Tuesday, September 13, 2016
Monday, September 12, 2016
శ్రీ నారాయణ శర్మ గారికి ధన్యవాదాలతో
ఉపాధ్యాయ దినోత్సవం నాడు మంచి కానుక ఇచ్చారు ఎం.నారయణ శర్మ గారు.
శర్మ గారు వ్రాసిన ఒక చాలా మంచి వ్యాసంలో నేను వ్రాసిన మూల్యాంకనం అనే కవితకు చోటు కల్పించినందుకు సదా కృతజ్ఞుడను . హాప్పీస్ :-)
శర్మ గారు వ్రాసిన ఒక చాలా మంచి వ్యాసంలో నేను వ్రాసిన మూల్యాంకనం అనే కవితకు చోటు కల్పించినందుకు సదా కృతజ్ఞుడను . హాప్పీస్ :-)
కాకినాడలో శ్రీ కాళోజీ
తెలంగాణా రాష్ట్రంలో శ్రీ కాళోజీ జన్మదినసందర్భంగా పత్రికలలో వ్యాసాలు, సాహితీ సంస్థల ఆధ్వర్యంలో సమాలోచనలు, స్కూళ్ళలో పిల్లల సమక్షంలో సభలు అన్నీ చూస్తుంటే, కన్నుల పండుగలా అనిపించింది. మహాకవిని తలచుకొంటున్న మిత్రులకు అభినందనలు, శుభాకాంక్షలు.
ఈ మధ్య ఒక సభలో ఓ పెద్దాయన చెప్పిన ఒక ఉదంతం - కవిత్వభాషగా ఏది ఉండాలి (ప్రజల భాష లేక గ్రాంధిక భాషా ) అని కవులు దిశానిర్ధేశం పొందటానికి 1950 లలో కాకినాడ పి.ఆర్. కాలేజీలో రెండుమూడు సభలు జరుపుకొన్నారట. తెలుగునాట నలుమూలలనుంచీ వచ్చిన కవులు, పండితులు రెండు వర్గాలుగా విడిపోయి వాదులాడుకొంటున్న సమయంలో, చివరి సభకు విచ్చేసిన శ్రీ కాళోజీ గారు - "ప్రజల భాషే కవిత్వ భాషగా ఉండాలి, అది సామాన్య ప్రజల జీవితాలను ప్రతిబింబించాలి" అంటూ ఉపన్యసించి అందరినీ ఒప్పించారట. ఆ సభలో పాల్గొన్న శ్రీ సోమసుందర్ గారు ఈ మాటలకు ప్రభావితమై, తన కవిత్వ భాషను సవరించుకొని, ప్రజలభాషలో వ్రాయటం మొదలుపెట్టారట.
వినటానికి ఆశ్చర్యం కలిగించేదిగా ఉన్నప్పటికీ, ఆ తరువాత ఓ యాభైఏళ్ళ కాళోజీ జీవితాన్ని, సాహిత్యాన్ని పరిశీలిస్తే వారి మాటల లోతు, నిబద్దతలు అర్ధమౌతాయి. గొప్ప ఫలవంతమైన కవిత్వజీవనం వారిది. వారి స్మృతికి వందనాలు
భవదీయుడు
బొల్లోజు బాబా
పి.ఎస్. ఆంధ్రప్రదేష్ లో ఇంత ......"ఐక్యంగా"...... అంతటి గౌరవం, ఘనతను పొందే సమఉజ్జీ అయిన సాహితీవేత్త ఎవరా అని ఆలోచనలో పడిపోయాను ఇపుడు నేను.
Wednesday, September 7, 2016
రూమీ వాక్యాలు
ఏది ఎక్కువ విలువైనది, కిక్కిరిసిన జన సందోహమా లేక స్వచ్ఛమైన నీ ఏకాంతమా? ---- రూమీ
ప్రతి చెట్టు ఆకు మరోలోకపు సందేశాన్ని మోసుకొస్తుంది. చూడు రాలిపోతున్న ప్రతి ఆకు ఒక దీవెనే ---- రూమీ
మరో లోకం లోకి ఎగురుకుంటా పో. మోయగలిగినంత సంపదల్ని తీసుకుపో, రోదించకు ---- రూమీ
నేను నిజం చెపుతున్నాను, నువ్వు చూసే ప్రతీదీ స్వప్నం వలే అదృశ్యమైపోతుంది ---- రూమీ
ప్రియమైన ఈశ్వరుడా, ప్రేమికులందరిని తృప్తిపరచు. వారికి సుఖాంతాలను ఇవ్వు. వారి జీవితాలను పండగగా మార్చు. నీ దయాకాంతి లో వారి హృదయాల్ని నృత్యం చేయనీ. ---- రూమీ
నీకు ఏది ఇచ్చినా అది తిరిగి నావద్దకు వస్తుందని నాకు తెలుసు. అందుకే నీకు నా జీవితాన్ని ఇచ్చేస్తున్నాను, నువ్వు తిరిగి నా వద్దకు వస్తావన్న ఆశతో ---- రూమీ
సూర్యునితో పాటు ఉదయించు. నిద్ర అనే గుహనుండి బయటకురా. అపుడే ముల్లు గులాబీగా విస్తరించగలదు. ---- రూమీ
తెరవెనుక నుంచి ఎవరో మనల్ని గమనిస్తున్నారు. నిజానికి మనమిక్కడ లేము. ఇది మన ఛాయ. ---- రూమీ
నీకు అనుకూలంగా నిన్నందరూ మోసగించారు అన్నట్లుగా జీవించు ---- రూమీ
దినాంతాన ఆత్మ మురికినీరులా అయి, సన్నని స్వరంతో ధన్యవాదాలు, ధన్యవాదాలు అంటుంది ---- రూమీ
నా హృదయ మార్గంలో ఆత్మ చందమామ కనిపించింది. ఆ ప్రయాణం ఎంత అమూల్యమైనది! ---- రూమీ
వేదన ఒక బహుమతి. దానిలోనే దయ దాగిఉంది. ---- రూమీ
నిన్ను చూస్తూ ఉండటం నన్ను స్వస్థ పరుస్తుంది ---- రూమీ
కాంతిని కౌగలించుకో, నీ వాంఛాపవనాలకు అవతల ఉన్న దారుల్ని అది నీకు చూపనీ ---- రూమీ
వేణువుఊదేవాని ఊపిరి వేణువుకు చెందుతుందా? ---- రూమీ
Friday, September 2, 2016
రవీంద్రుని క్రిసెంట్ మూన్
2009 లో రవీంద్రుని క్రిసెంట్ మూన్ అనువదించాను. చాలామట్టుకు నా బ్లాగులో పోస్ట్ చేసాను.
ఒక మిత్రుడు వాటిని చదివి ఇవి చిన్నపిల్లలపై వ్రాసిన గీతాలు, వీటిలో భాష సరళంగా లలితంగా ఉండటం సముచితం, కానీ నువ్వు గంభీరమైన, కఠినమైన పదాల్ని ఎక్కువగా ఉపయోగించావు అన్నాడు. అతని అభిప్రాయం కరక్టే అనిపించింది. మిగిలినవి సరిచూద్దామని అనుకొన్నాను కానీ ఆసక్తి, వీలు చిక్కలేదు.
మిత్రుడు Kks Kiran చలం గీతాంజలిలో కూడా ఉన్న ఒక క్రిసెంట్ మూన్ అనువాదాన్ని తన వాల్ పై పోస్ట్ చేసారు. అదే గీతానికి 2009 నేను చేసిన అనువాదమిది.
3. మూలం -- విశ్వకవి రవీంద్రుని క్రిసెంట్ మూన్ Source
శిశువు కళ్లపై వాలే నిద్ర
ఎక్కడనుంచి ఎలా వస్తుందో ఎవరికైనా తెలుసా?
ఓ ఇంద్రజాలిక గ్రామం చెంత
అడవి నీడల మధ్య మిణుగురుల కాంతిలో
మిల మిల మెరిసే రెండు సిగ్గు మొగ్గలు వేళ్లాడుతున్నవట.
శిశువు కళ్లని ముద్దుపెట్టుకోవటానికి నిద్ర అక్కడినించి
బయలుదేరి వస్తుందని అంటారు.
నిదురించే శిశువు పెదవులపై కదలాడే ఆ చిరునవ్వు
ఎక్కడ పుడుతుందో ఎవరికైనా తెలుసా?
పారిపోతున్న శరన్మేఘాంచలాన్ని
నెలవంక తొలికిరణ మొకటి తాకిందట.
అక్కడ ఆనాటి మంచుకడిగిన ఉదయస్వప్నంలో
ఈ నవ్వుకు తొలి జననమని అంటారు.
నిదురించే శిశువు పెదవులపై కదలాడే ఆ చిరునవ్వుకి.
శిశువు మేనిపై మెరిసే మిసిమి
ఇన్నాళ్లూ ఎక్కడ దాగి ఉందో ఎవరికైనా తెలుసా?
శిశువు తల్లి కన్యగా ఉండినపుడు
ఆమె హృదయంలొ మృదుల మౌన కోర్కెవలే నిగూఢంగా దాగిఉన్న ప్రేమే
శిశువు మేనిపై మెరిసే మిసిమి గా వికసించిందంటారు.
తెలుగు అనువాదం--- బొల్లోజు బాబా
నా బ్లాగు లో
http://sahitheeyanam.blogspot.in/2009/05/blog-post_30.html
మొత్తం అనువాదాన్ని ఈ క్రింది లింకులో చదువుకొనవచ్చును.
https://www.scribd.com/…/Crescent-Moon-Telugu-by-Bolloju-Ba…
Monday, August 29, 2016
కలలు
జీవితం అనే పదునైన కత్తి
కాలాన్ని
ఆఫీసు, అనుబంధాలు, స్వప్నాలుగా
ముక్కలు ముక్కలు చేసి వడ్డిస్తుంది.
కాలాన్ని
ఆఫీసు, అనుబంధాలు, స్వప్నాలుగా
ముక్కలు ముక్కలు చేసి వడ్డిస్తుంది.
దినాంతాన
స్వప్నాలు మాత్రమే
మన జేబులో మిగిలే
చివరి చిల్లర నాణేలు
స్వప్నాలు మాత్రమే
మన జేబులో మిగిలే
చివరి చిల్లర నాణేలు
బొల్లోజు బాబా
Thursday, August 25, 2016
ఒక కవిని కలిసాను
పరవళ్ళు తొక్కుతూ నినదించి నినదించి
ప్రవహించినంత మేరా పచ్చదనాన్ని పోటెత్తించి
ప్రశాంతంగా కాల సముద్రంలో కలిసే
నది లాంటి ఒక కవిని కలిసాను నేను
ఎముకల్ని కప్పుతూ వెలుతురు పొరలాంటి
ముడుతలు పడిన మెత్తని చర్మం.
ఆ దుర్భల దేహంలో ఇంకా మిగిలే ఉన్న
కొన్ని రక్తపు చుక్కల వెలుగు అది.
అతని చేతిని నా చేతుల్లోకి తీసుకొన్నాను
పావురం కన్నా మెత్తగా
నీరెండ కన్నా వెచ్చగా
కవిగా బ్రతికిన క్షణాల వాసన వేస్తూ
అతని చేయి.
ఒకనాటి ప్రయాణాలు, కొన్ని మార్గాలు
మరికొన్ని సంథ్యలు
సన్నని సెలయేరై ప్రవహించాయి మా చేతుల మధ్య
ఏదో అదృశ్య వాగ్ధానం గలగలమంది.
రేపతను తన దేహంలో ఉండకపోవచ్చు
రేపతను తన ఆత్మలో ఉండకపోవచ్చు
రేపతను తన ఇంటిలో ఉండకపోవచ్చు
కానీ తన పేరులో సజీవంగా ఉంటాడు
ఇన్ని సంవత్సరాల జీవితాన్నీ
తన పేరులో దాచుకొన్నాడు
అక్షరాలుగా, వాక్యాలుగా, కవిత్వంగా.....
పసుపుపచ్చని ఎండుటాకులాంటి
అతని చేయి నా చేతుల్లోంచి
మెత్తగా జారిపోయింది
గడియారంలోని ఇసక ధారలా
చిన్నపిల్లలు వేసిన ముద్దుముద్దు రంగుల చిత్రమై
నవ్వుతూ వీడ్కోలు చెప్పిన
పువ్వులాంటి ఒక కవిని కలిసాను నేను.
బొల్లోజు బాబా
Saturday, August 6, 2016
భూసేకరణ ?
భూమంటే విద్యుత్ కాంతుల్లో
బెల్లీడాన్స్ చేసే ఆటకత్తె - వాడికి
భూమంటే నొసటన దిద్దుకొనే
ఆకుపచ్చని వీభూతిపండు - వీడికి
యుద్ధానంతరం
భూమికి మాత్రం వీరిద్దరూ
ఓ మూడడుగుల బాధ్యత ....
బొల్లోజు బాబా
Saturday, July 30, 2016
“చంద్రవర్షం” లో తడిచిన అందమైన వాక్యాలు – భగ్వాన్ కవిత్వం
వడ్లబండి, బల్లకట్టు వంటి చక్కని కవితా సంపుటులను వెలువరించిన శ్రీ భగ్వాన్ తాజాగా “చంద్రవర్షం” పేరుతో వ్రాసిన కొత్త కవిత్వసంపుటి, జూలై 24 న, కొత్తపేటలో ఆవిష్కరణ జరగనుంది.
ఒక కవి తాను సృష్టించే కవిత్వంలో అతని ప్రాంతం ప్రతిబింబిస్తుంది. ఒక మెట్రోకవి పట్టుకొనే వస్తువులకూ, కనీసం పట్టణీకరణ కూడా చెందని ఊరిలో ఉండే కవి కవిత్వీకరించే వస్తువులకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ తేడాని వారి వారి కవిత్వం ఇట్టే పట్టిచ్చేస్తుంది. భగ్వాన్ కవిత్వంలో కనిపించే ప్రతీకలు, పదచిత్రాలు పల్లెటూరి మట్టి పరిమళాల్ని కలిగి ఉంటాయి. నది, చెట్టు, పిట్ట, ఎండ, వాన, చలి, కాలువలు, తోటలు, జీవితానుభవాలు….. ఇవే ఈ “చంద్రవర్షం” లో కనిపించే చినుకులు, కవిసమయాలూ.
ప్రకృతికి చెట్టు పిట్టా ఎంతముఖ్యమో, కవిత్వానికి కూడా అవి అంతే ముఖ్యమన్న రహస్యాన్ని “చంద్రవర్షం” చెపుతుంది.
జీవితంలోంచి తోడుకొనే కవిత్వానికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ. సార్వజనీనం చేయబడిన అనుభవం ఎక్కువమందికి కనక్ట్ అవుతుంది. అవే భగ్వాన్ కవిత్వానికి శక్తిని, కాంతిని ఇచ్చే అంశాలు.
ఒక సాదాసీదా అనుభవాన్ని కవిత్వం చేయటం ఎంతో ప్రతిభ ఉంటే కానీ సాధ్యం కాదు. దీన్ని భగ్వాన్ అనేక కవితలలో అలవోకగా సాధిస్తారు.
“పాత పుస్తకం” అనే కవితలో …… ఒక పాతపుస్తకాలు కొనుక్కొనే వ్యక్తి సైకిల్ పై వెళుతుంటే, అతని సంచిలోంచి ఓ పుస్తకం జారి పడిందట. ఆ వెనుకే వెళ్తున్న కవి అది చూసి, ఆ వ్యక్తిని ఎంతపిలచినా అతను వినిపించుకోకుండా వెళిపోయాడట. కవిత ఇలా ముగుస్తుంది.
నేనా పుస్తకాన్ని తీసి
భద్రంగా దాచాను
తరువాత రోజుల్లో అది
నన్ను మనిషిని చేసే పుస్తకమవుతుందని
అప్పుడు ….. నాకు తెలియదు. ----- అని. ఇక్కడ ఆ పుస్తకమేమిటో చెప్పకుండా వదిలివేయటం వల్లే ఇది కవిత్వమైంది. ఒక వేళ “ భగవద్గీత లేదా చేగువెరా” పుస్తకం అనో ఏదో ఓ పేరుని కవి చెప్పాడా “కవిత ఫెయిల్ అయి ఉండేది”. ఈ కవిత చదివిన ప్రతిపాఠకుడూ అలా తనను ప్రభావితం చేసిన పుస్తకాన్ని, అది తన చేతుల్లోకి వచ్చిన సందర్భాన్ని ఒక సారి గుర్తుచేసుకొని, తనలోనికి కాసేపు ప్రయాణిస్తాడు. అదే కదా కవిత్వం చేయాల్సిన పని.
ఈ సంపుటిలో చాలా కవితలు నేరేటివ్ పద్దతిలో ఉంటాయి. ఉదాహరణకు, టీచర్ అయిన కవి తరగతి గదిలోకి కిటికీ గుండా ఒక పిచ్చుక వచ్చి మేజాబల్లపై గెంతులాడి దాదాపు అరగంట సేపు అక్కడే సంచరించి, తుర్రుమని ఎగిరిపోయిందట. ఆ కవితను….
పిచ్చుక ఎగిరిపోయాకా నాకనిపించింది
నేను చెప్పాలనుకున్న పాఠం
తను చెప్పి పోయిందని…… అంటూ ముగిస్తారు. ఈ కవితాశీర్షిక “పాఠం పేరు పర్యావరణం”. ఉత్త శీర్షిక ద్వారా, ఒక సాదా సీదా సంఘటనను అసాధారణమైన సందర్భంగా మార్చి కవిత్వీకరించిన తీరు అబ్బురపరుస్తుంది.
యూట్యూబ్ లో పిచ్చుక శబ్దాన్ని
ఇయర్ ఫోన్ లో వినే నేను
కిటికీలోంచి ఒక పిచ్చుకైనా కనిపిస్తుందని
ఆరాటపడటంలో తప్పేమీలేదనుకొంటాను// (కిటికీ దగ్గర/శ్రీ విరించి విరివింటి) అంటూ ఆర్థ్రంగా పలికే ఓ పట్టణ కవి, అప్పుడప్పుడూ పిచ్చుకలని చూసే భగ్వాన్ లాంటి ఓ గ్రామీణ కవి - ఒకే వస్తువును దర్శించిన తీరు, అభివ్యక్తీకరించిన భిన్న కోణాలు ఇక్కడ గమనార్హం.
కొత్తగా ఎక్కడైనా వంతెన నిర్మాణం జరిగితే ఆ ప్రాంతం చాలా వేగంగా మార్పులకు గురవుతుంది. యానాం వంతెన కట్టాకా అక్కడి ప్రజల జీవితాలలో వచ్చిన మార్పులను డైరెక్టర్ వంశీ ఓ కథలో అద్భుతంగా చెప్పుకొస్తాడు. భగ్వాన్ కూడా “ఒక వాస్తవం” అనే కవితలో కొత్తగా కట్టిన వంతెన గురించి వ్రాస్తూ….
అంత వరదలోనూ
అటూ ఇటూ పడవలు నడిపిన
సాహస వీరులెక్కడ//
ప్రయాణికుల పలకరింతలతో
పులకరించిన రేవుకిపుడు
మాట పడిపోయింది// ---- అన్న వాక్యాలలో నాస్టాల్జియాలోకి వెళిపోయినట్లు అనిపించినా
వంతెన్ని కాదని నాగరికత విలసిల్లలేదు
వంతెన్ని కాదని ఊరు విశాలంగా విస్తరించలేదు.
ఇప్పుడు వంతెన ఒక వాస్తవం//….. అంటూ ఒక సమకాలీన సత్యాన్ని ఆవిష్కరిస్తాడు.
వస్తువైవిధ్యం ఈ కవితలకు మంచి పఠనీయతను కలిగించింది. కరంటుపోయిన రాత్రి, మాస్టారి కుర్చీ, ఒక రోజు బస్సు ప్రయాణం, నిద్రలేవటం, బస్సు నడపటం, నేనో పిచ్చుకను చూసాను, తోటకు వీడ్కోలు, ప్రవాహం వంటి వివిధ దైనందిక విషయాలు కవిత్వమై మెరిసాయి ఈ సంపుటిలో.
పుస్తకావిష్కరణ సభ విజయవంతంగా జరగాలని కోరుకొంటూ- భగ్వాన్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు…..
భగ్వాన్ గారి ఫోన్ నంబరు: 9393533336
భవదీయుడు
బొల్లోజు బాబా
Subscribe to:
Posts (Atom)


