న్యూయార్క్, బ్రాడ్వే 26 వ వీధి మూల
చలికాలంలో ప్రతీ సాయింత్రం పూట ఒక వ్యక్తి
వచ్చీపోయే బాటసారులను అడుగుతూ
నిరాశ్రయులకు మంచాలు అందిస్తూంటాడు
అది ప్రపంచాన్ని ఏమీ మార్చివేయదు
మనుషుల మధ్య సంబంధాలను మెరుగుపరచదు
దోపిడీ యుగాన్ని తగ్గించదు
కానీ కొద్దిమందికి ఆ రాత్రికి మంచం దొరుకుతుంది
వారు ఆ రాత్రికి చలిగాలులను తప్పించుకొంటారు
వారిపై కురవాల్సిన మంచు రోడ్డుపై రాలుతుంది
ఇది చదివి పుస్తకాన్ని పక్కన పెట్టేయకు... మిత్రమా!
కొద్దిమందికి ఆ రాత్రికి మంచం దొరుకుతుంది
వారు ఆ రాత్రికి చలిగాలులను తప్పించుకొంటారు
వారిపై కురవాల్సిన మంచు రోడ్డుపై రాలుతుంది
కానీ, అది ప్రపంచాన్ని ఏమీ మార్చివేయదు
మనుషుల మధ్య సంబంధాలను మెరుగుపరచదు
దోపిడీ యుగాన్ని తగ్గించదు
Source: A Bed for the Night by by Bertolt Brecht
అనువాదం: బొల్లోజు బాబా
No comments:
Post a Comment