ఇటీవల వార్తల్లో వినుతికెక్కిన పిఠాపురానికి ఘనమైన చరిత్ర ఉంది. చరిత్ర తెలియని కొందరు పిఠాపురం లాంటి ఒక కుగ్రామం .... అంటూ మాట్లాడుతున్నారు. వారికోసం....
.
క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంనుండి పిఠాపురం గొప్ప పట్టణంగా విరాజిల్లింది. క్రీపూ 2వ శతాబ్దంలో వేయించిన ఖారవేలుని హాథిగుంఫా శాసనంలో కనిపించే పిథుండా పిఠాపురమే అనటానికి ఆధారాలు ఉన్నాయి.
పిఠాపుర సమీపంలో ఉన్న బౌద్ధ ఆరామం కొడవలి వద్ద క్రీశ 2 వ శతాబ్దంనాటి శాతవాహనరాజు వేయించిన శాసనం లభించింది.
క్రీశ 4 వ శతాబ్దంలో సముద్రగుప్తుడు వేయించుకొన్న ప్రసస్తి శాసనంలో పిఠాపురాన్ని జయించానని గర్వంగా చెప్పుకొన్నాడు
వేంగి రాజ్య స్థాపన నిజానికి 7వ శతాబ్దంలో పిఠాపురంలో కుబ్జవిష్ణువర్ధనుడిచే జరిగింది.
హుయాన్ త్సాంగ్ క్రీశ 631 లో పిఠాపురం సందర్శించి ఉండొచ్చునని ఆధారాలు ఉన్నాయి.
కాలక్రమేణా తూర్పుచాళుక్యులు, కొప్పుల నాయకులు, గజపతులు,పూసపాటి రాజులు గోల్కొండ నవాబులు, బ్రిటిష్ వారు ఈ పట్టణాన్ని పాలించారు
దోనేపూడి శాసనంలో (క్రీశ1337) పిఠాపురపట్టణ వర్ణనలు ఈ విధంగా ఉన్నాయి
పిఠాపురీ జయతి తత్ర సమస్తదేవ
శక్తి ప్రయత్నపరికల్పిత తోరణశ్రీః
యస్యాస్సునిర్మలనభోముకురాంతరాలే
ధత్తే సురేంద్రనగరీప్రతిబింబలీలమ్
(తాత్పర్యం: సమస్తదేవతలు కొలువున్న పిఠాపురం యొక్క అందాలు ఎంతటి దివ్యమైనవి అంటే ఆకాశం అనే అద్దంలో పిఠాపురం అందాలే ఆ ఇంద్రుని అమరావతి అందాలుగా ప్రతిబింబిస్తున్నాయి)
యత్ సౌధాగ్రనిషణ్ణవారవనితావక్త్రేందుమధ్యస్థితః
స్వైరం నైషవిభావ్యతే హిమరుచిస్తేభ్యోవిభిన్నాకృతిః
ఏవం చేతపి శకితేనరచితో ధాత్రాకళంకస్ఫుటమ్
నోచే దీదృశి నిర్మలే కథ మిదమ్ మాలిన్య ముజ్జృంభతే.
(తాత్పర్యం: పిఠాపురం భవనాల మిద్దెలపై వెన్నెలలో కూర్చున్న నాట్యకత్తెల గుండ్రని వెలుగులీనే మొఖాలలో కలిసిపోయి చంద్రుడు కనిపించటం లేదట. అందుకని బ్రహ్మదేవుడు చంద్రునిపై నల్లమచ్చలు పెట్టటంతో ఆ అప్సరసల ముఖబింబాల మధ్య చంద్రబింబాన్ని గుర్తించటం వీలయిందట)
ఒకనాటి పిఠాపురం భౌతిక వర్ణనను ఒక పద్యంలో శ్రీనాథుడు ఇలా చిత్తరువుగా నిలిపాడు
సీ|| ఏటేట విలినీట నిరుగారునుం బండు
బ్రాసంగు వరిచేల బసిడిచాయ
బరిపాకమున వేరుపనసపండుల తావి
ఇందిందిరములకు విందుసేయు
వేబోక ఒలుపారు వింధ్యాద్రిపవనంబు
పోకపువ్వుల తావి బుక్కిలించు
వేశ్యవాటికలందు విహరించు వలరాజు
ననయంబు జెఱకువిల్లును ధరించు
తే.గీ. నారదంబులవలపు పొన్నల బెనగి
విచికిలామోదములతోడ వియ్యమందు
బాటలీపుష్ప కేతకీపరిమళములు
పొదల విలసిల్లు బీఠికాపురమునందు.
(తాత్పర్యం: ఎటు చూసినా బంగారు వన్నెల వరిచేలు, తుమ్మెదలకు విందు చేసే బాగా ముగ్గిన పనస పండ్ల సువాసనతోను; వింధ్య పర్వతపు పోక పువ్వుల పరిమళాలను పుక్కిలించే చల్లనైన గాలులతోను; మన్మధుడు తన చెరుకు వింటిని ఎక్కుపెట్టే వేశ్య వాడలతోను; పొన్నపూలు, పాటలీ పుష్పాలు, పరిమళాలు వెదజల్లే పొదలు కలిగిన పిఠాపురం -- లాంటి వాక్యాలలో శ్రీనాథుడు (1380-1470) ఆనాటి పిఠాపురం picturesque సౌందర్యాన్ని కళ్లముందు నిలుపుతాడు)
***
పిఠాపురం వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిఉంది. శతాబ్దాలపాటు ఆంధ్ర దేశానికి రాజధానిగా వ్యవహరించిన ప్రాచీన పట్టణమైన పిఠాపురవైభవం గురించి సుమారు 30 పేజీల వ్యాసం ఇటీవలే ద్వితీయముద్రణకు వచ్చిన "తూర్పుగోదావరి ప్రాచీనపట్టణాలు" పుస్తకంలో కలదు. లభించుచోటు- పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి. నారాయణ గారు, ఫోన్ నంబరు. 9866115655 సంప్రదించగలరు.
బొల్లోజు బాబా
No comments:
Post a Comment