Wednesday, June 12, 2024

యోగేశ్వర కవి



యోగేశ్వర కవి – పార్ట్ 1
.
యోగేశ్వరుడు తొమ్మిదో శతాబ్దంలో జీవించిన సంస్కృత కవి. ఇతను పాల రాజుల ఆస్థాన కవి. బెంగాలు ప్రాంతానికి చెందినవాడు. ఇతని కవిత్వం రాజాశ్రయరీతిలో కాక కొంత దేశద్రిమ్మరి తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇతను బహుశా దేశమంతా సంచరించి ఉంటాడు. అందుకనే అనేక పద్యాలలో గ్రామీణవాతావరణం, పేదరికం ప్రకృతి వర్ణనలు, మానవ సంబంధాల మెరుపులు ఎక్కువగా కనిపిస్తాయి.
పదాలతో ఒక చిత్రాన్ని రూపుకట్టటం యోగేశ్వరుని కవిత్వశైలి. ఇతను రచించిన కావ్యాలేవీ లభించలేదు. ఇతని కవిత్వం కూడా విద్యాకరుని సుభాషితరత్నకోశము, శ్రీధరుని సదుక్తికర్ణామృతము వంటి ఇతర సంకలనాలద్వారా ముక్తకాలరూపంలో మాత్రమే దొరుకుతున్నది. వీటిద్వారా యోగేశ్వరుడు గొప్ప ప్రతిభ కలిగిన కవి అని గుర్తించవచ్చు.
ఇతని కొన్ని పద్యాలకు నా అనువాదాలు ఇవి
1.
మేఘమనే గండుపిల్లి
మెరుపు అనే నాలుకతో
ఆకాశమనే పళ్ళెంలోంచి
వెన్నెల అనే పాలని తాగుతోంది. -- యోగేశ్వరుడు

2.
తొలకరి పంట చేతికొచ్చాకా
గాదులలో నిల్వ చేసిన ధాన్యం సువాసనలతో
ఇంటి పడుచులు రోకళ్లతో కొత్త వడ్లను దంచుతున్నపుడు
వారి చేతులు పైకి కిందకూ ఆడేవేళ వారి గాజులు చేసే చప్పుళ్ళతో
రైతుల ఇళ్ళు ఎంత సందడిగా ఉంటాయో కదా! -- యోగేశ్వరుడు

3.
వానవెలిసాక మెత్తని గాలి చల్లగా తాకుతుంది
మేఘాలు నిండిన ఆకాశంలో ఒక మూల మెరుపు మెరుస్తుంది
చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు నిద్రలోకి జారుకొంటాయి
తడిచిన కదంబ పుష్పాలనుండి సువాసన పైకిలేస్తుంది
చిమ్మచీకటిలో కప్పల బెకబెకల శబ్దాలు విస్తరిస్తాయి
ఒంటరి ప్రేమికుడు ఈ రాత్రులు ఎలా గడపగలడూ?-- యోగేశ్వరుడు

4.
అంతవరకూ సందడి చేసిన
కంపజిట్ట పిట్టలన్నీ ఎగిరిపోయాయి
నీటికాకులు కొత్తచోట్లకు వలసపోయాయి
కంకపక్షులు, చిలువబాయిలు శుష్కించిపోయాయి
నీరుకోళ్ళ, బాతుల సందడి లేదు
పొన్నంగిపిట్టలు చలాకీదనం కోల్పోయాయి
దోరువాలు కదలటం లేదు
లొట్టకన్ను జిట్టలు, వెదురు పిచ్చుకలు, రెక్కలపోతులు కనిపించవు
వేసవిలో నీరు అడుగంటగానే చెరువు అలా మిగిలింది – యోగేశ్వరుడు

5.
చెరువు నీరు పైన వేడిగా
లోలోతుల్లో చల్లగా ఉంటుంది
దారి బావులు ఎండిపోగా బాటసారులు
మధ్యాహ్నపువేళ వచ్చి
పొర్లాడే గేదెలవల్ల బురదగా మారి, నాచుతో కప్పబడిన నీటిని
చేతులతో కదలించి దోసిళ్ళతో తాగుతారు -- యోగేశ్వరుడు
6.
రైతులవద్దకు బాటసారులు ఎండుగడ్డికొరకు వచ్చి
వారిని బతిమాలుతూ పొగుడుతూంటే ఉప్పొంగిపోయి
ఉదారంగా దానం చేసి
రాత్రిపూట నెమరువేసుకొనే పశువులనుంచి వచ్చే
వేడి శ్వాసలలో వెచ్చదనాన్ని పొందుతారు వారు.
కనురెప్పల వెంట్రుకలపై మంచుబిందువులతో
వీపున ఆవపూలతో శోభిల్లే నందీశ్వరునిపై
ప్రాతఃకాలపు తొలి కిరణాలు పడి పల్లె తెల్లవారుతుంది.-- యోగేశ్వరుడు

7.
ఆమె విరహజ్వరం
నీరు మరిగేంత వేడిగా ఉంది
చేతులకు నూనె పూసుకునైనా
ఆమెను పరీక్షించే సాహసం ఎవరూ చేయలేదు
దహించుకుపోతామనే భయంవల్ల.
మూలికలు, చందనపు పూతలు
పనికిరాకుండా పోయాయి
ఆమె హారంలోని ముత్యాలు
పేలాల్లా పేలిపోవటంచూసి
మేమెంతో ఆశ్చర్యపోయాం-- యోగేశ్వరుడు


8.
ఆ రైతుల వెచ్చదనం చలిగాలులకు కరిగిపోతోంది
గడ్డిమంటను కర్రలతో కెలుకుతూ పదే పదే రగిలిస్తున్నారు
మంటలు రేగినట్లే రేగి ఆరిపోతున్నాయి
ఆవపంట గడ్డిని మండించే కొద్దీ దట్టమైన గొట్రు
కుప్పనూర్పిడి నేల నలుమూలలకూ వ్యాపిస్తోంది-- యోగేశ్వరుడు


9.
చలికాలంలో ఒడ్లు దంచుతూ ఆడువారు పాడుకొనే
దంపుడు పాటలు ఎంత మనోహరంగా ఉంటాయి!
పైకి క్రిందకూ కదిలే వారి చేతి గాజులు చేసే
గలగలల శబ్దాల మధ్య సాగే పాటలు
పైకి క్రిందకూ ఊగే వారి చన్నుల లయను అనుసరిస్తూ
ఆ హుం, ఆహుం అంటూ చేసే ఊర్పులతో సాగే పాటలు-- యోగేశ్వరుడు


10.
నువ్వు చెలకలు పండాయి
పిట్టలు సందడి మొదలైంది
ఆవపంట ముదురు గోధుమ రంగుతేరింది
పూలు గింజలుగా మారుతున్నాయి
ఎండిన పైరు గాలికి ఊగుతుంటే
మంచు బిందువులు రాలి చెదురుతున్నాయి
బాటసారులు ఊరి మంట వద్ద చేరి
పనిలేని ముచ్చట్లు చెప్పుకొంటున్నారు-- యోగేశ్వరుడు


11.
ప్రేమికుల ఆటలు
.
మొదట ఒక కౌగిలింత
ఓటమిని అంగీకరించి అతను తన పణాన్ని ఒదులుకొని
జూదనియమాలను అనుసరించి మరొక పందెం కోరాడు
తన ఉద్వేగాన్ని ఎంత దాచాలని ప్రయత్నించినా
ఆమె ఒణికే పెదవులు దాచలేవు
చెమర్చిన చేతులలోకి పాచికలను
తీసుకొందామె మారుమాట్లాడక. -- యోగేశ్వరుడు


12.
కలయిక
.
ఓ స్నేహితుడా!
కాలి అందియల తెరుచుకొన్న నోళ్ళలో
దూది కూరి వాటి నోరుమూయించాను
వడ్డాణం చుట్టూ వస్త్రాన్ని చుట్టి
దాని మువ్వల గలగలల సద్దుమణిచాను
పంజరపు చిలుకలు నిద్రిస్తున్నాయి
పనివాళ్ళు కలల్లో విహరిస్తున్నారు
రహదారి నిర్జనంగా ఉంది
చీకటి చిక్కగా ఉంది
రా… వచ్చేయి… లేచిపోదాం -- యోగేశ్వరుడు


13.
ఎండి గట్టిబడిన పేడకుప్పలను కార్చిచ్చు
తప్పించుకొని సాగి పోతుంది
గడ్డితో దట్టంగా కప్పబడిన చీమల పుట్టలను కూడా
పెద్దగా దహించదు
చెట్లకొమ్మలపై ఎండు ఆకులు, పుల్లలతో కట్టుకొన్న
పక్షిగూళ్లను మాత్రం వదిలిపెట్టదు
నూనె నిండిన గుడ్ల సొనను బహుశా
యజ్ఞంలో అగ్నికి సమర్పించే నేయిగా భావిస్తుందేమో! – యోగేశ్వరుడు


బొల్లోజు బాబా

Monday, June 10, 2024

"ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా" రెండవ ముద్రణ

"ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా" పుస్తకం రెండో ముద్రణకు వచ్చింది. పల్లవి పబ్లిషర్ నారాయణ గారికి ధన్యవాదములు.
ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాకు చెందిన నాలుగు ప్రధాన ప్రాచీన పట్టణాలు ఇంకా చారిత్రిక ప్రాధాన్యత కలిగిన తొమ్మిది ఇతర పట్టణాల గురించి ఆసక్తికరమైన సమాచారంతో ఈ పుస్తకం ఉంటుంది.
దయచేసి ఆదరించండి.
.
వెల: 200 రూపాయలు
లభించు చోటు: పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్. వి. నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655

భవదీయుడు
బొల్లోజు బాబా



Monday, June 3, 2024

శ్రమను లాలించే దయా దీవి - శ్రీ వెంకట కృష్ణ చినుకు దీవి


 
జి. వెంకట కృష్ణ ప్రసిద్దకథకుడు, కవి, విమర్శకుడు. వీరు ఇటీవల చినుకు దీవి” పేరుతో కవిత్వ సంఫుటి వెలువరించారు. “చినుకు దీవి” పదబంధం ఆకట్టుకొనేలా ఉంది. కొంత అస్ఫష్టంగానూ అనిపిస్తుంది. అదే శీర్షికతో ఉన్న ఓ కవితలో ఆ పదబంధాన్ని విప్పుకొనే తాళం చెవి దొరుకుతుంది.
 
చినుకు సృష్టికి ఆది
శ్రమను లాలించే దయా దీవి — (చినుకు దీవి).
 
ఎంతగొప్ప భావన ఇది. చినుకు పడితేనే వ్యవసాయం నడుస్తుంది, రైతుల శ్రమ ఫలిస్తుంది, సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా ప్రజలు చేసుకొంటారు. మరీ ముఖ్యంగా వర్షాభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొనే ప్రాంతాలకు చినుకు అనేది ఎంత అపురూపమో, అవసరమో, చినుకు వాలటం ఎంతటి దయాపూరిత చర్యో పై వర్ణన తెలియచేస్తుంది. అలాంటి చినుకుని ఒక దయాదీవి గా పోల్చటం, ఆ పోలికనే కవితా సంపుటి శీర్షికగా ఎంచుకోవటం వెంకట కృష్ణ అభిరుచిని తెలియచేస్తుంది.
 
తెలుగు సాహిత్యాన్ని ప్రాంతాలవారీగా విడదీసి మాట్లాడటం ఒక అలవాటుగా మారింది. ఉత్తరాంధ్రనుంచి వచ్చే సాహిత్యానికి ఉద్యమనేపథ్యముంటుందని, గోదావరి జిల్లాల కవిత్వంలో కడుపు నిండిన వ్యవహారం కనిపిస్తుందని, సీమ సాహిత్యం కరువు, పంటలెండిపోవటం లాంటి అంశాలను వ్యక్తీకరిస్తుందని తెలుగు సాహిత్యకారుల్లో కొన్ని నిశ్చితాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. దీనికి కారణం, ఒక కవి తాను సృజించే కవిత్వంలో తాను బ్రతుకు తున్న ప్రాంతం యొక్క అస్థిత్వం, తాను జీవించే జీవితం తాలూకు పదచిత్రాలు ప్రవహించక తప్పదు. అదొక అనివార్యత. ఆ కారణంగా పరిణామ క్రమంలో అటువంటి నిశ్చితాభిప్రాయాలు ఏర్పడి ఉండొచ్చు. కానీ అదే సంఫూర్ణ సత్యం కాబోదు.
 
వెంకట కృష్ణ కవిత్వం అలాంటి పడికట్టు అభిప్రాయాల్ని బద్దలు కొట్టిందనిపిస్తుంది. సీమ కరువును, రైతు అస్థిత్వాన్ని ఎంతైతే బలంగా వ్యక్తీకరించిందో అంతే బలంగా చిక్కని భావుకతా, సౌందర్యం, సౌకుమార్యాలు కూడా అనేక కవితలలో అలవోకగా అంతే ప్రాధాన్యతతో ప్రతిబింబించాయి. దుఃఖమమయమైన సందర్భాల్ని చెప్పేకవితలకు కూడా చక్కని ఆశావహముగింపు ఇవ్వటం కూడా వెంకట కృష్ణ కవిత్వప్రత్యేకతగా భావించవచ్చు.
 
వెన్నెలను వర్ణిస్తూ…..
ఆకసం పొయ్యి లోన
పగలు మణిగిన జాబిల్లి పిల్లి
రాత్రి సంచారానికి లేచి
అంటిన బూదిని దులిపనట్లు వెన్నెలా — (వెన్నెల) — అంటూ చేసిన వర్ణన అపూర్వమైనది. అనాదిగా వెన్నెలను ఎంతమంది కవులు ఎన్నిరకాలుగా వర్ణించినా ఇంకా చాలానే మిగిలిఉందన్న భావన కలిగిస్తుంది.
 
ఇంటి మెట్ల అరుగులమీద కూచుని మూడు తరాల స్త్రీలు ఒకరి జడ ఒకరు అల్లుతూ కనిపించే దృశ్యం ప్రస్తుతం ఒక పురాస్మృతి. పల్లెటూర్లలో అయినా కనిపిస్తుందో లేదో!. జడ అల్లటాన్ని వస్తువుగా చేసి వ్రాసిన “జత పదార్ధం” అనే కవిత వెంకట కృష్ణ ప్రతిభకు గీటు రాయి. సామాన్యమైన వస్తువును కవిత్వీకరించటం కత్తిమీద సాములాంటిది.
 
ఇద్దరు తనూ లతలు – వొకరిలో ఒకరు చుట్టుకున్న వాళ్ళు
తమనవ్వులను పురితిప్పి అనుబంధాలను కదా అల్లటం//
జడ అల్లడమంటే
ముచ్చటగా ప్రేమను తురమటం// — (జత పదార్థం) — తనూలతలు, తురమటము అన్న పదాలు ఎంత అందంగా ఒదిగిపోయాయీ సందర్భానికి. నిజమే కదా! జడ అల్లటం అంటే ప్రేమను తురమటమే!
 
ఒక బైరాగిని వర్ణిస్తూ వ్రాసిన ఈ వాక్యాలలో పొంగే ఊహాశాలిత చాలాబాగుంది
 
అప్పుడప్పుడూ అతని పెదవులు తాకి
పరవశించి పాడుతాయి వెదురు కన్నులు
ఆ పాటలు వినడానికి భూమిలో నుండీ
తొంగి చూస్తాయి వజ్రపు తునకలు (రవ్వల దీవి)— వెదురుకన్నులు పరవశించి పాడుతాయనటం, వజ్రపుతునకలు ఆ గానాన్ని వింటున్నాయనటం నూతన అభివ్యక్తి.
వెంకట కృష్ణ కవిత్వంలో కాల స్పృహ అనేక కవితలలో బలంగా వినిపిస్తుంది.
 
లో-హితుడు అనే కవితలో—
 
ఒక గొంతుకు వురి బిగించి
పెళపెళ పెటిళ్ళున
ఎన్ని గొంతుల గొలుసులు తెంపి
యిలాగైనా యీ దళపతుల నోటి కుట్లు
తెంపావురా! — (లో-హితుడు) — కుల వివక్షకు బలైన రోహిత్ ఆత్మహత్య వృధా కాలేదని కొన్ని కోట్ల గొంతులు ఎలుగెత్తి అన్యాయాన్ని ప్రశ్నించాయనటం, రోహిత్ మరణంలో మనంచూడాల్సిన మరోకోణంగా భావించవచ్చు.
ఈ మధ్యకాలంలో ఎక్కువగా చర్చింపబడుతున్న అంశం రైతు ఆత్మహత్యలు. రైతు ఆత్మహత్యల నేపథ్యంలో వ్రాసిన మూగ బాసట అనే కవితలో రైతుకు ఎద్దుకూ ఉన్న అవినాభావసంబంధాన్ని అత్యంత కరుణరసార్థ్రభరితంగా వర్ణిస్తారు.
 
పాదయాత్రలు చేసే వాళ్ళంతా
సింహాసనాల పైకే చేరుకుంటుంటే
ఎన్ని వేల పాదముద్రలో విత్తిన వాడు
చెట్టెందుకెక్కాడో
అట్నుంచీ పాడెందుకెక్కాడో
అర్ధంకాని మూగెద్దులు సలిపే సంభాషణ — (మూగ బాసట) రాజకీయ తంత్రంలో రైతు స్థానం కడపంక్తే. రైతు పిడికెడు మట్టై చెట్టుకు వేలాడాల్సి రావటం ఒక సామాజిక వాస్తవం. రైతు నేస్తం ఎద్దు. అలాంటి ఎద్దు కళ్ళనుండి “బాధా సర్పం జారిపడ్డదట”, “ఎద్దు పుండు ఎవరికిష్టం” అంటూ కవిత ముగుస్తుంది. రైతుకి ఎద్దుతో ఉండే ప్రేమానుబంధాన్ని అత్యంత అనుకంపనతో వ్రాసిన గొప్ప కవిత ఇది.
 
తండ్రులు-కూతుళ్ళు” కవిత టీనేజ్ కూతుర్లున్న తండ్రులను తప్పక కదిలిస్తుంది. ప్రతీ వాక్యమూ గొండెలోపొరల్ని స్పృశిస్తుంది. గొప్ప ఆర్థ్రత నిండిన కవిత ఇది. (ఈ కవిత చదివినప్పుడల్లా ఇంటర్ చదువుతున్న మా అమ్మాయే నా తలపుల్లో మెసలుతాఉంది.)
 
కవిత్వం మానవజీవితాన్ని ఆశ్రయించి ఉద్భవించిన కళ” అంటారు పింగళి లక్ష్మీ కాంతంగారు. కవి తాను జీవించే జీవితం, అనుభూతులు, తానునమ్మిన దృక్పథాలు తనకవిత్వంలో స్వాభావికంగానే ప్రకటితమౌతూంటాయి. ఎందుకంటే కవిత్వం ఎక్కువగా అంతశ్చేతనకు సంబంధించింది కనుక. వెంకట కృష్ణ కవిత్వంలో దళిత, బహుజన దృక్పథం , సమాజాన్ని చైతన్యపరచాలనే ఆకాంక్ష, బలహీనులపట్ల సహానుభూతి వంటివి అనేక కవితలలో కనిపిస్తాయి. ఇది ఇతని కవిత్వ తత్వం.
 
అరఅడుగు వొరలో వొదిగిన
ఆరడుగుల చీర
తనకంటే వొద్దికైన వాణ్ణి చూపించనా అంటుంది (కళతన నేతన్నా) అంటూ నేటి చేనేతకార్మికుల వెతలను అక్షరీకరిస్తాడు. ధనంనిండిన మార్కెట్ మాయాజాలం లో చిక్కుకొన్న నేతన్నలో స్థైర్యం, చైతన్యం నింపేలా కవిత ముగుస్తుంది.
 
పర్వాంతం అనే కవితలో ఈ దేశపు కర్షక, కార్మికులు సామాజికంగా, రాజకీయంగా ఎలామోసానికి గురవుతున్నారో, న్యాయం చేయమని తట్టిన న్యాయాలయాలు కూడా ఏ రకమైన తీర్పులు చెపుతున్నాయో చాలా వాస్తవికంగా ఆవిష్కరించారు వెంకట కృష్ణ
 
దేశంలోని ప్రతి రైతుదేహానికీ
ఒక తెల్లగుడ్డ
ప్రతి కార్మికుడి దేహానికీ
ఒక ఎర్రగుడ్డ
పరిహారం పంపిణీగా కోర్టు తీర్పు (పర్వాంతం) అంటూ ఆధునిక జీవనపోరాటంలో బలహీనుల పక్షాన నిలిచారు. ఈ కవితను ముగిస్తూ ఈ నాటకాన్ని మలుపు తిప్పాలనుకొనే ఔత్సాహికుడు, సాహసికుడు, ఉద్యమకారుడు అయిన ఒక పాత్ర ప్రవేశిస్తుంది అనటం ద్వారా ఒక ఆశావహ దృక్కోణం ఆవిష్కృతమౌతుంది.
 
సాధారణంగా ఉగాది కవితలు సౌందర్యంతో మెత్తమెత్తగా చక్కని ఉపమానాలతో సాగుతాయి. సమాజం పట్ల నిబద్దత, మార్పురావాలనే ఆకాంక్ష హృదయాంతరాళాలో పొదువుకొన్న ఈ కవి ఆ వచ్చిన ఉగాది అతిథికి….
 
శ్రమజీవన సౌందర్యానికి శ్రమదానం చెయ్యమని
నేల పాతరేసిన ఉషస్సును
జనానికి పంచమని! (అతిథి)— ఉపదేశిస్తాడు. గొప్ప సామాజిక చైతన్యం, ఈ వ్యవస్థ బాగుపడాలన్న నిబద్దత కలిగిన కవిమాత్రమే వ్రాయగల వాక్యాలివి.
 
ఒక హిజ్రా పై వ్రాసిన “స్వదేహ పరాయీకరణ” కవిత తీసుకున్న వస్తువులోని భిన్న పార్శ్వాలను స్పృశించిన తీరు అద్భుతమనిపించక మానదు. . చాలా గాఢత కలిగిన కవిత అది. అందులో ఒకచోట
 
జీవితమంతా అజ్ఞాతవాసంలో వుండటం
ఏ బృహన్నలకు మాత్రం సాధ్యం
రణరంగమొకటి రోజూ ఎదురొస్తుంటే
ఏ వొక్క క్షణాన్నీ ఎలా శాంతిగా గడపటం — అన్న వాక్యాల వద్ద తడిలాంటిదేదో చదువరుల హృదయాల్ని తాకుతుంది. వెంకట కృష్ణను- వాస్తవిక వాదిగా, వస్తువును శిల్పంగా, ఉద్వేగంగా, ఉదాత్త వాక్యాలుగా మార్చగలిగే శక్తి కలిగిన గొప్ప కవిగా నిరూపిస్తుందీ కవిత.
 
ఇంకా ఈ సంపుటిలో, యస్. ఆర్. శంకరన్, అరుణ్ సాగర్, కొండేపూడి నిర్మల, మార్క్వెజ్, కొప్పర్తి లపై వ్రాసిన ప్రేమపూర్వక కవితలున్నాయి.
 
ఈ సంపుటిలో మొత్తం 49 కవితలున్నాయి. ఈ పుస్తకానికి  కాశీభట్ల వేణుగోపాల్, శ్రీ జి.ఎస్. రామ్మోహన్ లు ఆప్తవాక్యాలు వ్రాసారు.
 
రఫీక్ అహ్మద్ అందమైన ముఖచిత్రాన్ని అందించారు.
పుస్తకం వెల: 100/-
కాపీల కొరకు: 8985034894

Tuesday, April 23, 2024

ఆవు కవిత...

ఏదో టివి డిబేట్ లో
వాడిని ఒకసారి చూసాను
"మా మనోభావాలను
గాయపరుస్తావా" అంటూ చెప్పుతీసుకొని
మరొకరిని కొడుతూండటం.
ఎక్కడో టీవీలో కదా అనుకొన్నాను
తరువాత అక్కడక్కడా
అలాంటి ఘటనలు వింటూ వచ్చాను

నిన్న నేనే స్వయంగా ఎదుర్కొన్నాను

రోడ్డుకడ్డంగా ఉంటే తట్టి లేపుతున్నందుకు
"ఏంటి సర్ ఆవుని కొడుతున్నారు" అంటూ
మీద మీదకు వచ్చాడు" వాడు
 
ఊరిలో కనుమరోజున
పూజించిన చేతులతోనే, పచ్చనిచేలో పడితే
కర్ర తిరగేసి కొట్టిన వాడిని
నూతి వెలుపల కాంతి ఉందని
ఆ పట్నవాసపు కొత్త పరిరక్షకుడితో
ఎలా చెప్పాలి?

బొల్లోజుబాబా

Wednesday, April 17, 2024

బదులు

ఆరుబయట ఆనబపాదు
అడుగుకో కాయ చొప్పున
విరగకాచింది.
 
ఎప్పటిదో చిన్న విత్తనం

ఏం ఇచ్చాను నేను
అరచెయ్యంత చోటు
ఎప్పుడైనా కెక్కరించే కోళ్ళను తరిమి
నాలుగు తుంపర్ల నీరు చల్లుంటాను

అంతే
నా జీవితాన్ని పెనవేసుకొంది ప్రేమతో
సూర్యకాంతిలా

బొల్లోజు బాబా

మనవి మాటలు

గత నాలుగేళ్ళుగా రాస్తున్న చరిత్ర వ్యాసాలను వేదబాహ్యులు అనే పేరుతో పుస్తకరూపంలోకి తీసుకొని వద్దామని నిర్ణయించుకొన్నాక రాతప్రతిని ఎవరైన రివ్యూ చేస్తే బాగుంటుందని అనిపించింది.

శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్ గారు ఈ ఫేస్ బుక్ లో పరిచయం. నాలుగేళ్ళ క్రితం హిందూ ఆలయాలకు ఏం జరిగింది అనే నా పోస్టు లో వారూ నేను మొదటి సారిగా అభిప్రాయాలు పంచుకొన్నాం. ఇటీవల భిన్నమతాలలో ఉమ్మడి పాత్రలు అనే పోస్టులో కూడా చర్చించుకొన్నాం. ఈ పరిచయంతోనే శ్రీనివాస్ గారు ఎంతో ప్రేమతో నాకు Douglas Ober రాసిన Dust on the throne అనే పుస్తకాన్ని కాన్కగా కొరియర్ లో పంపించారు. చాలా సంతోషం వేసింది. అంతర్జాల మిత్రులనుండి గిఫ్ట్ అందుకోవటం అది రెండవ సారి . ఎప్పుడో బ్లాగుల కాలంలో వేల్పూరి సుజాత గారు జరుక్ శాస్త్రి పేరడీల పుస్తకాన్ని పంపించారు.
 
శ్రీనివాస్ గారు మంచి చదువరి, బహుభాషా కోవిదులు, విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి నిర్ధారించుకొంటే తప్ప విశ్వసించరు. నేను చూసినంత మేర భద్రుడు గారి తరువాత నాకు తటస్థించిన అంతటి వొరేషియస్ రీడర్ శ్రీనివాస్ గారే.
 
శ్రీనివాస్ గారిని ఈ వ్యాసాలను ఎడిట్ చేసిపెట్టమని అడిగాను కొంత జంకుతూనే. వారు అంగీకరించి ఎంతో లోతుగా ఈ వ్యాసాలను రివ్యూ/ఎడిట్ చేసారు. చాలా అక్షరదోషాలను, వాక్యనిర్మాణ దూడలను సరిచేసారు. ప్రతీ అధ్యాయాన్ని సమీక్షించి చెప్పిన విలువైన అభిప్రాయాలు, లోచూపు ఈ రచనను ఎంతో మెరుగుపరిచాయి. ఎడిటర్ గా పేరు వేసుకొంటాను అని అడుగగా సున్నితంగా తిరస్కరించారు.
 
జనరల్ గా నా ఏ పుస్తకానికైనా ముందుమాటలలో మిత్రులందరి పేర్లు ప్రస్తావించటం పరిపాటి. ఈ పుస్తకానికి ఒక్క శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్ గారి పేరు మాత్రమే ఉండటం వెనుక కారణం ఇది.
వారికి సదా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను

వేదబాహ్యులు పుస్తకానికి నేను రాసుకొన్న ముందుమాట ఇది.
ఈ పుస్తకం లభించుచోటు- పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి.నారాయణ గారు, ఫోన్ నంబరు. 9866115655 సంప్రదించగలరు.
*******
మనవి మాటలు
.
ప్రాచీన భారతదేశ ప్రజల విశ్వాసాల గురించి అధ్యయనం చేయటం ఒక నిరంతర శోధన. వైదిక సంప్రదాయం హిందూమతం రూపుదిద్దుకొనకముందు ఈ నేల భిన్న సంప్రదాయాలకు, విశ్వాసాలకు ఆలవాలంగా ఉంది. హిందూ మతానికి వెలుపల బౌద్ధులు, జైనులు, చార్వాకులు, ఆజీవికులు లాంటి ఎందరో ఈ నేలపై జీవించారు. ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించారు.
హిందూమతం మాత్రమే భారతదేశపు ఆత్మ అని పలికే మాటలకు ఈ వేదబాహ్య సంస్కృతి ఒక కనువిప్పు.
 
కూర్మపురాణం (CE 550-800) బౌద్ధులు, జైనులు, పాంచరాత్రికులు, కాపాలికులు, పాశుపతులు అంటూ ఐదురకాల వేదబాహ్యులను పేర్కొనింది. పాంచరాత్ర పూజావిధానం (cult) మొదట్లో వేదబాహ్యంగా ఉన్నప్పటికీ క్రమేపీ వైష్ణవంలో కలిసిపోయి వేదావలంబిగా మారిపోయింది.
వేదబాహ్యులను నీతిశాస్త్రాలు చాలా తక్కువ చేసి మాట్లాడాయి. గృహస్తులెవరూ వీరిని ఆదరించరాదని మనువు; నాస్తికులను పరిహరించాలని యాజ్ఞవల్క్యుడు; సాక్షులుగా పెట్టుకోరాదని నారదుడు; ఆపత్సమయాలలో వేదబాహ్యుల ఆస్తులను రాజు స్వాధీనం చేసుకొనవచ్చునని అంతేకాక వారితో సన్నిహితంగా ఉండేవారిపై అధికపన్నులు విధించవచ్చునని కౌటిల్యుడు; వేదబాహ్యులు రాజ్యంలోకి ప్రవేశించరాదని సౌరపురాణము; వేదబాహ్యులను రాజు శిక్షించాలని శుక్రనీతిసారము- అంటూ నీతిశాస్త్రకారులు తమ గ్రంథాలలో వీరిపట్ల సమాజం వ్యవహరించాల్సిన పద్దతులను నిర్దేశించారు.
 
ఇన్ని వెలివేతలు పెట్టినా సంఘంలో వేదాలను ధిక్కరించి జీవించేవారి సంఖ్య తక్కువ ఏమీ ఉండేది కాదు.
 
“History of India is nothing but the battle between Buddhism and Brahmanism.” – Dr. B.R. Ambedkar

ఈ వైదిక, అవైదిక విశ్వాసాలు చరిత్రలో ఘర్షించుకొన్నాయి. ఒకదానినొకటి మెరుగుపరుచుకొన్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. వేదబాహ్యులు భారతీయ ఆత్మను, బహుళతను తీర్చిదిద్దారు. వ్యక్తులు గతించిపోతారేమో కానీ వారు చేసిన ఆలోచన నమసిపోదు
‌‍****
బాబ్రిమసీదు కూల్చివేత ఆధునిక భారతదేశ చరిత్రలో కీలకమలుపు. ద్వేషం, విభజన నింపుకున్న రాజకీయాల కారణంగా ఒకే దేవుడు, ఒకేమతం, ఒకే సంస్కృతి లాంటి అంశాలు ముందుకు వచ్చాయి. ఇవి భారతీయ ధర్మంలోని బహుళతను విచ్ఛిన్నం చేస్తున్నాయి.
ఇప్పుడు అన్నిచోట్లా మెజారిటేరియన్ వాదం ప్రబలంగా నడుస్తూంది.
 
ఈ దేశ సంస్కృతిని నిర్మించటంలో ప్రధాన పాత్రవహించిన వేదబాహ్యులు నేడు సమాజపు అంచుల్లోకి నెట్టబడ్డారు. నిజానికి వీరు ఈ దేశమూలవాసులు.
 
చరిత్రలో వేదబాహ్యులు నెరపిన సామాజిక, సాంస్కృతిక పాత్రను గురించి ఈ వ్యాసాలు మాట్లాడతాయి. స్వేచ్ఛ, సమానత్వం, కార్యకారణ వివేచన, లౌకికత్వం కొరకు వారు ఎలా నిలబడ్డారో చెబుతాయి. నేటి మెజారిటేరియన్ భావజాలానికి ఒకనాడు సమవుజ్జీలుగా నిలిచిన భిన్న ప్రత్యామ్నాయ విశ్వాసాలకు ఈ పుస్తకం అద్దంపడుతుందని ఆశిస్తున్నాను.
ఈ పుస్తకరచనలో శ్రీ విరుపుటూరి శ్రీనివాస్ గారు చేసిన సూచనలు, సలహాలు ఎంతో విలువైనవి. ఈ పుస్తకం యొక్క ప్రతి అథ్యాయాన్ని సమీక్షించి చెప్పిన విలువైన అభిప్రాయాలు, లోచూపు ఈ రచనను మెరుగుపరచాయి. వారి మేధకు, వెచ్చించిన కాలానికి నేను ఋణపడి ఉన్నాను.
 
బొల్లోజు బాబా
17/3/2024
.
ఈ పుస్తకం లభించుచోటు- పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి.నారాయణ గారు, ఫోన్ నంబరు. 9866115655 దయచేసి ఆదరించండి.



ఇటీవల వార్తల్లో వినుతికెక్కిన పిఠాపురానికి ఘనమైన చరిత్ర ఉంది.



ఇటీవల వార్తల్లో వినుతికెక్కిన పిఠాపురానికి ఘనమైన చరిత్ర ఉంది. చరిత్ర తెలియని కొందరు పిఠాపురం లాంటి ఒక కుగ్రామం .... అంటూ మాట్లాడుతున్నారు. వారికోసం....
.
క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంనుండి పిఠాపురం గొప్ప పట్టణంగా విరాజిల్లింది. క్రీపూ 2వ శతాబ్దంలో వేయించిన ఖారవేలుని హాథిగుంఫా శాసనంలో కనిపించే పిథుండా పిఠాపురమే అనటానికి ఆధారాలు ఉన్నాయి.
 
పిఠాపుర సమీపంలో ఉన్న బౌద్ధ ఆరామం కొడవలి వద్ద క్రీశ 2 వ శతాబ్దంనాటి శాతవాహనరాజు వేయించిన శాసనం లభించింది.

క్రీశ 4 వ శతాబ్దంలో సముద్రగుప్తుడు వేయించుకొన్న ప్రసస్తి శాసనంలో పిఠాపురాన్ని జయించానని గర్వంగా చెప్పుకొన్నాడు

వేంగి రాజ్య స్థాపన నిజానికి 7వ శతాబ్దంలో పిఠాపురంలో కుబ్జవిష్ణువర్ధనుడిచే జరిగింది.
హుయాన్ త్సాంగ్ క్రీశ 631 లో పిఠాపురం సందర్శించి ఉండొచ్చునని ఆధారాలు ఉన్నాయి.
 
కాలక్రమేణా తూర్పుచాళుక్యులు, కొప్పుల నాయకులు, గజపతులు,పూసపాటి రాజులు గోల్కొండ నవాబులు, బ్రిటిష్ వారు ఈ పట్టణాన్ని పాలించారు
 
దోనేపూడి శాసనంలో (క్రీశ1337) పిఠాపురపట్టణ వర్ణనలు ఈ విధంగా ఉన్నాయి

పిఠాపురీ జయతి తత్ర సమస్తదేవ
శక్తి ప్రయత్నపరికల్పిత తోరణశ్రీః
యస్యాస్సునిర్మలనభోముకురాంతరాలే
ధత్తే సురేంద్రనగరీప్రతిబింబలీలమ్
 
(తాత్పర్యం: సమస్తదేవతలు కొలువున్న పిఠాపురం యొక్క అందాలు ఎంతటి దివ్యమైనవి అంటే ఆకాశం అనే అద్దంలో పిఠాపురం అందాలే ఆ ఇంద్రుని అమరావతి అందాలుగా ప్రతిబింబిస్తున్నాయి)

యత్ సౌధాగ్రనిషణ్ణవారవనితావక్త్రేందుమధ్యస్థితః
స్వైరం నైషవిభావ్యతే హిమరుచిస్తేభ్యోవిభిన్నాకృతిః
ఏవం చేతపి శకితేనరచితో ధాత్రాకళంకస్ఫుటమ్
నోచే దీదృశి నిర్మలే కథ మిదమ్ మాలిన్య ముజ్జృంభతే.
 
(తాత్పర్యం: పిఠాపురం భవనాల మిద్దెలపై వెన్నెలలో కూర్చున్న నాట్యకత్తెల గుండ్రని వెలుగులీనే మొఖాలలో కలిసిపోయి చంద్రుడు కనిపించటం లేదట. అందుకని బ్రహ్మదేవుడు చంద్రునిపై నల్లమచ్చలు పెట్టటంతో ఆ అప్సరసల ముఖబింబాల మధ్య చంద్రబింబాన్ని గుర్తించటం వీలయిందట)

ఒకనాటి పిఠాపురం భౌతిక వర్ణనను ఒక పద్యంలో శ్రీనాథుడు ఇలా చిత్తరువుగా నిలిపాడు
సీ|| ఏటేట విలినీట నిరుగారునుం బండు
బ్రాసంగు వరిచేల బసిడిచాయ
బరిపాకమున వేరుపనసపండుల తావి
ఇందిందిరములకు విందుసేయు
వేబోక ఒలుపారు వింధ్యాద్రిపవనంబు
పోకపువ్వుల తావి బుక్కిలించు
వేశ్యవాటికలందు విహరించు వలరాజు
ననయంబు జెఱకువిల్లును ధరించు
తే.గీ. నారదంబులవలపు పొన్నల బెనగి
విచికిలామోదములతోడ వియ్యమందు
బాటలీపుష్ప కేతకీపరిమళములు
పొదల విలసిల్లు బీఠికాపురమునందు.

(తాత్పర్యం: ఎటు చూసినా బంగారు వన్నెల వరిచేలు, తుమ్మెదలకు విందు చేసే బాగా ముగ్గిన పనస పండ్ల సువాసనతోను; వింధ్య పర్వతపు పోక పువ్వుల పరిమళాలను పుక్కిలించే చల్లనైన గాలులతోను; మన్మధుడు తన చెరుకు వింటిని ఎక్కుపెట్టే వేశ్య వాడలతోను; పొన్నపూలు, పాటలీ పుష్పాలు, పరిమళాలు వెదజల్లే పొదలు కలిగిన పిఠాపురం -- లాంటి వాక్యాలలో శ్రీనాథుడు (1380-1470) ఆనాటి పిఠాపురం picturesque సౌందర్యాన్ని కళ్లముందు నిలుపుతాడు)
 
***
పిఠాపురం వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిఉంది. శతాబ్దాలపాటు ఆంధ్ర దేశానికి రాజధానిగా వ్యవహరించిన ప్రాచీన పట్టణమైన పిఠాపురవైభవం గురించి సుమారు 30 పేజీల వ్యాసం ఇటీవలే ద్వితీయముద్రణకు వచ్చిన "తూర్పుగోదావరి ప్రాచీనపట్టణాలు" పుస్తకంలో కలదు. లభించుచోటు- పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి. నారాయణ గారు, ఫోన్ నంబరు. 9866115655 సంప్రదించగలరు.

బొల్లోజు బాబా



చివరిచూపుల తరువాత....

బాడీని పూడ్చిపెట్టాక
స్నానం చేసి
ఉప్పుకల్లు నోట్లో ఉంచుకొని
దీపం వెలుగుకి దణ్ణం పెట్టుకొని
బస్సెక్కేసాను.

సీట్లో కుదురుకున్నాకా
కలలు కబళించాయి
జ్ఞాపకాలు, కలలు కలగలిసిపోయి
వింతైన లోకంలో దించాయి

అక్కడ
ముడుతలు పడిన చేతుల్ని
పెదాలవద్దకు తీసుకొని
నేను పుట్టినప్పుడు నా చిట్టి చేతివేళ్ళమధ్య
మృదువుగా తన చూపుడు వేలు ఉంచినంత
మెత్తగా ముద్దుపెట్టుకొన్నానట

తన చివరి ఫోన్ కాల్ లో 'చూడాలనుందిరా'
అన్నవెంటనే శలవుపెట్టి పద్మా, పిల్లలతో వెళ్ళి
తనతో వారం రోజులు గడిపిపానట

ఎర్రటి ఎండలో నిలుచుని
తనని పాతిన చోట ఏర్పడిన మట్టి దిబ్బను
చేతులతో తడుముతూ జార్చుకొన్న
కన్నీళ్ళు ఆ నెర్రలలోకి ఇంకిపోయాయట

కుంపటిపై అటూ ఇటూ సర్దబడే
మొక్కజొన్న కండెలా హృదయం
డ్రింకు సీసాలో చిక్కుకొని తెల్లార్లూ
ఎగబాకుతూనే ఉన్న చిమ్మెటలా ఆలోచనలు

సార్, మీ స్టాప్ అన్న కండక్టర్ కేకతో లేచి
బాగ్ తీసుకొని బస్సుదిగి పద్మకు ఫోన్ చేసి
"పిల్లల్ని స్కూల్ నుండి పికప్ చేసుకొని
వస్తాను, నువ్వు వెళ్ళక్కరలేదు" అని చెప్పాను


బొల్లోజు బాబా

పారిపోలేం...

ఇక్కడ ఉండాలంటే
ఈ దేహం ఉండాలి
దీన్ని విడిచి ఎక్కడికీ పారిపోలేం
ఇది చిరిగి జీర్ణమైపోయాకా
నూతన వస్త్రాలను ధరించవచ్చుననే
ఆశ ఒక్కటే
ఇన్ని లోపాలతో, గాయాలతో ఉండే
ఈ దేహాన్ని మోసుకొని తిరిగేలా చేస్తుంది

ఇంత వరకు అందరూ అదే చేసారు
నవ్వుతూ, ఏడుస్తూ, ప్రేమిస్తూ....

బొల్లోజు బాబా