వడ్లబండి, బల్లకట్టు వంటి చక్కని కవితా సంపుటులను వెలువరించిన శ్రీ భగ్వాన్ తాజాగా “చంద్రవర్షం” పేరుతో వ్రాసిన కొత్త కవిత్వసంపుటి, జూలై 24 న, కొత్తపేటలో ఆవిష్కరణ జరగనుంది.
ఒక కవి తాను సృష్టించే కవిత్వంలో అతని ప్రాంతం ప్రతిబింబిస్తుంది. ఒక మెట్రోకవి పట్టుకొనే వస్తువులకూ, కనీసం పట్టణీకరణ కూడా చెందని ఊరిలో ఉండే కవి కవిత్వీకరించే వస్తువులకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ తేడాని వారి వారి కవిత్వం ఇట్టే పట్టిచ్చేస్తుంది. భగ్వాన్ కవిత్వంలో కనిపించే ప్రతీకలు, పదచిత్రాలు పల్లెటూరి మట్టి పరిమళాల్ని కలిగి ఉంటాయి. నది, చెట్టు, పిట్ట, ఎండ, వాన, చలి, కాలువలు, తోటలు, జీవితానుభవాలు….. ఇవే ఈ “చంద్రవర్షం” లో కనిపించే చినుకులు, కవిసమయాలూ.
ప్రకృతికి చెట్టు పిట్టా ఎంతముఖ్యమో, కవిత్వానికి కూడా అవి అంతే ముఖ్యమన్న రహస్యాన్ని “చంద్రవర్షం” చెపుతుంది.
జీవితంలోంచి తోడుకొనే కవిత్వానికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ. సార్వజనీనం చేయబడిన అనుభవం ఎక్కువమందికి కనక్ట్ అవుతుంది. అవే భగ్వాన్ కవిత్వానికి శక్తిని, కాంతిని ఇచ్చే అంశాలు.
ఒక సాదాసీదా అనుభవాన్ని కవిత్వం చేయటం ఎంతో ప్రతిభ ఉంటే కానీ సాధ్యం కాదు. దీన్ని భగ్వాన్ అనేక కవితలలో అలవోకగా సాధిస్తారు.
“పాత పుస్తకం” అనే కవితలో …… ఒక పాతపుస్తకాలు కొనుక్కొనే వ్యక్తి సైకిల్ పై వెళుతుంటే, అతని సంచిలోంచి ఓ పుస్తకం జారి పడిందట. ఆ వెనుకే వెళ్తున్న కవి అది చూసి, ఆ వ్యక్తిని ఎంతపిలచినా అతను వినిపించుకోకుండా వెళిపోయాడట. కవిత ఇలా ముగుస్తుంది.
నేనా పుస్తకాన్ని తీసి
భద్రంగా దాచాను
తరువాత రోజుల్లో అది
నన్ను మనిషిని చేసే పుస్తకమవుతుందని
అప్పుడు ….. నాకు తెలియదు. ----- అని. ఇక్కడ ఆ పుస్తకమేమిటో చెప్పకుండా వదిలివేయటం వల్లే ఇది కవిత్వమైంది. ఒక వేళ “ భగవద్గీత లేదా చేగువెరా” పుస్తకం అనో ఏదో ఓ పేరుని కవి చెప్పాడా “కవిత ఫెయిల్ అయి ఉండేది”. ఈ కవిత చదివిన ప్రతిపాఠకుడూ అలా తనను ప్రభావితం చేసిన పుస్తకాన్ని, అది తన చేతుల్లోకి వచ్చిన సందర్భాన్ని ఒక సారి గుర్తుచేసుకొని, తనలోనికి కాసేపు ప్రయాణిస్తాడు. అదే కదా కవిత్వం చేయాల్సిన పని.
ఈ సంపుటిలో చాలా కవితలు నేరేటివ్ పద్దతిలో ఉంటాయి. ఉదాహరణకు, టీచర్ అయిన కవి తరగతి గదిలోకి కిటికీ గుండా ఒక పిచ్చుక వచ్చి మేజాబల్లపై గెంతులాడి దాదాపు అరగంట సేపు అక్కడే సంచరించి, తుర్రుమని ఎగిరిపోయిందట. ఆ కవితను….
పిచ్చుక ఎగిరిపోయాకా నాకనిపించింది
నేను చెప్పాలనుకున్న పాఠం
తను చెప్పి పోయిందని…… అంటూ ముగిస్తారు. ఈ కవితాశీర్షిక “పాఠం పేరు పర్యావరణం”. ఉత్త శీర్షిక ద్వారా, ఒక సాదా సీదా సంఘటనను అసాధారణమైన సందర్భంగా మార్చి కవిత్వీకరించిన తీరు అబ్బురపరుస్తుంది.
యూట్యూబ్ లో పిచ్చుక శబ్దాన్ని
ఇయర్ ఫోన్ లో వినే నేను
కిటికీలోంచి ఒక పిచ్చుకైనా కనిపిస్తుందని
ఆరాటపడటంలో తప్పేమీలేదనుకొంటాను// (కిటికీ దగ్గర/శ్రీ విరించి విరివింటి) అంటూ ఆర్థ్రంగా పలికే ఓ పట్టణ కవి, అప్పుడప్పుడూ పిచ్చుకలని చూసే భగ్వాన్ లాంటి ఓ గ్రామీణ కవి - ఒకే వస్తువును దర్శించిన తీరు, అభివ్యక్తీకరించిన భిన్న కోణాలు ఇక్కడ గమనార్హం.
కొత్తగా ఎక్కడైనా వంతెన నిర్మాణం జరిగితే ఆ ప్రాంతం చాలా వేగంగా మార్పులకు గురవుతుంది. యానాం వంతెన కట్టాకా అక్కడి ప్రజల జీవితాలలో వచ్చిన మార్పులను డైరెక్టర్ వంశీ ఓ కథలో అద్భుతంగా చెప్పుకొస్తాడు. భగ్వాన్ కూడా “ఒక వాస్తవం” అనే కవితలో కొత్తగా కట్టిన వంతెన గురించి వ్రాస్తూ….
అంత వరదలోనూ
అటూ ఇటూ పడవలు నడిపిన
సాహస వీరులెక్కడ//
ప్రయాణికుల పలకరింతలతో
పులకరించిన రేవుకిపుడు
మాట పడిపోయింది// ---- అన్న వాక్యాలలో నాస్టాల్జియాలోకి వెళిపోయినట్లు అనిపించినా
వంతెన్ని కాదని నాగరికత విలసిల్లలేదు
వంతెన్ని కాదని ఊరు విశాలంగా విస్తరించలేదు.
ఇప్పుడు వంతెన ఒక వాస్తవం//….. అంటూ ఒక సమకాలీన సత్యాన్ని ఆవిష్కరిస్తాడు.
వస్తువైవిధ్యం ఈ కవితలకు మంచి పఠనీయతను కలిగించింది. కరంటుపోయిన రాత్రి, మాస్టారి కుర్చీ, ఒక రోజు బస్సు ప్రయాణం, నిద్రలేవటం, బస్సు నడపటం, నేనో పిచ్చుకను చూసాను, తోటకు వీడ్కోలు, ప్రవాహం వంటి వివిధ దైనందిక విషయాలు కవిత్వమై మెరిసాయి ఈ సంపుటిలో.
పుస్తకావిష్కరణ సభ విజయవంతంగా జరగాలని కోరుకొంటూ- భగ్వాన్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు…..
భగ్వాన్ గారి ఫోన్ నంబరు: 9393533336
భవదీయుడు
బొల్లోజు బాబా
No comments:
Post a Comment