Sunday, February 9, 2020

"మూడో కన్నీటిచుక్క"5

నా కవితా సంపుటి "మూడో కన్నీటిచుక్క" పై శ్రీ Abdul Rajahussain
గారి సమీక్ష. థాంక్యూ సర్
***

బొల్లోజు బాబా “ మూడో కన్నీటి చుక్క “ సమీక్ష !!

కళ్ళు రెండే...ఏడిస్తే మొదట రాలేవి రెండు కన్నీటి చుక్కలే... ఈ మూడో కన్నీటి చుక్క ఎక్కడిది? ఇదే ….ఈ జువాలజీ మేస్టారు చెప్పుదలుచుకున్న అసలు విషయం.

ఈ జువాలజీ మేస్టారు కప్పల్ని,బొద్దింకల్ని,వాన పాముల్ని డిసెక్షన్ చేసి ఏ పార్టు ఎక్కడుందో పిల్లలకు చూపించినట్లే..తన కవిత్వంతో ఈ సమాజాన్నిడిసెక్షన్ చేసి రుగ్మతల్ని డిటెక్ట్ చేస్తున్నాడు కవి బొల్లోజు బాబా.

బొల్లోజు బాబా నాకు చాలా కాలంగా తెలుసు. సాహిత్య కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కలుసుకోవడమేకానీ,ఎప్పుడూ సాహిత్య చర్చ చేయలేదు. కారణం ఐటువంటి సందర్భమేదీ రాలేదు. అయితే ఆయన కవిత్వంచదువుతూ వుంటాను, కానీ ఎప్పుడూ ఆయన కవిత్వంపై ఏదీ రాసినట్లు గుర్తులేదు. దాదాపు రాయలేదనే చెప్పాలి. దానికిప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. అలాంటి సందర్భం కానీ, ఆ సమయం కానీ రాకపోవడమే…!!

ఇదిగో ఇప్పుడు “ మూడో కన్నీటి చుక్క “ (డిసెంబర్ 2019 ) పేరుతో బొల్లోజు బాబా తాజా కవితా సంపుటిచదివాక ఇక రాయలేకుండా వుండలేకపోతున్నాను.కారణం ఆయన కవిత్వం అలాంటిది
మరి.ఓ సారిచదివాక మళ్ళీ మళ్ళీ చదవాలనిపించి చదివాను. ఇన్ని సార్లు చదివాక కూడా ఏమీ రాయక పోతే ..అది నా లోపం అవుతుంది. మంచి కవిత్వానికి అన్యాయం చేసినట్లవుతుంది.

బొల్లోజు బాబా..కేరాఫ్ యానాం.! నిజానికి కాకినాడలో నివాసం.అయితే ఆయన సాహిత్య ప్రస్థానమంతా యానాం తోనే ముడిపడి వుంది. ఎంతగా అంటే..”యానాం విమోచనోద్యమం “
(2007)‌ గురించి ఓ పరిశోథక గ్రంథం రాసినంతగా..!

“ఆకుపచ్చని తడి గీతం”(2009) పేరుతో గుండె తడిచేసే తొలి కవితా సంపుటి వెలువరించాడు.
ఆ తర్వాత “వెలుతురు తెర “ (2016 ) ద్వితీయ సంపుటిగా వచ్చింది.మళ్ళీ మూడేళ్ళకు గానీ …. ముచ్చటగా మూడోసంపుటి “మూడో కన్నీటి చుక్క “ (2019) వెలువడింది.
కవిత్వంలో కొంచెం ‘స్లో ‘ అయినా ..కళిత్వంలో ‘ఫ్లో ‘ మాత్రం మిస్ కానివ్వడు.
ఈలోగా అనువాదాలు ..2016లో రవీంద్ర కవీంద్రుని ‘ స్ట్రే బర్డ్స్ ‘ ను “స్వేచ్ఛా విహంగాలు “పేరుతో తెలుగులో అనువదించాడు.

అలాగే సూఫీకవుల కవిత్వాన్ని“ఎడారి అత్తరు" గా తెనుగీకరించాడు. ప్యాబ్లో నెరూడా. ఇరవై ప్రేమ కవితల్ని తెలుగు సేత చేశాడు.

అలాగే రవీంద్రుని “ క్రీసెంట్ మూన్, “గాధా సప్తశతి “ వంటి అనువాదాలు చేశాడు.అంటే ..సొంత కవిత్వం కంటే అనువాదాలే ఎక్కువన్నమాట.అయితే అనువాదాల్లో కూడా తన మార్క్ ను మిస్ కాకుండా జాగ్రత్త పడటం వల్ల, అనువాదాలన్నీ దాదాపుసొంత రచనల్లాగే కనబడతాయి.

నిజానికి జంతు శాస్త్ర మేస్టార్లకి హృదయం వుండదంటారు.కానీ బొల్లోజు బాబాఇందుకు మినహాయింపు. వృత్తి జువాలజీ బోధన..ప్రవృత్తి కవిత్వ రచన..పొంతన లేని వైవిధ్యాల మధ్య తనదైన ఉనికిని చాటుకుంటున్నాడు బొల్లోజు బాబా.

సమాజమే కాన్వాస్ గా….!!

మూడో కన్నీటి చుక్క కవిత్వానికి సమాజాన్ని కాన్వాస్ గా తీసుకున్నాడు. ఇంతకు ముందే చెప్పినట్లు సమాజాన్నిచీల్చి చెండాడి (డిసెక్షన్ ) నిజాల్ని వెలికి తీశాడు. నిజం ఎంత నిష్టూరమైనా వెల్లడించడంలో వెనకాడలేదు. కాకపోతే టముకు కొట్టినట్లు కాక చాపకింద నీరులా నిశ్శబ్దంగానే దుర్మార్గాల భాండాల్ని బద్దలు చేశాడు. అవసరమనుకున్నచోట నేలకేసి కొట్టాడు. ఏది చేసినా, ఎలా చేసినా సత్యాన్ని ఆవిష్కరించి
పాఠకుడి ముందు పెడతాడు. ఆపై తీర్పు పాఠకులదే అంటాడు బొల్లోజు బాబా.

విద్యుల్లత ఈయన కవిత్వం…

బొల్లోజు కవిత్వం చదువుతుంటే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంది.ఉన్నట్టుండి నల్లని మబ్బును చీల్చుకుంటూ ఓ మెరుపు మెరిసినట్లు...సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై కొరడా ఝళిపించి నపుడు మనకు తెలీకుండానే మన మస్తిష్కంలో ఓ విద్యుల్లత తళుక్కున మెరుస్తుంది. పాఠకుడు ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా ..మెరుపు అనుభవాన్ని మిస్ అవుతాడు. అందుకే బొల్లోజు కవిత్వన్ని చదివేటపుడు బుర్ర దగ్గర పెట్టుకోవాలి.కవిత్వ మెరుపుల్ని ఒడిసిపట్టుకోవాలి. అనుభవించాలి.

ఉదాహరణకు ఈ కింది కవిత చూడండి.

భూమంటే విద్యుత్ కాంతుల్లో
బెల్లీ డాన్స్ చేసే ఆటకత్తె..వాడికి

భూమంటే..నొసటన దిద్దుకునే
ఆకు పచ్చని విభూతి పండు ...వీడికి

యుద్ధానంతరం
భూమికి వీరిద్దరూ
ఓ ఆరడుగుల బాధ్యత…!!” ( భూసేకరణ )

చూడ్డానికి ఈ కవిత చిన్నదే..కానీ వ్యక్తీకరణలో ఎంతో గొప్పది.

ఈ మధ్య సెజ్ ల పేరుతో,రాజధాని పేరుతో, ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం భూసేకరణ చేయడం చూస్తూనే వున్నాం. రాజ్యం ఎప్పుడూ ఉన్నోడి పక్షమే వహిస్తుంది. లేనోడ్ని పీల్చి పిప్పిచేసి, రోడ్డుపైవిసిరేయడం మామూలే. కార్పొరేట్లను బాగు చేయడానికి ,రైతుల భూముల్ని సేకరించి “సెజ్“ ల పేర ధారాదత్తం చేయడం కొత్తేమీ కాదు. కాకినాడలో వుంటున్న బొల్లోజు బాబా కు “కాకినాడ సెజ్ “ కోసం ప్రభుత్వం చేసిన భూసేకరణ తతంగం తెలియంది కాదు.సెజ్ లలో పరిశ్రమలు పెట్టి ఇంతకు మరింత సంపాదిస్తాడు కార్పొరేట్. తనకు అన్నంపెట్టే నేలతల్లిని బలవంతంగా లాక్కొని కార్పొరేప్ కు కట్టబెడుతుంది ప్రభుత్వం. పరిహారం పేరుతో తూతూ మాత్రంగా రైతు కంట తడి తుడిచేట్లు నటిస్తుంది ప్రభుత్వం.

ఒకరికి (కార్పొరేట్ కు ) భూమి విద్యుత్ కాంతుల్లో బెల్లీ డాన్స్ చేసే ఓ ఆటకత్తె..మరొకరికి ( రైతుకు) భూమంటే నుదుటన దిద్దుకునే ఆకుపచ్చని విభూతి పండు “...భేదమల్లా చూసే చూపులోనే కాదు..అనుభవంలో,ఆస్వాదనలో కూడా.!

నిజానికి ఒకడికి చెలగాటం..ఇంకొకడికి ప్రాణ సంకటం. భూసేకరణ యుధ్ధం జరిగాక..జయాపజయాల్ని పక్కనబెడితే... వీరిద్దరికీ కావలసింది మాత్రం “ ఓ ఆరడుగుల నేల “ .ఓ ఆరడుగుల బాధ్యత మాత్రమే.

బొల్లోజు కవిత్వం గురించి ఇంకేం చెప్పాలి. ఈ ఒక్క కవిత చాలదా..! అన్నమంతా పట్టి చూడాలా? ఒక్క మెతుకు చాలదా అది ఉడికిందో లేదో తెలుసుకోడానికి. అలాగే బొల్లోజు కవిత్వం పండిందో లేదో తెలుసుకోడానికి ఈ ఒక్క కవిత చాలదా? ఇంకా ఏం కావాలి?

క్షతగాత్ర నదీ.!.!

నది ప్రవాహ శీలి.జీవనది నిరంతరం ప్రవహించే జీవధార.కానీ మానవుడి స్వార్థం నదుల్నే ఎండబెడుతోంది. నదులు జీవం కోల్పోతున్నాయి. ఎండిన కన్నీటి చారికలా తమ గుర్తుల్ని
వదిలేసి కనుమరుగవుతున్నాయి.

ఎడారి నగరాల నిర్మాణాల కోసం
నదిలోని ఇసుకను
యూనిట్లు యూనిట్లుగా తరలిస్తున్నారు.

ఇసుక నుండి కావలసినంత తైలం (సొమ్ము) పిండుకుంటున్నారు. ఇదంతా మనకు తెలిసిన బహిరంగ రహస్యమే. ఈ దుర్మార్గాన్ని “క్షతగాత్రనది “ గా అభివర్ణించాడు బొల్లొజు బాబా. ఈ కవిత ముగింపులో అద్భుతమైన ప్రతిభను చూపాడు కవి.

“అపుడెపుడో మేసిన వెన్నెల్ని
చందమామ రజనుగా రోడ్డుపై కార్చుకుంటూ
క్షతగాత్ర నది
ట్రక్కులు ట్రక్కులుగా ప్రవహిస్తోంది
నగరం వైపు …”

నిజానికి ఎన్నెల మేసి ఏరులు, నదులు, నెమరేయాలి. కానీ ఇసుకాసురుల వల్ల నదీ గర్భాలు ఒట్టి పోతున్నాయి. ప్రవాహాలకు ఆటంకం కలిగి ఎండోపోతున్నాయి. ఇప్పుడు నదుల్లో నీళ్ళు లేవు. నీళ్ళల్లో వెన్నెల లేదు.ఉన్నదల్లా ఇసుక. ఆ ఇసుకను లారీలకు లారీలు నింపి నగరాలవైపుకు ... తరలించుకు పోతున్నారు. నీళ్ళున్నప్పుడు మేసిన వెన్నెల్ని చందమామ రజనుగా కార్చుకుంటూ క్షతగాత్ర నది ట్రక్కులు ట్రక్కులుగా నగరం వైపుకు ప్రవహిస్తోందంటాడు కవి. ఎంత అద్భుతమైన భావన.!

మనుషులూ..జీవితం..!!

మనుషుల్ని,జీవితాన్ని ఇంతగా అర్థం చేసుకున్న కవిని నేనిప్పుడు చూశాను.
జీవితాన్ని వైభోగంగా కాక అనుభవంగా మలుచుకున్న వాళ్ళు మాత్రమే నిజమైన జీవితాన్ని అర్థం చేసుకుంటారు.బొల్లోజు బాబా జీవితాన్ని దగ్గరగా చూశాడు. స్పృశించాడు. అనుభవించాడు. అనుభవాన్ని అక్షరాల కవిత్వం చేశాడు ..!

*జీవితం ముందుకే తప్ప వెనక్కు
ప్రవహించదన్న సంగతిని
ఏ స్వప్నమో నేర్పుతుందిలే “(పాఠం )

*”సర్దుకు పోవడమంటే
చచ్చిపోకుండా వుండటం అంతే
చరిత్రలో
మనిషేనాడూ సర్దుకు పోలేదు “(ఉదయకాంతి )

*”జీవిత పర్యంతమూ
పరిమళించీ పరిమళించీ
పూదోటగా విస్తరించడానికే
నువ్విక్కడకొచ్చావు “(పూలతోట )

*”జీవించడం అంటే
ప్రేమించిన ఒక్కొక్కరినీ కోల్పోవడం కాదూ..!” (Alone but together)

*”జీవితం
అప్పుడప్పుడు కాస్సేపాగి
తన సెల్ఫీ తానే తీసుకొంటోంది
ఒక్కో ఫోటో
రక్తమూ కన్నీళ్ళు నింపుకున్న
కవిత్వమై చరిత్రలో ఇంకిపోతోంది “..(సెల్ఫీ )

*”గొర్రెల మధ్య గొర్రెలా
నక్కల మధ్య నక్కలా బతకడం
చాలా సులువు
మనిషిలా
బతకాలనుకోవడం కన్నా !”.

ఏ కవికైనా అనుభవం నేర్పే పాఠాలే కవిత్వం గా తన్నుకొని బయటకు వస్తాయనడానికి ఇంతకంటే రుజువులు అవసరమా?

ఈ సంపుటిలో చాలా కవితలు Narrative గా సాగుతాయి. సాధారణంగా Narration ను కథల్లో,నవలల్లో చూస్తాం. కవిత్వంలో అరుదుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు రాస్తున్న వారిలో చాలామంది Narration పట్ల మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ నరేషన్లో కవిత్వం లేకపోతే తేలిపోతుంది. శుద్ధ వచనంలా మిగిలిపోతుంది.
ఈవిషయంలో బొల్లోజు బాబా చాలా జాగ్రత్తపడ్డాడు. “Message in train, ”నన్ను క్షమించవూ, ప్రయాణం, ఒక..పురా..ప్రకాశం “,
“Alone but together, ఒక apocalypse అనంతరం, “ ఏం పని వుంటుంది నీకు?” తదతర కవితల్లో Narration ను చూడొచ్చు.

ఈ కవికి మానవ బంబంధాల పట్ల గౌరవం వుంది.ఈ కింది ఫ్రాగ్మెంట్ చూడండి .

“సామాన్లు సర్దుతుంటే
పాత ఫోను కనిపించింది
ఆన్ అయింది చిత్రంగా
కాంటాక్ట్స్ లో అమ్మ నంబరు
అలాగే వుంది “.

ఈ సృష్టిలో అనంతమైంది అమ్మ ప్రేమ ఒక్కటే.అలాంటి అమ్మను నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం ఎంత నిర్లక్ష్యం చేసినా అమ్మ ప్రేమ మాత్రం అలాగే వుంటుంది అనడానికిది నిదర్శనం.
ఈ విషయాన్ని ఎంత గుంభనంగా చెప్పాడో బొల్లోజు బాబా చూశారుగా. ఇలాంటి వ్యక్తీకరణలే కవి స్థాయిని పెంచుతాయి.

“గురుదేవులకు వందనాలు “ కవితలో గురు శిష్య సంబంధాన్ని గొప్పగా చెప్పాడు.

*“స్కూలు అంటేనే గురువులు
గురువులంటే నిన్నూ నన్నూ
గురిచూసి సంధించే విలుకాళ్ళు “.

గురువులను విలుకాళ్ళుగా భావించడం బహుశా ఇదే తొలిసారి అనుకుంటా..

" స్త్రీ " అనే కవితలో చివరి స్టాంజా కంట తడిపెట్టిస్తుంది.

తన స్వప్నాల్ని బతికించుకోడానికి
ఓ కుర్రాడు నేత్రాల్ని అమ్ముకొని అంథత్వాన్ని,
హృదయాన్ని అమ్ముకొని అల్పత్వాన్ని
కొనుక్కుంటాడు.
నువ్వు ఇదివరకటి లా లేవు అంటుంది ఆమె.
కాలికింద నేల కూలినట్లు
అనిపిస్తుందతనికి..

*”ఆమె ఒళ్ళో చేరి
వలవలా ఏడ్చేస్తాడు
ఆమె
తన స్తన్యాన్ని అతని
నోటికి అందించి
ఓదారుస్తుంది “!

త్యాగానికి ప్రతీక స్త్రీ మూర్తి. స్త్రీ స్తన్యం అమృతమనే దివ్యౌషధాన్నిచ్చే ప్రేమ కడలి.

ఇలాంటిదే మరొకటి.. ”గుండె పూడిక ఎవరైనా తీస్తే బావుండు".. వంటి ప్రయోగాలు హృదయానికి హత్తుకొని ఆలోచింపజేస్తాయి.

వ్యక్తిత్వాన్ని గౌరవించే ఈ కవి..”ఇంకొకరి అభిప్రాయంగా వుండే కన్నా.! నువ్వే ఓ సిద్ధాంతంలా మారు “ అంటాడు.

”ఇప్పుడీ దేశానికేమైంది? ఎవరిని వధశాలలకు పంపటానికి ఇది కుట్రలు పన్నుతోంది?” వంటి పదునైన పద ప్రయోగాలతో వర్తమాన పరిస్థితుల్ని కళ్ళముందు నిలిపాడు!

ఒకటా..రెండా? ఎన్నని చెప్పేది.మీరే చదివి తెలుసుకుంటే మరింత రస స్ఫూర్తి కలుగుతుంది.

చివరగా...ఈ మూడో కన్నీటి చుక్క ఏమిటో చెప్పి ముగిస్తాను.

*”ఏ రెండు
కన్నీటి చుక్కలు ఒకేలా వుండవు
వాటిని చూసినపుడు
జారిన మూడో కన్నీటి చుక్క
కవిత్వం !!

ఇప్పుడర్థమైందిగా..సమాజాన్ని చూసి,అనుభవించి రాసిన కవిత్వమే..!”మూడో కన్నీటి చుక్క “!
ఈ కన్నీటి చుక్క చాలా చిక్కనైనది..మంచి రంగు కలది..రుచికరమైంది.
రుచి చూడటం ఇక మీ వంతు.!!

*మూడో కన్నీటి చుక్క ,కవితా సంపుటి
వెల.రూ.100/ పేజీలు.119.
కాపీల కొరకు
బొల్లోజు బాబా
30.7.31
సూర్యనారాయణ పురం
కాకినాడ,తూ.గో.జి
ఆంధ్రప్రదేశ్
ఫోన్.9849320443
0884..2368189

"మూడో కన్నీటిచుక్క" 4

"మూడో కన్నీటిచుక్క" కవిత్వ సంపుటిపై మెత్తని హృదయకవి Telugu Venkatesh గారు వ్రాసిన ప్రేమపూర్వక వాక్యాలు
థాంక్యూ వెంకటేష్ గారు...
***

తనను తాను శిల్పంనుంచి శిలగా రూపం మార్చుకొని
అవరోహన దారిలో స్పష్టంగా పరిచయమయ్యాడు బాబ

దుర్గమారణ్యాల తప్పిపోతలు లేవు. గడ్డకట్టిన మంచు లేదు. వణికించే శీతలం లేదు.

సాయంత్రపు నీరెండలు...గోరువెచ్చటి పలకరింపులు..
దప్పికతీర్చే చెలిమ ఈ కన్నీటిచుక్క...

అలా కూర్చొని ఓ కాఫి కప్పుతో బాబ తేట ఆలోచనల్ని...గాలి మంద్రంగా వీస్తున్నంత నిశ్శబ్దంగా మదిలోకి ఆహ్వానించుకోవచ్చు.

తెలుగు వెంకటేష్

హిందూ ఆలయాలకు ఏం జరిగింది?



ముస్లిం పాలకులు హిందూ ఆలయాలను ధ్వంసం చేయటానికి రెండు కారణాలు కనిపిస్తాయి ఒకటి అన్యమత ద్వేషం, రెండవది ఆలయాలలో దాచిపెట్టిన సంపదలను దోచుకొనటం కొరకు అంటూ Sita Ram Goel వ్రాసిన Hindu Temples What Happened to them పుస్తకం ప్రారంభమౌతుంది. ఈ పుస్తకంలో భారతదేశంలో మొత్తం మీద చిన్నా పెద్దా కలిపి 60000 దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయని అలా చేయటంలో మతవిశ్వాసాలే ప్రధాన కారణమని అనేక రసవత్తరమైన ఉదాహరణలు ఇస్తాడు గోయల్. ఆంధ్రప్రదేష్ నుంచి 140 ఆలయాలు అలా ధ్వంసం చేయబడ్డాయని లెక్కలు చెప్పాడు. చరిత్రలోంచి సెలక్టివ్ ఉదంతాలను తీసుకొని కొన్నింటిని పరిగ్రహించి విద్వేషాలను రగిల్చే రాతలు ఎక్కువమందిని ఆకర్షిస్తాయి. ఈ వాదన ఈనాటిది కాదు. హిందూ సమాజంలో వందలసంవత్సరాలుగా నడుస్తున్నదే!

ముస్లిముల దాడిలో కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక 1324 లో ఆంధ్రదేశరాజ్యాధికారం చేపట్టిన ప్రోలయనాయకుడు ఇచ్చిన “విలస తామ్రశాసనం” లో కూడా ఇదే వాదన కనిపిస్తుంది. ఈ శాసనం ద్వారా--

“మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్కనుపై చేసిన దండయాత్ర; సారాయితాగుతూ, పశుమాంసం తింటూ ముస్లిం పాలకులు ఆలయ విగ్రహాలను ధ్వంసం చేసి, బ్రాహ్మణులను ఊచకోత కోసి, వారి మాన్యాలను బలవంతంగా లాక్కొన్నారని; ధనవంతులను చిత్రహింసలు పెట్టి వారి సంపదలను దోచుకొన్నారని; రైతులను,సామాన్యులను హింసించారని, స్త్రీలను అపహరించారని; అలాంటి పరిస్థితులలో ప్రోలయనాయకుడు రాజ్యాధికారం చేపట్టి సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పి బ్రాహ్మణులు కోల్పోయిన హక్కులను పునరుద్దరించి, ఆలయాల పునర్నిర్మాణం జరిపి, హిందూధర్మాన్ని తిరిగి నెలకొల్పినట్లు” తెలుస్తుంది. (Epigraphia Indica –Vol. 32)

ముస్లింపాలకులు హిందూ ఆలయాలను ధ్వంసం చేసారు అనే మాట ఇన్ని వందల సంవత్సరాలుగా ప్రతిఒక్క హిందువు బుర్రలోను బలంగా నాటుకుపోయిన అంశం. అలాంటి విద్వేషపూరిత పునాదులపైనే నేటి రాజకీయాలు కొనసాగటం దురదృష్టకరం.

అసలు ఆలయాలు దేనికి సంకేతం? ఆలయాలపై ఎందుకు దాడి చేస్తారు? ముస్లింలు మాత్రమే ఆలయాల ధ్వంసం చేసారా లేక హిందురాజులు కూడా చేసారా? అనే ప్రశ్నలకు Richard M Eaton, Cynthia Talbot లు వ్రాసిన వ్యాసాల ద్వారా అనేక ఆసక్తికరమైన జవాబులు దొరికాయి

***

1. కొద్దిగా చరిత్ర

ఎనిమిదో శతాబ్దంలో మహమ్మద్ బిన్ ఖాసిమ్ సింధుని ఆక్రమించుకొని కొంతకాలం పరిపాలించాడు. ఈ కాలంలోనే భారతీయ శాస్త్రవిజ్ఞానం బాగ్దాద్ చేరి అరబిక్ భాషలోకి అనువదించబడింది. అలా పదకొండవ శతాబ్దంవరకూ హిందు-ముస్లిమ్ కలయిక చాలా ప్రశాంతంగా కొనసాగింది.

పదకొండవ శతాబ్దం నుంచి ఘర్షణలు మొదలయ్యాయి. గజని మహమ్మద్ (998-1030) ఆఫ్ఘనిస్తాన్ ని కేంద్రం గా చేసుకొని పరిపాలన సాగిస్తూ- సమీప నగరాలు, ఆలయాలపై దాడి చేసి సంపదలను కొల్లకొట్టి తన రాజ్యాభివృద్ధికి వాడుకొనేవాడు.

ఇతను ఇరాన్ వద్ద నున్న రే అనే నగరాన్ని కొల్లకొట్టినపుడు ఏడున్నర లక్షల దినార్ల విలువైన సంపద లభించగా భారతదేశంలోని సోమనాథ్ ఆలయంలో ఇరవై మిలియన్ దినార్ల సంపద లభించింది. గజని భారతదేశంపై దండయాత్రలు చేసి సంపదలు పట్టుకుపోవటమే తప్ప ఏనాడూ ఇక్కడ స్థిరపడాలని భావించలేదు. ఇతను మరణించాక దాదాపు ఒక శతాబ్దంపాటు ఏ దాడులు జరగలేదు.

మహమ్మద్ ఘోరి 1194 నాటికి ఉత్తరభారత దేశంలో చాలామట్టుకు రాజ్యాల్ని జయించి ఢిల్లీలో కుతుబుద్దిన్ ఐబక్ అనే తన ప్రతినిధిని నియమించాడు. 1206 లో ఘోరి చనిపోవటంతో ఐబక్ స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఢిల్లీ సుల్తానుగా అవతరించటంతో భారతదేశంలో ముస్లింల ప్రత్యక్షపాలన మొదలైంది.

2. హిందూ రాజ్యంలో ఆలయం యొక్క పాత్ర

హిందూ రాజ్యానికి ఒక రాష్ట్రదైవం ఉంటుంది. రాజ్యాన్నేలే రాజు ఆ దైవాన్ని కొలుస్తూంటాడు. ఆ ఆలయం ఆ రాజ్యలక్ష్మికి, సౌభాగ్యానికి, ప్రతిష్టకు సంకేతం. అంతేకాక ఆలయాలలో రహస్య మాళిగలలో సంపదలను భద్రపరచుకోవటం జరిగేది.

ఒక హిందూ రాజు మరో హిందూ రాజ్యాన్ని జయించినపుడు ఓడిపోయిన రాజ్యంయొక్క రాష్ట్రదైవాన్ని తరలించుకొని తనరాజ్యంలో ప్రతిష్టించుకోవటం రెండువేల సంవత్సరాలుగా ఈ గడ్డపై నడిచిన ఒక సంప్రదాయం. అలా చేయటం ద్వారా మాత్రమే ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవటం పూర్తయినట్లు భావించేవారు.

కళింగరాజ్యాన్ని మగధరాజులు జయించినపుడు రిషభనాథుని విగ్రహాలను ఎత్తుకుపోగా, ఆ తరువాత ఖారవేలుడు అనే కళింగరాజు మగధసామ్రాజ్యంపై దండెత్తి ఆ విగ్రహాలను తిరిగి తెచ్చుకొన్నట్లు క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన హతిగుంఫ శాసనం ద్వారా తెలుస్తున్నది.

ఇలాంటి ఉదంతాలు చరిత్రలో అనేకం కనిపిస్తాయి

A. పల్లవరాజైన నరసింహవర్మన్ I చాళుక్యరాజధాని వాతాపిని 642 CE లో జయించి అక్కడి గనేష విగ్రహాన్ని తీసుకుపోయాడు. యాభైఏళ్ల తరువాత చాళుక్యులు ఆ విగ్రహాన్ని తిరిగి తెచ్చుకొన్నారు.

B. పదకొండవ శతాబ్దానికి చెందిన రాజేంద్ర చోళుడు దండయాత్రలలో – చాళుక్యరాజ్యంనుంచి గనేష, కళింగులనుంచి భైరవ, భైరవి, తూర్పుచాళుక్యులనుంచి నంది, బెంగాలు నుంచి శివుని విగ్రహాలను తరలించుకొని వచ్చాడు.

C. కాశ్మీర రాజు హర్షుడు శత్రుదేశ ఆలయాలపై దాడి చేసి సంపదలను తరలించుకుపోవటం చేసేవాడు

D. గుజరాత్ లో పరమర వంశానికి చెందిన రాజులు జైన ఆలయాలను ధ్వంసం చేసారు

E. కృష్ణదేవరాయలు ఉదయగిరిని జయించి బాలకృష్ణుని విగ్రహాన్ని, పండరిపురాన్ని ఆక్రమించుకొని విట్టలనాథుని విగ్రహాన్ని ఎత్తుకొనిపోయి విజయనగరంలో ప్రతిష్టించుకొన్నాడు.

1192-1729 మధ్యకాలంలో హిందుత్వవాదులు వాదిస్తున్నట్లు 60 వేల ఆలయాల విధ్వంసం జరగలేదని, 80 ఆలయాలు మాత్రమే ధ్వంసానికి గురయినట్లు స్పష్టమైన చారిత్రిక ఆధారాలు లభిస్తున్నాయని ప్రముఖ చరిత్రకారుడు Eaton అభిప్రాయం.

3. ఆలయాల విధ్వంసం జరిగిన తీరులో ఒక పాటర్న్ కనిపిస్తుంది.

విధ్వంసమైన ఆలయాల భౌగోళికతను పరిశీలిస్తే, ముస్లిం సేనలు దండయాత్రచేసిన మార్గంలోని ఆలయాలు మాత్రమే దాడికి గురయ్యాయని అర్ధమౌతుంది. ఉత్తరభారతదేశం నుంచి దక్కనువైపుకు రాజ్యవిస్తరణ జరుపుకొంటూ వస్తున్నప్పుడు మొదట రాజస్తాన్, బిహార్, గుజరాత్ చివరగా దక్కన్ ప్రాంత ఆలయాలు ధ్వంసమవటంలోని పాటర్న్ సైన్యం నడిచిన మార్గాన్ని సూచిస్తుంది. ప్రతీచోటా యుద్ధోన్మాదమే తప్ప మతోన్మాదం కనిపించదు.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బహుమని సుల్తానులు ఒరిస్సా, విజయనగర సామ్రాజ్యాలపై యుద్ధం చేసిన సమయంలో ఆ రాజ్యాలలోని ఆలయాల విధ్వంసం జరగటాన్ని గమనిస్తాం. హిందూరాజ్యాలపై దండయాత్రలు జరిగిన ప్రతీసారీ ఆ రాజ్యంలోని ఆలయాలను సంపదలకొరకు కొల్లకొట్టటం జరిగింది. కొన్నిచోట్ల ఆలయాల స్థానంలో మసీదులను నిర్మించటం జరిగింది.

కొన్ని సందర్భాలలో ముస్లిం అధికారులు ఓడించిన రాజ్యంలోని ఆలయ మూలవిరాట్టులను ఢిల్లీబాదుషాకు కానుకలుగా పంపించేవారు. 1299 లో సోమనాథ్ ఆలయ మూలవిరాట్టును, 1359 లో ఒరిస్సా జగన్నాధ ఆలయవిగ్రహాలను ఢిల్లీకి తరలించారు.

ఢిల్లీ సుల్తానులపై తిరుగుబాటుచేసిన సామంతులను శిక్షించటానికి వారి రాజ్యాలకు చెందిన ఆలయాలపై దాడిచేసి విగ్రహాలను తరలించుకుపోవటం జరిగేది. గ్వాలియర్ రాజపుత్ సామంతుపై అనుమానం వచ్చి, ఇబ్రహిం లోడి గ్వాలియర్ కోటలోని శివాలయంలో చొరబడి అక్కడి విగ్రహాలను ఢిల్లీకి తరలించుకొని పోయాడు.

1579 లో అహోబిలంపై జరిగిన దాడి ఆసక్తికరం. గోల్కొండనవాబు వద్ద పనిచేసే మరాఠి బ్రాహ్మణుడైన మురహరిరావు – రాయలసీమ ప్రాంతాలను గోల్కొండరాజ్యంలో కలిపే యత్నంలో అహోబిలం నరసింహస్వామి ఆలయంలోని విగ్రహాన్ని గోల్కొండకు తరలించుకొనిపోయాడు. ఈ ఆలయం శ్రీ కృష్ణదేవరాయలకు ఎంతో ప్రీతిపాత్రమైనదన్న ఒకే ఒక రాజకీయకారణం కనిపిస్తుంది.

గోల్కొండ నవాబుపై కళింగ రాజులు చేస్తున్న తిరుగుబాటును అణచివేసే క్రమంలో 1599 లో శ్రీకూర్మం, సింహచలం ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి. అదే సమయానికి పూజలందుకొంటున్న ఇతర ప్రముఖ ఆలయాలైన ద్రాక్షారామం, పాలకొల్లు, పిఠాపురం, కుమార భీమారామం లాంటి ఆలయాలపై ఎలాంటి దాడులు జరగకపోవటానికి కారణం ఆ ప్రాంతాలలో ఏ రకమైన రాజకీయ అలజడులు లేకపోవటమే అని భావించాలి.

4. తెలుగునాట ముస్లిములను ఎలా చూసారు?

పద్నాలుగో శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైనదశలో ముస్లిం సేనలను రాక్షసులతో పోల్చటం పైన ఉదహరించిన “విలస తామ్రశాసనం” లో కనిపిస్తుంది. ఉత్తరబారతదేశంలో ఇస్లాం ప్రభావంనుంచి హిందూమతాన్ని స్థిరీకరించుకోవటానికి రామాయణాన్ని ఎలాగైతే ఒక సమాంతర శక్తిగా హిందువులు నిలబెట్టుకొన్నరో ఆంధ్రదేశంలో కూడా అన్నమయ్య, రామదాసుల భక్తితత్వం హిందూధర్మ ప్రచారానికి తోడ్పడింది. ఇది మొదటి దశ.

రెండో దశలో- కాల క్రమేణా పదిహేనవ శతాబ్దానికి వచ్చేసరికి ఆంద్రప్రాంతం గోల్కొండ పాలనలోకి వచ్చింది. కృష్ణదేవరాయలవద్ద సైన్యంలో ఎక్కువభాగం ముస్లింయోధులు ఉండేవారు. వారికొరకు మసీదులు కూడా కట్టించాడు. పర్షియన్ దుస్తులను మక్కువగా ధరించేవాడు. పర్షియన్ తరహా నిర్మాణాలు చేపట్టాడు. “హిందురాజులలో సుల్తాను” (హిందురాయ సురత్రాన) అని చెప్పుకోవటం ఒక బిరుదుగా మారింది. ఇబ్రహిం కుతుబ్ షాను మల్కిభరామునిగా కవులు ఓన్ చేసుకొన్నారు. సాహిత్యంలో, శాసనాలలో ముస్లిం వ్యతిరేకత పెద్దగా కనిపించదు. కుతుబ్ షాయి పాలనలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో కూడా వెలువరించేవారు. ఈ సమయంలోనే తెలుగులోకి అనేక ఉర్దూపదాలు వచ్చి చేరాయి. ఒరిస్సారాజులకు గజపతులని, విజయనగర రాజులను నరపతులని, గోల్కొండ రాజులను అశ్వపతులని సమానహోదాతో హిందూ ముస్లిము రాజులు వ్యవహరించుకొన్నారు.

విజయనగరరాజ్య పతనంతో మరలా తెలుగునాట హిందు ముస్లిం ల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రాజ్యవిస్తరణలో భాగంగా ఆలయాల విధ్వంసం జరిగింది. (అహోబిలం, శ్రీకూర్మం, సింహాచలం) ఇది మూడవ దశ. పదిహేడవ శతాబ్దం వచ్చేసరికి బ్రిటిష్ వారి రాకతో మొత్తం రాజకీయ, సామాజిక సమీకరణాలన్నీ మారిపోయాయి.

5. యుద్ధాలు లేని సమయంలో ఆలయాలపట్ల ముస్లిమ్ పాలకుల వైఖరి

బీదరు జిల్లాలో అంతకు పూర్వం ధ్వంసం చేసిన ఈశ్వరాలయాన్ని పునరుద్దరించి, పూజాదికాలు నిర్వహించమని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆదేశాలు ఇచ్చినట్లు 1326 నాటి ఒక శాసనం చెపుతున్నది. (kalyana inscription of sultan Muhammad - Epigraphia Indica 32)

అక్బర్ పరిపాలనలో అనేక హిందూ సామంతులు తమ రాజ్యాలలో వివిధ హిందూదేవాలయాలను నిర్మించుకొన్నారు. ఉదాహరణ: రాజామాన్ సింగ్ బృందావనంలో నిర్మించిన గోవిందదేవ ఆలయం.
1590-1735 ల మధ్య ఒరిస్సా పూరిజగన్నాధుని రధయాత్రకు ముఘల్ చక్రవర్తి ప్రతినిధులు వచ్చి ఒక రధంపై కూర్చుని ఆ ఉత్సవాన్ని పర్యవేక్షించేవారు.

ఔరంగజేబు 1659 లో – “కాశిలో కొంతమంది అక్కడి బ్రాహ్మణులను వేధిస్తున్నట్లు తెలుస్తున్నది- కాశిలోని ఆలయాలను కానీ అక్కడి పూజారులను కానీ వేధించటంకానీ తొలగించటం కానీ చేయకండి” అంటూ ఒక ఉత్తర్వును జారీ చేసాడు. ఇదే ఉత్తర్వులో “ప్రాచీన ఆలయాలను కూల్చరాదని పవిత్రగ్రంధం చెపుతున్నది” అని అనటం గమనార్హం.

శ్రీకూర్మ ఆలయదాడి అనంతరం కులికుతుబ్ షా- అక్కడి పరిస్థితులను చక్కదిద్దమని అశ్వారాయుడు అనే ఒక హిందూ అధికారిని ఇక్కడకు పంపించాడు.
1604 నాటి ఒక శాసనం ద్వారా- రాజప్రతినిధిగా వచ్చిన అశ్వారాయుడు ఈ ఆలయాలను తిరిగి తెరిపించి, ధార్మిక విధులను కొనసాగేలా చేసాడని తెలుస్తున్నది.

ముగింపు

ముస్లిం పాలనలో అనేక హిందూదేవాలయాలపై దాడిజరగటం వాస్తవం. చాలా ఆలయాలను మసీదులుగా మార్చటం కూడా వాస్తవమే. హిందూధర్మం ప్రకారం దేవాలయాలు అనేవి రాజ్యపు అస్తిత్వరూపాలు. ఒక్కోరాజ్యానికి ఒక్కో రాజ్యదేవత ఉంటుంది. ఆ దైవాన్ని కాపాడుకోవటం ఆ రాజు విధి. ఆ రాజ్యం ఓడిపోయినపుడు ఆ రాజ్యదేవతను విధ్వంసం చేయటమో తరలించుకుపోవటమో విజయానికి ఒక సింబాలిక్ చర్య. ఈ పనిని హిందూరాజులు కూడా చేసారు. అంతే కాక ఆలయంలో ఉండే గుప్తనిధులు కూడా ఆలయవిధ్వంసానికి మరొక కారణం.

భారతదేశంలో జరిగిన హిందూ ఆలయవిధ్వంసం ఎక్కువగా యుద్ధసమయంలోను, తిరుగుబాట్లు జరిగినపుడు శిక్షించే క్రమంలోను జరిగినట్లు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి.

ముస్లిమ్ లకు విగ్రహారాధనపట్ల వ్యతిరేకత బహిరంగమే అయినప్పటికీ ఆలయాల విధ్వంసంలో యుద్ధోన్మాదమే తప్ప మతోన్మాదం ఉందని నిర్ధారించలేం.

చివరగా ప్రముఖ చరిత్రకారుడు Mohammad Habib 1931 లో అన్న మాటలు నేటికీ ప్రాసంగిత కోల్పోకపోవటం సమకాలీన విషాదం.

“హిందూ మూలాల్ని కలిగి శాంతిని కోరుకొనే భారతీయ ముసల్మాను - అనాగరిక దుస్తులు ధరించిన, ఆలయాలను ధ్వంసంచేసిన, ఆవుమాంసం తినేవాడిగా, ముప్పై నలభై శతాబ్దాలపాటు నివసించిన సొంతగడ్డనే ఆక్రమించుకొన్న ఆక్రమణదారుడిగా చరిత్రలో వక్రీకరించబడ్డాడు. దాని ఫలితం నేడు భారతదేశం ఎదుర్కొంటున్న మతవాతావరణం” -- Mohammad Habib

బొల్లోజు బాబా
.
సంప్రదించిన పుస్తకాలు
1. Temple Desecration in Pre-modern India part I and II by Richard M Eaton
2. Hindu Temples What happened to them by Sita Ram Goel
3. Inscribing the Other, Inscribing the Self: Hindu-Muslim Identities in Pre-Colonial India by CYNTHIA TALBOT
4. Epigraphia Indica Vol 32

A Wonderful insight in to the poetry of all my three books.



Thank you Sreeram Puppala for a wonderful gift
-

గుండె పూడిక ఎవరైనా తీస్తే బాగుణ్ణు  -   శ్రీరామ్ - 24

****

“అస్తిత్వం అనేది గోనె సంచిలో తీసుకెళ్ళి ఊరిచివర విడిచినా తోకూపుకుంటూ వచ్చి చేరే పిల్లి పిల్ల లాంటిది". బాబా కొత్తపుస్తకంలోని కవితా వాక్యమిది.

బాబా పేరెత్తగానే నాకెందుకో ఇస్మాయిల్ గారూ,శిఖామణిగారు చఠుక్కున గుర్తొస్తారు.అదొక అసంకల్పిత చర్య.దానికొ సంకల్పిత కారణముంది.బాబా ఇస్మాయిల్ అవార్డు స్వీకరించినందుకో, బాబా కవిత్వమంటే ఇస్మాయిల్ స్కూలనే సూత్రీకరణం కోసమో కాదు.ఇస్మాయిల్ గారి ఆల్టర్నేట్ నేరేటివ్స్ (alternate narratives) కావాలీ రావాలీ అని సమయం చిక్కినప్పుడల్లా అరచిగీపెట్టే బాబా ఉద్దేశ్యం దాచేస్తే దాగేది కాదు. మరింకే వ్యతిరేకవాదమో (?) తటస్థించినా నా తప్పు కాదు.

‌అలాగే శిఖామణిగారెందుకు గుర్తొస్తారంటే ఆయన బాబాకు సాహితీ గురువు ;దళితసాహిత్యసృహ, ‌సామాజిక సంవేదన‌ల్ని పక్కనబెడితే శిఖామణిగారి కవిత్వంలోని దయ కరుణ,మృదుత్వం ఇత్యాది మానవీయ లక్షణాల ప్రభావం బాబామీదుంది.

ఆకుపచ్చని తడిగీతం,వెలుతురుతెర కవితా సంపుటాలు కవిగా బాబా సత్తాని ఇప్పటికే నిరూపించాయి. ఇప్పుడు మూడో కన్నీటి చుక్క సంపుటి తెచ్చాడు. బాబా అనుభూతికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం పట్ల కొత్తగా చర్చేమీ అవసరం లేదు కానీ బాబా లేటెస్టు పుస్తకం మునుపటి పుస్తకాల కన్నా చాలా భిన్నంగా కన్పించింది. ఏం డిఫరెన్సు కనబడిందో తెలుసునా ? ఫ్రాగ్మెంట్స్ అలానే వున్నాయి.తనకిష్టమైన పిచ్చుక మీద ఈసారీ మరో కవిత రాశాడు. ప్రకృతిని ఆలంబన చేసుకున్న చాలా కవితలూ ఎప్పటిలానే వున్నాయి.మరి మార్పేమిటంటే..మూడో కన్నీటి చుక్కలో కేవలం బాబా అభిరుచి కన్నా కొత్త ఆలోచనాభిముఖత ఎక్కువ నచ్చుతుంది. ఇది సాధారణీకరణ చెయ్యడం కాదుగానీ బాబా కవిత్వమీ పుస్తకంలో చాలా సూటిగా స్పష్టంగా వుంది. శైలిలో ఎక్కువ మెలికలు లేవు. మెలికలనగా తన భావచిత్రావిష్కరణలో వుండే వివిధ పొరలూ (layers); సంక్లిష్టతా ఈ బుక్ లో లేవు. ఉదాహరణకి ఆకుపచ్చని తడిగీతంలో “అంతరించబోతున్న పిచ్చుకలపై” అన్న కవితలో

“నువ్వు వస్తావని గుడిలో శఠగోపమంత
అందంగా పేనిన వరికంకుల కుంచె
ఇంటిస్లాబ్ ఇనుపకొక్కానికి,కాశీ ఆవు ఐదో కాలులా వేలాడుతూ
మమ్ములను వెక్కిరిస్తుంది.
తరువాత 'మీ వంతు' అంటూ భయపెడుతోంది" అంటాడు. అదే వస్తువు మీది లేటేస్టు కవిత చూడండి

పిచ్చుకా!నిన్నటిదాకా నీవు ప్రయాణించిన మార్గాన్నీ
పడిలేచిన నీ ఆత్మనీ చూడాలనిపిస్తుంది
కొత్త రహస్యాలేమైనా బోధపడుతాయేమో!(పిట్టగోడపై వాలిన పిచ్చుక)

బాబా ఆలోచనాభిముఖ ధోరణి కొత్తదేమీ కాదు.ఆ మాటకొస్తే అతను ప్రతీ వాక్యాన్ని సంవేద్యీకరణంగానే వ్రాస్తాడు. చేతనావంతమైన కవిలానే రాస్తాడు.అయితే ఇప్పుడతని ఆలోచనలోకి వ్యక్తికన్నా,వ్యక్తిగతానుభవం కన్నా తన చుట్టూ జరుగుతున్న కుట్రలకు, అన్యాయాలకు అతను ప్రతిస్పందించడం కనిపించింది. అతని అనుభవంలోకి వచ్చినా రాకున్నా కూడా దాన్ని గురించి ఆలోచించడంలో కవిగా తన కొత్త ఉనికిని గుర్తుచేస్తుంది.'ఇప్పడీదేశానికి ఏమైందీ' (మూ.క.చు - కుట్రలు) అని నేరుగా అడుగుతాడు.'అప్రియసత్యాలు చెప్పినందుకు నా దేహాన్ని బూడిద చేశారనే' కొత్త వాక్యహృదయంతో విలవిల్లాడిపోతాడు.దేశ కాలాల గురించి బాబా కన్నీరుమున్నీరైన గొప్ప సోషలిస్టు వాస్తవిక కవిత్వం రాశాడననుగానీ,ఇప్పటిదాకా తనలో తానే వినిపించుకునేట్టుండే శబ్దాలిప్పుడు బయటకి గుసగుసల్లా మాత్రం వినపడవు.

మొదటి పుస్తకంలో బాబా కవిత్వమంతా సమూహంలోంచి బయటపడాలన్న ప్రయత్నంగా కనిపిస్తుంది. ఏకాంతధ్యానం. టీచరుగా తన శిష్యుల "సార్ గారండి" మాటకి పరవశిస్తాడు.

సముద్రం తరపున నీళ్ళు వకాల్తా తీస్కుని
ఎట్లయితే ఆటుపోట్లని సృష్టించలేవో;అలాగే
ఒకరి దప్పిక, ఆకలి నొప్పులను,మరొకరు పూరింపలేరు
అయినాసరే లోకం దృష్టిలో మనిద్దరిదీ ఎప్పటికీ అన్యోన్య దాంపత్యమే (ఆ.త.గీ - నువ్వు నువ్వే-నేను నేనే) అంటాడు.

ఇతని ఒంటరితనాన్నేమనాలి? వెలుతురు తెర పుస్తకంలోనూ బాబా కవిత్వాన్ని గురించి -- స్వగతం కాదు, ఉపన్యాసం కాదు (ఫ్రాగ్మెంట్స్) అని నిర్వచిస్తాడు. నాకు శ్రీకాంతశర్మగారే గుర్తొచ్చారు."మానవ జీవితంలో ఎన్నో సున్నితమైనవీ, తళతళమెరిసేవీ, కళ్ళు మిరిమిట్లు గొలిపేవీ,అంతరంగానికి ఒక విస్పోటనంలాగ ఎరుక కలిగించేవీ అనుభూతులున్నాయి.వాటికి సాహిత్యంలో ప్రవేశించే హక్కుంది.దీనిని కాదని ఏ రాజకీయాన్ని తెచ్చి కవిత్వంగా నమ్మించజూసినా సహించవలసిన అవసరం ఏ కవికీ లేదు-(అనుభూతి కవిత్వం). బాబా అదే నమ్మకాన్ని కలిగిన కవి. సౌందర్యోపాసకుడు. ఈ కవితలు చూడండి

కాలానికో, ప్రేమకో వినమ్రంగా నమస్కరించి అస్తిత్వాన్నో ఆత్మనో
ఆనందంగా సమర్పించుకోవడంలో ఎంతటి జీవన సౌందర్యముందీ (ఆ.త.గీ -- జీవన సౌందర్యం) -- సమర్పించడం దేన్ని పొందడం కోసం ?
**
ఆమె నీడ నగ్నంగా మారి నన్ను కౌగిలించుకుంది. బిరుతెక్కిన కుచాగ్రాలు గుచ్చుకున్నాయి వృత్తిధర్మం ఎరిగిన వేశ్యలా నన్ను నేను విప్పుకుని అర్పించుకున్నాను (మూ.క.చు -- మోహం)-- ఈ అర్పించడం ఏమిటి ?

**
వాస్తవాన్నొప్పుకోనిదో, ఒప్పుకునేదో కవి తన సౌందర్యారాధనలోని అనుభూతి దగ్గరే ఆగిపోతున్నడప్పుడు మనకే ఫీలింగ్ కలుగుతుంది ? కవిగానీ, కథకుడుగానీ, ఆ మాటకొస్తే ఏ సాహిత్యకారుడైనా తన అనుభవంతో లింకై వున్న వాస్తవికతకి హేతుబద్దంగా ప్రతిస్పందించే లక్షణాన్ని బట్టే ఆ కవి ఏ ప్రపంచాకాశానికి కావాల్సిన సూర్యుడో చంద్రుడో తెలుస్తుంది.హేతుబద్దత సౌందర్యాధనకీ,దాని అనేకానేక భావనలకి,అతీతమైనది కాదు. "సౌందర్యం కేవలం వస్తువుల సహజసిద్ద లక్షణాల ఫలితం మాత్రమే కాదని, అది మానవుని కార్యాచరణ, మానవుని దృక్కోణం ఫలితంగా మానవీకరణ చెందడం ద్వారా బహిర్గతమయ్యేదని" (బీ సూర్య సాగర్ - సాహిత్యం సౌందర్యం) చెబుతారు. బాబా జీవనసౌందర్యంలో అతను జీవితం ఎలా ఉందో ఎలా ఉండాలని కోరుకుంటాడో మనకు తెలుస్తుంది. అందుకే "జీవించి ఉండటంలోని సౌందర్యం కొద్ది కొద్దిగా అర్ధమవుతోంది వాడికి" (మూ.క.చు -- ఆట) అని అంటాడొకచోట.

బాబా మొదట్నుంచీ ఏ పక్షం వహించి రాస్తున్నాడన్నదాన్ని నిర్ధారించాల్సొస్తే అదంత తేలిగ్గా తేలే విషయం కాదు.ఒక‌ స్టాండ్ తీస్కున్న నేల కనబడదు.ఎప్పటికప్పుడు ఆల్టర్నేట్ నేరేటివ్స్ (Alternate narratives) కనుక్కోవడంలోనే బాబా నిమగ్నమయ్యాడనిపిస్తుంది.అనిర్ధిష్టత (నైరూప్య ప్రేమ కాదు) పట్ల బాబాకి గల సుముఖతే అతని దృక్పధాతీత వ్యక్తీకరణకి ప్రధానకారణం. అతనికి వయక్తికమూ, సామాజికమూ లాంటి రొటీన్ చట్రాల్ని బద్దలుకొట్టాలన్న తీవ్రమైన కాంక్ష ఉంది. లేకపోతే ఈలాంటి కవిత రాయడు. చూడండి-

ఈ ప్రపంచం నిన్నెలా చూడాలనుకుంటుందో అలా వేషం కట్టి ఆత్మలోకంలో అమ్ముడుపోకు.
అబద్దపు వేషం పదే పదే కట్టి
నువ్వే ఓ నిలువెత్తు అబద్దంగా మారిపోకు
ఈ ప్రపంచం ఏవి నీకు ఉండకూడదని ఆశిస్తుందో
అదే నీ అస్తిత్వం; వాటిని కోల్పోకు;
కర్ణుడు కవచకుండలాల్ని కోల్పోయినట్లు (మూ.క.చు - అస్తిత్వం)
అంటాడు. అతనే పర్స్పెక్టివ్ (Perspective) తో రాస్తున్నాడో వెతకాలనిపిస్తుంది కానీ, అతను ఇంకా కవిత్వానికి భౌతికంగా ఆపాదిస్తున్న లక్షణాల్ని వ్యతిరేకిస్తున్నాడు. అందుకే Personal అన్న కవిత రాయగలిగాడు. తనకుతానుగా మతవాదిని, కమ్మ్యూనిస్టుని అని ప్రకటించుకోవడానికి వెనుకాడ్డు. కానీ వాటికిచ్చే కొత్త నిర్వచనాలే కళ్ళను మిరుమిట్లు గొలుపుతాయి. మనం బొక్కబోర్లా పడిపోయినా లెక్కచేస్తాడా ? లేనే లేదు. బేఫికర్ కవి కదా మరి.

“మతం అంటే భగవంతునితో నే చేసే ఏకాంత సంభషణ
చిడతలు పట్టుకున్న సమూహంలోను త్రిశూలాలు తిప్పుతున్న బృందాలలోనూ నే లేను -- జై శ్రీరాం

కమ్మ్యూనిజం అంటే సమాజం పట్ల నాకున్న వ్యక్తిగత బాధ్యత
జండాలు పట్టుకున్న సమూహాలలోను, తుపాకులు మోస్తున్న బృందాలలోనూ నేను లేను -- లాల్ సలాం” అని రాస్తాడు.
అతని ఏకాంత మత సంభాషణ సంగతి పక్కనపెడితే, ఒక రాజకీయార్ధిక సిద్దాంతమైన కమ్మ్యూనిజం పట్ల అతని వైఖరి ఈ పుస్తకంలో తెలియరావడం సంతోషించదగ్గ పరిణామం. ఎర్ర జండాలపట్ల, తుపాకులుమోసేవారిపట్ల బాబా థాట్ ప్రాసెస్ క్షుణ్ణంగా తెల్సిపోయింది. ఇలా ముందు పుస్తకాల్లో రాయలేదు. ఇప్పటిదాకా ఎందుకిలా రాయలేదని నేనంటే కుదిరే పనేనా ? కాలానుగుణంగా కవి తనకుతాను సాధించే స్పష్టతే తన రచనలో ప్రతిఫలించే గొప్ప లక్షణం కదా!

ఆకుపచ్చని తడిగీతం లో స్త్రీట్ చీమలు, పోలవరం నిర్వాసితులకోసం, రెండు దేశాలు, ఆసుపత్రిలో చావు లాంటి కవితల్లో బాబా తను నిర్వచించిన సమాజం పట్ల తన వ్యక్తిగత బాధ్యత మాత్రమే కనిపించదు. కవిగా సామాజిక దుస్తితులపట్ల తన అసహనం, కోపం, నిస్సహాయతల్లో తన Intelectual element ఎక్కువగా లేకపోయినప్పటికీ ఒక ద్రవీభూత ప్రతిస్పందనే మనల్ని కదిలిస్తుంది. బాధ్యతని గుర్తించడానికీ, లిప్తకాలంలో ప్రతిస్పందించడానికీ పోటీపెడితే దేనికి మొదటి స్థానమివ్వాలో, ఏ పాఠకుడైనా దేనికిస్తాడో ఆట్టే ఎక్కువ ఆలోచించనక్కరలేదు. అలానే వెలుతురు తెర లో కూడా ఒక కవితలో--

ఆమెనెందుకు తీసుకురాలేదూ ?
“ప్లీజ్”
రక్తనాళాల్లోకి దొంగలా ప్రవేశించిన అబార్షన్ పిల్ గోడపై విచ్చుకుంటున్న చామంతి మొగ్గను చిదిమేసింది (అపుత్రస్య) అని అన్నప్పుడో --

ఎవరో నా చేతిలో పూల రేకులు పెట్టారు
వాడువేసే అడుగు అడుక్కీ పూల రేకులు చల్లాను
ఇంటికొచ్చి చూసుకుంటే నా చేతుల నిండా రక్తం(రక్తం మరకలు)
అంటాడు.

కవి భ్రూణ హత్య జరిగినప్పుడు బాధపడ్డాడు. అనకిష్టమైన పూలని రక్తంతో సమానంగా భావించాడు. బాబాలో భావవాద- సామాజిక వాస్తవికతల మధ్య ఒక దృక్పధ స్థిరత్వం కోసం జరిగిన పెనుగులాట రెండు పుస్తకాల్లో బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మూడో కన్నీటి చుక్కలో అతని ఆలోచనల్లో ఒక settled; అనగా స్థిరంగా మాత్రమే రాస్తున్న మానసిక స్థితి కనిపిస్తుంది.

మొదటిపుస్తకం లో నే -- నైట్ షిఫ్ట్ కేబిన్ మేష్టారు అన్న కవితలో - తప్పుకున్న పట్టాల మధ్య పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి తనో నిలువెత్తు ఎర్ర జండాయై -- అని కూడా ప్రస్తావిస్తాడు. బీసీ అంటే ఎవరు నాన్నా అన్న కవితలోనూ సమజంలోని కులభూయిష్టమైన ఆలోచనలను నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకిస్తాడు. పద్మశాలీయుని, విశ్వబ్రాహ్మనుని, కుమ్మరిని, దూదేకుల వారిని, బెస్తవానిని, గీతకార్మికుని గురించిన వేదన వినిపిస్తాడు. అదే కవితలో -- ద్రోణాచార్యుడు ఒక వేలే అడిగాడు కానీ, పారిశ్రామిక విప్లవాచార్యుడు కోరిన వేన వేళ్ళ దేహాల సంతతి అని చెప్పనా ? అని కూడా అడుగుతాడు. బాబా ముందు రెండు పుస్తకాల్లో ప్రశ్నలకు సమాధానాలివ్వడంలో తడబడ్డాడేమో కానీ, మూడో కన్నీటి చుక్కలో మాత్రం సమాధానాల్లోని విషయానికి (వస్తువుకి) మాత్రం తనదైన స్పష్టత ఇచ్చాడనిపించింది. జై శ్రీరామనీ అన్నాడు; లాల్ సలామనీ అన్నాడు. శిల్పమెంత ఘనమై ఉన్నదో తనదైన సారమూ అంతే స్పష్టంగా ఉంది. కానైతే బాబా కూడా కవిత్వం యొక్క సామాజిక ప్రయోజకత్వానికి వయక్తిక మార్పు కూడా చదువరి హృదయంలో దీపం పెట్టగలదన్న నమ్మకాన్ని వెల్లడిస్తాడు. “అనుభవాన్ని బుద్దిలా ఖండఖండాలుగా విశ్లేషించకుండా సమగ్రంగా సంపూర్ణంగా స్వీకరించగలదు ఈ హృదయమనేది” (కవిత్వంలో నిశబ్దం) అన్న ఇస్మాయిల్ గార్ని జ్ఞాపకానికి తెస్తాడు. బాబా ప్రధానంగా హృదయవాది. అతని కవితల్లో దేశం, సమాజం, వర్గం, వైరుధ్యం, రాజకీయం, దాని రాక్షసత్వం కన్నా ప్రాణాన్ని భయపెట్టే మృత్యువు, జ్ఞాపకాల్ని వెంటాడే స్వప్నార్హతలు, మళ్ళీ మళ్ళీ ఆత్మల (అంతరాత్మ కాదు) ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది.

మూడో కన్నీటిచుక్క లో కవితా శిల్పం చాలా బిగుతుగా ఉండి విగ్రహం పుష్టిగా ఉంటుంది. స్కిన్ ట్రేడ్, సోషల్ ఇంజినీరింగ్, దుక్ఖ ద్వారం కవితలు ఊపిరి బిగదీస్తాయి. అతని స్వానుభవాన్ని మాత్రమే ఆశ్రయించకుండా కొత్త ఆలోచనలోకి దూకిన బాబా కనిపిస్తాడు.

జీవితం అప్పుడపుడూ కాసేపాగి
తన సెల్ఫీ తానే తీసుకుంటుంది
ఒక్కో ఫోటో రక్తమూ కన్నీళ్ళూ నింపుకున్న కవిత్వమై చరిత్రలోకి ఇంకిపోతుంది (సెల్ఫీ) అన్నప్పుడు -- వెలుతుతెర లో “పునర్జన్మించాల్సిన జీవనకాంక్ష ఎంతకీ కలగట్లేదు. ఇక శెలవ్” (కవిత్వం) అన్నదానికన్నా చాలా బాగుంది. అలాగే మూడో కన్నీటి చుక్క పుస్తకంలో --

జీవించడమంటే ప్రేమించిన ఒక్కొక్కరినీ కోల్పోవడం కదూ ? (Alone but together). లాంటి మాటలకన్నా --

గౌరీ లంకేష్ వర్ధంతిని పురస్కరించుకుని -- అనామక శవాలతో చప్పగా ప్రవహించే చరిత్రకు ఒక వర్ధంతిని బహూకరించడం మామూలు విషయమా ! అభినందనలు లాంటి మాటలకన్నా -

తిరస్కరించిన తరువాత ద్వేషించనక్కరలేదని చక్కగా ప్రేమించుకోవచ్చన్న ! (చక్కగా ప్రేమించుకోక) మాటలు

జీవిత పర్యంతమూ పరిమళించీ పరిమళించీ పూదోటగా విస్తరించడానికే నువు ఇక్కడికి వచ్చావు (పూలదోట) అన్న భావనలు చాలా బాగుంటాయి. బాబా మీద అంతకుముందు లేని ఇష్టం ఎక్కువగా కలుగుతుంది.

ఈ బుక్లో, స్త్రీల పట్ల బాబా ఆలోచనలు, నాన్న తో తన అనుబంధం, గురుప్రేమ బాగుంటాయి. నాన్నతనాన్ని ఎలా అక్షరబద్దం చేస్తాడో చూడండి --

నాన్నతనాన్ని బజార్లో ఎక్కడున్నా ఇట్టే గుర్తుపట్టేయొచ్చు
సైజులు సరిపోకపోతే మారుస్తారు కదూ అంటో పిల్లల బట్టల షాపులోనో; స్కూలు విడిచాక వస్తూన్న పిల్లల గుంపులోంచి "డాడీ" అన్న పిలుపు వచ్చిన వైపు అసంకల్పితంగానో
ఎగ్జాం సెంటర్ వద్దనో...ఎక్కడైనా సరే నాన్నతనం తేలిగ్గానే దొరికిపోతుంది (నాన్నతనం) అంటాడు. నాన్న గురించి ఎక్కడ ఏం చదివినా ఇది కలిగించే భావ సంచలనం వేరు. అలాగే స్త్రీపట్ల ఆ మూడు రోజులు, ముల్లు తీయించుకోవడం, గాయాల స్వాస కవితలు ఆలోచనతో పాటు ఉద్వేగాన్ని కలిగిస్తాయి. చాలా మంది మగవాళ్ళం మనమే ఏదో ఉద్దరిస్తున్నట్టు ఇంట్లో ఆడవాళ్ళతో ఏం పని ఉంటుంది నీకు ? అనేస్తుంటాం. అదే కవితా శీర్షికతో బాబా రాసిన కవిత చద్దివాక ఏ మగవాడూ ఇంకలా అడగడు. నిజం. ఆమె పనిచెయ్యకపోతే ఇల్లెలా ఉంటుందో చివర ఒకేఒక్క మాటలో చెప్తాడు.

ఇల్లు మొత్తం
క్వారీ పక్కన జుత్తు నెరసి కాంతి నశించిన చెట్టులా ఉంది - అంటాడు. గుండెల్లో ముల్లు దిగిపోతుందంతే.

బాబా పరిచయం అక్కర్లేని కవి. ఈ మూడు పుస్తకాలతో పాటుగా రవీంద్రుని స్ట్రే బర్డ్స్ ని స్వేచ్చా విహంగాలుగా, సూఫీ అత్తరులు, ఇరవై ప్రేమ కవితలు ఒక విషాద గీతం లాంటి అనువాదాలు చేశాడు. చాలా చక్కగా ఉంటాయి. బాబా అనువాదాల ఎఫెక్ట్ నిస్సందేహంగా తన మౌలిక రచనలపై కూడా ఉంది. రెంటినీ పక్క పక్క పెట్టుకుని చూస్తే వాక్య నిగ్రహం పట్ల మనం పడే కొంత అసౌకర్యం తెలుస్తుంది. అతనింకాస్త స్వేచ్చాయుతంగా ఉండొచ్చు. అతని కవిత్వ భాష పుస్తకం వర్ధమాన కవులందరికీ figures of speech పట్ల మౌలిక జ్ఞాన్నాన్నిస్తుంది. అలంకార శాస్త్రం పట్ల ఒక మంచి అవగాహన తెస్తుంది. అతని చారిత్రక వ్యాసాల్లో ఉండే నిబద్దత, వాస్తవికప్రేమ కవిత్వం లోకూడా ఉంటే చాలా బాగుంటుందనేంత చక్కటి చారిత్రక వ్యాసాలు రాస్తాడు. కడప కైఫియత్తులు, బ్రౌన్ కృషి, పాలెగాళ్ళ చరిత్ర, మీద అతని వ్యాసాలు మాణిక్యాల్లాంటివి. ఒక జువాలజీ లెక్చరర్ ఇవన్నీ చేశాడంటే ఆశ్చర్యమేస్తుంది. అందుకే నాకూ ఒక జ్ఞానోదయమయ్యింది. బాబాని "అన్నా నువ్వెందుకు మార్క్స్ కి వ్యతిరేకం" అనడగదలుచుకోలేదు. తిలక్ ని గురించి రారా గారిలా ఆనంద నిష్యందం, ప్రమత్తతా పర్యవసాయి లాంటి భేదాల్లోంచి తర్కించదలుచుకోను. మూడు పుస్తకాలొచ్చాక మళ్ళీ అలాంటి పిచ్చి ప్రశ్నలు వేయడం వృధా కదా ? అఫ్సర్ అతని narrative poetry లో ( Also read - Narrative verse, Narratology) సంప్రదాయ కవిత్వ శైలి వ్యతిరేకత, కవిత్వంలో ఒదగని సాంస్కృతిక లక్షణాల్ని బాబా 'చక్కదిద్దుతున్నాడంటారు'. అదేమో గానీ, బాబా తనకు వీలుగాని ప్రయోగాలు మాత్రం చేయట్లేదు. తన స్వభావాన్ని నేరుగా కధనం చేయడాన్ని మనం హర్షించి తీరాలి. మూడో కన్నీటి చుక్కలో అతనికి తెల్సిన, అనుభవించిన జీవితాన్నే చిత్రించాడు. అంతకు మించి ఆ అనుభవంలోంచి ఇంకొంత కొత్తగా ఆలోచించి మంచి కవితలు రాశాడు. అతనిలో కొత్తదనానికి సామాజిక స్పృహ పురివిప్పి నాట్యం చేసిందని కితాబులు రాయను. అతనొక కొత్త దారి వేసేందుకు చమటోడుస్తున్నాడు. కవినేది నిలబెడుతుందో కాలమే ఎప్పుడూ నిరూపించింది. భయ్యా ! మనల్నందరూ గమనిస్తూనే ఉంటారు. కవిని కలవడాన్నెవరూ అస్సలు మిస్సవరు. బాబానైతే మరీనూ.

మూడో కన్నీటి చుక్క; బాబాలోని అంతర్నేత్రాన్ని చూపిస్తుంది.

మిత్రులారా ఇదందరూ చదివితీరాల్సిన కవిత్వ సంపుటి. బాబా ప్రేమగా హత్తుకోవల్సిన కవి; @ 98493 20443

శెలవు మరి
మీ
శ్రీరామ్
99634 82597

"యానం కవితలు" ఒక పరిశీలన

(ప్రముఖ కవి శ్రీ శిఖామణి తాజా కవిత్వ సంపుటి "యానం కవితలు" ఒక పరిశీలన)

Is Sikhamani an Exile Poet?

‘When you are in your home, you don’t glorify home: you don’t feel its importance and its intimacy, but when deprived of home, it turns into a need and a lust, as if it is the ultimate aim of the whole journey.’ Mahmoud Darwish

Exile Poetry పై నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి చర్చ జరుగుతున్నది. Mohmoud Darwish, Wadih Saadeh, Adonis, Bertolt Brecht, Yehuda Amichai ల కవిత్వం ఈ రకపు పాయను ఏర్పరచింది. డయాస్పొరా సాహిత్యం సామూహిక అస్తిత్వ ప్రకటన అయితే Exile Poetry వైయక్తికం.

Jo-Marie Claassen States “Exile is a condition in which the protagonist is no longer living or be able to live, in the land of his birth” అంటె మన స్వస్థలం, తల్లిదండ్రులు, స్నేఇతులు ఇంకా చెప్పాలంటే ఇదీ మన ప్రపంచం అని అనుకొంటున్న అన్నింటినుంచీ ఒక్కసారిగా దూరమవటం. ఇది స్వచ్ఛందం కావొచ్చు లేదా బలవంతం కావొచ్చు. చాలామంది తాము చేరుకొన్న కొత్తప్రాంతాలలో- అక్కడి ప్రజల సంస్కృతి, భాష ఇంకా యాసను కూడా నేర్చుకొని చక్కగా కుదురుకొని పరాయీకరణ చెందుతారు. కానీ కవి అలా ఉండలేడు. స్వస్థలపు జ్ఞాపకాలు అతని ఆత్మను దహింపచేస్తూంటాయి. ఆ వియోగం అతన్ని నిత్యం దుఃఖపెడుతూంటుంది. ఆ వియోగం నుంచి విముక్తమవటానికి కవులు తమ స్వస్థలపు బౌతిక మానసిక స్వరూపాలను తమ కవిత్వంలో ఆవిష్కరిస్తారు.

దేశబహిష్కరణకు గురైన కవులు రాసే కవిత్వంలో రాజకీయాలు ఉంటాయి. కానీ శిఖామణి మెరుగైన ఉపాధికొరకు స్వస్థలాన్ని వీడిన కవి. శిఖామణి కవిత్వంలో రాజకీయాల స్థానంలో, జ్ఞాపకాల తలపోత ఉంటుంది. మానవ సంబంధాలలోని ఆర్థ్రత ప్రకటింపబడుతుంది.
***
ఎనిమిదవ శతాబ్దంలో రోమ్ నుంచి బహిష్కరించబడిన Ovid అనే కవి ఆనాటి రోమ్ లోని తన మిత్రులను, తిరిగిన ప్రదేశాలను, జ్ఞాపకాలను కవిత్వంలో భద్రపరచినట్లుగా, యానాం అనే ఒక ప్రాంత అస్తిత్వాన్ని శిఖామణి తన కవిత్వంలో దాచుకొన్నాడు. ఈ కవిత్వం అంతా ఒక కాలానికి చెందిన యానాం భౌగోళిక, సాంస్కృతిక, మానవసంబంధాల ఆవరణం. ఇది చరిత్రపుస్తకాలలో లభించదు. “Nations are to a very large extent invented by their poets and novelists” అని Aldous Huxley అన్నది దీనిగురించే. ఈ కవిత్వం అంతా ఒక Exile కవిగా శిఖామణి ఆత్మావిష్కరణ. ఆత్మావిష్కరణకు సాహిత్యం వినా మరో మార్గం లేదు మానవజాతికి.
***
‘మువ్వల చేతికర్ర’ నాటికి స్వస్థలాన్ని వీడలేదు శిఖామణి. ఆ సంపుటిలో యానాం కవితలు కనిపించవు. ఆ తరువాత ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వెళ్లవలసి వచ్చినప్పుడు రాసుకొన్న “ఆంతరంగికుని వుత్తరం” కవితలో తాను ఏం కోల్పోయి ఏం పొందుతున్నాడో స్పష్టంగానే చెపుతాడు శిఖామణి

నడివేసవి పొలంగట్టున
తుమ్మచెట్టు నీడలోని నిద్రలాంటి ఊరొదిలి
కలత నిద్రల నగరానికి
కళవల పడి నువ్వెందుకొచ్చావు నా తండ్రీ//
హఠాత్తుగా అర్ధరాత్రి
సిద్దార్థుడు కపిల వస్తును వొదిలినట్లు
ఏయే ధ్యేయాల గమ్యాల పరిసమాప్తి కోసం
ఈ దొంగ ఊబిలో
అడుగు మోపడానికి సాహసించావు?// అనే వాక్యాలలో స్వస్థలం పట్ల తనకున్న అనురాగాన్ని, తాను చేరుకొన్న మహానగరంపై తన ప్రధమ అభిప్రాయాల్ని నిక్కచ్చిగానే చెపుతాడు. ఆ తరువాత రాసిన కవిత్వంలో మహానగరంపై చేసిన వ్యాఖ్యలు కనిపించవు కానీ స్వస్థలంపై ఉన్న మోహం మాత్రం మరింత చిక్కబడి నేటివరకూ నిలిచిఉండటం చూడవచ్చు.

స్వస్థలంలో లేనందుకు వేదన చెందటం, అక్కడే ఉండిపోయిన లేదా గతించిన తల్లిదండ్రులను తలచుకొని దుఃఖపడటం Exile poetry లక్షణం. శిఖామణి అనేక కవితలలో ఈ అంశం కనిపిస్తుంది.

పొట్టచేతపట్టుకొని
కన్న వూరొదిలి
నగరం నట్టడవికొచ్చాను కాబట్టి
ఇంకానీవు
మన స్వస్థలంలో స్వస్థతగానే
ఉన్నావనుకొంటున్నాను
అవున్నాయినా!
మనిషికి స్వస్థలం ఏది?
మనిషికి స్వస్థత ఎక్కడ? (నాయిన 2) పై వాక్యాలలో తాను కన్న వూరొదిలి వచ్చాను కాబట్టి స్వస్థతగా లేదు అన్న అర్ధాన్ని ధ్వనిస్తున్నాడు. చివరకు మనిషికి సొంతూరు ఏది, శాంతి ఎక్కడా అంటూ తాత్వికతలోకి వెళిపోతాడు. ఇదంతా Exile వలన కలిగే ఎడతెగని దుఃఖం పలికించే నిర్వేదం.

Exile కవిత్వంలో తాను చనిపోయాకా స్వస్థలంలోనే తనను పండించాలన్న ఆకాంక్షలు కవులు పదే పదే చెప్పుకోవటం గమనించవచ్చు. Ali foda అనే పాలస్తీనియన్ కవి ఇలా అంటాడు

It is a sin to die in exile
Oh be merciful to me
And take me as a wheat in birds mouth
And bury me there// (2009)

శిఖామణి కవిత్వంలో మృత్యు ఊహలు, మరణానంతర కోర్కెల ప్రస్తావన దాదాపు కనిపించవు. మరీ ముఖ్యంగా ఈ సంపుటిలోని కవిత్వంలో. పై కవితలో ఆలి ఫోదా వెలిబుచ్చిన మనోభీష్టం శిఖామణి తన కవిత్వంలో ఎక్కడా నిక్షిప్తం చేయకపోయినా, సన్నిహితుల వద్ద “ఏదైనా జరిగితే యానాం తీసుకెళ్ళండి” అని చెప్పుకునే ఉన్నాడు. ఎవరికీ అసౌకర్యం కలగకూడదని ఎప్పుడో బంధువులకు ఇచ్చివేసిన పూర్వీకుల ఇంటిని డబ్బు వెచ్చించి తిరిగి కొనుక్కొన్నాడు కూడా.

స్వస్థలానికి దూరమైన కవులు తమ ఊరి భౌగోళిక స్వరూపాన్ని, చిన్ననాటి వ్యక్తులను అనుబంధాలను తమ జ్ఞాపకాలలోంచి వెలికితీసి కవితా వస్తువులుగా చేసుకొంటారు. ఉపరితలంగా చూస్తే ఇది నాస్టాల్జియా కవిత్వంలా కనిపిస్తుంది. లోతుగా గమనిస్తే ఒక ప్రాంతపు ఉనికిని, ఔన్నత్యాన్ని చరిత్రలో దాచిపెడుతున్నారని అర్ధమౌతుంది. Exile సాహిత్యాన్ని ఒకప్పుడు మానవ దుఃఖం, మనోవేదన కోణాలలోంచి చూసిన విమర్శకులు, నేడు Pride, Glorification, Enrichment in the National Literature దృష్టితో అధ్యయనం చేస్తున్నారు. ఇది శిఖామణి కవిత్వానికి కూడా అన్వయం చేసుకోవాలి. ఈ కవితలలోని యానాం తలపోతలు నాస్టాల్జియా కాదు. ఆ మట్టికి, అక్కడి మానవసంబంధాలకు శిఖామణి ఎత్తిన హారతి ఈ కవిత్వమంతా.

ఆది ఆంధ్రపేట, అక్కడి మంచినీటి చెరువు, ఆ చెరువుగట్టున ముత్యాలుగారి ఇల్లు, ఫ్రెంచి జెండాని ఎగరేసిన జెండా స్తంభం, పాతబస్ స్టాండ్ సెంటర్ లోని ఆరణాల షాపు, కవిగారి ఇంటిచుట్టూ ప్రహరీలా విస్తరించిన అడ్డసరం కట్టవ, ఈ ప్రాంతంలో మాత్రమే లభించే పులస చేపలు, ఆర్టోస్ కూల్ డ్రింకు, యానాం-ఎదుర్లంక వారధి వంటి వివిధ విషయాలు యానాం నైసర్గిక స్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి.

శిఖామణి మౌలికంగా మానవసంబంధాల కవి. Exile కవులు తమ జ్ఞాపకాలలోని వ్యక్తులను కవిత్వంలో బ్రతికించుకొంటారు. కవికి సంబంధించినంతవరకూ ఇది ఆయా వ్యక్తుల వియోగభారాన్ని దింపుకొనే ప్రయత్నం కావొచ్చు. ఈ కవిత్వంలో కూడా - తోకమీద నిలబడిన ఆరడుగుల నల్లతాచులాంటి బాప్ప; అవసరానికి చేతిగాజులు ఇచ్చిన శిఖామణి సాహిత్య గురువు శ్రీమతి కందర్ప వెంకట నరసమ్మ గారు; పదే పదే జ్ఞాపకానికొచ్చి కన్నీళ్ళు తెప్పించే దొండపాటి మీరాబాయి; నాయుడు బావకే మందు పెట్టిన గంగిరెడ్ల మరిడమ్మ; ఇవ్వటమే తప్ప తిరిగితీసుకోవటం తెలియని నాయిన, అంకులు గారు; బ్రహ్మ దేవుని మూడు ముఖాల్లా ఎడమొహం పెడమొహం పెట్టుకొనే ముగ్గురు కవులూ; బాల్యాన్ని మూరమూర కోసుకొని అమ్ముకొనే పూలబ్బాయి; ఇద్దరు ప్రభాకరరావు, భాస్కరరావు; చిన్నప్పుడు కవి నోట్లో వడ్లగింజ పడకుండా కాపాడిన చెల్లి గోపెమ్మ; లాంటి వ్యక్తులు రక్తమాంసాలతో సంచరిస్తారు. ఆయా కవితలను చదివిన వారి హృదయాలలోకి సొంతవ్యక్తులుగా ఇంకి పోతారు. ఈ లక్షణమే మానవసంబంధాలను గొప్ప ఆర్థ్రతతో ఆవిష్కరించగలిగే ఒకే ఒక సమకాలీన కవిగా శిఖామణిని నిలిపింది.

శిఖామణి యానాం విడిచి వెళ్ళినా యానాంతో సంబంధాలను కలిగి, పండగలకో పబ్బాలకో వస్తూపోతూనే ఉన్నాడు ఇన్నాళ్ళూ. ఆ వచ్చినప్పుడు కూడా కొన్ని కవితా వస్తువులను ఇక్కడనుంచి ఏరుకొని వెళ్ళిన సందర్భాలు కనిపిస్తాయి. కవి వంకే ఉత్తినే దిగులుగా రాతి చూపులు చూసే రంగూను సన్నికల్లు; ఆకాశమే హద్దుగా, వొఠి ఆరుబయలుగా మిగిలిపోయిన సన్ థియేటర్ లాంటి కవితలు అలా పాత జ్ఞాపకాలను మారిన పరిస్థితుల నేపథ్యంలోంచి దర్శింపచేస్తాయి.
కవి స్వస్థానం విడిచి మూడు దశాబ్దాలు దాటిపోయింది. అతని జ్ఞాపకాలు చెదలు తినేసిన పటంలా కొద్దికొద్దిగా వాస్తవంలోంచి కనుమరుగు అవుతూంటాయి. కవికి వయసు పెరుగుతున్న కొద్దీ తన జ్ఞాపకాలలో దాచుకొన్న వ్యక్తులు, ప్రదేశాలు కాలక్రమేణా అదృశ్యమౌతూంటాయి. మారిన భౌతిక స్వరూపం, చేరిన కొత్తవ్యక్తులు తాను అంతవరకూ నిర్మించుకొన్న ఊహల్ని భగ్నం చేస్తాయి. ఈ అనుభవాన్ని కూడా శిఖామణి పట్టుకొని “మనిషిలేని ఊరు” కవితలో ఇలా వర్ణిస్తాడు.

ఇప్పుడు
కుశలమడగడానికి
ఇక్కడ మనుషులేరి?
మనిషి లేని వూరూ
ఒక వూరేనా? – అని ప్రశ్నిస్తాడు. గుండెలు పిండే వాస్తవమిది. “యానమా నా ఆరో ప్రాణమా” అని ఎలుగెత్తి , అల్లర్లతో తల్లడిల్లిన యానానికి హ్రుదయాన్ని నవనీతం చేసి పూసి, తనని తాను అరిటాకు చేసుకొని స్వాంతన చేకూర్చి దాన్ని తన కవిత్వంలోకి ఆవాహన చేసిన కవికి ఎదురైన గొప్ప జీవన వైచిత్రి ఇది.
***

మనుషులకు స్వస్థలాల్ని విడిచి పోవటం కొత్తేం కాదు. మానవనాగరికత అంతా అలా పోగుపడిందే. విడిచివచ్చిన స్వస్థలాన్ని గురించి బెంగపడటమూ కవిత్వానికి కొత్తకాదు. ప్రతీ కవీ తన ఊరిగురించో, ఊరిలో చెరువుగురించో, పండగనాటి సంబరాలగురించో కవితలు అల్లే ఉంటాడు. కానీ శిఖామణిలా తన స్వస్థలపు మనుషుల్ని, ప్రదేశాలను, కాలానుగుణంగా వచ్చిన మార్పులను మూడు దశాబ్దాలపాటు కవిత్వంలో నిక్షిప్తం చేస్తూ వచ్చినవారు తెలుగుసాహిత్యంలో మరొకరు కనిపించరు. ఆ రకంగా శిఖామణిని ఒక Exile కవిగా, ఈ పుస్తకంలోని కవిత్వాన్ని Exile కవిత్వంలా భావించటానికి సందేహించక్కరలేదు.

శిఖామణి నిక్కమైన కవికనుక అలా రికార్డు చేసిన చరిత్రాత్మక కవితలలో కనిపించే కవిత్వాంశ కూడా అద్వితీయమే. అందుకనే బాప్ప కవితనో, యానాం సరస్వతి కవితనో, పూలకుర్రాడు కవితనో ఉత్త వైయక్తిక వ్యక్తీకరణలుగా కొట్టిపారేయలేం. ప్రతిఒక్కరూ ఎక్కడో ఒకచోట ఈ కవితలతో కనెక్ట్ అవుతారు. వాటిని సార్వజనీన అనుభూతులుగా హ్రుదయగతం చేసుకొంటారు. శిఖామణి ఏదో సభలో “నేను మూడు రాష్ట్రాల కవిని” అని చమత్కారంగా అన్నట్లు ఈయనకు రెండు అస్తిత్వాలు. ఒక దానిలో నల్లగేటు నందివర్థనం పూలు ఉంటాయి, మరొక అస్తిత్వంలో యానాం కవితలు ఉంటాయి.

(నా సాహితీగురువు శ్రీ శిఖామణి గారి ఆదేశం పై ఈ నాలుగు వాక్యాలు రాయటానికి నాకు ఉన్న అర్హత, నేనుకూడా ఆయనలాగే యానాంలో పుట్టి పెరగటమే అని తలుస్తాను)

బొల్లోజు బాబా
4/10/2019
కాకినాడ

"మూడోకన్నీటి చుక్క" 2

"మూడోకన్నీటి చుక్క" పుస్తకంపై Srinivasa Nyayapati గారు సహృదయంతో చేసిన అవలోకనం నన్నునాకు కొత్తగా దర్శింపచేసింది.

కొన్ని అనుభూతులను ఇద్దరం కలిసే అనుభవించామనే ఊహ తృప్తిగా అనిపిస్తోంది.

వాసుగారి ఆత్మీయ పలుకులకు సదా కృతజ్ఞుడను.

థాంక్యూ సర్

బొల్లోజు బాబా
***

__గుండె పూడికను తీసేసే మధురాంబువు__
.

బొల్లోజు బాబాగారితో నాకున్నదల్లా ఈ ముఖపుస్తక పరిచయం. అముఖపరిచయం. అయితేనేం, వారి కవిత్వంతో మంచి పరిచయమే ఉంది, ఈ మాధ్యమంలో. ఈ మూడో కన్నీటి చుక్క నా చెంపమీదుగానూ జారి దొర్లింది.

సరళమైన prose poems కుందుర్తి కాలానికే తెలుగులో మొదలయ్యాయి. "నా కవిత్వాన్ని సారళ్య సుందరి వరించింది." అని చెప్పుకోగలిగే కవులు కుందుర్తి తరువాత మనకు మరీ ఎక్కువమంది కనిపించరు. ఇదుగో ఇప్పుడు బొల్లోజు బాబా (తను అలా చెప్పుకోకున్నా) అదే కోవకు చెందిన కవి అని అనుకుంటాను నేను.

ఇస్మాయిల్ తరువాత అంత నిజాయితీగా నిరాడంబరంగా తను జీవించిన జీవితానికీ స్వానుభవాలకూ మాత్రమే అక్షరదర్పణాన్ని అందిచ్చిన కవి బొల్లోజు బాబా. బాబా తనే ఓ చోట చెప్పుకున్నట్టుగా తను జై శ్రీరామ్ అన్నా ఆ నినాదం వినగానే స్ఫురించే ఉద్యమానికి చేయూతనిచ్చేవాడుకాడు. అలాగే లాల్ సలామ్ అన్నా సరే ఒక రంగు జెండాని ఎత్తిపట్టుకొని ఒక పక్షానికే వత్తాసు పలికే రకమూ కాదు. ఏ రాజకీయ దుర్వాసనలూ అంటని మామూలు మనిషన్నమాట. ఈ మామూలు మనుషుల జీవనప్రయాణమే ఒక అసిధారావ్రతం. వీళ్ళు తమ ఆత్మావిష్కరణకోసం చేసే సుదీర్ఘమైన ప్రయాణం, ఈ ప్రపంచం గుండానే, ఈ జీవితంలో దొరికే ఓ పుంజీడు స్మృతులతోనే సాగుతుంది. బాబా దీనికి మినహాయింపు కాదు.

బాబా కవిత్వంలో ఉన్నది జీవితంలో ఉన్నది. ఇల్లూ తలితండ్రులూ పిల్లలూ (ముఖ్యంగా పిల్లలు) ఇల్లువదిలి దూరాలు వెళ్ళడం ఒకరికొకరు దూరం కావడం nostalgia అన్నీ. ఇవేకాదు, ఆధునిక నగరజీవితపు డొల్లతనం కించిత్ రాజకీయ చైతన్యమూ కాస్త సామాజిక స్పృహానూ. అయితే బాబా తను రాసినదానిని కవిత్వంగా మలచడానికి ఏ ఒక్క ప్రత్యేకమైన టెక్నిక్కూ వాడకుండా నిర్మలఝరిని తలపించే శైలిలో సున్నితంగా మనం కోల్పోతున్నవి ఎత్తిచూపుతాడు. మనల్నే మనకి పునఃపరిచయం చేస్తాడు. ఆ పరస్వపరిచయం పూర్తయాక మన వొళ్ళంతా ఏ కవనలేపనం అంటుకుంటుందో కానీ మనం విషాదమధురమైన బాధను అనుభవిస్తాం.

ఇందులోని కవితలు "వలస పోవటం.." చదివి పితావైపుత్త్రనామాసీత్ అన్నమాట తలుచుకున్నాను."రహస్య ప్రియురాలు" చదివి నేను సముద్రపొడ్డునుంచి తెచ్చుకున్న గవ్వను తడిమి చూసుకున్నాను. "నాన్నతనం" చదివి ఒక కొడుకుగా తండ్రిగా నా ఆత్రుతలూ అనుబంధాలూ ఏమిటా అని అవలోకించుకున్నాను. "గుండె పూడిక" చదివి నా గుండెలో దాన్ని దాచుకున్నాను. "Personal" చదివి హమ్మయ్య నాలాంటివారే ఈ కవి కూడా అని స్థిమితపడ్డాను. "గురుదేవులకు వందనాలు" చదివి నా గురుదేవులకు నమస్కారాలు అర్పించాను.

ఇలా చెప్పుకుంటూపోతే ఇందులోని ప్రతి కవితా నన్ను స్పర్శించినదే అని చెప్పాలి. స్పర్శ. ఆ స్పర్శ కోసం ఎదురుచూసినవాళ్ళకి బాబా కవిత్వం సహస్రహస్తాలతో వెలుతురు వేళ్ళతో స్వాగతం పలుకుతుంది. నేనీ స్వాగతాన్ని మన్నించి ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే బొల్లోజు బాబా నన్ను మార్చే ప్రయత్నం చెయ్యలేదు, సదా నేను నేనుగా ఉండే కవిత్వాన్నే నాకు ఇచ్చాడు. ఈ గుండె పూడికను తీసేసే మధురాంబువు చాలు నాకు.

-వాసు-

For copies,

Bolloju Baba,
30-7-31,
Suryanarayana Puram,
Kakinada

"మూడో కన్నీటిచుక్క" 1

ఇరవైనాలుగు గంటలూ పేషంట్లు, ఆపరేషన్లతో ఊపిరిసలపనంత బిజీగా ఉంటూ కూడా... కొన్ని గంటలు, మరి కొన్ని వాక్యాలు "మూడో కన్నీటిచుక్క" కు కేటాయించినందుకు Sailaja Kallakuri మేడమ్ గారికి శతకోటి వందనాలు.

థాంక్యూ అండి
****

కవి కి దుఃఖం రావాలి. కాదు,కావాలి!
వైయక్తిక, సామాజిక, జీవన చిత్రం రకరకాల పురుగుల బారినపడి కొంచెం కొంచెంగా ఛిద్రమైపోతుంటే, ముందస్తుగా పట్టుకోగలవాడు నిస్సందేహంగా కవే.
మరి కవిత్వం చదవడానికి..?
మనసులో సహానుభూతి అనే జల ఉండాలి.
కాస్త రొక్కం కడితే చాలు, గంటలకొద్దీ వినోదం, కడవల కొద్దీ అవసరం లేని కన్నీళ్ళు, అస్థిరత ను ఆవిష్కరించే కపటం ,మన ఇంట్లోకే సప్లై చేసే రోజుల్లో..... ఒక కవితనో, కవితల పుస్తకాన్నో చదవగల మెత్తని గుండె ఎవరెవరికి ఉంది? అలాంటి వారంతా రండి.రా రండి.
సుతిమెత్తని , చదివించే పంక్తులను రాసి, 'ఇదిగో కొన్నాళ్ళ నా ఆవేదన మూట' అంటూ,
బల్లమీద పెట్టగల ధైర్యం ఎవరికుంది, మా బొల్లోజు బాబా గారికి తప్ప?
ఒక దుఃఖం... అది సంఘటన కాదండోయ్! ఒక దుఃఖం.... అది సంభవించడానికి ముందున్న వాతావరణాన్ని----- రైతు ఇంట భార్య దిద్దుకునే కుంకుమబొట్టు లోనూ,ఆ పెరటి దండెం పై ఆరేసిన వెలిసిన చీర గాను,సాక్ష్యంగా ఉన్న వృక్షంలోనూ, చూడగలగడం కవి చేసే సత్య దర్శనం.
మరో కవి స్నేహ హస్తాన్ని పావురం కన్నా మెత్తగా,నీరెండ కన్న వెచ్చగా స్పృశించిన సౌహార్దత ఈ కవికే సొంతమైన ప్రత్యేక లక్షణం.

ఈయన అస్తిత్వం అంతా జీవం లేనట్టుగా తోచే "సజీవ చైతన్యం" తో సంభాషించ గల అనురాగమే. ఆ రాగాలాపనకు మనం చెవి ఒగ్గక తప్పుతుందా?గులాబీ మొక్క, లైబ్రరీలో పేజీలు తస్కరించి బడిన వెల్తురు వాక్యం,ఇసకలో దొరికిన గవ్వ....ఇలా ఎన్నో!
వలస పక్షులు,వట్టిపోయిన ఆవు,పాత ఫోటోలో రూపం...ఇలా ఎక్కడెక్కడో వెతికి మరీ, కవితా వస్తువులను లేత చివుళ్ళ లాంటి కవితలుగా మలచి మనకు బహూకరిస్తారు .
ఏ స్పర్శేంద్రియాలను మనం అబద్ధాల చీకటితో జో కొడుతున్నామో, (కన్ను, చెవి,ముక్కు)... అవి లుప్తమైన వారి అతీంద్రియ అనుభవాలను గుదిగుచ్చి,సత్యం--- ప్రేమ ---- దైవం----గా మన ముందే Tangible గా ఆవిష్కరిస్తారు.
అద్దంలోనో,ప్రేమాస్పద నయనాల లోనో తప్ప చూసుకోనక్కర్లేని ముఖాన్ని..... ఎన్నో సెల్ఫీలు గా చెక్కుకుంటున్న ఈ తరం, 'పరాయీకరణ పరాకాష్టను'మన చేతిలోనే ఆరబోసి చూపిస్తారు. పైగా పరాయీకరణ అంటే మరో దేశ సంస్కృతి దాకా పోనక్కర్లేదు,'నీ నుంచి నువ్వు విడిపోవడమే కాదూ...? అంటూ మెత్తగా సూచించారు.
తన నాన్న లా మారిపోయిన ఈ నాన్న ఎన్నింటి గురించి వాపోతున్నారో ?
గుబులు గుండె గల తల్లి లా ఎన్ని బెంగ దీపాలను వెలిగిస్తున్నారో?
'కొంచెం కొంచెంగా ఆత్మను చంపేసుకుని, హృదయాన్ని అమ్ముకుంటున్నావేమో?' హన్నా! అని నిలదీసి కళ్ళెర్ర చేస్తారు కూడా.
అదృశ్యమైన పిట్ట పాటనీ,దైనందిన జీవితాన్ని శాసించే బడా వ్యాపార సంస్థల బోర్డు మీటింగ్ లని తెచ్చి మన ముందుంచే నికార్సైన పాత్రికేయుడీయన .
Mark Twain ఎప్పుడో చెప్పాడు: Sanity and Happiness are Impossible Combination...
అని.
సమ్యక్ దృష్టి గలవారికి ఏ మతంలోనూ, ఏ ఇజంలోనూ ఇమడనంత విశాలమైన PERSONA ఉంటుంది.అలాంటి బాబా గారి
"మూడో కన్నీటి చుక్క" ......సగమే చదివాను.
మళ్ళీ సగం తో మరోసారి కలుస్తాను.

Ten Years It took by Song Sun (1493-1583)



పదేళ్ళు పట్టింది
ఈ చిన్నకుటీరం నిర్మించుకోవటానికి

చలిగాలి సగం ఆక్రమించింది
మిగిలిన సగంలో వెన్నెల

కొండకు,
సెలయేరుకు చోటు దక్కలేదు
బయటే ఉండిపోయాయవి.

అనువాదం: బొల్లోజు బాబా

ది గ్రేట్ ఇండియన్ పోలరైజేషన్ ట్రిక్



ఇద్దరు ఆటగాళ్ళు
బూరా ఊదుతున్నారు
బుట్టలోని తాడు దానంతట అదే
పడగవిప్పి
తోకపై నిలుచున్న రాచనాగులా
గాల్లోకి లేచింది
జనం చప్పట్లు కొట్టారు

మరో ఆటగాడు
ప్రజలకు అభివాదం చేసి
నిలుచున్న ఆ తాడుని
ఎక్కడం ప్రారంభించాడు
క్రమక్రమంగా
మసకచీకట్లోకి కనుమరుగయ్యాడు

కాసేపటికి
మాంసం కండలు, రక్తం చినుకులు
వర్షించాయి ప్రజలపై
తాడు ముడుచుకొంటూ బుట్టలోకి చేరింది.

"భలే కనికట్టు... భలే కనికట్టు" అంటో
మరలా తప్పట్లు కొట్టారు ప్రజలు.
జోలెనిండా కాసులు నిండాయి.

అది కనికట్టుకాదనే
వాస్తవం ఎరిగిన ఆ ఇద్దరూ
లోలోపల నవ్వుకొంటున్నారు.

బొల్లోజు బాబా

అమెరికన్ అధోజగత్ జీవనానుభవాల కవి


Charles Bukowski అమెరికన్ కవి. (1920-1994) బుకోవ్ స్కీ కవిత్వం ముతకగా ఉంటుంది. ఇంతకు మించి కోల్పోవటానికి ఏమీ లేదు అనే అనుభూతిని, ఉద్వేగాన్నీ కలిగిస్తుంది. ఒకరకమైన సినికల్ ధోరణిగా అనిపిస్తుంది కూడా.
నాలుగురోజుల క్రితం మా అమ్మాయి బుకోవ్ స్కి గురించిన ఒక కొటేషన్ ను చూపించింది.
ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకంలోని ప్రారంభ వాక్యాలట అవి.
"Charles Bukowski was an alcoholic, a womanizer, a chronic gambler, a lout, a deadbeat and on his worst days, a poet. He is probably the last person on earth you would ever look to for life advice"
ఇతన్ని నువ్వు చదివావా అని అడిగింది. కొన్ని అనువాదాలు కూడా చేసాను అన్నాను తను ఏమనుకొంటాదో అని భయపడుతూ (ఆ కొటేషన్ మేటర్ అలాంటిది మరి  )
ఈ రోజు బాల సుధాకర్ మౌళితో మాట్లాడుతున్నప్పుడు బుకోవ్ స్కి ప్రస్తావనవచ్చింది.
నేను చేసిన అనువాదాలను ఒక సారి చూసుకొన్నాను. అయిదేళ్ళుగా బుకోవ్ స్కీతో ప్రేమలో ఉన్నానని అర్ధమైంది.
అవన్నీ చూసి.... ఎందుకు అనువదించానో నన్ను నేను ఒకసారి తరచిచూసుకొనే ప్రయత్నమిది.
***
I Met A Genius- Charles Bukowski
ఈరోజు రైల్లో
నేనో మేధావిని కలిసాను
ఆరేళ్ళ వయసుంటుందేమో
అతను నా పక్కనే కూర్చున్నాడు
రైలు సముద్రతీరం వెంబడి వెళుతోంది
సముద్రాన్ని చూస్తూ అన్నాడతను
“పెద్ద అందంగా ఏం లేదని”
అవును నిజమే కదా అనిపించింది
మొదటిసారిగా
1 October 2015
అనాదిగా సముద్రం అందాన్ని వర్ణిస్తూ అనంతమైన సాహిత్యం వచ్చి ఉంటుంది. అదేదీ తెలియని ఒక చిన్నపిల్లవాడు సముద్రం పెద్ద అందంగా ఏం లేదు అన్నప్పుడు అతడిని మేధావిగా వర్ణించటం ద్వారా పాతతరం కవుల్నందరినీ దోషులుగా నిలబెడతాడు బుకోవ్ స్కి. . అదే అర్ధం వచ్చేలా Great art is horseshit అంటాడు మరోచోట.
***
ఈ రాత్రికి ----- Tonight by Charles Bukowski
“నీ ప్రియురాళ్ళపై నీవు వ్రాసే కవిత్వం
మరో యాభై ఏళ్ళు నిలుస్తుంది.....
వాళ్ళు గతించిపోయినప్పటికీ”
నా ఎడిటర్ ఫోన్ చేసి అంటున్నాడు.
మిత్రమా
వారేనాడో నన్ను విడిచి వెళ్ళిపోయారు
నువ్వేమంటున్నావో నాకు అర్ధమైంది.
ఐతే
ఒక్క నిజమైన సజీవ స్త్రీని నాకొరకు ఈ రాత్రికి పంపించు
నా వైపు నడుచుకొంటూ వచ్చే ఒక్క స్త్రీని...
నా కవితలన్నీ నీకిచ్చేస్తాను
మంచివీ, ముతకవీ
ఇకపై నేను వ్రాయబోయేవీ కూడా.
నువ్వేమంటున్నావో నాకు అర్ధమైంది.
నేనేమంటున్నానో నీకు అర్ధమైందా?
13 March 2016
ప్రేమ కవిత్వం అంతా విరహంలో పుడుతుందన్న సూచన, లేనిదాని కొరకు చేసే అన్వేషణే సాహిత్యం అన్న అర్ధాలు పై కవితలో కనిపించాయి. బహుశా బాలగోపాల్ అన్న "ఖాళీలను పూరించటమే సాహిత్యం చేసే పని" అనే వాక్యం పై కవితకు అన్వయించుకోవచ్చనుకొంటాను.
***
కొద్దిసేపటి క్రితమే -- it was just a little while ago by Charles Bukowski
తెల్లారింది
టెలిఫోను తీగలపై పిట్టలు
ఎదురుచూస్తుండగా
నిన్న మరచిపోయిన సాండ్విచ్ ను
ఇప్పుడు తింటున్నాను.
ప్రశాంతమైన ఆదివారపు ఉదయం
గది మూలన నిల్చుని ఉంది ఒక చెప్పు
మరొకటి దానిపక్కనే
అవును
కొన్ని జీవితాలు వృధా కావటానికే
సృజింపబడతాయి.
20 November 2016
ఒక మెలంకలీ పరుచుకొన్న కవిత ఇది. దృశ్యాలు, సంఘటనల ద్వారా బాధను ఎంత బలంగా చెప్పొచ్చో తెలియచేస్తుంది. శని ఆదివారాలు వీకెండ్ అనుకొంటే వృధా అయిన శనివారాన్ని చెపుతున్నట్లు తోచింది.
***
రూములు రెంట్ కి ఇచ్చే అందమైన అమ్మాయి - by Charles Bukowski
న్యూ ఓర్లియాన్స్ నగరంలో అద్దెకు గది చూపించింది
ఓ అందమైన అమ్మాయి.
చీకటిగా ఉందాచోటు
చాలా దగ్గరగా నిలుచున్నాం మేం
"ఈ గదికి వారానికి నాలుగున్నర డాలర్ల అద్దె" అందామె
"నేను సాధారణంగా మూడున్నర చెల్లిస్తూంటాను" అన్నాను
ఆమెను అప్పుడప్పుడూ చూస్తుండొచ్చుకదా అని
నాలుగున్నర చెల్లించటానికి నిర్ణయించుకొన్నాను
ఆ అమ్మాయి లాగే
స్త్రీలు ముందుగా తాము చొరవచూపరెందుకో అర్ధంకాదు
మననుంచి ఆశిస్తారు
చివరకు నేనే "రూము తీసుకొంటాను" అని చెప్పి డబ్బులు చెల్లించాను
దుప్పట్లు మురికిగా ఉన్నా, మంచం సర్ది లేనప్పటికీ
నేను అస్కలిత యవ్వనస్తుడను
కంగారులో ఉన్నాను కూడా
డబ్బులు తీసుకొని
తలుపు వేసి వెళిపోయిందామె.
రూములో టాయిలెట్ లేదు
సింకు లేదు, కిటికీ కూడా లేదు
రూమంతా ఆత్మహత్య, మృత్యువులతో తడితడిగా ఉంది
మంచంపై పడుకొన్నాను
అక్కడొక వారం ఉన్నాను
హాల్ లో చాలామందిని కలిసాను
ముసలి తాగుబోతుల్ని
ఉపశమనం పొందుతున్నవారిని
పిచ్చివాళ్లని
చురుకైన పడుచువాళ్లను
జబ్బైన వృద్ధులను
కానీ
ఆ అమ్మాయిని మాత్రం మరలా చూడలేదు
చివరకు
అక్కడనుంచి మరొక చోటుకు మారాను
వారానికి మూడున్నర డాలర్ల బాడుగ
అందవిహీన నేత్రాలు, ముడుతలు పడిన చర్మంతో
డబ్బై అయిదు ఏండ్ల వయసున్న స్త్రీ నడుపుతోంది ఆ చోటును
అక్కడ ఏ సమస్యా లేదు
సింక్ ఉంది
టాయిలెట్ ఉంది
రూమ్ కు కిటికీ కూడా ఉంది.
10 January 2019 •
పై కవితగురించి పెద్దగా చెప్పటానికి ఏం లేదు. ఒక కాంట్రాస్ట్ చెపుతున్నాడు. చాలా సరళమైన జీవన వాస్తవికత అది.
***
మరచిపోలేని నవ్వు by A smile to remember by Charles Bukowski
కిటికీ పక్కన టేబుల్ పై ఓ గాజుపాత్రలో
వలయాకారంలో ఒకదాని వెనుక మరొకటి తిరిగే
గోల్డ్ ఫిష్ లు ఉండేవి.
మా అమ్మ నిత్యం నవ్వులు చిందిస్తూ
మమ్మల్ని కూడా ఆనందంగా ఉండమని అంటూండేది
“సరదాగా ఉండు హెన్రీ” అని నాతో అనేది.
ఆమె చెప్పింది నిజమే,
ఎంత ఆనందంగా ఉండగలిగితే అంత మంచిదే కదా.
మా నాన్న మాత్రం తన ఆరున్నర అడుగుల దేహంతో ఊగిపోతూ
మా అమ్మను, నన్నూ విపరీతంగా కొట్టేవాడు
ఎందుకంటే
ఎవరు అతన్ని లోపలనుంచి హింసిస్తున్నారో
అతనికి అర్ధమయ్యేది కాదు.
మా అమ్మ, పాపం గోల్డ్ ఫిష్
రోజూ దెబ్బలు తింటున్నా ఆనందంగా ఉండాలనుకొనేది
నన్ను ఉంచాలనుకొనేది
“హెన్రీ, నువ్వెందుకు నవ్వుతూ ఉండవూ?” అంటూ
ఎలా నవ్వాలో తను నవ్వి నాకు చూపించింది ఒకసారి
నేను చూసిన అత్యంత విషాదకర నవ్వు అది.
ఒక రోజు గోల్డ్ ఫిష్ లన్నీ చచ్చి నీటిపై తేలాయి
కళ్ళు మాత్రం తెరుచుకొనే ఉన్నాయి.
ఇంటికి వచ్చిన మా నాన్న వాటిని
పిల్లికి ఆహారంగా వంటింటి నేలపైకి విసిరాడు
అపుడు
మా అమ్మ నవ్వుతూండటం నేను చూసాను
20 February 2019
అనువదించిన వాటిలో నన్ను చాన్నాళ్ళు పట్టికుదిపిన కవిత ఇది. ఎంతటి విషాదం! ఎంతటి జీవన బీభత్సం!
బుకోవ్ స్కి అమెరికన్ దిగువమధ్యతరగతికి ప్రతినిధి. ఇతని కవిత్వంలో పేదరికం, విచ్చలవిడితనం, క్రమరాహిత్యం, సౌందర్యలేమి, ప్రేమలేకపోవటం లాంటి ఉద్వేగాలు విస్మయపరిచే శైలిలో వ్యక్తీకరింపబడతాయి.
"ఎవరు అతన్ని లోపలనుంచి హింసిస్తున్నారో" అన్న వాక్యం మొత్తం కవితకు కీలకం. ఎన్ని కోణాలనైనా ఆవిష్కరిస్తుందా వాక్యం.
"అత్యంత విషాదకర నవ్వు" వద్ద కవిత ఆగిపోయినప్పటికీ అది బరుమైన కవితే. కానీ ముగింపులోని విషాదం చదువరిని వెంటాడి వెంటాడి వేటాడుతుంది.
బొల్లోజు బాబా