.
తిరుక్కురళ్ 3 BCE నుండి 5 CE మధ్యలో రచింపబడిన తమిళ కావ్యం. దీనిని రచించింది తిరువళ్ళువర్ కవి. ఈ రచన మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి విభాగంలో మనుషులు పాటించాల్సిన ధర్మం గురించి, రెండవ విభాగంలో భౌతిక సంపదల గురించి, మూడవ విభాగంలో ప్రేమ గురించి ఉంటుంది. ఇది హిందూ మతం చెప్పే పురుషార్ధాలైన ధర్మ అర్ధ కామ లతో సరిపోలుతున్నా ధర్మం పేరుతో తిరువళ్ళువార్ వర్ణధర్మం గురించి చెప్పడు. మనిషి భిన్నదశలలో నిర్వర్తించాల్సిన విధుల గురించి చెబుతాడు. అదే విధంగా నాలుగో ధర్మమైన మోక్షం గురించి తిరువళ్ళువర్ మాట్లాడడు.
ఇతని బోధనలలో అహింస, శాఖాహారం పట్ల ఇష్టత ఇంకా ఇతర జైన మతపర అంశాలను గుర్తించిన పండితులు తిరువళ్ళువర్ జైనుడని అభిప్రాయపడ్డారు. David Shulman (2016) Tamil: A Biography అనే పుస్తకంలో తిరువళ్ళువర్ జైనుడని అన్నాడు. తిరువళ్ళువర్ ఆజీవికుడనే అభిప్రాయం కూడా కలదు.
.
డాక్టర్ జి.యు పోప్ అనే కవి తిరువళ్ళువర్ ను ఇలా కీర్తించాడు
వళ్ళువర్ యోగీ! కడజాతిలో జన్మించిన ప్రబోధకుడా!//
నీవు విశ్వమానవకీర్తిగానం చేసే కవివి//
సుగుణాలు, వాస్తవమైన ఆస్తి, ఆనందము
ఇవే మానవుని లక్ష్యం అని
అతిమధురమైన ద్విపదలలో నీవు ఎలుగెత్తి చాటావు 1 //
.
హిందూమతం ఉచ్చ్ఛస్థితికి చేరుకొన్నతరువాత అంతవరకూ జైన, బౌద్ధ, ఆజీవిక సంప్రదాయాలను పాటించిన వ్యక్తులు సంఘబహిష్కృతులు గావించబడ్డారని ఆ విధంగా తిరువళ్లువర్ జాతి అయిన వల్లవన్ జాతి నేడు బహుజన కులంగా మారిపోయిందనే వాదన కూడా కలదు.
ఏది ఏమైనప్పటికీ....
.
తిరుక్కురళ్ లో మొత్తం రెండు పాదాలు కలిగిన 1330 కురళులు (ద్విపదలు) ఉంటాయి. ఇవి సూక్తులుగా, , బోధనలుగా, కవితా వాక్యాలుగా సమస్తమానవాళికి నేటికీ స్పూర్తినిస్తున్నాయి.
.
తిరుక్కురళ్ మూడవ భాగమైన ప్రేమ కురళ్ లలో కొన్నింటికి నేను చేసిన అనువాదం ఇది.
.
తిరుక్కురళ్ - ప్రేమ స్వరాలు
.
1.
అప్సరసా? అరుదైనమయూరమా? లేక
అందంగా అలంకరించుకొన్న మానవకన్యా? ఎవరీమె అంటూ
నా హృదయం తర్కించుకొంటోంది (1081)
2.
మృత్యువో, నయనాలో లేక హరిణమో?
ఆమె చూపులు నాకు ఆ మూడింటినీ
స్ఫురింపచేస్తున్నాయి (1085)
3.
ఆ యువతి చనుధ్వయాన్ని కప్పుతోన్న వస్త్రం,
మదమెక్కిన ఏనుగు కళ్లకు కట్టిన గంతల వలె ఉన్నది (1087)
4.
యుద్ధరంగంలో శతృవులను గడగడలాడించే నా పరాక్రమం
ఆమె అందమైన మోము ముందు ఓడిపోయి తలదించుకొంటుంది (1088)
5.
హరిణి చూపులు, ముగ్ధత్వము అలంకారాలుగా ఉన్న
ఆ పడతికి ఇక వేరే ఆభరణాలు ఎందుకు? (1089)
6.
మధువు సేవించినపుడే మైకం కలుగుతుంది
ప్రేమ ఉత్తచూపులతోనే హృదయాన్ని మత్తెక్కించగలదు (1090)
7.
ఆమె కాటుక కనులు ఏకకాలంలో రెండు పనులు చేయగలవు
ఒకటి గాయపరచటం, రెండు స్వస్థపరచటం (1091)
8.
నేను చూచినపుడు ఆమె కనులు దించుకొని నేలచూపులుచూస్తుంది
చూడనపుడు నన్నే చూస్తూ ముసిముసి నవ్వులు చిందిస్తుంది (1094)
9.
నిరంతరం ఒకరినొకరు కొత్తగా పరిచయమైన వారిగా
భావించటం ప్రేమికులకే చెల్లుతుంది (1099)
10.
హృదయం హృదయంతోను, కళ్ళు కళ్లతోను సంభాషిస్తున్నపుడు
మాటల అవసరం ఏముంది? (1100)
.
మూలం: తిరుక్కురళ్- తిరువళ్ళువర్
అనువాదం: బొల్లోజు బాబా
(ఇంకా ఉంది)
(1Source: భారతీయ సాహిత్యనిర్మాతలు-తిరువళ్ళువర్ - సాహిత్య అకాదెమి)
తిరుక్కురళ్ - ప్రేమస్వరాలు -2
.
తిరుక్కురళ్ మూడవవిభాగమైన ప్రేమ కురళ్ లను The Book of Desire పేరుతో ప్రముఖ కవయిత్రి మీనా కందసామి ఇటీవల అనువదించారు. ఈ పుస్తకంలో తిరువళ్ళువర్ 31 BCE లో జన్మించి ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు.
మద్రాసు ప్రెసిడెన్సీలో సివిల్ సర్వెంట్ గా పనిచేసిన Francis Whyte Ellis (1777-1819) తిరుక్కురళ్ ద్విపదలను ఎంతగానో ప్రేమించాడు. ఇతను మద్రాసు టంకశాలకు ఇంచార్జ్ గా ఉన్నసమయంలో తిరువళ్ళువర్ బొమ్మకలిగిన నాణాలను ముద్రింపచేసాడు.
Whyte Ellis తిరుక్కురళ్ లోని కొన్ని ద్విపదలను ఇంగ్లీషులోకి అనువదించి 1812 లో ప్రచురించాడు. తిరుక్కురళ్ కు పూర్తి ఇంగ్లీషు అనువాదం George Uglow Pope 1886 లో వెలువరించాడు.
***
తిరుక్కురళ్ మూడవ భాగమైన ప్రేమ కురళ్ లలో కొన్నింటికి నేను చేసిన అనువాదాలు ఇవి....
11.
స్పర్శ, రుచి, వాసన, దృష్టి, శ్రవణం - ఒకేక్షణంలో పంచేంద్రియ సుఖాలన్నీ ఆమె కౌగిలిలో లభిస్తాయి. (1101)
12.
చదువు ఎక్కువ అవుతున్నకొద్దీ
ఏమీ తెలియదనే తెలివిడి కూడా ఎక్కువయినట్లుగానే
ఆమెను ఎంత గాఢంగా అనుభవించినా
ఏమీ అనుభవించలేదనే విషయంకూడా నెమ్మదినెమ్మదిగా తెలుస్తూంటుంది. (1110)
13.
నాముందు సువిశాలమైన
సముద్రమంత ప్రేమ పరుచుకొని ఉంది
కానీ దాటేందుకు చిన్న తెప్పకూడా కనిపించదు (1164)
14.
పిచ్చి రాత్రి!
అన్నింటినీ నిద్రబుచ్చి నాకు తోడుకొరకు మేలుకొని ఉంటోంది (1168)
15.
దూరదేశమేగిన నా దయలేని మగని కంటే
క్రూరంగా ఉన్నవీ సుదీర్ఘమైన రాత్రులు (1169)
16.
నా హృదయంలానే నా నేత్రాలు కూడా
అతనితో పాటు వెళిపోయి ఉన్నట్లయితే
అవి నేడు నా కన్నీటి వరదల్లో చిక్కుకొని ఉండకపోను (1170)
17.
అతను ఉన్నప్పుడు నా కనులకు నిద్రరాదు, అతను లేనప్పుడు అవి నిద్రపోవు. ఈ రెండు విపరీతాల మధ్య నా కనులు ఎంత క్షోభకు గురవుతున్నాయో (1179)
18.
మన రహస్యాలన్నీ అందరకూ తెలిసిపోతున్నాయంటే
నిందించాల్సినది బాకాలు ఊదే నా నేత్రాలను (1180)
19.
ఈ నల్లపిల్ల కౌగిలింతలో నాకు
ఇల్లు ఇచ్చే చనువు, ఇంటిభోజనపు సుఖం లభిస్తాయి (1107)
20.
కలహించు, రాజీపడు, సంగమించు
అవన్నీ ప్రేమ దయతో అనుగ్రహించే వరాలు (1109)
తిరుక్కురళ్ - ప్రేమస్వరాలు - చివరి పార్టు
.
తిరుక్కురళ్ మూడవ భాగమైన కామత్తుప్పాల్ లోని 41 కురళ్ లను ప్రేమ స్వరాలు గా అనువదించాను. దానిని పిడిఎఫ్ రూపంలో ఆర్చైవ్ ఆర్గ్ నుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును.
థాంక్యూ ఆల్
బొల్లోజు బాబా
.
21.
ఓ వెన్నెలా!
నువ్వు మురికిగా, కాంతివిహీనంగా ఉన్నావేమీ?
నీ ప్రియుడుకూడా దయలేని వాడా? (1222)
22.
అతను నన్ను తలచుకొందామని అనుకొని
తలచుకోలేదు కాబోలు - వచ్చే తుమ్ము ఆగిపోయింది (1203)
23.
ప్రేమప్రతిపాదనకు స్పందన కరువైనప్పుడు ప్రియునికి
మడల్ స్వారీ1 మాత్రమే గొప్ప ఓదార్పు (1131)
(ప్రియురాలు తిరస్కరించినపుడు ప్రియుడు తాటిఆకులతో చేసిన గుర్రం బొమ్మ ఎక్కి వీధులలో ప్రియురాలి పేరు/చిత్రం రాసిన జండాని ప్రదర్శిస్తూ, రోదిస్తూ తిరగటాన్ని మడల్ స్వారీ అంటారు. ఇంతజరిగాక ప్రియురాలు అంగీకరించవచ్చు. ఇది సంగం యుగపు ఒక ఆచారం)
24.
సాగరమంతటి ప్రేమోద్రేకం ముంచెత్తినప్పటికీ
స్త్రీకి మడల్ నిషేదం.
ఎంత అదృష్టవంతురాలామె! (1137)
25.
దీపం ఆర్పేవరకూ చీకటి ఎదురుచూసినట్లు
నా కౌగిలినుంచి ప్రియుడు దూరమయ్యేవరకు
నన్ను ముంచెత్తటానికి కాంతిహీనత ఎదురుచూస్తోంది (1186)
.
మూలం: తిరుక్కురళ్- తిరువళ్ళువర్
అనువాదం: బొల్లోజు బాబా
ఇక్కడనుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును
No comments:
Post a Comment