నిన్న కాకినాడలో హెచ్చార్కె గారి సభా విశేషాలు.... Sailaja Kallakuri గారి వాల్ నుంచి.
.
మారని ధార హెచ్చా ర్కె
అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ అనే మాటని ప్రతి మనిషి ఎంతో కొంత ప్రేమిస్తాడు. ప్రపంచంలో మార్పు కన్నా శాశ్వతమైనది ఏమీ లేదు అని అదే మనిషి ప్రతిక్షణం ఎరుకలో ఉంటాడు కూడా!
అవును! పుట్టిన ప్రతి వాడు నా జీవితం ఎంతో కొంత Predictable గా ఉండాలనుకుంటాడు. అలా ఉండడం కోసమే నిజానికి మానవుడు నాగరికతను సృష్టించాడు. ప్రతిరోజు అడివిలో దారులు వెతుక్కుంటూ తనని తాను రక్షించుకోలేక!.
అది అడవో, జనారణ్యమో, యంత్రాల భూమో, సాంకేతికత నిండిన ఎడారో, ఇక రాబోయే జి పి చాట్ శూన్యమో.... ఇవన్నీ ఒక్కొక్కటి, ఒక్కొక్క మిస్సైల్స్ లా మానవాళిని తాకినప్పటికీ ఇంకా ఉన్నాంగా మనమంతా?ఒకరి పట్ల ఒకరం ప్రేమగా? అభిమానంగా?
ఇంకా మన కళ్ళు వెలుగుతున్నాయిగా, మరో మనసు తో మాట్లాడుతున్న గుర్తుగా? హృదయం తడబడి,మాట చెమ్మగిల్లి, మనమంతా ఒకరితో ఒకరు కరచాలనం చేసుకుంటున్నాం గా?
అదే జరిగింది నిన్న హెచ్ఆర్ కే గారు కాకినాడ వచ్చినప్పుడు.
అనంతపురం మద్దిలేటి వాగు నుంచి గోదావరి పంట కాలువ దాకా, సాయుధ పోరాట సమయం నుంచి ఉక్రెయిన్ యుద్ధ కాలం దాకా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ తోటి మనిషి పట్ల ప్రేమతో నడిచే ఒక జీవధార హెచ్ ఆర్ కే గారు.
ఆయన కాకినాడకు 19-2-2023 న వచ్చారు.
శ్రీ వక్కలంక రామకృష్ణ గారు అన్ని తానే అయి ముందుండి నడిపించిన ఒక్కరోజు కార్యక్రమం చివరికి వచ్చేసరికి సభా ప్రాంగణం నుంచి ప్రతివారు సాదర,సంతోష క్షణాలను కాసిని మూటగట్టుకుని ఇంటికి వెళ్ళగలిగారు.
ఉదయం 'పరివర్తన'లో పిల్లలను ఉద్దేశించి హెచ్ ఆర్ కే గారు మాట్లాడుతూ పదాన్ని ప్రేమించమన్నారు.ప్రతి వస్తువుకు భావానికి మానవుడు ఒక రూపాన్ని ఒక పేరును ఇవ్వగలిగాడని కాబట్టి ప్రతి పదం వెనుక ఒక సైన్స్ ప్రయోగమో, ఒక భావ ధారో ఉంటుందంటూ భాష గురించిన అత్యంత మౌలికమైన రహస్యాన్ని ఆ పిల్లలకు విప్పి చెప్పారు.
ఏదో ఒక పదం మాట్లాడకుండా ప్రతి పదం వెనుక నున్న సామాజిక, తాత్విక కోణాలను తమకు తాము ఆవిష్కరించుకోవడమే జీవితం అని హెచ్ ఆర్ కే గారు తెలియజేశారు.
ఈ ఏ ఒక్క వాక్యం ఆయన నోటిలోంచి వచ్చింది కాదు కానీ, ఇదే ఆయన చెప్పిన సారాంశం.
ఆయన చెప్పిన విధానం మటుకు పక్కనుండి విన్న వాళ్లకు మాత్రమే తెలిసింది.పాట పాడిన విజయ్, కలెక్టర్ ఔతానన్న రవిశంకర్, మా రోజూ రొటీన్ ఇది అంటూ కలబోసుకున్న మరొక చిన్నారి,.... వీళ్ళందరికీ “అరేయ్ పెన్ను అంటే రాసే ఒక వస్తువు కదరా! మరి అది నీకు మార్కులను ఇస్తుంది, ఉద్యోగం తెస్తుంది, రేపు పొద్దున్న రచయితవైతే సమాజంలో మార్పును తెస్తుంది. "హెయిల్ హిట్లర్" అనే ఒక్క నినాదం కొన్నాళ్లపాటు మానవాళిని వణికించింది, అదే....'మరో ప్రపంచం' అంటూ శ్రీశ్రీ చెప్పిన కవిత్వంలో జనజీవన చిత్రమూ ఉంది అంటూ ఆయన సోదాహరణంగా... పదం,భాష భావం,తత్వం అన్నింటినీ సరిగ్గా విని, అర్థం చేసుకుని, ఆ తరువాత మానవ శ్రేయస్సు కోసం అనుక్షణం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని హెచ్ ఆర్ కే గారు బోధించారు.
ఆ తరువాత జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన నోటి నుంచి వచ్చిన కొన్ని ప్రత్యేకమైన విషయాలు
---
1.మల్టీ పొలారిటీతో ఉన్న నేటి సమాజం
2.ఎందరు ఎన్ని రకాల సమూహాలను సృష్టించినా మానవులంతా ఒక్కటిగా నిలబడాలని, సత్యాన్ని శోధించాలని. నేటి సత్యం రేపటికి అసత్యమైతే దాన్ని వదిలి పెట్టాలని ఆయన అభిప్రాయ పడ్డారు.
ఈ వాక్యాలు ఒక పూటతోనో ఒక రోజుతోనో వదిలిపెట్ట గలిగేవి కావు! ఆయనతో మాట్లాడిన తరువాత ఆహారం రుచిని కోల్పోయింది.
ఆయన నోటి వెంట అనేక భాషల్లో రచయితలు, కవులు వారి ఆలోచన స్రవంతి గురించి 'పరివర్తన' హాల్లోనే కాదు, మా హృదయాల్లో కూడా సుడులు తిరుగుతూ సదా మమ్మల్ని చైతన్య వంతంగా ఉంచుతాయనడంతో సందేహం లేదు.
సాయంత్రం గాంధీభవన్లో ఏడు గంటల వేళ శ్రీ అద్దేపల్లి ప్రభు గారి సారధ్యంలో సాహితీ సమావేశం జరిగింది.
సభాధ్యక్షులు శ్రీ బొల్లోజు బాబా గారు ఆద్యంతం సభను కడు సమర్థవంతంగా నిర్వహించారు.
ఇద్దరు ప్రధాన ఉపన్యాసకులు ఒకరు ముక్కామల చక్రధర గారు. మరొకరు సుంకర గోపాల్. ఇద్దరూ ఇద్దరే.
చక్రధర్ గారు తనకు హెచ్ఆర్ కే గారి కుటుంబంతో ఉన్న ఆత్మీయత గురించి తెలియజేసుకుంటూ, "తెలుగు సాహిత్యంలో మరొక కవి వ్రాసిన కవిత్వాన్ని, వ్యక్తిగత స్థితిని బట్టి కాక భాష, భావం, ఆలోచనలను బట్టి విని, ప్రోత్సహించే అరుదైన వ్యక్తిత్వం హెచ్ ఆర్ కే గారిది"అంటూ తన కొన్ని అనుభవాలను తెలియజేశారు.
" ఈ సభ అయ్యేసరికి మనమందరం మనుషుల పట్ల ప్రేమను మరింత ఎక్కువగా, ఇంకొంచెం స్పష్టంగా, మూట కట్టుకుని వెళ్తామని" చెప్పారు. అదే జరగడం అత్యంత ఆనందదాయకం. శ్రీ ముక్కామల చక్రధర్ గారి ప్రసంగంలో సామాన్యంగా కనిపించే వాక్యాల్లోనే అసామాన్యమైన అబ్జర్వేషన్స్ ఉంటాయి. కుండబద్దలు కొట్టేంత నిర్మొహమాటం తప్ప ఇంకేం ఉండదు.
శ్రీ సుంకర గోపాల్ మాట్లాడుతూ--- 1970లో విప్లవ గీతంతో మొదలై దశాబ్దాలు గడిచినా పోరు బాట వదలక,నిక్కచ్చిగా మానవ సమాజం కోసం ఆలోచించే వ్యక్తి శ్రీ హెచ్చార్కే గారు అని అభివర్ణించారు. ఆయన పదాల్లో, కవిత్వ భాషలో సూటిదనం ఎప్పటికీ 'అప్డేటెడ్' గా ఉంటాయని, ఆయన వ్రాసినవన్నీ 'పద్యాలు' అంటూ ఉదాహరణలతో సహా వివరించి చెప్పారు. హెచ్ ఆర్ కే గారు భాషను శాసించి,వాటి భావాన్ని పాఠకుడికి అందించడంలో కృతకృత్యులయ్యారని తెలియజేస్తూ, 'నీటి తాత్వికత' ను ప్రతిబింబించే హెచ్ ఆర్ కే గారు రాసిన ఒక కవితను చదివి వినిపించారు. "మనిషి మొట్టమొదటిసారి తన ప్రతిబింబాన్ని చూసుకున్న అద్దం నీరు" అని హెచ్ ఆర్ కే గారు వ్రాసిన వాక్యం చదివినప్పుడు సభాస్థలి మొత్తం అవాక్కయింది. హెచ్ ఆర్ కే గారి లాంటి కవుల గురించి, తెలుగు నాట కవిత్వాన్ని కవులను ఇంకా సమర్థవంతంగా విద్యార్థి లోకానికి పరిచయం చేయటం లేదనే ఆవేదనను శ్రీ సుంకర గోపాల్ వ్యక్తం చేశారు.
శ్రీ అవధానుల మణి బాబు హెచ్ ఆర్ కే గారు రాసిన రెండు కథలను గురించి ప్రస్తావించి అందులో హెచ్ ఆర్ కే గారి ఎత్తుగడ సంఘర్షణను చిత్రీకరించే నేర్పు గురించి చెప్పారు.
శ్రీ బొల్లోజు బాబా గారు విరోధాభాస ను అలవోకగా నిర్వహించగల నేర్పు గల కవి శ్రీ హెచ్ ఆర్ కే గారు అంటూ, కవి వాక్యాలను కొన్నింటిని చదివి వినిపించారు.
నేను కూడా నాలుగు మాటలు మాట్లాడడానికి పోడియం మీదకు వెళ్లేసరికి హెచ్ ఆర్ కే గారి వ్యక్తిత్వం భావజాలాలకు అతీతంగా.....
వ్యక్తి శ్రమను, శ్రమైక సౌందర్యాన్ని గుర్తించి,
యుద్ధాన్ని, మానవ సంక్షోభాన్ని నిరసించే... నిలువెత్తు నిజాయితీగా ఆయన కనబడడంతో అదే విషయాన్ని నా ప్రసంగంలో చెప్పాను.
తదుపరి హెచ్ ఆర్ కే గారు తన స్పందనను తెలియజేస్తూ మనిషి కలలు కనాలని, కల ఎప్పుడు కృత్రిమంగా ఉండకూడదని,
గతంలోకో,భవిష్యత్తులోకో జారిపోకుండా వర్తమాన క్షణంలో నిలబడి, నిక్కచ్చిగా, సమస్య కళ్ళలోకి చూసినప్పుడు మాత్రమే సరైన సమాధానాలు, పరిష్కారాలు దొరుకుతాయని చెప్పారు.
మేధో శక్తి, ఊహా శక్తి గొప్పవి కావచ్చు కానీ వాటన్నింటికీ అస్తిత్వం మటుకు మనిషి తినే ప్రతి తిండి గింజయే. కనుక అది పండించే రైతు, పండే భూమి మటుకు ఎవరి చేతుల్లో బందీగా ఉండకూడదు అని చెప్పారు.
ఎంత సాంకేతికత వచ్చినా ప్రేమించే మనిషి ముందు నిలబడలేవని ధీమా వ్యక్తం చేశారు.
యుద్ధం ఎక్కడిదైనా రక్తపాతం సృష్టిస్తుంది కాబట్టి అది గర్హనీయమన్నారు. ప్రపంచమంతా మంచి వైపే నడుస్తూ ఉందని, ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయని, ఇవన్నీ మనిషిని మరింత ఉన్నతీకరిస్తూనే వెళ్లాలని, అలాగే జరిగి తీరుతుందని మానవాళి పట్ల తనకున్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
మనుషుల మధ్య విభేదాలు సహజమని, వాటిని పరస్పరం చర్చతో అవగాహన చేసుకోవాలని, మనం ఆలోచనలకు ప్రతీకలుగా కాక ఎదుటివారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటో తెలుసుకోవడం వలనే పురోగమిస్తామని, అటువంటి చర్చ మాత్రమే మనల్ని అర్థవంతంగా మలచగలదని తెలియజేశారు.
శ్రీ అద్దేపల్లి ప్రభు గారు వందన సమర్పణ చేశాక ఎవరికి వారం విడిపోయాం.
ఇంతకు పొద్దున్న లేచేసరికి వార్త ఏమిటంటే, కాకినాడ పట్టణం హెచ్ ఆర్ కే గారిని విపరీతంగా ప్రేమిస్తోంది.
ఏనాడూ లేనిది, షిరిడి ఎక్స్ప్రెస్ 5 గంటలు లేటు!
మనమీద మనకు కన్న మనిషి మీద నమ్మకం పెరిగినపుడు అభద్రత కు తావులేని,స్వార్ధానికి చోటులేని నిర్మలానందం దొరుకుతుంది...
.
Sailaja Kallakuri
No comments:
Post a Comment