను మోసుకొంటూ సాగుతోంది
చీకట్లోకి ఆకట్లోకి రేపట్లోకి
చెవులు, నాలుకలు, కళ్ళు లేని
క్షతగాత్ర దేహాల జలపాతం తూర్పుదిక్కున
తెల్లారే వేళకి
సగంసగం పచ్చిగా ఉన్న గాయాలను తడుముకొంటూ
చూడలేని, వినలేని, పలుకలేని ప్రజలు మరలా ఉదయిస్తారు
రాత్రంతా వారు విడిచిన నిట్టూర్పులే
ఈ పొగమంచు
నగరమంతా పరుచుకొంది
దేహమంతా నిండిపోయింది
కవిత్వమంతా పాదుకొంది
గర్భగుడి గోడలపై తారాడే
దేవదేవుని అఖంఢజ్యోతి పలుచని కాంతి
ఒక్కటే ఆశ ఇక
ఈ చలిమంచుని కరిగించగలిగే స్వప్నం
బొల్లోజు బాబా
No comments:
Post a Comment