Thursday, August 25, 2016
ఒక కవిని కలిసాను
పరవళ్ళు తొక్కుతూ నినదించి నినదించి
ప్రవహించినంత మేరా పచ్చదనాన్ని పోటెత్తించి
ప్రశాంతంగా కాల సముద్రంలో కలిసే
నది లాంటి ఒక కవిని కలిసాను నేను
ఎముకల్ని కప్పుతూ వెలుతురు పొరలాంటి
ముడుతలు పడిన మెత్తని చర్మం.
ఆ దుర్భల దేహంలో ఇంకా మిగిలే ఉన్న
కొన్ని రక్తపు చుక్కల వెలుగు అది.
అతని చేతిని నా చేతుల్లోకి తీసుకొన్నాను
పావురం కన్నా మెత్తగా
నీరెండ కన్నా వెచ్చగా
కవిగా బ్రతికిన క్షణాల వాసన వేస్తూ
అతని చేయి.
ఒకనాటి ప్రయాణాలు, కొన్ని మార్గాలు
మరికొన్ని సంథ్యలు
సన్నని సెలయేరై ప్రవహించాయి మా చేతుల మధ్య
ఏదో అదృశ్య వాగ్ధానం గలగలమంది.
రేపతను తన దేహంలో ఉండకపోవచ్చు
రేపతను తన ఆత్మలో ఉండకపోవచ్చు
రేపతను తన ఇంటిలో ఉండకపోవచ్చు
కానీ తన పేరులో సజీవంగా ఉంటాడు
ఇన్ని సంవత్సరాల జీవితాన్నీ
తన పేరులో దాచుకొన్నాడు
అక్షరాలుగా, వాక్యాలుగా, కవిత్వంగా.....
పసుపుపచ్చని ఎండుటాకులాంటి
అతని చేయి నా చేతుల్లోంచి
మెత్తగా జారిపోయింది
గడియారంలోని ఇసక ధారలా
చిన్నపిల్లలు వేసిన ముద్దుముద్దు రంగుల చిత్రమై
నవ్వుతూ వీడ్కోలు చెప్పిన
పువ్వులాంటి ఒక కవిని కలిసాను నేను.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment