Thursday, April 2, 2015

గాథాసప్తశతి - 5 (ప్రేమ గాథలు)


{గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము, ప్రకృతి సౌందర్యం,ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.}

గాథాసప్తశతి - ప్రేమ గాథలు

సప్తశతి గాథలలో ఎక్కువ భాగం ప్రేమానుభవాలే. అందులో కూడా విరహము, రహస్యసమాగమములు, స్వైరిణీ సంయోగాలు, వివాహం వెలుపలి ప్రేమోదంతాలు వంటి అంశాలు ఎక్కువ. ఇవి ఆ కాలంలో అసహజం కాదని భావించాలి. ఆనాటి ప్రజలు శృంగారాన్ని హాయిగా అనుభవించారు, మాట్లాడు కొన్నారు, అందమైన కవిత్వరూపంలో వ్రాసుకొన్నారు.

Love at first sight అన్న మాట ఎప్పటిదో తెలియదు కాని “చూపులు కలిసిన శుభవేళ” అనే ఈ గాథ మాత్రం

రెండువేల ఏళ్ళనాటిది.....
అతడు ఆమెవైపు చూసాడు
ఆమె అతనివైపు చూసింది. 
ఆ శుభవేళే వారు తమ ప్రేమను 
ఖాయపరచుకొన్నారు -- 627

వస్తానన్న సమయానికి రాకుండా ఆలస్యం చేసిన ప్రియుని పై ప్రేయసి అలుకబూనటం ఎంత అందంగా ఉంటుందీ....

ప్రియా
నీవు నిజంగా నిద్రపోవటం లేదని
కళ్ళు మాత్రమే మూసుకొన్నావని 
నీ చెంపలు నా ముద్దుకు పులకరించటం ద్వారా
నాకు తెలుస్తూందిలే,
ఇంకెప్పుడూ ఆలస్యం చేయను సరేనా! (20)

ఈ గాథలో వర్ణించిన సంఘటన ఎంతో అందంగా, తోడు దొంగల్ని పట్టించేదిగా ఉంటుంది.

రేవు మెట్లు ఎగుడుదిగుడుగా ఉన్నాయనే సాకుతో
ఆమె అతని చాతీకి అతుక్కుపోయింది
అతనుకూడా నిజంగా అదే ఉద్దేశంతో
ఆమెను బలంగా కౌగిలించుకొన్నాడు 193

ఈ గాథలో మరో ఇద్దరు దొంగలు అందంగా పట్టుబడ్డారు.

ఆ బాటసారి ఇందాకటి నుంచి
దోసిటివేళ్లు ఎడంచేసి నీళ్ళు తాగుతున్నాడు
తలపైకెత్తి చలివేంద్రం అమ్మాయినే చూస్తో.
అది గమనించిన ఆమె కూడా 
సన్నంగా ఉన్న ధారను మరింత తగ్గించింది. 161

ఒక అందమైన సందర్భాన్ని మరో రమ్యమైన ఒక పోలికతో ఎలా ముడిపెట్టాడో ఈ గాథాకారుడు చూడండి..

కోపం వల్ల కలిగిన ఆమె చెక్కిళ్ళ ఎరుపు 
అతను మోహంతో చుంబిస్తున్నప్పుడు
క్రమక్రమంగా అదృశ్యమౌతోంది
గాజుపాత్రలోని ద్రాక్షమధువులా. (933)

ముందుగా చెప్పినట్లు ఈ క్రింది గాథను చదివేటపుడు, ఆనాటి సమాజాన్ని దృష్టిలో నిలుపుకోవాలి...

ఊరంతా తుంటరి కుర్రాళ్ళు
వసంతకాలం, యవ్వనం, ముసలిభర్త, ఇప్పసారాయి 
ఏంచెయ్యాలో ఎవరూ చెప్పక్కర్లేదు
చెడిపోకుండా ఉండాలంటే చావొక్కటే దారి. (197)

వితంతువులైన స్త్రీలు అలనాటి కుటుంబాలలో సభ్యులుగా ఉండేవారని అనేక గాథలద్వారా అర్ధమౌతూంటుంది. ఈ క్రింది గాథలో అలాంటి ఒక స్త్రీకి వచ్చిన పెద్ద అనుమానం.......

చలికాలపు రాత్రులు ఎంతకీ తరగవు దీర్ఘమైనవి
చాన్నాళ్లుగా భర్త ఊళ్ళోనే లేడు 
రాత్రుళ్ళు చక్కగా నిద్రపోవచ్చు కదా!
పగలు నిద్రపోతున్నావు; ఏమిటి సంగతీ? (66)

ఈ గాథలో ఓ అత్తకు తగ్గ కోడలు దర్శనమిస్తుంది.....

కోడలు పిల్లా!
వెదురు ఆకులు నీ జుట్టులో చిక్కడి ఉన్నాయి
అత్తా!
నీ వీపంతా దుమ్ముఅంటుకొని ఉంది. (676)

ఈ గాథలో కనిపించే వ్యంగ్యం కానీ వెక్కిరింత స్థాయిని కానీ గమనిస్తే, అప్పటి ప్రజలు నిత్యజీవితంలో ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో బ్రతికి ఉంటారో అని ఆశ్చర్యం కలుగక మానదు.

భర్త శవంపై పడి ఆ మదనవతి
మూర్చలు పోతూ, గుండెలు బాదుకొంటూ ఏడిస్తే
ఎక్కడ సతీసహగమనం చేసుకొంటుందో అని
అందరూ హడిలి చచ్చారు...ఆమె ప్రియుడి తో సహా! (873)

రహస్యప్రేమికునికి సంకేతాల ద్వారా తన సంసిద్దతను తెలియచేసే విలాసవతులు గాథలలో చాలాచోట్ల కనిపిస్తారు. ఈ క్రింది గాథలో ఇంట్లో బస తీసుకొంటున్న బాటసారికి ఓ మోహనాంగి ఎలా తెలివిగా తను మనసులోని మాట చెపుతున్నదో చూడండి...

ఇది మా అత్త పడుకొనే చోటు
ఇక్కడ నేను పడుకొంటాను
అక్కడ పనివాళ్ళు
బాటసారీ! చీకట్లో కనిపించటం లేదని
నా పైన పడేవు. జాగ్రత్త సుమీ! - (669)

ఈ క్రింది గాథ కూడా దాదాపు అలాంటిదే

చిమ్మ చీకటి అలముకొంది
మగడు పొరుగూరు వెళ్ళాడు
ఇంట్లో ఎవరూ లేరు, దొంగలు పడతారేమో!
పొరుగింటివాడా కాస్త కనిపెడుతూ ఉండు - (335)

ఇవి ఒక స్వైరిణి మాటలులా అనిపిస్తాయి. అయినప్పటికీ ఈ గాథలో తొంగిచూసే ఆత్మవిశ్వాసం (నేను నేనే అనుకోవటం వరకూ) ముచ్చటగొల్పుతుంది.

నేను పల్లెటూర్లో పుట్టి పెరిగిన దాన్ని
పల్లెటూరివాసిని 
పట్నం పద్దతులు నాకు తెలియవు
అయినప్పటికీ
పట్నపు ఇంతుల భర్తల్ని వశపర్చుకోగలను
ఎందుకంటే నేను నేనే - 705

చెట్టెందుకెక్కావు అంటే గడ్డికొయ్యటానికి అన్నాట్ట ఒకడు, అలా ఉందీ వ్యవహారం.

ఓ బాలకా
పూలెందుకు కోస్తున్నావు
దేవతలు సంతోషించటానికి ఉదకం చాలు కదా!
గోదావరి తీరాలు
యువకులను పాడుచేస్తున్నాయి. – 355

జారిణులపట్ల వ్యామోహం పెంచుకొంటున్న కుర్రవానికి ఇచ్చిన ఉచిత సలహా...

బాలకా!
తొందరపడకు
బధ్రపరచమని ఉంచటానికి 
ఇది సరైన చోటు కాదు
నాకు తెలిసున్నంతమేరకు
ఇక్కడ దాచుకొన్న హృదయాల్ని 
ఎవ్వరూ తిరిగిపొందలేదు - 154


బొల్లోజు బాబా

No comments:

Post a Comment