Friday, June 26, 2015

అమ్మ

లేత చర్మాన్ని చుట్టిన గుడ్డల్ని
పచ్చిబాలింత బహుజాగ్రత్తగా
మారుస్తున్నపుడు.....

అంచులదాకా చీకటి నిండిన రాత్రి
ఎక్కడెక్కడి వెలుగురేకల్నో ఏరుకొచ్చి
నిదురలో నవ్వుతున్న పాపాయి పెదవులపై
ఒక్కొక్కటిగా పేర్చింది

ఆకుల సవ్వడి, పిట్టపాట
అలల గలగల, ఆకాశపు నిశ్శబ్దం
దేహాల చావులేమి.....
అన్నిమాటలెందుకూ
ఆక్షణం నుంచే
భూమి తిరగటం మొదలైంది.

బొల్లోజు బాబా

Sunday, June 7, 2015

రెండు చింతలు



భుజాలపై చేతులువేసుకొని
నిలుచున్న మిత్రుల్లా ఉండేవి
ఆ రెండు చింతచెట్లు.

నాలుగు తరాల్ని చూసుంటాయి
చివరకు రియల్ ఎస్టేట్  రంపానికి
కట్టెలు కట్టెలుగా చిట్లిపోయాయి.
వేళ్ల పేగులు తెంపుకొని
రెండు చింతలు నేలకొరిగాయి.

వృక్షం నేలకూలితే పిట్టలు
కకావికలం అయినట్లు
హృదయం చుట్టూ  చింతనలు

చిత్రంగా జీవితానికి కూడా
నిత్యం రెండు చింతలు
గతము, భవిష్యత్తూ.

వర్తమాన రంపం
పరాపరా కోస్తుంటే
అక్షరాల రంపంపొట్టు రాలుతోంది

బొల్లోజు బాబా

(నే నడచిన దారిలో నీడనిచ్చిన రెండు చింతచెట్ల  జ్ఞాపకాలతో)

Wednesday, June 3, 2015

వీలుకాదని చెప్పించకు....



నీ దేహమొక స్వప్నం
ప్రతీరోజూ ఆ స్వప్నంలోకి
అనేకానేక అనుభూతులు
వచ్చిపోతూంటాయి

ఎరుపు తెలుపు
నీలిమ ఆకుపచ్చ ఎన్నో..
ఏనాడూ దేనినీ
అనాదరించకు.
ఆహ్వానించు అన్నింటినీ
నీ దేహంలోకి

ఎందుకంటే
అవి నీ గురించే పంపబడ్డాయి
నిన్ను
సంపూర్ణుడిని చేసి
ఓ స్వప్న వర్ణచిత్రంగా
మార్చటానికే
వస్తున్నాయి.

బొల్లోజు బాబా

Saturday, April 25, 2015

గాథాసప్తశతి - 7

 గాథాసప్తశతి  - 7
{గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం.  గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము,  ప్రకృతి సౌందర్యం,ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.}
  
సప్తశతి గాథలలో  చాలాచోట్ల జీవితానుభవాలు చక్కని ఉదాహరణలతో దర్శనమిస్తాయి

ధనస్సును తాకిన మరుక్షణం
రివ్వున దూరమౌతుంది బాణం
వంకరగా ఉండే వారితో
సూటిగా ఉండేవారు స్నేహించగలరా?   ------ గాథాసప్తశతి

ఒకప్పుడు నీ కనులు నా చెంపలను
అలా చూస్తూనే ఉండేవి
నేనీనాటికీ అలానే ఉన్నాను
నా చెంపలు కూడా.
నీ కళ్ళు మాత్రం అలా లేవు. ------ గాథాసప్తశతి

మనసుపడినవాటిని ఎంచుకొంటాము తప్ప
గొప్పలక్షణాలను బట్టి కాదు.
పుళిందులు ముత్యాలను కాదని
గురివిందలను కోరుకోరా? ------ గాథాసప్తశతి

సుదీర్ఘకాల సహజీవనం లో కష్టసుఖాలు పంచుకొని
ప్రేమ అర్ధాన్ని కనుగొన్నదంపతులలో
మొదటచనిపోయినవారు బ్రతికినట్లు    
రెండవవ్యక్తి ఉన్నా చచ్చినట్లే.   (142)

కత్తులు ధరించిన కసాయివాళ్ళు తోలుకుపోతూంటే
గేదెలు వెనక్కు తిరిగి తోటను చూస్తూ
ఇక శెలవు అంటూ సాగిపోయాయి. ------ గాథాసప్తశతి

మగడెంత బ్రతిమాలినప్పటికీ
తన కోపం తగ్గలేదన్న విషయాన్ని
ఆమె బహు నేర్పుగా చెప్పగలదు.
ఏకాంత మందిరంలో కూడా
మగనికి మర్యాదలు చేస్తోంది.   -----  (88)

రత్యానంతరం వివశురాలైన  ఆమె  
చనిపోయిందనుకొని
పాలెకాపు భయంతో పారిపోవటం చూసి
సగం విచ్చుకొన్న
కాయలభారంతో వంగిన పత్తిచెట్టు
నవ్వుకొంటోంది.  ------ (360)

ఓహ్. కాలమా!
ప్రేమకవిత్వం పట్ల రోసిన ఈ యువకుడు
బ్రతకటాన్కి తర్కాన్ని చదువుకొంటున్నాడు
మేమేమో
మా భర్తలకు పరిమితమయ్యాము. ------ గాథాసప్తశతి


(సమాప్తం)
బొల్లోజు బాబా

Wednesday, April 8, 2015

ఆశావాది – నజీమ్ హిక్మత్ (Optimistic Man – Nazim Hikmet)

ఆశావాది – నజీమ్ హిక్మత్ (Optimistic Man – Nazim Hikmet)

అతను చిన్నప్పుడు తూనీగల రెక్కలని తెంచలేదు
రేకు డబ్బాల్ని పిల్లుల తోకలకు కట్టలేదు
మిణుగురుల్ని అగ్గిపెట్టెల్లో బంధించనూలేదు
చీమలపుట్టల్ని ఏనాడూ నేలకూల్చలేదు.
అయినప్పటికీ  పెద్దయ్యాకా
అవన్నీ అతనికి జరిగాయి.

అతను చనిపోయేటపుడు పక్కనే ఉన్నాను
నన్ను కవిత్వం చదవమన్నాడు
సూర్యుడి గురించి, సముద్రం గురించి
అణురియాక్టర్ల గురించి, సాటిలైట్ల గురించి
మానవత్వపు తేజస్సు గురించి.

అనువాదం

బొల్లోజు బాబా

Thursday, April 2, 2015

గాథాసప్తశతి - 5 (ప్రేమ గాథలు)


{గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము, ప్రకృతి సౌందర్యం,ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.}

గాథాసప్తశతి - ప్రేమ గాథలు

సప్తశతి గాథలలో ఎక్కువ భాగం ప్రేమానుభవాలే. అందులో కూడా విరహము, రహస్యసమాగమములు, స్వైరిణీ సంయోగాలు, వివాహం వెలుపలి ప్రేమోదంతాలు వంటి అంశాలు ఎక్కువ. ఇవి ఆ కాలంలో అసహజం కాదని భావించాలి. ఆనాటి ప్రజలు శృంగారాన్ని హాయిగా అనుభవించారు, మాట్లాడు కొన్నారు, అందమైన కవిత్వరూపంలో వ్రాసుకొన్నారు.

Love at first sight అన్న మాట ఎప్పటిదో తెలియదు కాని “చూపులు కలిసిన శుభవేళ” అనే ఈ గాథ మాత్రం

రెండువేల ఏళ్ళనాటిది.....
అతడు ఆమెవైపు చూసాడు
ఆమె అతనివైపు చూసింది. 
ఆ శుభవేళే వారు తమ ప్రేమను 
ఖాయపరచుకొన్నారు -- 627

వస్తానన్న సమయానికి రాకుండా ఆలస్యం చేసిన ప్రియుని పై ప్రేయసి అలుకబూనటం ఎంత అందంగా ఉంటుందీ....

ప్రియా
నీవు నిజంగా నిద్రపోవటం లేదని
కళ్ళు మాత్రమే మూసుకొన్నావని 
నీ చెంపలు నా ముద్దుకు పులకరించటం ద్వారా
నాకు తెలుస్తూందిలే,
ఇంకెప్పుడూ ఆలస్యం చేయను సరేనా! (20)

ఈ గాథలో వర్ణించిన సంఘటన ఎంతో అందంగా, తోడు దొంగల్ని పట్టించేదిగా ఉంటుంది.

రేవు మెట్లు ఎగుడుదిగుడుగా ఉన్నాయనే సాకుతో
ఆమె అతని చాతీకి అతుక్కుపోయింది
అతనుకూడా నిజంగా అదే ఉద్దేశంతో
ఆమెను బలంగా కౌగిలించుకొన్నాడు 193

ఈ గాథలో మరో ఇద్దరు దొంగలు అందంగా పట్టుబడ్డారు.

ఆ బాటసారి ఇందాకటి నుంచి
దోసిటివేళ్లు ఎడంచేసి నీళ్ళు తాగుతున్నాడు
తలపైకెత్తి చలివేంద్రం అమ్మాయినే చూస్తో.
అది గమనించిన ఆమె కూడా 
సన్నంగా ఉన్న ధారను మరింత తగ్గించింది. 161

ఒక అందమైన సందర్భాన్ని మరో రమ్యమైన ఒక పోలికతో ఎలా ముడిపెట్టాడో ఈ గాథాకారుడు చూడండి..

కోపం వల్ల కలిగిన ఆమె చెక్కిళ్ళ ఎరుపు 
అతను మోహంతో చుంబిస్తున్నప్పుడు
క్రమక్రమంగా అదృశ్యమౌతోంది
గాజుపాత్రలోని ద్రాక్షమధువులా. (933)

ముందుగా చెప్పినట్లు ఈ క్రింది గాథను చదివేటపుడు, ఆనాటి సమాజాన్ని దృష్టిలో నిలుపుకోవాలి...

ఊరంతా తుంటరి కుర్రాళ్ళు
వసంతకాలం, యవ్వనం, ముసలిభర్త, ఇప్పసారాయి 
ఏంచెయ్యాలో ఎవరూ చెప్పక్కర్లేదు
చెడిపోకుండా ఉండాలంటే చావొక్కటే దారి. (197)

వితంతువులైన స్త్రీలు అలనాటి కుటుంబాలలో సభ్యులుగా ఉండేవారని అనేక గాథలద్వారా అర్ధమౌతూంటుంది. ఈ క్రింది గాథలో అలాంటి ఒక స్త్రీకి వచ్చిన పెద్ద అనుమానం.......

చలికాలపు రాత్రులు ఎంతకీ తరగవు దీర్ఘమైనవి
చాన్నాళ్లుగా భర్త ఊళ్ళోనే లేడు 
రాత్రుళ్ళు చక్కగా నిద్రపోవచ్చు కదా!
పగలు నిద్రపోతున్నావు; ఏమిటి సంగతీ? (66)

ఈ గాథలో ఓ అత్తకు తగ్గ కోడలు దర్శనమిస్తుంది.....

కోడలు పిల్లా!
వెదురు ఆకులు నీ జుట్టులో చిక్కడి ఉన్నాయి
అత్తా!
నీ వీపంతా దుమ్ముఅంటుకొని ఉంది. (676)

ఈ గాథలో కనిపించే వ్యంగ్యం కానీ వెక్కిరింత స్థాయిని కానీ గమనిస్తే, అప్పటి ప్రజలు నిత్యజీవితంలో ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో బ్రతికి ఉంటారో అని ఆశ్చర్యం కలుగక మానదు.

భర్త శవంపై పడి ఆ మదనవతి
మూర్చలు పోతూ, గుండెలు బాదుకొంటూ ఏడిస్తే
ఎక్కడ సతీసహగమనం చేసుకొంటుందో అని
అందరూ హడిలి చచ్చారు...ఆమె ప్రియుడి తో సహా! (873)

రహస్యప్రేమికునికి సంకేతాల ద్వారా తన సంసిద్దతను తెలియచేసే విలాసవతులు గాథలలో చాలాచోట్ల కనిపిస్తారు. ఈ క్రింది గాథలో ఇంట్లో బస తీసుకొంటున్న బాటసారికి ఓ మోహనాంగి ఎలా తెలివిగా తను మనసులోని మాట చెపుతున్నదో చూడండి...

ఇది మా అత్త పడుకొనే చోటు
ఇక్కడ నేను పడుకొంటాను
అక్కడ పనివాళ్ళు
బాటసారీ! చీకట్లో కనిపించటం లేదని
నా పైన పడేవు. జాగ్రత్త సుమీ! - (669)

ఈ క్రింది గాథ కూడా దాదాపు అలాంటిదే

చిమ్మ చీకటి అలముకొంది
మగడు పొరుగూరు వెళ్ళాడు
ఇంట్లో ఎవరూ లేరు, దొంగలు పడతారేమో!
పొరుగింటివాడా కాస్త కనిపెడుతూ ఉండు - (335)

ఇవి ఒక స్వైరిణి మాటలులా అనిపిస్తాయి. అయినప్పటికీ ఈ గాథలో తొంగిచూసే ఆత్మవిశ్వాసం (నేను నేనే అనుకోవటం వరకూ) ముచ్చటగొల్పుతుంది.

నేను పల్లెటూర్లో పుట్టి పెరిగిన దాన్ని
పల్లెటూరివాసిని 
పట్నం పద్దతులు నాకు తెలియవు
అయినప్పటికీ
పట్నపు ఇంతుల భర్తల్ని వశపర్చుకోగలను
ఎందుకంటే నేను నేనే - 705

చెట్టెందుకెక్కావు అంటే గడ్డికొయ్యటానికి అన్నాట్ట ఒకడు, అలా ఉందీ వ్యవహారం.

ఓ బాలకా
పూలెందుకు కోస్తున్నావు
దేవతలు సంతోషించటానికి ఉదకం చాలు కదా!
గోదావరి తీరాలు
యువకులను పాడుచేస్తున్నాయి. – 355

జారిణులపట్ల వ్యామోహం పెంచుకొంటున్న కుర్రవానికి ఇచ్చిన ఉచిత సలహా...

బాలకా!
తొందరపడకు
బధ్రపరచమని ఉంచటానికి 
ఇది సరైన చోటు కాదు
నాకు తెలిసున్నంతమేరకు
ఇక్కడ దాచుకొన్న హృదయాల్ని 
ఎవ్వరూ తిరిగిపొందలేదు - 154


బొల్లోజు బాబా

Sunday, March 29, 2015

గాథాసప్తశతి 4 - రమణీ మనోహరులు


{గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము, ప్రకృతి సౌందర్యం,ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.}

గాథాసప్తశతి  - రమణీ మనోహరులు
ఒక అందమైన అమ్మాయిని వర్ణించేటపుడు దేహసౌందర్యం ప్రధాన పాత్రవహించటం, అదే పురుషుని వర్ణించవలసివచ్చినపుడు అది అతనిపట్ల మనసుపడ్డ ఒక స్త్రీ మనోచిత్రణ పరంగా ఉండటం ఈ గాథలలో చాలాచోట్ల కనిపిస్తుంది.

ఒక యవ్వనవతి తను మనసుపడ్డ యువకుని గురించి తన అత్తతో ఇలా అంటుంది

అత్తా!
ఆ యువకుడ్ని తదేకంగా 
ఎంతసేపు చూసినా అలుపైతే రాదు కానీ 
కలలో నీళ్ళు తాగినట్టు దాహం తీరదు. – 93

తన ప్రియుడు ఏ ఇంట్లో (ఎవరితో) ఉన్నాడో కనిపెట్టటానికి ఈ అమ్మాయి వేసిన పధకం బాగుంది చూడండి

పండగపూట కొత్తదుస్తులు ధరించి 
పిండివంటలు ఇంటింటికీ 
తిరుగుతూ పంచుతోంది పిచ్చిపిల్ల
నువ్వెక్కడయినా కనిపిస్తావన్న ఆశతో - 328

ప్రియుడి చేతిస్పర్శ పొందటమే భాగ్యంగా భావిస్తూ ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకొంటుందీ అమ్మాయి

నాకున్నవన్నీ మంటలకు బూడిదైనా
నాకు ఆనందంగానే ఉంది, ఎందుకంటే
మంటలనార్పేటపుడు
అతడు నా చేతుల్ని తాకుతూ 
నీళ్ళకడవ అందుకొన్నాడు. – 229

ఈ క్రింది గాథలో వర్ణించిన ఘటన అతిశయోక్తిగా అనిపించినా గాథాకారుని చమత్కారం అర్ధం చేసుకోవచ్చు.

నీ గొంతువినంగానే నిన్ను చూడటానికి
ఇంటినుండి పరుగులిడుతూ బయటకు వచ్చింది
నీవు వెళిపోయాకా ఆమెను 
మోసుకు తీసుకెళ్ళాల్సివచ్చింది. - 506

ఎట్టకేలకు కలుసుకొన్న ప్రియుడు మౌనంగా ఉంటే ప్రియురాలు అతన్ని ఎలా మాటల్లోకి దింపుతుందో చూడండి

చాలామంది నీ గురించి ఎంతొ చెప్పారు
ఈనాటికి నిన్ను కళ్ళారా చూస్తున్నాను
ప్రియతమా ఏదో ఒకటి మాట్లాడు
నా చెవులు కూడా తేనెను గ్రోలనీ! - 805

తాను అనుభవిస్తున్న భాదనంతా ఈమె ఎంత గడుసుగా చెపుతున్నదో చూసారా

ప్రియసఖుడా
నిన్ను చూడని స్త్రీలు మాత్రమే
సంతోషంగా ఉంటున్నారు
సుఖంగా నిద్రపోతున్నారు
చెప్పినది వింటున్నారు
మాటలుకోసం తడుముకోవటం లేదు. – 418

ప్రియుని చూసిన ఆనందాతిశయంలో చెమర్చిన నయనాలను దాచుకోలేకపోయిందట ఓ పడతి..... (వేరే అన్వయాలు కూడా చెప్పుకోవచ్చు)

నిన్నుచూచినపుడు
తల్లిదండ్రులు పక్కనున్నారని 
ఏ ఉద్వేగాన్నీ ప్రదర్శించలేదుకానీ
ఆమె రెప్పలు మూసినపుడు
ఓ కన్నీటి బిందువు జాలువారింది. – 367

ఈ గాథలోని వర్ణన నేటి సినిమా పాటలవరకూ విస్తరించి ఉందంటే అదెంత బలమైనదో ఊహించండి.

తమ ప్రియులను కనీసం స్వప్నాలలో 
దర్శించుకొనేవారు ధన్యులు
నీవు నా పక్కన లేకుంటే కలలమాట అటుంచు
నిదురే రాదు నాకు. - 397

ఈ క్రింది గాథ చాలా చాలా అందమైన ఊహ...

నిన్ను చుట్టుకొన్న నా చేతుల్ని 
బలంతో తొలగించుకొని దూరదేశానికి వెళుతున్నావు
నా హృదయం నుంచి నీ రూపు తొలగించి చూపు
అపుడు నీ బలాన్ని నేను గుర్తిస్తాను. - 749

ఇస్మాయిల్ గారు “తెరచుకొన్న పద్యం” అన్నది ఇలాంటి వాటిగురించే. పద్యం ముగిసాకా ఆ తొలుచూలు పడతి
మనసులో కోరుకునేదేమిటో పాఠకుడే పూరించుకోవాలి.

తొలిచూలు పడతిని సఖులు
నీ మనసులోని కోరిక ఏమిటని అడగగా
సిగ్గుపడుతూ భర్తను చూసింది. - 115

బొల్లోజు బాబా

Monday, March 16, 2015

"ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకం కినిగెలో లభ్యం

నే రచించిన "ఫ్రెంచిపాలనలో యానాం" (The Colonial History of Yanam) పుస్తకం కినిగెలో ఈ క్రింది లింకులో లభిస్తుంది.  ఆశక్తికలిగిన మిత్రులు దయచేసి ప్రోత్సహించవలసినదిగా ప్రార్ధిస్తున్నాను.

http://kinige.com/book/French%20Palanalo%20Yanam



భవదీయుడు
బొల్లోజు బాబా 

Saturday, February 28, 2015

గాథాసప్తశతి

గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని. గాథాసప్తశతి అంటే హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం అని. ఇది ప్రాకృత భాషలో రచింపబడింది.      
ఈ గ్రంధములో హాలుని విరచితములు అధికం.   పల్లెజీవనము, ఆనాటిప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు ఈ గాధలలో కనపడుతూంటాయి. .

కొద్దిరోజుల క్రితం శ్రీ చినవీరభద్రుడు గారు మా కాకినాడ వచ్చినపుడు హాలుని గాథాసప్తశతిపై మాట్లాడతారని ఒక స్థానిక సాహితీసంస్థ ప్రకటించింది. కానీ వేరే కారణాల వల్ల ఆయన మరో అంశంపై మాట్లాడారు. 

అప్పటినుంచి ఈ గాథా సప్తశతి గురించి వెతికితే, దీవిసుబ్బారావుగారి అనువాదం కినిగేలో దొరికింది. చాలాబాగుందనిపించింది.  తరువాత 1944 లో శ్రీ గట్టి లక్ష్మి నరశింహ శాస్త్రిగారు, 1930 నాటి శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు, Peter Khoroche & Herman Tieken లు చేసిన అనువాదాలు లభించాయి.

సప్తశతి గాధలలో చాలామట్టుకు శృంగార ప్రధానంగా ఉంటాయి. స్వేచ్చగా, అరమరికలు లేకుండా ఉండే పల్లెజీవుల ప్రణయకలాపాలు. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.  వాటిలో ఉన్న ఆ కవిత్వం వల్లే అవి రెండువేల సంవత్సరాలుగా నిలిచిఉన్నాయని అనిపించింది. నాకు నచ్చిన కొన్ని గాధల్ని అనువదిస్తున్నాను. త్వరలో పంచుకొంటాను. ప్రస్తుతానికి ఒక అనువాదం (మొత్తం అయిదు వెర్షన్లు ఇక్కడ సరదాగా......)  ఈ క్రింది ఇవ్వబడిన  గాథలో భార్యమొఖము మామూలుగానే ఒక చందమామ. మసి అంటుకొన్న తరువాత మచ్చలతోకూడిన చందమామ లా అయ్యింది అని ఒక భాష్యము. ఆ గాథలన్నీ కొండవంటివి. కొండను అద్దంలో చూపించటంలో ఎవరి అద్దం వారిదే ఎవరి అర్ధం వారిదే. 


The husband laughed at his wife’s face
Which, smudged with soot
That stuck to her hand from kitchen work,
Looked more than ever like the moon. [14] (Peter Khoroche & Herman Tieken)


వంట యింటి పనులనంటిన మసిచేయి
సోకియుండ జంద్ర సుందరముగ 
నింపుగొల్పుచున్న ఇల్లాలి మోమును
భర్త నవ్వుచున్నవాడు చూచి ---- రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ


పులుముకొని వంటపని మసి మలినమైన
చివురుచేత సంస్పృష్టము చెలువమోము
హరిణలాంఛనునునుగోము నాముకొనియె
ననుచు నుల్లసిల్లె బ్రియుండు హాసమొలుక – గట్టి లక్ష్మినరశింహ శాస్త్రి


వంటింటి పనుల్లో
మసి అంటుకున్న చేయి తగిలి
చంద్రబింబంలా మెరిసిపోతున్న
ఇల్లాలిమోము చూసి
మొగుడు ముసిముసి నవ్వులు
నవ్వుతున్నాడు              ------ దీవి సుబ్బారావు


వంటింటి పనిలో చేతిమసి ముఖానికంటుకొని
మునుపటికంటె మరింత ఎక్కువగా చందమామను
పోలిన భార్య మోమును చూసి 
భర్త ముసిముసినవ్వులు నవ్వుతున్నాడు --- బొల్లోజు బాబా

గాథాసప్తశతి

గాథాసప్తశతి

గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఇది ప్రాకృత భాషలో రచింపబడింది.  
    
ఈ గ్రంధములో హాలుని విరచితములు అధికం.  పల్లెజీవనము, ఆనాటిప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు, ప్రకృతి వర్ణణలు ఈ గాథలలో కనపడుతూంటాయి.  సప్తశతి గాధలలో చాలామట్టుకు శృంగార ప్రధానంగా ఉంటాయి. స్వేచ్చగా, అరమరికలు లేకుండా ఉండే పల్లెజీవుల ప్రణయకలాపాలు అవి.  గోదావరి, నర్మద నదీతీరాలలో వికసించిన కవిత్వం ఇది.  ఈ కావ్యం అమృతమధురం అని హాలుడే స్వయంగా చెప్పాడు.  ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.  వాటిలో ఉన్న ఆ కవిత్వం వల్లే అవి రెండువేల సంవత్సరాలుగా నిలిచిఉన్నాయి అనిపించకమానదు. 

గాథాసప్తశతి ప్రభావం భారతీయసాహిత్యంపై ఎంతోఉంది. కాళిదాసు వర్ణణలపై, తమిళ సంగం సాహిత్యంపై, కబీర్, సూరదాస్ వంటి భక్తికవులపైనా గాధాసప్తశతి ప్రభావం ఉన్నట్లు నేడు గుర్తించ గలుగుతున్నారు.  

కావ్యాలంకార శాస్త్రాల్ని రచించిన  అనేక మీమాంసకులను గాథాసప్తశతి ప్రభావితం చేసింది.  ధ్వని సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ఆనందవర్ధనుడు ఆ సిద్దాంతానికి మద్దతుగా గాథాసప్తశతి నుంచి అనేక ఉదాహరణలు తీసుకొని తన “ద్వన్యాలోకం” గ్రంధంలో ఉటంకించాడు.  

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గాథాసప్తశతికి అపూర్వమైన ఆదరణ లభీస్తుంది.  ఎందుకంటే ప్రపంచం అంతటా కవిత్వాన్ని మత, రాజకీయ భావజాలాలనుంచి విముక్తిచేయాలనే ప్రయత్నం జరుగుతున్నది.  ఈ ప్రయత్నంలో భాగంగానే,   సూఫీ సాహిత్యం, మధ్యయుగపు చైనీస్ కవిత్వం, గాథాసప్తశతి వంటి రచనలు గొప్ప గౌరవం పొందుతున్నాయి

గాథాసప్తశతిని తెలుగులో అనేకమంది అనువదించారు. శ్రీనాథుడు తన యౌవనారంభంలో గాథాసప్తశతిని అనువదించాను అని చెప్పుకొన్నాడు కానీ వాటిలో ఒక్క గాథ అనువాదం తప్పమరేవీ  లభ్యంలో లేవు.  
1930 నాటి శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ , తరువాత 1944 లో శ్రీ గట్టి లక్ష్మి నరశింహ శాస్త్రిగారు చేసిన అనువాదాలు అంతర్జాలంలో దొరుకుతాయి. 2012లో శ్రీ నరాల రామారెడ్డి, సంస్కృతమూలచ్ఛాయలను ఇస్తూ,  గాథాత్రిశతి పేరిట మూడు వందల గాథలను తెనిగించారు. 

ఇటీవలి కాలంలో శ్రీ దీవిసుబ్బారావు తెలుగులోకి గాథాసప్తశతిని అనువదించారు. ప్రముఖ కథకుడు శ్రీ తల్లావఝుల పతంజలిశాస్త్రి గారు కొన్ని గాథలను అనువదించారు.  శ్రీ కొలకలూరి ఇనాక్ గారు తమ ఒక రచనకు గాథలు అన్న పేరు పెట్టుకొన్నారు.  

Hala’s Sattasai పేరుతో Peter Khoroche & Herman Tieken లు చేసిన గాథాసప్తశతి అనువాదం ప్రపంచవ్యాప్తంగా ఆదరణపొంది ప్రమాణికంగా పరిగణింపబడుతున్నది.   


ఈ గాథలన్నీ కొండవంటివి.  కొండను అద్దంలో చూపించటంలో ఎవరి అద్దం వారిదే ఎవరి అర్ధం వారిదే. ఈ క్రింది ఇవ్వబడిన గాథకు భార్యమొఖము మామూలుగానే ఒక చందమామ. మసి అంటుకొన్న తరువాత మచ్చలతోకూడిన చందమామలా అయ్యింది అని ఒక భాష్యము. దీనికి వివిధ కవులు చేసిన అనువాదాలు ఇలా ఉన్నాయి. 

The husband laughed at his wife’s face
Which, smudged with soot
That stuck to her hand from kitchen work,
Looked more than ever like the moon. [14] (Peter Khoroche & Herman Tieken)

వంట యింటి పనులనంటిన మసిచేయి
సోకియుండ జంద్ర సుందరముగ 
నింపుగొల్పుచున్న ఇల్లాలి మోమును
భర్త నవ్వుచున్నవాడు చూచి ---- రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ

పులుముకొని వంటపని మసి మలినమైన
చివురుచేత సంస్పృష్టము చెలువమోము
హరిణలాంఛనునునుగోము నాముకొనియె
ననుచు నుల్లసిల్లె బ్రియుండు హాసమొలుక – గట్టి లక్ష్మినరశింహ శాస్త్రి
(సంస్పృష్టము = తాకిన, హరిణ = తెల్లని, 


వంటవార్పుల మునిగిన వారిజాక్ష
కురులనెగద్రోయ మలినితకరముతోడ
ముఖముమసియంటి సకళంకపూర్ణచంద్రు
పగిదిభాసింప – నాథుడు పరిహసించె      ---- నరాల రామారెడ్డి

వంటింటి పనుల్లో
మసి అంటుకున్న చేయి తగిలి
చంద్రబింబంలా మెరిసిపోతున్న
ఇల్లాలిమోము చూసి
మొగుడు ముసిముసి నవ్వులు
నవ్వుతున్నాడు              ------ దీవి సుబ్బారావు

వంటింటి పనిలో చేతిమసి ముఖానికంటుకొని
మునుపటికంటె మరింత ఎక్కువగా చందమామను
పోలిన భార్య మోమును చూసి 
భర్త ముసిముసినవ్వులు నవ్వుతున్నాడు --- బొల్లోజు బాబా


అన్నింటిలోను శ్రీ గట్టి లక్ష్మినరశింహ శాస్త్రి గారి అనువాదం  గ్రాంధికంగా సాగుతుంది.  వారికంటే 14 ఏళ్ళ ముందు వ్రాసిన శ్రీ రాళ్ళపల్లి వారి అనువాదం కొంచెం సరళంగా ఉండటం గమనార్హం.  ఇటీవలికాలంలో వచ్చిన అనువాదాల్లో రామారెడ్డిగారి తెనిగింపు తేటగీతి పద్దతిలో, సుబ్బారావుగారి అనువాదం వచనకవిత్వరూపంలోను ఉన్నాయి.  

జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రామారెడ్డిగారి గాథ లో “సకళంకపూర్ణచంద్రు” అన్న ప్రయోగం ద్వారా మచ్చలతో కూడిన చంద్రుడు అన్న అర్ధం వచ్చి, Peter Khoroche & Herman Tieken అనువాదానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది.  

(కవిసంధ్య పత్రికలో ఇకపై ప్రతినెలా  గాథాసప్తశతి లో ఉన్న – దేవతల ప్రస్తావన, ప్రకృతి వర్ణణలు, అపురూప సౌందర్యవతులు, నారీమనోహరులు, ప్రేమగాథలు, అన్యోన్య దంపతులు, జీవితానుభవాలు అనే వివిధ అంశాలతో కూడిన గాథలకు నేను చేసిన,  వివరణలతో కూడిన అనువాదాల పరంపర ఉంటుంది. -- బొల్లోజు బాబా)